
ముంబై: పెట్టుబడులను సులభంగా సమీకరించేందుకు వీలుగా ఇన్సూరెన్స్ కంపెనీలు స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌ను పరిశీలించవచ్చని బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏ చైర్మన్ దేవాశిష్ పాండా పేర్కొన్నారు. పబ్లిక్ ఇష్యూలు చేపట్టడం ద్వారా బీమా కంపెనీలు లిస్టింగును సాధించవచ్చని తెలియజేశారు. దీంతో బిజినెస్‌లో వృద్ధి అవకాశాలకు వీలుగా పెట్టుబడులను సమకూర్చుకునేందుకు వీలు చిక్కుతుందని తెలియజేశారు. అంతేకాకుండా దేశీయంగా బీమా విస్తృతికి సైతం లిస్టింగ్స్ దోహదపడతాయని అభిప్రాయపడ్డారు.
బీమా రంగ కంపెనీలను ఐపీవోలకు వెళ్లవలసిందిగా సూచిస్తున్నట్లు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పీఎస్‌యూ దిగ్గజం ఎల్‌ఐసీ పబ్లిక్ ఇష్యూకి వస్తే మార్కెట్లో 60 శాతం లిస్టయినట్లేనని వ్యాఖ్యానించారు. ఇది అత్యధిక పారదర్శకత, సమాచార వెల్లడికి దారి చూపుతుందని పేర్కొన్నారు. కంపెనీలు మరింత పురోగమించడానికి లిస్టింగ్ దోహదపడుతుందని, అంతిమంగా ఇది బీమా రంగ వ్యాప్తికి కారణమవుతుందని వివరించారు. ఐఆర్‌డీఏ చైర్మన్‌గా పాండా గత నెలలో బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. బీమా రంగ సంస్థలతో రెండు రోజులుగా ఇక్కడ పాండా సమావేశాలు నిర్వహిస్తున్నారు.
రూ.100 కోట్ల ప్రవేశ నిబంధన ఎత్తివేయాలి
బీమా వ్యాపారం ప్రారంభించేందుకు కనీసం రూ.100 కోట్ల పెట్టుబడి పరిమితిని ఎత్తివేయాలంటూ ప్రభుత్వాన్ని కోరే అవకాశం ఉన్నట్టు ఐఆర్‌డీఏఐ చైర్మన్ దేవాశిష్ పాండా తెలిపారు. ప్రస్తుత నిబంధన సదుపాయ కల్పన కంటే అడ్డంకిగా ఉన్నట్టు తాము గుర్తించామన్నారు. ఈ రంగంలోకి మరిన్ని సంస్థలు ప్రవేశానికి వీలుగా పరిమితిని ఎత్తివేయడం లేదా తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు.
సవరించిన వ్యాపార ప్రణాళికలు సమర్పించండి
ప్రభుత్వ సాధారణ బీమా సంస్థలకు ఐఆర్‌డీఏ ఆదేశం
సవరించిన వ్యాపార ప్రణాళికలు సమర్పించాలంటూ మూడు ప్రభుత్వరంగ సాధారణ బీమా సంస్థలు.. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్‌ను ఐఆర్‌డీఏ ఆదేశించింది. ఈ మూడు ప్రభుత్వరంగ బీమా సంస్థలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుండడం గమనార్హం. ప్రభుత్వరంగ సాధారణ బీమా సంస్థలకు సంబంధించి కొంత సమాచారాన్ని ప్రభుత్వం కోరిందని, దాన్ని అందించినట్టు ఐఆర్‌డీఏఐ చైర్మన్ పాండా తెలిపారు. ఆయా సంస్థలకు ప్రభుత్వం నిధులను అందించే అవకాశం ఉందన్నారు. ఐఆర్‌డీఏఐ చైర్మన్ దేవాశిష్ పాండా, ఇతర సీనియర్ అధికారులు, సభ్యులు, బీమా సంస్థల ఉన్నతాధికారుల సమావేశం గురువారం ముంబైలో జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment