PE companies
-
అమ్మకానికి సువెన్ ఫార్మా!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కంపెనీ అమ్మకం లేదా మెజారిటీ వాటా విక్రయానికి సువెన్ ఫార్మాస్యూటికల్స్ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. మెజారిటీ వాటా అమ్మకం విషయమై సలహా కోసం ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్‌ను నియమించు కున్నట్టు తెలుస్తోంది. కంపెనీని విక్రయించేందుకు ప్రైవేట్ ఈక్విటీ, వ్యూహాత్మక సంస్థలతో చర్చలు జరుగుతున్నాయి. సువెన్ ఫార్మాస్యూటికల్స్‌లో ప్రమోటర్లకు 60 శాతం వాటా ఉంది. డీల్ ద్వారా వచ్చే మొత్తాన్ని సువెన్ లైఫ్ సైన్సెస్‌లో ఔషధాల అభివృద్ధికి ఖర్చు చేయనున్నారు. ఇప్పటి వరకు సువెన్ ఫార్మా నుంచి డివిడెండ్ రూపంలో సమకూరిన మొత్తాన్ని ప్రమోటర్లు ఇందుకోసం వ్యయం చేశారు. సువెన్ లైఫ్ నుంచి 2020లో సువెన్ ఫార్మా విడిపోయింది. క్రితం ముగింపుతో పోలిస్తే సువెన్ ఫార్మాస్యూటికల్స్ షేరు ధర బీఎస్ఈలో బుధవారం 1.52 శాతం ఎగసి రూ.491.10 వద్ద స్థిరపడింది. -
గ్రాన్యూల్స్‌పై పీఈ దిగ్గజాల కన్ను!
ఫార్మా రంగ హైదరాబాద్ కంపెనీ గ్రాన్యూల్స్ ఇండియాలో మెజారిటీ వాటా కొనుగోలుకి గ్లోబల్ పీఈ సంస్థలు కేకేఆర్, బెయిన్ క్యాపిటల్, బ్లాక్‌స్టోన్ ఆసక్తిని చూపుతున్నట్లు తెలుస్తోంది. ఏపీఐ, కాంట్రాక్ట్ రీసెర్చ్ అండ్ మ్యాన్యుఫాక్చరింగ్ కంపెనీ గ్రాన్సూల్స్ ఇండియాను కొనుగోలు చేసేందుకు పీఈ దిగ్గజాలు ప్రాథమిక ఆసక్తిని వ్యక్తం చేసినట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. ఈ మూడు పీఈ దిగ్గజాలూ నాన్‌బైండింగ్ బిడ్స్‌ను దాఖలు చేసినట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. కంపెనీలో మెజారిటీ వాటా విక్రయం కోసం గ్రాన్యూల్స్ ఇండియా ప్రమోటర్లు కొటక్ మహీంద్రా క్యాపిటల్‌ను ఎంపిక చేసుకున్నట్లు వెల్లడించింది. ఇతర వివరాలు చూద్దాం.. షేరు జూమ్ ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న ఫార్మా కంపెనీ గ్రాన్యూల్స్ ఇండియా కౌంటర్‌కు తాజాగా డిమాండ్ కనిపిస్తోంది. ఎన్ఎస్ఈలో తొలుత ఈ షేరు 9.4 శాతం దూసుకెళ్లి రూ. 395ను తాకింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 4 శాతం లాభంతో రూ. 375 వద్ద ట్రేడవుతోంది. కాగా.. పారాసెట్మల్ ఔషధ తయారీలో ప్రపంచస్థాయి కంపెనీగా గ్రాన్యూల్స్ నిలుస్తున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. కోవిడ్-19 నేపథ్యంలో ఈ ఏడాది క్యూ1లో కంపెనీ ఆకర్షణీయ ఫలితాలు సాధించినట్లు నిపుణులు తెలియజేశారు. ఇందుకు మెట్ఫార్మిన్, పారాసెట్మల్, ఇబుప్రోఫిన్ వంటి ఔషధాలకు ఏర్పడిన డిమాండ్ కారణమైనట్లు పేర్కొన్నారు. జూన్‌కల్లా కంపెనీలో ప్రమోటర్లు 42.13 శాతం వాటాను కలిగి ఉన్నారు. గ్రాన్యూల్స్‌లో మెజారిటీ వాటా కోసం పీఈ దిగ్గజాల మధ్య పోటీ నెలకొనే వీలున్నట్లు ఈ సందర్భంగా నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే గ్రాన్యూల్స్ కంపెనీ ప్రతినిధి ఈ అంశాలపై స్పందిస్తూ.. మార్కెట్ అంచనాలపై మాట్లాడబోమన్నారు. అవసరమైనప్పుడు సెబీ నిబంధనలకు అనుగుణంగా స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమాచారాన్ని అందించగలమని స్పష్టం చేశారు. పీఈ హవా ముంబై ఫార్మా కంపెనీ జేబీ కెమికల్స్‌లో 54 శాతం వాటాను సొంతం చేసుకునేందుకు 2020 జులైలో పీఈ దిగ్గజం కేకేఆర్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందుకు రూ. 3,100 కోట్లను వెచ్చించనుంది. ఐపీవో యోచనను వాయిదా వేసిన పుణే కంపెనీ ఎమ్క్యూర్ ఫార్మాలో గతంలోనే బెయిన్ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక మరోపక్క దేశీయంగా రియల్టీ రంగంలో బ్లాక్‌స్టోన్ గ్రూప్ పలు వాణిజ్య ప్రాజెక్టులను కలిగి ఉంది. వెరసి పీఈ కంపెనీలు దేశీ కంపెనీలలో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. -
వినతీ కొత్త రికార్డ్- ఎస్సెల్ ప్రొ పతనం
హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలతో కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న ఫార్మా రంగ కంపెనీ వినతీ ఆర్గానిక్స్ కౌంటర్‌కు మరోసారి డిమాండ్ కనిపిస్తోంది. అయితే మరోవైపు పీఈ దిగ్గజం బ్లాక్‌స్టోన్ వాటాను విక్రయించనున్నట్లు వెల్లడికావడంతో ప్యాకేజింగ్ దిగ్గజం ఎస్సెల్ ప్రొప్యాక్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి వినతీ ఆర్గానిక్స్ షేరు భారీ లాభాలతో సందడి చేస్తుంటే.. ఎస్సెల్ ప్రొప్యాక్ నష్టాలతో కళ తప్పింది. వివరాలు ఇలా.. వినతీ ఆర్గానిక్స్ లాక్‌డవున్‌ల నేపథ్యంలోనూ ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో జోరందుకున్న వినతీ ఆర్గానిక్స్ మరోసారి దూకుడు చూపుతోంది. ఎన్ఎస్ఈలో తొలుత వినతీ షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 1355ను తాకింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 3 శాతం లాభంతో రూ. 1325 వద్ద ట్రేడవుతోంది. గత వారం రోజుల్లోనే వినతీ షేరు 36 శాతం దూసుకెళ్లడం విశేషం! ఈ ఏడాది క్యూ1లో నికర లాభం 12 శాతమే క్షీణించి రూ. 72 కోట్లను తాకగా.. మొత్తం ఆదాయం సైతం స్వల్పంగా తగ్గి రూ. 232 కోట్లకు చేరింది. అయితే ఇబిటా మార్జిన్లు 0.7 శాతం బలపడి 42 శాతంగా నమోదయ్యాయి. క్యూ2 ఫలితాలపై ఆశావహ అంచనాలు ఈ కౌంటర్‌కు జోష్‌నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఎస్సెల్ ప్రొప్యాక్ లామినేటెడ్ ట్యూబ్స్ ప్యాకేజింగ్ దిగ్గజం ఎస్సెల్ ప్రొప్యాక్‌లో మెజారిటీ వాటా కలిగిన బ్లాక్‌స్టోన్ సంస్థ ఎప్సిలాన్ బిడ్కో 23 శాతం వాటాను విక్రయించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఎస్సెల్ ప్రొప్యాక్‌లో ఎప్సిలాన్‌కు 75 శాతం వాటా ఉంది. ఇందుకు రూ. 225 ఫ్లోర్ ధరను నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. బ్లాక్‌డీల్స్ ద్వారా 7.25 కోట్ల షేర్లను బ్లాక్‌స్టోన్ సంస్థ విక్రయించనున్నట్లు వివరించాయి. తద్వారా బ్లాక్‌స్టోన్ రూ. 1850 కోట్లు సమకూర్చుకునే వీలుంది. ఈ నేపథ్యంలో ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఎస్సెల్ ప్రొప్యాక్ షేరు 6.25 శాతం పతనమై రూ. 256 దిగువన ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 252 దిగువకూ చేరింది. కాగా.. నేటి ట్రేడింగ్‌లో తొలి గంటన్నరలోనే బీఎస్ఈలో 7.68 కోట్లకుపైగా షేర్లు చేతులు మారినట్లు నిపుణులు పేర్కొన్నారు. గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 22,400 షేర్లు మాత్రమేకావడం గమనార్హం. తద్వారా బ్లాక్‌స్టోన్ గ్రూప్ 23 శాతం వాటాను విక్రయించినట్లు చెబుతున్నారు. -
రిలయన్స్ రిటైల్‌లో కార్లయిల్‌కు వాటా!
డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ విభాగం రిలయన్స్ రిటైల్‌లో మరో పీఈ దిగ్గజం కార్లయిల్ గ్రూప్ వాటా కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా రిలయన్స్ రిటైల్‌లో 150-200 కోట్ల డాలర్ల(సుమారు రూ. 14,700 కోట్లు) వరకూ కార్లయిల్ గ్రూప్ ఇన్వెస్ట్ చేయవచ్చని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. ఇందుకు రెండు కంపెనీల మధ్య చర్చలు నడుస్తున్నట్లు విశ్లేషకులు ఊహిస్తున్నారు. అయితే ఈ అంశంపై అటు ఆర్ఐఎల్, ఇటు కార్లయిల్ గ్రూప్ ప్రతినిధులు స్పందించలేదంటూ ఈ వార్తల విశ్లేషణ సందర్భంగా ఆంగ్ల మీడియా పేర్కొంది. కాగా, ఈ డీల్ కుదిరితే.. దేశీ కంపెనీలో కార్లయిల్ చేస్తున్న అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్గా నిలవనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. అంతేకాకుండా దేశీ రిటైల్ రంగ కంపెనీలో కార్లయిల్ తొలిసారి వాటా సొంతం చేసుకున్నట్లు అవుతుందని తెలియజేశారు. కాగా.. ఇటీవల రిలయన్స్ రిటైల్‌లో 1.75 శాతం వాటా కొనుగోలుకి పీఈ సంస్థ సిల్వర్ లేక్ ఒప్పందాన్ని కుదుర్చుకున్న విషయం విదితమే. ఇందుకు రూ. 7,500 కోట్లు వెచ్చించనుంది. తద్వారా రిలయన్స్ రిటైల్ విలువ రూ. 4.21 లక్షల కోట్లకు చేరినట్లు మార్కెట్‌వర్గాలు అంచనా వేశాయి కూడా! షేరు జోరు డిజిటల్ విభాగం జియో బాటలో రిలయన్స్ రిటైల్లోనూ వాటా విక్రయం ద్వారా భారీగా నిధుల సమీకరణ చేపట్టనున్న వార్తలతో రిలయన్స్ ఇండస్ట్రీస్ కౌంటర్‌కు మరోసారి డిమాండ్ పుట్టింది. ఎన్ఎస్ఈలో తొలుత ఆర్ఐఎల్ షేరు 2 శాతం ఎగసి రూ. 2,360ను తాకింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 0.7 శాతం లాభపడి రూ. 2,335 వద్ద ట్రేడవుతోంది. మరోపక్క ఆర్ఐఎల్ పీపీ షేరు సైతం 3 శాతం పుంజుకుని రూ. 1462కు చేరింది. దీంతో ఉదయం సెషన్లో కంపెనీ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రూ. 16.5 లక్షల కోట్లను తాకింది. వారాంతాన ఆర్ఐఎల్ మార్కెట్ క్యాప్ తొలిసారి రూ. 15 లక్షల కోట్లు(200 బిలియన్ డాలర్లు)ను అధిగమించడం ద్వారా దేశీ స్టాక్ మార్కెట్ల చరిత్రలో కొత్త రికార్డును లిఖించిన సంగతి తెలిసిందే. -
రిలయన్స్ రిటైల్‌లో.. సిల్వర్ లేక్
డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు అనుబంధ విభాగమైన రిలయన్స్ రిటైల్‌లో పీఈ సంస్థ సిల్వర్ లేక్ స్వల్ప వాటాను కొనుగోలు చేయనుంది. 1.75 శాతం వాటాను సొంతం చేసుకునేందుకు సిల్వర్ లేక్ డీల్ కుదుర్చుకున్నట్లు ఆర్ఐఎల్ తాజాగా వెల్లడించింది. ఇందుకు సిల్వర్‌లేక్ రూ. 7,500 కోట్లు వెచ్చించనున్నట్లు తెలియజేసింది. ఈ డీల్‌తో రిలయన్స్ రిటైల్ విలువ రూ. 4.21 లక్షల కోట్లకు చేరినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం డిజిటల్ అనుబంధ విభాగమైన రిలయన్స్ జియోలో సైతం సిల్వర్ లేక్ ఇన్వెస్ట్ చేసింది. నిధుల సమీకరణ డిజిటల్ అనుబంధ విభాగం రిలయన్స్ జియో బాటలో రిలయన్స్ రిటైల్లోనూ మైనారిటీ వాటా విక్రయం ద్వారా మరిన్ని నిధులు సమకూర్చుకునే ప్రణాళికల్లో ముకేశ్ అంబానీ ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. కంపెనీ వృద్ధి కోసం ఆర్ఐఎల్ వివిధ అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలియజేశాయి. రిలయన్స్ జియోలో ఇప్పటికే సిల్వర్ లేక్ రూ. 10,202 కోట్లను ఇన్వెస్ట్ చేసిన విషయం విదితమే. రిలయన్స్ జియోలో ఇన్వెస్ట్ చేసిన సంస్థలకు రిలయన్స్ రిటైల్లోనూ వాటా కొనుగోలుకి వీలు కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. రిలయన్స్ రిటైల్‌లో 10 శాతంవరకూ వాటాను విక్రయించే ప్రణాళికల్లో ముకేశ్ అంబానీ ఉన్నట్లు చెబుతున్నారు. కన్సాలిడేషన్ గత నెలలో కిశోర్ బియానీ సంస్థ ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన రిటైల్, హోల్‌సేల్ బిజినెస్‌లను ముకేశ్ అంబానీ దిగ్గజం రిలయన్స్ రిటైల్ సొంతం చేసుకున్న విషయం విదితమే. ఇందుకు రూ. 24,713 కోట్ల డీల్‌ను కుదుర్చుకుంది. తద్వారా దేశీ రిటైల్ రంగంలో కన్సాలిడేషన్ ద్వారా రిలయన్స్ గ్రూప్.. రిటైల్ బిజినెస్‌ను మరింత పటిష్ట పరచుకోనున్నట్లు నిపుణులు తెలియజేశారు. మరోవైపు ఈకామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్(వాల్‌మార్ట్)కు పోటీగా జియో మార్ట్ ద్వారా రిలయన్స్ రిటైల్ వేగంగా విస్తరిస్తున్నట్లు వివరించారు. 2006లో ప్రారంభమైన రిలయన్స్ రిటైల్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 11,806 స్టోర్లను కలిగి ఉంది. -
రిలయన్స్ రిటైల్‌లో సిల్వర్ లేక్‌కు వాటా!
డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు అనుబంధ విభాగమైన రిలయన్స్ రిటైల్‌లో పీఈ సంస్థ సిల్వర్ లేక్ వాటా కొనుగోలుకి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు దిగ్గజ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ గ్రూప్‌లోని ప్రధాన కంపెనీ ఆర్ఐఎల్తో చర్చలు నిర్వహిస్తున్నట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. ఈ కథనం ప్రకారం ఇప్పటికే చర్చలు ప్రారంభమైనట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. రిలయన్స్ రిటైల్‌లో 1.7-1.8 శాతం వాటా కొనుగోలుకి పీఈ సంస్థ సిల్వర్ లేక్ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ వాటా విలువను రూ. 7,500 కోట్లుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారీ విలువ సిల్వర్ లేక్‌తో 1.8 శాతం వాటాకుగాను రూ. 7,500 కోట్లకు డీల్ కుదిరితే.. రిలయన్స్ రిటైల్ విలువ రూ. 4.3 లక్షల కోట్ల(57 బిలియన్ డాలర్లు)కు చేరవచ్చని నిపుణులు ఊహిస్తున్నారు. డిజిటల్ అనుబంధ విభాగం రిలయన్స్ జియో బాటలో రిలయన్స్ రిటైల్లోనూ మైనారిటీ వాటా విక్రయం ద్వారా మరిన్ని నిధులు సమకూర్చుకునే ప్రణాళికల్లో ముకేశ్ అంబానీ ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. కాగా.. కంపెనీ విధానాల ప్రకారం ఊహాజనిత వార్తలపై స్పందించబోమంటూ ఆర్ఐఎల్ ప్రతినిధులు పేర్కొన్నారు. అయితే వృద్ధికి వీలుగా కంపెనీ వివిధ అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలియజేశారు. డీల్ తదితర అంశాలకు తెరతీస్తే సెబీ నిబంధనల ప్రకారం స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేస్తామని స్పష్టం చేశారు. కాగా.. రిలయన్స్ జియోలో ఇప్పటికే సిల్వర్ లేక్ రూ. 10,202 కోట్లను ఇన్వెస్ట్ చేసిన విషయం విదితమే. రిలయన్స్ జియోలో ఇన్వెస్ట్ చేసిన సంస్థలకు రిలయన్స్ రిటైల్లోనూ వాటా కొనుగోలుకి వీలు కల్పిస్తున్నట్లు వార్తా కథనంలో మీడియా పేర్కొంది. కన్సాలిడేషన్ గత నెలలో కిశోర్ బియానీ సంస్థ ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన రిటైల్, హోల్‌సేల్ బిజినెస్‌లను ముకేశ్ అంబానీ దిగ్గజం రిలయన్స్ రిటైల్ సొంతం చేసుకున్న విషయం విదితమే. ఇందుకు రూ. 24,713 కోట్ల డీల్‌ను కుదుర్చుకుంది. తద్వారా దేశీ రిటైల్ రంగంలో కన్సాలిడేషన్ ద్వారా రిలయన్స్ గ్రూప్.. రిటైల్ బిజినెస్‌ను మరింత పటిష్ట పరచుకోనున్నట్లు నిపుణులు తెలియజేశారు. రిలయన్స్ రిటైల్‌లో 10 శాతంవరకూ వాటాను విక్రయించే ప్రణాళికల్లో ముకేశ్ అంబానీ ఉన్నట్లు చెబుతున్నారు. -
యాక్సిస్ బ్యాంక్‌లో కార్లయిల్ పెట్టుబడి!
దేశీ ప్రయివేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్‌లో గ్లోబల్ పీఈ సంస్థ కార్లయిల్ గ్రూప్ ఇన్వెస్ట్ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ప్రిఫరెర్షియల్ కేటాయింపుల ద్వారా 100 కోట్ల డాలర్ల(సుమారు రూ. 7500 కోట్లు) విలువైన యాక్సిస్ బ్యాంక్ షేర్లను కొనుగోలు చేసే వీలున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. తద్వారా యాక్సిస్ బ్యాంకులో కార్లయిల్‌కు 5-8 శాతం వాటా లభించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇందుకు చర్చలు జరుగుతున్నట్లు సంబంధితవర్గాలు పేర్కొంటున్నాయి. చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతక్రితం 2017 నవంబర్‌లో బెయిన్ కేపిటల్ సైతం యాక్సిస్ బ్యాంకులో 1.8 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. ఇతర ప్రయివేట్ రంగ బ్యాంకులు ఇండస్ఇండ్, ఆర్బీఎల్, ఐడీఎఫ్సీ ఫస్డ్ సైతం కొద్ది నెలలుగా పెట్టుబడి సమీకరణ యోచనలో ఉన్న విషయం విదితమే. దీనిలో భాగంగా కొటక్ మహీంద్రా బ్యాంక్ మంగళవారం(26న) అర్హతగల సంస్థాగత వాటాదారులకు షేర్ల జారీ(క్విప్) ద్వారా రూ. 7460 కోట్లకుపైగా సమీకరించేందుకు సన్నద్ధమైంది. కాగా.. కార్లయిల్ గ్రూప్ పెట్టుబడి వార్తల నేపథ్యంలో యాక్సిస్ బ్యాంక్ షేరు ఎన్ఎస్ఈలో 13 శాతంపైగా దూసుకెళ్లి రూ. 387కు చేరింది. తొలుత ఒక దశలో రూ. 392 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. -
పేమెంట్ కంపెనీ ఎఫ్‌ఎస్‌ఎస్‌లో ప్రేమ్‌జీ పెట్టుబడి
బెంగళూరు: బ్యాంకింగ్ చెల్లింపులు(పేమెంట్స్), ప్రాసెసింగ్ చేపట్టే ఫైనాన్షియల్ సాఫ్ట్వేర్ అండ్ సిస్టమ్స్(ఎఫ్ఎస్ఎస్)లో ప్రేమ్‌జీ వ్యక్తిగత హోదాలో ఇన్వెస్ట్ చేశారు. కుటుంబ సంస్థ ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ ద్వారా ఎఫ్‌ఎస్‌ఎస్‌లో రూ. 350 కోట్లను ఐటీ దిగ్గజం విప్రో అధినేత అజీమ్ ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ చేశారు. రెండేళ్లలో పబ్లిక్ ఇష్యూ చేపట్టే ప్రణాళికల్లో ఉన్న ఎఫ్‌ఎస్‌ఎస్‌లో ప్రేమ్జీతోపాటు పీఈ సంస్థలు నైలిమ్ జాకబ్ బల్లాస్, న్యూ ఎంటర్ప్రైజ్ అసోసియేట్స్ సైతం పెట్టుబడి పెట్టాయి. చెన్నైకు చెందిన టెక్నాలజీ కంపెనీ అంతర్జాతీయ స్థాయిలో ఎఫ్ఎస్ఎస్ 100 బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు పేమెంట్ సర్వీసులను అందిస్తోంది. ఏటీఎం, పీవోఎస్(పాయింట్ ఆఫ్ సేల్) టెర్మినళ్లు, ప్రీపెయిడ్ కార్డులు తదితర రిటైల్ విభాగం చెల్లింపులకు సంబంధించిన సర్వీసులను నిర్వహిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2014-15) ముగిసేసరికి రూ. 850 కోట్ల టర్నోవర్‌ను సాధించాలని కంపెనీ భావిస్తోంది. కంపెనీ క్లయింట్లలో ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, పీఎన్బీ, కెనరా బ్యాంక్ తదితరాలున్నాయి. ప్రేమ్‌జీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల్లో దేశీయంగా హార్డ్‌రాక్ కేఫ్‌లను నిర్వహించే జేఎస్ఎం కార్ప్, ఫ్యాషన్ ఈటైలర్ మింత్రా, ఆన్లైన్ మార్కెటింగ్ సంస్థ స్నాప్‌డీల్, మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ సైతం ఉన్నాయి.