‘ఈ’ ధీమా మీకుందా!?
- ఎలక్ట్రానిక్ పద్ధతిలో బీమా పాలసీలు
- రోజురోజుకూ పెరుగుతున్న ఆదరణ
- పాలసీదారులకు ప్రయోజనాలెన్నో..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్యాంకింగ్ కార్యక లాపాలన్నీ దాదాపుగా ఎలక్ట్రానిక్ పద్ధతిలోకి మారిపోయాయి. స్టాక్ మార్కెట్ లావాదేవీలూ ఇదే బాటపట్టాయి. ఇప్పుడు జాబితాలో బీమా కంపెనీలూ చేరాయి. బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏ) కొన్నాళ్ల కిందటే ఈ-ఇన్సూరెన్స్ పాలసీలకు వీలు కల్పించినా... దేశంలో తొలి డిజిటలైజ్ బీమా పాలసీ 2013 సెప్టెంబర్లో ఆరంభమైనా... ఇప్పటివరకు 2 శాతం కంటే తక్కువ పాలసీలు మాత్రమే ఎలక్ట్రానిక్ పద్ధతిలో అమ్ముడుపోయాయి. ఈ మధ్య కాలంలో కాగిత రహిత ఎలక్ట్రానిక్ రికార్డుల వైపు ప్రపంచం మొగ్గుచూపుతుండటం.. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల్లో ఎలక్ట్రానిక్ రికార్డుల వినియోగం ఎంతగానో పెరుగుతుండటంతో ఈ-ఇన్సూరెన్స్‌లకు గిరాకీ పెరిగిందన్నది పరిశ్రమ వర్గాల మాట.
ప్రత్యేకంగా రిపాజిటరీలుంటాయ్..
బీమా పాలసీలను ఎలక్ట్రానిక్ పద్ధతిలో జారీ చేయడానికి 2013లో ఐఆర్‌డీఏ అనుమతించింది. ఈ సేవలను అందించటానికి ఇన్సూరెన్స్ రిపాజిటరీలకు లెసైన్సులు జారీ చేసింది. ఎన్‌ఎస్‌డీఎల్ డేటాబేస్ మేనేజ్‌మెంట్, సెంట్రల్ ఇన్సూరెన్స్, షిల్ ప్రాజెక్ట్స్, కార్వీ ఇన్సూరెన్స్, క్యామ్స్ వంటివి ఇందులో ఉన్నా యి. దాదాపు అన్ని బీమా కంపెనీలూ ఎలక్ట్రానిక్ పద్ధతిలో పాలసీలను అందించేందుకు రిపాజిటరీ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నాయి కూడా.
ఏం చేయాలంటే..
బీమా వినియోగదారులు ఎలక్ట్రానిక్ పద్ధతిలో బీమా పాలసీలు భద్రపరుచుకోవాలంటే ముందుగా ఏదైనా ఇన్సూరెన్స్ రిపాజిటరీ సంస్థ వద్ద ఖాతాను తెరవాల్సి ఉంటుంది. ఆ తర్వాత పాలసీ కొనుగోలు చేస్తే, ఆ పాలసీ వివరాలు ఇన్సూరెన్స్ రిపాజిటరీ ఖాతాలో కనిపిస్తాయి. ఒక్కో పాలసీకి ఒక్కో ఖాతా కాకుండా ఎన్ని బీమా కంపెనీల నుంచి ఎటువంటి పాలసీలు కొనుగోలు చేసినా వాటన్నింటినీ ఒకే రిపాజిటరీ ఖాతాలో భద్రపరుచుకునే వీలుంటుంది. అంతేకాకుండా అప్పటికే ఫిజికల్ సర్టిఫికెట్ల రూపంలో ఉన్న బీమా పాలసీలను సైతం ఎలక్ట్రానిక్ పద్ధతిలో రిపాజిటరీ ఖాతాలోకి మార్చుకోవచ్చు.
రూ.100 కోట్ల ఆదా..
ఈ-ఇన్సూరెన్స్‌కు ఒక్కో పాలసీకి రూ.75-80 ఖర్చవుతుంది. దీనికి సర్వీసు ఛార్జీలు అదనం. ఇవి ఏటా రూ.500-900 వరకు ఉంటాయి. ఇవన్నీ పాలసీదారులే భరించాల్సి ఉంటుంది. ఫిజికల్ రూపంలో పాలసీలు నిర్వహించడానికి ఒకో పాలసీకి ఏటా రూ.150-200 ఖర్చవుతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కానీ, ఎలక్ట్రానిక్ రూపంలో పాలసీలుంటే పరిశ్రమకు ఏటా రూ.100 కోట్ల ఆదా అవుతుందని ఐఆర్‌డీఏ చెబుతోంది. దీంతో నాలుగైదేళ్లలో బీమా పాలసీలన్నీ ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే జారీ అయ్యే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
ప్రయోజనాలెన్నో..
- విడివిడిగా ప్రతి పాలసీకి ఒక పాలసీ సర్టిఫికెట్ తీసుకుని భద్రపరుచుకోవాల్సిన పని ఉండదు. ఒకసారి రిపాజిటరీ ఖాతా తెరిస్తే చాలు.. ఎన్ని బీమా పాలసీలు కొనుగోలు చేసినా వాటన్నింటినీ ఇందులోనే జమ చేసుకోవచ్చు.
- ఎలక్ట్రానిక్ ఖాతా కాబట్టి పాలసీదారు వద్ద సర్టిఫికెట్లు ఉండవు. దీంతో సర్టిఫికెట్లు పోతాయనే భయం.. భద్రపరచాల్సిన అవసరమూ ఉండదు.
- వరదలు, తుఫాన్లు, అగ్ని ప్రమాదాల వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సర్టిఫికెట్లు, ముఖ్యమైన పత్రాలు పోతాయన్న భయం అవసరం లేదు.
- పాలసీ ప్రీమియం చెల్లింపులు, మెచ్యూరిటీ బెనిఫిట్‌లకు సంబంధించి సమాచారం ఎప్పటికప్పుడు ఎస్‌ఎంఎస్‌లు, ఈ-మెయిల్స్ రూపంలో పాలసీదారులకు వస్తుంటుంది.
- ఈ-ఇన్సూరెన్స్‌తో క్లెయిమ్ పరిష్కారం చాలా సులువు. పాలసీ సర్టిఫికెట్, దానికి సంబంధించిన ఇతరత్రా పత్రాలు, ధృవీకరణ అంతగా అవసరం ఉండదు.
- ఏడాదికోసారి లేదా కోరినప్పుడు రిపాజిటరీ సంస్థ ఈ-ఇన్సూరెన్స్ పాలసీల ఖాతా స్టేట్‌మెంట్ పాలసీదారుకు అందజేస్తుంది.