ముంబై: ప్రైవేటు బీమా సంస్థలు బ్యాంకుల భాగస్వామ్యంతో విక్రయించే పాలసీల విషయంలో నిబంధనలను పాటించడం లేదనే ఆరోపణలు రావడంతో బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏ) రంగంలోకి దిగింది. సాధారణంగా బీమా సంస్థలు బ్యాంకులతో ఒప్పందం చేసుకుని పాలసీలను విక్రయిస్తుంటాయి.
అయితే, కొన్ని బీమా కంపెనీలు తమ పాలసీల విక్రయంపై నిబంధనలకు మించి అధిక కమీషన్లు, ప్రతిఫలాలను బ్యాంకులకు ఆఫర్ చేస్తున్నట్టు ఐఆర్డీఏ దృష్టికి వచ్చిందని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. అధికారి వెల్లడించిన సమాచారం ప్రకారం...
ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్
‘‘కొన్ని పెద్ద బీమా కంపెనీలు, వాటి మాతృ సంస్థలు పలు బ్యాంకుల వద్ద కరెంటు అకౌంట్ బ్యాలన్స్‌లను నిర్వహిస్తున్నాయి. ఈ బ్యాలన్స్‌లపై వడ్డీని బీమా కంపెనీలు వదులుకుంటున్నాయి. బీమా ఉత్పత్తుల విక్రయంపై పరిహారంగా వాటిని పరిగణిస్తున్నాయి. దీంతో ఈ విధమైన చర్యలు పాలసీదారుల ప్రయోజనాలకు చేటు చేస్తాయని, బ్యాంకుల్లో ఉంచే ఈ డిపాజిట్లపై రాబడులు సున్నాయే’’నని ఆ అధికారి వివరించారు. ఈ తరహా విధానాలు ఐఆర్డీఏ నిబంధనలకు పూర్తి విరుద్ధమని తెలిపారు.
దీనిపై ఐఆర్డీఏ ప్రభుత్వానికి తెలియజేయగా, వాటికి వ్యతిరేకంగా చర్యలు తీసుకునేందుకు ఆమోదం లభించినట్టు చెప్పారు. ‘‘కార్పొరేట్ ఏజెన్సీ నిబంధనల మేరకు బ్యాంకుల ద్వారా బీమా కంపెనీలు పాలసీలను విక్రయిస్తే, వాటిపై బ్యాంకులకు కేవలం కమీషన్లను మాత్రమే ఇవ్వాలి. ఇక బ్యాంకులు బీమా సంస్థలకు మార్కెట్ రేటు కంటే అధిక ఫారెక్స్ రేట్లను ఆఫర్ చేయడం, మార్కెట్ రేటు, ఆఫర్ చేసిన రేటు మధ్య వ్యత్యాసం బ్యాంకులకు పాలసీలను విక్రయించినందుకు ప్రోత్సాహకరంగా వెళుతోంది.
అలాగే, చాలా బీమా కంపెనీలు బ్యాంకుల ఏటీఎంలపై తమ ఉత్పత్తుల ప్రకటనలను ప్రదర్శించినందుకు ఫీజులు చెల్లిస్తున్నా యి. నిజానికి బ్యాంకులు ఫీజులు వసూలు చేయరాదు. ఆ భారాన్ని అవే భరించాలి. కానీ, ఈ ఫీజుల భారం పాలసీదారులపైనే పడుతోంది’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment