న్యూఢిల్లీ: క్లయింట్ల నిధులను దుర్వినియోగం చేసిన కేసులో కార్వీ స్టాక్ బ్రోకింగ్ (కేఎస్‌బీఎల్), దాని ప్రమోటర్ కొమండూర్ పార్థసారథి ఏడేళ్ల పాటు సెక్యూరిటీస్ మార్కెట్‌లో లావాదేవీలు జరపకుండా సెబీ నిషేధించింది. కేఎస్‌బీఎల్‌కు రూ. 13 కోట్లు, పార్థసారథికి రూ. 8 కోట్లు జరిమానా కూడా విధించింది. అలాగే పార్థసారథి ఏ లిస్టెడ్ కంపెనీలోనూ కీలక మేనేజర్ హోదాల్లో పని చేయకుండా పదేళ్ల పాటు నిషేధించింది. కేఎస్‌బీఎల్‌కు చెందిన మరో ఇద్దరు డైరెక్టర్లయిన భగవాన్ దాస్ నారంగ్, జ్యోతి ప్రసాద్‌లకు ఇది రెండేళ్ల పాటు వర్తిస్తుంది.
అటు కేఎస్‌బీఎల్ నుంచి తీసుకున్న రూ. 1,443 కోట్ల మొత్తాన్ని మూడు నెలల్లోగా వాపసు చేయాలంటూ కార్వీ రియల్టీ, కార్వీ క్యాపిటల్‌ను సెబీ ఆదేశించింది. లేని పక్షంలో ఆ మొత్తాన్ని రాబట్టేందుకు రెండు సంస్థల ఆస్తులను ఎన్‌ఎస్‌ఈ తన అధీనంలోకి తీసుకుంటుందని సెబీ స్పష్టం చేసింది. క్లయింట్లు ఇచ్చిన పవర్ ఆఫ్ అటార్నీలను దుర్వినియోగం చేసి వారి షేర్లను తనఖా పెట్టి, కార్వీ సొంత అవసరాల కోసం నిధులను సమీకరించిందని ఆరోపణలు ఉన్నాయి.
కేఐఎస్‌ఎల్‌పై ఆంక్షలు: నిబంధనల ఉల్లంఘన కేసులో కొత్త క్లయింట్లను చేర్చుకోకుండా కార్వీ ఇన్వెస్టర్ సర్వీసెస్ (కేఐఎస్‌ఎల్)పై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిషేధం విధించింది. ఇది తక్షణం అమల్లోకి వస్తుందని, తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు వర్తిస్తుందని పేర్కొంది.
2021–22 మధ్య కాలంలో డెట్ సెక్యూరిటీల పబ్లిక్ ఇష్యూలకు సంబంధించి కంపెనీ పలు నిబధనలను ఉల్లంఘించినట్లు సెబీ విచారణలో తేలింది. మర్చంట్ బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వహించేందుకు ఉద్యోగులు గానీ, భౌతిక మౌలిక సదుపాయాలు గానీ కేఐఎస్‌ఎల్‌కు లేవని కూడా వెల్లడైంది. పైగా 2022 డిసెంబర్ నుంచి 2025 డిసెంబర్ వరకూ చెల్లుబాటయ్యేలా రెన్యువల్ ఫీజును కూడా కంపెనీ కట్టలేదని 13 పేజీల ఎక్స్‌పార్టీ మధ్యంతర ఉత్తర్వుల్లో సెబీ పేర్కొంది. ఇలాంటి సంస్థల కార్యకలాపాల వల్ల సెక్యూరిటీల మార్కెట్ సమగ్రత, ఇన్వెస్టర్ల ప్రయోజనాలు
దెబ్బతింటాయని వ్యాఖ్యానించింది.
Comments
Please login to add a commentAdd a comment