నిధులు ‘తొట్టెల’ పాలు
నిధులు ‘తొట్టెల’ పాలు
Published Wed, Sep 7 2016 9:48 PM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
ఇందూరు: పశువుల కోసం ఏర్పాటు చేసిన నీటి తొట్టెల నిర్మాణాల్లో నాణ్యత లోపించింది. దీంతో నాలుగు కూడా గడవక ముందే కుప్పకూలుతున్నాయి. వేసవిలో పశువుల దాహార్తిని తీర్చడానికి ‘డ్వామా’ అధికారులు ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో నీటి తొట్టెలు నిర్మించారు. అయితే, వాటిలో నాణ్యతా లోపాలు బయటపడుతున్నాయి. అధికారులు, గుత్తేదారులు ములాఖత్ అయి నామమాత్రంగా నిర్మాణాలు చేపట్టి భారీగా దండుకున్నారే ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
ఒకటి, రెండు కాదు.. ఏకంగా 2 వేల వరకు నిర్మించిన తొట్టెల నిర్మాణాల్లో భారీ అవినీతి చోటు చేసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. గతంలో నిర్మించిన తొట్టెలకు స్వల్ప మరమ్మతులు చేపడితే అవి వినియోగంలోకి వచ్చేవి, కానీ వాటిని వదిలేసి కొత్తవి నిర్మించారు. మరోవైపు, కొన్ని చోట్ల అవసరం లేకున్నా కట్టేశారు. దీంతో అవి నిరుపయోగంగా మారాయి.
జిల్లాలో గత ఐదేళ్లలో వందల నీటి తొట్టేలను నిర్మించారు. అవన్నీ బాగానే ఉన్నా, వాటిని కాదని ఈ సంవత్సరం కొత్త నీటి తొట్టెల నిర్మాణాలు చేపట్టారు. పాతవి ఎందుకు నిరుపయోగంగా మారాయో తెలుసుకోకుండా, చిన్న మరమ్మతులు చేయిస్తే వినియోగంలోకి వస్తాయని తెలిసీ, మళ్లీ రూ.లక్షల నిధులతో కొత్త వాటిని నిర్మించారు. ఫలితంగా జిల్లాలో నిధుల దుబారా జరిగింది. పాత తొట్టెలు జిల్లాలో వెయ్యికిపైగా నిరూపయోగంగా ఉన్నాయి.
ప్రయోజనం లేదే..!
డ్వామా అధికారులు ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో 2010–11 నుంచి గతేడాది వరకు రూ.1.10 కోట్లతో 1500 పశువుల తొట్టెలను నిర్మించారు. ఇవే కాకుండా జిల్లా నీటి యాజమాన్య పథకం కింద కొన్ని ప్రాంతాల్లో పశువుల కోసం నీటి తొట్టెలు నిర్మాణాలు చేపట్టారు. గ్రామాల్లో పశువులు సంచరించే ప్రాంతాల్లో చేతి పంపులు, బావుల దగ్గర వీటిని నిర్మించారు. తద్వారా వృథా నీటిని తొట్టెల్లోకి మళ్లించడంతో పాటు అవసరముంటే ఎవరైనా నీళ్లు తోడి తొట్టెలను నింపుకోవచ్చనే ఆలోచనతో ఈ నిర్మాణాలు చేపట్టారు. కానీ ప్రస్తుతం వీటిలో సింహభాగం ఎక్కడ పశువుల దాహార్తిని తీర్చడం లేదు. పైగా నిర్మాణాల్లో సాంకేతిక, నాణ్యతా లోపాల కారణంగా వీటిలో నీళ్లు నిల్వ చేయలేని పరిస్థితి నెలకొంది.
మరమ్మత్తులతో సరిపోయేది..
నీటి తొట్టెలు నిరుపయోగంగా మారడానికి చిన్న చిన్న కారణాలున్నాయి. ఒకచోట చేతిపంపు చెడిపోయి నీళ్లురాని పరిస్థితి ఉండగా, మరో చోట పైపులైన్ మరమ్మతు చేయాల్సిన అవసరం ఉంది. ఇంకో చోట పూర్తిగా నీటి వసతి లేకుండా నీటి తొట్టెలను నిర్మించారు. దీంతో గతంలో నిర్మించి తొట్టెలు నిరుపయోగంగా మారాయి. జిల్లాలో పలు ప్రాంతాల్లో ఒక తొట్టెకు రూ.1000–2000 ఖర్చు చేస్తే అవి వినియోగంలోకి వచ్చే అవకాశం ఉంది.
ఇది తెలిసినా అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అనవసరంగా కొత్తవి నిర్మించారు. గతంలో నిర్మించి ఒక్కో తొట్టె విలువ రూ.14,000–18,000 ఉండగా, కొత్తగా నిర్మిస్తున్న వాటి విలువ రూ.22 వేల వరకు ఉంది. జిల్లాలోని 36 మండలాల పరిధిలోని 71 గ్రామ పంచాయతీల్లో కొత్తగా 2,154 నీటి తొట్టెలను (ఒక జీపీకి మూడు చొప్పున) మంజూరు చేశారు. ఒక్కో దానికి రూ.22,190 కేటాయించారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 75శాతం నిర్మాణాలు పూర్తయ్యాయి.
నీటి సౌకర్యం లేకున్నా నిర్మాణాలు..
నీటి సౌకర్యం లేకున్నా తొట్టెలు నిర్మించడం విమర్శలకు తావిస్తోంది. వచ్చే నిధులకు ఆశపడి స్థానిక ప్రజాప్రతినిధులు గుత్తేదారు అవతారం ఎత్తారు. నాసిరకం పనులతో మమ అనిపిస్తున్నారు. కూలీలకు చెల్లించాల్సిన సొమ్మును కూడా వీరే అప్పనంగా తినేస్తున్నారు. నాణ్యత లేక కొద్ది నెలలకే వాటి గోడలు కూలుతున్నాయి. తొట్టెలకు శాశ్వత నీటి సౌకర్యం లేక కొద్ది రోజులకే నిరుపయోగంగా మారుతున్నాయి.
కేస్ స్టడి–1
కూలిపోయిన నీటి తొట్టి జుక్కల్ మండలం బస్వాపూర్ గ్రామం లోనిది. రూ.22 వేలతో గత వేసవిలోనే ఈ తొట్టెను నిర్మించారు. గుత్తేదారు నాసిరకంగా పనులు చేపట్టడంతో ఇటీవలే కూలిపోయింది. అదే గుత్తెదారు ఈ మండలంలో నిర్మించిన మరో మూడు తొట్టెలు కూడా నాసిరకంగా ఉన్నాయి. ఈ ఒక్క మండలంలోనే కాదు. చాలా మండలాల్లో నాణ్యతా లోపాలు వెలుగు చూస్తున్నాయి.
కేస్ స్టడీ–2
కనిపిస్తున్న నీటి తొట్టె గాంధారి మండలం దుర్గం గ్రామ పంచాయతీలోనిది. 2009–10 సంవత్సరంలో నిర్మించిన ఈ నీటి తొట్టెకు నీటిని సరఫరా చేసే పైపులైన్ పగిలిపోవడంతో వినియోగం లేక వృథాగా పడి ఉంది. ఈ గ్రామంలో గల పశువులకు తాగునీటి సదుపాయం లేకుండా పోయింది. ఈ ఒక్క గ్రామంలోనే కాదు దాదాపు 70 శాతం గ్రామాల్లో పరిస్థితి ఇలాగే ఉంది.
నీటి సౌకర్యం కల్పించాలి..
జక్రాన్‌పల్లి మండలంలో నిర్మించిన తొట్టెలు నీటి సౌకర్యం లేక నిరూపయోగంగా మారాయి. పశువులకు తాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ తొట్టెలకు నీటి సౌకర్యం కల్పించాలి.
– భాజన్న, యువ రైతు, జక్రాన్‌పల్లి
Advertisement