gas block
-
వేలానికి 8 ఆయిల్, గ్యాస్ బ్లాకులు
న్యూఢిల్లీ: ఓపెన్ ఎక్రేజ్ లైసెన్సింగ్ విధానం (ఓఏఎల్‌పీ) కింద నిర్వహించే ఏడో విడత వేలంలో 8 చమురు, గ్యాస్ బ్లాకులను విక్రయానికి ఉంచుతున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ (డీజీహెచ్) వెల్లడించింది. బిడ్లను ఆహ్వానిస్తూ జారీ చేసిన ప్రకటనలో ఈ విషయం తెలిపింది. వేలం వేస్తున్న బ్లాకులు.. మొత్తం అయిదు రాష్ట్రాల్లో విస్తరించి ఉండగా, సింహభాగం బ్లాకులు అస్సాంలో ఉండనున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 నాటికి బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. అక్టోబర్ 6తో ముగిసిన ఆరో విడత వేలంలో 21 బ్లాకులు విక్రయానికి ఉంచగా మూడు కంపెనీలు మాత్రమే బిడ్లు దాఖలు చేశాయి. ప్రభుత్వ రంగ ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియాతో పాటు ప్రైవేట్ రంగ సన్ పెట్రోకెమికల్స్ వేలంలో పాల్గొన్నాయి. 21 బ్లాకుల్లో 18 బ్లాకులకు ఒక్కొక్కటి చొప్పున, 3 బ్లాకులకు రెండు బిడ్లు చొప్పున వచ్చాయి. దేశీయంగా మరింత విస్తీర్ణంలో చమురు, గ్యాస్ ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా చమురు దిగుమతుల బిల్లుల భారాన్ని తగ్గించుకునే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గత విధానాలకు భిన్నంగా .. ఆసక్తి గల సంస్థలే చమురు, గ్యాస్ వెలికితీతతకు అనువైన నిర్దిష్ట ఏరియాలను గుర్తించే స్వేచ్ఛ కల్పిస్తూ 2016 నుంచి ఓపెన్ ఎక్రేజ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. అటువంటి ప్రాంతాలను ఒక దగ్గర చేర్చి ఏటా రెండు సార్లు వేలం నిర్వహిస్తోంది. సదరు ఏరియాను గుర్తించిన సంస్థకు బిడ్డింగ్‌లో అదనంగా 5 పాయింట్లు కేటాయిస్తోంది. అలాగే రాయల్టీ రేట్ల తగ్గింపు, మార్కెటింగ్.. ధరలపరమైన స్వేచ్ఛనివ్వడం మొదలైన వెసులుబాటు కల్పిస్తోంది. ఈ విధానంలో నిర్వహించిన తొలి విడత వేలంలో మినహా మిగతా రౌండ్లలో ప్రైవేట్ కంపెనీలు అంతగా పాల్గొనలేదు. -
వేదాంత లిమిటెడ్‌కు 41 ఆయిల్ బ్లాక్‌లు
న్యూఢిల్లీ: అనిల్ అగర్వాల్‌కు చెందిన వేదాంత లిమిటెడ్ 41 ఆయిల్, గ్యాస్ బ్లాక్‌లను వేలంలో దక్కించుకుంది. మొత్తం 55 ఆయిల్, గ్యాస్ బ్లాక్‌లను కేంద్రం వేలానికి పెట్టగా, ఇందులో ప్రభుత్వరంగంలోని ఆయిల్ ఇండియా(ఓఐఎల్) 9, ఓఎన్జీసీ 2 చొప్పున గెలుచుకున్నాయి. ఈ వివరాలను డైరెక్టర్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్ కార్యాలయం తెలియజేసింది. ప్రభుత్వరంగ గెయిల్, బీపీసీఎల్ ఒక్కోటి చొప్పున, హిందుస్తాన్ ఆయిల్ ఎక్స్‌ప్లోరేషన్ కంపెనీ ఒకటి సొంతం చేసుకున్నాయి. ఓపెన్ యాక్రేజ్ లైసెన్సింగ్ పాలసీ(ఓఏఎల్‌పీ) తొలి దశ కింద ఈ వేలం జరిగింది. మే 2తో బిడ్డింగ్ ప్రక్రియ ముగియగా... వేదాంత మొత్తం 55 బ్లాక్‌లకు బిడ్లు వేసి 41ని గెలుచుకుంది. ఓఎన్జీసీ 37 బ్లాక్‌లకు పోటీపడి 2 దక్కించుకుంటే, ఓఐఎల్ 22 బ్లాక్‌లకు బిడ్లు వేసి రెండింటిని సాధించింది. 55 బ్లాకుల్లో 53 బ్లాక్‌లకు కేవలం రెండే బిడ్లు దాఖలయ్యాయి. 55 బ్లాక్‌లు కలిపి మొత్తం 59,282 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం పరిధితో ఉన్నాయి. ఆర్ఐఎల్ కానీ, మరే విదేశీ కంపెనీ కానీ ఈ వేలంలో పాలుపంచుకోలేదు. ‘‘మన దేశం ఇంధన లోటుతో ఉంది. ఓఏఎల్‌పీ తరహా విధానాలు ప్రధానమంత్రి విజన్‌కు అనుగుణంగా మన దేశ చమురు దిగుమతులను ప్రస్తుతమున్న 80% నుంచి 2022 నాటికి 67%కి తగ్గించగలవు. ఈ పరిణామం భారత్‌లో పెట్టుబడులు పెట్టాలన్న మా విధానాన్ని బలోపేతం చేస్తుంది. అలాగే, దేశీయ చమురు ఉత్పత్తిలో 50% సమకూర్చగలం’’ అని వేదాంత అధినేత అనిల్ అగర్వాల్ చెప్పారు. -
గ్యాస్ బ్లాకులో రిలయన్స్ వాటాలపై హార్డీ ఆసక్తి
న్యూఢిల్లీ: గుజరాత్ తీరంలోని జీఎస్-01 బేసిన్ గ్యాస్ బ్లాకులో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి చెందిన మొత్తం 90 శాతం వాటాలను కొనుగోలు చేయాలని భాగస్వామ్య సంస్థ హార్డీ ఆయిల్ అండ్ గ్యాస్ యోచిస్తోంది. ఇందుకోసం రిలయన్స్‌తో చర్చలు జరుపుతోంది. వాణిజ్యపరమైన షరతులపై అంగీ కారం కుదిరిందని, ముసాయిదా ఒప్పందాన్ని ఇరు కంపెనీలు పరిశీలిస్తున్నాయని 2014-15 ఆర్థిక సమీక్ష నివేదికలో హార్డీ ఆయిల్ పేర్కొంది. ప్రస్తుతం ఈ బ్లాకులో హార్డీకి 10 శాతం వాటాలు ఉన్నాయి. -
రిలయన్స్ గ్యాస్ బ్లాకులు మరో 2 వెనక్కి
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్, దాని భాగస్వామ్యసంస్థ బీపీ.. కేజీ బేసిన్‌లోని మరో రెండు చమురు, గ్యాస్ బ్లాకులను కేంద్రానికి సరెండర్ చేశాయి. రక్షణ శాఖ పరిమితుల కారణంగా కేజీ-డీడబ్ల్యూఎన్-2003/1ను, అధిక రిస్కు చేసినా ముడి ఇంధనం లభించే అవకాశాలు అంతంతమాత్రంగా ఉండటం వల్ల సీవై-పీఆర్-డీడబ్ల్యూఎన్-2001/3 (సీవై-డీ6) బ్లాకును వదులుకున్నట్లు 2014-15 వార్షిక నివేదికలో రిలయన్స్ ఇండస్ట్రీస్ పేర్కొంది. డీడబ్ల్యూఎన్-2003/1 విషయంలో నియంత్రణలను సడలించాలంటూ చాలాకాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నప్పటికీ ఫలితం లేకపోవడంతో దీన్నుంచి వైదొలగాలని నిర్ణయించినట్లు వివరించింది. రిలయన్స్‌కి చెందిన 21 చమురు, గ్యాస్ బ్లాకుల్లో బ్రిటన్ కంపెనీ బీపీ 2011లో 30% వాటాలు కొనుగోలు చేసింది. అప్పట్నుంచీ లాభసాటిగా లేని బ్లాకులను ఇరు సంస్థలు క్రమంగా తగ్గించుకుంటూ వస్తున్నాయి. తాజా పరిణామంతో రెండు కంపెనీల భాగస్వామ్యంలో 4 బ్లాకులు మిగిలినట్లవుతుంది. ఇక హార్డీ ఆయిల్ సంస్థ భాగస్వామ్యంలో ఒక బ్లాకు, రెండు కోల్ బెడ్ మీథేన్ బ్లాకులు కంపెనీ చేతిలో ఉన్నాయి. రిలయన్స్ ఎక్స్‌ప్లొరేషన్ అండ్ ప్రొడక్షన్ (ఆర్ఈపీ) డీఎంసీసీ.. పెరూ, యెమెన్ తదితర దేశాల్లో దాదాపు 15 క్షేత్రాలను కొనుగోలు చేసింది. అయితే ముడి ఇంధనం లభించే అవకాశాలు తక్కువగా ఉండటంతో వీటిలో చాలా మటుకు క్షేత్రాలను వదులుకుంది.