
మార్కెట్ విలువలో టాప్
రూ. 17.5 లక్షల కోట్లతో అగ్రస్థానం
అన్‌లిస్టెడ్ సంస్థల్లో నంబర్ వన్‌గా ఎన్‌ఎస్‌ఈ
బర్గండీ ప్రైవేట్ హురున్ ఇండియా టాప్ 500 జాబితాలో వెల్లడి
ముంబై: దేశీయంగా అత్యధిక మార్కెట్ వేల్యుయేషన్‌తో పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ వరుసగా నాలుగో ఏడాదీ అగ్రస్థానంలో కొనసాగింది. రూ. 17.5 లక్షల కోట్ల విలువతో బర్గండీ ప్రైవేట్ హురున్ ఇండియా టాప్ 500 కంపెనీల లిస్టులో నంబర్ వన్ ర్యాంకు దక్కించుకుంది. అటు ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్విసెస్ (టీసీఎస్) రూ. 16.1 లక్షల కోట్ల మార్కెట్ వేల్యుయేషన్‌తో రెండో స్థానంలో, రూ. 14.22 లక్షల కోట్లతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మూడో స్థానంలో నిల్చాయి.
మరోవైపు, ఐపీవోకి సన్నాహాలు చేసుకుంటున్న స్టాక్ ఎక్స్ఛేంజీ ఎన్‌ఎస్‌ఈ సంస్థ రూ. 4.7 లక్షల కోట్ల వేల్యుయేషన్‌తో.. అన్‌లిస్టెడ్ కంపెనీల విభాగంలో అగ్రస్థానంలో ఉంది. 2024 ఆర్థిక సంవత్సరంలో సంస్థ ఆదాయాలు 28 శాతం పెరిగి రూ. 16,352 కోట్లకు, లాభాలు 51 శాతం ఎగిసి రూ. 8,306 కోట్లకు చేరాయి. ఈ విభాగంలో రూ. 77,860 కోట్ల వేల్యుయేషన్‌తో మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రా అయిదో స్థానంలో ఉంది. బైటి నుంచి నిధులు సమీకరించకుండా సొంతంగా ఎదిగిన బూట్‌స్ట్రాప్డ్ సంస్థల లిస్టులో నాలుగో ర్యాంకు దక్కించుకుంది.
గ్రూప్‌లవారీగా చూస్తే టాటా సన్స్ వేల్యుయేషన్ 2024లో 37 శాతం ఎగిసి రూ. 32.27 లక్షల కోట్లకు చేరింది. అదే సమయంలో రిలయన్స్ గ్రూప్ మొత్తం వేల్యుయేషన్ రూ. 19.71 లక్షల కోట్లుగా, అదానీ గ్రూప్ విలువ రూ. 13.40 లక్షల కోట్లుగా ఉంది. తొలిసారిగా లిస్టులోని కంపెనీలన్నీ 1 బిలియన్ డాలర్ల పైగా వేల్యుయేషన్ ఉన్నవేనని హురున్ చీఫ్ రీసెర్చర్ అనాస్ రెహ్మాన్ జునైద్ తెలిపారు.
దేశవ్యాప్తంగా పరిశ్రమ నిపుణులు, జర్నలిస్టులు, బ్యాంకర్ల నుంచి సేకరించిన అభిప్రాయాలు, బహిరంగంగా అందుబాటలో ఉన్న గణాంకాల ఆధారంగా ఈ జాబితాను సిద్ధం చేసినట్లు వివరించారు. దీనికి డిసెంబర్ 13 కటాఫ్ తేదీగా నిర్ణయించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ఇందులో పరిగణనలోకి తీసుకోలేదు.
మరిన్ని వివరాలు ..
⇒ టాప్ 500లోకి చోటు దక్కించుకునేందుకు ఈసారి కనిష్ట వేల్యుయేషన్ పరిమితిని 43% అధికంగా రూ. 9,580 కోట్లకు పెంచారు. 2023లో ఇది రూ. 6,700 కోట్లుగా ఉంది.
⇒ లిస్టులోని మొత్తం కంపెనీల విలువ 40 శాతం ఎగిసి 3.8 లక్షల కోట్ల డాలర్లకు (సుమారు రూ. 324 లక్షల కోట్లు) చేరింది. ఇది దాదాపు 3.5 లక్షల కోట్ల డాలర్లుగా ఉన్న దేశ జీడీపీ కన్నా అధికం కావడం గమనార్హం. మోతీలాల్ ఓస్వాల్, ఐనాక్స్ విండ్, జెప్టో, డిక్సన్ వంటి సంస్థల వేల్యుయేషన్ అత్యధికంగా పెరిగింది.
⇒ మొత్తం సుమారు రూ. 86 లక్షల కోట్ల పైగా ఆదాయం ఉన్న ఈ 500 కంపెనీలు దాదాపు రూ. 8 లక్షల కోట్ల లాభాలు ఆర్జించగా, రూ. 2.2 లక్షల కోట్ల మొత్తాన్ని పన్నుల కింద చెల్లించాయి. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) కార్యక్రమాలపై రూ. 11,000 కోట్లు వెచ్చించాయి. సుమారు 85 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నాయి.
⇒టాప్ కంపెనీల సంఖ్యాపరంగా చూస్తే రూ. 10.11 లక్షల కోట్ల విలువ చేసే 35 సంస్థలతో హైదరాబాద్ అయిదో స్థానంలో నిలి్చంది. రాష్ట్రాలవారీగా చూస్తే తెలంగాణ ఏడో ర్యాంకులో ఉంది.