హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలతో కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న ఫార్మా రంగ కంపెనీ వినతీ ఆర్గానిక్స్ కౌంటర్‌కు మరోసారి డిమాండ్ కనిపిస్తోంది. అయితే మరోవైపు పీఈ దిగ్గజం బ్లాక్‌స్టోన్ వాటాను విక్రయించనున్నట్లు వెల్లడికావడంతో ప్యాకేజింగ్ దిగ్గజం ఎస్సెల్ ప్రొప్యాక్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి వినతీ ఆర్గానిక్స్ షేరు భారీ లాభాలతో సందడి చేస్తుంటే.. ఎస్సెల్ ప్రొప్యాక్ నష్టాలతో కళ తప్పింది. వివరాలు ఇలా..
వినతీ ఆర్గానిక్స్
లాక్‌డవున్‌ల నేపథ్యంలోనూ ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో జోరందుకున్న వినతీ ఆర్గానిక్స్ మరోసారి దూకుడు చూపుతోంది. ఎన్‌ఎస్‌ఈలో తొలుత వినతీ షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 1355ను తాకింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 3 శాతం లాభంతో రూ. 1325 వద్ద ట్రేడవుతోంది. గత వారం రోజుల్లోనే వినతీ షేరు 36 శాతం దూసుకెళ్లడం విశేషం! ఈ ఏడాది క్యూ1లో నికర లాభం 12 శాతమే క్షీణించి రూ. 72 కోట్లను తాకగా.. మొత్తం ఆదాయం సైతం స్వల్పంగా తగ్గి రూ. 232 కోట్లకు చేరింది. అయితే ఇబిటా మార్జిన్లు 0.7 శాతం బలపడి 42 శాతంగా నమోదయ్యాయి. క్యూ2 ఫలితాలపై ఆశావహ అంచనాలు ఈ కౌంటర్‌కు జోష్‌నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.
ఎస్సెల్ ప్రొప్యాక్
లామినేటెడ్ ట్యూబ్స్ ప్యాకేజింగ్ దిగ్గజం ఎస్సెల్ ప్రొప్యాక్‌లో మెజారిటీ వాటా కలిగిన బ్లాక్‌స్టోన్ సంస్థ ఎప్సిలాన్ బిడ్కో 23 శాతం వాటాను విక్రయించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఎస్సెల్ ప్రొప్యాక్‌లో ఎప్సిలాన్‌కు 75 శాతం వాటా ఉంది. ఇందుకు రూ. 225 ఫ్లోర్ ధరను నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. బ్లాక్‌డీల్స్ ద్వారా 7.25 కోట్ల షేర్లను బ్లాక్‌స్టోన్ సంస్థ విక్రయించనున్నట్లు వివరించాయి. తద్వారా బ్లాక్‌స్టోన్ రూ. 1850 కోట్లు సమకూర్చుకునే వీలుంది. ఈ నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఎస్సెల్ ప్రొప్యాక్ షేరు 6.25 శాతం పతనమై రూ. 256 దిగువన ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 252 దిగువకూ చేరింది. కాగా.. నేటి ట్రేడింగ్‌లో తొలి గంటన్నరలోనే బీఎస్‌ఈలో 7.68 కోట్లకుపైగా షేర్లు చేతులు మారినట్లు నిపుణులు పేర్కొన్నారు. గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 22,400 షేర్లు మాత్రమేకావడం గమనార్హం. తద్వారా బ్లాక్‌స్టోన్ గ్రూప్ 23 శాతం వాటాను విక్రయించినట్లు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment