పేమెంట్ కంపెనీ ఎఫ్‌ఎస్‌ఎస్‌లో ప్రేమ్‌జీ పెట్టుబడి
బెంగళూరు: బ్యాంకింగ్ చెల్లింపులు(పేమెంట్స్), ప్రాసెసింగ్ చేపట్టే ఫైనాన్షియల్ సాఫ్ట్‌వేర్ అండ్ సిస్టమ్స్(ఎఫ్‌ఎస్‌ఎస్)లో ప్రేమ్‌జీ వ్యక్తిగత హోదాలో ఇన్వెస్ట్ చేశారు. కుటుంబ సంస్థ ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ ద్వారా ఎఫ్‌ఎస్‌ఎస్‌లో రూ. 350 కోట్లను ఐటీ దిగ్గజం విప్రో అధినేత అజీమ్ ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ చేశారు.
రెండేళ్లలో పబ్లిక్ ఇష్యూ చేపట్టే ప్రణాళికల్లో ఉన్న ఎఫ్‌ఎస్‌ఎస్‌లో ప్రేమ్‌జీతోపాటు పీఈ సంస్థలు నైలిమ్ జాకబ్ బల్లాస్, న్యూ ఎంటర్‌ప్రైజ్ అసోసియేట్స్ సైతం పెట్టుబడి పెట్టాయి. చెన్నైకు చెందిన టెక్నాలజీ కంపెనీ అంతర్జాతీయ స్థాయిలో ఎఫ్‌ఎస్‌ఎస్ 100 బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు పేమెంట్ సర్వీసులను అందిస్తోంది. ఏటీఎం, పీవోఎస్(పాయింట్ ఆఫ్ సేల్) టెర్మినళ్లు, ప్రీపెయిడ్ కార్డులు తదితర రిటైల్ విభాగం చెల్లింపులకు సంబంధించిన సర్వీసులను నిర్వహిస్తుంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2014-15) ముగిసేసరికి రూ. 850 కోట్ల టర్నోవర్‌ను సాధించాలని కంపెనీ భావిస్తోంది. కంపెనీ క్లయింట్లలో ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, పీఎన్‌బీ, కెనరా బ్యాంక్ తదితరాలున్నాయి. ప్రేమ్‌జీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల్లో దేశీయంగా హార్డ్‌రాక్ కేఫ్‌లను నిర్వహించే జేఎస్‌ఎం కార్ప్, ఫ్యాషన్ ఈటైలర్ మింత్రా, ఆన్‌లైన్ మార్కెటింగ్ సంస్థ స్నాప్‌డీల్, మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ సైతం ఉన్నాయి.