
సాక్షి,ముంబై : జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్(జీఈఈఎల్) చైర్మన్ పదవికి సుభాష్ చంద్ర రాజీనామా చేయడంతో కంపెనీ షేరు మంగళవారం సెషన్‌లో భారీ నష్టాలతో కొనసాగుతోంది. ఇన్వెస్టర్లు ట్రేడర్ల అమ్మకాలతో జీ 9 శాతం నష్టపోయింది. గత సెషన్‌లో రూ. 343.80 వద్ద ముగిసిన ఈ షేరు, మంగళవారం రూ. 312.40 వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరింది. జీలో సుభాష్ చంద్ర నేతృత్వంలోని ఎస్సెల్ గ్రూప్ వాటా అమ్మకం గురించి గత వారం ప్రతికూల ప్రభావం చూపకపోయినప్పటికీ, జీ బోర్డు ఛైర్మన్ పదవి నుంచి చంద్ర పదవి నుంచి తప్పుకున్నట్లు ప్రకటించడం ప్రతికూలంగా మారింది.
కంపెనీ ఎండీ, సీఈవోలతో చైర్‌పర్సన్‌కు బంధుత్వం వంటివి ఉండకూడదన్న సెబీ నిబంధనలకు లోబడి చంద్ర రాజీనామా చేసినట్లు జీఈఈఎల్ సోమవారం రెగ్యులేటరీ సమాచారంలో వెల్లడించింది. అయితే సుభాష్ చంద్ర కుమారుడు పునిత్ గోయెంకా నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా కొనసాగుతారు. అలాగే బోర్డును పునర్‌వ్యవస్థీకరించినట్లు, కొత్తగా ముగ్గురు స్వతంత్ర డైరెక్టర్లు (ఆర్ గోపాలన్, సురేంద్ర సింగ్, అపరాజిత జైన్) నియమితులైనట్లు పేర్కొంది. కొత్త బోర్డులో స్వతంత్ర డైరెక్టర్లు ఆరుగురు, ఎస్సెల్ గ్రూప్ (జీఈఈఎల్ మాతృసంస్థ) తరఫున ఇద్దరు ఉంటారు. రుణాల భారాన్ని తగ్గించుకునే దిశగా ప్రమోటర్ల వాటాలను మరింతగా విక్రయించేందుకు ఎస్సెల్ గ్రూప్ మార్గాలు అన్వేషిస్తున్న తరుణంలో చంద్ర రాజీనామా ప్రాధాన్యం సంతరించుకుంది. జూన్ 30న కంపెనీలో 35.79 శాతంగా ఉన్న ప్రమోటర్ల వాటా సెప్టెంబర్ 30 నాటికి 22.37 శాతానికి తగ్గింది. రుణాల చెల్లింపుల కోసం జీఈఈఎల్‌లో 16.5 శాతం వాటాలు విక్రయించనున్నట్లు నవంబర్ 20న ఎస్సెల్ గ్రూప్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment