ఆన్‌లైన్ పాలసీలకు డిస్కౌంట్లు ఇవ్వవచ్చు
⇒ బీమాలో ఈ కామర్స్‌పై
⇒ ఐఆర్‌డీఏఐ మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: బీమా సంస్థలు ఆన్‌లైన్‌లో పాలసీలను విక్రయిస్తే, డిస్కౌంట్లను ఆఫర్ చేయవచ్చని బీమా నియంత్రణ సంస్థ, ఐఆర్‌డీఏ తెలిపింది. బీమా ఈ–కామర్స్ అంశంపై ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అధారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్‌డీఏఐ)తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. బీమా సంస్థలు తమ పాలసీలను ఐఎస్‌ఎన్‌పీ(ఇన్సూరెన్స్ సెల్ఫ్–నెట్‌వర్క్ ప్లాట్‌ఫార్మ్) ద్వారా విక్రయిస్తే, డిస్కౌంట్లు ఇవ్వవచ్చని పేర్కొంది.
ఈ–కామర్స్ సేవలను అందించడానికి ఐఆర్‌డీఏఐ అనుమతితో బీమా సంస్థలు ఏర్పాటు చేసే ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫార్మ్‌ను ఐఎస్‌ఎన్‌పీగా వ్యవహరిస్తారు. తక్కువ ఖర్చుతో బీమాను మరింత మందికి అందుబాటులోకి తేవడమే.... బీమాలో ఈ కామర్స్ ముఖ్య ఉద్దేశమని ఐఆర్‌డీఏఐ పేర్కొంది. ఆన్‌లైన్ ద్వారా పాలసీలు విక్రయించే కంపెనీలు పాలసీ ముఖ్య ఫీచర్లు, ఆప్షన్‌లు, కవరేజ్, మొత్తం ప్రీమియమ్, ఇతర చార్జీలు, పాలసీని రద్దు చేసుకునే విధానాల గురించి సవివరంగా తెలియజేయాల్సి ఉంటుందని వివరించింది.