అగ్రిగోల్డ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అగ్రిగోల్డ్ టేకోవర్‌కు ముందుకొచ్చిన ఎస్సెల్ గ్రూపు తీరుపై తీవ్ర అసంతృప్తి, అసహనాన్ని వ్యక్తం చేసిన హైకోర్టు అసలు టేకోవర్‌పై ముందుకు వెళతారా లేదా పక్కకు తప్పుకుంటారో తేల్చి చెప్పాలని ఆదేశించింది. అగ్రిగోల్డ్ ఆస్తుల యాజమాన్యపు హక్కులపై అభ్యంతరాలు తెలపటంపై పత్రికా ప్రకటనల జారీకి అనుమతినివ్వాలన్న ఎస్సెల్ గ్రూప్ అభ్యర్థన ను తోసిపుచ్చింది. ఈ దశలో ప్రకటనల జారీకి అనుమతినివ్వలేదని స్పష్టం చేసింది. అభ్యంతరాలను కోరితే పరిస్థితి జటిలమై కేసు పురోగతికి తీవ్ర అడ్డంకిగా మారుతుందని పేర్కొంది. కంపెనీ ఆస్తి, అప్పుల మదింపు ప్రక్రియ తరువాత కావాలంటే పత్రికా ప్రకటనలు ఇచ్చుకోవచ్చునని తెలిపింది.