న్యూఢిల్లీ: ఏ లిస్టెడ్ కంపెనీలోనూ కీలక యాజమాన్య పదవులు లేదా డైరెక్టర్లుగా బాధ్యతలు చేపట్టకుండా ఎస్సెల్ గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్రతోపాటు ఎండీ, సీఈవో పునీత్ గోయెంకాను క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిషేధించింది. మీడియా దిగ్గజం జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్(జీల్)కు చెందిన నిధుల అక్రమ మళ్లింపు వ్యవహారంలో సెబీ తాజా ఆదేశాలు జారీ చేసింది. జీల్ చైర్మన్ చంద్ర, డైరెక్టరు గోయెంకా తమ హోదాలను అడ్డుపెట్టుకుని సొంత లబ్ది కోసం నిధులను అక్రమంగా తరలించిన కేసులో సెబీ తాజా చర్యలు చేపట్టింది.
చంద్ర, గోయెంకా.. జీల్‌సహా ఎస్సెల్ గ్రూప్‌లోని ఇతర లిస్టెడ్ కంపెనీల ఆస్తులను.. సొంత నియంత్రణలోని సహచర సంస్థల కోసం అక్రమంగా వినియోగించినట్లు సెబీ పేర్కొంది. పక్కా ప్రణాళిక ప్రకారం నిధుల అక్రమ వినియోగాన్ని చేపట్టినట్లు తెలియజేసింది. కాగా.. జీల్ షేరు 2018–19లో నమోదైన రూ. 600 స్థాయి నుంచి 2022–23కల్లా రూ. 200కు దిగివచ్చినట్లు సెబీ ప్రస్తావించింది.
ఈ కాలంలో కంపెనీ అత్యంత లాభదాయకంగా నడుస్తున్నప్పటికీ షేరు విలువ పడిపోయినట్లు పేర్కొంది. వెరసి కంపెనీలో ఏవో అక్రమాలు జరుగుతున్న విషయాన్ని ఇది ప్రతిఫలించినట్లు వ్యాఖ్యానించింది. ఇదే సమయంలో కంపెనీలో ప్రమోటర్ల వాటా 41.62 శాతం నుంచి 3.99 శాతానికి పడిపోయినట్లు వెల్లడించింది. ప్రమోటర్ల వాటా 4 శాతం దిగువకు చేరినప్పటికీ చంద్ర, గోయెంకా జీల్ వ్యవహారాలను చక్కబెడుతూనే ఉన్నట్లు తెలియజేసింది.
Comments
Please login to add a commentAdd a comment