మైనింగ్ మొఘల్, ప్రమోటర్ అనిల్ అగర్వాల్ కంపెనీలో వాటాను విక్రయించే సన్నాహాల్లో ఉన్నట్లు మీడియాలో వచ్చిన వార్తలు నిరాధారమని వేదాంతా లిమిటెడ్ తాజాగా పేర్కొంది. ఇందుకు చర్చలు జరుగుతున్నట్లు వెలువడిన వార్తలు కేవలం వదంతులేనని కంపెనీ ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. చివరి అవకాశంగా వేదాంతాలో 5 శాతంవరకూ వాటా విక్రయించే యోచనలో అనిల్ అగర్వాల్ ఉన్నట్లు ఇటీవల మీడియా పేర్కొన్న నేపథ్యంలో కంపెనీ వివరణకు ప్రాధాన్యత ఏర్పడింది.
వేదాంతా లిమిటెడ్‌లో మెజారిటీ వాటాదారు అయిన వేదాంతా రిసోర్సెస్ రుణ భారాన్ని తగ్గించుకునేందుకు చూస్తోంది. ఇందుకు హిందుస్తాన్ జింక్ లిమిటెడ్(హెచ్‌జెడ్‌ఎల్)కు జింక్ ఆస్తులను విక్రయించడం ద్వారా 298.1 కోట్ల డాలర్లు సమీకరించాలని ప్రణాళికలు వేసింది. కంపెనీలో వేదాంతాకు 64.92 శాతం వాటా ఉంది. అయితే హెచ్‌జెడ్‌ఎల్‌లో 29.54 శాతం వాటా కలిగిన ప్రభుత్వం ఇందుకు వ్యతిరేకతను వ్యక్తం చేసింది. కాగా.. రానున్న త్రైమాసికాలలో రుణ చెల్లింపులకు అవసరమైన వనరులున్నట్లు ఇంతక్రితం వేదాంతా వెల్లడించింది.
తద్వారా రుణ చెల్లింపులపై ఇన్వెస్టర్లలో నెలకొన్న ఆందోళనలకు తెరదించే ప్రయత్నం చేసింది. సిండికేట్ రుణం, బైలేటరల్ బ్యాంక్ సౌకర్యాల ద్వారా 1.75 బిలియన్ డాలర్లు పొందే ఒప్పందం తుది దశలో ఉన్నట్లు వేదాంతా తెలియజేసింది. 2023 మార్చివరకూ అన్ని రకాల రుణ చెల్లింపులనూ పూర్తి చేసినట్లు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. గత 11 నెలల్లో 2 బిలియన్ డాలర్ల రుణాలను తిరిగి చెల్లించినట్లు పేర్కొంది. జూన్‌కల్లా చేపట్టవలసిన చెల్లింపులకూ తగిన లిక్విడిటీని కలిగి ఉన్నట్లు వెల్లడించింది. బార్‌క్లేస్, స్టాన్‌చార్ట్ బ్యాంకుల నుంచి తీసుకున్న 25 కోట్ల డాలర్ల రుణాలను పూర్తిగా చెల్లించినట్లు ఇటీవలే కంపెనీ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment