Vedanta Limited
-
ఆరు సంస్థలుగా వేదాంతా
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ మైనింగ్ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ బిజినెస్‌ల విడదీతకు రుణదాతలు ఆమోదముద్ర వేశారు. దీంతో ఆరు స్వతంత్ర లిస్టెడ్ కంపెనీలుగా ఆవిర్భవించేందుకు వేదాంతాకు వీలు చిక్కనుంది. ఎస్బీఐసహా రుణదాతలు అంగీకరించడంతో 52 శాతానికిపైగా అను మతి లభించినట్లేనని వేదాంతా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు పేర్కొన్నారు. అధిక శాతం రుణదాతలు విడదీతను సమరి్ధంచినట్లు వెల్లడించారు. విడదీత ప్రణాళికకు 75% ఆమోదం లభించవలసి ఉండగా.. వారం, పది రోజుల్లో మిగిలిన లక్ష్యాన్ని సైతం చేరుకోగలమని తెలియజేశారు. కొన్ని అనుమతులకు కమిటీ మీటింగ్, బోర్డు సమావేశాల కోసం చూస్తున్నట్లు తెలియజేశారు. వీటి తదుపరి ఎన్సీఎల్టీకి దరఖాస్తు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రధాన రుణదాత ఎస్బీఐ ఇప్పటికే సమ్మతించగా.. 20 బిలియన్ డాలర్ల విలువైన విడదీత ప్రణాళికకు దారి ఏర్పడినట్లు వివరించారు. గత జనవరి–మార్చిలో రూ. 6,155 కోట్ల నికర రుణభారాన్ని తగ్గించుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. దీంతో రుణ భారం రూ. 56,388 కోట్లకు చేరినట్లు తెలియజేసింది. వేదాంతా రుణదాతల జాబితాలో ఎస్బీఐ, బీవోబీ, పీఎన్బీ, కెనరా బ్యాంక్, ఐవోబీ, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రతోపాటు.. ప్రయివేట్ బ్యాంకులైన యస్ బ్యాంక్, ఐసీఐసీఐ, యాక్సిస్, ఐడీఎఫ్సీ ఫస్ట్, కొటక్ మహీంద్రా ఉన్నాయి. విడదీతలో భాగంగా వేదాంతా.. అల్యూమినియం, ఆయిల్ అండ్ గ్యాస్, విద్యుత్, స్టీల్, ఫెర్రస్ మెటీరియల్స్, బేస్ మెటల్స్ సంస్థలుగా ఏర్పాటు కానుంది. ఇవన్నీ స్వతంత్ర కంపెనీలుగా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్‌కానున్నాయి -
భారీ పెట్టుబడులకు వేదాంతా సై
న్యూఢిల్లీ: మైనింగ్ రంగ ప్రయివేట్ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ వివిధ బిజినెస్‌లలో 6 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయనుంది. అల్యూమినియం, జింక్, ముడిఇనుము, స్టీల్, చమురు, గ్యాస్ తదితర విభిన్న విభాగాలపై పెట్టుబడులు వెచ్చించేందుకు ప్రణాళికలు వేసింది. తద్వారా వార్షికంగా కనీసం 2.5 బిలియన్ డాలర్ల నిర్వహణ లాభాన్ని(ఇబిటా) జత చేసుకోవాలని చూస్తున్నట్లు ఇన్వెస్టర్ల సమావేశంలో కంపెనీ అత్యున్నత అధికారులు వెల్లడించారు. పైప్‌లైన్‌లో 50 యాక్టివ్ ప్రాజెక్టులుసహా విస్తరణ ప్రణాళికలున్నట్లు తెలియజేశారు. ఇవి కంపెనీ వృద్ధికి దోహదం చేస్తాయని, తద్వారా 6 బిలియన్ డాలర్ల ఆదాయానికి వీలున్నట్లు పేర్కొన్నారు. ఇది ప్రస్తుత ఆరి్థక సంవత్సరం(2023–24)లో సాధించే వీలున్న 5 బిలియన్ డాలర్ల ఇబిటాను వచ్చే ఏడాది(2024–25) 6 బిలియన్ డాలర్లకు పెంచనున్నట్లు అంచనా వేశారు. ఈ బాటలో 2027కల్లా 7.5 బిలియన్ డాలర్ల ఇబిటాను సాధించవచ్చని ఆశిస్తున్నారు. రానున్న 25ఏళ్లలో విభిన్న స్థాయికి కంపెనీ చేరనున్నట్లు వేదాంతా చైర్మన్ అనిల్ అగర్వాల్ ఇన్వెస్టర్లకు తెలియజేశారు. విభిన్న ప్రాజెక్టులపై 6 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేస్తున్నట్లు అనిల్ సోదరుడు, కంపెనీ వైస్‌చైర్మన్ నవీన్ అగర్వాల్ పేర్కొన్నారు. ఇది 6 బిలియన్ డాలర్ల అదనపు టర్నోవర్‌కు దారిచూపనున్నట్లు, వార్షికప్రాతిపదికన ఇబిటా 2.5–3 బిలియన్ డాలర్లవరకూ అదనంగా బలపడనున్నట్లు వివరించారు. -
ఆరు కంపెనీలుగా వేదాంతా
బిలియనీర్ అనిల్ అగర్వాల్ గ్రూప్.. వేదాంతా రిసోర్సెస్.. సరికొత్త ప్రణాళికలకు తెరతీసింది. వీటి ప్రకారం డైవర్సిఫైడ్ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ ఆరు లిస్టెడ్ కంపెనీలుగా విడిపోనుంది. ఇక మైనింగ్ దిగ్గజం హిందుస్తాన్ జింక్ విభిన్న విభాగాల కార్పొరేట్ నిర్మాణాన్ని పూర్తిస్థాయిలో సమీక్షించనుంది. తద్వారా ఓవైపు రుణ భారాన్ని తగ్గించుకోవడం, మరోపక్క వాటాదారులకు అధిక విలువను రాబట్టడం లక్ష్యాలుగా పెట్టుకుంది. వివరాలు చూద్దాం.. న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ కీలక బిజినెస్‌లను ప్రత్యేక కంపెనీలుగా విడదీయనుంది. అల్యూమినియం, ఆయిల్– గ్యాస్, స్టీల్, ఫెర్రస్ మెటల్స్, బేస్ మెటల్స్ పేరుతో ఐదు విభాగాలను విడదీసేందుకు ప్రణాళికలు వేసింది. వీటిని విడిగా లిస్ట్ చేయడం ద్వారా వాటాదారులకు మరింత విలువ చేకూర్చనున్నట్లు వేదాంతా తాజాగా వెల్లడించింది. దీనిలో భాగంగా సరళతర విభజనకు తెరతీయనుంది. వెరసి వేదాంతా వాటాదారులకు తమవద్దగల ప్రతీ 1 షేరుకీ విడదీయనున్న 5 కంపెనీలకు చెందిన ఒక్కో షేరు చొప్పున కేటాయించనున్నారు. ఆపై వీటిని స్టాక్ ఎక్సే్చంజీలలో లిస్ట్ చేయనున్నట్లు వేదాంతా తెలియజేసింది. వెరసి వేదాంతాసహా.. ఆరు లిస్టెడ్ కంపెనీలకు తెరలేవనుంది. ఇక మరోవైపు హిందుస్తాన్ జింక్‌సహా.. కొత్తగా ఏర్పాటు చేసిన స్టెయిన్లెస్ స్టీల్, సెమీకండక్టర్ డిస్ప్లే బిజినెస్‌లలో 65 శాతం చొప్పున వాటాను కలిగి ఉండనుంది. ఈ మొత్తం ప్రణాళికల అమలును 12–15 నెలలలోగా పూర్తిచేయాలని వేదాంతా భావిస్తోంది. గ్రూప్‌నకు మాతృ సంస్థ వేదాంతా రిసోర్సెస్.. హోల్డింగ్ కంపెనీగా కొనసాగనుంది. హింద్ జింక్ కార్పొరేట్ సమీక్ష వేదాంతా గ్రూప్ కంపెనీ హిందుస్తాన్ జింక్ పూర్తిస్థాయిలో కార్పొరేట్ నిర్మాణాన్ని సమీక్షించనుంది. కంపెనీ విలువలో మరింత వృద్ధికి వీలుండటంతో కార్పొరేట్ నిర్మాణ సమీక్షకు బోర్డు నిర్ణయించినట్లు మైనింగ్ దిగ్గజం హిందుస్తాన్ జింక్ వెల్లడించింది. ప్రధానంగా జింక్, లెడ్, సిల్వర్, రీసైక్లింగ్ బిజినెస్‌లను ప్రత్యేక చట్టబద్ధ సంస్థలుగా ఏర్పాటు చేసే లక్ష్యంతో ఉన్నట్లు తెలియజేసింది. కంపెనీకిగల భిన్న విభాగాల పరిమాణం, కార్యకలాపాలు, వృద్ధి అవకాశాలను పరిగణనలోకి తీసుకుని తాజా ప్రతిపాదనలకు తెరతీసినట్లు వివరించింది. వీటిలో బిజినెస్ అవసరాలరీత్యా మూలధన నిర్మాణం, పెట్టుబడి కేటాయింపుల విధానాలు, కీలక అంశాలపై ప్రత్యేక దృష్టి తదితర అంశాలున్నట్లు తెలియజేసింది. తద్వారా విభిన్న బిజినెస్‌లు తమ మార్కెట్ పొజిషన్‌ను వినియోగించుకుని దీర్ఘకాలిక వృద్ధి సాధించేందుకు వీలు కల్పించనున్నట్లు తెలియజేసింది. వెరసి అన్ని రకాల వాటాదారులకు విలువ చేకూర్చే వ్యూహంతో ఉన్నట్లు పేర్కొంది. బిజినెస్‌ల విడదీత వార్తలతో ఎన్ఎస్ఈలో వేదాంతా షేరు 7 శాతం దూసుకెళ్లి రూ. 223 వద్ద నిలవగా.. హిందుస్తాన్ జింక్ 3.5 శాతం జంప్‌చేసి రూ. 308 వద్ద ముగిసింది. నిధుల సమీకరణ.. ప్రతీ ప్రత్యేక విభాగాన్నీ ఒక్కొక్క కంపెనీగా విడదీయడం ద్వారా వేదాంతా గ్రూప్ కార్పొరేట్ నిర్మాణాన్ని సరళతరంగా మార్చివేయనుంది. ఆయా రంగాలపై పూర్తిస్థాయిలో దృష్టిసారించే బాటలో స్వతంత్ర సంస్థలుగా ఏర్పాటు చేయనుంది. దీంతో సావరిన్ వెల్త్‌ఫండ్స్ తదితర గ్లోబల్ ఇన్వెస్టర్లతోపాటు.. సంస్థాగత, రిటైల్ ఇన్వెస్టర్లకు పెట్టుబడి అవకాశాలను కలి్పంచే యోచనలో ఉంది. వెరసి దేశ ఆర్థిక వృద్ధిని అవకాశాలుగా మలచుకునే ప్యూర్‌ప్లే కంపెనీలలో పెట్టుబడులకు వ్యూహాత్మక ఇన్వెస్టర్లను ఆకట్టుకోనుంది. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిస్తున్న భారత్‌లో కమోడిటీలకు భారీ డిమాండ్ కనిపించనున్నట్లు వేదాంతా భావిస్తోంది. ఇటీవలే సెమీకండక్టర్లు, డిస్ప్లే తయారీలోకి సైతం ప్రవేశించింది. -
విడిగా వివిధ బిజినెస్‌ల లిస్టింగ్: అనిల్ అగర్వాల్ మెగా ప్లాన్
న్యూఢిల్లీ: మైనింగ్, మెటల్ రంగ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ గ్రూప్‌లోని బిజినెస్‌లను విడిగా లిస్ట్ చేయాలని భావిస్తోంది. వాటాదారులకు మరింత విలువ చేకూర్చేబాటలో అల్యూమినియం, ఇనుము–ఉక్కు, చమురు–గ్యాస్ తదితర విభాగాలను ప్రత్యేక కంపెనీలుగా విడదీసే యోచనలో ఉన్నట్లు వేదాంతా గ్రూప్ చీఫ్ అనిల్ అగర్వాల్ తాజాగా పేర్కొన్నారు. మాతృ సంస్థ వేదాంతా రీసోర్సెస్ వీటన్నిటికీ హోల్డింగ్ కంపెనీగా కొనసాగనుంది. (మార్కెట్లో దూసుకుపోతున్న భారత్: ఈ నంబర్ ప్లేట్ల గురించి తెలుసా?) వాటాదారులకు వీడియో సందేశం ద్వారా చైర్మన్ అనిల్ అగర్వాల్ ఈ వివరాలు వెల్లడించారు. మెటల్స్ అండ్ మైనింగ్, ఆయిల్ అండ్ గ్యాస్ తదితరాలను విడిగా లిస్ట్ చేయడం ద్వారా భారీగా వృద్ధి చెందేందుకు వీలుంటుందని పేర్కొన్నారు. వెరసి వేదాంతా లిమిటెడ్‌లో 1 షేరుని కలిగి ఉంటే పలు కంపెనీలలో షేర్లను పొందేందుకు వీలు చిక్కనున్నట్లు తెలియజేశారు. (పండగ సీజన్..బీఅలర్ట్: సెప్టెంబరులో బ్యాంకు సెలవులెన్నో తెలుసా?) తొలుత 2021 నవంబర్‌లో అగర్వాల్ బిజినెస్‌ల విడదీత, వ్యూహాత్మక భాగస్వామ్యాలు తదితరాల ద్వారా కార్పొరేట్ పునర్వ్యవస్థీకరణ అంశాన్ని ప్రస్తావించిన సంగతి తెలిసిందే. కార్పొరేట్ నిర్మాణాన్ని క్రమబదీ్ధకరించడం, సరళీకరించడం ద్వారా వాటాదారులకు లబ్ది చేకూర్చాలని భావించారు. దీర్ఘకాలిక వృద్ధికి తెరతీయాలని ప్రణాళికలు వేసినప్పటికీ ముందుకుసాగలేదు. అయితే ప్రస్తుతం ఇందుకున్న అవకాశాలపై వాటాదారులు, తదితరుల అభిప్రాయాలకు ఆహా్వనం పలుకుతున్నారు. రెండు దశాబ్దాలుగా.. గత రెండు దశాబ్దాలలో వేదాంతా దిగుమతుల ప్రత్యామ్నాయంగా ఎదిగినట్లు అగర్వాల్ పేర్కొన్నారు. దీంతో ఆయా విభాగాలలో ప్రవేశించడం అత్యంత క్లిష్టతరమని అభిప్రాయపడ్డారు. ఆయిల్ అండ్ గ్యాస్‌తోపాటు భారీ స్థాయిలో అల్యూమినియంను ఉత్పత్తి చేస్తున్నట్లు ప్రస్తావించారు. ఈ బాటలో సమీకృత విద్యుత్, కాపర్, జింక్, సిల్వర్, లెడ్, ఐరన్ అండ్ స్టీల్, నికెల్, ఫెర్రోఅల్లాయ్స్, సెమీకండక్టర్, డిస్ప్లే గ్లాస్ తదితర మరిన్ని విభాగాలలో కార్యకలాపాలు విస్తరించినట్లు వివరించారు. ప్రస్తుతం ఇవన్నీ వేదాంతా గొడుగుకిందనే ఉన్నట్లు తెలియజేశారు. మొత్తం ప్రపంచమంతా ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నట్లు పేర్కొన్నారు. ఇన్వెస్టర్లు స్వతంత్ర కంపెనీలపట్లనే ఆసక్తి చూపుతారని, ప్రత్యేక కంపెనీగా విడిపోవడం ద్వారా కీలక బిజినెస్‌పై దృష్టి సారించగలుగుతాయని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఇన్వెస్టర్లకు తమకిష్టమైన రంగాలు, కంపెనీలలో ఇన్వెస్ట్ చేసేందుకు వీలుంటుందని వివరించారు. తద్వారా ఉత్తమ రిటర్నులతోపాటు డివిడెండ్లు అందుతాయని అంచనా వేశారు. -
తూత్తుకుడి ప్లాంట్ విక్రయించం
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ తమిళనాడులోని తూత్తుకుడిలోగల కాపర్ ప్లాంటును విక్రయించబోమని తాజాగా స్పష్టం చేసింది. స్టెరిలైట్ కాపర్ ప్లాంటును విక్రయిస్తున్నట్లు మీడియాలో వచ్చిన వార్తలను తప్పుపట్టింది. ఇవి ఆధారరహిత, తప్పుడు వార్తలని పేర్కొంది. వీటికి ఎలాంటి ప్రాతిపదికలేదంటూ తోసిపుచి్చంది. స్టెరిలైట్ కాపర్ జాతీయ ఆస్తిఅని, దేశీయంగా మొత్తం కాపర్ ఉత్పత్తిలో 40 శాతం వాటాను ఆక్రమిస్తున్నట్లు స్టాక్ ఎక్సే్ఛంజీలకు ఇచి్చన సమాచారంలో తెలియజేసింది. మీడియాలోని కొన్ని వర్గాలు తూత్తుకుడిలోని స్టెరిలైట్ కాపర్ ప్లాంటును వేదాంతా విక్రయిస్తున్నట్లు తప్పుడు వార్తలు సృష్టించినట్లు పేర్కొంది. వీటిని ఖండిస్తున్నట్లు తెలియజేసింది. దేశం నికరంగా కాపర్‌ను దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో మెటల్‌కు డిమాండ్ పెరుగుతూనే ఉన్నదని, కార్యకలాపాలు తిరిగి ప్రారంభించవలసిన ఆవశ్యకత ఉన్నట్లు వివరించింది. -
వేదాంతా లాభం క్షీణత
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 57 శాతం క్షీణించి రూ. 3,132 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో రూ. 7,261 కోట్లు ఆర్జించింది. అల్యూమినియం బిజినెస్ తగ్గడం, రైటాఫ్‌లు లాభాలను దెబ్బతీశాయి. అయితే త్రైమాసికవారీగా(క్యూ3) చూస్తే నికర లాభం(రూ. 3,092 కోట్లు) 1 శాతం బలపడింది. అయితే మొత్తం ఆదాయం 5 శాతం క్షీణించి రూ. 37,225 కోట్లను తాకింది. అంతక్రితం క్యూ4లో రూ. 39,342 కోట్ల టర్నోవర్ సాధించింది. జింక్ నుంచి ముడిఇనుము వరకూ కమోడిటీ ధరలు తగ్గడం ఫలితాలను ప్రభావితం చేసింది. వీటికితోడు చమురు, గ్యాస్ బిజినెస్ నుంచి రూ. 1,336 కోట్లమేర అనుకోని నష్టం వాటిల్లినట్లు కంపెనీ వెల్లడించింది. ఇక గతేడాది కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 1,45,404 కోట్ల టర్నోవర్ అందుకుంది. పెట్టుబడులకు సై గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ అనిల్ అగర్వాల్ సోదరుడు నవీన్ అగర్వాల్, కుమార్తె ప్రియా అగర్వాల్‌లను బోర్డు ఐదేళ్లపాటు డైరెక్టర్లుగా తిరిగి నియమించినట్లు వేదాంతా పేర్కొంది. చమురు, గ్యాస్ అన్వేషణకు 29.6 కోట్ల డాలర్ల పెట్టుబడి వ్యయాలకూ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలియజేసింది. ఈ ఆర్థిక సంవత్సరం(2023–24) 1.7 బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్రణాళికలున్నట్లు వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో వేదాంతా షేరు 2.3 శాతం నీరసించి రూ. 275 వద్ద ముగిసింది. -
వాటా విక్రయం వదంతే: వేదాంతా నిరాధారమని స్పష్టీకరణ
మైనింగ్ మొఘల్, ప్రమోటర్ అనిల్ అగర్వాల్ కంపెనీలో వాటాను విక్రయించే సన్నాహాల్లో ఉన్నట్లు మీడియాలో వచ్చిన వార్తలు నిరాధారమని వేదాంతా లిమిటెడ్ తాజాగా పేర్కొంది. ఇందుకు చర్చలు జరుగుతున్నట్లు వెలువడిన వార్తలు కేవలం వదంతులేనని కంపెనీ ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. చివరి అవకాశంగా వేదాంతాలో 5 శాతంవరకూ వాటా విక్రయించే యోచనలో అనిల్ అగర్వాల్ ఉన్నట్లు ఇటీవల మీడియా పేర్కొన్న నేపథ్యంలో కంపెనీ వివరణకు ప్రాధాన్యత ఏర్పడింది. వేదాంతా లిమిటెడ్‌లో మెజారిటీ వాటాదారు అయిన వేదాంతా రిసోర్సెస్ రుణ భారాన్ని తగ్గించుకునేందుకు చూస్తోంది. ఇందుకు హిందుస్తాన్ జింక్ లిమిటెడ్(హెచ్‌జెడ్‌ఎల్)కు జింక్ ఆస్తులను విక్రయించడం ద్వారా 298.1 కోట్ల డాలర్లు సమీకరించాలని ప్రణాళికలు వేసింది. కంపెనీలో వేదాంతాకు 64.92 శాతం వాటా ఉంది. అయితే హెచ్‌జెడ్‌ఎల్‌లో 29.54 శాతం వాటా కలిగిన ప్రభుత్వం ఇందుకు వ్యతిరేకతను వ్యక్తం చేసింది. కాగా.. రానున్న త్రైమాసికాలలో రుణ చెల్లింపులకు అవసరమైన వనరులున్నట్లు ఇంతక్రితం వేదాంతా వెల్లడించింది. తద్వారా రుణ చెల్లింపులపై ఇన్వెస్టర్లలో నెలకొన్న ఆందోళనలకు తెరదించే ప్రయత్నం చేసింది. సిండికేట్ రుణం, బైలేటరల్ బ్యాంక్ సౌకర్యాల ద్వారా 1.75 బిలియన్ డాలర్లు పొందే ఒప్పందం తుది దశలో ఉన్నట్లు వేదాంతా తెలియజేసింది. 2023 మార్చివరకూ అన్ని రకాల రుణ చెల్లింపులనూ పూర్తి చేసినట్లు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. గత 11 నెలల్లో 2 బిలియన్ డాలర్ల రుణాలను తిరిగి చెల్లించినట్లు పేర్కొంది. జూన్‌కల్లా చేపట్టవలసిన చెల్లింపులకూ తగిన లిక్విడిటీని కలిగి ఉన్నట్లు వెల్లడించింది. బార్క్లేస్, స్టాన్‌చార్ట్ బ్యాంకుల నుంచి తీసుకున్న 25 కోట్ల డాలర్ల రుణాలను పూర్తిగా చెల్లించినట్లు ఇటీవలే కంపెనీ పేర్కొంది. -
ప్రభుత్వానికి వేదాంత షాక్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గుంప గుత్త లాభాల పన్ను (విండ్‌ఫాల్ ట్యాక్స్)కు నిరసనగా వేదాంత లిమిటెడ్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. తన గ్యాస్ క్షేత్రాల నుంచి ఆర్జించిన లాభంలో కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన 91 మిలియన్ డాలర్ల వాటాని (సుమారు రూ.773 కోట్లు) నిలిపివేసింది. జనవరి 31, ఫిబ్రవరి 20వ తేదీల్లో పెట్రోలియం, సహజవాయువు శాఖకు ఈ విషయమై వేదాంత సమాచారం కూడా ఇచ్చింది. స్థానికంగా (దేశీయంగా) ఉత్పత్తి అయ్యే చమురుపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీ (ఎస్ఏఈడీ)ని కేంద్రం విధించింది. ఆరంభంలో టన్నుపై రూ.23,250 ప్రకటించగా (అంటే బ్యారెల్ చమురుపై 40 డాలర్లు).. ఆ తర్వాత టన్నుకు రూ.3,500కు తగ్గించింది. ఇది కాకుండా ఉత్పత్తి దారులు చమురు, గ్యాస్ రేటుపై ఆర్జించిన మొత్తంపైనా 10–20 శాతం రాయల్టీని చెల్లించాల్సి ఉంటుంది. వీటితోపాటు ఆదాయం నుంచి ఖర్చులను తీసివేసిన తర్వాత మిగిలిన లాభంలో ముందుగా నిర్ణయించిన మేరకు ప్రభుత్వం వాటా తీసుకోవచ్చు. ఇన్ని రకాలుగా ఉత్పత్తిదారులు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో వేదాంత రాజస్థాన్‌లోని బ్లాక్ ఉత్పత్తిపై ఈ ప్రత్యేక అదనపు ఎక్సైడ్ డ్యూటీ (ఎస్ఏఈడీ) చెల్లించేందుకు గాను 85.35 మిలియన్ డాలర్లు, కాంబే బేసిన్లో సీబీ–ఓఎస్/2 బ్లాక్‌కు సంబంధించి ఎస్ఏఈడీ కోసం 5.50 మిలియన్ డాలర్లను నిలిపివేసినట్టు పెట్రోలియం శాఖకు స్పష్టం చేసింది. ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఆర్థిక ప్రయోజనాలను పునరుద్ధరించేందుకే ఈ చర్య చేపట్టినట్టు వివరించింది. కేంద్రం విధించిన ఎస్ఏఈడీ, కాంట్రాక్టు ఒప్పందాలకు విరుద్ధమన్నది వేదాంత వాదనగా ఉంది. -
100 బిలియన్ డాలర్ల సంస్థగా వేదాంత
న్యూఢిల్లీ: వ్యాపార దిగ్గజం వేదాంత లిమిటెడ్ వచ్చే ఎనిమిదేళ్లలో 100 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 8 లక్షల కోట్లు) కంపెనీగా ఎదగాలని నిర్దేశించుకుంది. ప్రస్తుతం ఇది 18 బిలియన్ డాలర్ల (రూ. 1.3 లక్షల కోట్లు) సంస్థగా ఉంది. వృద్ధి ప్రణాళికలను దూకుడుగా అమలు చేయడంపైనా, వివిధ వ్యాపార విభాగాల్లో సామర్థ్యాలను పెంచుకోవడంపైనా మరింతగా దృష్టి పెట్టనున్నట్లు బుధవారం వేదాంత వార్షిక సర్వసభ్య సమావేశంలో సంస్థ చైర్మన్ అనిల్ అగర్వాల్ వెల్లడించారు. సెమీకండక్టర్లు, డిస్ప్లే ఫ్యాబ్రికేషన్ విభాగాల్లోకి వ్యూహాత్మకంగా ప్రవేశిస్తున్నట్లు ఆయన తెలిపారు. ‘అంతర్జాతీయంగా సెమీకండక్టర్ల కొరత నెలకొంది. భారత్ 100 శాతం దిగుమతులపైనే ఆధారపడాల్సి ఉంటున్నందున ఇది సమస్యగా మారింది. దేశీయంగా సెమీకండక్టర్ల వినియోగం 2026 నాటికి 80 బిలియన్ డాలర్లకు, ఆ తర్వాత 2030 నాటికి 110 బిలియన్ డాలర్లకు చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి‘ అని అగర్వాల్ వివరించారు. దేశీయంగా సమగ్ర సెమీకండక్టర్ తయారీ ప్లాంటు ఏర్పాటు చేసేందుకు వేదాంత ఇప్పటికే దిగ్గజ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ ఫాక్స్‌కాన్‌తో చేతులు కలిపింది. దేశ వృద్ధిలో సహజ వనరుల కీలక పాత్ర.. భారతదేశ ఆర్థిక వృద్ధిలో సహజ వనరుల రంగం కీలక పాత్ర పోషిస్తోందని అనిల్ అగర్వాల్ అన్నారు. ఒక చిన్న విధానపరమైన మార్పు ఈ రంగం ‘నిజమైన సామర్థ్యాన్ని వెలికితీస్తుంది‘ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘భారత్ స్వావలంబన దిశలో వేగంగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో దేశ వృద్ధి, ఉపాధి కల్పనలో సహజ వనరుల రంగం కీలక పాత్ర పోషిస్తోంది. చిన్న విధాన సంస్కరణలు కూడా సహజ వనరుల విభాగ నిజమైన సామర్థ్యాన్ని వెలికితీస్తాయి’’ అని చెప్పారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... ► మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల మధ్య ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు గమ్యస్థానంగా చైనాను మాత్రమే కాకుండా భారత్‌ను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. ► ‘చైనాతోపాటు మరొక దేశం వ్యూహాన్ని’ అవలంబిస్తున్న అంతర్జాతీయ పెట్టుబడిదారులకు ‘భారత్ ఖచ్చితంగా ఒక ఆకర్షణీయమైన ప్రదేశంగా కనబడుతుంది. తమ పెట్టుబడులకు కేవలం చైనానే కాకుండా, ప్రత్యామ్నాయంగా మిగిలిన దేశాలవైపూ చూడటం ఈ వ్యూహం ప్రధాన ఉద్దేశం. ► మహమ్మారి కోవిడ్–19, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. అయితే ఈ సమయంలో భారత ఆర్థిక వ్యవస్థ చాలా దేశాల కంటే మెరుగ్గా పనిచేస్తోంది. ► భారత్ దాదాపు ఏడు శాతం వృద్ధి రేటుతో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఉంది. అమెరికా, బ్రిటన్లు దాదాపు రెండంకెల స్థాయిల్లో ద్రవ్యోల్బణం సవాలును ఎదుర్కొంటుండగా, ఆయా దేశాలతో పోల్చితే భారత్‌లో ఒక మోస్తరు ద్రవ్యోల్బణమే కొనసాగుతోంది. -
వేదాంతా లాభం అప్
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 5 శాతం పుంజుకుని రూ. 4,421 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 4,224 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా రూ. 29,151 కోట్ల నుంచి రూ. 39,355 కోట్లకు జంప్‌చేసింది. అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 21,751 కోట్ల నుంచి రూ. 32,095 కోట్లకు ఎగశాయి. ఫైనాన్స్ వ్యయాలు స్వల్పంగా 2 శాతం పెరిగి రూ. 1,206 కోట్లకు చేరగా.. రూ. 8,031 కోట్లమేర స్థూల రుణాలు జత కలిశాయి. దీంతో మొత్తం రుణ భారం రూ. 61,140 కోట్లను తాకింది. కాగా, భాగస్వామ్య నియంత్రణా సంస్థలను కూడా కలుపుకుంటే ప్రస్తుత సమీక్షా కాలంలో మొత్తం నికర లాభం 6 శాతం మెరుగుపడి రూ. 5,592 కోట్లుగా నమోదైంది. స్టెరిలైట్ యూనిట్‌కు బిడ్స్ తమిళనాడులోని తూత్తుకుడిలోని స్టెరిలైట్ కాపర్ యూనిట్ కొనుగోలుకి పలు సంస్థల నుంచి బిడ్స్ దాఖలైనట్లు వేదాంతా రీసోర్సెస్ తాజాగా వెల్లడించింది. తమిళనాడు రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు అభ్యంతరాల నేపథ్యంలో 2018 నుంచి మూతపడిన స్టెరిలైట్ కాపర్ స్మెల్టింగ్ ప్లాంటును వేదాంతా అమ్మకానికి పెట్టింది. ఫలితాల నేపథ్యంలో వేదాంతా షేరు బీఎస్ఈలో 1 శాతం బలపడి రూ. 245 వద్ద ముగిసింది. -
వేదాంతా చేతికి ఎథేనా చత్తీస్‌గఢ్
న్యూఢిల్లీ: రుణ సవాళ్లు ఎదుర్కొంటున్న ఎథేనా చత్తీస్‌గఢ్ పవర్ లిమిటెడ్‌ను సొంతం చేసుకోనున్నట్లు డైవర్సిఫైడ్ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ తాజాగా పేర్కొంది. ఇందుకు దాదాపు రూ. 565 కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించింది. నగదు రూపేణా చేపట్టనున్న ఈ డీల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23)లో పూర్తయ్యే వీలున్నట్లు వేదాంతా తెలియజేసింది. ఎథేనా చత్తీస్‌గఢ్ పవర్ లిక్విడేషన్ ప్రక్రియ గతేడాది మార్చిలో ప్రారంభమైంది. కంపెనీలో 100 శాతం వాటాను చేజిక్కించుకోనున్నట్లు వేదాంతా వెల్లడించింది. ఈ కొనుగోలుతో అల్యూమినియం బిజినెస్ విద్యుత్ అవసరాలు తీరనున్నట్లు తెలియజేసింది. ఏథేనా పవర్.. చత్తీస్‌గఢ్‌లోని ఝాంజ్గిర్ చంపా జిల్లాలో 1,200 మెగావాట్ల బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంటును కలిగి ఉంది. 2019 మే 15న కంపెనీపై కార్పొరేట్ దివాలా రుణపరిష్కార ప్రాసెస్ ప్రారంభమైంది. గతేడాది మే 13న ఎన్సీఎల్టీ హైదరాబాద్ బెంచ్ లిక్విడేషన్ ప్రాసెస్‌కు ఆదేశాలు జారీ చేసింది. కంపెనీకి గల రెండు యూనిట్లలలో 80 శాతం, 30 శాతం చొప్పున పనులు పూర్తయ్యాయి. దీంతో వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించలేదు. జాతీయ రహదారులు, రైల్వే స్టేషన్లకు విద్యుత్ ప్లాంటు అనుసంధానమై ఉండటం గమనార్హం! -
రెట్రో వివాద పరిష్కార దిశలో వేదాంత!
న్యూఢిల్లీ: కేంద్రంతో దాదాపు రూ.20,495 కోట్ల విలువైన రెట్రాస్పెక్టివ్ పన్ను వివాద పరిష్కారం దిశగా బిలియనీర్ అనిల్ అగర్వాల్ మైనింగ్ గ్రూప్ వేదాంతా ముందడుగు వేసింది. ప్రభుత్వంపై ఇందుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టులో అలాగే ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ (ఐఏటీ)లో విచారణలో ఉన్న కేసులను ఉపసంహరించుకుంటున్నట్లు సంస్థ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే... బ్రిటీష్ మాతృసంస్థ ద్వారా వచ్చిన మూలధన లాభాలపై పన్ను తీసివేయడంలో విఫలమైనందుకు కెయిర్న్ ఇండియా నుండి రూ. 20,495 కోట్ల పన్నులను (పెనాల్టీతో సహా) ఐటీ శాఖ డిమాండ్ చేసింది. అటు తర్వాత 2011లో కెయిర్న్ ఇండియాను అగర్వాల్ గ్రూప్ కొనుగోలు చేసింది. వేదాంతా లిమిటెడ్‌లో ఈ సంస్ధ విలీనమైంది. దీనితో పన్ను డిమాండ్ కేసు విషయంలో ఐటీ శాఖతో వేదాంత న్యాయ పోరాటం చేస్తోంది. మరోవైపు గతంలో ఎప్పుడో జరిగిన వ్యాపార ఒప్పందాలపై కూడా పన్నులు విధించేలా (రెట్రాస్పెక్టివ్ ట్యాక్స్) 2012లో చేసిన చట్టం వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో కేంద్రం ఇటీవల ఈ చట్టాన్ని పక్కన పెట్టింది. ప్రభుత్వంపై పెట్టిన కేసులను ఉపసంహరించుకుంటే సామరస్యంగా ఈ వివాదాల పరిష్కారానికి కేంద్రం ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. -
వేదాంత డీలిస్టింగ్ విఫలం
న్యూఢిల్లీ: సాంకేతిక సమస్యల కారణంతో వేదాంత లిమిటెడ్ డీలిస్టింగ్ ప్రక్రియ సాధ్యపడలేదు. కన్ఫర్మ్ కాని ఆర్డర్ల సంఖ్య భారీ స్థాయిలో ఉండటం, షేర్లను దఖలు చేసే ప్రక్రియలో కొన్ని సాంకేతిక లోపాలు తలెత్తడం వంటి అంశాలు దీనికి కారణమని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బైబ్యాక్ ప్రక్రియను మరొక్క రోజు పొడిగించే అంశం సహా పలు ప్రత్యామ్నాయాలను కంపెనీ పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బీఎస్ఈ గణాంకాల ప్రకారం అక్టోబర్ 9 సాయంత్రం నాటికి షేర్‌హోల్డర్ల దగ్గర 169.73 కోట్ల షేర్లు ఉండగా, ప్రమోటర్లకు వాటాదారులు 137.74 కోట్ల షేర్లను ఆఫర్ చేశారు. వాస్తవానికి 134.12 కోట్ల షేర్ల లభిస్తే ప్రమోటర్ల షేర్‌హోల్డింగ్ కంపెనీలో 90 శాతాన్ని దాటి డీలిస్టింగ్‌కు మార్గం సుగమమయ్యేది. కానీ కస్టోడియన్ల నుంచి ఆమోదముద్ర లభించకపోవడంతో కొన్ని బిడ్లు ప్రాసెస్ కాలేదు. దీంతో ఆఫర్ చేసిన షేర్ల సంఖ్య 125.47 కోట్లకు తగ్గింది. డీలిస్ట్ చేయడానికి ఇంతకు మించిన స్థాయిలో షేర్లను కొనుగోలు చేయాల్సి ఉండటంతో డీస్టింగ్లో దాఖలైన షేర్లను వాపసు చేసే అవకాశం ఉందని వేదాంత తెలిపింది. డేటా ప్రకారం డీలిస్టింగ్‌కు సంబంధించి చాలా మటుకు షేర్లను రూ. 320 రేటు చొప్పున షేర్హోల్డర్లు ఆఫర్ చేశారు. శుక్రవారం నాటి ముగింపు ధర రూ. 120తో పోలిస్తే ఇది భారీ ప్రీమియం కావడం గమనార్హం. -
వేదాంత లాభం రూ. 2,158 కోట్లు
న్యూఢిల్లీ: మైనింగ్ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019–20) సెప్టెంబర్ క్వార్టర్లో 61 శాతం పెరిగింది. గత క్యూ2లో రూ.1,343 కోట్లుగా ఉన్న నికర లాభం (కన్సాలిడేటెడ్) ఈ క్యూ2లో రూ.2,158 కోట్లకు పెరిగిందని వేదాంతా తెలిపింది. కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించడం కలిసి వచ్చిందని, దీనికి ఇతర ఆదాయం 49 శాతం పెరగడం తోడయిందని, అందుకే నికర లాభం ఈ క్యూ2లో ఈ స్థాయిలో పెరిగిందని కంపెనీ సీఈఓ శ్రీనివాసన్ వెంకటకృష్ణన్ పేర్కొన్నారు. ఆదాయం మాత్రం రూ.23,279 కోట్ల నుంచి రూ.22,814 కోట్లకు తగ్గిందన్నారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం... కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు ప్రయోజనాలు రూ.1,891 కోట్లుగా ఉన్నాయి. గత క్యూ2లో రూ.574 కోట్లుగా ఉన్న ఇతర ఆదాయం ఈ క్యూ2లో రూ. 856 కోట్లకు పెరిగింది. ఈ క్యూ2లో రూ.3,279 కోట్ల మేర స్థూల రుణ భారం తగ్గింది. ఇక నికర రుణ భారం రూ.8,322 కోట్ల మేర తగ్గింది. నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.35,817 కోట్లుగా ఉన్నాయి. బీఎస్ఈలో వేదాంత షేర్ 3 శాతం నష్టంతో రూ.144 వద్ద ముగిసింది. -
వేదాంత లిమిటెడ్‌కు 41 ఆయిల్ బ్లాక్‌లు
న్యూఢిల్లీ: అనిల్ అగర్వాల్‌కు చెందిన వేదాంత లిమిటెడ్ 41 ఆయిల్, గ్యాస్ బ్లాక్‌లను వేలంలో దక్కించుకుంది. మొత్తం 55 ఆయిల్, గ్యాస్ బ్లాక్‌లను కేంద్రం వేలానికి పెట్టగా, ఇందులో ప్రభుత్వరంగంలోని ఆయిల్ ఇండియా(ఓఐఎల్) 9, ఓఎన్జీసీ 2 చొప్పున గెలుచుకున్నాయి. ఈ వివరాలను డైరెక్టర్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్ కార్యాలయం తెలియజేసింది. ప్రభుత్వరంగ గెయిల్, బీపీసీఎల్ ఒక్కోటి చొప్పున, హిందుస్తాన్ ఆయిల్ ఎక్స్‌ప్లోరేషన్ కంపెనీ ఒకటి సొంతం చేసుకున్నాయి. ఓపెన్ యాక్రేజ్ లైసెన్సింగ్ పాలసీ(ఓఏఎల్‌పీ) తొలి దశ కింద ఈ వేలం జరిగింది. మే 2తో బిడ్డింగ్ ప్రక్రియ ముగియగా... వేదాంత మొత్తం 55 బ్లాక్‌లకు బిడ్లు వేసి 41ని గెలుచుకుంది. ఓఎన్జీసీ 37 బ్లాక్‌లకు పోటీపడి 2 దక్కించుకుంటే, ఓఐఎల్ 22 బ్లాక్‌లకు బిడ్లు వేసి రెండింటిని సాధించింది. 55 బ్లాకుల్లో 53 బ్లాక్‌లకు కేవలం రెండే బిడ్లు దాఖలయ్యాయి. 55 బ్లాక్‌లు కలిపి మొత్తం 59,282 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం పరిధితో ఉన్నాయి. ఆర్ఐఎల్ కానీ, మరే విదేశీ కంపెనీ కానీ ఈ వేలంలో పాలుపంచుకోలేదు. ‘‘మన దేశం ఇంధన లోటుతో ఉంది. ఓఏఎల్‌పీ తరహా విధానాలు ప్రధానమంత్రి విజన్‌కు అనుగుణంగా మన దేశ చమురు దిగుమతులను ప్రస్తుతమున్న 80% నుంచి 2022 నాటికి 67%కి తగ్గించగలవు. ఈ పరిణామం భారత్‌లో పెట్టుబడులు పెట్టాలన్న మా విధానాన్ని బలోపేతం చేస్తుంది. అలాగే, దేశీయ చమురు ఉత్పత్తిలో 50% సమకూర్చగలం’’ అని వేదాంత అధినేత అనిల్ అగర్వాల్ చెప్పారు. -
వేదాంత లాభం రూ.5,675 కోట్లు
న్యూఢిల్లీ: వేదాంత లిమిటెడ్ మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో రూ.5,675 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే కాలంలో రూ.3,226 కోట్ల లాభంతో పోలిస్తే 34% వృద్ధి చెందింది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 17% పెరిగి రూ.27,630 కోట్లకు చేరింది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.23,961 కోట్లు. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికి (2017–18) లాభం 21% వృద్ధితో అంతకుముందు ఏడాదితో పోలిస్తే రూ.11,319 కోట్ల నుంచి రూ.13,692 కోట్లకు చేరింది. ఫలితాల వెల్లడి సందర్భంగా వేదాంత సీఈవో కుల్దీప్ కౌర మాట్లాడుతూ... ముడిసరుకుల ధరలు పెరిగినప్పటికీ అధిక ఎబిటా నమోదు చేసినట్టు చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో గోవాలో మైనింగ్ కార్యకలాపాలను మార్చిలో మూసివేయడం వల్ల నాలుగో క్వార్టర్లో ఏమంత ప్రభావం చూపించలేదని తెలిపారు. 2017–18 సంవత్సరం వేదాంతకు మార్పుతో కూడినదని సంస్థ చైర్మన్ నవీన్ అగర్వాల్ పేర్కొన్నారు. కంపెనీకి ఉన్న వృద్ధి అవకావాలు వాటాదారుల విలువను మరింత పెంచేవిగా తెలిపారు. -
వేదాంత లాభం నాలుగు రెట్లు జంప్
ముంబై: ప్రముఖ మైనింగ్ సంస్థ వేదాంత లిమిటెడ్ ఆకర్షణీయమైన ఫలితాలను నమోదు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఏకీకృత నికర లాభంలో గణనీయమైన వృద్ధిని సాధించింది. నాలుగురెట్ల పెరుగుదలతోమ రూ. 1,866 కోట్లు నికర లాభాలను ప్రకటించింది. అంతకు ముందు సంవత్సరంలో ఇదే క్వార్టర్ నికరలాభం రూ 412 కోట్లుగా ఉంది. ఆపరేషన్ల నుండి మొత్తం ఆదాయం 30 శాతం పెరిగి రూ. 20,393 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇది రూ. 15,731 కోట్లుగా ఉంది. నిర్వహణ లాభం(ఇబిటా) 77 శాతం దూసుకెళ్లి రూ. 5879 కోట్లకు చేరగా.. ఇబిటా మార్జిన్లు 21.1 శాతం నుంచి 28.8 శాతానికి బలపడ్డాయి. ఈ కాలంలో పన్ను వ్యయాలు కూడా రూ. 49 కోట్ల నుంచి రూ. 897 కోట్లకు పెరిగాయి. డిసెంబర్ త్రైమాసికంలో జింక్ ఇండియా మెటల్ ఉత్పత్తి క్వార్టర్ ఆన్ క్వార్టర్ 44 శాతంపెరిగినట్టు తెలిపింది. బాక్సైట్ మరియు కంకర మైనింగ్ ప్రారంభ కేటాయింపులపై రాష్ట్ర ప్రభుత్వంలో కలిసి పనిచేస్తున్నట్టు కంపెనీ తెలిపింది. క్వార్టర్ 3లో కాపర్ ఇండియా ఉత్పత్తి 102 కేటీ గా నమోదైనట్టు వేదాంత తెలిపింది. -
వేదాంతలో కెయిర్న్ ఇండియా విలీనం
పూర్తిగా షేర్లరూపంలోనే డీల్; విలువ 2.3 బిలియన్ డాలర్లు - కెయిర్న్ వాటాదారులకు 1:1 నిష్పత్తిలో వేదాంత షేర్ల కేటాయింపు - రూ.10 ముఖవిలువగల వేదాంత ప్రిఫరెన్షియల్ షేరు కూడా - విలీనానికి ఇరు కంపెనీల బోర్డులు ఓకే... - దేశంలో అతిపెద్ద సహజ వనరుల - కంపెనీగా నిలవనున్న వేదాంత! ముంబై: దేశీ ప్రైవేటు మైనింగ్ దిగ్గజం వేదాంత లిమిటెడ్‌లో కెయిర్న్ ఇండియా విలీనం ఖరారైంది. ఈ రెండు కంపెనీల మాతృ సంస్థ అయిన అనిల్ అగర్వాల్ వేదాంత గ్రూప్ తన రుణ భారాన్ని తగ్గించుకునే చర్యల్లో భాగంగా ఈ ఒప్పందానికి తెరతీసింది. పూర్తిగా షేర్ల మార్పిడి రూపంలో జరగనున్న ఈ డీల్ విలువ 2.3 బిలియన్ డాలర్లు(దాదాపు రూ.15,000 కోట్లు). ఒప్పందానికి ఇరు కంపెనీల డెరైక్టర్ల బోర్డులు ఆదివారం ఆమోదముద్ర వేశాయి. డీల్ ప్రకారం.. కెయిర్న్ ఇండియా వాటాదారులకు ఒక్కో షేరుకి ప్రతిగా ఒక వేదాంత షేరు లభించనుంది. అంతేకాకుండా రూ.10 ముఖ విలువ గల ఒక రిడీమబుల్ ప్రిఫరెన్షియల్ షేరు(7.5 శాతం వడ్డీ ప్రకారం) దక్కుతుంది. మొత్తంమీద చూస్తే.. కెయిర్న్ ఇండియా గత శుక్రవారం నాటి షేరు ముగింపు ధర(రూ.180)తో పోలిస్తే కంపెనీ షేర్హోల్డర్లకు 7.3 శాతం మేర అధిక ధర(ప్రీమియం) లభిస్తున్నట్లు లెక్క. ఈ డీల్ ద్వారా భారత్‌లో అతిపెద్ద సహజవనరుల(విభిన్న విభాగాల్లో) కంపెనీగా వేదాంత అవతరించనుంది. లండన్ స్టాక్ఎక్స్ఛేంజీలో లిస్టయిన మాతృ సంస్థ వేదాంత రిసోస్సెస్ పీఎల్‌సీకి వేదాంతలో ప్రస్తుతం 62.9 శాతం వాటా ఉంది. ఇప్పుడు ఈ విలీన డీల్ పూర్తయితే ఈ వాటా 50.1 శాతానికి తగ్గనుంది. 2011లో కెయిర్న్ ఇండియాలో మెజారిటీ వాటాను దాదాపు 8.67 బిలియన్ డాలర్ల మొత్తానికి వేదాంత రిసోర్సెస్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తమ కార్పొరేట్ స్వరూపాన్ని సరళీకరించే దిశగా 2013లో ప్రారంభించిన చర్యల్లో ఇది రెండో కీలక విలీన చర్యగా వేదాంత లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టామ్ అల్బనీస్ పేర్కొన్నారు. వ్యాపార పునర్వ్యవస్థీకరణలో భాగంగా 2013లో సెసాగోవాను స్టెరిలైట్ ఇండస్ట్రీస్‌లో విలీనం చేసిన విషయం విదితమే. ఈ డీల్ తర్వాత సెసాస్టెరిలైట్గా మారిన విలీనకంపెనీ పేరు తదనంతరం వేదాంత లిమిటెడ్‌గా మార్పు చెందింది. కాగా, తాజా విలీన ఒప్పందం దీర్ఘకాలంలో వేదాంత వాటాదార్లకు మేలుచేకూర్చనుందని.. మరోపక్క, కెయిర్న్ ఇండియా షేర్హోల్డర్లకు కూడా ఇది మంచి డీల్‌గా అల్బనీస్ చెప్పారు. చమురు-గ్యాస్ రంగంలో కెయిర్న్ ఇండియాకు చాలా పటిష్టమైన బ్రాండ్ విలువ ఉందని.. విలీనం తర్వాత కూడా ఈ బ్రాండ్‌ను యథాతథంగా కొనసాగించనున్నట్లు అల్బనీస్ వెల్లడించారు. అంతేకాకుండా కంపెనీలో ఎలాంటి ఉద్యోగాల కోతలూ ఉండబోవని కూడా స్పష్టం చేశారు. కెయిర్న్ నగదు నిల్వలే లక్ష్యం... వేదాంత లిమిటెడ్‌కు దాదాపు 77,752 కోట్ల భారీ రుణ భారం ఉంది. దీంతోపాటు కెయిర్న్ ఇండియా నుంచి వేదాంత 1.25 బిలియన్ డాలర్ల(దాదాపు రూ.8,000 కోట్లు) అంతర్గత రుణం కూడా తీసుకుంది. అయితే, దీనిపై అప్పట్లో ఇన్వెస్టర్ల నుంచి కొంత ప్రతికూలత కూడా ఎదురైంది. కాగా, ఇప్పుడు కెయిర్న్ ఇండియాను విలీనం చేసుకోవడం ద్వారా దానిదగ్గరున్న దాదాపు రూ.17,000 కోట్ల నగదు నిల్వలను రుణభారాన్ని కొంత మేర తగ్గించుకోవడానికి వేదాంత ఉపయోగించుకోనుంది. కెయిర్న్ ఇండియాకు ఇప్పుడు ఎలాంటి రుణాలు లేవు. అల్యూమినియం, కాపర్ ఉత్పత్తిలో దేశంలో నంబర్ వన్ కంపెనీగా వేదాంత లిమిటెడ్ నిలుస్తోంది. దేశీయంగా ఉన్న ఏడు బ్లాకుల్లో మూడింట్లో కెయిర్న్ ఇండియా చమురు-గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తోంది. ఇదిలాఉండగా.. భారీగా నగదు నిల్వలున్న(దాదాపు రూ.31,000 కోట్లు) మరో సబ్సిడరీ హిందుస్థాన్ జింక్‌ను కూడా విలీనం చేసుకోవడానికి వేదాంత రిసోర్సెస్ సిద్ధంగా ఉంది. అయితే, దీనిలో ప్రభుత్వానికి 29.5 శాతం వాటా ఉండటంతో ఈ ప్రతిపాదన జాప్యమవుతూ వస్తోంది. అనుమతులే కీలకం... వేదాంతలో కెయిర్న్ ఇండియా విలీనానికి ఇప్పుడు వివిధ భాగస్వామ్య పక్షాలు, నియంత్రణపరమైన అనుమతులు కీల కంగా మారనున్నాయి. అయితే, వచ్చే ఏడాది మార్చి 31కల్లా డీల్‌ను పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అల్బనీస్ తెలిపారు. కాగా, కెయిర్న్ ఇండియాలో 50 శాతం వాటా మైనారిటీ వాటాదారుల వద్ద ఉంది. ఇందులో దీని పూర్వపు మాతృ సంస్థ బ్రిటన్‌కు చెందిన కెయిర్న్ ఎనర్జీ(9.8 శాతం) ప్రధానమైనది. దీంతోపాటు మరో 9 శాతం వాటా ప్రభుత్వ రంగ బీమా అగ్రగామి ఎల్ఐసీకి చెందనుంది. డీల్ పూర్తవ్వాలంటే ఈ సంస్థల ఆమోదం తప్పనిసరి. విలీన ఒప్పందం ప్రతిపాదనను పూర్తిగా పరిశీలించిన తర్వాత తమ సంస్థ వాటాదారుల ప్రయోజనాల మేరకు నిర్ణయం తీసుకుంటామని కెయిర్న్ ఎనర్జీ ప్రతినిధి ఈ డీల్‌పై వ్యాఖ్యానించారు. ఇదిలాఉండగా.. విలీనానికి స్టాక్ ఎక్స్ఛేంజీలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ.. నియంత్రణ సంస్థ సెబీతో పాటు హైకోర్టు అనుమతి కూడా అవసరమే. మరోపక్క, రాజస్థాన్‌లోని బామర్ ఆయిల్ బేసిన్, కేజీ బేసిన్లో రవ్వ చమురు-గ్యాస్ క్షేత్రంలోని కెయిర్న్ ఇండియా హక్కులను వేదాంతకు బదలాయించాలంటే కేంద్ర పెట్రోలియం శాఖ ఆమోదించాలి ఉంటుంది. ఇదిలాఉండగా.. గతం లో కెయిర్న్ ఎనర్జీ నుంచి వాటా కొనుగోలు డీల్‌లో కెయిర్న్ ఇండియా రూ.20,495 కోట్ల మేర పన్ను చెల్లించాలంటూ ఇప్పటికే ఐటీ శాఖ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పాత లావాదేవీలను తిరగదోడి(రెట్రాస్పెక్టివ్) ఇలా పన్నులు వేయ డం పట్ల తాము చాలా విసుగు చెందామని.. ఇలాంటి చర్యలు అంతర్జాతీయ మార్కెట్లో భారత్ ప్రతిష్టకు నష్టం కలిగిస్తాయని వేదాంత చీఫ్ ఎగ్జిక్యూటివ్ అల్బనీస్ వ్యాఖ్యానించారు.