ముంబై: దేశీయ స్థూల ఆర్థిక వ్యవస్థపై ఆశావహ అంచనాలు, ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలతో స్టాక్ సూచీలు బుధవారం సరికొత్త శిఖరాలను అధిరోహించాయి. బ్యాంకింగ్, కమోడిటీ, మెటల్, ఆటో రంగాల షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ తొలిసారి 72,000 పాయింట్ల ఎగువన, నిఫ్టీ 21,650 స్థాయిపై ముగిశాయి. ఉదయం లాభాల తో మొదలైన సూచీలు రోజంతా స్థిరంగా ముందుకు కదిలాయి. సెన్సెక్స్ 71,492 పాయింట్లు వద్ద మొదలైంది.
ఇంట్రాడేలో 783 పాయింట్లు ఎగసి 72,120 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని తాకింది. చివరికి 701 పాయింట్లు లాభపడి 72,038 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో నిఫ్టీ 235 పాయింట్లు బలపడి 21,676 వద్ద సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఆఖరికి 213 పాయింట్లు లాభపడి 21,655 వద్ద నిలిచింది. ఆయిల్ అండ్‌గ్యాస్, యుటిలిటీ, విద్యుత్, సేవా రంగ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,926 కోట్ల షేర్లను కొన్నారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.192 కోట్ల షేర్లు విక్రయించారు.
ర్యాలీ ఎందుకంటే...?
ఫెడ్ రిజర్వ్ 2024 మార్చి కంటే ముందుగానే ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు ఉంటుందనే అంచనాలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న సానుకూలత దేశీయ మార్కెట్‌కు కలిసొచి్చంది. గత 20 ఏళ్ల ట్రేడింగ్ ట్రెండ్‌ను అనుసరిస్తూ ఈక్విటీ మార్కెట్లలో శాంటా క్లాజ్ ర్యాలీ కొనసాగుతుంది. (డిసెంబర్ చివరి 5 ట్రేడింగ్ సెషన్లు, జనవరి తొలి 2 ట్రేడింగ్ సెషన్లు మార్కెట్ పెరిగితే దానిని శాంటా ర్యాలీగా వ్యవహరిస్తారు).
వాల్ స్ట్రీట్‌లో ‘సెల్ చైనా, బై భారత్’ వ్యూహం జోరుగా సాగుతున్నట్లు కనిపిస్తుంది. అందుకు అనుగుణంగా డిసెంబర్‌లో ఎఫ్‌ఐఐలు రూ.57,275 కోట్ల ఈక్విటీలను కొన్నారు. రెండో త్రైమాసికంలో అలాగే భారత కరెంట్ ఖాతా లోటు తగ్గడం కలిసొచి్చంది. భారీ భద్రత నడుమ ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకల రాకపోకల పునఃప్రారంభంతో బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 80 డాలర్ల దిగువకు చేరుకుంది.
మార్కెట్లో మరిన్ని సంగతులు
► చైనా తయారీ రంగం పుంజుకోవడం, డాలర్ బలహీనతతో అంతర్జాతీయంగా బేస్ మెటల్ ధరలు పెరగడం మెటల్ షేర్లకు డిమాండ్ పెంచింది. హిందాల్కో 4%, జేఎస్‌డబ్ల్యూ 3%, సెయిల్, నాల్కో 2% లాభపడ్డాయి. టాటా స్టీల్, వెల్‌స్పాన్ కార్ప్, హిందుస్థాన్ కాపర్, వేదాంతా, జిందాల్ స్టీల్ షేర్లు 1% వరకు పెరిగాయి.
► ఇటీవల ర్యాలీలో వెనకబడిన బ్యాంకింగ్ షేర్లు పుంజుకున్నాయి. పీఎన్‌బీ 4%, బ్యాంక్ ఆఫ్ బరోడా 3%, ఎస్‌బీఐ 2%, ఇండస్‌ఇండ్ బ్యాంక్ 1.50%, బంధన్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ, కోటక్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, ఏయూస్మాల్‌ఫైనాన్స్ బ్యాంక్‌లు 1–6% లాభపడ్డాయి.
► 4 రోజుల్లో సెన్సెక్స్ 1,532 పాయింట్ల ర్యాలీ తో దలాల్ స్ట్రీట్‌లో రూ.11.11 లక్షల కోట్లు సంపద సృష్టి జరిగింది. దీంతో బీఎస్‌ఈలో మొత్తం కంపెనీల మార్కెట్ విలువ జీవితకాల గరిష్ట స్థాయి రూ.361 లక్షల కోట్లకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment