Stake sale
-
వాటా అమ్మేసిన అదానీ గ్రూప్
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ (Adani) తాజాగా ఎఫ్ఎంసీజీ సంస్థ అదానీ విల్మర్‌లో (Adani Wilmar) 13.5 శాతం వాటా విక్రయించింది. ఫార్చూర్ బ్రాండ్ వంట నూనెలు, ఫుడ్ ప్రొడక్టుల కంపెనీలో 17.54 కోట్ల షేర్లను షేరుకి రూ. 275 ఫ్లోర్(కనీస) ధరలో అమ్మివేసింది. తద్వారా విల్మర్‌తో ఏర్పాటు చేసిన భాగస్వామ్య కంపెనీ(జేవీ) నుంచి వైదొలగనుంది.వెరసి కీలకంకాని బిజినెస్‌ల నుంచి తప్పుకోవడం ద్వారా గ్రూప్‌నకు ప్రధానమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్పై దృష్టి పెట్టనుంది. భాగస్వామి విల్మర్‌కు వాటా విక్రయించనున్నట్లు గత నెలలో అదానీ గ్రూప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అనుబంధ సంస్థ అదానీ కమోడిటీస్ ఎల్ఎల్పీ ద్వారా 13.5 శాతం వాటాను సంస్థాగత ఇన్వెస్టర్లకు విక్రయించింది. దీనిలో అదనంగా విక్రయించే వీలున్న 6.5 శాతం వాటా(8.44 కోట్ల షేర్లు) సైతం కలసి ఉన్నట్లు వెల్లడించింది.మార్కెట్లు క్షీణతలో ఉన్నప్పటికీ ఆఫర్ ఫర్ సేల్కు దేశ, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభించినట్లు అదానీ గ్రూప్ తెలియజేసింది. దీంతో 1.96 కోట్ల షేర్లను అదనంగా ఆఫర్ చేయనున్నట్లు వెల్లడించింది. అంటే 17.54 కోట్ల షేర్లు(13.5 శాతం వాటా) ప్రస్తుతం విక్రయించగా.. మరో 1.96 కోట్ల(1.5 శాతం వాటా)ను సోమవారం(13న) రిటైల్ ఇన్వెస్టర్లకు ఆఫర్ చేయనున్నట్లు వివరించింది.అంటే మొత్తం 19.5 కోట్ల షేర్ల(15.01 శాతం వాటా)ను అమ్మివేయనున్నట్లు వెల్లడించింది. ఈ లావాదేవీ తదుపరి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25)లో 3.15 బిలియన్ డాలర్ల ఈక్విటీ పెట్టుబడులను సమకూర్చుకున్నట్లవుతుందని అదానీ గ్రూప్ తెలియజేసింది. పబ్లిక్కు కనీస వాటా తాజా వాటా విక్రయ నేపథ్యంలో పబ్లిక్కు కనీస వాటా నిబంధనలను అమలు చేసినట్లు అదానీ విల్మర్ పేర్కొంది. ప్రస్తుతం ప్రమోటర్లకు 74.37 శాతం, పబ్లిక్కు 25.63 శాతం వాటా ఉన్నట్లు తెలియజేసింది. తదుపరి దశలో ఒప్పందం ప్రకారం మిగిలిన వాటాను విల్మర్‌కు షేరుకి రూ. 305 ధర మించకుండా విక్రయించనున్నట్లు తెలియజేసింది. లావాదేవీకి ముందు కంపెనీలో అదానీ గ్రూప్‌నకు 43.94 శాతం వాటా ఉన్న విషయం విదితమే.నిజానికి విల్మర్‌కు 31 శాతం వాటా విక్రయానికి ఒప్పందం కుదిరినప్పటికీ ఆఫర్ ఫర్ సేల్కు లభించిన స్పందన ఆధారంగా మిగిలిన వాటా ను విక్రయించనుంది. మార్చి31లోగా మొత్తం వాటా విక్రయం పూర్తికానున్నట్లు అదానీ గ్రూప్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో అదానీ విల్మర్ షేరు బీఎస్ఈలో 10 శాతం పతనమై రూ. 292 దిగువన స్థిరపడింది. -
యాపిల్‌లో మరింత తగ్గిన బఫెట్ వాటా
ముంబై: టెక్ దిగ్గజం యాపిల్ సంస్థలో బెర్క్‌షైర్ హాత్వే అధిపతి వారెన్ బఫెట్ వాటా మరింత తగ్గింది. సెప్టెంబర్ క్వార్టర్లో షేర్లను విక్రయించినట్లు బెర్క్‌షైర్ హాత్వే తెలిపింది. దీంతో యాపిల్‌లో మొత్తం వాటా విలువ 69.9 బిలియన్ డాలర్లకు దిగివచి్చంది. ఆగస్టు త్రైమాసికంలో 75 బిలియన్ డాలర్ల విలువైన షేర్ల(సగానికి పైగా వాటా)ను అమ్మింది. ఈ ఏడాదిలో యాపిల్‌తో పాటు బ్యాంక్ ఆఫ్ అమెరికా షేర్లను భారీ విక్రయించడంతో పాటు ఎలాంటి ప్రధాన కొనుగోళ్లు జరపకపోవడంతో బెర్క్‌షైర్ హాత్వే నగదు రిజర్వు 325 బిలియన్ డాలర్లకి చేరింది. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కీలక నిర్ణయం
ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ కీలక నిర్ణయం తీసుకుంది. తన హెచ్డీఎఫ్సీ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 100 శాతం వాటాను విక్రయించాలని నిర్ణయించింది. ఈ లావాదేవీ స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో జరుగుతుందని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్విస్ ఛాలెంజ్ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత హెచ్డీఎఫ్సీ ఎడ్యుకేషన్ వాటాను ఎవరు కొనుగోలు దారులను ఖరారు చేస్తుంది. ఆ తర్వాత బ్యాంక్ బిడ్డర్ ప్రయోజనాల కోసం డాక్యుమెంటేషన్ ప్రాసెస్‌ను ప్రారంభించనున్నట్లు పేర్కొంది. స్విస్ ఛాలెంజ్ పద్ధతి స్విస్ ఛాలెంజ్ పద్ధతి అనేది ఓ కంపెనీలో వాటాను మరో సంస్థకు అమ్మేందుకు ఉపయోగపడే బిడ్డింగ్ ప్రక్రియ. ఆసక్తిగల సంస్థ (సాధారణంగా ఒక ప్రైవేట్ సంస్థ) ఒక కాంట్రాక్ట్ లేదా ప్రాజెక్ట్ కోసం ఒక ప్రతిపాదనను ప్రారంభిస్తుంది. అప్పుడు ప్రభుత్వం ప్రాజెక్టు వివరాలను బహిరంగంగా విడుదల చేసి, ఇతర పార్టీలను తమ ప్రతిపాదనలను సమర్పించమని ఆహ్వానిస్తుంది. ఈ ప్రతిపాదనను ప్రారంభించిన అసలు బిడ్డర్(ఇక్కడ హెచ్డీఎఫ్సీ బ్యాంక్)కు తిరస్కరించే హక్కు ఉంది. అసలు బిడ్డర్‌కు నచ్చితే వాటా అమ్మకం ప్రక్రియ ముందుకు సాగుతుంది. -
ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్..హెచ్‌డీఎఫ్‌సీలో వాటా కొనుగోలుకు ఎల్ఐసీ రెడీ!
దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) ప్రైవేట్ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీలో మరికొంత వాటాను సొంతం చేసుకునేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ఆర్బీఐ నుంచి అనుమతి పొందింది. జనవరి 24, 2025 నాటికి ఎల్ఐసీ తన మొత్తం వాటాను మొత్తం వాటాను 9.99 శాతానికి పెంచుకునేందుకు హెచ్‌డీఎఫ్‌సీలో అదనంగా 4.8శాతం వాటాను పొందేలా ఎల్ఐసీకి ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. 2023 డిసెంబర్ నాటికి హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో ఎల్ఐసీ 5.19 శాతం వాటాను కలిగి ఉంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన నోటిఫికేషన్లో జనవరి 25, 2025 నాటికి బ్యాంక్‌లో 9.99శాతం వరకు కొనుగోలు చేయడానికి ఎల్ఐసీ.. ఆర్బీఐ నుంచి ఆమోదం పొందిందని తెలిపింది. అయితే నిబంధనలకు అనుగుణంగా ఏడాదిలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో వాటాను ఎల్ఐసీ 9.99 శాతానికి పెంచుకోవచ్చు. అయితే ఆ పరిమితిని దాటకూడదు. -
ఎకో హోటల్స్‌లో ఈజీ ట్రిప్ ప్లానర్స్
న్యూఢిల్లీ: ఆన్లైన్ ట్రావెల్ సర్వీసులందించే ఈజీ ట్రిప్ ప్లానర్స్ తాజాగా ఎకో హోటల్స్ అండ్ రిసార్ట్స్‌లో 13.39 శాతం వాటాను కొనుగోలు చేసింది. షేర్ల మార్పిడి ద్వారా వాటాను సొంతం చేసుకోనుంది. ఇందుకు 1: 1 నిష్పత్తిలో షేర్లను జారీ చేయనుంది. ఈజ్‌మైట్రిప్ బ్రాండ్‌తో సేవలందించే కంపెనీ ప్రతీ ఒక ఎకో హోటల్స్ షేరుకి ఒక ఈజీ ట్రిప్ షేరుని కేటాయించనుంది. ఆపై ప్రిఫరెన్షియల్ పద్ధతిలో రూ. 10 ముఖ విలువగల 40 లక్షల ఎకో హోటల్స్ ఈక్విటీ షేర్లను సొంతం చేసుకోనుంది. ఎన్ఎస్ఈలో ఈజ్‌మైట్రిప్ షేరు 0.8 శాతం బలపడి రూ. 39 వద్ద ముగిసింది. -
నిప్పన్ లీక్లెస్కు టాల్బ్రోస్ గుడ్‌బై
ముంబై: భాగస్వామ్య సంస్థ(జేవీ) నిప్పన్ లీక్‌లెస్ టాల్బ్రోస్ నుంచి వైదొలగనున్నట్లు ఆటో విడిభాగాల కంపెనీ టాల్బ్రోస్ ఆటోమోటివ్ కంపోనెంట్స్ లిమిటెడ్(టీఏసీఎల్) తాజాగా పేర్కొంది. నిప్పన్ లీక్లెస్లో గల మొత్తం 40 శాతం వాటాను భాగస్వామ్య కంపెనీకి విక్రయించే ప్రతిపాదనకు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు వెల్లడించింది. దీంతో జేవీలో 100 శాతం వాటా నిప్పన్ లీక్‌లెస్ సొంతం కానున్నట్లు తెలియజేసింది. 2005లో నిప్పన్ లీక్లెస్తో జత కట్టడం ద్వారా టాల్బ్రోస్ జేవీకి తెరతీసింది. నిప్పన్‌కు 60 శాతం, టాల్బ్రోస్కు 40 శాతం చొప్పున వాటాతో జేవీ కార్యకలాపాలు ప్రారంభించింది. ప్రధానంగా ద్విచక్ర వాహన రంగ దిగ్గజాల(ఓఈఎంలు) కోసం గ్యాస్కట్స్ తయారు చేసి సరఫరా చేస్తోంది. వ్యూహాత్మక బిజినెస్ సమీక్షలో భాగంగా నిప్పన్ లీక్‌లెస్ టాల్బ్రోస్లో మొత్తం వాటాను విక్రయించేందుకు బోర్డు అనుమతించినట్లు టీఏసీఎల్ జేఎండీ అనుజ్ తల్వార్ వివరించారు. కంపెనీ గ్యాస్కట్స్సహా హీట్ షీల్డ్స్, ఫోర్జింగ్స్, సస్పెన్షన్ సిస్టమ్స్, యాంటీవైబ్రేషన్ ప్రొడక్టులు తదితరాలను తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. జేవీలో 40 శాతం వాటా విక్రయం ద్వారా రూ. 82 కోట్లు లభించనున్నట్లు టీఏసీఎల్ వెల్లడించింది. మార్చిలోగా వాటా విక్రయం పూర్తికాగలదని భావిస్తోంది. నిధులను విస్తరణ, భవిష్యత్ పెట్టుబడులకు వినియోగించనుంది. వాటా విక్రయ వార్తలతో టాల్బ్రోస్ షేరు ఎన్ఎస్ఈలో 2 శాతం పుంజుకుని రూ. 303 వద్ద ముగిసింది. -
సఫైర్ ఫుడ్స్‌లో వాటా విక్రయం
న్యూఢిల్లీ: ఓమ్ని చానల్ రెస్టారెంట్ల నిర్వాహక కంపెనీ సఫైర్ ఫుడ్స్ ఇండియా లిమిటెడ్‌లో రెండు ప్రమోటర్ సంస్థలు తాజాగా 5.9 శాతం వాటాను విక్రయించాయి. ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా సమర క్యాపిటల్ పార్ట్నర్స్ ఫండ్–2.. 4,49,999 షేర్లు(0.71 శాతం వాటా), సఫైర్ ఫుడ్స్ మారిషస్ 33,37,423 షేర్లు(5.24 శాతం) అమ్మివేశాయి. బీఎస్ఈ బల్క్ డీల్ గణాంకాల ప్రకారం ఒక్కో షేరుకి రూ. 1,400 సగటు ధరలో విక్రయించిన వాటా విలువ రూ. 530 కోట్లు. కేఎఫ్‌సీ, పిజ్జా హట్, టాకో బెల్ తదితర యమ్ బ్రాండ్ల అతిపెద్ద ఫ్రాంచైజీగా సఫెర్ ఫుడ్స్ వ్యవహరిస్తోంది. తాజా లావాదేవీల తదుపరి కంపెనీలో మారిషస్ ప్రమోటర్ వాటా 29.28 శాతం నుంచి 24.04 శాతానికి తగ్గింది. ఇక సమర క్యాపిటల్ పార్ట్నర్స్ ఫండ్–2.. కంపెనీ నుంచి పూర్తిగా వైదొలగినట్లయ్యింది. సింగపూర్ ప్రభుత్వం 10.05 లక్షల షేర్లు, హెచ్డీఎఫ్సీ ఎంఎఫ్ 22 లక్షల షేర్లు కొనుగోలు చేశాయి. కాగా.. ఈ నెల మొదట్లో మరో ప్రమోటర్ సంస్థ అరింజయ మారిషస్.. రూ. 378 కోట్లకు సఫైర్ ఫుడ్స్‌లో 4.2 శాతం వాటాను విక్రయించిన విషయం విదితమే. వాటా విక్రయం నేపథ్యంలో సఫైర్ ఫుడ్స్ షేరు బీఎస్ఈలో 0.26 శాతం నీరసించి రూ. 1,403 వద్ద ముగిసింది. ఆర్కియన్ కెమ్‌లో వాటా అమ్మకం స్పెషాలిటీ కెమికల్స్ తయారీ కంపెనీ ఆర్కియన్ కెమికల్ ఇండస్ట్రీస్‌లో ఇండియా రిసర్జెన్స్ ఫండ్ స్కీ మ్–1, స్కీమ్–2, పిరమల్ నేచురల్ రిసోర్సెస్ ఉమ్మడిగా 3.4% వాటాకు సమానమైన 42 లక్షల షేర్లను విక్రయించాయి. ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా షేరుకి రూ. 600–601 సగటు ధరలో విక్రయించిన వాటా విలువ రూ. 252 కోట్లు. టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ 14.06 లక్షల షేర్లు, డీఎస్పీ ఎంఎఫ్ 10 లక్షల షేర్లు, గోల్డ్‌మన్ శాక్స్ 6.23 లక్షల షేర్లు చొప్పున సొంతం చేసుకున్నాయి. వాటా విక్రయం నేపథ్యంలో ఆర్కియన్ కెమికల్స్ షేరు ఎన్ఎస్ఈలో 3.3% పతనమై రూ. 610 దిగువన ముగిసింది. ప్రైకోల్లో వాటా విక్రయం ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా ఆటో విడిభాగాల కంపెనీ ప్రైకోల్లో పీహెచ్‌ఐ క్యాపిటల్ సొల్యూషన్స్ 14,40,922 షేర్లను విక్రయించింది. ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం 1.2 శాతం వాటాకు సమానమైన వీటిని షేరుకి రూ. 347 సగటు ధరలో అమ్మివేసింది. డీల్ విలువ రూ. 50 కోట్లుకాగా.. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఎంఎఫ్ వీటిని కొనుగోలు చేసింది. తాజా లావాదేవీల తదుపరి కంపెనీలో పీహెచ్‌ఐ క్యాపిటల్ వాటా 5.73 శాతం నుంచి 4.55 శాతానికి తగ్గింది. వాటా విక్రయం నేపథ్యంలో ప్రైకోల్ షేరు ఎన్ఎస్ఈలో 1 శాతం నష్టంతో రూ. 344 దిగువన ముగిసింది. -
‘ఇదే మంచి సమయం’.. జొమాటోలోని వాటా అమ్మనున్న అలిపే
ప్రముఖ చైనా పేమెంట్ దిగ్గజం అలిపే కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌కు చెందిన ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ఉన్న తన వాటాను అమ్మేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. జొమాటోలో అలిపేకి మొత్తం 3.44 శాతం వాటా ఉంది. అందులో 3.4 శాతం వాటాను ఇండియన్ స్టాక్ మార్క్ట్లోని బ్లాక్ డీల్ (5లక్షల షేర్లను ఒక్కొకరికి అమ్మే) పద్దతిలో విక్రయించేందుకు సిద్ధమైనట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఆ మొత్తం విలువ 395 మిలియన్ల డాలర్లు (సుమారు రూ.3,300 కోట్లు). జొమాటో - అలిపే మధ్య జరిగే ఈ డీల్‌లో సలహా ఇచ్చేందుకు బ్యాంక్ ఆఫ్ అమెరికా, మోర్గాన్ స్టాన్లీ ప్రతినిధుల్ని సలహాదారులుగా నియమించన్నట్లు సమాచారం. అయితే దీనిపై జొమాటో- అలిపేలు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. రాకెట్ వేగంతో జొమాటో 2021 జులై నెలలో ఐపీఓకి వెళ్లింది. ఉక్రెయిన్‌పై రష్యా వార్తో పాటు ఇతర అనిశ్చితి పరిస్థితుల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్టాక్ మార్కెట్లోని టెక్నాలజీ స్టాక్స్ 2022 మే వరకు నష్టాల్లోనే కొనసాగాయి. భారీ లాభాల్ని ఒడిసిపట్టి మే నెల నుంచి తిరిగి పుంజుకోవడంతో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు సుమారు 90 శాతం మేర జొమాటో షేర్ల విలువ పెరిగింది. దీంతో భారీ లాభాల్ని అర్జించిన అలిపే మార్కెట్లో పెట్టిన పెట్టుబడుల్ని అమ్మేందుకు ఇదే మంచి సమయం అని తెలిపింది. అన్నట్లుగానే తాజాగా జొమాటోలోని వాటాను అమ్మేందుకు అలిపే చర్చలు జరుపుతున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. -
విల్మర్ కంపెనీ వాటా మొత్తం విక్రయించడానికి సిద్దమైన అదానీ
ప్రపంచ కుబేరుల జాబితాలో స్థానం పొందిన ప్రముఖ దిగ్గజ వ్యాపార వేత్త 'గౌతమ్ అదానీ' (Gautam Adani) విల్మర్ లిమిటెడ్‌లోని తన మొత్తం వాటాను విక్రయించాలని చూస్తున్నట్లు ఒక వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఇందులో నిజమెంత? విక్రయిచాలనుకుంటే దానికిగల కారణం ఏంటనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వంట నూనెలు సహా ఇతర ఆహార, పానీయ ఉత్పత్తుల్ని విక్రయించే అదానీ విల్మర్‌లో గౌతమ్ ఆదానీ వాటా 43.97 శాతం ఉంది. ఈ వాటాలను మొత్తం విక్రయించడానికి మల్టీనేషనల్ కన్జూమర్ గూడ్స్ కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లు ఇవన్నీ ఒక నెలలోనే పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. భారీ నష్టాలు అదానీ విల్మర్ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో వెల్లడించిన ఫలితాల ప్రకారం ఏకంగా రూ. 130.73 కోట్ల నష్టాన్ని చవి చూసినట్లు తెలిసింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ. 48.76 కోట్ల లాభాలను ఆర్జించిన కంపెనీ ఈ ఏడాది ఊహకందని నష్టాలను పొందాల్సి వచ్చింది. ముఖ్యంగా కుకింగ్ ఆయిల్ బిజినెస్‌లో నష్టాలు వచ్చినట్లు సమాచారం. అదానీ విల్మర్ మొత్తం వ్యయం రూ. 12,439.45 కోట్లుగా ఉంది. ఇదీ చదవండి: ఒక్క గ్యాడ్జెట్.. కారు మరింత సేఫ్ - ధర కూడా తక్కువే! అదానీ గ్రూప్ చైర్మన్ 'గౌతమ్ అదానీ' ఇప్పటికీ కొన్ని ఆర్థిక పరమైన చిక్కులో ఉన్నట్లు.. హిండెన్‌బర్గ్ రిపోర్ట్ తర్వాత ఇంకా కోలుకోలేకపోయినట్లు సమాచారం. ఈ కారణంగానే ప్రస్తుతం తన గ్రూప్‌కు చెందిన కంపెనీ వాటాల్ని మొత్తం విక్రయించడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. -
టాటా టెక్నాలజీస్‌లో వాటా అమ్మకం.. ఎంతంటే?
న్యూఢిల్లీ: ఇంజినీరింగ్ సర్వీసెస్ అనుబంధ కంపెనీ టాటా టెక్నాలజీస్‌లో 9.9 శాతం వాటా విక్రయించనున్నట్లు మాతృ సంస్థ, ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్ తాజాగా పేర్కొంది. ఇందుకు టీపీజీ రైజ్ క్లయిమేట్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. డీల్ విలువను దాదాపు రూ. 1,614 కోట్లుగా వెల్లడించింది. వెరసి రూ. 16,300 కోట్ల ఈక్విటీ విలువలో టాటా టెక్ వాటాను టీపీజీ రైజ్ కొనుగోలు చేయనుంది. డీల్ రెండు వారాలలో పూర్తికావచ్చని టాటా మోటా ర్స్ అంచనా వేస్తోంది. తాజా లావాదేవీ ద్వా రా రుణ భారాన్ని తగ్గించుకునే లక్ష్యంవైపు సా గుతున్నట్లు టాటా మోటార్స్ తెలియజేసింది. టీపీజీ రైజ్ ఇంతక్రితం వ్యూహాత్మక భాగస్వామిగా టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్‌లో బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. టాటా టెక్నాలజీస్ ఆటోమోటివ్ పరిశ్రమలో లోతైన(డొమైన్) నైపుణ్యాన్ని కలిగి ఉంది. బీఎస్ఈలో టాటా మోటార్స్ షేరు శుక్రవారం 5 శాతం జంప్‌చేసి రూ. 667 వద్ద ముగిసింది. -
జొమాటోలో కీలక పరిణామం
న్యూఢిల్లీ: ఆన్లైన్ ఫుడ్ ఆర్డరింగ్ ప్లాట్‌ఫామ్ జొమాటోలో టైగర్ గ్లోబల్, డీఎస్టీ గ్లోబల్ మొత్తం 1.8 శాతం వాటాను విక్రయించాయి. ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా టైగర్ గ్లోబల్ 1.44 శాతం వాటాకు సమానమైన 12,34,86,408 షేర్లను విక్రయించింది. ఇక డీఎస్టీ గ్లోబల్ 0.4 శాతం వాటాకు సమానమైన 3,19,80,447 షేర్లను అమ్మివేసింది. షేరుకి రూ. 90–91 సగటు ధరలో విక్రయించిన వీటి మొత్తం విలువ రూ. 1,412 కోట్లు. యాక్సిస్ ఎంఎఫ్, ఎస్బీఐ లైఫ్, ఐసీఐసీఐ ప్రులైఫ్, మోర్గాన్ స్టాన్లీ ఏషియా సింగపూర్, సొసైటీ జనరాలి తదితరాలు జొమాటో షేర్లను కొనుగోలు చేశాయి. ఈ నేపథ్యంలో జొమాటో షేరు బీఎస్ఈలో 1.5 శాతం పుంజుకుని రూ. 92.3 వద్ద ముగిసింది. -
గో ఫస్ట్ విక్రయానికి కసరత్తు
న్యూఢిల్లీ: స్వచ్ఛందంగా దివాలా ప్రకటించిన విమానయాన సంస్థ గో ఫస్ట్‌ను విక్రయించే అవకాశాలపై కసరత్తు జరుగుతోంది. ఇందుకు సంబంధించి ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలను (ఈవోఐ) ఆహ్వానిస్తూ రిజల్యూషన్ ప్రొఫెషనల్ (ఆర్పీ) శైలేంద్ర అజ్మీరా ప్రకటన జారీ చేశారు. ఈవోఐల దాఖలుకు ఆగస్టు 9 ఆఖరు తేది. అర్హత కలిగిన సంస్థల పేర్లను ఆగస్టు 19న ప్రకటిస్తారు. ప్రొవిజనల్ లిస్టుపై అభ్యంతరాలను తెలియజేసేందుకు ఆగస్టు 24 ఆఖరు తేది. ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ల సరఫరా సమస్య కారణంగా భారీగా ఆదాయ నష్టం వాటిల్లుతోందంటూ గో ఫస్ట్ సంస్థ మే 3 నుంచి ఫ్లయట్ సర్వీసులు నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఆర్థిక సంస్థలకు, ఇతరత్రా రుణదాతలకు కంపెనీ రూ. 11,463 కోట్లు చెల్లించాల్సి ఉంది. నోటీసు ప్రకారం 2022 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో సంస్థ ఆదాయం రూ. 4,183 కోట్లుగా నమోదు కాగా, 4,200 మంది ఉద్యోగులు ఉన్నారు. రుణదాతల కమిటీ ఆమోదించిన పునరుద్ధరణ ప్రణాళికను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కు గో ఫస్ట్ గత నెలలో సమర్పించింది. డీజీసీఏ జూలై 4–6 మధ్య ప్రత్యేక సేఫ్టీ ఆడిట్ నిర్వహించింది. ఈ వారంలో నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. -
అదానీ గ్రూప్ సంస్థల్లో మరో కీలక పరిణామం!
న్యూఢిల్లీ: Gautam Adani Raised rs 11,330 crore : ప్రణాళికలకు అనుగుణంగానే నిధుల సమీకరణ చేపట్టినట్లు డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ తాజాగా పేర్కొంది. దీంతో గత నాలుగేళ్లలో రూ. 73,800 కోట్లు(9 బిలియన్ డాలర్లు) సమకూర్చుకున్నట్లు తెలియజేసింది. ఇందుకు గ్రూప్ కంపెనీలలో వాటాల విక్రయాన్ని చేపట్టినట్లు తెలియజేసింది. ఈ బాటలో ఇటీవలే మూడు కంపెనీలలో వాటాల విక్రయం ద్వారా రూ. 11,330 కోట్లు(1.38 బిలియన్ డాలర్లు) సమీకరించిన అంశాన్ని ప్రస్తావించింది. 10ఏళ్ల కాలానికిగాను పెట్టుబడుల పరివర్తన నిర్వహణ (ట్రాన్స్ఫార్మేటివ్ క్యాపిటల్ మేనేజ్మెంట్) ప్రణాళికల్లో భాగంగా నిధుల సమీకరణ చేపడుతున్నట్లు అదానీ గ్రూప్ వెల్లడించింది. వివిధ పోర్ట్‌ఫోలియో కంపెనీల కోసం 2016లో ఈ ప్రణాళికలకు తెరతీసినట్లు తెలియజేసింది. దీనిలో భాగంగానే ఇటీవల అదానీ ఎంటర్ప్రైజెస్, గ్రీన్ ఎనర్జీ, ట్రాన్స్మిషన్ కంపెనీలలో వాటాల విక్రయం ద్వారా రూ. 11,330 కోట్లు అందుకున్నట్లు వివరించింది. దీంతో గ్రూప్ స్థాయిలో అత్యధిక పెట్టుబడులు అందుబాటులోకి వచ్చినట్లు తెలియజేసింది. -
వాటా విక్రయం! ఎస్బీఐ, ఎల్ఐసీ, పీఎన్బీ, బీవోబీ రెడీ..
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజాలు స్టేట్‌బ్యాంక్(ఎస్బీఐ), లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ), పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ), బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ).. యూటీఐ మ్యూచువల్ ఫండ్(ఎంఎఫ్)లో వాటాలను విక్రయించే యోచనలో ఉన్నాయి. పురాతన ఎంఎఫ్ యూటీఐ స్పాన్సర్స్ అయిన ఈ సంస్థలు వాటా విక్రయం కోసం మర్చంట్ బ్యాంకర్లను సంప్రదిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. యూటీఐ ఎంఎఫ్‌ను ఎస్బీఐ, పీఎన్బీ, ఎల్ఐసీ, బీవోబీ ఉమ్మడిగా ప్రమోట్ చేశాయి. ఈక్విటీలో మొత్తం 45.21 శాతం వాటాను కలిగి ఉన్నాయి. అనుబంధ సంస్థ ద్వారా మరో ప్రమోటర్ టీ రోవ్ ప్రైస్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్(యూకే) సైతం 23 శాతం వాటాను పొందింది. 2020లో పబ్లిక్ ఇష్యూ ద్వారా ఈ సంస్థలన్నీ యూటీఐ ఎంఎఫ్‌లో దాదాపు 3.9 కోట్ల షేర్లను విక్రయించాయి. వెరసి ఐపీవో నిధులను ప్రమోటర్ సంస్థలే అందుకున్నాయి. 2019 డిసెంబర్లో సెబీ ఆదేశాలమేరకు వాటాను తగ్గించుకునే బాటలో ఐపీవోను చేపట్టాయి. కాగా.. ప్రభుత్వ సంస్థలు(పీఎస్ఈలు) అనుబంధ సంస్థలలో వాటాలను విక్రయించాలనుకుంటే ప్రతిపాదనలను ఆయా శాఖలకు పంపించవచ్చని గతేడాది దీపమ్ స్పష్టం చేసింది. తద్వారా ఇందుకు అనుమతించింది. ఈ బాటలో తాజాగా సంబంధిత మార్గదర్శకాలను సైతం జారీ చేసింది. వీటి ప్రకారం వాటాల విక్రయ ప్రతిపాదనలు అందాక ఆయా మంత్రిత్వ పాలనా శాఖలు తొలుత పరిశీలించి దీపమ్‌కు బదిలీ చేస్తాయి. ఆపై దీపమ్ వీటికి ముందస్తు అనుమతిని మంజూరు చేస్తుంది. 1964లో.. పార్లమెంటు యూటీఐ ఎంఎఫ్ 1964లో ఏర్పాటైంది. యూఎస్ 64 పథకం మూతపడ్డాక 2002లో పార్లమెంట్ యూటీఐ చట్టాన్ని ఆమోదించింది. దీంతో యూటీఐను సూటీ(ఎస్‌యూయూటీఐ), యూటీఐ అసెట్ మేనేజ్మెంట్ పేరుతో రెండు సంస్థలుగా విభజించారు. యాక్సిస్ బ్యాంక్‌కు సూటీలో 11.8 శాతం వాటా ఉంది. ఇక యూటీఐ ఎంఎఫ్‌లో నాలుగు ప్రభుత్వ సంస్థల నుంచి టీ రోవ్ ప్రైస్ 2009లో 26 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఇందుకు 14 కోట్ల డాలర్లు వెచ్చించింది. ఒక్కో సంస్థ విడిగా 6.5 శాతం వాటా చొప్పున విక్రయించాయి. -
అదానీ నిధుల సమీకరణ బాట రూ. 21,000 కోట్లపై కన్ను
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ నిధుల సమీకరణపై కన్నేసింది. గ్రూప్‌లోని రెండు కంపెనీలలో వాటాల విక్రయం ద్వారా 2.5 బిలియన్ డాలర్లు(రూ. 21,000 కోట్లు) సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉంది. గ్రూప్‌లోని ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ రూ. 12,500 కోట్లు, అదానీ ట్రాన్స్మిషన్ రూ. 8,500 కోట్లు చొప్పున సమీకరించ నున్నట్లు స్టాక్ ఎక్స్ఛేజీలకు సమాచారమిచ్చాయి. ఈ బాటలో అదానీ గ్రీన్ ఎనర్జీ సైతం శనివారం బోర్డు సమావేశాన్ని నిర్వహించ తలపెట్టినప్పటికీ ఈ నెల 24కు వాయిదా పడింది. అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల విక్రయాన్ని చేపట్టనుంది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం మధ్యప్రాచ్యం, యూరప్ నుంచి ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. (కేంద్రం గుడ్ న్యూస్: మొబైల్ పోతే..మే 17 నుంచి కొత్త విధానం) అదానీ గ్రూప్‌నకు వ్యతిరేకంగా యూఎస్ షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ నివేదిక వెలువరించడంతో అదానీ ఎంటర్ప్రైజెస్ చేపట్టిన రూ. 20,000 కోట్ల ఎఫ్‌పీవోను రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇష్యూ పూర్తిగా సబ్స్క్రయిబ్ అయినప్పటికీ కంపెనీ ఇన్వెస్టర్లకు సొమ్మును వాపసు చేసింది. ఇది జరిగిన మూడు నెలల తదుపరి తిరిగి గ్రూప్ కంపెనీలు వాటా విక్రయం ద్వారా నిధుల సమీకరణకు తెరతీయడం గమనార్హం! (స్వీట్ కపుల్ సక్సెస్ స్టోరీ: తొలి ఏడాదిలోనే రూ.38 కోట్లు) -
కళ్యాణ్ జువెల్లర్స్‌లో హైడెల్ వాటా విక్రయం
న్యూఢిల్లీ: ఆభరణాల విక్రయ సంస్థ కళ్యాణ్ జువెల్లర్స్‌లో వార్బర్గ్ పింకస్‌కు చెందిన హైడెల్ ఇన్వెస్ట్మెంట్ 2.26 శాతం వాటాను ఓపెన్ మార్కెట్లో రూ.256.6 కోట్లకు విక్రయించింది. ఎన్ఎస్ఈలో బల్క్ డీల్ సమాచారం ప్రకారం ఒక్కొక్కటి రూ.110.04 చొప్పున 2,33,25,686 షేర్లను హైడెల్ విక్రయించింది. ఇదీ చదవండి: Charges on UPI: యూపీఐ చెల్లింపులపై అదనపు చార్జీలు.. యూజర్లకు వర్తిస్తాయా? డిసెంబర్ త్రైమాసికంలో కళ్యాణ్ జువెల్లర్స్‌లో హైడెల్‌కు 26.36 శాతం వాటా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే ఎన్ఎస్ఈలో కళ్యాణ్ జువెల్లర్స్ షేరు ధర మంగళవారం 9.06 శాతం పడిపోయి రూ.107.90 వద్ద స్థిరపడింది. ఇదీ చదవండి: పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్.. పేటీఎం వ్యాలెట్ నుంచి ఏ మర్చంట్‌కైనా చెల్లింపులు -
వాటా విక్రయం వదంతే: వేదాంతా నిరాధారమని స్పష్టీకరణ
మైనింగ్ మొఘల్, ప్రమోటర్ అనిల్ అగర్వాల్ కంపెనీలో వాటాను విక్రయించే సన్నాహాల్లో ఉన్నట్లు మీడియాలో వచ్చిన వార్తలు నిరాధారమని వేదాంతా లిమిటెడ్ తాజాగా పేర్కొంది. ఇందుకు చర్చలు జరుగుతున్నట్లు వెలువడిన వార్తలు కేవలం వదంతులేనని కంపెనీ ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. చివరి అవకాశంగా వేదాంతాలో 5 శాతంవరకూ వాటా విక్రయించే యోచనలో అనిల్ అగర్వాల్ ఉన్నట్లు ఇటీవల మీడియా పేర్కొన్న నేపథ్యంలో కంపెనీ వివరణకు ప్రాధాన్యత ఏర్పడింది. వేదాంతా లిమిటెడ్‌లో మెజారిటీ వాటాదారు అయిన వేదాంతా రిసోర్సెస్ రుణ భారాన్ని తగ్గించుకునేందుకు చూస్తోంది. ఇందుకు హిందుస్తాన్ జింక్ లిమిటెడ్(హెచ్‌జెడ్‌ఎల్)కు జింక్ ఆస్తులను విక్రయించడం ద్వారా 298.1 కోట్ల డాలర్లు సమీకరించాలని ప్రణాళికలు వేసింది. కంపెనీలో వేదాంతాకు 64.92 శాతం వాటా ఉంది. అయితే హెచ్‌జెడ్‌ఎల్‌లో 29.54 శాతం వాటా కలిగిన ప్రభుత్వం ఇందుకు వ్యతిరేకతను వ్యక్తం చేసింది. కాగా.. రానున్న త్రైమాసికాలలో రుణ చెల్లింపులకు అవసరమైన వనరులున్నట్లు ఇంతక్రితం వేదాంతా వెల్లడించింది. తద్వారా రుణ చెల్లింపులపై ఇన్వెస్టర్లలో నెలకొన్న ఆందోళనలకు తెరదించే ప్రయత్నం చేసింది. సిండికేట్ రుణం, బైలేటరల్ బ్యాంక్ సౌకర్యాల ద్వారా 1.75 బిలియన్ డాలర్లు పొందే ఒప్పందం తుది దశలో ఉన్నట్లు వేదాంతా తెలియజేసింది. 2023 మార్చివరకూ అన్ని రకాల రుణ చెల్లింపులనూ పూర్తి చేసినట్లు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. గత 11 నెలల్లో 2 బిలియన్ డాలర్ల రుణాలను తిరిగి చెల్లించినట్లు పేర్కొంది. జూన్‌కల్లా చేపట్టవలసిన చెల్లింపులకూ తగిన లిక్విడిటీని కలిగి ఉన్నట్లు వెల్లడించింది. బార్క్లేస్, స్టాన్‌చార్ట్ బ్యాంకుల నుంచి తీసుకున్న 25 కోట్ల డాలర్ల రుణాలను పూర్తిగా చెల్లించినట్లు ఇటీవలే కంపెనీ పేర్కొంది. -
ప్రైవేటీకరణ దిశగా ప్రభుత్వ బ్యాంకు.. స్పష్టత ఇచ్చిన కేంద్రం!
ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణను వాయిదా వేస్తున్నట్లు వస్తున్న వార్తల్ని కేంద్రం ఖండించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ నిర్వహణలోని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ (దీపం) విభాగం అధికారిక ప్రకటన చేసింది. ఐడీఐబీ బ్యాంక్‌ను వ్యూహాత్మక అమ్మక ప్రణాళికలు కొనసాగుతున్నట్లు తెలిపింది. ముందస్తు ఆసక్తి వ్యక్తీకరణ( Expression of Interest (EOI)దశలో ఉన్నట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా ప్రైవేటీకరణపై దీపం సెక్రటరీ తుహిన్‌కాంత పాండే ట్వీట్లు చేశారు. ఐడీబీఐ బ్యాంక్ కొనుగోలు కోసం ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఈఏఐలు దాఖలయ్యాయని, ఐడీబీఐ బ్యాంకులో 60.72 శాతం వాటాను ప్రభుత్వం, ఎల్ఐసీ సంయుక్తంగా విక్రయించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం కేంద్రం, ఆర్బీఐ ఐడీబీఐ కొనుగోలు చేసేందుకు దాఖలైన బిడ్లను పరిశీలిస్తుంది. ప్రభుత్వం, ఆర్బీఐ నుంచి భద్రతాపరమైన అనుమతులు వచ్చిన వెంటనే రెండో దశ బిడ్ల ప్రక్రియ ప్రారంభం కానుందని తుహిన్‌కాంత పాండే పేర్కొన్నారు. ఐడీబీఐలో కేంద్రం,ఎల్ఐసీ వాటా ఎంతంటే కేంద్రం, ఎల్ఐసీ ఈ రెండింటికీ ఐడీబీఐ బ్యాంకులో 94.72 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఎల్ఐసీకి 49.24 శాతం, ప్రభుత్వానికి 45.48 శాతం చొప్పున వాటా ఉంది. విక్రయంలో భాగంగా ఎల్ఐసీ 30.24 శాతం, ప్రభుత్వం 30.48 శాతం చొప్పున వాటాలు ఆఫర్ చేయనున్నాయి. విక్రయానంతరం ప్రభుత్వం 15%, ఎల్ఐసీ 19% చొప్పున వాటాలను కలిగి ఉంటాయి. -
ఎన్ఎండీసీలో ఎల్ఐసీ వాటా విక్రయం
న్యూఢిల్లీ: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) తాజాగా ఎన్ఎండీసీలో 2 శాతం వాటాను విక్రయించింది. దీంతో ఈ కంపెనీలో ఎల్ఐసీ వాటా మార్చి 14 నాటికి 11.69 శాతానికి వచ్చి చేరింది. తద్వారా రూ.700 కోట్లు సమకూరింది. బహిరంగ మార్కెట్లో 2022 డిసెంబర్ 29 నుంచి 2023 మార్చి 14 మధ్య 5.88 కోట్ల షేర్లను ఒక్కొక్కటి సగటున రూ.119.37కు ఎల్ఐసీ విక్రయించింది. ఈ విక్రయం ఫలితంగా ఎల్ఐసీ హోల్డింగ్ 13.699 శాతంనుంచి 11.69శాతానికి దిగి వచ్చిందని కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజ్కి తెలియజేసింది. దీంతో షేర్ల పరంగా ఎన్ఎండిసిలో ఎల్ఐసీ హోల్డింగ్ 40,14,72,157 నుండి 34,25,97,574 ఈక్విటీ షేర్లకు తగ్గింది. ఇది కూడా చదవండి: లగ్జరీ ఫ్లాట్లకు ఇంత డిమాండా? మూడు రోజుల్లో రూ. 8 వేల కోట్లతో కొనేశారు! 250 కోట్ల బిగ్గెస్ట్ ప్రాపర్టీ డీల్: మాజీ ఛాంపియన్, బజాజ్ ఆటో చైర్మన్ రికార్డు -
డెల్హివరీలో తగ్గిన సాఫ్ట్‌బ్యాంక్ వాటా
న్యూఢిల్లీ: జపనీస్ ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ సప్లై చైన్ కంపెనీ డెల్హివరీలో 3.8 శాతం వాటాను విక్రయించింది. బీఎస్ఈ బ్లాక్‌డీల్ సమాచారం ప్రకారం అనుబంధ సంస్థ ఎస్వీఎఫ్ డోర్‌బెల్(కేమన్) ద్వారా 2.8 కోట్ల షేర్లను అమ్మివేసింది. ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా షేరుకి రూ. 340.8 సగటు ధరలో విక్రయించిన వీటి విలువ రూ. 954 కోట్లకుపైనే. షేర్లను కొనుగోలు చేసిన సంస్థల జాబితాలో సౌదీ అరేబియన్ మానిటరీ అథారిటీ, సిటీ ఆఫ్ న్యూయార్క్ గ్రూప్ ట్రస్ట్, సొసైటీ జనరాలి, బీఎన్పీ పరిబాస్ ఆర్బిట్రేజ్ తదితరాలున్నాయి. కాగా.. తాజా లావాదేవీ తదుపరి డెల్హివరీలో ఎస్వీఎఫ్ డోర్‌బెల్ వాటా 18.42 శాతం నుంచి 14.58 శాతానికి తగ్గింది. బ్లాక్‌డీల్ వార్తల నేపథ్యంలో డెల్హివరీ షేరు బీఎస్ఈలో 2.2 శాతం క్షీణించి రూ. 341 వద్ద స్థిరపడింది. -
షేర్ల విక్రయంతో అదానీకి నిధులు
న్యూఢిల్లీ: లిస్టెడ్ కంపెనీలు నాలుగింటిలో స్వల్పంగా వాటాలు విక్రయించినట్లు ప్రయివేట్ రంగ డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ తాజాగా పేర్కొంది. తద్వారా 1.87 బిలియన్ డాలర్లు(రూ. 15,446 కోట్లు) సమకూర్చుకున్నట్లు వెల్లడించింది. అమెరికా ఈక్విటీ పెట్టుబడుల కంపెనీ జీక్యూజీ పార్టనర్స్‌కు షేర్లను విక్రయించినట్లు తెలియజేసింది. సెకండరీ మార్కెట్లో బ్లాక్ డీల్స్ ద్వారా అదానీ ఎంటర్ప్రైజెస్(ఏఈఎల్), అదానీ పోర్ట్స్ అండ్ సెజ్(ఏపీసెజ్), అదానీ గ్రీన్ ఎనర్జీ(ఏజీఈఎల్), అదానీ ట్రాన్స్మిషన్ లిమిటెడ్(ఏటీఎల్)లకు చెందిన మైనారిటీ వాటాలను విక్రయించినట్లు అదానీ గ్రూప్ ఒక ప్రకటనలో పేర్కొంది. దేశీ మౌలిక సదుపాయాల రంగ అభివృద్ధి, విస్తరణలో కీలక పెట్టుబడిదారుగా అదానీ గ్రూప్ కంపెనీలలో జీక్యూజీ ఇన్వెస్ట్ చేసినట్లు తెలియజేసింది. రానున్న నెలల్లో 2 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 16,500 కోట్లు) రుణ చెల్లింపులు చేపట్టవలసి ఉన్న నేపథ్యంలో వాటాల విక్రయం ప్రాధాన్యతను సంతరించుకుంది. గ్రూప్ మొత్తం రూ. 2.21 లక్షల కోట్ల రుణ భారాన్ని కలిగి ఉంది. దీనిలో వచ్చే ఆర్థిక సంవత్సరం(2023–24)లోగా 8 శాతం రుణాలను తిరిగి చెల్లించవలసి ఉంది. ప్రమోటర్ల వాటా ఇలా అదానీ గ్రూప్‌లోని ప్రధాన కంపెనీలు ఏఈఎల్‌లో ప్రమోటర్లకు 72.6 శాతం వాటా ఉంది. దీనిలో తాజాగా 3.39 శాతం వాటాకు సమానమైన 3.8 కోట్ల షేర్లను జీక్యూజీకి విక్రయించింది. తద్వారా రూ. 5,460 కోట్లు లభించాయి. ఇక ఏపీసెజ్‌లో గల 66% వాటాలో 4.1% వాటాను విక్రయించింది. 8.8 కోట్ల షేర్లకుగాను రూ. 5,282 కోట్లు పొందింది. ఈ బాటలో ఏటీఎల్‌లో 73.9% వాటా కలిగిన అదానీ గ్రూప్ 2.5% వాటాకు సమానమైన 2.8 కోట్ల షేర్లను అమ్మింది. రూ. 1,898 కోట్లు అందుకుంది. ఏజీఈఎల్‌లో గల 60.5% వాటాలో 3.5% వాటాను విక్రయించింది. 5.5 కోట్ల షేర్ల ద్వారా రూ. 2,806 కోట్లు లభించాయి. ఈ లావాదేవీలకు జెఫరీస్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ బ్రోకర్‌గా వ్యవహరించింది. కాగా.. అదానీ గ్రూప్ కంపెనీలలో ఇన్వెస్ట్ చేసినందుకు ఉత్సాహపడుతున్నట్లు జీక్యూజీ పార్టనర్స్ చైర్మన్, సీఐవో రాజీవ్ జైన్ తెలిపారు. దేశీయంగా, ప్రపంచవ్యాప్తంగా అదానీ కంపెనీలు భారీస్థాయిలో, కీలక మౌలిక సదుపా యాల ఆస్తులను కలిగి ఉండటంతోపాటు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఆయన తరం ఉత్తమ వ్యాపారవేత్తలలో ఒకరిగా గుర్తింపు పొందినట్లు ప్రస్తావించారు. -
అంబానీ చేతికి హైదరాబాద్ కంపెనీ, లోటస్ చాకొలెట్లో రిలయన్స్ మరింత వాటా
న్యూఢిల్లీ: లోటస్ చాకొలెట్లో మరో 26 శాతం వాటా కొనుగోలుకి రిలయన్స్ గ్రూప్ కంపెనీలు రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ ఓపెన్ ఆఫర్ ప్రకటించాయి. లోటస్ చాకొలెట్ వాటాదారుల నుంచి ఈ వాటాను సొంతం చేసుకునేందుకు ఓపెన్ ఆఫర్ చేపట్టనున్నట్లు తెలియజేశాయి. ఇందుకు షేరుకి రూ. 115.5 ధరను నిర్ణయించినట్లు 2 సంస్థల తరఫున ఆఫర్‌ను చేపట్టనున్న డీఏఎం క్యాపిటల్ తెలియజేసింది. తద్వారా 33.38 లక్షల షేర్లను కొనుగోలు చేయనున్నట్లు తెలియజేసింది. పూర్తి వాటాకు రూ. 38.56 కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించింది. ఓపెన్ ఆఫర్ ఫిబ్రవరి 21న ప్రారంభమై మార్చి 6న ముగియనున్నట్లు పబ్లిక్ నోటీస్ ద్వారా తెలియజేసింది. 3 నెలల గరిష్టం రిలయన్స్ సంస్థలు కన్నేయడంతో లోటస్ చాకొలెట్ షేరు బీఎస్ఈలో గురువారం రూ. 149ను దాటి ముగిసింది. ఇది మూడు నెలల గరిష్టంకాగా.. శుక్రవారం(6న) సైతం షేరు 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 157 సమీపంలో నిలిచింది. కంపెనీ చాకొలెట్లు, కోకోవా ప్రొడక్టులు, డెరివేటివ్స్‌ను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. రిలయన్స్ కన్జూమర్.. రిలయన్స్ రిటైల్ ఎఫ్ఎంసీజీ విభాగంకాగా.. ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ కంపెనీలివి. లోటస్ చాకొలెట్లో గత వారమే రిలయన్స్ కన్జూమర్ ప్రమోటర్ల నుంచి 51 శాతం వాటాను చేజిక్కించుకుంది. -
హెచ్డీఎఫ్సీ ఏఎంసీలో వాటాలు విక్రయం!
న్యూఢిల్లీ: హెచ్డీఎఫ్సీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలో (ఏఎంసీ) తనకున్న మొత్తం 10.21 శాతం వాటాలను విక్రయించాలని ఏబీఆర్డీఎన్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ (ఏఐఎం) యోచిస్తోంది. ప్రతిపాదిత లావాదేవీ తర్వాత నుంచి హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ కో–స్పాన్సర్‌గా ఏఐఎం పక్కకు తప్పుకోనుంది. హెచ్డీఎఫ్సీ ఏఎంసీ ఈ విషయాలు వెల్లడించింది. హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (హెచ్డీఎఫ్సీ), ఏఐఎం (గతంలో స్టాండర్డ్ లైఫ్ ఇన్వెస్ట్మెంట్స్) జాయింట్ వెంచర్‌గా హెచ్డీఎఫ్సీ ఏఎంసీ కార్యకలాపాలు సాగిస్తోంది. ఆగస్టులో ఏఐఎం 5.58 శాతం వాటాలను సుమారు రూ. 2,300 కోట్లకు బహిరంగ మార్కెట్ లావాదేవీ ద్వారా విక్రయించింది. ప్రస్తుతం మిగిలిన 10.21 శాతం వాటాల్లో 9.9 శాతం వాటాలను ఒకే కొనుగోలుదారుకు విక్రయించాలని, మిగతాది వేరుగా అమ్మాలని భావిస్తోంది. -
మ్యాక్స్ ఫిన్‌కు సుమితోమో వాటా
న్యూఢిల్లీ: మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో మిగిలిన వాటాను కొనుగోలు చేసేందుకు బీమా నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ తాజాగా మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌ను అనుమతించింది. దీంతో మిత్సుయి సుమితోమో కంపెనీకి గల 5.17 శాతం వాటాను రానున్న రెండు వారాల్లోగా సొంతం చేసుకునే వీలున్నట్లు మ్యాక్స్ ఫైనాన్షియల్ పేర్కొంది. షేరుకి రూ. 85 ధరలో 9.91 కోట్ల మ్యాక్స్ లైఫ్ షేర్లను కొనుగోలు చేయనున్నట్లు మాతృ సంస్థ వెల్లడించింది. ఈ కొనుగోలు తదుపరి మ్యాక్స్ లైఫ్‌లో మాతృ సంస్థ వాటా 87 శాతానికి బలపడనుంది. గతంలో మ్యాక్స్ లైఫ్‌లో మిత్సుయి సుమితోమో 25.48 శాతం, మ్యాక్స్ ఫైనాన్షియల్ 72.52 శాతం చొప్పున వాటాలను కలిగి ఉండేది. -
యాక్సిస్ బ్యాంక్‌కు కేంద్రం గుడ్‌బై!
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ నుంచి ప్రభుత్వం పూర్తిగా వైదొలగనుంది. యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ప్రత్యేక విభాగం (ఎస్‌యూయూటీఐ) ద్వారా మిగిలిన 1.55% వాటాను ప్రభుత్వం విక్రయించనున్నట్లు యాక్సిస్ బ్యాంకు తాజాగా పేర్కొంది. మొత్తం 4,65,34,903 షేర్లను ప్రభుత్వం ఆఫర్ చేయనున్నట్లు బ్యాంక్ వెల్లడించింది. తద్వారా ప్రభుత్వానికి సుమారు రూ. 4,000 కోట్లు లభించే వీలుంది. వెరసి యాక్సిస్ బ్యాంకు నుంచి ప్రభుత్వం పూర్తిగా వైదొలగనుంది. కాగా.. గతేడాది మే నెలలోనూ ప్రభుత్వం ఎస్‌యూయూటీఐ ద్వారా యాక్సిస్ బ్యాంకులో 1.95 శాతం వాటాను విక్రయించింది. ఈ వార్తల నేపథ్యంలో యాక్సిస్ బ్యాంక్ షేరు 4% పతనమై రూ. 841 వద్ద ముగిసింది. -
ఎయిరిండియాకు ఎయిర్ ఏషియా వాటా
న్యూఢిల్లీ: బడ్జెట్ ధరల విమానయాన సంస్థ ఎయిర్ఏషియా ఇండియాలో మిగిలిన వాటాను ప్రయివేట్ రంగ దిగ్గజం ఎయిరిండియా సొంతం చేసుకోనుంది. ఇందుకు వాటా విక్రయ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు మలేషియన్ కంపెనీ ఎయిర్ఏషియా తాజాగా వెల్లడించింది. అయితే ఒప్పందం పూర్తి వివరాలు వెల్లడికాలేదు. టాటా గ్రూప్, మలేషియన్ కంపెనీ భాగస్వామ్యంలో ఏర్పాటైన ఎయిర్ఏషియా ఇండియా 2014 జూన్‌లో కార్యకలాపాలు ప్రారంభించింది. టాటా సన్స్‌కు 83.67 శాతం, ఏషియా ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్‌కు 16.33 శాతం చొప్పున వాటా ఉంది. ఈ ఏడాది జూన్‌లో ఎయిరేషియాలో పూర్తి వాటాను ఎయిరిండియా కొనుగోలు చేసేందుకు సీసీఐ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కాగా.. జనవరిలో ప్రభుత్వం నుంచి ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లను టాటా గ్రూప్ చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. తదుపరి ఈ రెండింటితోపాటు.. విస్తారా, ఎయిర్ఏషియా ఇండియా బిజినెస్‌లను కన్సాలిడేట్(ఏకీకృతం) చేసే సన్నాహాలు ప్రారంభించింది. -
అంబుజా సిమెంట్ కొనుగోలు, అదానీకి భారీ షాక్!
న్యూఢిల్లీ: సంస్థాగత ఇన్వెస్టర్ల సలహా సంస్థ ఐఐఏఎస్ తాజాగా అదానీ కుటుంబం చేపట్టిన పెట్టుబడుల సమీకరణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఓటు చేయవలసిందిగా అంబుజా సిమెంట్స్ వాటాదారులకు సూచించింది. వారంట్ల జారీ ద్వారా రూ. 20,000 కోట్ల సమీకరణకు అంబుజా సిమెంట్స్ సన్నాహాలు చేస్తోంది. అంతేకాకుండా స్వతంత్ర డైరెక్టర్లుగా అమీత్ దేశాయ్, పుర్వీ షేథ్ ఎంపికను సైతం వ్యతిరేకించవలసిందిగా ఐఐఏఎస్ సిఫారసు చేసింది. ఏసీసీలో 50.05 శాతం వాటాను కలిగి ఉన్న అంబుజా సిమెంట్స్ శనివారం(8న) అత్యవసర వాటాదారుల సమావేశాన్ని(ఈజీఎం) నిర్వహిస్తోంది. మొత్తం 12 ప్రతిపాదనలపై వాటాదారుల అనుమతిని కోరనుంది. వీటిలో ప్రిఫరెన్షియల్ కేటాయింపుల ద్వారా 47.74 కోట్ల వారంట్ల జారీ ప్రతిపాదన సైతం ఉంది. షేరుకి దాదాపు రూ. 419 ధరలో అదానీ గ్రూప్ సంస్థ హార్మోనియా ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్‌కు వారంట్ల కేటాయింపు ద్వారా రూ. 20,001 కోట్లను సమీకరించే యోచనలో ఉంది. బోర్డులో గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, కుమారుడు కరణ్ అదానీసహా ఇద్దరు డైరెక్టర్లు, మరో నలుగురు స్వతంత్ర డైరెక్టర్ల ఎంపికకు అనుమతులను కోరనుంది. కారణాలివీ.. అదానీ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న ఐఐఏఎస్ ఇందుకు పలు కారణాలను పేర్కొంది. వారంట్లను మార్పిడి చేశాక ఈక్విటీ 19.4 శాతంమేర విస్తరించనుంది. ఇది అత్యధికంకాగా.. ప్రమోటర్ల వాటా ప్రస్తుత 63.1 శాతం నుంచి 70.3 శాతానికి పెరగనుంది. అంతేకాకుండా వారంట్ల ఇష్యూ ధర ప్రస్తుత రూ. 500తో పోలిస్తే 16 శాతంపైగా తక్కువ(డిస్కౌంట్). హోల్సిమ్ గ్రూప్ నుంచి కొనుగోలు చేసిన ధర కంటే 8.8 శాతం ప్రీమియం. అంబుజా సిమెంట్స్ ఇప్పటికే రూ. 3,840 కోట్ల నగదు, తత్సమాన నిల్వలు కలిగి ఉంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన చూస్తే ఇవి రూ. 8,500 కోట్లు. ఎన్ఎస్ఈలో అంబుజా సిమెంట్స్ షేరు 3.7 శాతం జంప్‌చేసి రూ. 526 వద్ద ముగిసింది. చదవండి👉 ‘అదానీ సంపద హాంఫట్’ ఒక్కరోజే వేలకోట్ల నష్టం..కారణం ఏంటో తెలుసా -
ఐడీబీఐ బ్యాంక్ విక్రయం షురూ
న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటైజేషన్ ప్రక్రియకు ప్రభుత్వం తాజాగా తెరతీసింది. ఎల్ఐసీతో కలసి మొత్తం 60.72 శాతం వాటాను విక్రయించనుంది. ఇందుకు ఆసక్తి వ్యక్తీకరణ బిడ్స్(ఈవోఐ)కు ఆహ్వానం పలికింది. ఆసక్తి గల సంస్థలు బిడ్స్ దాఖలు చేసేందుకు డిసెంబర్ 16 వరకూ గడువును ప్రకటించింది. ప్రస్తుతం బ్యాంకులో బీమా రంగ పీఎస్‌యూ ఎల్ఐసీకి 49.24 శాతం వాటా ఉంది. ప్రభుత్వం 45.48 శాతం వాటాను కలిగి ఉంది. వెరసి సంయుక్తంగా 94.72 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ప్రైవేటైజేషన్‌లో భాగంగా ప్రభుత్వం 30.48 శాతం, ఎల్ఐసీ 30.24 శాతం చొప్పున వాటాలు విక్రయించనున్నాయి. వాటాలతోపాటు బ్యాంకులో యాజమాన్య నియంత్రణను సైతం బదిలీ చేయనున్నట్లు బిడ్స్‌కు ఆహ్వానం పలికిన దీపమ్ వెల్లడించింది. ఇందుకు పలు నిబంధనలు వెల్లడించింది. డీల్ తదుపరి సంయుక్త వాటా 34 శాతానికి పరిమితంకానుంది. నిబంధనలివీ..: ఐడీబీఐ కొనుగోలుకి ఈవోఐ దాఖలు చేసే కంపెనీలు కనీసం రూ. 22,500 కోట్ల నెట్‌వర్త్‌ను కలిగి ఉండాలి. అంతేకాకుండా గత ఐదేళ్లలో మూడేళ్లపాటు లాభాలు ఆర్జించిన కంపెనీకి మాత్రమే బిడ్డింగ్‌కు అర్హత లభిస్తుంది. కన్సార్షియంగా ఏర్పాటైతే నాలుగు కంపెనీలను మించడానికి అనుమతించరు. విజయవంతమైన బిడ్డర్ కనీసం ఐదేళ్లపాటు బ్యాంకులో 40% వాటాను తప్పనిసరిగా లాకిన్ చేయాలి. భారీ పారిశ్రామిక, కార్పొరేట్ హౌస్‌లు, వ్యక్తులను బిడ్డింగ్‌కు అనుమతించరు. ఈ వార్తల నేపథ్యంలో ఐడీబీఐ బ్యాంక్ షేరు 0.7 శాతం బలపడి రూ. 43 వద్ద ముగిసింది. ఈ ధరలో 60.72 శాతం వాటాకు రూ. 27,800 కోట్లు లభించే వీలుంది. -
వారీ ఎనర్జీస్‌కు రూ.1,000 కోట్లు
న్యూఢిల్లీ: సోలార్ మాడ్యూల్స్ తయారీలో ఉన్న వారీ ఎనర్జీస్ రూ.1,000 కోట్ల నిధులను సమీకరించింది. ప్రైవేట్ ఇన్వెస్టర్స్ నుంచి ఈ మొత్తాన్ని స్వీకరించినట్టు సంస్థ సీఎండీ హితేష్ దోషి తెలిపారు. ఈ నిధులతో ఫోటోవోల్టాయిక్ మాడ్యూల్స్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 9 గిగావాట్లకు చేర్చనున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం ఇది 5 గిగావాట్లు ఉంది. 2023 జనవరి నాటికి విస్తరణ పూర్తి అవుతుందని పేర్కొన్నారు. గుజరాత్‌లోని చిక్లిలో ఉన్న కంపెనీకి చెందిన మాడ్యూల్స్ తయారీ కేంద్రం వద్ద 5.4 గిగావాట్ల సోలార్ సెల్స్ తయారీ యూనిట్ సైతం స్థాపిస్థామన్నారు. సోలార్ పీవీ మాడ్యూల్స్ తయారీలో భాగంగా ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకంలో పాలుపంచుకోనున్నట్టు గుర్తు చేశారు. వారీ ఎనర్జీస్ ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ (ఈపీసీ), ప్రాజెక్ట్ డెవలప్మెంట్, రూఫ్‌టాప్ సొల్యూషన్స్ అందించడంతోపాటు సోలార్ వాటర్ పంప్స్ తయారీలోనూ ఉంది. -
సబ్సీడీలపై కొత్త మార్గదర్శకాలు!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ కంపెనీ(పీఎస్ఈ)లు ఇకపై అనుబంధ సంస్థలలో వాటా విక్రయించాలంటే తాజా మార్గదర్శకాలను పాటించవలసి ఉంటుంది. పెట్టుబడులు, పబ్లిక్ ఆస్తుల నిర్వహణ సంస్థ(దీపమ్) ఇందుకు మార్గదర్శకాలను జారీ చేసింది. వీటి ప్రకారం విక్రయ ప్రతిపాదనలను సంబంధిత పాలనా(ఎడ్మినిస్ట్రేటివ్) శాఖలకు పీఎస్ఈలు దాఖలు చేయవలసి ఉంటుంది. ఇప్పటివరకూ అనుబంధ సంస్థలలో మెజారిటీ లేదా మైనారిటీ వాటాలు, యూనిట్ల విక్రయాలను దీపమ్ చేపడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. సబ్సిడరీలలో వాటాల విక్రయంపై పీఎస్ఈలు నిర్ణయం తీసుకునేందుకు ఈ ఏడాది జూన్‌లో క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ బాటలో అనుబంధ సంస్థలకు చెందిన వ్యూహాత్మక వాటాలు, యూనిట్లు, భాగస్వామ్య సంస్థల విక్రయానికి దీపమ్ తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. వెరసి ఇకపై పీఎస్ఈ మాతృ సంస్థల బోర్డులు వ్యూహాత్మక విక్రయ ప్రతిపాదనలను సంబంధిత పాలనా శాఖలకు పంపించవలసి ఉంటుంది. వీటిని పరిశీలించిన ఆయా శాఖలు తదుపరి దీపమ్‌కు నివేదిస్తాయి. కేంద్ర ఆర్థిక మంత్రి అధ్యక్షతన డిజిన్వెస్ట్‌మెంట్‌పై ఏర్పాటయ్యే ఆల్టర్నేటివ్ మెకనిజం నుంచి ఈ ప్రతిపాదనలకు ముందస్తు అనుమతిని దీపమ్ పొందుతుంది. ఈ నిర్ణయాలను పీఎస్ఈలకు తెలియజేస్తారు. వెరసి మాతృ సంస్థ బోర్డులు ఈ లావాదేవీలను చేపట్టేందుకు వీలుంటుంది. -
అమ్మకానికి సువెన్ ఫార్మా!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కంపెనీ అమ్మకం లేదా మెజారిటీ వాటా విక్రయానికి సువెన్ ఫార్మాస్యూటికల్స్ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. మెజారిటీ వాటా అమ్మకం విషయమై సలహా కోసం ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్‌ను నియమించు కున్నట్టు తెలుస్తోంది. కంపెనీని విక్రయించేందుకు ప్రైవేట్ ఈక్విటీ, వ్యూహాత్మక సంస్థలతో చర్చలు జరుగుతున్నాయి. సువెన్ ఫార్మాస్యూటికల్స్‌లో ప్రమోటర్లకు 60 శాతం వాటా ఉంది. డీల్ ద్వారా వచ్చే మొత్తాన్ని సువెన్ లైఫ్ సైన్సెస్‌లో ఔషధాల అభివృద్ధికి ఖర్చు చేయనున్నారు. ఇప్పటి వరకు సువెన్ ఫార్మా నుంచి డివిడెండ్ రూపంలో సమకూరిన మొత్తాన్ని ప్రమోటర్లు ఇందుకోసం వ్యయం చేశారు. సువెన్ లైఫ్ నుంచి 2020లో సువెన్ ఫార్మా విడిపోయింది. క్రితం ముగింపుతో పోలిస్తే సువెన్ ఫార్మాస్యూటికల్స్ షేరు ధర బీఎస్ఈలో బుధవారం 1.52 శాతం ఎగసి రూ.491.10 వద్ద స్థిరపడింది. -
‘సెబు’ ప్రాజెక్టును విక్రయిస్తున్న జీఎంఆర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫిలిప్పైన్స్‌లోని సెబు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో తనకున్న 40 శాతం వాటాను జీఎంఆర్ గ్రూప్ విక్రయిస్తోంది. అమ్మకం కారణంగా కంపెనీ రూ.1,330 కోట్లు అందుకోవడంతోపాటు రాబోయే కాలంలో నాలుగేళ్లకుపైగా ఆదాయం స్వీకరించనుంది. జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఇంటర్నేషనల్ బీవీ, అబూటిజ్ ఇన్ఫ్రా క్యాపిటల్ మధ్య ఈ మేరకు ఒప్పందం కుదిరింది. జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ రుణ భారం తగ్గించడం, అధిక రాబడి కోసం ఆస్తులను మళ్లించడంపై దృష్టి సారించడంలో భాగంగా ఈ వాటాను ఉపసంహరించుకుంటున్నట్టు కంపెనీ శుక్రవారం ప్రకటించింది. 2026 డిసెంబర్ వరకు సాంకేతిక సేవలను జీఎంఆర్ అందించనుంది. సెబు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టును 2014లో జీఎంఆర్ దక్కించుకుంది. -
అదానీ దూకుడు, ఓపెన్ ఆఫర్ డేట్ ఫిక్స్, షేర్ ప్రైస్ ఎంతంటే?
న్యూఢిల్లీ: మీడియా సంస్థ ఎన్డీటీవీలో అదనంగా 26 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు అదానీగ్రూప్ మరింత వేగంగా అడుగులు వేస్తోంది. ఈ వాటా కొనుగోలుకు సంబంధించి తన ఓపెన్ ఆఫర్‌ను అక్టోబర్ 17న ప్రారంభించనుంది.1.67 కోట్ల ఈక్విటీ షేర్లను కొనుగోలుకు సంబంధించిన ఈ ఓపెన్ ఆఫర్లో ఒక్కో షేరు ధర రూ. 294గా నిర్ణయించిందని జేఎం ఫైనాన్షియల్ ప్రకటించింది. గౌతమ్ అదానీ నేతృత్వంలోని గ్రూప్ అనుబంధ సంస్థల ద్వారా బహుళ-లేయర్డ్ లావాదేవీలతో ఎన్డీటీవీలో మొత్తం 55శాతం వాటాను కొనుగోలు చేయాలని యోచిస్తోంది. అదానీ గ్రూప్, మీడియా సంస్థలో 29.18వాటాను కొనుగోలు చేయాలనే గ్రూప్ ప్రణాళికలకు అనుగుణంగా, ఓపెన్ ఆఫర్ కోసం తాత్కాలిక ప్రారంభ తేదీగా అక్టోబర్ 17ని నిర్ణయించింది.ఇష్యూకు మేనేజర్ జేఎం ఫైనాన్షియల్ పబ్లిక్ ప్రకటన ప్రకారం, ఆఫర్ తాత్కాలికంగా నవంబర్ 1న ముగియనుంది. ఓపెన్ ఆఫర్‌కు అనుగుణంగా, ఓపెన్ ఆఫర్లో పూర్తి అంగీకారం ఉందని భావించి, కొనుగోలుదారు, ఓటింగ్ షేర్ క్యాపిటల్‌లో 26శాతం వరకు పొందవలసి ఉంటుంది. ఒక్కో షేరుకు రూ. 294 ధరతో పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయితే, ఓపెన్ ఆఫర్ మొత్తం రూ. 492.81 కోట్లుగా ఉంటుంది. (ఢిల్లీ టూ సిమ్లా: విమాన టికెట్ ధర కేవలం రూ. 2480) కాగా ఆగస్టు 23న, ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్‌లో 99.99 శాతం వాటాను కలిగి ఉన్న విశ్వప్రధాన కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ కొనుగోలు ద్వారా ఎన్డీటీవీలో 29.18 శాతం వాటాను కొనుగోలు చేస్తున్నట్లు అదానీ గ్రూప్ ప్రకటించింది. అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్‌కు చెందిన ఏఎంజీ మీడియా నెట్వర్క్ లిమిటెడ్‌లో భాగమైన వీపీసీఎల్ వాటా తీసుకున్నామని వివరించింది. ఎన్డీటీవీలో ఆర్ఆర్పీఆర్ ప్రమోటర్ గ్రూప్ కంపెనీ. ఇందులో 29.18 శాతం వారికి వాటా ఉంది. ఎన్డీటీవీలో మరో 26 శాతం వాటా కొనుగోలుకు వీసీపీఎల్, ఏఎంఎన్ఎల్, ఏఈఎల్ కలిసి ఓపెన్ ఆఫర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. (Share Pledging Case: కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు భారీ ఊరట!) -
సెబీ అనుమతిపై ఎన్డీటీవీ ప్రమోటర్లకు అదానీ కౌంటర్
న్యూఢిల్లీ: ఎన్డీటీవీ ప్రమోటర్ సంస్థ ఆర్ఆర్పీఆర్లో వాటాను సొంతం చేసుకునేందుకు సెబీ అనుమతులు అవసరంలేదని అదానీ గ్రూప్ తాజాగా పేర్కొంది. ఆర్ఆర్పీఆర్ లేవనెత్తిన అంశాలు నిరాధారమని, న్యాయపరంగా ఆమోదనీయంకావని, సత్యదూరాలని వ్యాఖ్యానించింది. దీంతో వెనువెంటనే వారంట్ల స్థానే ఈక్విటీల కేటాయింపునకు డిమాండ్ చేస్తున్నట్లు తెలియజేసింది. ఆర్ఆర్పీఆర్కు ఇచ్చిన రుణాలకుగాను పొందిన వారంట్లను ఈక్విటీగా మార్పు చేసుకునేందుకు అదానీ గ్రూప్ సంస్థ వీసీపీఎల్ నిర్ణయించడం తెలిసిందే. తద్వారా ఎన్డీటీవీ ప్రమోటర్ సంస్థలో 99.5% వాటాను పొందనుంది. ఫలితంగా ఎన్డీటీవీలో ఆర్ఆర్పీఆర్కు గల 29.18% వాటాను సొంతం చేసుకోనుంది. కాగా నవంబర్ 2020లో క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ తన ప్రమోటర్లను షేర్లను కొనడం లేదా విక్రయించకుండా రెండేళ్లపాటు నిషేధించిందని, అందువల్ల నవంబర్ వరకు వీసీపీఎల్‌కు షేర్లను బదిలీ చేయడం సాధ్యం కాదని పేర్కొన్న ఎన్డిటివి స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌పై అదానీ గ్రూప్ స్పందించింది. -
అమ్మకానికి ప్రభుత్వ రంగ సంస్థ వాటా, కేంద్ర ఖజానాలోకి రూ.36 వేల కోట్లు!
న్యూఢిల్లీ: హిందుస్తాన్ జింక్ లిమిటెడ్ (హెచ్‌జెడ్‌ఎల్)లో కేంద్ర ప్రభుత్వం తనకున్న 29.53 శాతం వాటా విక్రయ వ్యవహారాలు చూసేందుకు ఐదు మర్చంట్ బ్యాంకర్లను ఎంపిక చేసింది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్, యాక్సిస్ క్యాపిటల్, సిటీగ్రూపు గ్లోబల్ మార్కెట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ ఉన్నాయి. ప్రభుత్వానికి ఆరు వరకు మర్చంట్ బ్యాంకర్లు వాటాల విక్రయ వ్యవహరాల గురించి ప్రెజెంటేషన్ ఇచ్చినట్టు అధికార వర్గాలు తెలిపాయి. మర్చంట్ బ్యాంకర్ల కోసం దీపమ్ ఈ ఏడాది జూలైలో బిడ్లను ఆహ్వానించింది. ఎంపికైన మర్చంట్ బ్యాంకర్లు, సకాలంలో వాటాలు విక్రయించడం, ఇన్వెస్టర్ల అభిప్రాయాలు తెలుసుకోవడం, ఇన్వెస్టర్ రోడ్ షోలు, నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు తీసుకోవడం తదితర వ్యవహరాల్లో దీపమ్‌కు సేవలు అందిస్తాయి. హిందుస్తాన్ జింక్‌లో ప్రభుత్వం వాటాల విక్రయంతో రూ.36,000 కోట్ల వరకు సమకూర్చుకునే అవకాశం ఉంది. -
మరో సంస్థను అమ్మకానికి పెడుతోన్న కేంద్రం!
న్యూఢిల్లీ: మెటల్ రంగ దిగ్గజం హిందుస్తాన్ జింక్‌లో ప్రభుత్వానికిగల వాటా విక్రయ నిర్వహణను చేపట్టేందుకు మర్చంట్ బ్యాంకర్ సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. హింద్ జింక్‌లో ప్రభుత్వానికి 29.53 శాతం వాటా ఉంది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్, యాక్సిస్ క్యాపిటల్, సిటీగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ జాబితాలో ఉన్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఈ సంస్థలు శుక్రవారం(12న) వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వాటా విక్రయ నిర్వహణపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇవ్వనున్నట్లు వెల్లడించాయి. కంపెనీలో ప్రస్తుతం వేదాంతా గ్రూప్ 64.92 శాతం వాటాను కలిగి ఉంది. చదవండి👉 రెండు బ్యాంకులకు కేంద్రం మంగళం..అమ్మకానికి సర్వం సిద్ధం? -
బీపీసీఎల్ 'ఫర్ సేల్' ..కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు!
నిర్ణీత సమయంలో పరిస్థితిని సమీక్షించిన తర్వాత భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) వాటా విక్రయ ప్రక్రియను తిరిగి ప్రారంభించడంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఆర్థిక శాఖ సహాయమంత్రి భగవత్ కిషన్రావ్ కరాద్ లోక్‌సభలో ఈ విషయాన్ని వెల్లడించారు. కోవిడ్ మహమ్మారి, ఇంధన ధరల అనిశ్చితి, భౌగోళిక–రాజకీయ పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశ్రమలను ప్రభావితం చేశాయని మంత్రి పేర్కొంటూ, ఇందులో చమురు, గ్యాస్ పరిశ్రమ ప్రధానమైనదని తెలిపారు. ఆ పరిస్థితుల ప్రభావంతోనే బీపీసీఎల్ వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ (మెజారిటీ వాటా) కోసం ప్రస్తుత ఈఓఐ (ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్) ప్రక్రియను నిలిపివేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు. బీపీసీఎల్‌లో 52.98 శాతం వాటాలను విక్రయించడానికి సంబంధించిన ఆఫర్‌ను ప్రభుత్వం మేలో ఉపసంహరించింది. బీపీసీఎల్ వ్యూహాత్మక వాటా విక్రయానికి 2020లో బిడ్డర్ల నుంచి ఈఓఐలను ఆహ్వానించడం జరిగింది. 2020 నవంబర్ నాటికి మూడు బిడ్స్ దాఖలయ్యాయి. ఇంధన ధరలపై అస్పష్టత తత్సంబంధ అంశాల నేపథ్యంలో తదనంతరం ఇరువురు బిడ్స్ ఉపసంహరించుకున్నారు. దీనితో మొత్తం బిడ్డింగ్ పక్రియను కేంద్రం వెనక్కు తీసుకుంది. అప్పట్లో బిడ్స్ వేసిన సంస్థల్లో మైనింగ్ దిగ్గజం అనిల్ అగర్వాల్‌కు చెందిన వేదాంత గ్రూప్, యుఎస్ వెంచర్ ఫండ్స్ అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్ ఇంక్, ఐ స్క్వేర్డ్ క్యాపిటల్ అడ్వైజర్స్ ఉన్నాయి. -
జొమాటోకు మరో ఎదురు దెబ్బ
న్యూఢిల్లీ: ఫుడ్ డెలివరీ యాప్ జొమాటోకు మరో షాక్ తగిలింది. పెట్టుబడి సంస్థ టైగర్ గ్లోబల్ బహిరంగ మార్కెట్లో 18.45 కోట్ల షేర్లను విక్రయించడం ద్వారా కంపెనీలో దాదాపు సగం వాటాను 2.77 శాతానికి తగ్గించుకున్నట్లు జోమాటో గురువారం తెలిపింది. న్యూయార్క్‌కు చెందిన హెడ్జ్ ఫండ్ కంపెనీ టైగర్ గ్లోబల్ తన వాటాను దాదాపు సంగానికి తగ్గించుకుంది. జూలై 25 నుంచి ఆగస్ట్ 2 మధ్య ఓపెన్ మార్కెట్లో 18.45 కోట్ల షేర్లను విక్రయించడంతో టైగర్ గ్లోబల్‌కు చెందిన ఇంటర్నెట్ ఫండ్-6 వాటా 5.11 నుంచి 2.77 శాతానికి వచ్చి చేరింది. (భారత్ వాణిజ్యానికి సంస్కరణలు కీలకం) టైగర్ గ్లోబల్ మొదటిసారిగా సెప్టెంబర్ 2020లో జొమాటోలో 102.5 మిలియన్లడాలర్ల మేర పెట్టుబడి పెట్టింది. ఫిబ్రవరి 2021లో 250 మిలియన్ల డాలర్లు ఫండింగ్ చేసింది. ఆగస్ట్ 3 నాటికి జొమాటో మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు 5.74 బిలియన్ డాలర్లుగాఉంది. కాగా, జొమాటోలో రూ.3,088 కోట్ల విలువైన 61.2 కోట్ల షేర్లను ట్యాక్సీ సేవల సంస్థ ఉబర్ ఓపెన్ మార్కెట్లో బుధవారం విక్రయించిన సంగతి తెలిసిందే. (OnePlus10T 5G: వన్‌ప్లస్ 10 టీ వచ్చేసింది..ఆఫర్ అదిరింది!) (ఇదీ చదవండి: అయిదేళ్లలో రెండింతలు: డిజిటల్ రేడియోకు అదరిపోయే వార్త) -
'మా వాటా మేం అమ్మేస్తున్నాం'..జొమాటోకు మరో షాక్!
ప్రముఖ రైడ్ షేరింగ్ సంస్థ ఉబర్..దేశీయ ఫుడ్ ఆగ్రిగ్రేటర్ జొమాటోకు భారీ షాకిచ్చింది. ఆ సంస్థలో ఉన్న 7.8శాతం స్టేక్‌ను అమ్మేందుకు ఉబర్ సిద్ధమైంది. 7.8 శాతం వాటాల అమ్మకంతో ఉబర్‌కు రూ.3,305 కోట్ల వస్తాయని అంచనా వేస్తుంది. తక్కువలో తక్కువ డీల్ పరిమాణం రూ.2,938.6 కోట్లు ఉండనుంది. భారత్‌లో ఉబర్ తన ఫుడ్ డెలివరీ విభాగమైన ఉబెర్ ఈట్స్‌ను జొమాటోకు అమ్మేసింది. ఆ సమయంలో ఉబర్..జొమాటోలో వాటాను కొనుగోలు చేసింది. ఆ సమయంలో స్టాక్ లావాదేవీ డీల్ విలువ రూ.1,376 కోట్లుగా ఉంది. ఇప్పుడు ఆ స్టేక్‌ను ఉబర్ అమ్మేయడంతో ఉబర్‌కు కనీసం 2.5శాతం లాభం పొందవచ్చని భావిస్తోంది. పోటీ పడుతున్న అమెరికన్ కంపెనీలు జొమాటోలో ఉన్న తన వాటాను ఆగస్ట్ 5కి క్లోజ్ చేయాలని ఉబర్ భావిస్తుంది. ఈ తరుణంలో జొమాటోలోని తన షేర్లను ఉబర్ ఎవరికి అమ్మేస్తుందని అంశంపై టర్మ్ షీట్లో వెల్లడించలేదు. అయినప్పటికీ ఉబర్ అమ్మే 7.8% వాటాను కొనుగోలు చేసేందుకు అమెరికాకు చెందిన అనేక మంది సంస్థాగత పెట్టుబడిదారులు పోటీ పడుతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. వెయ్యి కోట్లు లాస్ జొమాటో ప్రీ-ఐపీవో వాటాదారులకు ఒక సంవత్సరం లాక్ ఇన్ పీరియడ్ జులై 23న ముగిసింది. లాక్ ఇన్ పీరియడ్ ముగిసిన వారం తర్వాత ఉబర్ తన జొమాటోలోని తన వాటాల్ని అమ్మేందుకు సిద్ధమైనట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు లాక్ ఇన్ పీరియడ్ ముగిసిన తర్వాత మార్కెట్ ప్రారంభమైన జులై 25 ఒక్కరోజే జొమాటో సుమారు వెయ్యి కోట్లు నష్టపోయిన విషయం తెలిసిందే. -
అప్పుల ఊబి, వాటల విక్రయం..ఫ్యూచర్ ఎంటర్‌ప్రైజెస్‌కు వేల కోట్లు!
న్యూఢిల్లీ: రుణ ఊబిలో ఉన్న ఫ్యూచర్ గ్రూపు కంపెనీ ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ దివాలా ప్రక్రియ బారిన పడకుండా చర్యల మార్గం పట్టింది. ఫ్యూచర్ జనరాలి ఇన్సూరెన్స్ కంపెనీల్లో తనకున్న వాటాలను విక్రయించడం ద్వారా రూ.3,000 కోట్లను సమకూర్చుకోనుంది. ఈ నిధులతో రుణభారం తగ్గించుకోవాలన్నది కంపెనీ వ్యూహం. ఫ్యూచర్ జనరాలి ఇండియా ఇన్సూరెన్స్ అన్నది ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్, జనరాలి భాగస్వామ్య సంస్థ. ఇది సాధారణ బీమా సంస్థ. ఇందులో తనకున్న వాటాలో 25 శాతాన్ని భాగస్వామి జనరాలికి రూ.1,266 కోట్లను విక్రయించినట్టు గత వారమే ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ ప్రకటించింది. ఈ లావాదేవీ తర్వాత కూడా ఫ్యూచర్ జనరాలిలో ఫ్యూచర్ ఎంటర్ ప్రైజెస్‌కు 24.91 శాతం వాటా మిగిలే ఉంది. వచ్చే 30–40 రోజుల్లో మిగిలిన 25 శాతం వాటా విక్రయంతో రూ.1,250 కోట్లు లభిస్తాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇక ఫ్యూచర్ జనరాలి లైఫ్ ఇన్సూరెన్స్‌లో ఉన్న 33.3 శాతం వాటాను సైతం విక్రయించనుంది. దీని ద్వారా మరో రూ.400 కోట్ల వరకు రానున్నాయి. ఈ మూడు లావాదేవీలతో మొత్తం రూ.2,950 కోట్ల వరకు సమకూరతాయి. ఈ ఏడాది మార్చి 31 నాటికి చెల్లించాల్సిన రూ. 2,911 కోట్ల రుణాల విషయంలో ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ డిఫాల్ట్ అయింది. దీనికి అదనంగా 30 రోజుల సమీక్ష కాలంలోనూ చెల్లించలేకపోయింది. -
కీలక నిర్ణయం..వాటాలను విక్రయించేందుకు సిద్ధమైన హెచ్డీఎఫ్సీ క్యాపిటల్..!
న్యూఢిల్లీ: పీఈ అనుబంధ సంస్థ హెచ్డీఎఫ్సీ క్యాపిటల్ అడ్వయిజర్స్లో 10 శాతం వాటాను విక్రయించనున్నట్లు మార్టిగేజ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ తాజాగా పేర్కొంది. అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అధారిటీ (ఏడీఐఏ)కి చెందిన పూర్తి అనుబంధ సంస్థకు వాటాను రూ. 184 కోట్లకు విక్రయించనున్నట్లు వెల్లడించింది. కాగా.. 3 బిలియన్ డాలర్ల విలువైన హెచ్డీఎఫ్సీ క్యాపిటల్ నిర్వహణలోని ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్‌లోనూ ఏడీఐఏ ప్రధాన ఇన్వెస్టర్‌గా నిలుస్తుండటం గమనార్హం. 2016లో ఏర్పాటైన హెచ్డీఎఫ్సీ క్యాపిటల్.. అఫర్డబుల్ రియల్టీ ఫండ్స్ 1, 2, 3లకు ఇన్వెస్ట్మెంట్ మేనేజర్‌గా వ్యవహరిస్తోంది. చదవండి: హెచ్డీఎఫ్సీ సంస్థల మెగా విలీనం... ఆర్థికమంత్రితో ‘హెచ్డీఎఫ్సీ’ చీఫ్‌ల భేటీ -
మహీంద్రా సంచలన నిర్ణయం..! ఆ కంపెనీని పూర్తిగా అమ్మేసింది..!
ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా గ్రూప్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. దక్షిణకొరియాకు చెందిన శాంగ్యాంగ్ మోటార్స్‌ను పూర్గిగా అమ్మేసినట్లు తెలుస్తోంది. ఈ కంపెనీలో మహీంద్రా 75 శాతం మేర వాటాలను కల్గి ఉంది. దక్షిణకొరియాకు చెందిన శాంగ్యాంగ్ మోటార్స్‌ను 2010లో మహీంద్రా అండ్ మహీంద్రా వాటాలను కొనుగోలు చేసింది. తాజాగా భారీ నష్టాలు రావడంతో కంపెనీని వదులకునేందుకు మహీంద్రా సిద్దమైంది. అంతేకాకుండా భారీ అప్పులు శాంగ్‌యాంగ్‌ను వెంటాడాయి.దీంతో మహీంద్రా కంపెనీ వీటిలో ఇన్వెస్ట్ చేయడం నిలిపివేసింది. శాంగ్‌యాంగ్‌ను కొనుగోలుచేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. మహీంద్రా కొత్త కొనుగోలుదారుని కనుగొనడంలో విఫలమైనందున శాంగ్యాంగ్ మోటార్ చాలా నెలలుగా దక్షిణ కొరియా కోర్టు రిసీవర్‌షిప్‌లో ఉంది. ఎడిసన్ చేతిలోకి..! దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ ఎడిసన్ మోటార్స్ .కో నేతృత్వంలోని కన్సార్టియం అప్పుల ఊబిలో కూరుకుపోయిన శాంగ్యాంగ్ మోటార్ కో లిమిటెడ్‌ను కొనుగోలు చేసేందుకు అంగీకరించిందని శాంగ్యాంగ్ మోటార్ సోమవారం తెలిపింది. సుమారు 254.56 మిలియన్ డాలర్లకు స్థానిక దక్షిణకొరియా కన్సార్టియం కొనుగోలు చేసినట్లు కంపెనీ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. భారీ దెబ్బ..! ఇటీవలి కాలంలో శాంగ్‌యాంగ్‌కు మోటార్స్‌కు భారీ నష్టాలు వెంటాడాయి. కోవిడ్-19 రాకతో అది మరింత తీవ్రంగా మారింది. వాహన విక్రయాలు 2021లో 84,000కు తగ్గాయి.ఇది మునుపటి సంవత్సరంతో పోలిస్తే 21 శాతం తగ్గింది. దీంతో కంపెనీను అమ్మకానికి ఉంచింది. చదవండి: అదానీ గ్రూప్స్ మరో రికార్డు..! ఏకంగా రూ. 10 లక్షల కోట్లు..! -
డిష్ టీవీ ఫర్ సేల్..! పోటీలో ప్రధాన కంపెనీలు..!
లోన్ రికవరీలో భాగంగా డిష్ టీవీలో దక్కిన 25.6 శాతం వాటాలను యస్ బ్యాంకు అమ్మేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకుగాను యస్ బ్యాంకు దిగ్గజ శాటిలైట్ సంస్థలతో సంప్రదింపులు కూడా జరిపినట్లు సమాచారం. పోటీలో టాటా స్కై, భారతి ఎయిర్టెల్..! డిష్ టీవీను దక్కించుకునేందుకు దిగ్గజ శాటిలైట్ సంస్థలు టాటాస్కై, భారతీ ఎయిర్టెల్ ముందున్నట్లుగా తెలుస్తోంది. కాగా ఈ వ్యవహారంపై ఇరు కంపెనీలు స్పందించలేదు. డిష్ టీవీ, యస్ బ్యాంకుల మధ్య గత కొద్ది రోజల నుంచి అనిశ్చితి నెలకొంది. కంపెనీపై బాధ్యతలు తమకే ఉంటాయని ఇరు వర్గాలు వాదనలు చేస్తున్నాయి. వారికే బెనిఫిట్..! డిష్ టీవీ వ్యవహారాలను కంపెనీ ప్రమోటర్ సుభాష్ చంద్ర ఫ్యామిలీ కంపెనీ కార్యకలాపాలను చూసుకుంటుంది. వీరికి కంపెనీలో ఆరు శాతం వాటాలు కల్గి ఉన్నారు. ఒకవేళ యస్‌బ్యాంకు డిష్‌టీవీ వాటాలను టాటాస్కై, లేదా ఎయిర్టెల్ దక్కించుకుంటే ఆయా శాటిలైట్ టీవీ కంపెనీలు వాటా గణనీయంగా పెరగనుంది. శాటిలైట్ డిష్ టీవీ మార్కెట్లో 88 శాతంతో టాటాస్కై మొదటిస్థానంలో ఉంది. ఎయిర్టెల్, డిష్ టీవీలు తరువాతి స్థానాల్లో ఉన్నాయి. మార్చి 2021తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో డిష్ టీవీ ఆదాయం రూ.14 కోట్లుగా నమోదైంది. అలాగే రూ.67 కోట్ల నష్టాలను చవిచూసింది. డిష్ టీవీ మార్కెట్ విలువ రూ.8,268 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: 500 కోట్ల పరిహారం అడిగాడు.. ఆపై భార్యతో కలిసి ఫోన్లో బండబూతులు తిట్టాడు! -
ఆన్లైన్ కిరాణా బిజినెస్‌పై రిలయన్స్ భారీ డీల్..! ఏకంగా...!
దేశవ్యాప్తంగా ఆన్లైన్ కిరాణా వ్యాపారాన్ని మరింత వేగవంతం చేసేందుకుగాను ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిటైల్ చైన్ సంస్థ రిలయన్స్ రిటైల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్ డెలివరీ ప్లాట్‌ఫాం డంజోతో కలిసే పనిచేసేందుకు రిలయన్స్ రిటైల్ సిద్దమైంది. వాటాల కొనుగోలు....! ఆన్లైన్ కిరాణా డెలివరీ వ్యాపారంలో రిలయన్స్ రిటైల్ ఉనికిని విస్తరించేందుకుగాను ప్రముఖ ఆన్లైన్ డెలివరీ ప్లాట్‌ఫాం డంజోలో 25.8 శాతం వాటాలను రిలయన్స్ కొనుగోలుచేసినట్లు తెలుస్తోంది. ఈ డీల్ విలువ సుమారు రూ. 1,488 కోట్లు. తాజాగా రిలయన్స్ రిటైల్ నేతృత్వంలోని ఫండింగ్ రౌండ్లో డంజో సుమారు 240 మిలియన్ల డాలర్లను సేకరించింది. ఈ ఫండింగ్ రౌండ్లో ఇప్పటికే ఈ సంస్థకు ఇన్వెస్టర్లుగా ఉన్న లైట్‌బాక్స్, లైట్‌త్రాక్, 3ఎల్ క్యాపిటల్ , ఆల్టెరియా క్యాపిటల్ కూడా ఫండింగ్ రౌండ్లో పాల్గొన్నాయి. మరింత వేగవంతం..! డంజో భాగస్వామ్యంతో జియో మార్ట్, రిలయన్స్ రిటైల్ సేవలను మరింత వేగవంతంగా అందిస్తామని రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ డైరెక్టర్ ఇషా అంబానీ తెలిపారు. ఈ భాగస్వామ్యంతో డంజో తన సేవలను విస్తరించేందుకు ఎంతగానో ఉపయోగపడుతోందని కంపెనీ సహా వ్యవస్థాపకుడు కబీర్ బిశ్వాస్ అన్నారు. డంజో ఇప్పటివరకు భారత్‌లో 7 మెట్రో నగరాల్లో వేగవంతమైన డెలివరీ సేవలను అందిస్తోంది. కొద్ది రోజుల క్రితం డంజో డైలీ పేరుతో మరింత వేగవంతమైన డెలివరీ సేవలను ప్రారంభించింది. చదవండి: యూజర్ల ప్రైవసీతో చెలగాటం..! గూగుల్, మెటా సంస్థలకు దిమ్మతిరిగే షాక్..! -
అమ్మకానికి హైదరాబాద్ మెట్రో! ఎల్ అండ్ టీ కీలక నిర్ణయం?
ఎన్నో అంచనాల మధ్య ప్రారంభమైన హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకి కోవిడ్ సంక్షోభం శాపంగా మారింది. వరుస లాక్డౌన్లు, కఠిన నిబంధనలు, వర్క్‌ఫ్రం హోం వంటి కారణాల వల్ల నష్టాల ఊబి నుంచి బయటపడలేకపోతుంది. దీంతో హైదరాబాద్ మెట్రోలో తన వాటా అమ్మేందుకు ఎల్ అండ్ టీ సన్నాహలు చేస్తోంది. మెట్రో స్పీడుకి కోవిడ్ బ్రేకులు పబ్లిక్ , ప్రైవేటు పార్టనర్‌షిప్‌లో ప్రపంచలోనే అతి పెద్ద మెట్రోగా 71 కిలోమీటర్ల నిడివితో మూడు మార్గాల్లో హైదరాబాద్ మెట్రో ఘనంగా ప్రారంభమైంది. ఆరంభానికి తగ్గట్టే ప్రారంభించిన ఏడాదిలోపే నిత్యం 4.50 లక్షల మందిని వారి గమ్యస్థానాలకు చేరవేసే ప్రయాణ సాధనంగా మారింది. ఇక లాభాల రూట్లోకి వెళ్లడమే తరువాయి అనే సమయంలో కోవిడ్ సంక్షోభం వచ్చి పడి మెట్రో స్పీడుకి బ్రేకులు వేసింది. నష్టాల ట్రాక్‌లో కోవిడ్ ఫస్ట్ వేవ్ కారణంగా ఆరు నెలల పాటు మెట్రో రైలు నడవలేదు. ఆ తర్వాత కఠిన నిబంధనల మధ్య 2020 సెప్టెంబరులో మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి, క్రమంగా ప్రయాణికుల సంఖ్య పుంజుకుంటున్న తరుణంలో 2021 మేలో మరోసారి కరోనా సెకండ్ వేవ్ వచ్చి పడింది. ఫలితంగా మరోసారి మెట్రో సేవలు నిలిచిపోయాయి. దీంతో వరుసగా మెట్రో నష్టాలు పెరిగాయి. 2021 ఆర్థిక సంవత్సరంలో మెట్రో నష్టాలు రూ. 1,766 కోట్లకు చేరగా అంతకు ముందు ఏడాది ఈ నష్టం రూ. 382 కోట్లుగా నమోదైంది. మొత్తంగా రెండు వేలకు కోట్లకు పైగా నష్టాల్లో మెట్రో నడుస్తోంది. వర్క్‌ఫ్రం హోం ఎఫెక్ట్ కరోనా భయాలు పూర్తిగా తొలగిపోకపోవడంతో చాలా ఐటీ కంపెనీలు, ఇతర సంస్థలు వర్క్‌ఫ్రం హోంనే కొనసాగిస్తున్నాయి. దీంతో ఉద్యోగులు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. కోవిడ్ కారణంగా పడిన జీతాల కోతకు తోడు మెట్రో సర్వీసులు రెగ్యులర్‌గా నడకవపోవడంతో చాలా మంది ప్రత్యామ్నాయ రవాణాకు మారిపోయారు. దీంతో సెకండ్ వేవ్ ముగిసినా మెట్రో ప్రయాణానికి మొగ్గు చూపుతున్న వారి సంఖ్య పెరగడం లేదు. ఫలితంగా రోజువారి ప్రయాణికుల సంఖ్య 4.50 లక్షల నుంచి కేవలం ఒక లక్షకు పడిపోయింది. మరికొంత కాలం ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉండటంతో మెట్రో నష్టాలు తడిసి మోపెడు అవుడం ఖాయంగా మారింది. వాటా అమ్మకానికి సిద్ధం లాభాలు తెచ్చివ్వని సంస్థల్లో వాటాలు అమ్మేయాలని ఎల్ అండ్ టీ సంస్థ నిర్ణయించింది. అందులో భాగంగా పంజాబ్‌లోని పవర్ ప్రాజెక్టుతో పాటు హైదరాబాద్ మెట్రోలో వాటాను అమ్మాలని సంస్థాపరమైన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. హైదరాబాద్ మెట్రోలో 15 శాతం వాటా అమ్మకానికి ఎల్ అండ్ టీ రెడీ అవుతోంది. హైదరాబాద్ మెట్రోలో వాటాను వాటాను కొనుగోలు చేసేందుకు గ్రీన్కో సంస్థ సిద్ధంగా ఉందంటూ ఎల్ అండ్ టీ వైస్‌ప్రెసిడెంట్ డీకే సేన్ అన్నారు. అయితే దీనిపై గ్రీన్ సంస్థ నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. ప్రభుత్వం అనుమతిస్తుందా ? హైదరాబాద్ మెట్రో పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్‌షిప్‌లో నిర్మించిన ప్రాజెక్టు కావడంతో ఎల్ అండ్ టీ తన వాటాలను ఏకపక్షంగా అమ్మేయడానికి వీలులేదు. తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే వాటాల విక్రయానికి సంబంధించి ఎల్ అండ్ టీ సంస్థ నుంచి తమకు ఎటువంటి సమాచారం అందలేదని మెట్రో అధికారులు అంటున్నారు. సాయం అందేనా ? నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న హైదరాబాద్ మెట్రో రైలులో పెట్టుబడులు పెట్టేందుకు నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ ఫండ్ ముందుకు వచ్చినట్టు వార్తలు రావడం కొంత శుభ పరిణామంగా చెప్పుకోవాలిజ హైదరాబాద్ మెట్రోలో నాలుగు వేల కోట్ల రూపాయల పెట్టుబడికి నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ ఫండ్ సుముఖతగా ఉన్నట్టు సమాచారం. నష్టాల ఊబి నంచి బయట పడేందుకు గత కొంత కాలంగా సాఫ్ట్ రుణాల కోసం వివిధ బ్యాంకులను హైదరాబాద్ మెట్రో ఆశ్రయిస్తోంది. చదవండి : మెట్రో తడబాటు! ఏడాది సుమారు రూ.2 వేల కోట్ల నష్టం -
ఆ సంస్థలోని వాటాలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: బీపీసీఎల్
న్యూఢిల్లీ: పెట్రోనెట్ ఎల్ఎన్జీ, ఇంద్రప్రస్థ గ్యాస్(ఐజీఎల్)లో గల వాటాల విక్రయంపై ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని ప్రభుత్వ రంగ దిగ్గజం బీపీసీఎల్ వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం బీపీసీఎల్‌లో మెజారిటీ వాటా విక్రయ సన్నాహాల్లో ఉన్న నేపథ్యంలో కంపెనీ తాజా వివరణ ఇచ్చింది. బీపీసీఎల్‌ను సొంతం చేసుకోనున్న కొత్త ప్రమోటర్ పెట్రోనెట్, ఐజీఎల్ వాటాదారులకు ఓపెన్ ఆఫర్ ఇవ్వడంపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి మినహాయింపును కోరామని, స్పందన వెలువడవలసి ఉన్నదని కంపెనీ సీఎఫ్‌వో వీఆర్కే గుప్తా పేర్కొన్నారు. బీపీసీఎల్‌కు ఐజీఎల్‌లో 22.5 శాతం, పెట్రోనెట్‌లో 12.5%చొప్పున వాటాలు న్నాయి. ఈ 2 కంపెనీలకూ ప్రమోటర్‌గా వ్యవహరిస్తోంది. ప్రభుత్వం బీపీసీఎల్లోగల 52.98 శాతం వాటాను డిజిన్వెస్ట్ చేస్తున్న విషయం విదితమే. -
వీఎస్ఎన్ఎల్ నుంచి కేంద్రం ఔట్
సాక్షి, న్యూఢిల్లీ: టెలికం రంగ కంపెనీ టాటా కమ్యూనికేషన్స్(గతంలో వీఎస్ఎన్ఎల్) నుంచి కేంద్రం ప్రభుత్వం వైదొలగనుంది. కంపెనీలోని 26.12 శాతం వాటాను ప్రభుత్వం విక్రయించనుంది. ఇందుకు ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్), వ్యూహాత్మక విక్రయాలకు తెరతీయనుంది. టాటా కమ్యూనికేషన్స్‌లో ప్రభుత్వానికున్న వాటాను ఓఎఫ్ఎస్ ద్వారా విక్రయించనున్నట్లు పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ(దీపమ్) తాజాగా పేర్కొంది. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం వాటా విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ. 8,400 కోట్లవరకూ లభించే వీలుంది. బుధవారాని(20)కల్లా లావాదేవీలను పూర్తిచేయనున్నట్లు దీపమ్ వెల్లడించింది. తద్వారా వీఎస్ఎన్ఎల్ నుంచి ప్రభుత్వం పూర్తిగా వైదొలగనుంది. ఓఎఫ్ఎస్లో విక్రయంకాకుండా మిగిలిన వాటాను వ్యూహాత్మక భాగస్వామి పానటోన్ ఫిన్‌వెస్ట్‌కు ఆఫర్ చేయనున్నట్లు దీపమ్ తెలియజేసింది. పీఎస్‌యూ సంస్థ వీఎస్‌ఎన్‌ఎల్‌ను 2002లో ప్రైయివేటైజ్ చేసిన సంగతి తెలిసిందే. తదుపరి ఈ సంస్థ టాటా కమ్యూనికేషన్స్‌గా ఆవిర్భవించింది. కాగా.. బీఎస్ఈలో టాటా కమ్యూనికేషన్స్ షేరు 1 శాతం బలపడి రూ. 1130 వద్ద ముగిసింది. -
జెడ్‌ఎన్‌జెడ్ ఫార్మా చేతికి సెలన్ ల్యాబ్స్
హైదరాబాద్, సాక్షి: హైదరాబాద్‌కు చెందిన స్పెషాలిటీ జనరిక్స్ ఫార్మా కంపెనీ సెలన్ ల్యాబ్స్‌లో జెడ్‌ఎన్‌జెడ్ ఫార్మా2 మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. యూకే బయోఫార్మా కంపెనీ జెడ్‌ఎన్‌జెడ్ ఫార్మా ఇందుకు రూ. 364 కోట్లను వెచ్చిస్తోంది. తద్వారా సెలన్ ల్యాబ్స్‌లో 74 శాతం వాటాను సొంతం చేసుకుంది. జెడ్‌ఎన్‌జెడ్ ఫార్మా2లో సీడీసీ గ్రూప్, డెవలప్మెంట్ పార్టనర్స్ ఇంటర్నేషనల్, పునర్నిర్మాణ, అభివృద్ధి యూరోపియన్ బ్యాంక్ ప్రధాన వాటాలు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. ఇటీవల మూడు ఇన్వెస్ట్మెంట్ సంస్థల ద్వారా జెడ్‌ఎన్‌జెడ్ ఫార్మా 25 కోట్ల డాలర్లను(రూ. 1,850 కోట్లు) సమీకరించింది. ఈ నిధులలో రూ. 200 కోట్లను సెలన్ ల్యాబ్స్ విస్తరణకు వినియోగించనున్నట్లు తెలుస్తోంది. 26 శాతం వాటా క్రిటికల్ కేర్, అంకాలజీ విభాగాలలో ఓరల్, ఇంజక్టబుల్స్ ఔషధాల తయారీకి వీలుగా హైదరాబాద్‌లో కొత్త ప్లాంటును ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సెలన్ ల్యాబ్స్ ఎండీ మిద్దే నగేష్ కుమార్ తెలియజేశారు. గత ఆర్థిక సంవత్సరం(2019-20)లో సెలన్ ల్యాబ్స్ రూ. 200 కోట్ల ఆదాయం సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరం(2020-21)లో రూ. 250 కోట్ల అమ్మకాలు నమోదుకాగలవని అంచనా వేస్తున్నట్లు నగేష్ పేర్కొన్నారు. సెలన్ విక్రయం నేపథ్యంలో కంపెనీ ప్రమోటర్లు విమల్ కుమార్ కావూరు, విజయ్ కుమార్ వాసిరెడ్డి తమ ఫార్మసీ బిజినెస్‌పై దృష్టి సారించనున్నట్లు చెప్పారు. సెలన్‌లో 26 శాతం వాటాతో ప్రమోటర్లు కొనసాగనున్నట్లు నగేష్ తెలియజేశారు. జెడ్‌ఎన్‌జెడ్ ఫార్మా అజమాయిషీలో కంపెనీని ప్రొఫెషనల్స్ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఫార్మా సిటీలో సెలన్ ల్యాబ్స్ కొత్తగా ఏర్పాటు చేయతలపెట్టిన ప్లాంటును హైదరాబాద్‌లోని షామీర్పేట లేదా త్వరలో ప్రారంభంకానున్న ఫార్మా సిటీ వద్ద ఏర్పాటు చేసే అవకాశమున్నట్లు నగేష్ కుమార్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్త రెగ్యులేటెడ్ మార్కెట్లపై దృష్టితో ఈ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం కంపెనీ ఆసియా పసిఫిక్, లాటిన్ అమెరికా, సీఐఎస్ తదితర 45 దేశాలకు ప్రొడక్టులను విస్తరించినట్లు తెలియజేశారు. అయితే కొత్త ప్లాంటు ద్వారా రెగ్యులేటెడ్ మార్కెట్లకు సైతం విస్తరించే యోచనలో ఉన్నట్లు వివరించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని పారిశ్రామికవాడలోగల రెండు యూనిట్ల ద్వారా కంపెనీ అంకాలజీ, క్రిటికల్ కేర్ విభాగాలలో ప్రొడక్టులను రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. -
రిలయన్స్ రీటైల్లో మరో భారీ పెట్టుబడి
సాక్షి, ముంబై : రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) కు చెందిన రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్‌ఆర్‌విఎల్) మరో భారీ పెట్టుబడిని సాధించింది. ప్రపంచంలోని అతిపెద్ద సావరిన్ వెల్త్ ఫండ్లలో ఒకటైన సౌదీ అరేబియాకు చెందిన పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (పీఐఎఫ్) 2.04 శాతం వాటాలను కొనుగోలు చేయనుంది. దీంతో రిలయన్స్ రీటైల్లో గ్లోబల్ ఇన్వెస్టర్ల నుంచి వచ్చిన ఎనిమిదవ పెట్టుబడిగా ఇది నిలిచింది. (కరోనా : లక్ష కోట్ల అంబానీ సంపద ఆవిరి) భారతదేశంలో అతిపెద్ద రిటైల్ చెయిన్ రిలయన్స్ రీటైల్‌తో చేసుకున్న ఈ ఒప్పందం విలువ .9,555 కోట్ల రూపాయలని(సుమారు 3 1.3 బిలియన్లు) అని రిలయన్స్ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. తాజాడీల్తో రిలయన్స్ రీటైల్ ప్రీ-మనీ ఈక్విటీ విలువ రూ. 4.587 లక్షల కోట్లు (సుమారు 62.4 బిలియన్లు)గా ఉండనుంది. సౌదీతో తమకు దీర్ఘకాల సంబంధం ఉందనీ, భారత రిటైల్ రంగంలో విశేష మార్పులకు ఇదొక ప్రతిష్టాత్మక ప్రయాణమంటూ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ పెట్టుబడి భారతదేశ ఆర్థికవ్యవస్థను, పీఐఎఫ్ ఉనికిని మరింత బలోపేతం చేస్తుందన్నారు. ఆర్‌ఆర్‌విఎల్ ఇప్పటివరకు 10.09 శాతం వాటాలను 47,265 కోట్ల రూపాయలకు విక్రయించింది. సింగపూర్ సావరిన్ వెల్త్‌ఫండ్ జీఐసీ, టీపీజీ అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, ముబదాలాఇన్వెస్ట్‌మెంట్ కో, జనరల్ అట్లాంటిక్, కేకేఆర్, సిల్వర్ లేక్ (రెండుసార్లు) సంస్థలనుంచి పెట్టుబడులనుసాధించిన సంగతి తెలిసిందే. కాగా పీఐఎఫ్ ఇంతకుముందు రిలయన్స్ టెలికాం విభాగం జియో ప్లాట్‌ఫామ్‌లలో 2.32 శాతం వాటాను కొనుగోలు చేసింది. -
టాటా గ్రూప్ చేతికి బిగ్‌బాస్కెట్!
ఆన్లైన్ గ్రోసరీ స్టార్టప్ కంపెనీ బిగ్‌బాస్కెట్‌ను పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్ కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు వీలుగా రెండు సంస్థల మధ్య ఇప్పటికే ప్రారంభమైన చర్చలు పురోగతిలో ఉన్నట్లు సంబంధివర్గాలు పేర్కొన్నాయి. బిగ్‌బాస్కెట్‌లో మెజారిటీ వాటాను బిలియన్ డాలర్ల(సుమారు రూ. 7,350 కోట్లు)కు సొంతం చేసుకునే వీలున్నట్లు తెలుస్తోంది. గ్రూప్‌లోని కన్జూమర్ బిజినెస్‌లన్నిటినీ కలుపుతూ ఇటీవల టాటా గ్రూప్ సూపర్ యాప్‌ను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. దేశీయంగా ఇటీవల అమెజాన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ తదితర దిగ్గజాలు ఈకామర్స్ మార్కెట్లో కార్యకలాపాలను వేగవంతంగా విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టాటా గ్రూప్ సైతం పటిష్ట ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. కాగా.. ఈ అంశంపై ఇటు టాటా గ్రూప్, అటు బిగ్‌బాస్కెట్ పెదవి విప్పకపోవడం గమనార్హం! పోటీ తీవ్రం బెంగళూరు కేంద్రంగా ప్రారంభమైన ఆన్లైన్ గ్రోసరీ కంపెనీ బిగ్‌బాస్కెట్ ఇప్పటికే వాల్‌మార్ట్‌కు మెజారిటీ వాటాగల ఫ్లిప్‌కార్ట్, యూఎస్ దిగ్గజం అమెజాన్.. తదితరాలతో పోటీని ఎదుర్కొంటోంది. కోవిడ్-19 నేపథ్యంలో ఇటీవల ఆన్లైన్ సర్వీసులకు డిమాండ్ పెరుగుతూ వస్తోంది. బిగ్‌బాస్కెట్‌లో చైనీస్ ఆన్లైన్ దిగ్గజం అలీబాబా 26 శాతం వాటాను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే డీల్‌లో భాగంగా అలీబాబా సైతం మొత్తం వాటాను విక్రయించే వీలున్నట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. కాగా.. బిగ్‌బాస్కెట్‌లో మెజారిటీ వాటా కోసం టాటా గ్రూప్ 50-70 కోట్ల డాలర్లను వెచ్చించే అవకాశమున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల 20 కోట్ల డాలర్లను సమీకరించేందుకు టాటా గ్రూప్‌తో బిగ్‌బాస్కెట్ చర్చలు నిర్వహించినట్లు తెలుస్తోంది. -
ఫ్లిప్‌కార్ట్, ఆదిత్యా బిర్లా డీల్
సాక్షి, ముంబై: ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ (ఏబీఎఫ్ఆర్ఎల్) మరో బిగ్ డీల్ కుదుర్చుకుంది. ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తమసంస్థలో వాటాలను కొనుగోలు చేస్తున్నట్టు ప్రకటించింది. పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లా గ్రూప్‌నకు చెందిన ఆదిత్య బిర్లా ఫ్యాషన్ లో 7.8 వాటాను 1,500 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయనుంది. ఈమేరకు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ప్రిఫరెన్షియల్ కేటాయింపుల ద్వారా రూ .205 (షేరుకు) ఫ్లిప్‌కార్ట్ కొనుగోలు చేయనుంది. ఫ్లిప్‌కార్ట్-ఏబీఎఫ్ఆర్ఎల్ ఒప్పందం ఇప్పటివరకు ఆఫ్‌లైన్ వినియోగదారుల స్థలంలో 2020 యొక్క రెండవ పెద్ద ఒప్పందం అవుతుంది. ఈ ఏడాది ఆగస్టులో, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) యూనిట్ రిటైల్ వెంచర్స్ రిటైల్ మరియు హోల్‌సేల్ వ్యాపారంతో పాటు కిషోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ గ్రూప్ నుండి లాజిస్టిక్స్ మరియు గిడ్డంగుల వ్యాపారాన్ని 24,713 కోట్ల రూపాయల స్థూల మొత్తానికి ఆందోళనకు గురిచేసింది.వాటా విక్రయం ఎబిఎఫ్ఆర్ఎల్ ప్రమోటర్ , ప్రమోటర్ గ్రూప్ కంపెనీలు వాటాలు 55.13 శాతానికి చేరనున్నట్లు వెల్లడించింది. ఈ ఒప్పందం ద్వారా దేశీ దుస్తుల మార్కెట్లో కంపెనీ మరింత విస్తరించే వీలున్నట్లు ఏబీ ఫ్యాషన్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా వ్యాఖ్యానించారు. రానున్న ఐదేళ్లలో దేశీయ వస్త్ర పరిశ్రమ 100 బిలియన్ డాలర్లను తాకనుందని తెలిపారు. ఫ్లిప్‌కార్ట్‌కు వాటా విక్రయం ద్వారా లభించే నిధులను బ్యాలన్స్‌షీట్ పటిష్టతకు, వృద్ధి అవకాశాలకూ వినియోగించనున్నట్లు కంపెనీ తెలియజేసింది. ఈ వార్తల తరువాత, ఏబిఎఫ్ఆర్ఎల్ షేర్లు శుక్రవారం 3.5 శాతం ఎగిసాయి. 2020 లో ఏబీఎఫ్ఆర్ఎల్ చేసుకున్న రెండవ అతిపెద్ద డీల్ గా నిలిచింది. ఈ ఏడాది ఆగస్టులో, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) యూనిట్ రిటైల్ వెంచర్స్ కిషోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ గ్రూప్ లాజిస్టిక్స్ గిడ్డంగుల వ్యాపారాన్ని 24,713 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. సుమారు 3,000 దుకాణాల నెట్వర్క్ ఆదిత్యా బిర్లా ష్యాషన్ సొంతం. 23,700 మల్టీ-బ్రాండ్ అవుట్లెట్లలో ఉంది. పాంటలూన్స్ రిటైల్ ఫార్మాట్‌తో పాటు పీటర్ ఇంగ్లాండ్, అలెన్ సోలీ, వాన్ హ్యూసెన్, లూయిస్ ఫిలిప్ వంటి బ్రాండ్లను నిర్వహిస్తుంది.ఈ సముపార్జనతో, వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ తన ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లైన మింత్రా తోపాటు, ఏబీఎఫ్ఆర్ఎల్ అంతర్జాతీయ, జాతీయ ప్రీమియం బ్రాండ్లను కూడా విక్రయించనుంది. -
వినతీ కొత్త రికార్డ్- ఎస్సెల్ ప్రొ పతనం
హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలతో కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న ఫార్మా రంగ కంపెనీ వినతీ ఆర్గానిక్స్ కౌంటర్‌కు మరోసారి డిమాండ్ కనిపిస్తోంది. అయితే మరోవైపు పీఈ దిగ్గజం బ్లాక్‌స్టోన్ వాటాను విక్రయించనున్నట్లు వెల్లడికావడంతో ప్యాకేజింగ్ దిగ్గజం ఎస్సెల్ ప్రొప్యాక్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి వినతీ ఆర్గానిక్స్ షేరు భారీ లాభాలతో సందడి చేస్తుంటే.. ఎస్సెల్ ప్రొప్యాక్ నష్టాలతో కళ తప్పింది. వివరాలు ఇలా.. వినతీ ఆర్గానిక్స్ లాక్‌డవున్‌ల నేపథ్యంలోనూ ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో జోరందుకున్న వినతీ ఆర్గానిక్స్ మరోసారి దూకుడు చూపుతోంది. ఎన్ఎస్ఈలో తొలుత వినతీ షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 1355ను తాకింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 3 శాతం లాభంతో రూ. 1325 వద్ద ట్రేడవుతోంది. గత వారం రోజుల్లోనే వినతీ షేరు 36 శాతం దూసుకెళ్లడం విశేషం! ఈ ఏడాది క్యూ1లో నికర లాభం 12 శాతమే క్షీణించి రూ. 72 కోట్లను తాకగా.. మొత్తం ఆదాయం సైతం స్వల్పంగా తగ్గి రూ. 232 కోట్లకు చేరింది. అయితే ఇబిటా మార్జిన్లు 0.7 శాతం బలపడి 42 శాతంగా నమోదయ్యాయి. క్యూ2 ఫలితాలపై ఆశావహ అంచనాలు ఈ కౌంటర్‌కు జోష్‌నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఎస్సెల్ ప్రొప్యాక్ లామినేటెడ్ ట్యూబ్స్ ప్యాకేజింగ్ దిగ్గజం ఎస్సెల్ ప్రొప్యాక్‌లో మెజారిటీ వాటా కలిగిన బ్లాక్‌స్టోన్ సంస్థ ఎప్సిలాన్ బిడ్కో 23 శాతం వాటాను విక్రయించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఎస్సెల్ ప్రొప్యాక్‌లో ఎప్సిలాన్‌కు 75 శాతం వాటా ఉంది. ఇందుకు రూ. 225 ఫ్లోర్ ధరను నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. బ్లాక్‌డీల్స్ ద్వారా 7.25 కోట్ల షేర్లను బ్లాక్‌స్టోన్ సంస్థ విక్రయించనున్నట్లు వివరించాయి. తద్వారా బ్లాక్‌స్టోన్ రూ. 1850 కోట్లు సమకూర్చుకునే వీలుంది. ఈ నేపథ్యంలో ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఎస్సెల్ ప్రొప్యాక్ షేరు 6.25 శాతం పతనమై రూ. 256 దిగువన ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 252 దిగువకూ చేరింది. కాగా.. నేటి ట్రేడింగ్‌లో తొలి గంటన్నరలోనే బీఎస్ఈలో 7.68 కోట్లకుపైగా షేర్లు చేతులు మారినట్లు నిపుణులు పేర్కొన్నారు. గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 22,400 షేర్లు మాత్రమేకావడం గమనార్హం. తద్వారా బ్లాక్‌స్టోన్ గ్రూప్ 23 శాతం వాటాను విక్రయించినట్లు చెబుతున్నారు. -
రిలయన్స్ రిటైల్‌లో కార్లయిల్‌కు వాటా!
డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ విభాగం రిలయన్స్ రిటైల్‌లో మరో పీఈ దిగ్గజం కార్లయిల్ గ్రూప్ వాటా కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా రిలయన్స్ రిటైల్‌లో 150-200 కోట్ల డాలర్ల(సుమారు రూ. 14,700 కోట్లు) వరకూ కార్లయిల్ గ్రూప్ ఇన్వెస్ట్ చేయవచ్చని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. ఇందుకు రెండు కంపెనీల మధ్య చర్చలు నడుస్తున్నట్లు విశ్లేషకులు ఊహిస్తున్నారు. అయితే ఈ అంశంపై అటు ఆర్ఐఎల్, ఇటు కార్లయిల్ గ్రూప్ ప్రతినిధులు స్పందించలేదంటూ ఈ వార్తల విశ్లేషణ సందర్భంగా ఆంగ్ల మీడియా పేర్కొంది. కాగా, ఈ డీల్ కుదిరితే.. దేశీ కంపెనీలో కార్లయిల్ చేస్తున్న అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్గా నిలవనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. అంతేకాకుండా దేశీ రిటైల్ రంగ కంపెనీలో కార్లయిల్ తొలిసారి వాటా సొంతం చేసుకున్నట్లు అవుతుందని తెలియజేశారు. కాగా.. ఇటీవల రిలయన్స్ రిటైల్‌లో 1.75 శాతం వాటా కొనుగోలుకి పీఈ సంస్థ సిల్వర్ లేక్ ఒప్పందాన్ని కుదుర్చుకున్న విషయం విదితమే. ఇందుకు రూ. 7,500 కోట్లు వెచ్చించనుంది. తద్వారా రిలయన్స్ రిటైల్ విలువ రూ. 4.21 లక్షల కోట్లకు చేరినట్లు మార్కెట్‌వర్గాలు అంచనా వేశాయి కూడా! షేరు జోరు డిజిటల్ విభాగం జియో బాటలో రిలయన్స్ రిటైల్లోనూ వాటా విక్రయం ద్వారా భారీగా నిధుల సమీకరణ చేపట్టనున్న వార్తలతో రిలయన్స్ ఇండస్ట్రీస్ కౌంటర్‌కు మరోసారి డిమాండ్ పుట్టింది. ఎన్ఎస్ఈలో తొలుత ఆర్ఐఎల్ షేరు 2 శాతం ఎగసి రూ. 2,360ను తాకింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 0.7 శాతం లాభపడి రూ. 2,335 వద్ద ట్రేడవుతోంది. మరోపక్క ఆర్ఐఎల్ పీపీ షేరు సైతం 3 శాతం పుంజుకుని రూ. 1462కు చేరింది. దీంతో ఉదయం సెషన్లో కంపెనీ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రూ. 16.5 లక్షల కోట్లను తాకింది. వారాంతాన ఆర్ఐఎల్ మార్కెట్ క్యాప్ తొలిసారి రూ. 15 లక్షల కోట్లు(200 బిలియన్ డాలర్లు)ను అధిగమించడం ద్వారా దేశీ స్టాక్ మార్కెట్ల చరిత్రలో కొత్త రికార్డును లిఖించిన సంగతి తెలిసిందే. -
రిలయన్స్ రిటైల్, అమెజాన్ డీల్?
సాక్షి, ముంబై: పెట్టుబడుల సమీకరణలో రిలయన్స్ రీటైల్ హవా కొనసాగుతోంది. పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) తన రిటైల్ విభాగం రిలయన్స్ రిటైల్ లో సుమారు 20 బిలియన్ల డాలర్ల విలువైన వాటాను అమెజాన్ కు విక్రయించాలని ప్లాన్ చేసింది. ఈ మేరకు అమెజాన్, రిలయన్స్ మధ్య చర్చలు జరిగినట్టు సమాచారం. ఈ లావాదేవీపై అమెజాన్ ఆసక్తి చూపుతున్నట్టు తాజా నివేదికల సమాచారం. సిల్వర్ లేక్ ఒప్పందాన్ని రిలయన్స్ నిర్ధారించిన తరువాత అమెజాన్ డీల్ చర్చల్లో నిలిచింది. (రిలయన్స్ రిటైల్‌లో: కేకేఆర్ భారీ పెట్టుబడి) కాగా రిలయన్స్ టెలికాం విభాగం జియోలో పెట్టుబడుల సునామీ తరువాత తాజాగా రీటైల్ విభాగంగాపై దృష్టిపెట్టారు ఈ క్రమంలో ఇప్పటికే అమెరికా ప్రైవేట్ ఈక్విటీ సంస్థ సిల్వర్ లేక్ పార్ట్నర్స్ రిలయన్స్ రిటైల్‌లో 1.75 శాతం వాటాను 7,500 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయనుంది. అలాగే కంపెనీలో బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులకు కేకేఆర్ చర్చలు జరుపుతోంది. దీంతోపాటు రిలయన్స్ రిటైల్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (ఏడీఐఐ), సౌదీ అరేబియాకు చెందిన పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (పీఐఎఫ్) సహా, పలు కంపెనీలు చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. (15 శాతం వాటాకు రూ. 63,000 కోట్లు!) -
రైల్వే శాఖపై కేంద్రం కీలక నిర్ణయం..!
న్యూఢిల్లీ: రైల్వే శాఖపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. కేంద్ర ప్రభుత్వం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్ప్ (ఐఆర్సీటీసీ) లోని తన వాటాల్లో కొంత షేర్ల భాగాన్ని ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా విక్రయించాలని(అమ్మకం) యోచిస్తోంది. ఈ నేపథ్యంలో పెట్టబడలకు సంబంధించిన సంస్థ (డీఐపీఏఎం) అమ్మకాల ప్రక్రియను నిర్వహించడానికి సెప్టెంబర్ 10 లోగా సెబీలో నమోదు చేసుకున్న మర్చంట్ బ్యాంకర్ల నుండి ప్రతిపాదనలను ఆహ్వానిస్తోంది. కాగా సెక్యూరిటీస్ అండ్ ఎక్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబి) నియమ నిబంధనలకు అనుగుణంగానే షేర్ల అమ్మాకలు కొనసాగుతాయని ప్రభుత్వం పేర్కొంది. మరోవైపు రెల్వేలో పనిచేసే ఉద్యుగలకు అర్హత ఉంటే షేర్లలో డిస్కౌంట్లు ప్రకటించే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. విక్రయ ప్రక్రియపై మర్చెంట్ బ్యాంకర్లు అధ్యయనం చేయాలని ప్రభుత్వం పేర్కొంది. కాగా సంస్థ మూలధనం రూ.250 కోట్లు కాగా, పెయిడ్ అప్ క్యాపిటల్ రూ .160 కోట్లు. ప్రస్తుతం రైల్వే శాఖ షేర్ క్యాపిటల్‌లో 87.40 శాతం వాటాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం బీఎస్ఇ లో(బాంబే స్టాక్ ఎక్స్చెంజ్) ఐఆర్సీటీసీ షేర్లు రూ .1,351.65 వద్ద ట్రేడవుతున్నాయి. -
వాటాల అమ్మకానికి ఆ బ్యాంకులు..
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల ప్రక్షాళనకు ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగానే ప్రభుత్వ రంగ బ్యాంకులు (పంజాబ్ ఎండ్ సింధ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యూకో బ్యాంక్, ఐడీబీఐ) తదితర బ్యాంక్‌లలో కేంద్ర ప్రభుత్వం మెజారిటీ వాటా ఉంది. అయితే కరోనా వైరస్, ఆర్థిక మాంధ్యం ప్రభావంతో బ్యాంకుల అభివృద్ధికి నిధుల కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో బ్యాంకుల పనితీరును మెరుగు పరిచేందుకు ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం వైపు ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. ఈ క్రమంలో పైన పేర్కొన్న (నాలుగు బ్యాంకుల) వాటాలో కొంత ప్రైవేట్ సంస్థలకు అమ్మకానికి ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు పీఎమ్ఓ ఆఫీస్ వర్గాలు తెలిపాయి. కాగా గత నెలలో సగానికిపైగా బ్యాంకులను ప్రైవేట్ సంస్థలకు వాటా ఇవ్వడానికి మొగ్గు చూపుతున్నట్లు ర్యూటర్స్ సంస్థ పేర్కొన్న విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంకుల వాటాల అమ్మకానికి కేంద్ర ప్రభుత్వం వేగవంతంగా చర్యలు చేపట్టవచ్చని బ్యాంకింగ్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చదవండి: బంధన్ బ్యాంక్‌కు వాటా విక్రయ షాక్ -
ఎఫ్ఐఐలు వాటాలను తగ్గించుకున్న కంపెనీలు ఇవే..!
గడచిన ఏడాదిలో విదేశీ ఇన్వెస్టర్లు 254 కంపెనీల్లో వాటాలను తగ్గించుకున్నారు. 12నెలల్లో ఏకంగా 8నెలల్లో వారు నికర అమ్మకందారులుగా నిలిచారు. అయితే మొత్తం ప్రతిపాదికన రూ.5వేల కోట్లతో ఎఫ్ఐఐలే నికర కొనుగోలుదారులుగా ఉన్నట్లు ఏస్ ఈక్విటీ గణాంకాలు చెబుతున్నాయి. ఎఫ్ఐఐలు ఫైనాన్షియల్, ఫార్మా, క్యాపిటల్ గూడ్స్, టూరిజం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలో వాటాను విక్రయించారు. వాల్యూయేషన్ ప్రాతిపదికన, కార్పోరేట్ పాలన సమస్యల దృష్ట్యా, డిమాండ్ పతనం, లేదా లాభాల స్వీకరణ తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని ఎఫ్ఐఐలు కంపెనీల్లో వాటాలను విక్రయించి ఉండొచ్చని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎఫ్ఐఐలు వాటాలను విక్రయించిన 254 కంపెనీల్లో సన్ ఫార్మా, డాబర్ ఇండియా, సిప్లా, హెచ్‌సీఎల్ టెక్నాలజీ, జుబిలెంట్ ఫుడ్‌వర్క్స్‌లున్నాయి. ఈ మొత్తం 254 కంపెనీల్లో 93 కంపెనీల షేర్లు 50శాతం నష్టాన్ని చవిచూశాయి. పీసీ జూవెలరీస్, ఫ్యూచర్స్ రీటైల్, సద్భావన్ ఇంజనీరింగ్, కాక్స్ అండ్ కింగ్స్, మన్‌పసంద్ బేవరీజెస్, మాగ్మా ఫిన్ కార్ప్, ధావన్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లు ఉన్నాయి. ‘‘వాల్యూయేషన్ల విస్తరణ, కార్పోరేట్ పాలన బాగోలేకపోవడం, పెరుగుతున్న పోటీ తదితర కారణాల దృష్ట్యా ఎఫ్ఐఐలు కంపెనీల్లో వాటాను తగ్గించుకొని ఉండొచ్చు. కారణలేవైనప్పటికీ.., జుబిలెంట్ ఫుడ్‌వర్క్స్, నెస్లే ఇండియా, అలెంబిక్ ఫార్మా, సిప్లా, డాబర్ లాంటి బ్లూచిప్ కంపెనీల్లో వాటాలను తగ్గించుకోవడం కొంత ఆందోళలను కలిగించే అంశం.’’ అని ఎస్ఎస్జే ఫైనాన్స్ సీనియర్ విశ్లేకుడు అతీష్ మత్లావాలా తెలిపారు. ఇన్వెస్టర్లు ఏంచేయాలి..? కేవలం ఎఫ్ఐఐలు వాటా విక్రయించారనే ఒకే కారణంతో షేర్లను అమ్మేయం మంచి పద్దతి కాదని విశ్లేషకులు అంటున్నారు. కంపెనీల గత ఆర్థిక ట్రాక్ రికార్డు, ప్రమోటర్ల పనితీరు, బ్యాలెన్స్ షీట్, నగదు ప్రవాహం, వ్యాల్యూయేషన్లు, వృద్ధి అవకాశాలను విశ్లేషించడం చాలా ముఖ్యమని వారు తెలిపారు. కోవిడ్-19 సమయంలో కంపెనీ కనబరిచిన ప్రదర్శన, వచ్చే త్రైమాసికాలకు సంబంధించి యాజమాన్యం అవుట్‌లుక్ వ్యాఖ్యలు లాంటి అంశాలను స్పష్టంగా అధ్యయనం చేసి పిదప స్టాక్స్‌లో లాభాల స్వీకరణ గానీ, స్టాక్స్ నుంచి పూర్తిగా వైదొలగడం కాని చేయాలి. అన్నింటి కన్నా ముఖ్యంగా నిపుణులు పర్యవేక్షణలో పెట్టుబడులు పెట్టడం ఉత్తమమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎఫ్ఐఐలు చివరి నాలుగు క్వార్టర్ల నుంచి అనేక చిన్న-మధ్య తరహా కంపెనీల్లో తమ వాటాలను క్రమంగా తగ్గించుకుంటున్నారు. డిమాండ్ మందగించడం, ఆర్థిక వ్యవస్థ క్షీణత ఇందుకు ప్రధాన కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. చిన్న-మధ్య తరహా స్టాకులు 2018 నుంచి బేర్‌ఫేజ్‌లో ఉన్నాయి. అయితే బెంచ్‌మార్క్ ఇండెక్స్ ఏడాదిలోని బేర్ ఫేజ్‌లోకి ప్రవేశించాయి. -
పిరమల్ ఫార్మాలో 20% వాటా విక్రయం
హెల్త్‌కేర్ విభాగం పిరమల్ ఫార్మాలో యూఎస్ సంస్థ కార్లయిల్ గ్రూప్ 20 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు పిరమల్ ఎంటర్ప్రైజెస్ తాజాగా పేర్కొంది. డీల్ అంచనా విలువను 49 కోట్ల డాలర్లు(సుమారు రూ. 3700 కోట్లు)గా వెల్లడించింది. ఇందుకు కార్లయిల్ గ్రూప్‌నకు చెందిన సీఏ క్లోవర్ ఇంటర్మిడయట్ 2 ఇన్వెస్ట్‌మెంట్స్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు పిరమల్ ఎంటర్ప్రైజెస్ తెలియజేసింది. నికర రుణం, మారకపు రేటు, పనితీరు వంటి అంశాల ఆధారంగా డీల్‌కు తుది ధరను నిర్ణయించనున్నట్ల అజయ్ పిరమల్ గ్రూప్ కంపెనీ వివరించింది. కాగా.. శుక్రవారం ఎన్ఎస్ఈలో పిరమల్ ఎంటర్ప్రైజెస్ షేరు నామమాత్ర లాభంతో రూ. 1344 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 1370 వద్ద గరిష్టాన్ని తాకగా.. 1317 దిగువన కనిష్టాన్నీ చవిచూసింది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో పీఎస్‌యూ సంస్థ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐవోబీ) కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. దీంతో వారాంతాన ఎన్ఎస్ఈలో బ్యాంక్ షేరు 10 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. అంతా కొనుగోలుదారులేతప్ప అమ్మేవాళ్లు కరువుకావడంతో రూ. 13.10 వద్ద ఫ్రీజయ్యింది. తద్వారా 52 వారాల గరిష్టానికి చేరింది. 18 త్రైమాసికాల తదుపరి టర్న్అరౌండ్ ఫలితాలను సాధించిన నేపథ్యంలో గురువారం సైతం ఈ కౌంటర్ 10 శాతం దూసుకెళ్లింది. టర్న్అరౌండ్ గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో ఐవోబీ రూ. 144 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2018-19) క్యూ4లో రూ. 1985 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొండి రుణాలకు కేటాయింపులు తగ్గడంతో లాభదాయకత మెరుగైనట్లు నిపుణులు తెలియజేశారు. నికర వడ్డీ ఆదాయం 3.6 శాతం పెరిగి రూ. 1532 కోట్లను తాకగా.. ప్రొవిజన్లు, కంటింజెన్సీలు రూ. 4502 కోట్ల నుంచి రూ. 1479 కోట్లకు భారీగా తగ్గాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 21.97 శాతం నుంచి 14.78 శాతానికి దిగిరాగా.. నికర ఎన్పీఏలు సైతం 10.81 శాతం నుంచి సగానికి క్షీణించి 5.44 శాతానికి చేరాయి. -
జియోలో జనరల్ అట్లాంటిక్ పెట్టుబడులు
ముంబై : రిలయన్స్ జియోలో అమెరికాకు చెందిన జనరల్ అట్లాంటిక్ 1.34 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఈ ఒప్పందం ద్వారా జియోలో అమెరికన్ కంపెనీ రూ 6549 కోట్లు వెచ్చించనుంది. గత నాలుగు వారాల్లో ఫేస్బుక్, సిల్వర్ లేక్ పార్టనర్స్, విస్టా ఈక్విటీ పార్టనర్స్, జనరల్ అట్లాంటిక్ వంటి టెక్ దిగ్గజాల నుంచి జియో రూ 67,194 కోట్లు సమీకరించింది. భారత ఆర్థిక వ్యవస్థను తదుపరి దశకు తీసుకువెళ్లేందుకు డిజిటల్ కనెక్టివిటీ కీలకమనే ముఖేష్ అంబానీ విజన్‌ను తాము పంచుకుంటున్నామని, భారత్‌లో డిజిటల్ విప్లవానికి ముందుండి చొరవ చూపిన జియోతో కలిసి పనిచేస్తామని జనరల్ అట్లాంటిక్ సీఈఓ బిల్ పోర్డ్ అన్నారు. ఇక ప్రపంచ టెక్ దిగ్గజాల పెట్టుబడులతో భారత్‌లో డిజిటల్ సొసైటీని పటిష్టపరిచేందుకు మార్గం సుగమం అవుతుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) ఓ ప్రకటనలో పేర్కొంది. చదవండి : గుడ్ న్యూస్: జియో అదిరిపోయే ప్లాన్ -
రిలయన్స్ జియోలో ఫేస్బుక్ భారీ పెట్టుబడి
-
జియోలో ఫేస్బుక్ భారీ పెట్టుబడి
సాక్షి, ముంబై : దేశీయ దిగ్గజ కంపెనీ రిలయన్స్ టెలికాం యూనిట్ జియోలో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ భారీ పెట్టుబడి పెట్టింది. మొత్తం 5.7 బిలయన్ డాలర్ల(దాదాపు రూ. 43,574 కోట్లు) పెట్టుబడి పెట్టినట్టు ఫేస్బుక్ బుధవారం ప్రకటించింది. దీంతో జియోలో 9.9 శాతం వాటాను ఫేస్బుక్ కొనుగోలు చేసింది. తద్వారా ఫేస్బుక్ జియోలో అతిపెద్ద మైనారిటీ వాటాను సొంతం చేసుకున్నట్టు అయింది. ఫేస్బుక్ పెట్టుబడి తరువాత జియో ప్లాట్ ఫామ్స్ విలువ రూ. 4.62 లక్షల కోట్లకు పెరిగినట్లవుతుంది. దేశంలోని టెక్నాలజీ రంగంలో ఇదే అతిపెద్ద ఎఫ్‌డీఐ అని రిలయన్స్ తెలిపింది. ఫేస్‌బుక్‌తో భాగస్వామ్యం వల్ల రిలయన్స్ ఇండస్ట్రీస్‌పై అప్పుల భారం తగ్గనుంది. (రిలయన్స్, ఫేస్బుక్: వన్ స్టాప్ సూపర్ యాప్) తమ మెసేజింగ్ ఫ్లాట్‌ఫామ్ వాట్సాప్, రిలయన్స్‌కు చెందిన ఈ-కామర్స్ వెంచర్ జియో మార్ట్‌తో కలిసి ప్రజలు చిన్న వ్యాపారాలతో కనెక్ట్ అయ్యేలా దృష్టి సారించనున్నట్లు తెలిపింది. అలాగే దేశంలో డిజిటల్ ఆపరేషన్స్‌లో తన పరిధిని మరింత విస్తరించుకోవాలని ఫేస్బుక్ యోచిస్తోంది. ఈ క్రమంలోనే రిలయన్స్ జియోలో భారీగా పెట్టుబడి పెట్టింది. ఇటీవల వాట్సాప్ భారత్‌లో సురక్షితమైన డిజిటల్ చెల్లింపులకు అనుమతి పొందినట్టుగా తెలుస్తోంది. కాగా, వాట్సాప్‌కు భారత్‌లో 400 మిలియన్ల యూజర్స్ ఉన్నారు. స్మార్ట్ ఫోన్ వినియోగించేవారిలో 80 శాతం మంది వాట్సాప్‌ను వాడుతున్నారు.(జుకర్‌బర్గ్ విరాళం రూ.187 కోట్లు ) జియోలో పెట్టుబడిపై ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ స్పందిస్తూ.. ‘భారత్‌లో ప్రజలకు వాణిజ్య పరమైన అవకాశాలు కల్పించేలా రిలయన్స్‌తో కలిసి పనిచేయనున్నాం. ఫేస్బుక్, వాట్సాప్‌లకు ఇండియాలో భారీ సంఖ్యలో వినియోగదారులు ఉన్నారు. ప్రతి ఆర్థిక వ్యవస్థకు చిన్న వ్యాపారాలు చాలా ముఖ్యమైనవి. భారత్‌లో దాదాపు 60 మిలియన్ల చిన్న వ్యాపారాలు ఉన్నాయి. చాలా వరకు ఉద్యోగాలు వాటిపై ఆధారపడి ఉన్నాయి. కోట్లాది మంది భారతీయులు చిన్న చిన్న వ్యాపారాలు ఆన్లైన్లో పొందడంలో జియో కీలక పాత్ర పోషించింది. ఈ క్రమంలోనే భారత్‌లో వాణిజ్యపరంగా కొత్త అవకాశాలు కల్పించడానికి జియోతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాం. చాలా మంది వ్యాపారవేత్తలు వారి బిజినెస్‌ను వృద్ధి చేసుకోవడంలో భాగంగా వినియోగదారులతో కమ్యూనికేట్ అవ్వడానికి డిజిటల్ పరికరాలు అవసరం ఉంది. ఈ భాగస్వామ్యం కల్పించిన ముఖేశ్ అంబానీ, జియో టీమ్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని అన్నారు. (జియోపై కన్నేసిన ఫేస్ బుక్ : కరోనా దెబ్బ) 2016లో దేశంలో అధికారికంగా సేవలను ప్రారంబించిన రిలయన్స్ జియో వేగంగా అభివృద్ధి చెంది భారతీయ టెలికాం మార్కెట్లోకి టాప్ లోకి దూసుకు వచ్చింది. మొబైల్ టెలికాంతోపాటు, హోమ్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు, ఈ-కామర్స్ వరకు ప్రతిదానికీ విస్తరించింది. అంతేకాదు యుఎస్ టెక్ గ్రూపులతో పోటీ పడగల ఏకైక సంస్థగా రిలయన్స్ అవతరించింది. గత నెలలోనే ఫేస్బుక్.. రిలయన్స్ జియో 10 శాతం వాటా కొనుగోలు చేయనున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసింది.(లాక్డౌన్.2 : జియో గుడ్ న్యూస్) -
జియోపై కన్నేసిన ఫేస్ బుక్ : కరోనా దెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ : దేశీయ దిగ్గజ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ పై సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ కన్నేసింది. లక్షల కోట్ల విలువైన వాటాను కొనుగోలు చేసుందుకు ఫేస్ బుక్ సిద్ధమవుతోంది. తద్వారా దేశంలో డిజిటల్ ఆపరేషన్స్ లో తన పరిధిని మరింత విస్తరించుకోవాలని ఫేస్ బుక్ యోచిస్తోంది. ఫైనాన్షియల్ టైమ్స్ సమాచారం ప్రకారం భారతీయ డిజిటల్ మార్కెట్లో తన ఉనికిని విస్తరించుకునేందుకు ముకేశ అంబానీ డిజిటల్ సంస్థ రిలయన్స్ జియోలో మల్టి బిలియన్ డాలర్ల వాటాను కొనుగోలు చేయడానికి చర్చలు జరుపుతోంది. ఈ నెలాఖరులో ఫేస్‌బుక్‌తో ఈ ఒప్పందం జియో ప్రకటించాల్సి ఉంది. మార్చి 2021 నాటికి రిలయన్స్ సంస్థ అప్పులేని సంస్థగా మార్చే ప్రణాళికల్లో ఈ విక్రయం చోటు చేసుకోనుందని ఫైనాన్షియల్ టైమ్స్ తెలిపింది. సిలికాన్ వ్యాలీ టెక్నాలజీ దిగ్గజం ఫేస్ బుక్ 10 శాతం వాటా కోసం ప్రాథమిక ఒప్పందంపై సంతకం చేయడానికి సిద్ధంగా వుందని, అయితే కోవిడ్ -19 కరోనావైరస్ వ్యాప్తి ప్రపంచ ప్రయాణ నిషేధాల కారణంగా ఈ ప్రక్రియ నిలిచిపోయాయని తెలిపింది. అయితే ఈ విషయంపై వ్యాఖ్యానించడానికి రిలయన్స్ ప్రతినిధి నిరాకరించినట్టు తెలుస్తోంది. వ్యాపారాలకు క్లౌడ్ కంప్యూటింగ్‌ను అందించడానికి జియోతో భాగస్వామ్యంపై చర్చలు జరుపుతున్నట్టు మైక్రోసాఫ్ట్ గత ఏడాది ప్రకటించిన తరువాత ఈ వార్తలు వెలుగులోకి రావడం విశేషం. 2016లో దేశంలో అధికారికంగా సేవలను ప్రారంబించిన రిలయన్స్ జియో వేగంగా అభివృద్ధి చెంది భారతీయ టెలికాం మార్కెట్లోకి టాప్ లోకి దూసుకు వచ్చింది. మొబైల్ టెలికాంతోపాటు, హోమ్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు, ఇకామర్స్ వరకు ప్రతిదానికీ విస్తరించింది. అంతేకాదు యుఎస్ టెక్ గ్రూపులతో పోటీ పడగల ఏకైక సంస్థగా రిలయన్స్ అవతరించింది. -
బీపీసీఎల్ విక్రయం: బిడ్డింగ్‌లకు ఆహ్వానం
సాక్షి, న్యూఢిల్లీ : భారతదేశపు రెండవ అతిపెద్ద చమురు శుద్ధిదారు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్)ను ప్రైవేటీకరణలో సంస్థలో సగానికిపైగా వాటాల విక్రయానికి కేంద్రం శనివారం బిడ్డింగ్‌లను ఆహ్వానించింది. మొత్తం 52.98 శాతం వాటాను విక్రయించడానికి బిడ్లను ఆహ్వానిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. పెట్టుబడి, పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ విభాగం (డిపామ్) బిడ్‌నోట్ ప్రకారం బీపీసీఎల్ వ్యూహాత్మక అమ్మకం కోసం ఆసక్తి గల వారు మే 2వ తేదీలోగా తమ బిడ్డింగ్‌లను సమర్పించాల్సి వుంటుంది. భారత ప్రభుత్వం 114.91 కోట్ల (52.98శాతం ఈక్విటీ వాటా)ఈక్విటీ షేర్లతో కూడిన బీపీసీఎల్ మొత్తం వాటాను వ్యూహాత్మకంగా పెట్టుబడులు పెట్టాలని ప్రతిపాదిస్తోంది. తద్వారా బీపీసీఎల్ ఈక్విటీ వాటా 61.65 శాతం వాటా వున్న ఎన్ఆర్ఎల్ తప్ప, మిగిలిన నిర్వహణ నియంత్రణ వ్యూహాత్మక కొనుగోలుదారుకు బదిలీ అవుతుందని తెలిపింది. బిడ్డింగ్ రెండు దశల్లో వుంది మొదటి దశలో ఆసక్తి వ్యక్తీకరణ ఆసక్తి, అనంతరం రెండవ రౌండ్లో ఫైనాన్స్ బిడ్డింగ్ ఉంటుంది. ప్రభుత్వ రంగ సంస్థలకు ఈ బిడ్డింగ్‌లో పాల్గొనే అవకాశం లేదు. 10 బిలియన్ డాలర్ల నెట్‌వర్త్ ఉన్న ఏ ప్రైవేట్ సంస్థ అయినా బిడ్డింగ్‌కు అర్హులు . అలాగే నాలుగు సంస్థలకు మించని కన్సార్షియానికి అనుమతి వుండదు. బిడ్డింగ్ ప్రమాణాల ప్రకారం, కన్సార్టియం లీడర్ 40శాతం వాటాను కలిగి ఉండాలి. ఇతరులు కనీసం ఒక బిలియన్ డాలర్ల నెట్‌వర్త్ కలిగి ఉండాలి. 45 రోజుల్లో కన్సార్షియంల మార్పులు అనుమతించబడతాయి. కానీ కన్సార్షియానికి నేతృత్వం వహించే సంస్థను మార్చడానికి వీల్లేదు. కాగా మందగమనంలో ఉన్న ఆర్థికవ్యవస్థను ఆదుకునేందుకు రూ.లక్ష కోట్లు సమీకరించే లక్ష్యంగా భాగంగా ఎయిరిండియా, బీపీసీఎల్ ప్రైవేటీకరణకు ప్రభుత్వం నిర్ణయించిన సంగతి విదితమే. -
బంగారు బాతును చంపేస్తారా?
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ)ని ఉద్యోగ సంఘాలు నిరసనకు దిగనున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ 2020 ప్రసంగంలో ఎల్ఐసీ ఐపీవో నిర్ణయాన్ని ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనలకు సిద్ధపడుతున్నాయి. సుదీర్ఘ కాలంగా తాము వ్యతిరేకిస్తున్నప్పటికీ పబ్లిక్ ఇష్యూ, ప్రత్యక్ష పెట్టుబడులు అంశాలపై ఉద్యోగులు ఆందో ళన చేపట్టనున్నారు. ఎల్ఐసి మూడు ప్రధాన కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా ఆందోళనలోపాల్గొననున్నాయి.ఎల్ఐసీ బ్రాంచ్ కార్యాలయాల వద్ద సోమవారం భోజన విరామ సమయంలో ప్లకార్డ్సు, నినాదాలతో నిరసన తెలపనున్నారు. అలాగే మంగళవారం ఒక గంట నిరసన సమ్మె (వాక్-అవుట్) ను చేపట్టనున్నారు. దీంతోపాటు (ఫిబ్రవరి 3,4 తేదీల్లో నిరసనల అనంతరం) ఉమ్మడి ఫోరం ఆధ్వర్యంలో ఒకరోజు సమ్మెను కూడా చేపట్టాలని యోచిస్తున్నారు. ఎల్ఐసీ ఐపీవోకు (ఐపిఓ ద్వారా ప్రభుత్వం ఈక్విటీ షేర్లను విక్రయించే ఆఫర్) తాము పూర్తిగా వ్యతిరేకమనీ, మంచి లాభాలతో ఉన్న సంస్థలో వాటాలను ఎందుకు విక్రయిస్తోందని సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసారు. గత ఏడాది రూ. 2,600 కోట్ల డివిడెండ్ ఎల్ఐసీ అందజేసిందని ఫెడరేషన్ ఆఫ్ ఎల్ఐసి క్లాస్ -1 ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఎస్ రాజ్‌కుమార్ చెప్పారు. ప్రభుత్వం నిధులను కోరినప్పుడల్లా, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సామాజిక రంగం, గృహనిర్మాణానికి నిధులు అందిస్తూనే ఉన్నామని పేర్కొన్నారు. లాభదాయకమైన ఎల్ఐసీ సంస్థను లిస్టింగ్ చేయడమంటే.. బంగారు బాతును చంపేయడమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్ఐసీ మూడుప్రధాన కార్మిక సంఘాల ఉమ్మడి ఫోరం- ఎల్ఐసి క్లాస్ -1 ఆఫీసర్స్ అసోసియేషన్ల సమాఖ్య, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఫీల్డ్ వర్కర్స్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సంస్థ మొత్తం శ్రామిక శక్తిలో 90 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. 2019 మార్చి చివరి నాటికి ఎల్ఐసిలో 2.85 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. మరోవైపు ఐడీబీఐ బ్యాంక్‌లోని తన వాటాను ప్రభుత్వం ప్రైవేటు పెట్టుబడిదారులకు విక్రయిస్తామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్-2020 ప్రసంగంలో వెల్లడించారు. ఐడీబీఐ బ్యాంకులో వాటాను పూర్తిగా విక్రయించడం ద్వారా మొత్తం రూ. 90,000 కోట్లు సమకూరుతాయని కేంద్రం ఆశిస్తోంది. ఈ ఏడాది మొత్తంగా రూ. 2.10 లక్షల కోట్లను డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా సేకరించాలని.. కేంద్రం లక్ష్యంగా నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎల్ఐసీలో కేంద్రానికి 100 శాతం వాటా ఉండగా.. ఐడీబీఐలో 46.5 శాతం వాటా కేంద్రం వద్దే ఉంది. చదవండి : ఐడీబీఐ, ఎల్ఐసీలో వాటా అమ్మకం -
ఎన్ఎస్ఈలో ఒక శాతం వాటా విక్రయం: ఎస్బీఐ
న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్సే్చంజ్ (ఎన్ఎస్ఈ)లో 1.01 శాతం వాటాను ఎస్బీఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా)విక్రయించనున్నది. మూలధన నిధుల సమీకరణలో భాగంగా 1.01 శాతం వాటాకు సమానమైన 50 లక్షల షేర్లను విక్రయించనున్నామని ఎస్బీఐ వెల్లడించింది. కాంపిటేటివ్ బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా ఈ షేర్లను విక్రయిస్తామని తెలిపింది. నిర్దేశిత ఫార్మాట్లో కనీసం పది లక్షల షేర్లకు బిడ్ చేయాల్సి ఉంటుందని, ఆసక్తి గల సంస్థలు ఈ నెల 15 వ తేదీలోగా దరఖాస్తు చేయాలని పేర్కొంది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఎస్బీఐకు 5.19 % వాటా ఉంది. 2016లో ఎన్ఎస్ఈలో 5 శాతం వాటాను మారిషస్‌కు చెందిన వెరాసిటి ఇన్వెస్ట్‌మెంట్స్‌కు రూ.911 కోట్లకు ఎస్బీఐ విక్రయించింది. ఎన్ఎస్ఈలో వాటా విక్రయంతో పాటు మరో రెండు కంపెనీల్లో కూడా వాటా విక్రయం ద్వారా నిధులు సమీకరించాలని ఎస్బీఐ యోచిస్తోంది. -
బీపీసీఎల్, కాంకర్ విక్రయానికి బిడ్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని బీపీసీఎల్, కంటెయినర్ కార్పొరేషన్ (కాంకర్)లో వ్యూహాత్మక వాటాల విక్రయానికి సంబంధించి పెట్టుబడులు, ప్రజా ఆస్తుల విభాగం (దీపమ్) ఆసక్తి కలిగిన సంస్థల నుంచి ప్రతిపాదనలకు ఆహ్వానం పలికింది. బీపీసీఎల్‌లో ప్రభుత్వం పూర్తి వాటాను విక్రయించనుండగా, కాంకర్లో మాత్రం 24 శాతం మేర వాటాను తన వద్దే అట్టిపెట్టుకుని మిగిలిన వాటాను, యాజమాన్య నియంత్రణను ప్రైవేటు సంస్థకు కట్టబెట్టనుంది. బీపీసీఎల్‌కు అసోంలో ఉన్న నుమాలిగఢ్ రిఫైనరీని మాత్రం ప్రభుత్వరంగ సంస్థకే విక్రయించాలని కేంద్ర కేబినెట్ తాజాగా నిర్ణయించిన విషయం తెలిసిందే. -
వాటాల విక్రయం : ‘జీ’ షేర్లు జంప్
సాక్షి, ముంబై: ప్రమోటర్ల వాటా విక్రయ వార్తలతో దేశీయ అతిపెద్ద లిస్టెడ్ మీడియా కంపెనీ జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్‌ప్రైజె భారీగా లాభపడుతోంది.గురువారం ఉదయం ట్రేడింగ్ సెషన్ ఆరంభంలోనే ఏకంగా 15 శాతం ర్యాలీ చేసింది. హై స్థాయిలో ట్రేడర్ల లాభాల స్వీకరణ కనిపించినప్పటికీ మిడ్ సెషన్ తరువాత తిరిగి పుంజుకుంది. గత రెండు రోజుల్లో 16.89 శాతం పెరిగింది. ప్రమోటర్ సుభాష్ చంద్ర నేతృత్వంలోని ఎస్సెల్ గ్రూప్ 16.5 శాతం వరకు వాటాను ఆర్థిక పెట్టుబడిదారులకు విక్రయించనున్నారు. జీల్ లోని 16.5 శాతం వాటాను ఆర్థిక పెట్టుబడిదారులకు విక్రయించాలని ఎస్సెల్ గ్రూప్ యోచిస్తోందని మీడియా సంస్థ బుధవారం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్కు అందించిన సమాచారంలోతెలిపింది. ఒప్పంద పత్రం ప్రకారం మూడు ప్రమోటర్లు ఈఎంవీఎల్ 77 మిలియన్ షేర్లను, క్వైతర్ గ్రూప్ 61 మిలియన్ షేర్లను, ఎస్సెల్ గ్రూప్ 11 మిలియన్ల ఈక్విటీ షేర్లను మొత్తం 15.72 శాతం వాటాకు సమానమైన ఈక్విటీ షేర్లను విక్రయించనున్నారు. ఒక్కో ఈక్విటీ ధరను బుధవారం నాటి ముగింపు ధర(రూ.307)తో పోలిస్తే 10శాతం డిస్కౌంట్‌తో రూ.277 గా నిర్ణయించారు. ఈ మొత్తం ఒప్పందం విలువ దాదాపు రూ.4,132 కోట్లుగా ఉండవచ్చు. సిటీ గ్రూప్ సంస్థ డీల్స్‌కు బుక్ రన్నర్‌గా వ్యవహరించారు. ఈ విక్రయం ద్వారా సమకూరిన నిధులను సంస్థ రుణాల చెల్లింపునకు వినియోగించుకోనుంది. ఈ 16.50శాతంలో ఇన్వెస్కో ఒపెన్‌హైమర్ డెవలపింగ్ మార్కెట్స్ ఫండ్ అనుబంధ సంస్థ ఓఎఫ్సీ గ్లోబల్ చైనా ఫండ్‌కు 2..3శాతం వాటాను విక్రయించనుంది. ఈ సంస్థ ఇప్పటికే జీ లిమిడెలో 8.7శాతం వాటాను కలిగి ఉంది. సెప్టెంబర్ 30 నాటికి, జీ ప్రమోటర్లు 22.37 శాతం వాటాకు సమానమైన ఈక్విటీ షేర్లను కలిగి ఉన్నారు. షేర్‌హోల్డింగ్ డాటా ప్రకారం 96 శాతానికి సమానమైన వాటాను రుణదాతల వద్ద తనఖా పెట్టింది. ఈ లావాదేవీ తరువాత, సంస్థలో ఎస్సెల్ హోల్డింగ్ ఐదు శాతానికి పడిపోతుంది, వీటిలో ఎన్కంబర్డ్ హోల్డింగ్ 1.1 శాతంగా ఉంటుంది. సుభాష్ చంద్ర తన కుటుంబంతో కలిసి మ్యూచువల్ ఫండ్లతో సహా దేశీయ రుణదాతలకు, రష్యన్ రుణదాత విటిబితో సహా రూ 7,000 కోట్ల బాకీ పడిన సంగతి తెలిసిందే. -
జీలో 11 శాతం వాటా విక్రయం
సాక్షి, ముంబై : జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (జీల్) ప్రమోటర్ సుభాష్ చంద్ర ఎస్సెల్ గ్రూప్ వాటాను ఇన్వెస్కో ఒపెన్‌హైమర్ డెవలపింగ్ మార్కెట్స్ ఫండ్ విక్రయించారు. 11 శాతం వాటాను రూ .4,224 కోట్ల విలువకు కొనుగోలు చేసింది. ఈ ఫండ్‌కు ఇప్పటికే కంపెనీలో 8 శాతం వాటా ఉంది. తాజా కొనుగోలు తరువాత జీల్లో ఫండ్ మొత్తం వాటా 19 శాతానికి పెరిగింది. కాగా ప్రమోటర్ల వాటా 25 శాతానికి తగ్గుతుంది. ఈ వివరాలను మార్కెట్ ముగిసిన అనంతరం కంపెనీ వెల్లడించింది. జీల్ ఎండీ, సీఈవో పునీత్ గోయంకా మీడియాతో మాట్లాడుతూ ఆర్థిక పెట్టుబడిదారుగా కంపెనీపై నమ్మకం వుంచినందుకు సంతోషంగా ఉందన్నారు. ప్రమోటర్లు జీల్లో తమ వాటాను సగం (ఆ సమయంలో 42 శాతం) వ్యూహాత్మక పెట్టుబడిదారులకు విక్రయించడానికి ఉద్దేశించినట్లు ఎస్సెల్ గ్రూప్ నవంబర్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో, ఎస్సెల్ గ్రూప్ రుణదాతలు జీ ఎంటర్టైన్మెంట్, డిష్ టివి వంటి ఎస్సెల్ కంపెనీలలో వాటాలను అమ్మడం ప్రారంభించింది. సెప్టెంబరు 2019 నాటికి రుణదాతలందరికీ రూ.11వేల కోట్ల రుణాలను తిరిగి చెల్లించాలనేది ఎస్సెల్ గ్రూప్ లక్ష్యం. ఈ నేపథ్యంలోనే తాజా డీల్. కాగా ఈక్వీటీ షేరు సుమారు 400 చొప్పున కొనుగోలు చేయనుంది ఇన్వెస్కో. దీని ప్రభావం గురువారం నాటి ట్రేడింగ్‌లో కనిపించనుంది. -
జీ..ఎవరి చేజిక్కేనో..?
ముంబై : దేశీ మీడియా దిగ్గజం సుభాష్ చంద్రకు చెందిన జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్‌ప్రెజెస్‌ను చేజిక్కించుకునేందుకు సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్, అంతర్జాతీయ మీడియా దిగ్గజం ముర్ధోక్‌ల మధ్య పోరు నెలకొంది. జీ ఎంటర్టైన్మెంట్ను కైవసం చేసుకునేందుకు ఫేస్బుక్ సంకేతాలు పంపగా ముర్ధోక్, ఆయన కుటుంబ సభ్యులతో పాటు బ్లాక్‌స్టోన్‌లతో కలిసి అమెరికా కేబుల్ దిగ్గజం కామ్‌కాస్ట్ కన్సార్షియంగా ఏర్పడి జీ ఎంటర్టైన్మెంట్ని కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. జీ ఎంటర్టైన్మెంట్ విలువను మదించే ప్రక్రియనూ కామ్‌కాస్ట్ కన్సార్షియం చేపట్టిందన్న ప్రచారం సాగుతోంది. సీఎన్‌బీసీ, యూనివర్సల్ పిక్చర్స్ వంటి గ్లోబల్ మీడియా బ్రాండ్లను కలిగిఉన్న కామ్‌కాస్ట్ కన్సార్షియం భారత మీడియాలో మెరుగైన మార్కెట్ వాటా కోసం జీ ఎంటర్టైన్మెంట్ను కైవసం చేసుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసినట్టు సమాచారం. మరోవైపు జీ ప్రమోటర్లు వ్యాపార నిర్వహణలో తాము చురుకైన పాత్రను కొనసాగించేందుకు మొగ్గుచూపుతుండగా కొనుగోలుదారులు మాత్రం కంపెనీపై పూర్తి నియంత్రణ కోసం పట్టుబడుతున్నారు. జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ ప్రస్తుత ధర ప్రకారం ప్రమోటర్ల వాటాలో సగం విలువ రూ 6,603 కోట్లుగా అంచనా వేస్తుండగా మదింపు విలువను మరింత పెంచాలని జీ ప్రమోటర్లు పట్టుబడుతున్నట్టు తెలిసింది. జీ ఎంటర్టైన్మెంట్ విక్రయ ఒప్పందం ఓ కొలిక్కివస్తే రుణభారంతో సతమతమవుతున్న ప్రమోటింగ్ కంపెనీ ఎస్సెల్ గ్రూప్‌కు ఊరట కలుగుతుందని భావిస్తున్నారు. -
జీ షేరు ఢమాల్ : కంపెనీ వివరణ
సాక్షి, ముంబై : ఎస్సాల్ గ్రూప్‌నకు చెందిన జీ ఎంటర్ప్రైజెస్ షేర్ల భారీ పతనం వరుసగా రెండో రోజు కూడా కొనసాగింది. 2019 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సంస్థ ఆర్థిక నివేదికల ఆడిట్, ప్లెడ్జ్డ్ (తనఖా) షేర్లు విక్రయంపైమంగళవారం నుంచి పుకార్లు చెలరేగడంతో ఇన్వెస్లర్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో బుధవారం జీ కౌంటర్ ఏకంగా 12 శాతానికి పైగా పతనమైంది. మరోవైపు ఈ పుకార్లను కొట్టి పారేసిన సంస్థ జీ ఎంటర్టైన్మెంట్లో ప్లెడ్జ్డ్ షేర్ల విక్రయం చోటు చేసుకోలేదని స్పష్టం చేసింది. అలాగే వాటా విక్రయ అంశం తుది దశకు చేరుకుందంటూ ఒక ప్రకటన విడుదల చేసింది. మరో 6-8 వారాల్లో ఈ విక్రయాన్ని పూర్తి చేస్తామని తెలిపింది. అయితే వివరాలను వెల్లడి చేయలేమని, రుణాలను తీర్చడానికే మొదటి ప్రాధాన్యత ఇస్తామని కంపెనీ సీఈవో పునీత్ గోయంకా స్పష్టం చేశారు. అలాగే షేరు విలువ అనూహ్య పతనం, వదంతులపై సెబీకి ఫిర్యాదు చేయనున్నామని గోయంకా తెలిపారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి స్టాండ్‌లోన్ ఫలితాలను మే 27వ తేదీన వెల్లడించ నున్నామన్నారు. కాగా రుణ సంక్షోభంలో చిక్కుకున్న కంపెనీని గట్టెక్కించేందుకు జీ ఎంటర్టైన్మెంట్లో 50 శాతం వాటాలను వ్యూహాత్మక భాగస్వామికి విక్రయిస్తామని సంస్థ ప్రమోటర్ సుభాష్ చంద్ర గత ఏడాది నవంబర్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో గత ఏడు నెలల కాలంగా జీ ఎంటర్ టైన్మెంట్ షేరు విలువ తీవ్ర ఒడిదుడుకుల మధ్య కొనసాగుతుంది. -
పీఎన్బీ హౌసింగ్‌లో వాటా విక్రయించిన పీఎన్బీ
సాక్షి, ముంబై: పంజాబ్ నేషనల్ భ్యాంకు పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్‌లో వాటాను విక్రయ నిర్ణయాన్ని పూర్తి చేయనుంది. జనరల్ అట్లాంటిక్, వర్డె పార్టనర్స్ సంస్థలకు రూ. 1851 కోట్లకు విక్రయించనున్నామని పీఎన్బీ రెగ్యులేటరీ సమాచారంలో వెల్లడించింది. అయితే హౌసింగ్ యూనిట్లో ప్రమోటర్ హోదా ఉంటుందని బ్యాంకు తెలిపింది. ఇందులో భాగంగా ఇరు సంస్థలు 1.09 కోట్ల పీఎన్బీ హౌసింగ్ షేర్లను రూ. 850 చొప్పున కొనుగోలు చేస్తాయి. ఈ విలువ ప్రకారం పీఎన్బీ హౌసింగ్ మొత్తం విలువ రూ. 926 కోట్లకు చేరుతుంది. ఈ విక్రయం అనంతరం పీఎన్బీకి హౌసింగ్ ఫైనాన్స్‌లో వాటా 32.79 శాతం నుంచి 19.78 శాతానికి దిగిరానుంది. హౌసింగ్ యూనిట్లో వాటాలను విక్రయించి సొమ్ము చేసుకోవాలని గత డిసెంబర్లో పీఎన్బీ నిర్ణయించింది. ఈ ప్రకటనతో శుక్రవారం మార్కెట్లో పీఎన్బీ హౌసింగ్ ఫిన్ షేర్ దాదాపు 4శాతం లాభపడింది. -
డిజిన్వెస్ట్‌మెంట్ నిధులు రూ.53,558 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా రూ.53,558 కోట్లు సమీకరించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.80,000 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఆర్థిక సంవత్సరం మరో నెలలో ముగియ నుండటం, స్టాక్ మార్కెట్ అంతంత మాత్రంగానే ఉండటంతో ఈ లక్ష్యం సాకారమయ్యే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని నిపుణులంటున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ.90,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గత వారంలో రూ.15,379 కోట్లు గత వారంలో కేంద్రం రూ.15,379 కోట్లు సమీకరించింది. భారత్–22 ఈటీఎఫ్ ఎఫ్‌పీఓ ద్వారా రూ.10,000 కోట్లు, యాక్సిస్ బ్యాంక్‌లో ఎస్‌యూయూటీఐకు ఉన్న వాటాను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించడం ద్వారా రూ.5,379 కోట్లు ప్రభుత్వ ఖజానాకు వచ్చాయి. భారత్–22 ఈటీఎఫ్ ఎఫ్‌పీఓకు మంచి స్పందన లభించింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.38,000 కోట్లు, రిటైల్ ఇన్వెస్టర్లు రూ.2,000 కోట్ల మేర బిడ్ చేశారు. గత ఏడాది జూన్‌లో ఈ ఈటీఎఫ్ ద్వారా ప్రభుత్వం రూ.8,325 కోట్లు సమీకరించగలిగింది. షేర్ల బైబ్యాక్‌ల ద్వారా జోరుగా నిధులు... షేర్ల బైబ్యాక్ ద్వారా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి రూ.2,647 కోట్లు వచ్చాయి. అలాగే భెల్ నుంచి రూ.992 కోట్లు, ఎన్‌హెచ్‌పీసీ నుంచి రూ.398 కోట్లు, కొచ్చిన్ షిప్‌యార్డ్ నుంచి రూ.137 కోట్లు, ఎన్ఎల్సీ నుంచి రూ.990 కోట్లు, నాల్కో నుంచి రూ.260 కోట్లు, కేఐఓసీఎల్ నుంచి రూ.260 కోట్ల మేర నిధులు ప్రభుత్వానికి లభించాయి. హెచ్‌ఎస్‌సీసీలో వ్యూహాత్మక వాటా విక్రయం ద్వారా రూ.285 కోట్లు ప్రభుత్వానికి వచ్చాయి. ఇక ఆఫర్ ఫర్ సేల్ విధానంలో కోల్ ఇండియా ద్వారా ప్రభుత్వానికి రూ.5,218 కోట్లు లభించాయి. సీపీఎస్‌యూ ఈటీఎఫ్ యూనిట్ల విక్రయం ద్వారా రూ.17,000 కోట్లు లభించాయి. ఇక ఐదు ప్రభుత్వ రంగ పీఎస్‌యూల ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) ద్వారా రూ.1,700 కోట్లు కేంద్రం సమీకరించింది. రీట్స్, ఇర్కన్, మిధాని, గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ ఐపీఓల ద్వారా ఈ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం సమీకరించింది. -
టాటా సన్స్ బూస్ట్ : జెట్ ఎయిర్వేస్ జూమ్
సాక్షి, ముంబై: రుణ సంక్షోభంలో చిక్కుకుని విలవిల్లాడుతున్న జెట్ ఎయిర్వేస్కు అనూహ్య బాసట దొరకనుంది. టాటా గ్రూప్‌లోని వాటా సన్స్ జెట్ ఎయిర్ వేస్‌లో వాటాను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతోందన్న అంచనాల నేపథ్యంలో ఈ కౌంటర్ గురువారం నాటి తారాజువ్వలా ఎగిసి పడింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 26 శాతం లాభాలతో ముగిసింది. తొలి నుంచీ జోరందుకున్న జెట్ ఎయిర్వేస్ కౌంటర్ మిడ్‌సెషన్ నుంచీ మరింత జోరందుకుంది. విస్తారా బ్రాండు విమానయాన సేవల సంస్థను నిర్వహిస్తున్న టాటా ఎస్ఐఏ ఎయిర్‌లైన్స్ షేర్ల విలీనం ద్వారా జెట్ ఎయిర్వేస్ను సొంతం చేసుకోనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. తదుపరి దశలో ప్రమోటర్ నరేష్ గోయల్ కుటుంబీకుల వాటాను టాటా గ్రూప్ కొనుగోలు చేయనున్నట్లు సమాచారం. కాగా ఇటీవల ప్రకటించిన జెట్ ఎయిర్వేస్ వరుసగా మూడవ క్వార్టర్లో కూడా నష్టపోయింది. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2 ఫలితాల్లో రూ.1,297 కోట్ల ఏకీకృత నికర నష్టాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. అధిక ఇంధన ధరలు, డాలర్‌తో రూపాయి విలువ క్షీణిస్తుండడంతో భారీ నష్టాలను నమోదయినట్లు సంస్థ పేర్కొంది. -
ఎయిరిండియా విక్రయం రద్దైందా?
న్యూఢిల్లీ : అప్పుల్లో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను కొనేవారే కరువయ్యారు. ఈ సంస్థను కొనుగోలు చేసేందుకు గతంలో ఆసక్తి చూపించిన కంపెనీలు కూడా ఒక్కొక్కటిగా పక్కకి తప్పుకున్నాయి. టాటా గ్రూప్ సైతం దీన్ని కొనేందుకు విముఖత వ్యక్తం చేసింది. ఒక్క బిడ్డర్ కూడా రావడం లేదు. దీంతో ఎన్నికలకు ముందు ఎయిరిండియా అమ్మకానికి వెళ్లకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. సంస్థ నిర్వహణ కోసం నిధులను సమకూర్చాలని నిర్ణయించినట్టు ప్రభుత్వ సీనియర్ అధికారి చెప్పారు. ఎయిరిండియాలో 76 శాతం వాటా విక్రయించడంలో ప్రభుత్వం విఫలం చెందిన కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. సంస్థ రోజువారీ నిర్వహణ కార్యకలాపాలను కొనసాగించడానికి ప్రభుత్వం త్వరలోనే నిధులను సమకూర్చబోతుందని ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఈ నిర్ణయాన్ని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఆధ్వర్యంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో తీసుకున్నారు. ఈ సమావేశానికి పీయూష్ గోయల్, సురేష్ ప్రభు, నితిన్ గడ్కారీ, ఆర్థిక, ఏవియేషన్ శాఖలకు చెందిన పలువురు సీనియర్ అధికారులు కూడా హాజరయ్యారు. ఈ ఎయిర్‌లైన్ లాభాలను పోస్ట్ చేస్తుందని, ఏ విమానం కూడా ఖాళీగా లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఎయిరిండియా నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తామన్నారు. ప్రస్తుతం ఎయిరిండియా డిజ్ఇన్వెస్ట్మెంట్ ప్రక్రియ చేయడానికి ఎలాంటి తొందరలేదని పేర్కొన్నాయి. అయితే త్వరలోనే ఎయిరిండియా మార్కెట్లో లిస్టింగ్‌కు రావాలని చూస్తోంది. ఈ లిస్టింగ్‌కు వచ్చే ముందే కంపెనీ లాబాలను ఆర్జించాల్సి ఉంది. ఏదైనా కంపెనీ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ కావాలంటే, దాని కంటే ముందు మూడు ఆర్థిక సంవత్సరాలు లాభాలను పోస్టు చేయాల్సి ఉన్న క్రమంలో ఎన్నికలకు ముందు డిజ్‌ఇన్వెస్ట్‌మెంట్‌కు వెళ్లకుండా.. ప్రభుత్వం నుంచే నిధులు సమకూర్చాలని చూస్తోంది. -
ఫ్లిప్‌కార్ట్-వాల్‌మార్ట్ భారీ డీల్
సాక్షి, ముంబై: దేశీయ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో అమెరికన్ రిటైల్ సంస్థ వాల్‌మార్ట్ అతి భారీ వాటా విక్రయానికి ఆమోదముద్ర పడింది. ప్రపంచంలోనే అతిపెద్ద రీటెయిలర్‌గా పేరున్న వాల్‌మార్ట్‌కు 75 శాతం వాటా విక్రయానికి ఫ్లిప్కార్ట్బోర్డు అంగీకరించినట్టు విశ్వనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇప్పటివరకు అంచనాలకుమించి సుమారు 15 బిలియన్ డాలర్లకు (లక్షకోట్ల రూపాయలకు) ఈ డీల్ కుదిరింది. ప్రతిపాదిత ఒప్పందంలో సాఫ్ట్ బ్యాంకు గ్రూప్ కార్పొరేషన్ ఫ్లిప్‌కార్ట్‌లో ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కింద దాదాపు 20 మిలియన్ డాలర్ల వాటాను విక్రయించనుందని పేరు చెప్పడానికి ఇష్టపడని సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. అలాగే గూగుల్-పేరెంట్ ఆల్ఫాబెట్ సంస్థ వాల్‌మార్ట్ పెట్టుబడిలో పాల్గొనే అవకాశం ఉంది. మరో 10 రోజుల్లో తుది డీల్ పూర్తి కావచ్చని అంచనా. మరోవైపు ఈ వార్తలపై స్పందించడానికి వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్, సాఫ్ట్ బ్యాంక్ వ్యాఖ్యానించడానికి నిరాకరించాయి. అంతర్జాతీయ విస్తరణలో భాగంగా దేశీయంగా ఆన్లైన్ సంస్థలపైకన్నేసిన వాల్‌మార్ట్ చివరకు ఫ్లిప్కార్ట్లోమెజారిటీ వాటాపై కొనుగోలుకు పథకం వేసింది. గ్లోబల్ ఇ-కామర్స్ వ్యూహంలో ఫ్లిప్‌కార్ట్ డీల్ కీలకమని న్యూఢిల్లీ ఆధారిత రిటైల్ కన్సల్టెన్సీ అడ్వైజర్ల ఛైర్మన్ అరవింద్ సింఘాల్ అన్నారు. కాగా ప్రపంచంలోనే అతి పెద్ద రిటైల్ సంస్థ వాల్‌మార్ట్ భారత రిటైల్ మార్కెట్లో ప్రవేశించేందుకు సుదీర్ఘ కాలంగా ప్రయత్నిస్తోంది. తాజా డీల్ సాకారమైతే శరవేగంగా పరుగులుపెడుతున్న భారత ఈకామర్స్ మార్కెట్లో వాల్‌మార్ట్ భారీ స్థాయిలో పాగా వేయడం ఖాయమని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అంతేకాదు ప్రత్యర్ధి సంస్థ అమెజాన్‌కు గట్టి పోటీ తప్పదు. ముఖ్యంగా చైనాలో అమెజాన్‌కు ఎదురుదెబ్బ నేపథ్యంలో ఇండియాలో విస్తరించాలని అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ భారీ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. -
ఎయిర్‌టెల్‌కు ఖతార్ షాక్
సాక్షి, ముంబై: దేశీయ టెలికాం దిగ్గజం భారతి ఎయిర్టెల్ కు వాటా విక్రయం షాక్ తగిలింది. ఖతార్‌కు చెందిన బిగ్ ఇన్వెస్టర్ భారతికి చెందిన భారీవాటాను విక్రయించనున్నారన్న వార్తలతో బుధవారం నాటి మార్కెట్లో భారతి ఎయిర్టెల్ టాప్ లూజర్‌గా నిలిచింది. భారతీ ఎయిర్టెల్ షేర్లు 3.4 శాతం క్షీణించి రూ .514.35 వద్ద ముగిశాయి. ఖతార్ ఫౌండేషన్ అనుబంధ సంస్థ త్రి పిల్లర్స్ లిమిటెడ్ భారతి ఎయిర్టెల్ లిమిటెడ్‌లో 5 శాతం వాటాను విక్రయించాలని యోచిస్తోంది. ఈ బ్లాక్ డీల్ ద్వారా 9,500 కోట్ల (1.46 బిలియన్ డాలర్లు) విలువైన షేర్లను విక్రయించనుంది. 1999 మిలియన్ షేర్లను మార్కెట్ లావాదేవీల ద్వారా విక్రయించాలని నిర్ణయించింది. షేర్ ధర రూ.473-490 గా ఉండనుంది. 2013లో వీటిని రూ.340 వద్ద కొనుగోలు చేసింది. అటు ఖతర్ ఫౌండేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రషీద్ ఫహాద్ అల్ నోయిమి భారతి ఎయిర్టెల్ బోర్డులో ఉన్నారు. అయితే ఈ పరిణామాలపై స్పందించేందుకు భారతి ఎయిర్టెల్ నిరాకరించింది. కాగా ఉగ్రవాదానికి మద్దతిస్తోందన్న ఆరోపణలతో ఖతార్‌తో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, ఈజిప్ట్ దేశాలు దౌత్య సంబంధాలను తెగ తెంపులు చేసుకున్నాయి.దీంతో ఖతార్ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని నివారించే వ్యూహంతో అక్కడి కంపెనీలు విదేశాల్లో తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నాయి. గల్ఫ్ దేశాలు ఈ ఏడాది జూన్ 5 న దోహాతో దౌత్య మరియు రవాణా సంబంధాలను కట్ చేసిన సంగతి తెలిసిందే. -
రూ.450 కోట్లు సమీకరిస్తున్న అపోలో
• దీనికోసం అపోలో హెల్త్‌లో వాటా విక్రయం • సంస్థ జేఎండీ సంగీత రెడ్డి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వైద్య సేవల రంగంలో ఉన్న అపోలో హాస్పిటల్స్ అనుబంధ కంపెనీ అపోలో హెల్త్, లైఫ్‌స్టైల్ రూ.450 కోట్ల నిధులను సమీకరిస్తోంది. ప్రయివేటు ఈక్విటీ రూపంలో ఈ నిధులను సమీకరిస్తున్నామని, వీటిని కంపెనీ విస్తరణకు ఉపయోగిస్తామని అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్ జాయింట్ మేనేజింగ్ డెరైక్టరు సంగీత రెడ్డి మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు. కొద్ది రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. అపోలో క్లినిక్స్, అపోలో షుగర్, అపోలో డయాగ్నాస్టిక్స్, అపోలో వైట్, అపోలో డయాలసిస్, అపోలో క్రాడిల్, అపోలో స్పెక్ట్రా హాస్పిటల్స్‌ను అపోలో హెల్త్, లైఫ్‌స్టైల్ నిర్వహిస్తోంది. క్లినిక్స్ రెట్టింపు... మల్టీ స్పెషాలిటీ క్లినిక్స్ అయిన అపోలో క్లినిక్స్‌కు ప్రస్తుతం భారత్‌తోపాటు పలు దేశాల్లో 78 శాఖలున్నాయి. క్లినిక్స్ విస్తరణపై పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తామని సంగీత రెడ్డి తెలిపారు. మూడేళ్లలో వీటి సంఖ్యను రెండింతలు చేయనున్నట్టు వెల్లడించారు. తృతీయ శ్రేణి నగరాల్లోనూ క్లినిక్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. క్రాడిల్ కేంద్రాలు ప్రస్తుతం 7 ఉన్నాయి. 2019 నాటికి మరో 13 రానున్నాయి. ముంబైలో ఏర్పాటవుతున్న 600 పడకల అపోలో ఆసుపత్రి వచ్చే నెలలో ప్రారంభం కానుంది. దీంతో సంస్థ పడకల సంఖ్య 10,200లకు చేరనుంది. చెన్నైలో సదస్సు.. దేశంలో ఆరోగ్య సేవల రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఙానం పూర్తిగా వినియోగంలోకి రాలేదని సంగీత రెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో ట్రాన్స్ఫార్మింగ్ హెల్త్‌కేర్ విత్ ఐటీ, పేషంట్ సేఫ్టీ కాంగ్రెస్ పేరుతో సదస్సులను చెన్నైలో అక్టోబరు 21-22న అపోలో నిర్వహిస్తోందని చెప్పారు. రోగుల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలతో నివేదికను రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని వివరించారు. సదస్సుకు 15 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారు. -
కతార్ ఇన్వెస్ట్‌మెంట్‌కు సహారా విదేశీ హోటళ్లు!
నేడు సుప్రీం అనుమతికి పిటిషన్.. న్యూఢిల్లీ : విదేశాల్లోని మూడు హోటళ్లలో వాటాల విక్రయానికి సహారా గ్రూప్‌కు లైన్ క్లియర్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. హోటళ్లను 1.6 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.10,720 కోట్లు) కతార్ ఇన్వెస్ట్‌మెంట్‌కు విక్రయించడానికి ఒక అవగాహన కుదిరినట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. మూడు హోటళ్లలో ఒకటి లండన్‌లో (గ్రాస్‌వీనర్) ఉండగా, మరో రెండు న్యూయార్క్ ప్లాజా, డ్రీమ్ డౌన్‌టౌన్ (న్యూయార్క్)లో ఉన్నాయి. అమ్మకం ద్వారా వచ్చే మొత్తం నిధుల్లో తన ప్రధాన రుణ దాత రూబిన్ బ్రదర్స్‌కు 995 మిలియన్ డాలర్లను కంపెనీ చెల్లించే వీలుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ అమ్మకం ప్రక్రియకు ఆమోదం కోసం సహారా శుక్రవారం సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నదని తెలుస్తోంది. సుప్రీంకోర్టు ఆమోదం లభిస్తే, అమ్మకం ప్రక్రియ పూర్తికి దాదాపు 2 నెలలు పడుతుంది. రెండు గ్రూప్ సంస్థలు- ఇన్వెస్టర్లకు డబ్బు తిరిగి చెల్లించలేని కేసులో... రెండేళ్ల పాటు తీహార్ జైలులో ఉన్న సహారా చీఫ్ సుబ్రతారాయ్ ప్రస్తుతం పెరోల్‌పై ఉన్నారు. ఈ కేసులో బెయిల్ పొందడానికి సహారా చీఫ్ రూ.10,000 కోట్లు చెల్లించాల్సి ఉంది. -
జీఎంఆర్ ఎనర్జీలో వాటాల విక్రయం
♦ మలేషియా కంపెనీ టీఎన్‌బీకి 30% వాటాలు ♦ డీల్ విలువ రూ. 2,000 కోట్లు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ దిగ్గజం జీఎంఆర్ గ్రూప్ అనుబంధ సంస్థ జీఎంఆర్ ఎనర్జీ (జీఈఎల్)కి చెందిన అసెట్స్ కొన్నింటిలో 30 శాతం వాటాలను మలేషియా కంపెనీ తెనగా నేషనల్ బెర్హాద్ (టీఎన్‌బీ)కు విక్రయించింది. ఈ డీల్ విలువ 300 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 2,000 కోట్లు). సుమారు రూ. 2,750 కోట్ల పైచిలుకు ఉన్న జీఈఎల్ కార్పొరేట్ రుణభారాన్ని తగ్గించుకునేందుకు ఈ నిధులను వినియోగించనున్నట్లు జీఎంఆర్ గ్రూప్ కార్పొరేట్ చైర్మన్ కిరణ్ కుమార్ గ్రంధి సోమవారం వివరించారు. డీల్ ప్రకారం జీఈఎల్కు చెందిన ఏడు విద్యుత్ అసెట్స్ పోర్ట్‌ఫోలియోల్లో 30 శాతం వాటాలు టీఎన్‌బీకి దాఖలుపడతాయి. రాబోయే అయిదేళ్లలో ఛత్తీస్‌గఢ్ తదితర ప్రాజెక్టుల్లో టీఎన్‌బీ పెట్టుబడులు పెట్టవచ్చు. ఈ పోర్ట్‌ఫోలియోల విలువ దాదాపు 1 బిలియన్ డాలర్ల మేర (సుమారు రూ. 6,700 కోట్లు)గా ఉంటుందని అంచనా. హైడ్రో, పునరుత్పాదక విద్యుదుత్పత్తి ప్లాంట్ల అభివృద్ధి, నిర్వహణ కార్యకలాపాల్లో తెనగా అనుభవం తమకు తోడ్పడగలదని జీఈఎల్ చైర్మన్ జీబీఎస్ రాజు ఈ సందర్భంగా తెలిపారు. మరోవైపు, 2022 నాటికల్లా ప్రజలందరికీ నిరంతరాయ విద్యుత్ అందించాలన్న కేంద్రం లక్ష్య సాధన దిశగా టీఎన్బీతో ఒప్పందం దోహదపడగలదని జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ జీఎం రావు పేర్కొన్నారు. ఏటా రూ. 250 కోట్ల వడ్డీ మిగులు.. తాజా నిధుల రాకతో జీఈఎల్కు ఉన్న రుణభారం సుమారు రూ. 2,000 కోట్లు తగ్గి, రూ. 750 కోట్ల స్థాయికి చేరుకోగలదని కిరణ్ కుమార్ పేర్కొన్నారు. దీనితో ఏటా రూ. 250 కోట్ల మేర వడ్డీ ఆదా అవుతుందన్నారు. మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌లోని గ్యాస్ ఆధారిత ప్లాంట్లు ప్రస్తుతం 35 శాతం పీఎల్‌ఎఫ్‌తో (పే లోడ్ ఫ్యాక్టర్) పనిచేస్తున్నట్లు వివరించారు. దాదాపు 4,630 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం గల ప్రాజెక్టులు జీఈఎల్ ఆధ్వర్యంలో ఉన్నాయి. కమలాంగ, వేమగిరి, వరోరా, అప్పర్ కర్నాలి హైడ్రో మొదలైన ప్రాజెక్టులు వీటిలో ఉన్నాయి. 10,818 మెగావాట్ల స్థాపిత విద్యుదుత్పత్తి సామర్ధ్యం గల టీఎన్‌బీకి.. మలేషియాలో విద్యుత్ పంపిణీ తదితర కార్యకలాపాలు కూడా ఉన్నాయి. -
కోల్ ఇండియా కొత్త రికార్డు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బొగ్గు దిగ్గజం కోల్ ఇండియాలో వాటా విక్రయానికి ఊహించిన విధంగానే స్పందన వచ్చింది. శుక్రవారం ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) విధానంలో కేంద్రం 10 శాతం వరకూ వాటాను విక్రయించగా రూ. 22,557.63 కోట్లు లభించాయి. దేశీ స్టాక్ మార్కెట్లలో ఇప్పటిదాకా అతిపెద్ద పబ్లిక్ ఇష్యూ(2010 అక్టోబర్‌లో ఐపీఓ ద్వారా రూ.15,199 కోట్ల సమీకరణ) కోల్ ఇండియాదే. ఇప్పుడు ఓఎఫ్ఎస్తో వాటా విక్రయంతో కోల్ఇండియా కొత్త రికార్డు నెలకొల్పింది. కాగా ఈ వాటా అమ్మకానికి వ్యతిరేకంగా సంస్థ కార్మిక యూనియన్లు ఆందోళన నిర్వహించాయి.