న్యూఢిల్లీ: అనిల్ అగర్వాల్‌కు చెందిన వేదాంత లిమిటెడ్ 41 ఆయిల్, గ్యాస్ బ్లాక్‌లను వేలంలో దక్కించుకుంది. మొత్తం 55 ఆయిల్, గ్యాస్ బ్లాక్‌లను కేంద్రం వేలానికి పెట్టగా, ఇందులో ప్రభుత్వరంగంలోని ఆయిల్ ఇండియా(ఓఐఎల్) 9, ఓఎన్‌జీసీ 2 చొప్పున గెలుచుకున్నాయి. ఈ వివరాలను డైరెక్టర్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్ కార్యాలయం తెలియజేసింది. ప్రభుత్వరంగ గెయిల్, బీపీసీఎల్ ఒక్కోటి చొప్పున, హిందుస్తాన్ ఆయిల్ ఎక్స్‌ప్లోరేషన్ కంపెనీ ఒకటి సొంతం చేసుకున్నాయి.
ఓపెన్ యాక్రేజ్ లైసెన్సింగ్ పాలసీ(ఓఏఎల్‌పీ) తొలి దశ కింద ఈ వేలం జరిగింది. మే 2తో బిడ్డింగ్ ప్రక్రియ ముగియగా... వేదాంత మొత్తం 55 బ్లాక్‌లకు బిడ్లు వేసి 41ని గెలుచుకుంది. ఓఎన్‌జీసీ 37 బ్లాక్‌లకు పోటీపడి 2 దక్కించుకుంటే, ఓఐఎల్ 22 బ్లాక్‌లకు బిడ్లు వేసి రెండింటిని సాధించింది. 55 బ్లాకుల్లో 53 బ్లాక్‌లకు కేవలం రెండే బిడ్లు దాఖలయ్యాయి. 55 బ్లాక్‌లు కలిపి మొత్తం 59,282 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం పరిధితో ఉన్నాయి. ఆర్‌ఐఎల్ కానీ, మరే విదేశీ కంపెనీ కానీ ఈ వేలంలో పాలుపంచుకోలేదు.
‘‘మన దేశం ఇంధన లోటుతో ఉంది. ఓఏఎల్‌పీ తరహా విధానాలు ప్రధానమంత్రి విజన్‌కు అనుగుణంగా మన దేశ చమురు దిగుమతులను ప్రస్తుతమున్న 80% నుంచి 2022 నాటికి 67%కి తగ్గించగలవు. ఈ పరిణామం భారత్‌లో పెట్టుబడులు పెట్టాలన్న మా విధానాన్ని బలోపేతం చేస్తుంది. అలాగే, దేశీయ చమురు ఉత్పత్తిలో 50% సమకూర్చగలం’’ అని వేదాంత అధినేత అనిల్ అగర్వాల్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment