న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ (Adani) తాజాగా ఎఫ్‌ఎంసీజీ సంస్థ అదానీ విల్మర్‌లో (Adani Wilmar) 13.5 శాతం వాటా విక్రయించింది. ఫార్చూర్ బ్రాండ్ వంట నూనెలు, ఫుడ్ ప్రొడక్టుల కంపెనీలో 17.54 కోట్ల షేర్లను షేరుకి రూ. 275 ఫ్లోర్(కనీస) ధరలో అమ్మివేసింది. తద్వారా విల్మర్‌తో ఏర్పాటు చేసిన భాగస్వామ్య కంపెనీ(జేవీ) నుంచి వైదొలగనుంది.
వెరసి కీలకంకాని బిజినెస్‌ల నుంచి తప్పుకోవడం ద్వారా గ్రూప్‌నకు ప్రధానమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై దృష్టి పెట్టనుంది. భాగస్వామి విల్మర్‌కు వాటా విక్రయించనున్నట్లు గత నెలలో అదానీ గ్రూప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అనుబంధ సంస్థ అదానీ కమోడిటీస్ ఎల్‌ఎల్‌పీ ద్వారా 13.5 శాతం వాటాను సంస్థాగత ఇన్వెస్టర్లకు విక్రయించింది. దీనిలో అదనంగా విక్రయించే వీలున్న 6.5 శాతం వాటా(8.44 కోట్ల షేర్లు) సైతం కలసి ఉన్నట్లు వెల్లడించింది.
మార్కెట్లు క్షీణతలో ఉన్నప్పటికీ ఆఫర్ ఫర్ సేల్‌కు దేశ, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభించినట్లు అదానీ గ్రూప్ తెలియజేసింది. దీంతో 1.96 కోట్ల షేర్లను అదనంగా ఆఫర్ చేయనున్నట్లు వెల్లడించింది. అంటే 17.54 కోట్ల షేర్లు(13.5 శాతం వాటా) ప్రస్తుతం విక్రయించగా.. మరో 1.96 కోట్ల(1.5 శాతం వాటా)ను సోమవారం(13న) రిటైల్ ఇన్వెస్టర్లకు ఆఫర్ చేయనున్నట్లు వివరించింది.
అంటే మొత్తం 19.5 కోట్ల షేర్ల(15.01 శాతం వాటా)ను అమ్మివేయనున్నట్లు వెల్లడించింది. ఈ లావాదేవీ తదుపరి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25)లో 3.15 బిలియన్ డాలర్ల ఈక్విటీ పెట్టుబడులను సమకూర్చుకున్నట్లవుతుందని అదానీ గ్రూప్ తెలియజేసింది.
పబ్లిక్‌కు కనీస వాటా
తాజా వాటా విక్రయ నేపథ్యంలో పబ్లిక్‌కు కనీస వాటా నిబంధనలను అమలు చేసినట్లు అదానీ విల్మర్ పేర్కొంది. ప్రస్తుతం ప్రమోటర్లకు 74.37 శాతం, పబ్లిక్‌కు 25.63 శాతం వాటా ఉన్నట్లు తెలియజేసింది. తదుపరి దశలో ఒప్పందం ప్రకారం మిగిలిన వాటాను విల్మర్‌కు షేరుకి రూ. 305 ధర మించకుండా విక్రయించనున్నట్లు తెలియజేసింది. లావాదేవీకి ముందు కంపెనీలో అదానీ గ్రూప్‌నకు 43.94 శాతం వాటా ఉన్న విషయం విదితమే.
నిజానికి విల్మర్‌కు 31 శాతం వాటా విక్రయానికి ఒప్పందం కుదిరినప్పటికీ ఆఫర్ ఫర్ సేల్‌కు లభించిన స్పందన ఆధారంగా మిగిలిన వాటా ను విక్రయించనుంది. మార్చి31లోగా మొత్తం వాటా విక్రయం పూర్తికానున్నట్లు అదానీ గ్రూప్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో అదానీ విల్మర్ షేరు బీఎస్‌ఈలో 10 శాతం పతనమై రూ. 292 దిగువన స్థిరపడింది.
Comments
Please login to add a commentAdd a comment