Essel Group
-
’జీ’ సుభాష్ చంద్రపై దివాలా చర్యలకు ఎన్సీఎల్టీ ఆదేశాలు
న్యూఢిల్లీ: మీడియా దిగ్గజం, జీ ఎంటర్టైన్మెంట్ (జీల్) గౌరవ చైర్మన్ సుభాష్ చంద్రపై దివాలా చట్టం కింద ప్రొసీడింగ్స్ చేపట్టాలంటూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆదేశించింది. ఎస్సెల్ గ్రూప్ సంస్థ వివేక్ ఇన్ఫ్రాకాన్ తీసుకున్న రుణాలకు గ్యారంటార్‌గా ఉన్న చంద్రపై ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ (ఐహెచ్ఎఫ్ఎల్) దాఖలు చేసిన పిటీషన్ మీద ఎన్సీఎల్టీ ఈ ఉత్తర్వులు ఇచ్చింది. మరో రెండు సంస్థలు (ఐడీబీఐ ట్రస్టీíÙప్, యాక్సిస్ బ్యాంక్) దాఖలు చేసిన ఇదే తరహా పిటీషన్లను తోసిపుచి్చంది. ఓపెన్ కోర్టులో ఎన్సీఎల్టీ ఈ ఆర్డరులివ్వగా పూర్తి వివరాలతో కూడిన తీర్పు ఇంకా వెలువడాల్సి ఉంది. వివరాల్లోకి వెడితే చంద్రా ప్రమోట్ చేస్తున్న ఎస్సెల్ గ్రూప్‌లో భాగమైన వివేక్ ఇన్ఫ్రాకాన్ సంస్థ 2022లో ఐహెచ్‌ఎఫ్‌ఎల్‌కు రూ. 170 కోట్ల రుణం డిఫాల్ట్ అయ్యింది. దీనిపైనే ఐహెచ్ఎఫ్ఎల్ .. ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. వ్యక్తిగత గ్యారంటార్లు.. దివాలా ప్రొసీడింగ్స్ పరిధిలోకి రారని, తనపై చర్యలు తీసుకునేందుకు ఎన్సీఎల్టీకి ఎలాంటి అధికారాలు ఉండవని చంద్రా వాదనలు వినిపించారు. అయితే, దీన్ని ఎన్సీఎల్టీ తిరస్కరించగా .. చంద్రా ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించారు. వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఇరు వర్గాలు నిర్ణయించుకోవడంతో కేసును ఉపసంహరించుకున్నారు. కానీ, ఆ తర్వాత కూడా బకాయిలను తీర్చకపోవడంతో ఐహెచ్ఎఫ్ఎల్ ఈ ఏడాది ప్రారంభంలో కేసును తిరగదోడింది. -
సుభాష్ చంద్ర, పునీత్‌లకు సెబీ షాక్
న్యూఢిల్లీ: ఏ లిస్టెడ్ కంపెనీలోనూ కీలక యాజమాన్య పదవులు లేదా డైరెక్టర్లుగా బాధ్యతలు చేపట్టకుండా ఎస్సెల్ గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్రతోపాటు ఎండీ, సీఈవో పునీత్ గోయెంకాను క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిషేధించింది. మీడియా దిగ్గజం జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్(జీల్)కు చెందిన నిధుల అక్రమ మళ్లింపు వ్యవహారంలో సెబీ తాజా ఆదేశాలు జారీ చేసింది. జీల్ చైర్మన్ చంద్ర, డైరెక్టరు గోయెంకా తమ హోదాలను అడ్డుపెట్టుకుని సొంత లబ్ది కోసం నిధులను అక్రమంగా తరలించిన కేసులో సెబీ తాజా చర్యలు చేపట్టింది. చంద్ర, గోయెంకా.. జీల్‌సహా ఎస్సెల్ గ్రూప్‌లోని ఇతర లిస్టెడ్ కంపెనీల ఆస్తులను.. సొంత నియంత్రణలోని సహచర సంస్థల కోసం అక్రమంగా వినియోగించినట్లు సెబీ పేర్కొంది. పక్కా ప్రణాళిక ప్రకారం నిధుల అక్రమ వినియోగాన్ని చేపట్టినట్లు తెలియజేసింది. కాగా.. జీల్ షేరు 2018–19లో నమోదైన రూ. 600 స్థాయి నుంచి 2022–23కల్లా రూ. 200కు దిగివచ్చినట్లు సెబీ ప్రస్తావించింది. ఈ కాలంలో కంపెనీ అత్యంత లాభదాయకంగా నడుస్తున్నప్పటికీ షేరు విలువ పడిపోయినట్లు పేర్కొంది. వెరసి కంపెనీలో ఏవో అక్రమాలు జరుగుతున్న విషయాన్ని ఇది ప్రతిఫలించినట్లు వ్యాఖ్యానించింది. ఇదే సమయంలో కంపెనీలో ప్రమోటర్ల వాటా 41.62 శాతం నుంచి 3.99 శాతానికి పడిపోయినట్లు వెల్లడించింది. ప్రమోటర్ల వాటా 4 శాతం దిగువకు చేరినప్పటికీ చంద్ర, గోయెంకా జీల్ వ్యవహారాలను చక్కబెడుతూనే ఉన్నట్లు తెలియజేసింది. -
వినతీ కొత్త రికార్డ్- ఎస్సెల్ ప్రొ పతనం
హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలతో కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న ఫార్మా రంగ కంపెనీ వినతీ ఆర్గానిక్స్ కౌంటర్‌కు మరోసారి డిమాండ్ కనిపిస్తోంది. అయితే మరోవైపు పీఈ దిగ్గజం బ్లాక్‌స్టోన్ వాటాను విక్రయించనున్నట్లు వెల్లడికావడంతో ప్యాకేజింగ్ దిగ్గజం ఎస్సెల్ ప్రొప్యాక్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి వినతీ ఆర్గానిక్స్ షేరు భారీ లాభాలతో సందడి చేస్తుంటే.. ఎస్సెల్ ప్రొప్యాక్ నష్టాలతో కళ తప్పింది. వివరాలు ఇలా.. వినతీ ఆర్గానిక్స్ లాక్‌డవున్‌ల నేపథ్యంలోనూ ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో జోరందుకున్న వినతీ ఆర్గానిక్స్ మరోసారి దూకుడు చూపుతోంది. ఎన్ఎస్ఈలో తొలుత వినతీ షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 1355ను తాకింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 3 శాతం లాభంతో రూ. 1325 వద్ద ట్రేడవుతోంది. గత వారం రోజుల్లోనే వినతీ షేరు 36 శాతం దూసుకెళ్లడం విశేషం! ఈ ఏడాది క్యూ1లో నికర లాభం 12 శాతమే క్షీణించి రూ. 72 కోట్లను తాకగా.. మొత్తం ఆదాయం సైతం స్వల్పంగా తగ్గి రూ. 232 కోట్లకు చేరింది. అయితే ఇబిటా మార్జిన్లు 0.7 శాతం బలపడి 42 శాతంగా నమోదయ్యాయి. క్యూ2 ఫలితాలపై ఆశావహ అంచనాలు ఈ కౌంటర్‌కు జోష్‌నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఎస్సెల్ ప్రొప్యాక్ లామినేటెడ్ ట్యూబ్స్ ప్యాకేజింగ్ దిగ్గజం ఎస్సెల్ ప్రొప్యాక్‌లో మెజారిటీ వాటా కలిగిన బ్లాక్‌స్టోన్ సంస్థ ఎప్సిలాన్ బిడ్కో 23 శాతం వాటాను విక్రయించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఎస్సెల్ ప్రొప్యాక్‌లో ఎప్సిలాన్‌కు 75 శాతం వాటా ఉంది. ఇందుకు రూ. 225 ఫ్లోర్ ధరను నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. బ్లాక్‌డీల్స్ ద్వారా 7.25 కోట్ల షేర్లను బ్లాక్‌స్టోన్ సంస్థ విక్రయించనున్నట్లు వివరించాయి. తద్వారా బ్లాక్‌స్టోన్ రూ. 1850 కోట్లు సమకూర్చుకునే వీలుంది. ఈ నేపథ్యంలో ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఎస్సెల్ ప్రొప్యాక్ షేరు 6.25 శాతం పతనమై రూ. 256 దిగువన ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 252 దిగువకూ చేరింది. కాగా.. నేటి ట్రేడింగ్‌లో తొలి గంటన్నరలోనే బీఎస్ఈలో 7.68 కోట్లకుపైగా షేర్లు చేతులు మారినట్లు నిపుణులు పేర్కొన్నారు. గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 22,400 షేర్లు మాత్రమేకావడం గమనార్హం. తద్వారా బ్లాక్‌స్టోన్ గ్రూప్ 23 శాతం వాటాను విక్రయించినట్లు చెబుతున్నారు. -
ఎస్సెల్ ప్రొప్యాక్ జూమ్- హెచ్ఏఎల్ స్కిడ్
కొద్ది రోజులుగా ర్యాలీ బాటలో సాగుతున్న ఎఫ్ఎంసీజీ ప్రొడక్టుల ప్యాకేజింగ్ దిగ్గజం ఎస్సెల్ ప్రొప్యాక్ కౌంటర్ మరోసారి ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. మరోపక్క ఇటీవల ఆఫర్ ఫర్ సేల్ ద్వారా కేంద్ర ప్రభుత్వం కొంతమేర వాటాను విక్రయించిన నేపథ్యంలో నేలచూపులతో కదులుతున్న ఇంజినీరింగ్ దిగ్గజం హిందుస్తాన్ ఏరోనాటిక్స్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి ఎస్సెల్ ప్రొప్యాక్ లాభాలతో సందడి చేస్తుంటే.. హెచ్ఏఎల్ షేరు నష్టాలతో కళ తప్పింది. వివరాలు చూద్దాం.. ఎస్సెల్ ప్రొప్యాక్ ఈ ఏడాది క్యూ1లో పటిష్ట ఫలితాలు సాధించాక మరింత జోరందుకున్న ఎస్పెల్ ప్రొప్యాక్ కౌంటర్‌కు డిమాండ్ కొనసాగుతోంది. దీంతో ఎన్ఎస్ఈలో తొలుత ఈ షేరు 13 శాతం దూసుకెళ్లి రూ. 306ను తాకింది. ప్రస్తుతం 5.3 శాతం లాభంతో రూ. 285 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో కలిపి తొలి రెండు గంటల ట్రేడింగ్‌లోనే 4 లక్షల షేర్లు ఈ కౌంటర్లో చేతులు మారాయి. గత మూడు నెలల్లో ఈ కౌంటర్ 75 శాతం ర్యాలీ చేయడం విశేషం! క్యూ1లో ఎస్సెల్ ప్రొ నికర లాభం 14 శాతం పెరిగి రూ. 46 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 18 శాతం పుంజుకుని రూ. 741 కోట్లను తాకింది. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ వరుసగా నాలుగో రోజు హిందుస్తాన్ ఏరోనాటిక్స్ కౌంటర్లో అమ్మకాలు నమోదవుతున్నాయి. ఎన్ఎస్ఈలో ఈ షేరు ప్రస్తుతం 3 శాతం క్షీణించి రూ. 898 వద్ద ట్రేడవుతోంది. తొలుత 6 శాతం పతనమై రూ. 871 వరకూ నీరసించింది. గత నాలుగు రోజుల్లోనే ఈ షేరు 26 శాతం నష్టపోయింది. గత గురువారం(27న) కేంద్ర ప్రభుత్వం ఓఎఫ్ఎస్ ద్వారా 14.82 శాతం వాటాకు సమానమైన 49.56 మిలియన్ ఈక్విటీ షేర్లను విక్రయించిన విషయం విదితమే. ఇందుకు ఫ్లోర్ ప్రైస్‌ను రూ. 1001గా అమలు చేసింది. తద్వారా కంపెనీలో వాటాను 89.97 శాతం నుంచి 75.15 శాతానికి తగ్గించుకుంది. అయితే ఫ్లోర్ ప్రైస్ కంటే దిగువకు తాజాగా షేరు క్షీణించినప్పటికీ గత మూడు నెలల్లో ఈ కౌంటర్ 60 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! -
ఎస్సెల్ ప్రొప్యాక్- టొరంట్ ఫార్మా యమస్పీడ్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించడంతో హెల్త్‌కేర్ రంగ కంపెనీ టొరంట్ ఫార్మాస్యూటికల్స్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. మరోపక్క ఇదే సమయంలో ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో ప్యాకేజింగ్ దిగ్గజం ఎస్సెల్ ప్రొప్యాక్ కౌంటర్ వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ ఆటుపోట్ల మార్కెట్లోనూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. ఎస్సెల్ ప్రొప్యాక్ లిమిటెడ్ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో ఎస్సెల్ ప్రొప్యాక్ నికర లాభం 14 శాతం పెరిగి రూ. 46 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 18 శాతం పుంజుకుని రూ. 741 కోట్లను అధిగమించింది. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఎస్సెల్ ప్రొప్యాక్ షేరు 14.5 శాతం దూసుకెళ్లి రూ. 235 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 243 వరకూ ఎగసింది. జూన్ చివరికల్లా కంపెనీ ఆర్‌వోసీఈ 4.2 శాతం బలపడి 19.9 శాతానికి ఎగసినట్లు ఎడిల్వీజ్ సెక్యూరిటీస్ పేర్కొంది. టొరంట్ ఫార్మాస్యూటికల్స్ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో టొరంట్ ఫార్మా నికర లాభం 49 శాతం జంప్‌చేసి రూ. 321 కోట్లను తాకింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం నామమాత్ర వృద్ధితో రూ. 2060 కోట్లకు చేరింది. దీనిలో దేశీ ఆదాయం 2 శాతం పుంజుకుని రూ. 925 కోట్లకు చేరింది. అయితే యూఎస్ ఆదాయం 1 శాతం క్షీణతతో రూ. 373 కోట్లకు పరిమితమైంది. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో టొరంట్ ఫార్మా షేరు 10 శాతం దూసుకెళ్లి రూ. 2673 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 2681 వరకూ ఎగసింది. -
‘యస్’ షేర్ల ట్రేడింగ్‌పై ఆంక్షలు
న్యూఢిల్లీ: సంక్షోభంలో చిక్కుకున్న యస్ బ్యాంక్ పునరుద్ధరణ ప్రణాళికలో భాగంగా షేర్ల ట్రేడింగ్‌పై హఠాత్తుగా ఆంక్షలు విధించడం.. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) సహా ఇతరత్రా సంస్థాగత ఇన్వెస్టర్లను ఆందోళనలోకి నెట్టింది. ప్రస్తుత ఇన్వెస్టర్లు తమ దగ్గరున్న షేర్లలో పాతిక శాతానికి మించి విక్రయించడానికి లేకుండా విధించిన నిబంధనతో సోమవారం మదుపరులు తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నారు. షేరు ఏకంగా 50 శాతం పైగా ఎగిసినప్పటికీ తమ దగ్గరున్న వాటిని విక్రయించే పరిస్థితి లేకుండాపోయింది. క్యాష్, డెరివేటివ్స్ సెగ్మెంట్లో తమ పొజిషన్లను వదిలించుకోలేకపోవడంపై పలువురు సీనియర్ ఫండ్ మేనేజర్లు, ఎఫ్‌పీఐలు, సంస్థాగత ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఈ నిబంధనను ప్రవేశపెట్టడంతో డెరివేటివ్స్ సెగ్మెంట్లో భారీగా పొజిషన్లు ఉన్న ఇన్వెస్టర్లు ఇరుక్కుపోయినట్లయిందని పేర్కొన్నారు. దీనిపై సంబంధిత నియంత్రణ సంస్థను ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు వివరించారు. ఆంక్షల గురించి సోమవారం ఉదయానికి మాత్రమే ఇన్వెస్టర్లకు తెలిసింది. అంతే కాకుండా యస్ బ్యాంక్ షేర్లలో ట్రేడింగ్‌ను మొబైల్ యాప్స్ ద్వారా కుదరదని, డెస్క్‌టాప్ ద్వారా మాత్రమే చేయాలని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తదితర బ్రోకింగ్ సంస్థలు .. ఇన్వెస్టర్లకు సమాచారమిచ్చాయి. ఒకవేళ యస్ బ్యాంక్ షేర్లలో ఈ–మార్జిన్ పొజిషన్లు గానీ ఉంటే సోమవారం వాటిని డెలివరీ కింద మారుస్తామని, అందుకు తగినంత స్థాయిలో నిధులు తమ అకౌంట్లలో ఉంచుకోవాలని సూచించాయి. 19నే సూచీల నుంచి నిష్క్రమణ.. తాజా పరిస్థితుల నేపథ్యంలో గతంలో అనుకున్న దానికంటే ముందుగానే యస్ బ్యాంక్‌ను నిఫ్టీ సహా వివిధ సూచీల నుంచి తొలగించాలని ఎన్ఎస్ఈ ఇండిసెస్ ఇండెక్స్ మెయింటెనెన్స్ సబ్–కమిటీ నిర్ణయించింది. దీంతో ముందుగా అనుకున్నట్లు మార్చి 27న కాకుండా 19 నుంచే నిఫ్టీ 50, నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ 100, నిఫ్టీ 500 వంటి అన్ని ఈక్విటీ సూచీల నుంచి యస్ బ్యాంక్ నిష్క్రమించనుంది. 18 నుంచి పూర్తి సేవలు: ఆర్బీఐ పునరుద్ధరణ ప్రణాళిక అమల్లోకి రావడంతో మార్చి 18 సాయంత్రం నుంచి యస్ బ్యాంక్‌పై మారటోరియం తొలగిపోయి, అన్ని సేవలు అందుబాటులోకి వస్తాయని రిజర్వ్ బ్యాంక్ గవ ర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. దీంతో ఖాతా దారులు .. ఆంక్షలేమీ లేకుండా విత్‌డ్రాయల్స్ లావాదేవీలు జరపవచ్చని పేర్కొన్నారు. కార్పొరేట్లకు ఈడీ సమన్లు.. యస్ బ్యాంక్ మాజీ వ్యవస్థాపకుడు రాణా కపూర్ తదితరులపై మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా పలువురు కార్పొరేట్ దిగ్గజాలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. ఎస్సెల్ గ్రూప్ ప్రమోటరు సుభాష్ చందద్ర, జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్, ఇండియాబుల్స్ చైర్మన్ సమీర్ గెహ్లాట్లను విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించింది. అటు అడాగ్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ కూడా ఈ నెల 19న హాజరు కానున్నారు. యస్ బ్యాంక్ అప్‌గ్రేడ్ .. తాజాగా పెట్టుబడులు వచ్చిన నేపథ్యంలో యస్ బ్యాంక్ రేటింగ్‌ను సానుకూల అంచనాలతో అప్‌గ్రేడ్ చేసినట్లు రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ వెల్లడించింది. బోర్డు పునర్వ్యవస్థీకరణకు ఓకే .. ప్రస్తుతం అడ్మినిస్ట్రేటరుగా ఉన్న ప్రశాంత్ కుమార్.. కొత్త ఎండీ, సీఈవోగా బోర్డు పునర్వ్యవస్థీకరణ ప్రణాళికకు ఆమోదం తెలిపినట్లు యస్ బ్యాంక్ వెల్లడించింది. -
‘జీ’ డీల్‌కు ఇన్వెస్కో సై
ముంబై: నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్న జీ గ్రూప్‌నకు ఊరటనిచ్చేలా అమెరికాకు చెందిన ఇన్వెస్కో ఓపెన్‌హైమర్ ఫండ్ మరింత ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకొచ్చింది. జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ (జీ)లో ప్రమోటర్ల నుంచి మరో 11 శాతం వాటాలు కొనుగోలు చేసేందుకు అంగీకరించింది. ఈ డీల్ విలువ రూ. 4,224 కోట్లుగా ఉండనుంది. ఇన్వెస్కో ఓపెన్‌హైమర్‌లో భాగమైన డెవలపింగ్ మార్కెట్స్ ఫండ్ ఈ వాటాలను కొనుగోలు చేయనుంది. 2002 నుంచి జీ లో ఇన్వెస్టరుగా కొనసాగుతున్న ఇన్వెస్కో ఫండ్‌కు ప్రస్తుతం ఇందులో 7.74 శాతం వాటాలు ఉన్నాయి. ‘ఇన్వెస్కో ఓపెన్‌హైమర్ డెవలపింగ్ మార్కెట్స్ ఫండ్ .. జీ లో మరింతగా ఇన్వెస్ట్ చేసేందుకు అంగీకరించింది. ప్రమోటర్ల నుంచి మరో 11 శాతం దాకా వాటాలను రూ. 4,224 కోట్లకు కొనుగోలు చేయడానికి అంగీకరించింది‘ అని జీ ఒక ప్రకటనలో తెలిపింది. తమ సంస్థపై ఇన్వెస్కో ఫండ్‌కున్న నమ్మకాన్ని తాజా పెట్టుబడులు తెలియజేస్తున్నాయని జీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో పునీత్ గోయెంకా పేర్కొన్నారు. ఈ డీల్‌తో జీ లో ప్రమోటర్ల వాటా 23 శాతానికి తగ్గుతుంది. 2019 జూన్ నాటికి జీ లో ప్రమోటర్ల వాటా 35.79 శాతంగా ఉంది. ఇందులో 63.98 శాతం వాటాలు మ్యూచువల్ ఫండ్స్, ఇతర ఆర్థిక సంస్థల దగ్గర తనఖాలో ఉన్నాయి. బుధవారం షేరు ముగింపు ధరను బట్టి జీ మార్కెట్ విలువ రూ. 34,717 కోట్లు కాగా.. ఇందులో ప్రమోటర్ల వాటాల విలువ సుమారు రూ. 13,000 కోట్లుగా అంచనా. ఏడాదిగా ప్రమోటర్ల ప్రయత్నాలు.. సంస్థ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉందంటూ ఎస్సెల్ గ్రూప్ ప్రమోటరు సుభాష్ చంద్ర ఈ ఏడాది జనవరిలో రాసిన బహిరంగ లేఖతో కంపెనీ వాస్తవ స్థితిగతులు అధికారికంగా బైటపడ్డాయి. ఇన్ఫ్రా రంగంలో భారీగా పెట్టిన పెట్టుబడులు, వీడియోకాన్‌కు చెందిన డీ2హెచ్ వ్యాపారం కొనుగోలు లావాదేవీలు ప్రతికూలంగా మారాయని చంద్ర పేర్కొన్నారు. అయితే, బ్యాంకర్లు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు, మ్యూచువల్ ఫండ్స్ నుంచి పొందిన రుణాలన్నీ పూర్తిగా తీర్చేస్తామని ఆయన స్పష్టం చేశారు. సెప్టెంబర్ దాకా ఎటువంటి చర్యలూ తీసుకోకుండా రుణదాతలతో కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. వాస్తవానికి భారీగా పేరుకుపోతున్న రుణభారాన్ని తగ్గించుకునే దిశగా గ్రూప్ సంస్థల్లో వాటాలను విక్రయించేందుకు గతేడాది నవంబర్ నుంచీ ఎస్సెల్ గ్రూప్ ప్రమోటర్లు ప్రయత్నిస్తూనే ఉన్నారు. రుణాల రీపేమెంట్‌కు 2019 సెప్టెంబర్‌ను గడువుగా నిర్దేశించుకున్నారు. జీ లో తమకున్న వాటాల్లో దాదాపు 50 శాతం వాటాలు వ్యూహాత్మక భాగస్వామికి విక్రయించేందుకు ప్రమోటర్లు గతేడాది నవంబర్ నుంచి ప్రయత్నిస్తున్నారు. జీ లోనూ, ఇతరత్రా మీడియాయేతర అసెట్స్‌లో వాటాల కొనుగోలుకు వివిధ భాగస్వాముల నుంచి సానుకూల స్పందన కూడా వస్తున్నట్లు ఎస్సెల్ గ్రూప్ చెబుతూ వస్తోంది. తాజాగా ఇన్వెస్కో ఓపెన్‌హైమర్‌తో ఒప్పందం కుదరడం సంస్థకు కొంత ఊరటనివ్వనుంది. రూ. 7,000 కోట్లకు తగ్గనున్న రుణభారం.. బుధవారం నాటి జీ షేరు ముగింపు ధరతో పోలిస్తే ఇన్వెస్కో 10 శాతం ప్రీమియం చెల్లించనుంది. ఈ డీల్‌తో గ్రూప్ రుణ భారం రూ. 11,000 కోట్ల నుంచి రూ. 7,000 కోట్లకు తగ్గనుందని జీ సీఈవో, ఎండీ పునీత్ గోయెంకా తెలిపారు. జనవరిలో రూ. 13,000 కోట్లుగా ఉన్న రుణభారాన్ని అంతర్గత వనరుల సమీకరణ తదితర చర్యల ద్వారా ప్రస్తుతం రూ. 11,000 కోట్లకు తగ్గించుకున్నట్లు వివరించారు. షేరు 5 శాతం డౌన్.. బుధవారం మార్కెట్లు ముగిశాక డీల్ వెల్లడైంది. బీఎస్ఈలో జీ షేరు 5.2 శాతం క్షీణించి రూ. 361.45 వద్ద ముగిసింది. మిగతా అసెట్స్ విక్రయంపై దృష్టి.. రుణాల చెల్లింపుల ప్రక్రియ పూర్తి చేయడానికి ప్రమోటర్లకు అవసరమైన ఆర్థిక వెసులుబాటు ఈ డీల్‌తో లభించగలదని జీ మాతృసంస్థ ఎస్సెల్ గ్రూప్ పేర్కొంది. ఇతరత్రా అసెట్స్ విక్రయం దిశగా ఇది ముందడుగని తెలిపింది. మీడియాయేతర అసెట్స్‌నూ విక్రయించాలని ఎస్సెల్ గ్రూప్ యత్నిస్తున్న సంగతి తెలిసిందే. ‘తాజా పరిస్థితుల నేపథ్యంలో నిర్దేశించుకున్న సెప్టెంబర్ గడువులోగా రుణాల రీపేమెంట్ ప్రక్రియను పూర్తి చేయగలం‘ అని ఎస్సెల్ గ్రూప్ ధీమా వ్యక్తం చేసింది. -
జీలో 11 శాతం వాటా విక్రయం
సాక్షి, ముంబై : జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (జీల్) ప్రమోటర్ సుభాష్ చంద్ర ఎస్సెల్ గ్రూప్ వాటాను ఇన్వెస్కో ఒపెన్‌హైమర్ డెవలపింగ్ మార్కెట్స్ ఫండ్ విక్రయించారు. 11 శాతం వాటాను రూ .4,224 కోట్ల విలువకు కొనుగోలు చేసింది. ఈ ఫండ్‌కు ఇప్పటికే కంపెనీలో 8 శాతం వాటా ఉంది. తాజా కొనుగోలు తరువాత జీల్లో ఫండ్ మొత్తం వాటా 19 శాతానికి పెరిగింది. కాగా ప్రమోటర్ల వాటా 25 శాతానికి తగ్గుతుంది. ఈ వివరాలను మార్కెట్ ముగిసిన అనంతరం కంపెనీ వెల్లడించింది. జీల్ ఎండీ, సీఈవో పునీత్ గోయంకా మీడియాతో మాట్లాడుతూ ఆర్థిక పెట్టుబడిదారుగా కంపెనీపై నమ్మకం వుంచినందుకు సంతోషంగా ఉందన్నారు. ప్రమోటర్లు జీల్లో తమ వాటాను సగం (ఆ సమయంలో 42 శాతం) వ్యూహాత్మక పెట్టుబడిదారులకు విక్రయించడానికి ఉద్దేశించినట్లు ఎస్సెల్ గ్రూప్ నవంబర్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో, ఎస్సెల్ గ్రూప్ రుణదాతలు జీ ఎంటర్టైన్మెంట్, డిష్ టివి వంటి ఎస్సెల్ కంపెనీలలో వాటాలను అమ్మడం ప్రారంభించింది. సెప్టెంబరు 2019 నాటికి రుణదాతలందరికీ రూ.11వేల కోట్ల రుణాలను తిరిగి చెల్లించాలనేది ఎస్సెల్ గ్రూప్ లక్ష్యం. ఈ నేపథ్యంలోనే తాజా డీల్. కాగా ఈక్వీటీ షేరు సుమారు 400 చొప్పున కొనుగోలు చేయనుంది ఇన్వెస్కో. దీని ప్రభావం గురువారం నాటి ట్రేడింగ్‌లో కనిపించనుంది. -
జీ షేరు ఢమాల్ : కంపెనీ వివరణ
సాక్షి, ముంబై : ఎస్సాల్ గ్రూప్‌నకు చెందిన జీ ఎంటర్ప్రైజెస్ షేర్ల భారీ పతనం వరుసగా రెండో రోజు కూడా కొనసాగింది. 2019 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సంస్థ ఆర్థిక నివేదికల ఆడిట్, ప్లెడ్జ్డ్ (తనఖా) షేర్లు విక్రయంపైమంగళవారం నుంచి పుకార్లు చెలరేగడంతో ఇన్వెస్లర్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో బుధవారం జీ కౌంటర్ ఏకంగా 12 శాతానికి పైగా పతనమైంది. మరోవైపు ఈ పుకార్లను కొట్టి పారేసిన సంస్థ జీ ఎంటర్టైన్మెంట్లో ప్లెడ్జ్డ్ షేర్ల విక్రయం చోటు చేసుకోలేదని స్పష్టం చేసింది. అలాగే వాటా విక్రయ అంశం తుది దశకు చేరుకుందంటూ ఒక ప్రకటన విడుదల చేసింది. మరో 6-8 వారాల్లో ఈ విక్రయాన్ని పూర్తి చేస్తామని తెలిపింది. అయితే వివరాలను వెల్లడి చేయలేమని, రుణాలను తీర్చడానికే మొదటి ప్రాధాన్యత ఇస్తామని కంపెనీ సీఈవో పునీత్ గోయంకా స్పష్టం చేశారు. అలాగే షేరు విలువ అనూహ్య పతనం, వదంతులపై సెబీకి ఫిర్యాదు చేయనున్నామని గోయంకా తెలిపారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి స్టాండ్‌లోన్ ఫలితాలను మే 27వ తేదీన వెల్లడించ నున్నామన్నారు. కాగా రుణ సంక్షోభంలో చిక్కుకున్న కంపెనీని గట్టెక్కించేందుకు జీ ఎంటర్టైన్మెంట్లో 50 శాతం వాటాలను వ్యూహాత్మక భాగస్వామికి విక్రయిస్తామని సంస్థ ప్రమోటర్ సుభాష్ చంద్ర గత ఏడాది నవంబర్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో గత ఏడు నెలల కాలంగా జీ ఎంటర్ టైన్మెంట్ షేరు విలువ తీవ్ర ఒడిదుడుకుల మధ్య కొనసాగుతుంది. -
బ్లాక్‌స్టోన్ చేతికి ఎస్సెల్ ప్రోప్యాక్
ముంబై: అమెరికన్ ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం బ్లాక్‌స్టోన్ తాజాగా స్పెషాలిటీ ప్యాకేజింగ్ కంపెనీ ఎస్సెల్ ప్రోప్యాక్‌లో మెజారిటీ వాటాలు కొనుగోలు చేయనుంది. ఇందుకోసం సుమారు రూ.3,211 కోట్లు (462 మిలియన్ డాలర్లు) వెచ్చించనుంది. ఎఫ్ఎంసీజీ, ఫార్మా కంపెనీల్లో ఉపయోగించే లామినేటెడ్ ట్యూబ్స్‌ను ఎస్సెల్ ప్రోప్యాక్ తయారుచేస్తోంది. ఈ డీల్ రెండంచెల్లో ఉండనుంది. తొలి దశలో ప్రమోటరు అశోక్ గోయల్ ట్రస్ట్ నుంచి బ్లాక్‌స్టోన్ 51% వాటా కొనుగోలు చేస్తుంది. షేరు ఒక్కింటికి రూ.134 రేటుతో ఈ డీల్ విలువ సుమారు రూ.2,157 కోట్లుగా ఉంటుంది. రెండో దశలో మరో 26% వాటాలను కొనుగోలు చేసేందుకు బ్లాక్‌స్టోన్ ఓపెన్ ఆఫర్ ప్రకటిస్తుంది. ఒక్కో షేరుకి రూ.139.19 చొప్పున ఓపెన్ ఆఫర్ విలువ రూ.1,054 కోట్లుగా ఉంటుందని ఇరు సంస్థలు ఒక ప్రకటనలో తెలిపాయి. 37 ఏళ్ల క్రితం నెలకొల్పిన ఎస్సెల్ ప్రోప్యాక్‌కు 10 దేశాల్లో 20 పైగా ప్లాంట్లు, 3,150 మంది పైగా ఉద్యోగులు ఉన్నారు. ఏటా 700 కోట్ల ల్యామినేటెడ్ ట్యూబ్స్‌ను తయారు చేస్తోంది. ఓపెన్ ఆఫర్ సబ్స్క్రిప్షన్ ఆధారంగా ఎస్సెల్ ప్రోప్యాక్ కొనుగోలు విలువ రూ.2,157 కోట్ల నుంచి రూ. 3,211 కోట్ల దాకా ఉండవచ్చని బ్లాక్‌స్టోన్ సీనియర్ ఎండీ అమిత్ దీక్షిత్ చెప్పారు. ఎస్సెల్ గ్రూప్‌తో సంబంధం లేదు: అశోక్ గోయల్ దాదాపు రూ.17,174 కోట్ల రుణాల భారంతో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఎస్సెల్ గ్రూప్ ప్రమోటరు సుభాశ్ చంద్ర సోదరుడు అశోక్ గోయల్‌కు చెందినదే ఈ ఎస్సెల్ ప్రోప్యాక్. అశోక్ గోయల్ ట్రస్టుకు ఇందులో 57 శాతం వాటాలుండగా.. అందులో 51 శాతం వాటాలను బ్లాక్‌స్టోన్ కొనుగోలు చేస్తోంది. డీల్ ద్వారా వచ్చిన నిధులను ముంబైలో తాము నిర్వహిస్తున్న అమ్యూజ్మెంట్ పార్క్ ఎస్సెల్ వరల్డ్‌ను, వాటర్ కింగ్డమ్ను అభివృద్ధి చేసేందుకు వెచ్చిస్తామని, మరికొన్ని నిధులను దాతృత్వ కార్యకలాపాలకు ఉపయోగిస్తామని గోయల్ చెప్పారు. సోదరుడు సుభాశ్‌చంద్రకు చెందిన ఎస్సెల్ గ్రూప్ రుణభారం తగ్గించేందుకు ఈ నిధులేమైనా ఉపయోగిస్తారా అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. తమ సంస్థ ఎస్సెల్ గ్రూప్‌లో భాగం కాదని.. గోయల్ ట్రస్టుకు గానీ ఎస్సెల్ ప్రోప్యాక్‌కు గానీ దానితో ఎలాంటి వాణిజ్యపరమైన సంబంధాలు లేవని ఆయన తెలిపారు. ‘మాదంతా ఒకే కుటుంబం. ఒకరి బాగోగులు మరొకరు చూసుకుంటూ ఉంటాం. అయితే రెండు గ్రూపుల మధ్య ఆర్థిక, వాణిజ్య సంబంధాలు గానీ క్రాస్ హోల్డింగ్స్ గానీ లేవు‘ అని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఎండీగా ఉన్న అశోక్ గోయల్ ఒప్పందం పూర్తయ్యాక 6 శాతం వాటాలతో కంపెనీలో సలహాదారుగా కొనసాగుతారు. ఇందుకు గాను అయిదేళ్ల పాటు ఏటా రూ.16 కోట్లు అందుకుంటారు. డీల్ నేపథ్యంలో బీఎస్ఈలో సోమవారం ఎస్సెల్ ప్రోప్యాక్ షేరు 0.91 శాతం పెరిగి రూ. 132.65 వద్ద క్లోజయ్యింది. -
మీడియా షాక్ : కుప్పకూలిన స్టాక్‌మార్కెట్లు
సాక్షి, ముంబై: లాభాలతో ఉత్సాహంగా కొనసాగుతున్న స్టాక్‌మార్కెట్లు అకస్మాత్తుగా నష్టాల్లోకి జారుకున్నాయి. ముఖ్యంగా మీడియా షేర్లలో అమ్మకాల వెల్లువెత్తడంతో సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా కోల్పోయింది. డబుల్ సెంచరీ లాభాలతో మొదలైన మార్కెట్లు తిరిగి 200 పాయింట్లు కోల్పోయాయి. మొత్తంగా దలాల్ స్ట్రీట్ 400 పాయింట్లు కుప్పకూలింది. మీడియా ఏకంగా 13శాతం కుప్పకూలింది. ఇందులో ప్రధానంగా ఎస్సెల్ గ్రూప్ కౌంటర్లలో భారీగా అమ్మకాలు ఊపందుకోవడం మార్కెట్లను దెబ్బతీసింది. పెద్ద నోట్ల రద్దు కాలంలో జీ ఎంటర్టైన్మెంట్ యాజమాన్యం భారీగా అవకతవకలకు పాల్పడిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనికి తోడు వాటా కొనుగోలుకు సంబంధించి సోనీ, జీ ప్రమోటర్ అయిన ఎస్సెల్ గ్రూపుతో చర్చలు జరుపుతోందని వార్తలు తాజాగా వెలువడ్డాయి. దీంతో అమ్మకాలు జోరందుకున్నాయి. మీడియా కౌంటర్లలో జీ ఎంటర్టైన్మెంట్ 25 శాతం కుప్పకూలింది. దీంతో ఆల్‌టైం కనిష్టాన్ని తాకింది. డిష్ టీవీ 19 శాతం పతనమైంది. ఇంకా జీ మీడియా, సన్ టీవీ, ఈరోస్, టీవీ 18, జాగరణ్, పీవీఆర్, డీబీ కార్ప్ 6-2 శాతం మధ్య నష్టపోయాయి. మరోవైపు ఈ వార్తలపై స్పందించేందుకు సోనీ ప్రతినిధి నిరాకరించారు. అటు జీ ఎంటర్టైన్మెంట్ ప్రతినిధి స్పందిస్తూ ప్రస్తుతం దీనిపై ఏమీ వ్యాఖ్యానించలేమని, ఈనేపథ్యంలో ఎలాంటి ఊహాగానాలను, పుకార్లను వ్యాప్తి చేయవద్దని కోరారు. చర్చలు కీలక దశకు చేరుకున్నాక కంపెనీ చేసే అధికారిక ప్రకటన కోసం వేచి చూడాలని విజ్ఞప్తి చేశారు. కాగా గత ఏడాది నవంబరులో అంతర్జాతీయ వ్యూహాత్మక ప్రణాళిలో భాగంగా జీలో మేజర్ వాటాను విక్రయించనున్నామని ఎస్సెల్ గ్రూపు ప్రకటించడం గమనార్హం. -
వేలానికి హాయ్‌ల్యాండ్!
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ ఆస్తుల టేకోవర్ ప్రతిపాదన నుంచి ఎస్సెల్ గ్రూపునకు చెందిన సుభాష్‌చంద్ర ఫౌండేషన్ వెనక్కి తగ్గిన నేపథ్యంలో హైకోర్టు తాజాగా హాయ్‌ల్యాండ్ విక్రయంపై దృష్టి సారించింది. హాయ్‌ల్యాండ్‌ను వేలం వేయడం ద్వారా భారీగా డబ్బు సమకూరే అవకాశం ఉండటంతో ఆ దిశగా సన్నాహాలు చేస్తోంది. అగ్రిగోల్డ్ యాజమాన్యం హాయ్‌ల్యాండ్ భూములను తాకట్టు పెట్టి స్టేట్ బ్యాంక్ ఇండియా (ఎస్బీఐ) నుంచి రుణం తీసుకుంది. ఈ నేపథ్యంలో బహిరంగ మార్కెట్లో హాయ్‌ల్యాండ్ విలువ, అప్పుల వివరాలను తెలియచేయాలని ఎస్బీఐ తరఫు న్యాయవాదిని న్యాయస్థానం గురువారం ఆదేశించింది. హాయ్‌ల్యాండ్ వేలానికి తొలి ప్రాధాన్యం ఇస్తామని, దీనివల్ల డబ్బు సమకూరి డిపాజిటర్లకు మొదటి ఇన్స్టాల్మెంట్ కింద ఎంతో కొంత చెల్లించేందుకు ఆస్కారం ఉంటుందని అభిప్రాయపడింది. తెలుగు రాష్ట్రాల్లో అగ్రిగోల్డ్ ఆస్తుల విలువెంత? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అగ్రిగోల్డ్ ఆస్తుల వివరాలను జిల్లాల వారీగా విభజించి బహిరంగ మార్కెట్ విలువ, రియల్టీ విలువ, సబ్ రిజిష్ట్రార్ విలువను పట్టిక రూపంలో సమర్పించాలని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని, పిటిషనర్లను హైకోర్టు ఆదేశించింది. ఎవరికి వారు స్వతంత్రంగా ఈ వివరాలు సమర్పించాలని స్పష్టం చేసింది. వీటిని పరిశీలించి ఒక్కో ఆస్తి కనీస వేలం ధరను నిర్ణయిస్తామని తెలిపింది. ఇకపై అగ్రిగోల్డ్ ఆస్తులను జిల్లా కమిటీల ద్వారా ఏకకాలంలో వేలం వేస్తామని పేర్కొంది. మినహాయిస్తామని మొదటి రోజే చెప్పాం.. అగ్రిగోల్డ్ ఆస్తుల టేకోవర్ నుంచి వెనక్కి వెళ్లిపోతున్నామని, దీనికి అనుమతినిస్తూ తాము డిపాజిట్ చేసిన రూ.10 కోట్లను తిరిగి ఇవ్వాలని కోరుతూ సుభాష్‌చంద్ర ఫౌండేషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై నిర్ణయాన్ని హైకోర్టు వాయిదా వేసింది. అయితే మొత్తం రూ.10 కోట్లను వెనక్కి ఇచ్చే ప్రసక్తే లేదని, కొంత మినహాయించి మిగిలింది ఇస్తామని ప్రకటించింది. టేకోవర్ నుంచి వెనక్కి వెళ్లిపోయారన్న కారణంతో తాము ఈ పని చేయడం లేదని, ఎంతో కొంత మొత్తాన్ని మినహాయిస్తామని ఈ కేసులో ప్రతివాదిగా చేరిన మొదటి రోజే చెప్పామని గుర్తు చేసింది. ఆస్తుల టేకోవర్‌కు తాము శక్తివంచన లేకుండా కృషి చేశామని, తమ అదుపులో లేని కొన్ని పరిస్థితుల వల్ల వెనక్కి వెళ్లిపోతున్నామని, సుభాష్ చంద్ర ఫౌండేషన్ తరఫు సీనియర్ న్యాయవాది పి.శ్రీరఘురాం తెలిపారు. ఇక ప్రతి శుక్రవారం కేసు విచారణ అగ్రిగోల్డ్ ఆస్తుల విషయంలో ఫోరెన్సిక్ ఆడిట్‌కు సంబంధించి సీఐడీ నివేదికను తదుపరి విచారణ సమయంలో పరిశీలిస్తామని హైకోర్టు తెలిపింది. ఇకపై ఈ కేసును ప్రతి శుక్రవారం విచారించనున్నట్లు పేర్కొంటూ తదుపరి విచారణను ఈనెల 28వ తేదీకి వాయిదా వేసింది. అగ్రిగోల్డ్ డిపాజిటర్లు హైకోర్టులో దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై విచారణ జరిపిన న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఈమేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో మీ పాత్ర చాలా పరిమితం... వేలం నిమిత్తం అగ్రిగోల్డ్ ఆస్తుల్లో 50 వరకు గుర్తించినట్లు సీఐడీ తరఫున వాదనలు వినిపిస్తున్న ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) కృష్ణప్రకాశ్ జాబితాను కోర్టుకు సమర్పించారు. కొన్ని ఆస్తులకు సీఐడీ చెబుతున్న ధర చాలా తక్కువగా ఉందని అగ్రిగోల్డ్ తరఫు న్యాయవాది జానకిరామిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేయగా ధర్మాసనం స్పందిస్తూ కోర్టు ద్వారా జరిగే వేలంలో భూములకు తక్కువ ధరే వస్తుందని పేర్కొంది. ‘మీరు (అగ్రిగోల్డ్) మీ ఆస్తుల విలువ రూ.20 వేల కోట్లకు పైగా చెప్పారు. చివరకు అది రూ.2 వేల కోట్ల వద్ద ఆగిపోయింది. మీరు ఒక్క వేలందారుడిని కూడా తీసుకురాలేకపోయారు. ఇప్పుడు ఆస్తుల విలువ తక్కువగా ఉందంటున్నారు. ఈ కేసులో ఇకపై మీ పాత్ర చాలా పరిమితం. టేకోవర్ ప్రతిపాదన నుంచి వెనక్కివెళ్లిపోవడానికి మీరు కూడా కారణమని సుభాష్‌చంద్ర ఫౌండేషన్ చెబుతోంది’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగానే అగ్రిగోల్డ్ ఆస్తుల్లో అత్యంత విలువైన హాయ్‌ల్యాండ్ గురించి హైకోర్టు ఆరా తీసింది. -
అగ్రిగోల్డ్ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్ : అగ్రిగోల్డ్ కేసుకు సంబంధించి బుధవారం హైకోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. అగ్రిగోల్డు ఆస్తుల కొనుగోలు విషయంలో జిఎస్సెల్ గ్రూప్ వెనక్కి తగ్గింది. దీంతో పిటిషనర్ , కోర్టు విలువైన సమయాన్ని వృధా చేసినందుకు గానూ ఎస్సెల్ గ్రూప్‌పై ( సుభాష్ చంద్ర ఫౌండేషన్) పెనాల్టీ వేయాలని అఫిడవిట్ దాఖలు చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఎస్సెల్ గ్రూపుకు చివరి అవకాశం ఇచ్చారు. జూన్ 5 నాటికి రూ.1000 లేదా 1500 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశించారు. లేని పక్షంలో రూ.100 కోట్ల విలువ చేసే అగ్రిగోల్డ్ 10 ఆస్తులను గుర్తించి ప్రభుత్వం వేలం వేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తదుపరి విచారణను జూన్ 5కు హైకోర్టు వాయిదా వేసింది. -
అగ్రిగోల్డ్‌తో అగ్లీ గేమ్స్!
సాక్షి, అమరావతి : అగ్రిగోల్డ్ ఆస్తులను కారుచౌకగా కొట్టేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు వేస్తున్న ఎత్తులు డిపాజిటర్లను అవాక్కయ్యేలా చేస్తోంది. ఇన్నాళ్లూ అగ్రిగోల్డ్ సంస్థను స్వాధీనం చేసుకుని (టేకోవర్ చేసి) డిపాజిటర్లకు న్యాయం చేస్తామని నమ్మబలుకుతూ వచ్చిన ఎస్సెల్ గ్రూప్.. ఒక్కసారిగా మాట మార్చడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. అగ్రిగోల్డ్ ఆస్తుల విలువ రూ.4,262 కోట్లకు మించదని.. డిపాజిటర్లకు రూ.పది వేల కోట్లకుపైగా చెల్లించాల్సి ఉంటుందని.. ఈ నేపథ్యంలో ఆ సంస్థను టేకోవర్ చేయడం తమకు గిట్టుబాటు కాదని ఎస్సెల్ గ్రూప్ తేల్చిచెప్పింది. ఇదే క్రమంలో అగ్రిగోల్డ్ సంస్థ భూములను అభివృద్ది చేసి, విక్రయించడం ద్వారా డిపాజిటర్లకు న్యాయంచేసే అంశంపై రాష్ట్ర ప్రభుత్వంతో మాజీ ఎంపీ అమర్ సింగ్ చర్చలు జరుపుతున్నారని.. ఆ చర్చల ఫలితాలు వెల్లడయ్యే వరకూ గడువు ఇవ్వాలని ఎస్సెల్ గ్రూప్ హైకోర్టును కోరింది. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న వాటిలో విలువైన ఆస్తులను కాజేయడం, ఇప్పటికీ స్వాధీనం చేసుకోని వేలాది కోట్ల విలువ చేసే ఆస్తులను అప్పనంగా కొట్టేసే ఎత్తుగడలో భాగంగానే ఎస్సెల్ గ్రూప్‌తో కొత్త నాటకానికి తెరతీయించారనే అనుమానాలు వ్యక్తమ వుతున్నాయి. హోదా సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ముసుగులో ఈనెల 3, 4న ఢిల్లీలో పర్యటించిన చంద్ర బాబు.. తాను బసచేసిన ఏపీ భవన్‌లోనే అమర్‌సింగ్, ఎస్సెల్ గ్రూప్ సంస్థ ప్రతినిధులతో రహస్యంగా చర్చలు జరపడం వీటికి బలం చేకూర్చుతోంది. ముఖ్యనేత గుప్పెట్లో..: అగ్రిగోల్డ్ డిపాజిటర్లు దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు స్పందిస్తూ.. రిటైర్డు జడ్జి నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటుచేసి, ఆ సంస్థకు చెందిన స్థిర, చరాస్తులను వేలం వేసి, వారికి ఇవ్వాల్సిన మొత్తాన్ని చెల్లించాలని ఆదేశించింది. ఈ క్రమంలో అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని అరెస్టు చేయకుండా సీఐడీ విభాగాన్ని నిలువరించిన ప్రభుత్వ పెద్దలు.. ఉద్దేశపూర్వకంగా విలువైన ఆస్తులను, జప్తు చేయని వేలాది ఎకరాలను తమ గుప్పెట్లో పెట్టుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుంటూరు జిల్లాలో 85.13 ఎకరాల్లో విస్తరించిన హాయ్‌ల్యాండ్, విశాఖ యారాడ సముద్రతీరంలో 106.44 ఎకరాల్లో నిర్మించిన రిసార్టుపై ముఖ్యనేత కన్నేశారు. అందుకే వేలం వేసే ఆస్తుల జాబితా నుంచి వాటిని తప్పించారని డిపాజిటర్లు ఆరోపిస్తున్నారు. అలాగే.. హైకోర్టు నేతృత్వంలో నిర్వహించే వేలం ప్రక్రియకు సహకరించకుండా సర్కార్ పెద్దలు చక్రం తిప్పారు. దీంతో చంద్రబాబు దన్నుతో మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలూ చెలరేగిపోయారు. ఆ సంస్థల ఆస్తులపై కన్నేశారు. కేసు నమోదై 21 నెలలు గడుస్తున్నా అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని అరెస్టు చేయకపోవడంపై హైకోర్టు తప్పుబట్టడంతో గత్యంతరంలేక ఐదుగురిని అరెస్టుచేశారు. కీలకమైన అవ్వా సీతారాంతోపాటూ 24 మంది డైరెక్టర్లను ఇప్పటికీ అరెస్టు చేయకపోవడం గమనార్హం. బిగ్‌బాస్..అదిరిపోయే ప్లాన్: ఆస్తుల వేలం ప్రక్రియను హైకోర్టు కొనసాగిస్తున్న క్రమం లో.. విలువైన ఆస్తులు చేజారిపోతాయని గ్రహించిన ముఖ్యనేత పావులు కదిపారు. ఈ క్రమంలోనే అగ్రిగోల్డ్‌ను టేకోవర్ చేసుకుని డిపాజిటర్లకు న్యాయం చేసేందుకు ఎస్సెల్ గ్రూప్ ముందుకొచ్చిందంటూ ఓ వర్గం మీడియాకు లీకులు ఇచ్చారు. ఆ తర్వాత ఎస్సెల్ గ్రూప్ తరపున మాజీ ఎంపీ అమర్‌సింగ్ సీఎం చంద్రబాబుతో రాయ‘బేరాలు’ జరిపారు. అనంతరం అగ్రిగోల్డ్ సంస్థను తాము టేకోవర్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని.. డిపాజిటర్లకు చెల్లించేందుకు రూ.రెండు వేల కోట్లను డిపాజిట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఎస్సెల్ గ్రూప్ హైకోర్టుకు విన్నవించింది. మరోవైపు.. దేశవ్యాప్తంగా అగ్రిగోల్డ్‌కు 18,395.74 ఎకరాల భూమి, 95,157.07 చదరపు గజాల అత్యంత విలువైన స్థలాలు ఉన్నట్లు సీఐడీ తేల్చింది. ఈ ఆస్తుల విలువ పది వేల కోట్లకుపైగా ఉంటుందని లెక్కకట్టింది. కానీ.. బహిరంగ మార్కెట్లో ఈ ఆస్తుల విలువ రూ.35 వేల కోట్లకుపైనే ఉంటుందని అంచనా. కాగా, అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు వడ్డీతో సహా చెల్లించాల్సింది రూ.పది వేల కోట్లలోపే ఉంటుందని సీఐడీ అధికార వర్గాలు చెబుతున్నాయి. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. అగ్రిగోల్డ్‌ను టేకోవర్ చేసిన సంస్థకు భారీఎత్తున లాభాలు వస్తాయని ఆర్థిక నిపుణులు స్పష్టీకరించారు. కానీ.. ఎస్సెల్ గ్రూప్ కొత్త పల్లవి అందుకుంది. ఆర్థికంగా గిట్టుబాటు కాదంటూ హైకోర్టుకు ఇటీవల నివేదించింది. ఆస్తుల విలువ అంటే రూ.4,262 కోట్లలో కేవలం 40 శాతం నిధులను డిపాజిటర్లకు ఇచ్చేందుకు డిపాజిట్ చేయగలమని ఓవైపు చెప్పిన ఎస్సెల్ గ్రూప్.. మరోవైపు అగ్రిగోల్డ్ ఆస్తులను అభివృద్ధి చేసి, విక్రయించడం ద్వారా డిపాజిటర్లకు న్యాయం చేసే ప్రతిపాదనపై మాజీ ఎంపీ అమర్‌సింగ్ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారని పేర్కొంది. ఆ చర్చల ఫలితాలు వెల్లడయ్యే వరకూ గడువు ఇవ్వాలని హైకోర్టును కోరడం గమనార్హం. రహస్య ఒప్పందంలో భాగంగానే.. అగ్రిగోల్డ్ ఆస్తుల విలువను ఎస్సెల్ గ్రూప్ కొద్ది నెలల్లోనే రూ.4,262 కోట్లకు తగ్గించి చూపడంపై సీఐడీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. సీఎంతో కుదిరిన రహస్య ఒప్పందంలో భాగంగానే ఈ విలువను ఎస్సెల్ గ్రూప్ తగ్గించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అగ్రిగోల్డ్‌కు చెందిన విలువైన భూములను తక్కువ ధరకు పొందేందుకు వాటి విలువను తక్కువగా చూపించారనే విమర్శలున్నాయి. కృష్ణా జిల్లా కీసరలో 324.06 ఎకరాల భూమిని ఓ మంత్రి, నూజివీడు మండలం రామన్నగూడెంలో 110.65 ఎకరాల విలువైన భూమిని మరో కీలక మంత్రి, వీరుపాలడు మండలం చింతవరంలో 54.67 ఎకరాల భూమిని కేంద్ర మాజీమంత్రి ఒకరు తక్కువ ధరకు కాజేసేందుకే వేలం ప్రక్రియను అడ్డుకున్నారని ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు. చంద్రబాబు హయాంలోనే ప్రారంభం రాష్ట్రంలో 1995లో అగ్రిగోల్డ్ సంస్థ పురుడుపోసుకుంది. దీని అక్రమాలను ఆదిలోనే పసిగట్టిన సెబీ (సెక్యూరిటీ అండ్ ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) తక్షణమే లావాదేవీలు నిలిపేయాలంటూ మార్చి 31, 1998న నోటీసులిచ్చింది. నాటి చంద్రబాబు ప్రభుత్వాన్నీ అప్రమత్తం చేసింది. అప్పటికి అగ్రిగోల్డ్ సేకరించిన డిపాజిట్లు రూ.13.50 కోట్లే. సెబీ మార్గదర్శకాల మేరకు చంద్రబాబు అగ్రిగోల్డ్‌పై చర్యలు తీసుకోవాల్సింది పోయి దన్నుగా నిలిచారు. 83 అనుబంధ సంస్థల పేర్లతో 2004 నాటికే రూ.6,500 కోట్లకుపైగా డిపాజిట్లను సేకరించింది. 2014 నాటికి డిపాజిట్లు 6,850 కోట్లకు చేరుకున్నాయి. డిపాజిటర్లకు గడువు మీరినా చెల్లింపులు చేయకపోవడంతో అలజడి మొదలైంది. అగ్రిగోల్డ్ యాజమాన్యం డిపాజిట్లు చెల్లించడంలేదని ఓ డిపాజిటర్ ఫిర్యాదు చేయడంతో డిసెంబర్ 24, 2014న నెల్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ కొందరు హైకోర్టుకు వెళ్లారు. దీంతో అగ్రిగోల్డ్ ఆస్తులు తమ చెప్పుచేతల్లో నుంచి వెళ్లకుండా ఉండేందుకు జనవరి 5, 2015న రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. అనంతరం రాష్ట్ర పరిధిలోని 16,857.81 ఎకరాల భూమిని మాత్రమే జప్తుచేస్తూ ఫిబ్రవరి 20, 2015న ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. రాష్ట్రంతోపాటూ కర్ణాటక, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లలో అగ్రిగోల్డ్ అనుబంధ సంస్థలు, ఆ సంస్థల డైరెక్టర్లు డిపాజిటర్ల నుంచి సేకరించిన నిధులతో వ్యక్తిగత పేర్లపై కొన్న ఆస్తులను జప్తు చేయకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించి.. వాటిని సొంతం చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే.. 1998లో సెబీ ఆదేశాల మేరకు అగ్రిగోల్డ్‌పై చర్యలు తీసుకుని ఉంటే అక్రమాల పర్వం రూ.13.50 కోట్లకే పరిమితమయ్యేది. కానీ, చర్యలు తీసుకోకుండా ఆ సంస్థకు అండగా నిలబడటంవల్లే లక్షలాది మంది డిపాజిటర్లకు అన్యాయం జరిగింది. -
అగ్రిగోల్డ్ తీరుపై హైకోర్టు అసహనం
-
టేకోవర్‌పై తేల్చుకోండి
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అగ్రిగోల్డ్ టేకోవర్‌కు ముందుకొచ్చిన ఎస్సెల్ గ్రూపు తీరుపై తీవ్ర అసంతృప్తి, అసహనాన్ని వ్యక్తం చేసిన హైకోర్టు అసలు టేకోవర్‌పై ముందుకు వెళతారా లేదా పక్కకు తప్పుకుంటారో తేల్చి చెప్పాలని ఆదేశించింది. అగ్రిగోల్డ్ ఆస్తుల యాజమాన్యపు హక్కులపై అభ్యంతరాలు తెలపటంపై పత్రికా ప్రకటనల జారీకి అనుమతినివ్వాలన్న ఎస్సెల్ గ్రూప్ అభ్యర్థన ను తోసిపుచ్చింది. ఈ దశలో ప్రకటనల జారీకి అనుమతినివ్వలేదని స్పష్టం చేసింది. అభ్యంతరాలను కోరితే పరిస్థితి జటిలమై కేసు పురోగతికి తీవ్ర అడ్డంకిగా మారుతుందని పేర్కొంది. కంపెనీ ఆస్తి, అప్పుల మదింపు ప్రక్రియ తరువాత కావాలంటే పత్రికా ప్రకటనలు ఇచ్చుకోవచ్చునని తెలిపింది. పత్రికా ప్రకటన జారీకి అనుమతినివ్వని పక్షంలో ముందుకెళ్లడం కష్టసాధ్యమని ఎస్సెల్ గ్రూపు పేర్కొనటంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి, అసహనాన్ని వ్యక్తం చేసింది. టేకోవర్‌పై ఏదో ఒకటి తేల్చి చెప్పాలని సూచించింది. ఒకవేళ తప్పుకోవాలని భావిస్తే తదుపరి విచారణ కంటే ముందే మెమో రూపంలో తెలియచేయాలని ఆదేశించింది. దాని ఆధారంగా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి ఆస్తుల వేలం ప్రక్రియను కొనసాగిస్తామంది. అగ్రిగోల్డ్ ఆస్తులు మాత్రమే తీసుకుంటారా? లేక కంపెనీలు మాత్రమే టేకోవర్ చేస్తారా? లేక అన్నీ కలిపి తీసుకుంటారా? అనే విషయంలో పూర్తిస్థాయిలో స్పష్టతనివ్వాలని ఎస్సెల్ గ్రూపును ఆదేశిస్తూ తదుపరి విచారణను జనవరి 18వతేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అగ్రిగోల్డ్ ఆస్తుల కేసులో తమను ప్రతివాదిగా చేర్చుకోవాలన్న ఎస్సెల్ గ్రూపు తరఫు సీనియర్ న్యాయవాది పి.శ్రీరఘురాం వినతిని ఈ సందర్భంగా ధర్మాసనం ఆమోదించింది. అగ్రిగోల్డ్ యజమానులను కలిసేందుకు సీఏలకు అనుమతి మరోవైపు ఏలూరు జైల్లో ఉన్న అగ్రిగోల్డ్ యజమానులను కలిసేందుకు కంపెనీ చార్టర్డ్ అకౌంటెంట్లను అనుమతించాలని జైలు అధికారులను ధర్మాసనం ఆదేశించింది. ఇదిలా ఉండగా అక్షయ గోల్డ్ కేసు జనవరి 18కి వాయిదా పడింది. డిపాజిటర్లకు ఎలా చెల్లిస్తారు? ఎవరు చెల్లిస్తారు? తదితర వివరాలను తదుపరి విచారణ నాటికి తమ ముందుంచాలని అక్షయ గోల్డ్ తరఫు న్యాయవాదిని ధర్మాసనం ఆదేశించింది. -
అగ్రిగోల్డ్ ఆస్తులు ఎస్సెల్ గ్రూప్‌కు ఇచ్చేద్దామా!
మంత్రివర్గ భేటీలో సీఎం మంతనాలు సాక్షి, అమరావతి: లక్షల మందిని నట్టేట ముంచిన అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులను ఎస్సెల్ గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్రకు (జీ మీడియా గ్రూపు మాజీ చైర్మన్) కట్టబెట్టేందుకు చంద్రబాబుమంతనాలు సాగిస్తున్నారు. శనివారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చ జరిగినట్లు సమాచారం. అగ్రిగోల్డ్ కేసు పురోగతికి సంబం ధించిన వివరాలను ఏసీబీ అధికారులు మంత్రివర్గం ముందుంచిన తర్వాత సంస్థకు సంబంధించిన ఆస్తులు చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఈ సమయంలో ఆస్తులన్నింటినీ ఒకే సంస్థ లేదా వ్యక్తికి అమ్మేస్తే ఇబ్బందులుండవని ముఖ్యమంత్రి చెప్పారు. పెద్ద మొత్తం వెచ్చించి ఎవరు కొంటారనే ప్రశ్న రాగా.. ఎస్సెల్ గ్రూప్ సిద్ధంగా ఉందని చంద్రబాబు అన్నారని తెలిసింది. నాలుగు రోజుల క్రితం ఆయన తన వద్దకు వచ్చి ఈ ఆస్తుల కొనుగోలు అంశంపై చర్చించారని, దీనిపై త్వరలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు తెలిసింది. -
క్రికెట్లో మరో కొత్త లీగ్ !
* ఇండియన్ చాంపియన్స లీగ్ పేరుతో సన్నాహకాలు * ఇంకా లభించని ఐసీసీ అనుమతి న్యూఢిల్లీ: దాదాపు దశాబ్దం క్రితం ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసీఎల్) పేరుతో ఎస్సెల్ గ్రూప్ చేసిన హడావిడి గుర్తుందిగా! పలువురు అగ్రశ్రేణి ఆటగాళ్ళతో పాటు కొత్తగా రిటైరైన స్టార్లతో జరిగిన ఆ లీగ్ కొద్ది రోజులు వార్తల్లో నిలిచింది. అయితే ఐసీసీ, బీసీసీఐ దీనిని గుర్తించడానికి నిరాకరించడంతో లీగ్‌ను నిర్వాహకులు రద్దు చేయక తప్పలేదు. ఆ తర్వాత మొదలైన ఐపీఎల్ ప్రభంజనం ఎలా సాగుతుందో మనకు తెలుసు. ఇప్పుడు మరోసారి కొత్తగా భారత్‌లో ప్రైవేట్ క్రికెట్ లీగ్‌కు రంగం సిద్ధం అవుతోంది. ఇండియన్ చాంపియన్స లీగ్ (ఐసీఎల్) టి20 పేరుతో ఈ కొత్త టోర్నీ రానుంది. మ్యాగ్‌పై అనే సంస్థ ఈ టోర్నమెంట్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఈ సంస్థలో భాగస్వామి అయిన మనీశ్ కుమార్ చౌదరి ఐసీఎల్ వివరాలను వెల్లడించారు. ఎనిమిది జట్లతో దుబాయ్‌లో ఐసీఎల్ నిర్వహించాలని భావిస్తున్నారు. డిసెంబర్ 25నుంచి జనవరి 25 మధ్య మొత్తం 47 మ్యాచ్‌లు జరుగుతాయి. ఢిల్లీ బాద్షా, ఇండోర్ రాకెట్స్, ముంబై స్టార్, చెన్నై వారియర్స్, హైదరాబాద్ రైడర్స్, బెంగళూర్ టైగర్స్, లక్నో సూపర్ స్టార్, చండీగఢ్ హీరోస్ అనే జట్ల పేర్లు ప్రస్తుతానికి ప్రచారంలో ఉన్నాయి. ఇంకా అధికారికంగా ఖరారు కాకపోయినా... రవి బొపారా, డస్కటే, సీన్ విలియమ్స్, పార్నెల్, జయసూర్య, వాస్, కనేరియా, సల్మాన్ బట్లతో నిర్వాహకులు ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. అటు వైపు వెళ్లవద్దు... ఐసీఎల్ టోర్నీకి ఐసీసీనుంచి ఎలాంటి అనుమతి లేదు. అరుుతే తాము ఇప్పటికే టోర్నీ గుర్తింపు కోసం ప్రయత్నాలు ప్రారంభించామని, త్వరలోనే దుబాయ్‌లో ఐసీసీతో సమావేశం అవుతామని నిర్వాహకులు చెబుతున్నారు. మరో వైపు కొత్త లీగ్‌లో సంతకాలు చేసి తమ కెరీర్‌ను పాడు చేసుకోవద్దని అంతర్జాతీయ క్రికెటర్ల సంఘాల సమాఖ్య (ఫికా) ఆటగాళ్లను హెచ్చరించింది. ఐసీఎల్ టి20కి ఇంకా ఐసీసీ గుర్తింపు లేదని, అలాంటి చోట ఆడటం నిబంధనలకు విరుద్ధమని గుర్తు చేసింది. అరుుతే కొంత మంది ఆటగాళ్లు కూడా గత ఐసీఎల్ అనుభవంతో ఇలాంటి ప్రైవేట్ లీగ్‌లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. -
ప్రసార హక్కులు సమస్య కాదు : షహర్యార్‌ఖాన్
న్యూఢిల్లీ : భారత్, పాకిస్తాన్ మధ్య సిరీస్ నిర్వహణకు ప్రసారకర్తల వివాదం అడ్డంకిగా మారబోదని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ షహర్యార్ ఖాన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఐపీఎల్‌కు పోటీగా రానున్న ఎసెల్ గ్రూప్‌కు చెందిన టెన్‌స్పోర్ట్స్ ఈ టోర్నీ హక్కులు తీసుకోనుందని, దీనిపై బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న ఆయన, బోర్డు పెద్దలు దాల్మియా, జైట్లీ, ఠాకూర్లతో వరుసగా సమావేశమయ్యారు.