Karvy Stock Broking
-
కార్వీ కేసులో ప్రముఖ సంస్థలకు ఊరట
కార్వీ స్టాక్ బ్రోకింగ్ కేసులో సెబీ, ఎన్ఎస్డీఎల్కు పెద్ద ఊరట లభించింది. ఈ కేసులో గత ఏడాది డిసెంబరు 20న సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రైబ్యునల్ (శాట్) జారీ చేసిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ తన ఖాతాదారుల షేర్లను బ్యాంకుల వద్ద తనఖాపెట్టి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుంది. ఈ కుంభకోణం బయటపడడంతో సెబీ, ఎన్ఎస్డీఎల్ రంగంలోకి దిగి ఆ షేర్లను మళ్లీ ఖాతాదారులకు బదిలీ చేయించాయి. యాక్సిస్ బ్యాంక్ నేతృత్వంలోని బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు ఈ విషయాన్ని శాట్‌లో సవాల్ చేశాయి. ఇదీ చదవండి: పెడితే రూపాయి రాదని తెలిసీ కోట్లు పెట్టుబడి..! ఫలితంగా కార్వీ తనఖాపెట్టిన షేర్ల విలువకు సమాన మొత్తాన్ని బ్యాంకులకు చెల్లించాలని శాట్ గత ఏడాది డిసెంబరులో సెబీ, ఎన్ఎస్డీఎల్ను ఆదేశించింది. ఈ సంస్థలు సంబంధిత అంశాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. కేసును విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం తాజాగా శాట్ తీర్పుపై స్టే ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసినట్లు తెలిసింది. -
కార్వీ ఉద్యోగులకు డిమాండ్ నోటీసు
న్యూఢిల్లీ: క్లయింట్ల నిధులను దురి్వనియోగం చేసిన కేసులో సుమారు రూ.1.8 కోట్లు చెల్లించాలని కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్‌కు (కేఎస్‌బీఎల్) చెందిన ముగ్గురు మాజీ అధికారులకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ బుధవారం డిమాండ్ నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లోగా ఈ మొత్తాన్ని చెల్లించడంలో విఫలమైతే వారిని అరెస్టు చేసి ఆస్తులతో పాటు బ్యాంకు ఖాతాలను అటాచ్మెంట్ చేస్తామని సెబీ హెచ్చరించింది. ఆస్తులను విక్రయించడం ద్వారా మొత్తాన్ని రికవరీ చేస్తామని స్పష్టం చేసింది. నోటీసులు అందుకున్న వారిలో కేఎస్‌బీఎల్ వైస్ ప్రెసిడెంట్ (ఎఫ్అండ్ఏ) కృష్ణ హరి జి, మాజీ కంప్లైంట్ ఆఫీసర్ శ్రీకృష్ణ గురజాడ, బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్ జనరల్ మేనేజర్ శ్రీనివాస రాజు ఉన్నారు. 2023 మే నెలలో విధించిన జరిమానాను చెల్లించడంలో ఈ అధికారులు విఫలమైన నేపథ్యంలో సెబీ తాజాగా డిమాండ్ నోటీసులు పంపింది. ఖాతాదారుల సెక్యూరిటీలను తాకట్టు పెట్టి భారీగా నిధులను సమీకరించారని, అలాగే క్లయింట్లు మంజూరు చేసిన పవర్ ఆఫ్ అటారీ్నని కార్వీ స్టాక్ బ్రోకింగ్ దుర్వినియోగం చేసినట్టు సెబీ విచారణలో తేలింది. సమీకరించిన నిధులను గ్రూప్ కంపెనీలకు మళ్లించడం ద్వారా వివిధ చట్ట నిబంధనలను కేఎస్‌బీఎల్ ఉల్లంఘించింది. కేఎస్‌బీఎల్ 2019 మే నెల వరకు దాని క్లయింట్లుగా ఉన్న తొమ్మిది సంబంధిత సంస్థల ద్వారా రూ.485 కోట్ల అదనపు సెక్యూరిటీలను విక్రయించింది. అలాగే ఈ తొమ్మిది కంపెనీల్లో ఆరింటికి అదనపు సెక్యూరిటీలను కూడా బదిలీ చేసింది. తన ఖాతాదారుల వాటాలను తాకట్టు పెట్టి ఆర్థిక సంస్థల నుండి రుణాలు సేకరించిన కేఎస్‌బీఎల్ మొత్తం రుణం 2019 సెప్టెంబర్ నాటికి రూ.2,032.67 కోట్లు. ఈ కాలంలో కంపెనీ తాకట్టు పెట్టిన సెక్యూరిటీల విలువ రూ. 2,700 కోట్లు. -
కేఎస్‌బీఎల్, ప్రమోటర్లపై ఏడేళ్ల నిషేధం..
న్యూఢిల్లీ: క్లయింట్ల నిధులను దుర్వినియోగం చేసిన కేసులో కార్వీ స్టాక్ బ్రోకింగ్ (కేఎస్‌బీఎల్), దాని ప్రమోటర్ కొమండూర్ పార్థసారథి ఏడేళ్ల పాటు సెక్యూరిటీస్ మార్కెట్లో లావాదేవీలు జరపకుండా సెబీ నిషేధించింది. కేఎస్‌బీఎల్‌కు రూ. 13 కోట్లు, పార్థసారథికి రూ. 8 కోట్లు జరిమానా కూడా విధించింది. అలాగే పార్థసారథి ఏ లిస్టెడ్ కంపెనీలోనూ కీలక మేనేజర్ హోదాల్లో పని చేయకుండా పదేళ్ల పాటు నిషేధించింది. కేఎస్‌బీఎల్‌కు చెందిన మరో ఇద్దరు డైరెక్టర్లయిన భగవాన్ దాస్ నారంగ్, జ్యోతి ప్రసాద్‌లకు ఇది రెండేళ్ల పాటు వర్తిస్తుంది. అటు కేఎస్‌బీఎల్ నుంచి తీసుకున్న రూ. 1,443 కోట్ల మొత్తాన్ని మూడు నెలల్లోగా వాపసు చేయాలంటూ కార్వీ రియల్టీ, కార్వీ క్యాపిటల్‌ను సెబీ ఆదేశించింది. లేని పక్షంలో ఆ మొత్తాన్ని రాబట్టేందుకు రెండు సంస్థల ఆస్తులను ఎన్ఎస్ఈ తన అధీనంలోకి తీసుకుంటుందని సెబీ స్పష్టం చేసింది. క్లయింట్లు ఇచ్చిన పవర్ ఆఫ్ అటార్నీలను దుర్వినియోగం చేసి వారి షేర్లను తనఖా పెట్టి, కార్వీ సొంత అవసరాల కోసం నిధులను సమీకరించిందని ఆరోపణలు ఉన్నాయి. కేఐఎస్ఎల్పై ఆంక్షలు: నిబంధనల ఉల్లంఘన కేసులో కొత్త క్లయింట్లను చేర్చుకోకుండా కార్వీ ఇన్వెస్టర్ సర్వీసెస్ (కేఐఎస్‌ఎల్)పై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిషేధం విధించింది. ఇది తక్షణం అమల్లోకి వస్తుందని, తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు వర్తిస్తుందని పేర్కొంది. 2021–22 మధ్య కాలంలో డెట్ సెక్యూరిటీల పబ్లిక్ ఇష్యూలకు సంబంధించి కంపెనీ పలు నిబధనలను ఉల్లంఘించినట్లు సెబీ విచారణలో తేలింది. మర్చంట్ బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వహించేందుకు ఉద్యోగులు గానీ, భౌతిక మౌలిక సదుపాయాలు గానీ కేఐఎస్ఎల్కు లేవని కూడా వెల్లడైంది. పైగా 2022 డిసెంబర్ నుంచి 2025 డిసెంబర్ వరకూ చెల్లుబాటయ్యేలా రెన్యువల్ ఫీజును కూడా కంపెనీ కట్టలేదని 13 పేజీల ఎక్స్‌పార్టీ మధ్యంతర ఉత్తర్వుల్లో సెబీ పేర్కొంది. ఇలాంటి సంస్థల కార్యకలాపాల వల్ల సెక్యూరిటీల మార్కెట్ సమగ్రత, ఇన్వెస్టర్ల ప్రయోజనాలు దెబ్బతింటాయని వ్యాఖ్యానించింది. -
రూ.110 కోట్ల కార్వీ ఆస్తుల జప్తు
సాక్షి, హైదరాబాద్: కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ ఎండీ పార్థసారథికి చెందిన రూ.110 కోట్ల విలువైన భూములు, బంగారు ఆభరణాలు, విదేశీ నగదు, షేర్లను జప్తు చేసినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. పార్థసారథితోపాటు సీఎఫ్‌వో జి.హరికృష్ణను గతంలో అరెస్ట్ చేయగా, ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నట్టు ఈడీ వెల్లడించింది. హైదరాబాద్ నగర కమిషనరేట్‌లోని సీసీఎస్ పోలీసులు నమోదు చేసిన కేసుల ఆధారంగా దర్యాప్తు చేస్తున్న ఈడీ కార్వీ సంస్థతోపాటు చైర్మన్, ఎండీ, తదితరులకు చెందిన రూ.1,984 కోట్ల విలువైన ఆస్తులను ఇప్పటికే జప్తు చేసినట్టు ఈడీ వెల్లడించింది. తాజాగా చేసిన రూ.110 కోట్ల ఆస్తులతో కలిపి మొత్తంగా రూ.2,095 కోట్ల ఆస్తులను జప్తు చేసినట్టు స్పష్టం చేసింది. కార్వీ సంస్థలో షేర్ హోల్డర్లను మోసం చేసి వారి షేర్ల మీద రూ.2,800 కోట్ల మేర రుణం పొంది ఎగొట్టిన కేసుల్లో పార్థసారథిపై దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో కేసులు నమోదయ్యాయి. ఆ రుణాలను రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి మళ్లించడంతోపాటు పలు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి వాటి పేర్ల మీద సైతం రుణం పొందినట్టు ఈడీ గుర్తించింది. షేర్ హోల్డర్లు ఇచ్చిన పవర్ ఆఫ్ అటార్నీని దుర్వినియోగం చేసి రుణం పొందడంతోపాటు కేడీఎంఎస్‌ఎల్, కేఆర్‌ఐఎల్ కంపెనీలకు మళ్లించి వాటిని లాభాల్లో చూపించే ప్రయత్నం చేసినట్టు గుర్తించింది. రుణాల్లో కొంత భాగాన్ని కుమారులు రజత్ పార్థసారథి, అధిరాజ్ పార్థసారథికి జీతభత్యాలు, రీయింబర్స్మెంట్ పేరుతో దోచిపెట్టినట్టు ఈడీ గుర్తించింది. కార్వీ అనుబంధ సంస్థగా ఉన్న కేడీఎంఎస్‌ఎల్ ఎండీ వి.మహేశ్‌తోపాటు మరికొంత మంది కలిసి పార్థసారథి డైరెక్షన్లో మనీలాండరింగ్‌లో కీలకపాత్ర పోషించినట్టు ఈడీ వెల్లడించింది. -
నష్టాలు చూపించి.. కోట్లు కొల్లగొట్టి..
సాక్షి, హైదరాబాద్: కస్టమర్ల పేరిట ఉన్న షేర్లను తనఖా పెట్టి మూడు వేల కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడిన కార్వీ ఎండీ పార్థసారథి వ్యవహారంపై ఈడీ లోతుగా దర్యాప్తు చేపట్టింది. నాలుగు రోజుల క్రితం అరెస్ట్‌చేసిన పార్థసారథితోపాటు కంపెనీ సీఎఫ్ఓ కృష్ణ హరిని విచారిస్తోంది. గురువారం కోర్టు అనుమతితో నాలుగు రోజుల కస్టడీలోకి తీసుకున్న ఈడీ మొదటి రోజు.. షేర్ల పేరిట రుణాలు తీసుకున్న డబ్బును ఎక్కడికి తరలించారన్న దానిపై ప్రశ్నల వర్షం కురిపించింది. షెల్ కంపెనీలపై వేల కోట్ల రుణం కార్వీ స్టాక్ బ్రోకింగ్ షేర్లు కొనుగోలు చేసిన క్లయింట్ షేర్లను పవర్ ఆఫ్ అటార్నీతో బదలాయించుకున్న పార్థసార«థి.. కృష్ణ హరితో కలిసి కార్వీ రియల్టీతోపాటు 14 షెల్ కంపెనీలకు మళ్లించినట్టు ఈడీ విచారణలో బయటపడింది. కస్టమర్ల షేర్లను సైతం షెల్ కంపెనీలకు మళ్లించినట్టు వెలుగులోకి వచ్చింది. ఇలా మళ్లించిన షేర్లను 5 షెల్ కంపెనీల పేరిట తనఖా పెట్టి హెచ్డీఎఫ్సీ బ్యాంకులో రూ.400 కోట్ల రుణం పొందినట్టు ఈడీ గుర్తించింది. ఈ డబ్బును కార్వీ సంస్థల అప్పుల చెల్లింపునకు ఉపయోగించినట్టు పార్థసారథి, కృష్ణ హరి విచారణలో చెప్పిననట్టు దర్యాప్తు వర్గాల ద్వారా తెలిసింది. కార్వీ రియల్టీతోపాటు మరో 9 కంపెనీల పేరు మీదకు మళ్లించిన షేర్లతో నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల ద్వారా రుణాలు పొందేందుకు యత్నించారని, ఆ తర్వాత రెండు ప్రైవేట్ బ్యాంకుల ద్వారా రూ.రెండువేల కోట్లకు పైగా రుణం పొందినట్టు గుర్తించారు. ఆ డబ్బు సంగతేంటి? స్టాక్ బ్రోకింగ్ కంపెనీ నుంచి మళ్లించిన షేర్లను తన వ్యక్తిగత ఖాతాతోపాటు కుటుంబీకుల పేర్ల మీద ఉన్న కంపెనీలకు తరలించినట్టు గుర్తించిన ఈడీ.. అక్కడి నుంచి ఎక్కడికి మళ్లించారన్న అంశాలపై లోతుగా విచారిస్తోంది. కుటుంబీకుల పేర్ల మీద ఉన్న కంపెనీలోకి దాదాపు రూ.2వేల కోట్లు మళ్లించినట్టు గుర్తించింది. తర్వాత ఈ డబ్బును ఎక్కడికి మళ్లించారు, షేర్ల బదలాయింపునకు ముందే కంపెనీని భారీ నష్టాల్లో ఎందుకు చూపించాల్సి వచ్చిందన్న దానిపై పార్థసారథిని ప్రశ్నిస్తోంది. ఇద్దరూ కంపెనీ ఉద్యోగులను పూర్తిస్థాయిలో కుంభకోణంలో పాలుపంచుకునేలా చేసినట్టు ఈడీ భావిస్తోంది. ఈ వ్యవహారంపై కస్టడీలో పూర్తి వివరాలను రాబట్టేందుకు ప్రయత్నిస్తోంది. -
కార్వీ ఎండీ పార్థసారథి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: కార్వీ స్టాక్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్(కేఎస్‌బీఎల్) మేనేజింగ్ డైరెక్టర్ పార్థసారథిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసింది. మదుపరుల అనుమతి లేకుండా వారి షేర్లను బదలాయించడంతోపాటు సెబీ నిబంధనలు ఉల్లంఘించి తీసుకున్న బ్యాంకు రుణాలను వ్యక్తిగత, షెల్ కంపెనీలకు మళ్లించిన నేరంలో ఆయనను సోమవారం ఉదయం బెంగళూర్‌లో పీటీ వారెంట్‌పై అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు హైదరాబాద్ తీసుకొచ్చి రిమాండ్‌కు తరలించారు. కార్వీలో జరిగిన కుంభకోణంపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు పార్థసారథితోపాటు ఇతర డైరెక్టర్లపై ఇప్పటికే కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇదే తరహా కేసులో బెంగళూర్ పోలీసులు కూడా పార్థసారథిని పీటీ వారెంట్‌పై తీసుకెళ్లి విచారించారు. సీసీఎస్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన ఈడీ సెప్టెంబర్, అక్టోబర్‌ల్లో కార్వీకి చెందిన 14 కార్యాలయాలు, ఎండీ, ఇతర కీలక వ్యక్తుల ఇళ్లలో సోదాలు చేసింది. కార్వీ షేర్లు కొన్న మదుపరుల పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా వారికి తెలియకుండా షేర్లను తన వ్యక్తిగత ఖాతాలోకి బదలాయించుకొని వాటిని బ్యాంకుల్లో తనఖా పెట్టి రూ.3 వేల కోట్లు రుణంగా పార్థసారథి పొందినట్టు ఈడీ గుర్తించింది. ఐసీఐసీఐ, ఇండస్ బ్యాంకుల ద్వారా పొందిన రూ.1,100 కోట్ల రుణంను తన ఖాతాలతోపాటు షెల్ కంపెనీలైనా కార్వీ రియాల్టీ, కార్వీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, మరో 7 కంపెనీలోకి మళ్లించి మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు ఈడీ గుర్తించింది. డీమ్యాట్ అకౌంట్లు బ్లాక్ లిస్ట్‌లో ఉన్నా పార్థసారథి సెబీ నిబంధనలు ఉల్లంఘించి ఇలా తనఖా పెట్టి షేర్ల ద్వారా రుణాలను షెల్ కంపెనీల్లోకి మళ్లించినట్టు ఈడీ దర్యాప్తులో తేలింది. రూ.700 కోట్ల షేర్లు ఫ్రీజ్ గతేడాది సెప్టెంబర్‌లో ఈడీ రూ.700 కోట్ల విలువైన కార్వీ స్టాక్ బ్రోకింగ్ షేర్లను ఫ్రీజ్ చేసింది. కస్టమర్లకు తెలియకుండా బదలాయించుకున్న షేర్లకు సంబంధించిన రూ.1,906 కోట్లను కార్వీ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ నుంచి కార్వీ రియాల్టీ, కార్వీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లోకి బదలాయించినట్టు ఈడీ దర్యాప్తులో గుర్తించినట్టు తెలిసింది. మిగిలిన రూ.1,800 కోట్ల లావాదేవీలపై విచారణను ముమ్మరం చేసింది. డబ్బును ఎక్కడికి మళ్లించారు, దేనికి వాడారో తేల్చేందుకు పార్థసారథిని మరింత లోతుగా విచారించనుంది. ఇందుకు కోర్టులో కస్టడీ పిటిషన్ వేసి విచారించేందుకు ఈడీ అధికారులు సిద్ధమవుతున్నారు. కాగా, బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను షెల్ కంపెనీకు మళ్లించిన ఆధారాలను ఆటోమేటెడ్ డిలీట్ సాఫ్ట్‌వేర్‌తో పార్థసారథి ధ్వంసం చేసినట్టు ఈడీ అనుమానిస్తోంది. వీటిని వెలుగులోకి తేవాల్సి ఉందని ఈడీ భావిస్తోంది. -
కార్వీకి భారీ షాక్: 700 కోట్ల షేర్లు ఫ్రీజ్
సాక్షి,హైదరాబాద్: కార్వీ స్టాక్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సి.పార్థసారథికి భారీ షాక్ తగిలింది. కార్వీకి సంబంధించిన 700 కోట్ల రూపాయల షేర్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం ఫ్రీజ్ చేసింది. ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యుల షేర్లు ఫ్రీజ్ చేశారు. రూ.3 వేల కోట్ల కుంభకోణం కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. రోజురోజుకు ఆయన చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా షేర్లను ఫ్రీజ్ చేసింది. సీసీఎస్ ఎఫ్ఐఆర్ ఆధారంగా రంగంలోకి దిగిన ఈడి అధికారులు..వీటితో పాటు ఎండీ పార్ధసారథి ఆస్తుల జప్తు, ఇద్దరు కుమారుల ఆస్తుల్ని ఈడీ అధికారులు ఫ్రీజ్ చేశారు. కాగా, ఇటీవల కార్వీలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. మదుపరుల షేర్లను వారి అనుమతి లేకుండా బ్యాంకుల్లో తాకట్టు పెట్టి తీసుకున్న రూ.వందల కోట్ల రుణాలు షెల్ కంపెనీలకు మళ్లించడంలో భారీగా మనీల్యాండరింగ్ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ స్కామ్‌పై సీసీఎస్ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ముందుకెళ్తున్న ఈడీ ఇప్పటికే కార్వీ చైర్మన్ సి.పార్థసారథిని విచారించింది. -
కార్వీ పార్థసారథిపై బిగుస్తున్న ఉచ్చు
సాక్షి, హైదరాబాద్: కార్వీ స్టాక్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సి.పార్థసారథి చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. ఇప్పటికే ఈయనపై పలు రాష్ట్రాల్లో కేసులు నమోదుకాగా, తాజాగా రూ.350 కోట్ల స్కామ్‌కు సంబంధించి బెంగళూరులోని వివిధ ఠాణాల్లో నలుగురు బాధితులు వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. ఆ ప్రాంతానికి చెందిన మదుపరుల డీమ్యాట్ ఖాతాల్లోని షేర్లు, బ్యాంకు ఖాతాల్లోని నగదును కార్వీ సంస్థ దుర్వినియోగం చేసిందంటూ వాటిలో పేర్కొన్నారు. ఈ కేసులను అక్కడి క్రైమ్ వింగ్ సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్ చేరుకున్న అధికారులు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులతో భేటీ అయ్యారు. ఇప్పటివరకు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాలను తెలుసుకున్నారు. మరోపక్క హరియాణా సహా ఇతర రాష్ట్రాల్లోనూ కార్వీపై కేసులు నమోదవుతున్నా యి. తక్కువ మొత్తాలతో ముడిపడి ఉన్న కేసులను పార్థసారథి సంబంధీకులు సెటిల్ చేస్తున్నారు. -
ఆడిట్ రిపోర్ట్ ముందుంచి పార్థసారథిని ప్రశ్నించిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్: కార్వి ఎండి పార్థసారధికి రెండు రోజుల కస్టడీ ముగిసింది. కస్టడీలో ఉండగా అతన్ని పలు అంశాల్లో సీసీఎస్ పోలీసులు విచారించారు. అందులో భాగంగా.. కార్వి సంస్థకు చెందిన బ్యాంక్ ఖాతాల వివరాలు సేకరించారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు ఎక్కడికి తరలించారన్న దానిపై ప్రశ్నించారు. పలు బ్యాంక్ లాకార్ల పై కూపీ కూడా లాగారు. కాగా ఆడిట్ రిపోర్ట్ అతని మందుంది విచారించినట్లు తెలిపారు. వైద్య పరీక్షల నిమిత్తం న్యాయమూర్తి ముందు పార్థసారథిని పోలీసులు హాజరుపరిచారు. అనంతరం అతన్ని చంచల్ గూడ జైలుకు తరలించారు. కాగా బ్యాంకు రుణాల ఎగవేత, నిధుల మళ్లింపుపై కార్వీ ఎండీ పార్ధసారథి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పోలీసుల విచారణలో పార్ధసారథి 6 బ్యాంక్‌ల నుంచి కార్వీ వేల కోట్లలో రుణాలు పొందినట్లు గుర్తించారు. చదవండి: బంగారాన్ని పేస్ట్‌గా మార్చి ప్యాంట్లో దాచాడు! -
రెండోరోజు ముగిసిన కార్వీ ఎండీ పార్థసారథి పోలీసుల కస్టడి
-
ముగిసిన కార్వీ ఎండీ పార్థసారథి పోలీసుల కస్టడి
సాక్షి, హైదరాబాద్: బ్యాంకు రుణాల ఎగవేత, నిధుల మళ్లింపుపై ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్వీ ఎండీ పార్ధసారథి పోలీసుల కస్టడీ ముగిసింది. రెండు రోజులు పాటు పార్థసారథిని విచారించిన సీసీఎస్ పోలీసులు అతని నుంచి కీలక సమాచారం సేకరించారు. కంపెనీ ఆడిట్ రిపోర్ట్ ఆధారంగా విచారించిన పోలీసులు.. కార్వీ సంస్థకు చెందిన బ్యాంక్ ఖాతాల వివరాలు సేకరించారు. వీటి ద్వారా 6 బ్యాంక్‌ల నుంచి కార్వీ వేల కోట్లలో రుణాలు పొందినట్లు గుర్తించారు. కార్వీకి చెందిన 6 బ్యాంక్ అకౌంట్లను అధికారులు ఫ్రీజ్ చేశారు. అలాగే కార్వీ కుంభకోణంలో ఇతరుల పాత్రపై పార్ధసారథిని పోలీసులు ప్రశ్నించారు. ఇతర నిందితులపై త్వరలో చర్యలకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. మరి కాసేపట్లో పార్థసారథిని వైద్య పరీక్షలు నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి న్యాయమూర్తి ముందు హాజరు పర్చనున్నారు. కాగా రుణాల ఎగవేత కేసులో అరెస్ట్ అయిన పార్ధసారథిని రెండు రోజుల పోలీసుల కస్టడీకి అనుమతిస్తూ మంగళవారం నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. రెండు రోజుల పాటు ఆయన్ను విచారించిన సీసీఎస్ పోలీసులు నేడు కోర్టులో హజరుపర్చనున్నారు. -
పోలీసుల అదుపులో కార్వీ పార్ధ సారధి
-
కార్వీ స్కామ్, తీసుకున్న రుణాలు ఎగ్గొట్టేందుకు కుట్ర.?!
ప్రముఖ స్టాక్ మార్కెట్ సంస్థ కార్వీపై షేర్లను తనఖా పెట్టి రుణం తీసుకుందని హెచ్డీఎఫ్సీ,ఇండస్ ఇండ్ బ్యాంక్‌లు ఫిర్యాదు చేశాయి. కార్వీపై సెంట్రల్ క్రైమ్ స్టేషన్ లో రెండు కేసులు నమోదయ్యాయి. షేర్లను ఉంచుకొని రుణాలు మంజూరు చేయాలని ధరఖాస్తు చేసుకొని తరువాత అసలు,వడ్డీ చెల్లించకుండా మోసం చేసిందని హెచ్డీఎఫ్సీ, ఇండస్ ఇండ్ బ్యాంక్ లు వేర్వేరుగా ఫిర్యాదు చేశాయి. రూ.329.16 కోట్ల షేర్లను తనఖా పెట్టి హెచ్డీఎఫ్సి వద్ద రుణం తీసుకుంటే.. ఇండస్ ఇండ్ బ్యాంక్ లో రూ. 137కోట్ల రుణం తీసుకొని ఎగవేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. రుణం తీసుకున్న తర్వాత కొద్దినెలలు వాయిదాలు చెల్లించి రుణాల్ని ఎగవేయడంలో వెన్నతో పెట్టిన విద్య అని బ్యాంక్‌లు అంటున్నాయి. 2019 సెప్టెంబరులో కార్వీసంస్థపై ఫిర్యాదుతో రావడంతో సెబీ విచారణ జరిపి లావాదేవీలపై నిషేదం విధించింది. వినియోగదారుల షేర్లను కార్వీసంస్థ అక్రమంగా సొంత లాభానికే వాడుకుంటుందంటూ సెబీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు నివేదిక సమర్పించింది. వందల కొద్ది షేర్లు నకిలీవి ఉన్నాయంటూ నివేదికలో తెలిపింది. దీంతో కార్వీ సంస్థ బ్యాంకుల్లో ఉంచిన షేర్ల లావాదేవీలు ఒక్కసారిగా స్తంభించాయి. మరోవైపు తాము ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించేందుకు అవసరమైన పత్రాల్ని సమర్పించాలంటూ కార్వీ డైరెక్టర్లకు హెచ్డీఎఫ్ అధికారులు నోటీసులు పంపారు. అయితే నెలలు గడుస్తున్నా పత్రాలు ఇవ్వలేదని బ్యాంక్ ఆరోపిస్తోంది. ఉద్దేశపూర్వకంగానే రుణాల్ని ఎగవేత వేయడంతో పాటూ బ్యాంకుల్ని దారుణంగా వంచించారని, ప్రజల డబ్బుకు రక్షణగా ఉన్న తమపట్ల అనైతికంగా ప్రవర్తిస్తున్నారంటూ కార్వీ సంస్థపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆ రెండు బ్యాంకులు కోరాయి. చదవండి : అమ్మో.. 2025 నాటికి ఇంతమంది కుబేరులవుతారా?! -
డిఫాల్టర్‌గా కార్వీ స్టాక్ బ్రోకింగ్
న్యూఢిల్లీ: క్లయింట్ల సెక్యూరిటీలను సొంతానికి వాడుకున్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్వీ స్టాక్ బ్రోకింగ్‌ను నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీ (ఎన్ఎస్ఈ) .. డిఫాల్టర్‌గా ప్రకటించింది. ఎక్స్చేంజీ మార్గదర్శకాలను ఉల్లంఘించడమే ఇందుకు కారణమని పేర్కొంది. కార్వీ స్టాక్ బ్రోకింగ్ సభ్యత్వాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు ఒక సర్క్యులర్‌లో ఎన్ఎస్ఈ తెలిపింది. నవంబర్ 23 నుంచే దీన్ని అమల్లోకి తెచ్చినట్లు వివరించింది. మరోవైపు, కొత్త క్లయింట్లను తీసుకోకుండా కార్వీ స్టాక్ బ్రోకింగ్‌పై మధ్యంతర ఉత్తర్వుల్లో విధించిన నిషేధాన్ని ఖరారు చేస్తూ సెబీ మంగళవారం తుది ఆదేశాలు జారీ చేసింది. అలాగే, సంస్థపైనా, దాని డైరెక్టర్లపైనా తగు చర్యలు తీసుకోవాలంటూ స్టాక్ ఎక్స్చేంజీలు, డిపాజిటరీలకు సూచించింది. ఇన్వెస్టర్ల క్లెయిమ్‌లను సెటిల్ చేసే వరకూ, ఎన్ఎస్ఈ నుంచి ముందస్తు అనుమతులు తీసుకోకుండా .. కార్వీ తన ఆస్తులను ఎవరికీ బదలాయించకూడదంటూ సెబీ ఉత్తర్వులు ఇచ్చింది. ఇన్వెస్టర్ల నిధులు, సెక్యూరిటీలను అనుమతి లేకుండా వాడుకున్న కార్వీ కేసులో.. 2.35 లక్షల మంది ఇన్వెస్టర్లకు చెందిన రూ.2,300 కోట్లకు విలువైన నిధులు, సెక్యూరిటీలను సెటిల్ చేసినట్టు ఎన్ఎస్ఈ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏం జరిగిందంటే.. 1985లో రిజిస్ట్రీ సర్విసుల సంస్థగా కార్యకలాపాలు ప్రారంభించిన కార్వీ గ్రూప్ ఆ తర్వాత కమోడిటీలు, బీమా, రియల్టి, ఆన్లైన్ బ్రోకింగ్ తదితర విభాగాల్లోకి విస్తరించింది. ఈ క్రమంలో బ్రోకింగ్ సంస్థగా క్లయింట్లు ఇచ్చిన పవర్ ఆఫ్ అటారీ్నలను దుర్వినియోగం చేసి, వారికి తెలియకుండా వారి ఖాతాల నుంచి రూ. 2,300 కోట్ల పైగా విలువ చేసే సెక్యూరిటీలను తన డీమ్యాట్ ఖాతాల్లోకి అనధికారికంగా మళ్లించుకుందని కార్వీపై ఆరోపణలు ఉన్నాయి. ఈ షేర్లను తనఖా పెట్టి హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ తదితర బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి కార్వీ రుణాలు తీసుకుంది. వీటిని కార్వీ రియల్టీ వంటి గ్రూప్ కంపెనీలకు మళ్లించింది. ఇదంతా బైటపడటంతో 2019 నవంబర్‌లో కార్వీ కొత్త క్లయింట్లను తీసుకోకుండా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిషేధం విధించింది. ఆ తర్వాత డిసెంబర్లో కార్వీ ట్రేడింగ్ కార్యకలాపాలను స్టాక్ ఎక్స్చేంజీలు నిలిపివేశాయి. ఈ స్కామ్ దరిమిలా బ్రోకింగ్ సంస్థలకు నిబంధనలను సెబీ మరింత కఠినతరం చేసింది. కార్వీ గ్రూప్ తన వ్యాపారాన్ని ఆర్థిక సేవలు, ఆర్థికేతర సేవల కింద రెండు విభాగాలుగా విడగొట్టింది. -
అలా ఎలా రుణాలిచ్చేశారు?
ముంబై: క్లయింట్ల షేర్లను సొంతానికి వాడుకుందని ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్వీ స్టాక్ బ్రోకింగ్ (కేఎస్‌బీఎల్) వివాదం... తాజాగా బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల మెడకు కూడా చుట్టుకుంటోంది. తనఖా పెట్టిన షేర్ల గురించి పూర్తిగా మదింపు చేయకుండా అవి కార్వీకి ఎలా రుణాలిచ్చాయన్న అంశంపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దృష్టి సారించింది. దీనికి సంబంధించి బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలపై విచారణ జరపాలంటూ రిజర్వ్ బ్యాంక్‌కు సెబీ లేఖ రాసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అక్రమంగా క్లయింట్ల సెక్యూరిటీలను తనఖా పెట్టి రుణాలు తీసుకున్నప్పుడే బ్యాంకులు అప్రమత్తం కావాల్సిందని సెబీ వర్గాలు పేర్కొంటున్నాయి. కార్వీ తనఖా పెట్టిన షేర్లను క్లయింట్ల ఖాతాల్లోకి మళ్లించాలంటూ డిసెంబర్ 2న సెబీ ఆదేశించటంతో నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ఎస్డీఎల్) దాదాపు 90 శాతం మంది క్లయింట్లకు షేర్లను బదలాయించడం తెలిసిందే. అయితే, తమకు పూచీకత్తుగా ఉంచిన షేర్లను క్లయింట్లకెలా బదలాయిస్తారంటూ బ్యాంకులు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ‘ఆ షేర్లపై కార్వీకే అధికారాల్లేనప్పుడు.. వాటిని తనఖా పెట్టుకుని బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు రుణాలెలా ఇచ్చాయి? వాటిని క్లయింట్ల ఖాతాల్లోకి బదలాయించొద్దంటూ ఎలా చెబుతాయి?‘ అని సెబీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. షేర్లన్నింటికీ రిస్కు.. భారీ ఆస్తులను తనఖా పెట్టి స్వల్ప మొత్తంలో రుణాలు తీసుకుంటున్నప్పుడే బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు అనుమానం రావాల్సిందని సంబంధిత వర్గాలు వ్యాఖ్యానించాయి. దాదాపు రూ.5,000 కోట్ల విలువ చేసే ప్రమోటర్ అసెట్స్‌కు ప్రతిగా కార్వీకి బ్యాంకులు రూ.1,200 కోట్లు రుణమిచ్చాయి. అలాగే రూ. 2,300 కోట్ల విలువ చేసే క్లయింట్ల షేర్లను తనఖా పెట్టి కార్వీ మరో రూ.600 కోట్లు రుణం తీసుకుంది. కార్వీ తీసుకున్న రుణాల్లో ఏ కొంచెం ఎగ్గొట్టినా.. ఇంత భారీ స్థాయిలో తనఖా పెట్టిన షేర్లన్నింటినీ బ్యాంకులు అమ్మేసే ప్రమాదం ఉంటుంది. పైపెచ్చు కార్వీ సొంత బ్యాలెన్స్ షీట్లో రూ.27 లక్షల విలువ చేసే షేర్లు మాత్రమే ఉండటం చూసైనా.. ఏదో పొరపాటు జరుగుతోందని బ్యాంకులు మేల్కొని ఉండాల్సిందని సంబంధిత వర్గాలు వ్యాఖ్యానించాయి. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు కచ్చితంగా తప్పు చేశాయని ఇలాంటి ఉదంతాలు రుజువు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. ఐసీఐసీఐ, ఇండస్ఇండ్, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్, కోటక్ మహీంద్రా బ్యాంకులతో పాటు బజాజ్ ఫైనాన్స్ వంటి సంస్థలు షేర్లను తనఖా పెట్టుకుని కార్వీకి దాదాపు రూ.1,800 కోట్ల మేర రుణాలిచ్చాయి. ఈవోడబ్ల్యూకీ సెబీ ఫిర్యాదు..? కార్వీ కేసుకు సంబంధించి ముంబై పోలీస్‌లో భాగమైన ఆర్థిక నేరాల విభాగానికి (ఈవోడబ్ల్యూ) కూడా సెబీ ఫిర్యాదు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ‘కార్వీ కేసు కేవలం సెక్యూరిటీస్ చట్టానికి మాత్రమే పరిమితమైనది కాదు. ఇది సివిల్ కేసు కూడా కనక సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌కు (శాట్) ఆదేశాలిచ్చే అధికారాల్లేవు. కాబట్టి క్లయింట్ల షేర్లను దొంగిలించిందంటూ కార్వీపై ఈవోడబ్ల్యూకి సెబీ ఫిర్యాదు చేయొచ్చు‘ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. క్లయింట్ల షేర్లను తనఖా పెట్టి రుణాలు తీసుకుంటున్న ఇతర బ్రోకరేజీ సంస్థలపైనా సెబీ దృష్టి సారించింది. సెక్యూరిటీలను తనఖా పెట్టి రూ.50 కోట్ల పైగా రుణాలు తీసుకున్న సంస్థలు నాలుగే ఉన్నాయని, మిగతా సంస్థలన్నీ సొంత షేర్లనే పూచీకత్తుగా పెట్టాయని తేలినట్లు సమాచారం. -
పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చే ముందు జాగ్రత్త
న్యూఢిల్లీ: స్టాక్ బ్రోకర్లతో ఇన్వెస్టర్లు పవర్ ఆఫ్ అటార్నీ (పీవోఏ) ఒప్పందం కుదుర్చుకునే విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలని ఎన్ఎస్ఈ హెచ్చరించింది. కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ రూ.2,300 కోట్ల విలువైన తమ క్లయింట్ల సెక్యూరిటీలను తన ఖాతాలోకి మళ్లించి, వాటిపై రుణాలు పొందిన విషయం తెలిసిందే. ఈ విషయంలో కార్వీ క్లయింట్ల పీవోఏను దుర్వినియోగం చేసినట్టు సెబీ తన ఆదేశాల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎన్ఎస్ఈ సోమవారం ఓ ప్రకటనలో సూచనలు చేసింది. ► ఇన్వెస్టర్లు తమ తరఫున బ్రోకర్లు నిర్వహించాల్సిన హక్కుల ను పీవోఏలో స్పష్టంగా పేర్కొనాలి. అవి ఎప్పటి వరకు చెల్లుబాటయ్యేది కూడా ఒప్పందంలో ఉండేలా చూసుకోవాలి. ► పీవోఏకు ప్రత్యామ్నాయంగా ఆన్లైన్లో సెక్యూరిటీలను డెలివరీ చేసేందుకు దరఖాస్తు చేసుకోవాలి. సెబీ, స్టాక్ ఎక్సే్ఛ ంజ్ నిబంధనల ప్రకారం పీవోఏ అన్నది తప్పనిసరేమీ కాదు. ► ట్రేడ్ కాంట్రాక్టు 24 గంటల్లోపు ఇన్వెస్టర్లకు అందాలి. అదే విధంగా అకౌంట్ స్టేట్మెంట్ ప్రతి మూడు నెలలకూ ఓ సారి తప్పకుండా వచ్చేలా చూసుకోవాలి. ► బ్రోకర్ వద్ద మార్జిన్ కోసం ఉంచిన సెక్యూరిటీలను తనఖా పెట్టి నిధులు పొందేందుకు అనుమతించకూడదు. ► నిధులు, సెక్యూరిటీలను బ్రోకర్ వద్దే ఉంచేయకుండా సకాలంలో తెప్పించుకోవాలి. ► ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాల్లోకి క్రమం తప్పకుండా లాగిన్ అయి, బ్యాలన్స్‌ను తనిఖీ చేసుకోవాలి. డిపాజిటరీల నుంచి వచ్చే స్టేట్మెంట్లు, స్టాక్ ఎక్సే్ఛంజ్‌ల నుంచి నిధులు, సెక్యూరిటీలకు సంబంధించి వచ్చే ఎస్ఎంఎస్లను కూడా పరిశీలించుకోవాలి. ఏవైనా వ్యత్యాసాలను గమనిస్తే వెంటనే ఆ విషయాన్ని బ్రోకర్లకు తెలియజేయాలి. ► స్టాక్ బ్రోకర్ వద్ద తమ మొబైల్ నంబర్, ఈ–మెయిల్ ఐడీకి సంబంధించి తాజా వివరాలు ఉండేలా చూసుకోవాలని కూడా ఇన్వెస్టర్లను ఎన్ఎన్ఈ కోరింది. -
కార్వీ కేసులో బ్యాంకులకు చుక్కెదురు
న్యూఢిల్లీ: క్లయింట్ల షేర్లు సొంతానికి వాడుకుందని ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్వీ స్టాక్ బ్రోకింగ్ (కేఎస్‌బీఎల్) వ్యవహారంలో సెక్యూరిటీస్ అపీలేట్ ట్రిబ్యునల్‌లో (శాట్) బ్యాంకులకు చుక్కెదురైంది. తనఖా పెట్టిన షేర్లను క్లయింట్ల ఖాతాల్లోకి మళ్లించకుండా తక్షణం ఆదేశాలివ్వాలన్న బ్యాంకుల అభ్యర్థనను శాట్ తోసిపుచ్చింది. దీనిపై డిసెంబర్ 6లోగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీనే ఆశ్రయించాలని ఆదేశించింది. అలాగే ఆయా బ్యాంకుల వాదనలు విని, డిసెంబర్ 12లోగా తగు ఆదేశాలివ్వాలని సెబీకి సూచించింది. దీంతోపాటు, కార్వీ ట్రేడింగ్ లైసెన్సును రద్దు చేసిన అంశానికి సంబంధించి డిసెంబర్ 6లోగా తగు నిర్ణయం తీసుకోవాలని నేషనల్ స్టాక్ ఎక్సే్చంజీ (ఎన్ఎస్ఈ)ని ఆదేశించింది. కాగా, కార్వీ తనఖా పెట్టిన షేర్లపై రుణదాతలు మొత్తం రూ.1,400 కోట్ల మేర రుణాలిచ్చినట్లుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. సుమారు 95,000 క్లయింట్లకు చెందిన దాదాపు రూ. 2,800 కోట్ల విలువ చేసే షేర్లను తనఖా పెట్టి కార్వీ పెద్దమొత్తంలో రుణాలు తీసుకుందన్న ఆరోపణలు రావటం తెలిసిందే. ఈ షేర్లను ఆయా క్లయింట్ల ఖాతాల్లోకి బదలాయించాలన్న సెబీ ఆదేశాలను ఎన్ఎస్డీఎల్ అమలు చేస్తోంది. సుమారు 83వేల మంది క్లయింట్లకు ఇప్పటికే షేర్ల బదిలీ జరిగింది. అయితే, కార్వీ తనఖా ఉంచిన షేర్లను క్లయింట్ల ఖాతాల్లోకి బదిలీ చేయరాదని, వాటిని ఎస్క్రో ఖాతాలోకి మళ్లించాలని కోరుతూ బజాజ్ ఫైనాన్స్ వంటి ఆర్థిక సంస్థలు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు.. ఐసీఐసీఐ బ్యాంక్ శాట్‌ను ఆశ్రయించాయి. దీనిపై మంగళవారం శాట్ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. -
తనఖా షేర్ల బదిలీ ఆపండి
న్యూఢిల్లీ: క్లయింట్ల షేర్లను సొంతానికి వాడుకుందని ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్వీ స్టాక్ బ్రోకింగ్ (కేఎస్‌బీఎల్) వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా కార్వీకి రుణాలిచ్చిన బ్యాంకులకు ఊరటనిస్తూ సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ శాట్ ఆదేశాలిచి్చంది. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ (ఎస్ఎస్డీఎల్).. మరిన్ని షేర్లను కార్వీ క్లయింట్ల ఖాతాల్లోకి బదలాయించకుండా స్టే విధిస్తూ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తుది ఉత్తర్వులు బుధవారం (నేడు) మధ్యాహా్ననికి ఇవ్వనుంది. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆదేశాల మేరకు ఎన్ఎస్డీఎల్ ఇప్పటికే చాలామటుకు షేర్లను క్లయింట్లకు బదిలీ చేయగా.. మరికొందరు ఇన్వెస్టర్లకు సెక్యూరిటీల బదలాయింపు ఇంకా జరగాల్సి ఉంది. అయితే, తనఖా పెట్టిన షేర్లకు ప్రతిగా కారీ్వకి రుణాలిచ్చిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ మొదలైన సంస్థలు ఈ విషయంలో సెబీ ఆదేశాలను సవాలు చేస్తూ శాట్‌ను ఆశ్రయించాయి. దీనిపైనే శాట్ తాజా ఆదేశాలిచి్చంది. రుణాలపై ప్రభావం చూపుతుంది.. రుణాల కోసం తనఖా ఉంచిన షేర్లను ఇలా ఏకపక్షంగా బదలాయించేస్తే.. ఇలాంటి రుణాల మంజూరుపై తీవ్ర ప్రభావం పడుతుందని బ్యాంకులు తమ వాదన వినిపించాయి. ఆయా షేర్లను క్లయింట్లు విక్రయించేసిన పక్షంలో మళ్లీ వెనక్కి రప్పించడం కష్టమవుతుందని ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో క్లయింట్లకు బదిలీ చేసిన షేర్లను వెనక్కి తీసుకుని, ఎస్క్రో అకౌంట్లో ఉంచాలని కోరాయి. నియంత్రణ సంస్థలు, నియంత్రిత సంస్థలు చేసే ’తప్పులకు’ తమను బాధ్యులను చేయడం సరికాదని బ్యాంకులు పేర్కొన్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంకు రూ. 470 కోట్ల విలువైన షేర్లకు ప్రతిగా రూ. 300 కోట్ల రుణమిచి్చంది. మిగతా వాటికన్నా ముందుగా శాట్‌ను ఆశ్రయించిన బజాజ్ ఫైనాన్స్ .. సుమారు రూ. 345 కోట్ల రుణమిచ్చింది. మరోవైపు, బ్యాంకులు బాధ్యతారహితంగా బ్రోకరేజీలకు రుణాలిస్తున్నాయంటూ ఎన్ఎస్డీఎల్ తరఫు న్యాయవాది ఆరోపించారు. సెబీ ఆదేశాల మేరకే క్లయింట్ల ఖాతాల్లోకి ఎన్ఎస్డీఎల్ షేర్లను బదిలీ చేసిందని స్పష్టం చేశారు. సుమారు 95,000 మంది క్లయింట్లకు చెందిన రూ. 2,300 కోట్లకు పైగా విలువ చేసే షేర్లను బజాజ్ ఫైనాన్స్ తదితర సంస్థల్లో తనఖా పెట్టి కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ దాదాపు రూ. 600 కోట్ల దాకా రుణాలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త క్లయింట్లను చేర్చుకోకుండా కార్వీపై సెబీ ఆంక్షలు విధించగా, స్టాక్ ఎక్సే్చంజీలు ఆ సంస్థ ట్రేడింగ్ లైసెన్సును రద్దు చేశాయి. ఈ క్రమంలో.. కార్వీ తనఖా పెట్టిన షేర్లను ఆయా క్లయింట్ల ఖాతాల్లోకి బదిలీ చేయాలన్న సెబీ ఆదేశాలను నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ (ఎన్ఎస్డీఎల్) ప్రస్తుతం అమలు చేస్తోంది. ఇప్పటికే 83,000 మంది ఇన్వెస్టర్ల ఖాతాల్లోకి షేర్ల బదిలీ పూర్తయ్యింది. చెల్లింపుల సమస్య కారణంగా మిగతా ఖాతాల్లోకి బదలాయింపు జరగాల్సి ఉంది. -
కార్వీకి మరో షాక్..!
ముంబై/హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్లయింట్ల షేర్లను సొంతానికి వాడుకుందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టాక్ బ్రోకింగ్ సంస్థ కార్వీకి ఒకదాని తర్వాత మరొకటిగా షాకులు తగులుతున్నాయి. తాజాగా అన్ని విభాగాల్లో ట్రేడింగ్ లైసెన్సును సస్పెండ్ చేస్తున్నట్లు స్టాక్ ఎక్సే్ఛంజీలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ సోమవారం ప్రకటించాయి. ఎక్సే్ఛంజీల నిబంధనలను ఉల్లంఘించడమే ఇందుకు కారణమని వెల్లడించాయి. సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి వస్తుందని వేర్వేరుగా విడుదల చేసిన సర్క్యులర్లలో బీఎస్ఈ, ఎన్ఎస్ఈ వివరించాయి. ఈక్విటీ, డెట్ విభాగాల్లో కార్వీ ట్రేడింగ్ టెర్మినల్స్‌ను డీయాక్టివేట్ చేసినట్లు బీఎస్ఈ తెలిపింది. ఈక్విటీ డెరివేటివ్స్, కరెన్సీ డెరివేటివ్స్, కమోడిటీ సెగ్మెంట్స్‌లో నిర్దిష్ట ఆంక్షలు విధించినట్లు పేర్కొంది. అటు ఎన్ఎస్ఈ కూడా ఈక్విటీ, ఎఫ్‌అండ్‌వో, కరెన్సీ డెరివేటివ్స్, డెట్, కమోడిటీ డెరివేటివ్స్ వంటి అన్ని విభాగాల్లోనూ కార్వీపై నిషేధం విధించింది. అయితే, బ్రోకింగ్ లైసెన్సును సస్పెండ్ చేయడంపై సెక్యూరిటీస్ అప్పీలేట్ ట్రిబ్యునల్ (శాట్)ను ఆశ్రయించనున్నట్లు కార్వీ వర్గాలు తెలిపాయి. ఇది సత్వరమే పరిష్కారం కాగలదని పేర్కొన్నాయి. దాదాపు రూ. 2,300 కోట్ల విలువ చేసే క్లయింట్ల షేర్లను తనఖా పెట్టి రూ. 600 కోట్ల దాకా రుణాలు తీసుకుందని, క్లయింట్ల నిధులను సొంత అవసరాలకు వాడుకుందని కార్వీ స్టాక్ బ్రోకింగ్ (కేఎస్‌బీఎల్) ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దీంతో కొత్త క్లయింట్లను చేర్చుకోకుండా, పాత క్లయింట్ల పవర్ ఆఫ్ అటార్నీలను (పీవోఏ) ఉపయోగించుకోకుండా కార్వీపై నవంబర్ 22న మా ర్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిషేధం విధించింది. వెసులుబాటుకు సెబీ నిరాకరణ.. క్లయింట్ల పవర్ ఆఫ్ అటార్నీలు (పీవోఏ) ఉపయోగించుకుని వారి ట్రేడ్స్‌ను సెటిల్ చేయడానికి వెసులుబాటు ఇవ్వాలన్న కార్వీ అభ్యర్థనను సెబీ తోసిపుచ్చింది. పీవోఏలను దుర్వినియోగం చేసి, క్లయింట్ల షేర్లను కంపెనీ అక్రమంగా దారి మళ్లించిందని ఆక్షేపించింది. ప్రాథమిక ఆధారాలన్నీ పరిగణనలోకి తీసుకుంటే.. ప్రస్తుత పరిస్థితుల్లో క్లయింట్ల పీవోఏలను కార్వీ ఉపయోగించడానికి అనుమతించడం వివేకవంతమైన నిర్ణయం కాబోదని సెబీ స్పష్టం చేసింది. కార్వీ ద్వారా షేర్లను విక్రయించాలనుకుంటున్న క్లయింట్లు.. ఇందుకోసం ఎలక్ట్రానిక్ లేదా ఫిజికల్ డెలివరీ ఇన్స్ట్రక్షన్ స్లిప్ (డీఐఎస్)ను తప్పనిసరిగా ఉపయోగించాలని సూచించింది. విక్రయించిన షేర్లను డీమ్యాట్ అకౌంట్ నుంచి డెబిట్ చేసేలా బ్రోకింగ్ సంస్థకు క్లయింట్లు సూచనలివ్వడానికి డీఐఎస్ ఉపయోగపడుతుంది. కార్వీపై ఎన్ఎస్ఈ చేపట్టిన ఫోరెన్సిక్ ఆడిట్ ఇంకా కొనసాగుతోందని, క్లయింట్ల షేర్లు.. నిధుల దుర్వినియోగం ఎంత మేర జరిగిందన్నది త్వరలోనే వెల్లడవుతుందని సెబీ వ్యాఖ్యానించింది. పీవోఏను ఉపయోగించుకోవడంపై స్పష్టతనివ్వాలన్న కార్వీ అభ్యర్థ్ధనపై డిసెంబర్ 2లోగా నిర్ణయం తీసుకోవాలంటూ సెబీకి శాట్ సూచించిన సంగతి తెలిసిందే. ఇన్వెస్టర్ల ఖాతాల్లోకి షేర్లు.. కార్వీ అక్రమంగా తన సొంత ఖాతాలోకి మళ్లించుకున్న షేర్లలో సుమారు 90 శాతం సెక్యూరిటీలు.. తిరిగి క్లయింట్ల ఖాతాల్లోకి చేరాయి. సెబీ తీసుకున్న సత్వర చర్యలతో సుమారు 83,000 మంది ఇన్వెస్టర్లకు తమ షేర్లు తిరిగి వచ్చాయని నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ (ఎన్ఎస్డీఎల్) వెల్లడించింది. ‘సెబీ ఆదేశాల మేరకు, ఎన్ఎస్ఈ పర్యవేక్షణలో కార్వీ స్టాక్ బ్రోకింగ్ డీమ్యాట్ ఖాతా నుంచి సుమారు 82,599 మంది క్లయింట్ల డీమ్యాట్ ఖాతాల్లోకి షేర్లను బదలాయించడం జరిగింది‘ అని పేర్కొంది. బాకీలు సెటిల్ చేసిన తర్వాత మిగతా వారి ఖాతాల్లోకి కూడా షేర్ల బదలాయింపు పూర్తవుతుందని ఎన్ఎస్డీఎల్ వివరించింది. -
కార్వీకి మరో షాక్
సాక్షి, ముంబై: కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థకు షాక్ మీదషాక్‌లు తగులుతున్నాయి. రెగ్యులేటరీ నిబంధనలను పాటించలేదనే ఆరోపణలతో స్టాక్ ఎక్స్ఛేంజీలు బీఎస్ఈ, ఎన్ఎస్ఇ కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ ట్రేడింగ్ లైసెన్స్‌ను సస్పెండ్ చేసాయి. ఈ మేరకు రెగ్యులేటరీ సంస్థలు నేడు (డిసెంబరు 2, సోమవారం) ఒక ప్రకటన విడుదల చేసాయి. గతవారం కార్వీ సంస్థపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తాజాగా ట్రేడింగ్ లైసెన్స్‌ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. రెండు వేల కోట్ల కుంభకోణానికి పాల్పడినట్టుగా అనుమానిస్తున్న కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ లైసెన్స్‌ను బీఎస్ఈ, మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజీ, ఎంఎస్ఈఐలు కూడా రద్దు చేశాయి. అన్ని విభాగాలకు ఈ నిర్ణయం వర్తిస్తుందని స్టాక్ ఎక్స్ఛేంజీలు తెలిపాయి. సెబీ విధించిన పలు మార్గదర్శకాలను పాటించని కారణంగా ఈ నిర్ణయం తీసుకొన్నట్లు ఎన్ఎస్ఈ ప్రకటించింది. ఖాతాదారుల సెక్యూరిటీలను దుర్వినియోగం చేసినట్లు, ఇతర అవసరాలకు వినియోగించినట్లు గుర్తించడంతో గత నెల 22న సెబీ చర్యలు తీసుకుంది. అలాగే కొత్త ఖాతాదారులను తీసుకోకుండా సెబీ ఆంక్షలు విధించింది. అంతేకాదు.. ప్రస్తుతం ఉన్న ఖాతాదాలకు సంబంధించిన పవర్ ఆఫ్ ఆటార్నీపై కూడా ఆంక్షలు విధించింది. దీంతోపాటు కార్వీ స్టాక్ బ్రోకింగ్‌పై ఎక్స్ఛేంజీలు క్రమ శిక్షణా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. -
వేల కోట్ల కుంభకోణం : కార్వీకి సెబీ షాక్!
న్యూఢిల్లీ: ఓ క్లయింటుకు సంబంధించిన రూ. 2,000 కోట్ల విలువ చేసే సెక్యూరిటీస్‌ను దుర్వినియోగం చేసిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్వీ స్టాక్ బ్రోకింగ్ (కేఎస్‌బీఎల్)పై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆంక్షలు విధించింది. స్టాక్ బ్రోకింగ్ కార్యకలాపాల కోసం కొత్తగా క్లయింట్లను తీసుకోకుండా నిషేధించింది. అలాగే, క్లయింట్ల పవర్ ఆఫ్ అటార్నీల ఆధారంగా కేఎస్‌బీఎల్ ఎలాంటి సూచనలు ఇచ్చినా.. పరిగణనలోకి తీసుకోరాదంటూ ఎన్ఎస్డీఎల్, సీడీఎస్‌ఎల్‌ను ఆదేశించింది. క్లయింట్ సెక్యూరిటీల విషయంలో కేఎస్‌బీఎల్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిందంటూ ఎన్ఎస్ఈ సమర్పించిన ప్రాథమిక నివేదిక ఆధారంగా సెబీ ఈ నిర్ణయం తీసుకుంది. క్లయింట్ల షేర్లు మరింతగా దుర్వినియోగం కాకుండా నియంత్రణ సంస్థ తక్షణం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందంటూ 12 పేజీల ఎక్స్‌పార్టీ మధ్యంతర ఉత్తర్వుల్లో సెబీ హోల్ టైమ్ మెంబర్ అనంత బారువా వ్యాఖ్యానించారు. క్లయింట్ల నిధులు, సెక్యూరిటీలను దుర్వినియోగం చేసినందుకు గాను డిపాజిటరీలు, స్టాక్ ఎక్సే్చంజీలు తగు క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని సెబీ సూచించింది. అభ్యంతరాలేమైనా ఉన్న పక్షంలో 21 రోజుల్లోగా తెలియజేయాలంటూ కేఎస్‌బీఎల్‌కు సమయమిచ్చింది. -
కార్వీ ట్రేడింగ్‌లో 40 శాతం యాప్‌తోనే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫైనాన్షియల్ బ్రోకరేజ్ కంపెనీ కార్వీ స్టాక్ బ్రోకింగ్ మొత్తం ఆదాయంలో కార్వీ ఆన్లైన్ ట్రేడ్ మొబైల్ యాప్ వాటా 40 శాతం వరకూ ఉంటుందని కంపెనీ సీఈఓ రాజీవ్ సింగ్ చెప్పారు. 2017–18 ఆర్ధిక సంవత్సరంలో 34 శాతం ఆదాయ వృద్ధిని సాధించామని.. అయితే ఈ సారి కాస్త తగ్గి 22 శాతానికి పరిమితం కావచ్చని చెప్పారాయన. శుక్రవారమిక్కడ ‘ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటర్జీ రిపోర్ట్’ను విడుదల చేస్తూ ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘ఇన్వెస్టర్ల ప్రొఫైల్ మారింది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచి కూడా పెట్టుబడులు పెడుతున్నారు. గత రెండేళ్లుగా ఆన్లైన్, యాప్ ఆధారిత ఇన్వెస్ట్మెంట్స్ పెరిగాయి. ఇందులో యువతరమే కీలకం. మొత్తం ఇన్వెస్ట్‌మెంట్స్‌లో 40 శాతం ఆన్లైన్ మీడియం ద్వారా జరుగుతున్నదే. అందుకే రెండేళ్ల క్రితమే ట్రేడింగ్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాం. యాప్ ఆధారిత ఇన్వెస్ట్మెంట్లకు తక్కువ ధర ఉండటమే కాకుండా లావాదేవీల్లో పారదర్శకత, సౌలభ్యంగా కూడా ఉంటుంది’’ అని ఆయన వివరించారు. కార్వీకి 10 లక్షల మంది కస్టమర్లు.. ‘‘ప్రస్తుతం దేశంలో కార్వీకి 60 కార్యాలయాలున్నాయి. త్వరలోనే కొత్తగా తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ ఆఫీసులను ప్రారంభించనున్నాం. ఐటీ, ఫార్మా, ఆటో, మెటల్ అన్ని రంగాల్లో కలిపి మాకు 10 లక్షల మంది కస్టమర్లున్నారు. ఇక నుంచి కార్వీ పెట్టుబడులు ఎక్కువగా టెక్నాలజీ, రీసెర్చ్ అండ్ అడ్వైజరీ రంగాల మీద ఉంటాయి. ఇదే మా కస్టమర్లకు ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. ప్రస్తుతం కార్వీలో 800 మంది ఈక్విటీ అడ్వైజర్స్ ఉన్నారు. 2019–20 నాటికి వెయ్యికి చేరుస్తాం. గతంలో సంస్థాగత పెట్టుబడిదారుల కోసం రీసెర్చ్ బృందం ముంబై కేంద్రంగా పనిచేసేది. కానీ, ఇప్పుడు హైదరాబాద్‌లోనూ సొంత పరిశోధన బృందం ఉంది. 2017–18లో 20 మందితో మొదలైన రీసెర్చ్ టీమ్‌లో ప్రస్తుతం 55 మంది ఉన్నారు. 2019–20 నాటికి 70 మందికి చేర్చుతాం’’ అని రాజీవ్ తెలిపారు. అయితే నిఫ్టీ 14 వేలు.. లేకపోతే 9 వేలకు! 2019 క్యాలెండర్ ఇయర్‌ను రెండు సమాన అర్ధ భాగాలు చేస్తే.. మొదటి ఆరు నెలల్లో కేంద్రం, రాష్ట్రాల్లో ఎన్నికల కారణంగా మార్కెట్లపై ప్రభావం ఉంటుందని, రెండో అర్థ భాగంలో ఒకవేళ కేంద్రంలో మళ్లీ స్థిరమైన ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. నిఫ్టీ 14,000 పాయింట్లను దాటుతుందని.. ఒకవేళ రానిపక్షంలో 9,000 పాయింట్లకు పడిపోతుందని కార్వీ విడుదల చేసిన ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటర్జీ రిపోర్ట్ తెలిపింది. ‘‘మళ్లీ కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం వస్తే భౌతిక సంస్కరణలుంటాయి. వ్యవసాయ, కార్మిక, స్థల లావాదేవీల్లో పన్ను సంస్కరణలుంటాయి. దీంతో స్థిరమైన ఆర్ధిక ప్రగతి చేకూరుతుంది. ఇది సంస్థాగత, వ్యక్తిగత ఇన్వెస్టర్లను మార్కెట్ వైపు దృష్టి మళ్లించేలా చేస్తుందని’’ రాజీవ్ సింగ్ చెప్పారు. 2019లోనూ ఆటో రివర్స్ గేరే: 2019లోనూ ఆటో పరిశ్రమ తిరోగమనంలోనే పయనించే సూచనలు కనిపిస్తున్నాయని.. అయితే ఈ రంగంలో కంపెనీలు టెక్నాలజీ వృద్ధి, విస్తరణలపై దృష్టిపెట్టే అవకాశముందని తెలిపారు. 2018 మార్చిలో 11.5 శాతంగా ఉన్న బ్యాంక్‌ల నిరర్ధక మూలధన ఆస్తులు (ఎన్పీఏ)లు.. 2018 సెప్టెంబర్ నాటికి 10.8 శాతానికి తగ్గాయి. 2019 మార్చి నాటికి ఇవి 10.3 శాతం వరకు తగ్గొచ్చని ఇది ఆర్ధిక వ్యవస్థకు, మార్కెట్‌కు ఎంతగానో ఉపయుక్తమని తెలియజేశారు. ప్రత్యేకించి ప్రభుత్వ రంగ బ్యాంక్ షేర్లు బెటరని సూచించారు. క్యాపిటల్ గూడ్స్ సెక్టార్, ఐటీ, ఫార్మా రంగాలు కూడా మంచి ఎంపికేనన్నారు. అధిక వడ్డీ రేట్లతో అమెరికా, ఆయిల్ ధరలతో ఇరాన్, మందగమనంలో చైనా మార్కెట్లు విలవిల్లాడుతున్నాయని.. ప్రస్తుతం ఇండియా, బ్రెజిల్ సురక్షిత పెట్టుబడుల మార్కెట్స్ అని చెప్పారు. -
కార్వీపై ఏడాది నిషేధం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్వీ స్టాక్ బ్రోకింగ్‌ను ఐపీవో స్కాం వీడటం లేదు. ఏడాది పాటు కొత్తగా ఎటువంటి ఐపీవోలు చేపట్టకుండా కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ (కేఎస్‌బీఎల్)పై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆంక్షలు విధించింది. 2003-05లో జరిగిన ఐపీవో స్కాం కేసుకు సంబంధించి సెబీ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం సోమవారం నుంచి ఏడాది పాటు ఐపీవోలకు సంబంధించిన ప్రత్యక్ష, పరోక్ష కార్యకలాపాల నుంచి కేఎస్బీఎల్ని నిషేధించింది. కానీ ఈ తీర్పు వెలువడేలోగా తీసుకున్న ఐపీవోలను చేపట్టవచ్చని సెబీ స్పష్టం చేసింది. ఈ ఐపీవో స్కాంకు సంబంధించి మార్చి, 2014లో సెబీ కేఎస్‌బీఎల్‌ను ఆరు నెలల పాటు నిషేధిస్తూ ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. దీన్ని సవాలు చేస్తూ కార్వీ సెక్యూరిటీస్ అప్పలెట్ ట్రిబ్యునల్‌ను (శాట్)ను ఆశ్రయించగా ఈ కేసులో కార్వీ వాదనలతో పాటు, అహ్మదాబాద్ భారత్ ఓవర్సీస్ బ్రాంచ్ మేనేజర్ని విచారించి నాలుగు నెలల్లోగా తుది ఉత్తర్వులను జారీ చేయాలని ఆదేశించింది. విచారణ అనంతరం ఏడాది పాటు కొత్త ఐపీవోలను చేపట్టరాదని సెబీ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. -
కొత్త గరిష్టాల నుంచి నష్టాల్లోకి
సెన్సెక్స్ 145 పాయింట్లు డౌన్ ► 26,127 వద్ద ముగింపు ► 8 రోజుల వరుస లాభాలకు బ్రేక్ వారాంతం రోజున కూడా ఇటీవల అలవాటైన బాటలో మార్కెట్లు లాభాలతో మొదలయ్యాయి. ప్రారంభంలోనే ప్రధాన ఇండెక్స్‌లు కొత్త గరిష్టాలను తాకాయి. సెన్సెక్స్ 26,300కు, నిఫ్టీ 7,841కు చేరాయి. ఇవి సరికొత్త రికార్డులుకాగా, ఆపై అమ్మకాల ఒత్తిడిలో పడ్డాయి. రోజు మొత్తం ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యత ఇవ్వడంతో ఒక దశలో సెన్సెక్స్ 26,007 వద్ద కనిష్ట స్థాయిని తాకింది. చివరికి 145 పాయింట్ల నష్టంతో 26,127 వద్ద ముగిసింది. ఇదే విధంగా కదలిన నిఫ్టీ సైతం 40 పాయింట్లు క్షీణతతో 7,790 వద్ద స్థిరపడింది. వెరసి 8 రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. ఈ కాలంలో సెన్సెక్స్ 1,265 పాయింట్లు లాభపడ్డ సంగతి తెలిసిందే. టాటా మోటార్స్ 5% డౌన్: ప్రధానంగా రియల్టీ, మెటల్, పవర్, ఆయిల్, బ్యాంకింగ్ రంగాలు 3-1.5% మధ్య తిరోగమించగా, ెహ ల్త్‌కేర్ 2% ఎగసింది. హెల్త్‌కేర్ షేర్లలో వొకార్డ్ 14% జంప్‌చేయగా, గ్లెన్‌మార్క్, సన్ ఫార్మా, ర్యాన్‌బాక్సీ, లుపిన్, క్యాడిలా హెల్త్ 7-2% మధ్య పుంజుకున్నాయి. కార్వీ స్టాక్‌బ్రోకింగ్‌కు ఊరట హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్వీ స్టాక్‌బ్రోకింగ్‌పై ఐపీవో స్కాంలో సెబీ విధించిన ఆరు నెలల నిషేధంపై అప్పిలేట్ ట్రిబ్యునల్ స్టేను పొడిగించింది. ట్రిబ్యునల్ తుది నిర్ణయం తీసుకునే వరకు ఈ స్టే కొనసాగుతుంది. అంతకుముందు 2003-2005 ఐపీవోలో జరిగిన అవకతవకలను సెబీ నిర్థారిస్తూ ఆరు నెలల పాటు కొత్త పథకాలను, కొత్త కార్యక్రమాలను చేపట్టకూడదని తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. -
2005 ఐపీవో అవకతవకల్లో కార్వీ పాత్ర: సెబీ
ముంబై: తొమ్మిదేళ్ల క్రితం జరిగిన ఐపీవో కుంభకోణంలో కార్వీ స్టాక్ బ్రోకింగ్ డిపాజిటరీకు సైతం పాత్ర ఉన్నట్లు నియంత్రణ సంస్థ సెబీ నిర్థారించింది. 2005లో వెలువడ్డ కొన్ని పబ్లిక్ ఇష్యూలకు సంబంధించి అవకతవకలు జరిగినట్లు సెబీ గతంలోనే బయటపెట్టింది. దీనిలో భాగంగా గతంలోనే కార్వీను 18 నెలల 26 రోజులపాటు నిషేధించింది కూడా. దీంతో ప్రస్తుతం ఎలాంటి జరిమానాలూ విధించడంలేదని సెబీ తెలిపింది. కాగా, కార్వీ స్టాక్ బ్రోకింగ్ సైతం తమ డిపాజిటరీ కార్యకలాపాలపై ఎలాంటి ఆంక్షలు లేవని మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. కంపెనీ కార్యకలాపాలు యథాతథంగా నడుస్తున్నట్లు తెలిపింది. భవిష్యత్‌లో ఇలాంటి సమస్యలు ఉత్పన్నంకాకుండా తమ వ్యవస్థను, కార్యకలాపాల విధానాలను ఆధునీకరించినట్లు వివరించింది.