
వరుసగా మూడో ఏటా భారత్ కొనుగోలు
రష్యాకు అండగా నిలిచిన చైనా, భారత్, టర్కీ
74 శాతం ఆదాయం ఈ దేశాల నుంచే
ప్రైవేటు పరిశోధన సంస్థ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలు పెట్టిన తర్వాత రష్యా నుంచి భారత్ వరుసగా మూడో ఏడాదీ 49 బిలియన్ యూరోల విలువైన (రూ.4.45 లక్షల కోట్లు సుమారు) చమురు కొనుగోలు చేసింది. ఈ వివరాలను ప్రైవేటు పరిశోధనా సంస్థ అయిన సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (సీఆర్‌ఈఏ) నివేదిక రూపంలో వెల్లడించింది.
భారత్ సాధారణంగా మిడిల్‌ఈస్ట్ దేశాల నుంచి చమురు సమకూర్చుకుంటుంది. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దాడి మొదలు పెట్టిన తర్వాత మారిన సమీకరణాలతో.. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ గణనీయంగా పెంచడం గమనార్హం. పాశ్చాత్య దేశాలు ఆర్థిక ఆంక్షలు విధించడం, యూరోపియన్ దేశాలు కొనుగోళ్లను తగ్గించడంతో.. అంతర్జాతీయ బెంచ్‌మార్క్ కంటే రష్యా చాలా తక్కువ ధరకే చమురును ఆఫర్ చేయడం ఇందుకు కారణం. అంతకుముందు వరకు దేశ చమురు దిగుమతుల్లో రష్యా వాటా ఒక శాతంలోపే ఉండగా.. అక్కడి నుంచి 40 శాతానికి పెరిగాయి.
‘‘రష్యా నుంచి మూడో ఏడాది అత్యధికంగా చైనా 78 బిలియన్ యూరోల చమురు కొనుగోలు చేయగా, భారత్ 49 బిలియన్ యూరోలు, టర్కీ 34 బిలియన్ యూరోల చొప్పున కొనుగోలు చేశాయి. దీంతో రష్యా చమురు ఆదాయాల్లో ఈ మూడు దేశాలు 74 శాతం సమకూర్చాయి’’అని సీఆర్‌ఈఏ తెలిపింది. ఉక్రెయిన్‌పై దాడి ప్రారంభించిన మూడో ఏడాది రష్యాకి శిలాజ ఇంధనాల ద్వారా 242 బిలియన్ యూరోలు, ఉక్రెయిన్‌పై దాడి మొదలు పెట్టిన తర్వాత మొత్తం 847 బిలియన్ యూరోల ఆదాయం లభించినట్టు వెల్లడించింది. ఒకానొక దశలో మార్కెట్ రేటు కంటే బ్యారెల్‌కు 18–20 డాలర్లు తక్కువే చమురును రష్యా ఆఫర్ చేసినట్టు తెలిపింది. దీంతో భార్ తక్కువ రేటుపై చమురును సొంతం చేసుకోగలిగినట్టు పేర్కొంది. అయితే ఇటీవలి కాలంలో రష్యా ఆఫర్ చేసే డిస్కౌంట్ బ్యారెల్‌పై 3 డాలర్లకు తగ్గినట్టు వెల్లడించింది.
యూరప్, జీ7 దేశాలకు ఎగుమతులు
భారత్‌లోని రిఫైనరీలు చౌకగా లభించిన రష్యా ముడి చమురును పెట్రోల్, డీజిల్ ఇంధనాలుగా మార్చి యూరప్, జీ7 దేశాలకు ఎగుమతి చేసినట్టు ఈ నివేదిక తెలిపింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభించిన మూడో ఏడాది జీ7 దేశాలు 18 బిలియన్ యూరోల ఆయిల్‌ను భారత్, టరీ్కలోని రిఫైనరీల నుంచి కొనుగోలు చేసినట్టు పేర్కొంది. భారత్, టర్కీ రిఫైనరీల నుంచి ఈయూ అతిపెద్ద చమురు దిగుమతిదారుగా నిలిచింది. రిఫైనరీల మొత్తం ఉత్పత్తిలో 13 శాతం ఇలా ఎగుమతి అయినట్టు ఈ నివేదిక తెలిపింది. ఐరోపా యూనియన్‌లో నెదర్లాండ్స్ 3.3 బిలియన్ యూరోలు, ఫ్రాన్స్ 1.4 బిలియన్ యూరోలు, రొమానియా 1.2 బిలియన్ యూరోలు, స్పెయిన్ 1.1 బిలియన్ యూరోల చొప్పున భారత్, టర్కీ రిఫైనరీల నుంచి కొనుగోలు చేసినట్టు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment