funds misuse
-
ఏసీబీ దర్యాప్తు.. సీడీపీవో ఆఫీసర్ శ్రీదేవి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: నిధుల దుర్వినియోగం వ్యవహారంలో.. సిటీ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు అధికారిణి అనిశెట్టి శ్రీదేవిని ఏసీబీ అరెస్టు చేసింది. కరీంనగర్ కోర్టులో ఆమెను హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా జైనూర్‌లో గతంలో సీడీపీవోగా పనిచేసిన సమయంలో శ్రీదేవి నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు గుర్తించామన్నారు. 322 అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి దాదాపు రూ.65.78 లక్షల నగదును దారి మళ్లించినట్లు గుర్తించారు. ఆరోగ్యలక్ష్మి పాల సరఫరా ఖర్చులపై నకిలీ ఇండెంట్లను సృష్టించి నగదు కాజేసినట్లు దర్యాప్తులో తేల్చారు. -
సుభాష్ చంద్ర, పునీత్‌లకు సెబీ షాక్
న్యూఢిల్లీ: ఏ లిస్టెడ్ కంపెనీలోనూ కీలక యాజమాన్య పదవులు లేదా డైరెక్టర్లుగా బాధ్యతలు చేపట్టకుండా ఎస్సెల్ గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్రతోపాటు ఎండీ, సీఈవో పునీత్ గోయెంకాను క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిషేధించింది. మీడియా దిగ్గజం జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్(జీల్)కు చెందిన నిధుల అక్రమ మళ్లింపు వ్యవహారంలో సెబీ తాజా ఆదేశాలు జారీ చేసింది. జీల్ చైర్మన్ చంద్ర, డైరెక్టరు గోయెంకా తమ హోదాలను అడ్డుపెట్టుకుని సొంత లబ్ది కోసం నిధులను అక్రమంగా తరలించిన కేసులో సెబీ తాజా చర్యలు చేపట్టింది. చంద్ర, గోయెంకా.. జీల్‌సహా ఎస్సెల్ గ్రూప్‌లోని ఇతర లిస్టెడ్ కంపెనీల ఆస్తులను.. సొంత నియంత్రణలోని సహచర సంస్థల కోసం అక్రమంగా వినియోగించినట్లు సెబీ పేర్కొంది. పక్కా ప్రణాళిక ప్రకారం నిధుల అక్రమ వినియోగాన్ని చేపట్టినట్లు తెలియజేసింది. కాగా.. జీల్ షేరు 2018–19లో నమోదైన రూ. 600 స్థాయి నుంచి 2022–23కల్లా రూ. 200కు దిగివచ్చినట్లు సెబీ ప్రస్తావించింది. ఈ కాలంలో కంపెనీ అత్యంత లాభదాయకంగా నడుస్తున్నప్పటికీ షేరు విలువ పడిపోయినట్లు పేర్కొంది. వెరసి కంపెనీలో ఏవో అక్రమాలు జరుగుతున్న విషయాన్ని ఇది ప్రతిఫలించినట్లు వ్యాఖ్యానించింది. ఇదే సమయంలో కంపెనీలో ప్రమోటర్ల వాటా 41.62 శాతం నుంచి 3.99 శాతానికి పడిపోయినట్లు వెల్లడించింది. ప్రమోటర్ల వాటా 4 శాతం దిగువకు చేరినప్పటికీ చంద్ర, గోయెంకా జీల్ వ్యవహారాలను చక్కబెడుతూనే ఉన్నట్లు తెలియజేసింది. -
కేఎస్‌బీఎల్, ప్రమోటర్లపై ఏడేళ్ల నిషేధం..
న్యూఢిల్లీ: క్లయింట్ల నిధులను దుర్వినియోగం చేసిన కేసులో కార్వీ స్టాక్ బ్రోకింగ్ (కేఎస్‌బీఎల్), దాని ప్రమోటర్ కొమండూర్ పార్థసారథి ఏడేళ్ల పాటు సెక్యూరిటీస్ మార్కెట్లో లావాదేవీలు జరపకుండా సెబీ నిషేధించింది. కేఎస్‌బీఎల్‌కు రూ. 13 కోట్లు, పార్థసారథికి రూ. 8 కోట్లు జరిమానా కూడా విధించింది. అలాగే పార్థసారథి ఏ లిస్టెడ్ కంపెనీలోనూ కీలక మేనేజర్ హోదాల్లో పని చేయకుండా పదేళ్ల పాటు నిషేధించింది. కేఎస్‌బీఎల్‌కు చెందిన మరో ఇద్దరు డైరెక్టర్లయిన భగవాన్ దాస్ నారంగ్, జ్యోతి ప్రసాద్‌లకు ఇది రెండేళ్ల పాటు వర్తిస్తుంది. అటు కేఎస్‌బీఎల్ నుంచి తీసుకున్న రూ. 1,443 కోట్ల మొత్తాన్ని మూడు నెలల్లోగా వాపసు చేయాలంటూ కార్వీ రియల్టీ, కార్వీ క్యాపిటల్‌ను సెబీ ఆదేశించింది. లేని పక్షంలో ఆ మొత్తాన్ని రాబట్టేందుకు రెండు సంస్థల ఆస్తులను ఎన్ఎస్ఈ తన అధీనంలోకి తీసుకుంటుందని సెబీ స్పష్టం చేసింది. క్లయింట్లు ఇచ్చిన పవర్ ఆఫ్ అటార్నీలను దుర్వినియోగం చేసి వారి షేర్లను తనఖా పెట్టి, కార్వీ సొంత అవసరాల కోసం నిధులను సమీకరించిందని ఆరోపణలు ఉన్నాయి. కేఐఎస్ఎల్పై ఆంక్షలు: నిబంధనల ఉల్లంఘన కేసులో కొత్త క్లయింట్లను చేర్చుకోకుండా కార్వీ ఇన్వెస్టర్ సర్వీసెస్ (కేఐఎస్‌ఎల్)పై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిషేధం విధించింది. ఇది తక్షణం అమల్లోకి వస్తుందని, తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు వర్తిస్తుందని పేర్కొంది. 2021–22 మధ్య కాలంలో డెట్ సెక్యూరిటీల పబ్లిక్ ఇష్యూలకు సంబంధించి కంపెనీ పలు నిబధనలను ఉల్లంఘించినట్లు సెబీ విచారణలో తేలింది. మర్చంట్ బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వహించేందుకు ఉద్యోగులు గానీ, భౌతిక మౌలిక సదుపాయాలు గానీ కేఐఎస్ఎల్కు లేవని కూడా వెల్లడైంది. పైగా 2022 డిసెంబర్ నుంచి 2025 డిసెంబర్ వరకూ చెల్లుబాటయ్యేలా రెన్యువల్ ఫీజును కూడా కంపెనీ కట్టలేదని 13 పేజీల ఎక్స్‌పార్టీ మధ్యంతర ఉత్తర్వుల్లో సెబీ పేర్కొంది. ఇలాంటి సంస్థల కార్యకలాపాల వల్ల సెక్యూరిటీల మార్కెట్ సమగ్రత, ఇన్వెస్టర్ల ప్రయోజనాలు దెబ్బతింటాయని వ్యాఖ్యానించింది. -
టూరిజం డే, అల్లూరి జయంతి.. ఛాన్స్ దొరికితే చాలు దోచేస్తున్నారు
సాక్షి, విశాఖపట్నం: కోవిడ్ పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పర్యాటక శాఖ ఖజానాను ఖాళీ చేసే పనిలో టూరిజం రీజనల్ డైరెక్టర్ కార్యాలయం నిమగ్నమైపోయింది. దొరికిందే తడవుగా.. ఏ చిన్న అవకాశం దొరికినా తమదైన శైలిలో దోపిడీకి తెరతీస్తున్నారు. టూరిజం సీఈవో నోటమాట పేరుతో నిధుల్ని తమ ఖాతాల్లోకి పంపించేసుకుంటున్నారు. టూరిజం డే.. అల్లూరి జయంతి.. కాదేదీ కాసుల వర్షానికి అనర్హం అన్న రీతిలో కలెక్టర్‌కు పంపించకుండానే బిల్లులతో ఖజానాకు చిల్లులు పెడుతున్నారు. 2021 ఆగస్ట్ 27న వీఎంఆర్డీఏ చిల్డ్రన్ థియేటర్లో పర్యాటక దినోత్సవం నిర్వహించారు. వరల్డ్ టూరిజం డేకు గతంలో రూ.2 లక్షలు నుంచి రూ.5 లక్షల వరకూ ఖర్చు చేసేవారు. ప్రభుత్వం కూడా రూ.5 లక్షలు ఖర్చు చేయాలని స్పష్టం చేసింది. గతంలో ఘనంగా నిర్వహించేవారు. ఈసారి కోవిడ్ కారణంగా ఇన్‌డోర్‌లోనే చేపట్టారు. కానీ.. ఏకంగా రూ.8 లక్షల వరకూ బిల్లులు పెట్టారు. కొందరు కళాకారులకు రూ.19 వేలు ఇచ్చి.. రూ.40 వేలు డ్రా చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నృత్య కళాకారులకు రూ.30 వేలు ఇచ్చి.. రూ.40 వేలు బిల్లు వేశారనీ.. మిగిలిన వారికీ అదేరీతిలో గోరంత ఇచ్చి.. కొండంత బిల్లు లాగేసుకున్నారనే విమర్శలొస్తున్నాయి. అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవానికి గతేడాది రూ.1.20 లక్షలు ఖర్చు చేయగా.. ఈసారి మాత్రం రూ.2.75 లక్షలు చేశారు. గతేడాది చేసిన మాదిరిగానే ఈసారీ నిర్వహించారు. కానీ.. ఒకే ఒక్క తేడా.. వర్షం పడుతుందని వాటర్ ప్రూఫ్ టెంట్ వేశారు. దానికే అదనంగా లాగేశారని కొందరు టూరిజం సిబ్బందే ఆరోపిస్తున్నారు. ఇలా అవకాశం దొరికిన ప్రతిసారీ.. టూరిజం ఖజానా ఖాళీ చేసేందుకు టూరిజం ప్రాంతీయ కార్యాలయ సిబ్బంది రెడీగా ఉంటున్నారని పర్యాటక శాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి. నోటిమాట చాలంట! ప్రతి జిల్లా పర్యాటక శాఖకు సంబంధించి డిస్ట్రిక్ట్ టూరిజం కౌన్సిల్ అకౌంట్ ఉంటుంది. దీనిని ప్రతి జిల్లాలోనూ జిల్లా పర్యాటక అధికారి పర్యవేక్షణలో ఉంటుంది. కానీ విశాఖ జిల్లాలో మాత్రం రెండేళ్ల క్రితం నుంచి వేరే అధికారి పర్యవేక్షణలో ఉంది. రీజనల్ డైరెక్టర్ కార్యాలయంలోని సిబ్బంది ఇటీవల కొన్ని పనులకు సంబంధించి టూరిజం సీఈవో (నోటిమాట) ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ పేరుతో ఇటీవలే రూ. 1.50 లక్షలు వివిధ పనులకు డ్రా చేసుకున్నట్లు సమాచారం. పర్యాటక శాఖకు సంబంధించిన ప్రతి ప్రధాన బిల్లుని జిల్లా కలెక్టర్‌కు పంపించాల్సి ఉంటుంది. కానీ ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ పేరుతో ఫైల్ని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పంపించకుండానే నడిపించినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై టూరిజం సీఈవో సత్యనారాయణని ప్రశ్నించగా.. ఈ బిల్లు విషయం తన దృష్టికి వచ్చిందనీ.. దీనిపై వివరణ కోరినట్లు తెలిపారు. -
గప్ చుప్‌గా ఈఎస్ఐ నిధులను సర్దేశారు
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్లో కేటాయించిన నిధులు ఆయా శాఖలకు పూర్తిస్థాయిలో రాకపోవడం సాధారణంగా జరిగేదే. అత్యంత ప్రాధాన్యరంగాలుగా ప్రభుత్వం గుర్తించిన వాటికి లేదా ఏదైనా అత్యవసర పరిస్థితులు తలెత్తితే కేటాయింపుల కంటే ఎక్కువ నిధులివ్వడం జరుగుతుంది. అయితే ఈఎస్ఐకి అదనంగా నిధులు రావడం, అవి పక్కదారి పట్టడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈఎస్ఐ విభాగానికి అదనపు నిధులు కావాలని కార్మికశాఖ ప్రభుత్వాన్ని కోరడం.. ప్రభుత్వం కూడా అడిగిందే తడవుగా నిధులు మంజూరు చేయడం వెనక ఎవరి హస్తం ఉందో తెలుసుకునే పనిలో పడ్డారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు. 2015 నుంచి 2019 వరకు ఈఎస్ఐకి రాష్ట్ర ప్రభుత్వం వాస్తవానికి రూ.1278.22 కోట్లు కేటాయించింది. కానీ ఈ నాలుగేళ్లలో మొత్తంగా రూ.1616.93 కోట్ల నిధులు మంజూరు చేసింది. అంటే బడ్జెట్ కేటాయింపుల కంటే అదనంగా రూ.338.71 కోట్లు విడుదల చేసిందని ఈఎస్ఐ సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఇంత పెద్ద మొత్తం అదనంగా ఎందుకు చెల్లించాల్సి వచ్చింది? ఎవరి ఒత్తిళ్లు పనిచేశాయనే సందేహాలు, మంత్రి కార్యాలయ సిబ్బంది పాత్రపై అనుమానాలు ఇదివరకే వ్యక్తమయ్యాయి. గతంలో కార్మికశాఖ మంత్రికి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన ముకుందరెడ్డి, ఆ మాజీ మంత్రి అల్లుడు శ్రీనివాసరెడ్డి ఇళ్లలో ఈడీ సోదాలు చేయడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. బిల్లులు ఇవ్వకుండా సతాయించి... వాస్తవానికి ఈఎస్ఐకి చెంది ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) కార్మికుల కోసం ఏటా మందులు కొనుగోలు చేస్తుంది. నిబంధనల ప్రకారం.. ప్రొక్యూర్మెంట్ కమిటీ ముందు ఆసుపత్రికి ఎన్ని మందులు కావాలి? ఏయే మందులు, పరికరాలు కావాలి? అన్న విషయాలపై నివేదిక ఇస్తుంది. దాని ప్రకారం.. ఆర్సీ (రేటెడ్ కంపెనీలు) కంపెనీల నుంచి బహిరంగ టెండర్లు ఆహ్వనించాలి. వచ్చిన టెండర్లలో మార్కెట్ రేటు కంటే తక్కువకు ఎవరు కోట్ చేస్తే వారికి టెండర్ అప్పగించాలి. కానీ, ఐఎంఎస్ అధికారులు ఈ ప్రక్రియను పాటించలేదు. ఐఎంఎస్ మాజీ డైరెక్టర్ దేవికారాణి, మాజీ డిప్యూటీ డైరెక్టర్ పద్మలు సరఫరా అయిన మందుల్లో 30 శాతం ఆర్సీ కంపెనీల నుంచి, మిగిలిన 70 శాతం ఎన్ఆర్సీ (నాన్ రేటెడ్ కంపెనీ)ల నుంచి తీసుకోవడం గమనార్హం. వాస్తవానికి ఆర్సీ కంపెనీల నుంచి సింహభాగం మందులు కొనుగోలు చేయాలి. కానీ, ఉద్దేశపూర్వకంగా ఆర్సీ కంపెనీలకు బిల్లులు చెల్లించేవారు కాదని, దీంతో సదరు కంపెనీలు మందుల సరఫరా నిలిపివేయగానే.. ఆ సాకుతో ఎన్ఆర్సీ కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చారని ఈఎస్ఐ సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఎన్ఆర్సీకి ఎప్పుడు వెళ్లాలి? జీవో నెం 51 ప్రకారం.. అత్యవసర పరిస్థితుల్లో, ఆర్సీ కంపెనీలు సరఫరా చేయలేని మందుల కోసం మాత్రమే ఎన్ఆర్సీ కంపెనీలకు మందుల సరఫరా కాంట్రాక్టు ఇవ్వాలి. దానికి సైతం ప్రొక్యూర్ కమిటీ నివేదిక, బహిరంగ టెండర్లు, కంపెనీల ఎంపిక నిబంధనలు తప్పకుండా పాటించాలి. కానీ, ఐఎంఎస్‌లో ఇవేమీ జరగలేదు. టెండర్లు లేకుండా కాంట్రాక్టులు అప్పగించిన తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది. అసలు విషయం ఏంటంటే.. రేటెడ్ కంపెనీలు అధికారులకు ఎలాంటి ముడుపులు, కమీషన్లు ఇవ్వవు. అదే, ఎన్ఆర్సీ కంపెనీలైతే అడిగినంత ఇస్తాయి. అందుకు బదులుగా కాంట్రాక్టు దక్కించుకున్నవారు ధరలు పెంచుకునే వీలును గతంలో అధికారులు కల్పించారు. ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు ఇష్టానుసారంగా అప్పగించిన టెండర్లకు ప్రొక్యూర్ కమిటీని ఏర్పాటు చేయనేలేదని ఈఎస్ఐ కార్మికులు ఆరోపిస్తున్నారు. వారే డొల్ల కంపెనీలను సృష్టించి, తమకు అనుకూలంగా ఉండే కాంట్రాక్టర్లను ఎంపిక చేసుకుని కథ నడిపారని, అందుకే అదనపు నిధులు విడుదల అయినా కార్మికులకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని మండిపడుతున్నారు. అదృశ్య శక్తులపై ఈడీ ఆరా వాస్తవ బడ్జెట్ కంటే అధికంగా నిధులు ఎందుకు విడుదల చేయాల్సి వచ్చింది? ఏ పరిస్థితుల్లో ఆ ప్రతిపాదనలు చేయాల్సి వచ్చింది? అందుకు, ఐఎంఎస్ అధికారులు ఏం కారణం చూపారు? ఆ ప్రతిపాదనలను ఉన్నతాధికారులు ఏ పరిస్థితుల్లో ఆమోదించారు? దీని వెనక అదృశ్య రాజకీయశక్తులు ఏమైనా ఉన్నాయా? అని ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇందుకోసం ఐఎంఎస్ ఆడిట్ పుస్తకాలు, ప్రభుత్వానికి విజిలెన్స్ కమిటీ ఇచ్చిన నివేదిక తదితరాలపై ఈడీ అధ్యయనం చేస్తోంది. నాలుగేళ్లలో కేటాయింపుల కంటే రూ.338 కోట్లు అధికంగా తీసుకొని ఖర్చుపెట్టి ఏం సేవలు అదనంగా అందించారు? ఎక్కడ సేవలు మెరుగుపరిచారు? అన్న విషయాలపైనా ఈడీ తవ్వడం మొదలుపెడుతోంది. ( చదవండి: ఐఎంఎస్ స్కాంలో దర్యాప్తు ముమ్మరం ) -
నిధులున్నా.. నిష్ప్రయోజనం !
– ఎఫ్ఏఓ లేక ఎస్ఎస్ఏ ఉద్యోగులకు ఆగిన జీతభత్యాలు – రూ.6.06 కోట్ల బడ్జెట్ వచ్చినా జీతాలివ్వలేని పరిస్థితి – వేలాది మంది ఉద్యోగులు ఎదురుచూపులు అనంతపురం ఎడ్యుకేషన్ : ‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్న చందంగా ఉందని సర్వశిక్ష అభియాన్ ఉద్యోగల వ్యథ. ఇన్ని రోజులూ బడ్జెట్ లేక జీతాలు ఇవ్వని సర్వశిక్ష అభియాన్ ఇప్పుడు నిధులున్నా...ఇవ్వలేని పరిస్థితి. జిల్లాకు సంబంధించి రూ.24 కోట్లు కావాలంటూ నివేదికలు రాష్ట్రానికి పంపారు. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం రూ.6.6 కోట్లు కేటాయించారు. రెండు రోజుల క్రితం ఖాతాలోనూ జమ చేశారు. కానీ ఈ డబ్బులో నుంచి ఒక్క రూపాయి కూడా వాడుకోలేని పరిస్థితి. సర్వశిక్ష అభియాన్ కార్యాలయంలో పని చేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులకు ఫైనాన్స్ అకౌంట్స్ ఆఫీసర్ (ఎఫ్ఏఓ) లేకపోవడంతో జూన్ నెల జీతం ఇప్పటిదాకా రాలేదు. దీంతో కాంట్రాక్ట్ ఉద్యోగుల పరిస్థితి వర్ణణాతీతం. సర్వశిక్ష అభియాన్‌లో 63 మంది ఎంఐఎస్ కో ఆర్డినేటర్లు, 63 మంది కంప్యూటర్ ఆపరేటర్లు, 357 మంది సీఆర్పీలు, 63 మంది మెసెంజర్లు, 378 మంది పార్ట్‌టైం ఇన్స్ట్రక్టర్లు, 126 మంది ఐఈఆర్టీలు, 12 మంది డీఎల్ఎంటీలు, 756 మంది కేజీబీవీల సిబ్బంది పని చేస్తున్నారు. వీరిలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా కేజీబీవీల్లో పని చేస్తున్న ఎస్ఓలు, సీఆర్టీలు, నాన్‌టీచింగ్ ఉద్యోగులకు ఐదు నెలలుగా జీతాలు రాలేదు. ఫిబ్రవరి నుంచి బకాయిలున్నాయి. అలాగే ఎమ్మార్సీ ఉద్యోగులకు మార్చి నెల నుంచి అంటే నాలుగు నెలలుగా జీతాలు రాలేదు. చాలామంది ఉద్యోగులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారంగా మారిన కుటుంబ పోషణ : గతంలో నెలనెలా క్రమం తప్పకుండా జీతాలు మంజూరు చేసేవారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరీ అధ్వానంగా నెలల తరబడి పెండింగ్ పెడుతున్నారు. వస్తున్న జీతాలు అంతంత మాత్రమేనని అవికూడా సరిగా ఇవ్వకపోతే ఎలా అని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో నిత్యం తిరగాల్సి ఉంటుందని, నెలంతా పని చేసి జీతాల కోసం ఎదురు చూసే పరిస్థితి నెలకొంటోందంటున్నారు. కనీసం అప్పులు కూడా పుట్టడం లేదని కొందరు చెబుతుండగా, మరికొందరు అధికవడ్డీకి అప్పులు చేస్తున్నామంటూ వాపోతున్నారు. వీరి వేతనాలతో పాటు కార్ల అద్దె కూడా చెల్లించలేదని వాహన యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొసమెరుపు : ఇన్ని రోజులూ బడ్జెట్ లేక జీతాలు పెండింగ్ పెట్టారు. ప్రస్తుతం రూ. 6.06 కోట్లు బడ్జెట్ వచ్చింది. ఇందులో అందరీ ఉద్యోగులకు రెండు నెలల జీతాలు చెల్లించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. పీఓ–ఎఫ్ఏఓ ఇద్దరూ సంతకాలు పెడితేనే ప్రతి పైసా ఖర్చు చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఎఫ్ఏఓ పోస్టు ఖాళీగా ఉండటం కొసమెరుపు. బడ్జెట్ వచ్చింది : జీతాల కోసం రూ.6.06 కోట్లు బడ్జెట్ వచ్చింది. ఎఫ్ఏఓ పోస్టు ఖాళీగా ఉంది. ఈ విషయం ఎస్పీడీ అధికారులకు విన్నవించాం. వీలైనంత త్వరగా ఎఫ్‌ఏఓను నియమిస్తారు. ఎఫ్ఏఓ రాగానే కాంట్రాక్ట్ ఉద్యోగులకు రెన్నెళ్ల జీతాలు, రెగ్యులర్ ఉద్యోగులకు జూన్ నెల జీతాలు జమ చేస్తాం. - సుబ్రమణ్యం, పీఓ ఎస్ఎస్ఏ -
ఇష్టారాజ్యం
► అనుమతి ఒకచోట, పనులు చేసేది మరోచోట ► 14వ ఆర్థిక సంఘం నిధులు పక్కదారి ► నిద్రమత్తులో ఎస్ఈ, ఎంఈలు కడప నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యారా..? నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారా? అక్రమార్జనే ధ్యేయంగా రూల్స్‌ను అతిక్రమిస్తున్నారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఒక చోట మంజూరైన పనులను వేరే చోట చేయడం నిబంధనలకు విరుద్ధమని తెలిసినా అధికారులు సహకరించడమే ఇందుకు సాక్ష్యం. కడప కార్పొరేషన్: కేంద్ర ప్రభుత్వం గ్రాంటు రూపంలో విడుదల చేసే 14వ ఆర్థిక సంఘం నిధుల కింద చేపట్టే పనులకు కొన్ని నియమాలు, మార్గదర్శకాలు ఉంటాయి. వాటిని ఇంజినీరింగ్ అధికారులు ఉల్లంఘించడానికి వీల్లేదు. ఏవైనా పనులకు జనరల్ బాడీ ఆమోదంతో పాటు రీజినల్ స్థాయిలో ఇంజినీరింగ్ ఉన్నతాధికారులతో కూడిన కమిటీ కూడా అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కసారి అనుమతి లభిం చాక ఆ పనిని మరొక చోట చేస్తామంటే కుదరదు. ఆ పని పేరు మార్చి వేరొక చోటికి బదలాయించడం అనేది కేంద్రప్రభుత్వ గ్రాంట్ల విషయంలో చాలా క్లిష్టతరమైన ప్రక్రియ. నిబంధనలు తుంగలో తొక్కిన నగరపాలక ఇంజినీర్లు అలాంటి దాన్ని సులువుగా మార్చి పడేస్తున్నారు. కాలువ నిర్మాణం కోసమంటూ..: అక్కాయపల్లెలో సాయిబాబా స్కూల్ ఎదురుగా ఉన్నదంతా లోతట్టు ప్రాంతం. వర్షమొస్తే ఇక్కడ అనేక ఇళ్లు వాననీటిలో మునిగిపోతాయి. కల్వర్టు కూడా తక్కువ ఎత్తులో ఉండటం వల్ల వర్షపునీరు ప్రవహించేందుకు తీవ్ర ఆటంకం ఏర్పడుతూ ఉండేది. దీన్ని దృష్టిలో ఉంచుకొని 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.60లక్షలతో కాలువ నిర్మాణం చేపట్టడానికి అనుమతులు మంజూరయ్యాయి. కానీ నగర పాలక ఇంజినీరింగ్ అధికారులు మంజూ రైన చోట పనులు చేయకుండా వేరొకచోట మొదలుపెట్టారు. కాంట్రాక్టర్ తప్పు చేస్తుంటే సరిదిద్దాల్సిన ఎస్ఈ, ఎంఈ ఎలాంటి అభ్యంతరాలు తెలపకుండా ఆ పనిని వేరొకచోటికి బదలాయించి పనులు పూర్తి చేసేందుకు సహకరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూర్చేందుకే..: కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూర్చేందుకు కాగితాలపెంట నుంచి నబీకోట సర్కిల్ వరకూ బాగున్న డ్రైన్‌ను పగులగొట్టి ఆ స్థానంలో కొత్త డ్రైన్ కట్టినట్లు తెలుస్తోంది. పని పేరు మార్చకుండా పనులే మొదలుపెట్టడానికి వీల్లేదని నిబంధనలు చెబుతుంటే వీరేమో ఏకంగా ఆ పనులు కూడా పూర్తి చేసి బిల్లులు ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతుండడం గమనార్హం. కాగా గతంలో ఇలాంటి పరిస్థితి రాగా అభ్యంతరం వ్యక్తం చేసిన నగరపాలక ఇంజినీర్లు ఇక్కడేమో కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు సాయిబాబా స్కూల్ ప్రాంతంలోని ప్రజలు ఈ వ్యవహారంపై మండిపడుతున్నారు. వర్షం వస్తే తమగతేం కావాలని ప్రశ్నిస్తున్నారు. దీనిపై స్థానిక న్యాయవాది ఒకరు ఆర్టీ యాక్టు ప్రకారం సమాచారం కోరితే ఇంజినీరింగ్ అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. నోట్ రాసి అనుమతి తీసుకుంటాం- ఎంఈ: దీనిపై మున్సిపల్ ఇంజినీర్ చెన్నకేశవరెడ్డిని వివరణ కోరగా ఈ డ్రైన్ కూడా ప్రజలకోసమే కదా, ఇందులో నిధులు దుర్వినియోగం ఏముందని ప్రశ్నిం చారు. నేమ్ చేంజ్ చేయకుండానే పనులు చేయవచ్చా అని ప్రశ్నించగా నోట్ రాసి అనుమతి తీసుకుంటామని తాపీగా సమాధానమిచ్చారు. -
మేట్ల మేత
తప్పుడు మస్తర్లతో నిధుల స్వాహా పనిచేయని వారి పేర్ల నమోదు ఉపాధి వేతనదారుల గగ్గోలు బలిజిపేట రూరల్: ఉపాధి పథకంలో సీనియర్ మేట్ల చేతివాటం పెరిగింది. తప్పుడు మస్తర్లతో నిధుల స్వాహా జరుగుతోంది. ఉపాధి వేతనదారులకు మొండిచెయ్యి మిగులుతోంది. తప్పుడు మస్తర్లతో సీనియర్ మేట్లు నిధులు స్వాహా చేస్తున్నారు.. అని ఉపాధి వేతనదారులు ముదిలి జనార్థన, పద్మ, భాగ్యం, స్వామినాయుడు తదితరులు ఆరోపించారు. ఉపాధి పథకంలో అక్రమాలపై వారందించిన వివరాలివి. సీనియర్ మేట్లు జి.సూర్యనారాయణ, మజ్జి లక్ష్మణరావు ఫీల్డ్ అసిస్టెంట్‌తో కుమ్మక్కయి 2014–15 సంవత్సరం ఉపాధి నిధులు కాజేశారు. కష్టపడి పనిచేసిన వారికి లేకుండా వలస వెళ్లిన వారు, చదువుకున్నవారు, వద్ధుల పేర్లతో నిధులు కాజేశారు. దీనిపై ఉపాధి మామీ పథకం అధికారులకు వేతనదారులు ఫిర్యాదు చేశారు. – విశాఖ కేజీహెచ్‌లో ఉన్న కె.నారాయణరావు, తాపీ పనిచేస్తున్న ఎం.శ్రీనివాసరావు, ఎం.సుదర్శనరావు, టి.దాలయ్య తదితరులు కలిపి మొత్తం 70 మంది పేర్లు తప్పుగా నమోదు చేసి వేలాదిరూపాయలు స్వాహా చేశారు. దొంగ మస్తర్లతో కె.నారాయణరావు పేరున రూ.1,000, మజ్జి శీనుకు రూ.4వేలు, సుదర్శనరావుకు రూ.572, దాలయ్యకు రూ.1,700, టి.నరసమ్మ పేరున రూ.5,730 స్వాహా చేశారు. – 2015–16 సంవత్సరానికి చెందిన మురళీకష్ణ బందంలో పనిచేయని అలజంగి రామినాయుడు, అప్పలనరసమ్మల పేరున మస్టర్లు వేసి రూ.2,900 కాజేశారు. పనులకు వెళ్లని వారి పేర్లను నమోదు చేయడం, వచ్చిన డబ్బును చెరిసగం పంచుకోవడం చేస్తున్నారు. గ్రామంలో కష్టపడి పనిచేసిన వారికి బిల్లులు చెల్లించకపోవడంతో అవస్థలు పడుతున్నారు. తప్పుడు మస్తర్లు వేయడంతో ఆ గ్రూపుల్లో పనిచేసేవారికి తక్కువ వేతనం అందే అవకాశాలుండటం గమనార్హం. – 2014–15సంవత్సరంలో పెద్దింపేట పంచాయతీలో 78 గ్రూపులుండగా 602 జాబ్‌కార్డు హోల్డర్లున్నారు. వీరిలో 1,031మంది వేతనదారులు పనిచేశారు. 49 పనులకు రూ.199.57 లక్షలు మంజూరవగా రూ.40.48 లక్షలు ఖర్చయినట్టు, 2015–16 సంవత్సరంలో 131పనులకు రూ.308.45 లక్షలు మంజూరవగా రూ.69.67 లక్షలు ఖర్చయినట్టు లెక్కలు చూపుతున్నారు. న్యాయం చేయండి– జనార్దన్, పెద్దింపేట. వికలాంగ గ్రూపునకు చెందిన మాకు, లక్ష్మి పేరంటాలు గ్రూపులకు డబ్బులు రావలసి ఉంది. జూన్ నెలలో చేసిన ఫారం పాండ్ పనుల బిల్లు సుమారు రూ.25వేల వరకు రావలసి ఉంది. తప్పుడు మస్తర్లు వేసి అక్రమంగా నిధులు స్వాహా చేస్తున్నట్టు గుర్తించి ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించటం లేదు. కష్టపడి పనిచేసిన వేతనదారులకు అన్యాయం జరగకుండా చూడాలి. అక్రమాలు రుజువైతే చర్య– విజయలక్ష్మి, ఏపీవో, ఉపాధి హామీ పథకం తప్పుడు మస్తర్లపై ఫిర్యాదు అందింది. దర్యాప్తు చేసి అక్రమాలు జరిగినట్టు రుజువైతే చర్యలు తీసుకుంటాం. ఎలాంటి పొరపాట్లు చేయవద్దని మేట్లను హెచ్చరిస్తున్నాం. -
నిధులు ‘తొట్టెల’ పాలు
ఇందూరు: పశువుల కోసం ఏర్పాటు చేసిన నీటి తొట్టెల నిర్మాణాల్లో నాణ్యత లోపించింది. దీంతో నాలుగు కూడా గడవక ముందే కుప్పకూలుతున్నాయి. వేసవిలో పశువుల దాహార్తిని తీర్చడానికి ‘డ్వామా’ అధికారులు ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో నీటి తొట్టెలు నిర్మించారు. అయితే, వాటిలో నాణ్యతా లోపాలు బయటపడుతున్నాయి. అధికారులు, గుత్తేదారులు ములాఖత్ అయి నామమాత్రంగా నిర్మాణాలు చేపట్టి భారీగా దండుకున్నారే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఒకటి, రెండు కాదు.. ఏకంగా 2 వేల వరకు నిర్మించిన తొట్టెల నిర్మాణాల్లో భారీ అవినీతి చోటు చేసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. గతంలో నిర్మించిన తొట్టెలకు స్వల్ప మరమ్మతులు చేపడితే అవి వినియోగంలోకి వచ్చేవి, కానీ వాటిని వదిలేసి కొత్తవి నిర్మించారు. మరోవైపు, కొన్ని చోట్ల అవసరం లేకున్నా కట్టేశారు. దీంతో అవి నిరుపయోగంగా మారాయి. జిల్లాలో గత ఐదేళ్లలో వందల నీటి తొట్టేలను నిర్మించారు. అవన్నీ బాగానే ఉన్నా, వాటిని కాదని ఈ సంవత్సరం కొత్త నీటి తొట్టెల నిర్మాణాలు చేపట్టారు. పాతవి ఎందుకు నిరుపయోగంగా మారాయో తెలుసుకోకుండా, చిన్న మరమ్మతులు చేయిస్తే వినియోగంలోకి వస్తాయని తెలిసీ, మళ్లీ రూ.లక్షల నిధులతో కొత్త వాటిని నిర్మించారు. ఫలితంగా జిల్లాలో నిధుల దుబారా జరిగింది. పాత తొట్టెలు జిల్లాలో వెయ్యికిపైగా నిరూపయోగంగా ఉన్నాయి. ప్రయోజనం లేదే..! డ్వామా అధికారులు ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో 2010–11 నుంచి గతేడాది వరకు రూ.1.10 కోట్లతో 1500 పశువుల తొట్టెలను నిర్మించారు. ఇవే కాకుండా జిల్లా నీటి యాజమాన్య పథకం కింద కొన్ని ప్రాంతాల్లో పశువుల కోసం నీటి తొట్టెలు నిర్మాణాలు చేపట్టారు. గ్రామాల్లో పశువులు సంచరించే ప్రాంతాల్లో చేతి పంపులు, బావుల దగ్గర వీటిని నిర్మించారు. తద్వారా వృథా నీటిని తొట్టెల్లోకి మళ్లించడంతో పాటు అవసరముంటే ఎవరైనా నీళ్లు తోడి తొట్టెలను నింపుకోవచ్చనే ఆలోచనతో ఈ నిర్మాణాలు చేపట్టారు. కానీ ప్రస్తుతం వీటిలో సింహభాగం ఎక్కడ పశువుల దాహార్తిని తీర్చడం లేదు. పైగా నిర్మాణాల్లో సాంకేతిక, నాణ్యతా లోపాల కారణంగా వీటిలో నీళ్లు నిల్వ చేయలేని పరిస్థితి నెలకొంది. మరమ్మత్తులతో సరిపోయేది.. నీటి తొట్టెలు నిరుపయోగంగా మారడానికి చిన్న చిన్న కారణాలున్నాయి. ఒకచోట చేతిపంపు చెడిపోయి నీళ్లురాని పరిస్థితి ఉండగా, మరో చోట పైపులైన్ మరమ్మతు చేయాల్సిన అవసరం ఉంది. ఇంకో చోట పూర్తిగా నీటి వసతి లేకుండా నీటి తొట్టెలను నిర్మించారు. దీంతో గతంలో నిర్మించి తొట్టెలు నిరుపయోగంగా మారాయి. జిల్లాలో పలు ప్రాంతాల్లో ఒక తొట్టెకు రూ.1000–2000 ఖర్చు చేస్తే అవి వినియోగంలోకి వచ్చే అవకాశం ఉంది. ఇది తెలిసినా అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అనవసరంగా కొత్తవి నిర్మించారు. గతంలో నిర్మించి ఒక్కో తొట్టె విలువ రూ.14,000–18,000 ఉండగా, కొత్తగా నిర్మిస్తున్న వాటి విలువ రూ.22 వేల వరకు ఉంది. జిల్లాలోని 36 మండలాల పరిధిలోని 71 గ్రామ పంచాయతీల్లో కొత్తగా 2,154 నీటి తొట్టెలను (ఒక జీపీకి మూడు చొప్పున) మంజూరు చేశారు. ఒక్కో దానికి రూ.22,190 కేటాయించారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 75శాతం నిర్మాణాలు పూర్తయ్యాయి. నీటి సౌకర్యం లేకున్నా నిర్మాణాలు.. నీటి సౌకర్యం లేకున్నా తొట్టెలు నిర్మించడం విమర్శలకు తావిస్తోంది. వచ్చే నిధులకు ఆశపడి స్థానిక ప్రజాప్రతినిధులు గుత్తేదారు అవతారం ఎత్తారు. నాసిరకం పనులతో మమ అనిపిస్తున్నారు. కూలీలకు చెల్లించాల్సిన సొమ్మును కూడా వీరే అప్పనంగా తినేస్తున్నారు. నాణ్యత లేక కొద్ది నెలలకే వాటి గోడలు కూలుతున్నాయి. తొట్టెలకు శాశ్వత నీటి సౌకర్యం లేక కొద్ది రోజులకే నిరుపయోగంగా మారుతున్నాయి. కేస్ స్టడి–1 కూలిపోయిన నీటి తొట్టి జుక్కల్ మండలం బస్వాపూర్ గ్రామం లోనిది. రూ.22 వేలతో గత వేసవిలోనే ఈ తొట్టెను నిర్మించారు. గుత్తేదారు నాసిరకంగా పనులు చేపట్టడంతో ఇటీవలే కూలిపోయింది. అదే గుత్తెదారు ఈ మండలంలో నిర్మించిన మరో మూడు తొట్టెలు కూడా నాసిరకంగా ఉన్నాయి. ఈ ఒక్క మండలంలోనే కాదు. చాలా మండలాల్లో నాణ్యతా లోపాలు వెలుగు చూస్తున్నాయి. కేస్ స్టడీ–2 కనిపిస్తున్న నీటి తొట్టె గాంధారి మండలం దుర్గం గ్రామ పంచాయతీలోనిది. 2009–10 సంవత్సరంలో నిర్మించిన ఈ నీటి తొట్టెకు నీటిని సరఫరా చేసే పైపులైన్ పగిలిపోవడంతో వినియోగం లేక వృథాగా పడి ఉంది. ఈ గ్రామంలో గల పశువులకు తాగునీటి సదుపాయం లేకుండా పోయింది. ఈ ఒక్క గ్రామంలోనే కాదు దాదాపు 70 శాతం గ్రామాల్లో పరిస్థితి ఇలాగే ఉంది. నీటి సౌకర్యం కల్పించాలి.. జక్రాన్‌పల్లి మండలంలో నిర్మించిన తొట్టెలు నీటి సౌకర్యం లేక నిరూపయోగంగా మారాయి. పశువులకు తాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ తొట్టెలకు నీటి సౌకర్యం కల్పించాలి. – భాజన్న, యువ రైతు, జక్రాన్‌పల్లి -
యంత్రాలకు ‘ఉపాధి’
ఊటకుంటల తవ్వకాల్లో అక్రమాలు కూలీలకు బదులుగా యంత్రాలతో పనులు బినామీ మస్టర్లతో నిధుల స్వాహా అధికార పార్టీ నేతల హవా ఉదయగిరి : గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది.కూలీలకు ఎంపిక చేసిన పనుల ద్వారా ఉపాధి కల్పించడం ఈ పథకం ఉద్దేశం. కానీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి హామీ పథకం నిబంధనలను గాలికొదిలేసింది. కూలీలతో చేయించాల్సిన పనులను యంత్రాలతో చేయించి టీడీపీ కార్యకర్తల జేబులను నింపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నేతల ఒత్తిళ్లను తట్టుకోలేక అధికారులు చేతులెత్తేశారు. వర్షపు నీటిని ఒడిసిపట్టే ఊటకుంటల పనులను యంత్రాలతో చేపడుతూ బినామీ మస్టర్లతో నిధులు స్వాహా చేస్తున్న తంతు ఉదయగిరి నియోజకవర్గంలో య«థేచ్ఛగా సాగుతోంది. ఈ పనులు అధికారుల కనుసన్నల్లోనే జరుగుతుండడం విశేషం. తక్కువ వ్యయంతో ఎక్కువ ఆదాయం వస్తుండడంతో నేతల కన్ను వీటిపై పడింది. ప్రజాప్రతినిధులు అండగా నిలుస్తుండడంతో అవినీతికి అంతులేకుండా పోతోంది. జిల్లాలో 22,087 ఊటకుంటలు తవ్వాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం రూ.128.43 కోట్లు కేటాయించారు. ఇప్పటి వరకు 5467 కుంటల పనులు ప్రారంభించి రూ.10.70 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో 791 ప్రస్తుతానికి పూర్తయ్యాయి. జిల్లాలోని 40 మండలాల్లో ఊటకుంటలను తవ్వేందుకు అనుమతులు మంజూరుచేశారు. ఇందులో భాగంగా ఒక్క ఉదయగిరి ప్రాంతానికే పది వేల కుంటలను మంజూరుచేశారు. ఈ పనులను ఉపాధి కూలీలతో చేయించాల్సి ఉన్నప్పటికీ ఉదయగిరి, సీతారామపురం, కలిగిర, వింజమూరు, వరికుంటపాడు, కొండాపురం, తదితర మండలాల్లో యంత్రాలతో పనులు చేస్తున్నారు. జిల్లాలోని మరికొన్ని ప్రాంతాల్లోనూ ఇదే తరహాలో పనులు చేపడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రాత్రివేళల్లో పనులు: యంత్రాలతో పగటిపూట పనులు చేయిస్తే కూలీల నుంచి ఎక్కడ వ్యతిరేకత వస్తుందోనన్న భయంతో రాత్రి వేళల్లో తవ్వకాలు చేపడుతున్నారు. పగటి వేళ కొంతమంది కూలీలను పెట్టి తుది మెరుగులు దిద్దుతున్నారు. అనంతరం తమకు అనుకూలమైన గ్రూపులను ఎంపిక చేసుకుని బినామీ మస్టర్లతో నిధులు కాజేస్తున్నారు. ఉదయగిర మండలంలోని తిరుమలాపురం, జి.అయ్యవారిపల్లి, దేకూరుపల్లి, జీ చెర్లోపల్లి, వెంకట్రావుపల్లి, జీ అయ్యవారిపల్లి, వరికుంటపాడు మండలంలోని రామాపురం, కొండాయపాళెం, వరికుంటపాడు, తదితర గ్రామాల్లో ఈ తరహాలతో యంత్రాలతో పనులు చేయించి నిధులు స్వాహా చేస్తున్నారు. పరస్పర సహకారం ఉపాధి హామీ సిబ్బంది, అధికారులు, నేతలు ముందుగా పరస్పర అవగాహనతో యంత్రాలతో పనులు చేస్తున్నారు. నేతలు ముందుగా యంత్రాలతో నీటి కుంటలను తవ్విస్తారు. ఆ తర్వాత కూలీలతో తుదిమెరుగులు దిద్దుతారు. యంత్రాలతో చేపట్టిన పనుల విషయమై గ్రామస్తులు ఎవరైనా అధికారుల్ని నిలదీస్తే ఆ పనులతో తమకు సంబంధం లేదని, మస్టర్లు వేసేది లేదని చెబుతారు.అంతా సర్దుమణిగిన తర్వాత నెలకో రెండు నెలలకో మస్టర్లు వేసి నిధులు స్వాహా చేస్తారు. ఉదయగిరి మండలం పుల్లాయపల్లిలో యంత్రాలతో నీటికుంటల పనులు చేస్తున్న విషయం తెలుసుకున్న కూలీలు అక్కడికెళ్లి పనులు ఆపివేశారు. ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు చేపట్టలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్వామా పీడీ అసంతృప్తి ఇటీవల నియోజకవర్గంలోని వింజమూరు, దుత్తలూరు, ఉదయగిరి ప్రాంతాల్లో ఉపాధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన డ్వామా పీడీ హరిత పనుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నీటి కుంటలను యంత్రాలతో నిర్మించినట్లుగా క్షేత్రస్థాయిలో ఆమె గుర్తించినా ఆ విషయాన్ని బహిర్గతం చేయకుండా కూలీలతో పనులు చేయించాలని, లేకపోతే చర్యలు తప్పవని పరోక్షంగా అధికారుల్ని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా కూలీలతో చేయించాల్సిన ఉపాధి పనులను యంత్రాలతో చేపడుతున్నా అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా కలెక్టర్ స్పందించి యంత్రాలతో పనులు చేపట్టకుండా కూలీలకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని కూలీలు కోరుతున్నారు. యంత్రాలతో పనులు చేయిస్తే చర్యలు తప్పవు– వీరాస్వామి, ఎంపీడీఓ, ఉదయగిరి కూలీలతో తవ్వించాల్సిన ఊటకుంటలను యంత్రాలతో చేపడితే సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం. యంత్రాలతో పనులు చేపడుతుంటే కూలీలు తమ దృష్టికి తీసుకురావాలి. ఉపాధి పనులను పారదర్శకంగా చేయించే ప్రయత్నం చేస్తున్నాం. -
తేలని లెక్కలు
రూ. 10.06కోట్లకు గల్లంతైన లెక్కలు నిధుల వినియోగంపై అనుమానాలు రాజీవ్ విద్యా మిషన్ పీఓకు సోకాజ్ నోటీసు జారీ వివరణ ఇచ్చేందుకు నేడే ఆఖరి రోజు సాక్షి ప్రతినిధి, విజయనగరం : ఆ శాఖలో నిధులు దండిగా ఉంటాయి. ఏ అవసరానికైనా వాటిపైనే ఆధారపడతారు. ఒక్కోసారి అధికారుల ఒత్తిడితో ఇతర శాఖలకూ నిధులు మళ్లిస్తారు. ఇదే ఇప్పుడు కొంపముంచింది. దాదాపు రూ. పదికోట్లకు లెక్కలు కనిపించట్లేదు. నిధుల ఖర్చుకు సంబంధించిన వినియోగ పత్రాలు సమర్పించలేదు. తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు జిల్లా అధికారికి షోకాజ్ నోటీసు జారి చేశారు. శనివారంలోగా వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. నిధులు దండిగా ఉండే విభాగాల్లో సర్వశిక్ష అభియాన్దే అగ్రస్థానం. 2014–15, 2015–16లో జిల్లాకు పెద్ద ఎత్తున నిధులు మంజూరయ్యాయి. కేంద్రం నుంచి వచ్చిన నిధులను విద్యాభివద్ధికి, పాఠశాలలకు మౌలిక సౌకర్యాలు, విద్యార్థులకు సౌకర్యాల కల్పన, ఉపా«ధ్యాయుల వేతనాలు, పాఠశాలల నిర్వహణ కోసం ఖర్చు పెట్టాలి. వాటికి ఖర్చు చేశాక సంబంధిత నిధుల మేరకు యుటిలైజేషన్ సర్టిఫికేట్లు సమర్పించాలి. కానీ, జిల్లాలో ఈ ప్రక్రియ సక్రమంగా జరగడం లేదు. రెండేళ్ల కాలంలో రూ. 10.06కోట్లకు అధికారులు లెక్కలు చూపించలేకపోయారు. సరికదా వాటికి సంబంధించి రికార్డులూ లేవు. నిధులకోసం ఆ శాఖపైనే ఆధారం వాస్తవానికి సర్వశిక్షా అభియాన్ నిధులు పెద్ద ఎత్తున పక్కదారి పడుతున్నాయి. నిధులున్న శాఖగా గుర్తింపు పొందడంతో ఉన్నతాధికారుల దష్టి అంతా దానిపైనే ఉంటుంది. జిల్లా ఉన్నతాధికారులకు ఏ అవసరం వచ్చినా, జిల్లా స్థాయిలో ఏ కార్యక్రమం తలపెట్టినా ఎస్ఎస్ఏ నిధులపైనే గురి పెడతారు. ఏదో ఒక రకంగా సర్దుబాటు చేసి నిధులు సమకూర్చాలని ఒత్తిళ్లు చేస్తారు. ఉన్నతాధికారుల మాట వినకపోతే ఇబ్బందని నిధులను అప్పనంగా ఇస్తారు. ముఖ్యమంత్రి పర్యటనలకు, మంత్రుల సమావేశాలకు, అధికార పార్టీ నేతల కార్యక్రమాలకు ఈ నిధులనే వెచ్చిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నిధుల్ని ఇతర శాఖలకు అవసరమొస్తే మళ్లిస్తున్న సందర్భాలూ ఉన్నాయి. అడ్వాన్సుల పేరిట వాడుకుంటున్నారన్న వాదనలు ఉన్నాయి. పాఠశాల నిర్వహణ కోసం ఇచ్చే నిధులు కూడా దుర్వినియోగమవుతున్నాయి. రెండేళ్లుగా పాఠశాల నిర్వహణ కమిటీల్లేకపోవడంతో ఎంఈఓలే ఆ పాత్ర పోషించారు. ఈ క్రమంలో ఎక్కడేం ఖర్చు పెట్టారో ఎవరికీ తెలియలేదు. బహుశా రూ. 10.06కోట్లకు లెక్కలు తేలకపోవడానికి ఇవే కారణాలు కావచ్చని తెలుస్తోంది. పీఓకు సోకాజ్ నోటీసు జారీ కారణమేదైతేనేమి ఆడిట్ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. జిల్లాలో రూ. 10.06కోట్లకు లెక్కల్లేవని, మరో రూ. 23.77కోట్లు ఖర్చు పెట్టకుండా బ్యాంకుల్లో ఉన్నాయని గుర్తించారు. వీటికి గల కారణాలేంటో, ఎక్కడున్నాయో కచ్చితంగా చెప్పలేకపోయారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ ఈ నెల 12న పీఓకు సోకాజ్ నోటీసు జారీ చేశారు. ఎందుకు చర్యలు తీసుకోకూడదో 20వ తేదీలోగా వివరణివ్వాలని నోటీసులో ఆదేశించారు. ఎంఈఓలకు హడావుడిగా నోటీసులు స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ నుంచి సోకాజ్ నోటీసు రావడమే తరువాయి ఇక్కడ సర్వశిక్షా అభియాన్ అధికారులు అప్రమత్తమయ్యారు. లెక్కలు తేల్చే పనిలో నిమిగ్నమయ్యారు. ముందుగా ఎంఈఓలకు నోటీసులు జారీ చేశారు. మండలాల వారీగా విడుదల చేసిన నిధులకు లెక్కలు చూపాలని, యూసీలివ్వాలని కోరినట్టు తెలిసింది. -
ప్రజాధనం దోపిడీ?
బోగోలులో భారీ కుంభకోణం స.హ.చట్టం ద్వారా వెలుగులోకి తీసుకొచ్చిన వైఎస్సార్సీపీ బిట్రగుంట: బోగోలు మేజర్ పంచాయతీలో భారీ కుంభకోణం వెలుగుచూసింది. అధికారులు, పంచాయతీ పాలకులు కలిసి రూ.25 లక్షల ప్రజాధనాన్ని దోచుకున్నారు. ఒకేపనికి రెండు సార్లు బిల్లులు చేసుకోవడం, కమీషన్ల కోసం కక్కుర్తిపడి ఒకే పనిని మూడు పనులుగా విభజించడంతో పాటు దాతలు దాతృత్వంతో చేసిన పనులకు కూడా బిల్లులు చేసుకోవడం గమనార్హం. ఈ వివరాలను సమాచార హక్కు చట్టం ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు వెలుగులోకి తీసుకురావడంతో పంచాయతీ పాలకుల్లో గుబులు మొదలైంది. బోగోలు మేజర్ పంచాయతీ నిర్వహణపై ఇటీవల తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతుండటం, ఉప సర్పంచ్ అంజయ్యయాదవ్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ మద్దిబోయిన వీరరఘు సమాచార హక్కు చట్టం ద్వారా పంచాయతీ ఆదాయ వ్యయాలపై వివరాల కోసం దరఖాస్తు చేశారు. జూన్ రెండున దరఖాస్తు చేయగా, ఆగస్ట్ పదో తేదీన అధికారులు సమాచారాన్ని అసంపూర్తిగా, అయిష్టంగా అందించారు. వివరాలను పరిశీలిస్తే విస్తుగొలిపే వాస్తవాలు కనిపిస్తున్నాయి. ఇదీ తీరు.. మూడేళ్ల కాలంలో పంచాయతీకి సుమారు రూ.1.5 కోట్లకుపైగా నిధులు వచ్చాయి. వీటిలో పంచాయతీ సాధారణ నిధులు రూ.65.93 లక్షలు, 13వ ఆర్థిక సంఘ నిధులు రూ.52.74 లక్షలు, 14వ ఆర్థిక సంఘ నిధులు రూ.27.5 లక్షలు, రాష్ట్ర ఆర్థిక సంఘ నిధులు రూ.నాలుగు లక్షల మేర వచ్చాయి. పంచాయతీ అభివృద్ధికి వినియోగించాల్సిన ఈ నిధులను పాలకులు పూర్తిగా దుర్వినియోగం చేశారు. కమీషన్ల కోసం కక్కుర్తిపడి అవసరం లేని చోట, అనవసరమైన పనులతో నిధులను పక్కదారి పట్టించారు. జిమ్మిక్కులతో రూ.25 లక్షల మేర గోల్మాల్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అన్నీ అవకతవకలే.. బోగోలు మేజర్ పంచాయతీలో నిధుల వినియోగంలో నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించారు. ఉదాహరణకు బోగోలు అరుంధతీయవాడ నుంచి మండల కార్యాలయాలకు వెళ్లే రోడ్డుకు రూ.85 వేలను ఖర్చు చేసినట్లు రికార్డుల్లో చూపించారు. అదే ప్రాంతానికి చెందిన దేవపల్లి చినకొండయ్య ఇంటి నుంచి రోడ్డుకు రూ.90 వేలతో మరమ్మతులు చేసినట్లు నిధులను డ్రా చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయ సిమెంట్ రోడ్డు పేరుతో రూ.రెండు లక్షలను డ్రా చేశారు. ఈ రోడ్డు ఎక్కడుండో ఎవరికీ అర్థం కావడం లేదు. బృందావనం వీధిలో 140 మీటర్ల సీసీ రోడ్డను మూడు పనులుగా విభజించి రూ.ఆరు లక్షలను డ్రా చేశారు. సాధారణంగా రూ.లక్షతో 35 మీటర్ల సీసీ రోడ్డు వేస్తారు. ఈ లెక్కన రూ.4 లక్షలతో పూర్తయ్యే పనికి కమీషన్ల కోసం కక్కుర్తిపడి రూ.ఆరు లక్షలను వెచ్చించారు. అదే ప్రాంతంలో 250 మీటర్ల సైడ్ డ్రెయిన్ల నిర్మాణం కోసం రూ.4.5 లక్షలను డ్రా చేశారు. ఈ ఒక్క పనిలోనే రూ.రెండు లక్షల మేర దోచుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బోగోలు దళితవాడలోనూ డ్రెయిన్ల పేరుతో రూ.మూడు లక్షలను వెచ్చించారు. నాసిరకంగా నిర్మించడంతో ఇవి నిరుపయోగంగా మారాయి. బోగోలు మార్కెట్ వీధిలో సీసీ రోడ్ల లెవలింగ్‌కు రూ.1.5 లక్షలను డ్రా చేశారు. సీసీ రోడ్డు లెవలింగ్ ఏమిటో స్థానికులకు అర్థం కావడం లేదు. బిల్లులు చేసిన ఇంజినీరింగ్ అధికారులకు ఎలా అర్థమైందో అవాక్కవుతున్నారు. -
పెనుగొండలో ఏసీబీ దాడులు
పెనుగొండ : పెనుగొండ పంచాయతీ కార్యాలయంలో సోమవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ కె.రాజేంద్ర కథనం ప్రకారం.. పెనుగొండ ఇందిరా శాంతినగర్‌కు చెందిన గెద్దాడ రూతమ్మ ఇంటి ప్లాను అనుమతి కోసం 2015లో దరఖాస్తు చేసుకున్నారు. అదే ఏడాది అక్టోబరు 12న జరిగిన పంచాయతీ సమావేశంలో దీనికి ఆమోదం లభించింది. అయితే, అప్పటి నుంచి రూతమ్మ పలుమార్లు పంచాయతీ కార్యాలయం చుట్టూ తిరిగినా ప్లాను అనుమతి పత్రాలు అందజేయలేదు. దీంతో రూతమ్మ తమ్ముడైన మెరిపే వెంకటేశ్వర్లు ప్లాను విషయమై పంచాయతీ అధికారులతో సంప్రదింపులు జరపగా.. పత్రాలు కనపడడం లేదని సిబ్బంది చెప్పారు. రూ.5వేలు లంచం ఇస్తే తిరిగి ప్లాన్ పత్రాలు బ్లూప్రింట్ తీసి అప్రూవల్ చేసి ఇస్తామని పేర్కొన్నారు. దీంతో వెంకటేశ్వర్లు ఆదివారం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారుల సూచనల ప్రకారం.. సోమవారం ఆయన రూ.5వేలు పంచాయతీలో విధులు నిర్వర్తిస్తున్న విశ్రాంత ఈవో సత్యనారాయణకు అందజేయగా.. ఆ నగదును రికార్డు అసిస్టెంట్ ఎల్.రామారావుకు అందజేశారు. అదే సమయంలో ఏసీబీ అధికారులు రంగ ప్రవేశం చేసి వారిద్దరినీ అదుపులోకి తీసుకుని రసాయన పరీక్షలు నిర్వహించారు. లంచం తీసుకున్నట్టు ధ్రువీకరించారు. దీనిపై వారిద్దరినీ విచారించగా గ్రామ కార్యదర్శి పి వసంతరావు సూచన మేరకే ఆ డబ్బు తీసుకున్నట్టు వారు వివరించారు. అలాగే ఆగస్టులో పంచాయతీకి జమైన నిధులు రూ.1,00,755 ఉండాల్సి ఉండగా.. రూ.3,800 మాత్రమే ఉండడంతో కార్యదర్శిని ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. అత్యవసర పనుల నిమిత్తం ఖర్చుచేసినట్టు ఆయన వివరించడంతో అలా ఖర్చుచేసే అధికారం లేదని ఏసీబీ అధికారులు తేల్చిచెప్పారు. కేసు నమోదు చేసి కార్యదర్శి పి.వసంతరావు, రికార్డు అసిస్టెంట్ ఎల్.రామారావు, రిటైర్డు ఈవో సత్యనారాయణను అదుపులోకి తీసుకున్నారు. దాడుల్లో ఏసీబీ సీఐ యు.జె.విల్సన్, వై.రాఘవేంద్రరావు పాల్గొన్నారు.