
న్యూఢిల్లీ: మైనింగ్ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019–20) సెప్టెంబర్ క్వార్టర్‌లో 61 శాతం పెరిగింది. గత క్యూ2లో రూ.1,343 కోట్లుగా ఉన్న నికర లాభం (కన్సాలిడేటెడ్) ఈ క్యూ2లో రూ.2,158 కోట్లకు పెరిగిందని వేదాంతా తెలిపింది. కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించడం కలిసి వచ్చిందని, దీనికి ఇతర ఆదాయం 49 శాతం పెరగడం తోడయిందని, అందుకే నికర లాభం ఈ క్యూ2లో ఈ స్థాయిలో పెరిగిందని కంపెనీ సీఈఓ శ్రీనివాసన్ వెంకటకృష్ణన్ పేర్కొన్నారు.
ఆదాయం మాత్రం రూ.23,279 కోట్ల నుంచి రూ.22,814 కోట్లకు తగ్గిందన్నారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం... కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు ప్రయోజనాలు రూ.1,891 కోట్లుగా ఉన్నాయి. గత క్యూ2లో రూ.574 కోట్లుగా ఉన్న ఇతర ఆదాయం ఈ క్యూ2లో రూ. 856 కోట్లకు పెరిగింది. ఈ క్యూ2లో రూ.3,279 కోట్ల మేర స్థూల రుణ భారం తగ్గింది. ఇక నికర రుణ భారం రూ.8,322 కోట్ల మేర తగ్గింది. నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.35,817 కోట్లుగా ఉన్నాయి.
బీఎస్‌ఈలో వేదాంత షేర్ 3 శాతం నష్టంతో రూ.144 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment