బిలియనీర్ అనిల్ అగర్వాల్ గ్రూప్.. వేదాంతా రిసోర్సెస్.. సరికొత్త ప్రణాళికలకు తెరతీసింది. వీటి ప్రకారం డైవర్సిఫైడ్ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ ఆరు లిస్టెడ్ కంపెనీలుగా విడిపోనుంది. ఇక మైనింగ్ దిగ్గజం హిందుస్తాన్ జింక్ విభిన్న విభాగాల కార్పొరేట్ నిర్మాణాన్ని పూర్తిస్థాయిలో సమీక్షించనుంది. తద్వారా ఓవైపు రుణ భారాన్ని తగ్గించుకోవడం, మరోపక్క వాటాదారులకు అధిక విలువను రాబట్టడం లక్ష్యాలుగా పెట్టుకుంది. వివరాలు చూద్దాం..
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ కీలక బిజినెస్‌లను ప్రత్యేక కంపెనీలుగా విడదీయనుంది. అల్యూమినియం, ఆయిల్– గ్యాస్, స్టీల్, ఫెర్రస్ మెటల్స్, బేస్ మెటల్స్ పేరుతో ఐదు విభాగాలను విడదీసేందుకు ప్రణాళికలు వేసింది. వీటిని విడిగా లిస్ట్ చేయడం ద్వారా వాటాదారులకు మరింత విలువ చేకూర్చనున్నట్లు వేదాంతా తాజాగా వెల్లడించింది. దీనిలో భాగంగా సరళతర విభజనకు తెరతీయనుంది.
వెరసి వేదాంతా వాటాదారులకు తమవద్దగల ప్రతీ 1 షేరుకీ విడదీయనున్న 5 కంపెనీలకు చెందిన ఒక్కో షేరు చొప్పున కేటాయించనున్నారు. ఆపై వీటిని స్టాక్ ఎక్సే్చంజీలలో లిస్ట్ చేయనున్నట్లు వేదాంతా తెలియజేసింది. వెరసి వేదాంతాసహా.. ఆరు లిస్టెడ్ కంపెనీలకు తెరలేవనుంది. ఇక మరోవైపు హిందుస్తాన్ జింక్‌సహా.. కొత్తగా ఏర్పాటు చేసిన స్టెయిన్‌లెస్ స్టీల్, సెమీకండక్టర్ డిస్‌ప్లే బిజినెస్‌లలో 65 శాతం చొప్పున వాటాను కలిగి ఉండనుంది. ఈ మొత్తం ప్రణాళికల అమలును 12–15 నెలలలోగా పూర్తిచేయాలని వేదాంతా భావిస్తోంది. గ్రూప్‌నకు మాతృ సంస్థ వేదాంతా రిసోర్సెస్.. హోల్డింగ్ కంపెనీగా కొనసాగనుంది.
హింద్ జింక్ కార్పొరేట్ సమీక్ష
వేదాంతా గ్రూప్ కంపెనీ హిందుస్తాన్ జింక్ పూర్తిస్థాయిలో కార్పొరేట్ నిర్మాణాన్ని సమీక్షించనుంది. కంపెనీ విలువలో మరింత వృద్ధికి వీలుండటంతో కార్పొరేట్ నిర్మాణ సమీక్షకు బోర్డు నిర్ణయించినట్లు మైనింగ్ దిగ్గజం హిందుస్తాన్ జింక్ వెల్లడించింది. ప్రధానంగా జింక్, లెడ్, సిల్వర్, రీసైక్లింగ్ బిజినెస్‌లను ప్రత్యేక చట్టబద్ధ సంస్థలుగా ఏర్పాటు చేసే లక్ష్యంతో ఉన్నట్లు తెలియజేసింది.
కంపెనీకిగల భిన్న విభాగాల పరిమాణం, కార్యకలాపాలు, వృద్ధి అవకాశాలను పరిగణనలోకి తీసుకుని తాజా ప్రతిపాదనలకు తెరతీసినట్లు వివరించింది. వీటిలో బిజినెస్ అవసరాలరీత్యా మూలధన నిర్మాణం, పెట్టుబడి కేటాయింపుల విధానాలు, కీలక అంశాలపై ప్రత్యేక దృష్టి తదితర అంశాలున్నట్లు తెలియజేసింది. తద్వారా విభిన్న బిజినెస్‌లు తమ మార్కెట్ పొజిషన్‌ను వినియోగించుకుని దీర్ఘకాలిక వృద్ధి సాధించేందుకు వీలు కల్పించనున్నట్లు తెలియజేసింది. వెరసి అన్ని రకాల వాటాదారులకు విలువ చేకూర్చే వ్యూహంతో ఉన్నట్లు పేర్కొంది.
బిజినెస్‌ల విడదీత వార్తలతో ఎన్‌ఎస్‌ఈలో వేదాంతా షేరు 7 శాతం దూసుకెళ్లి రూ. 223 వద్ద నిలవగా.. హిందుస్తాన్ జింక్ 3.5 శాతం జంప్‌చేసి రూ. 308 వద్ద ముగిసింది.
నిధుల సమీకరణ..
ప్రతీ ప్రత్యేక విభాగాన్నీ ఒక్కొక్క కంపెనీగా విడదీయడం ద్వారా వేదాంతా గ్రూప్ కార్పొరేట్ నిర్మాణాన్ని సరళతరంగా మార్చివేయనుంది. ఆయా రంగాలపై పూర్తిస్థాయిలో దృష్టిసారించే బాటలో స్వతంత్ర సంస్థలుగా ఏర్పాటు చేయనుంది. దీంతో సావరిన్ వెల్త్‌ఫండ్స్ తదితర గ్లోబల్ ఇన్వెస్టర్లతోపాటు.. సంస్థాగత, రిటైల్ ఇన్వెస్టర్లకు పెట్టుబడి అవకాశాలను కలి్పంచే యోచనలో ఉంది. వెరసి దేశ ఆర్థిక వృద్ధిని అవకాశాలుగా మలచుకునే ప్యూర్‌ప్లే కంపెనీలలో పెట్టుబడులకు వ్యూహాత్మక ఇన్వెస్టర్లను ఆకట్టుకోనుంది. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిస్తున్న భారత్‌లో కమోడిటీలకు భారీ డిమాండ్ కనిపించనున్నట్లు వేదాంతా భావిస్తోంది. ఇటీవలే సెమీకండక్టర్లు, డిస్‌ప్లే తయారీలోకి సైతం ప్రవేశించింది.
Comments
Please login to add a commentAdd a comment