రిలయన్స్ గ్యాస్ బ్లాకులు మరో 2 వెనక్కి
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్, దాని భాగస్వామ్యసంస్థ బీపీ.. కేజీ బేసిన్‌లోని మరో రెండు చమురు, గ్యాస్ బ్లాకులను కేంద్రానికి సరెండర్ చేశాయి. రక్షణ శాఖ పరిమితుల కారణంగా కేజీ-డీడబ్ల్యూఎన్-2003/1ను, అధిక రిస్కు చేసినా ముడి ఇంధనం లభించే అవకాశాలు అంతంతమాత్రంగా ఉండటం వల్ల సీవై-పీఆర్-డీడబ్ల్యూఎన్-2001/3 (సీవై-డీ6) బ్లాకును వదులుకున్నట్లు 2014-15 వార్షిక నివేదికలో రిలయన్స్ ఇండస్ట్రీస్ పేర్కొంది.
డీడబ్ల్యూఎన్-2003/1 విషయంలో నియంత్రణలను సడలించాలంటూ చాలాకాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నప్పటికీ ఫలితం లేకపోవడంతో దీన్నుంచి వైదొలగాలని నిర్ణయించినట్లు వివరించింది. రిలయన్స్‌కి చెందిన 21 చమురు, గ్యాస్ బ్లాకుల్లో బ్రిటన్ కంపెనీ బీపీ 2011లో 30% వాటాలు కొనుగోలు చేసింది. అప్పట్నుంచీ లాభసాటిగా లేని బ్లాకులను ఇరు సంస్థలు క్రమంగా తగ్గించుకుంటూ వస్తున్నాయి.
తాజా పరిణామంతో రెండు కంపెనీల భాగస్వామ్యంలో 4 బ్లాకులు మిగిలినట్లవుతుంది. ఇక హార్డీ ఆయిల్ సంస్థ భాగస్వామ్యంలో ఒక బ్లాకు, రెండు కోల్ బెడ్ మీథేన్ బ్లాకులు కంపెనీ చేతిలో ఉన్నాయి. రిలయన్స్ ఎక్స్‌ప్లొరేషన్ అండ్ ప్రొడక్షన్ (ఆర్‌ఈపీ) డీఎంసీసీ.. పెరూ, యెమెన్ తదితర దేశాల్లో దాదాపు 15 క్షేత్రాలను కొనుగోలు చేసింది. అయితే ముడి ఇంధనం లభించే అవకాశాలు తక్కువగా ఉండటంతో వీటిలో చాలా మటుకు క్షేత్రాలను వదులుకుంది.