Sensex Nifty
-
మళ్లీ రికార్డుల మోత
ముంబై: దేశీయ స్థూల ఆర్థిక వ్యవస్థపై ఆశావహ అంచనాలు, ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలతో స్టాక్ సూచీలు బుధవారం సరికొత్త శిఖరాలను అధిరోహించాయి. బ్యాంకింగ్, కమోడిటీ, మెటల్, ఆటో రంగాల షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ తొలిసారి 72,000 పాయింట్ల ఎగువన, నిఫ్టీ 21,650 స్థాయిపై ముగిశాయి. ఉదయం లాభాల తో మొదలైన సూచీలు రోజంతా స్థిరంగా ముందుకు కదిలాయి. సెన్సెక్స్ 71,492 పాయింట్లు వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 783 పాయింట్లు ఎగసి 72,120 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని తాకింది. చివరికి 701 పాయింట్లు లాభపడి 72,038 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో నిఫ్టీ 235 పాయింట్లు బలపడి 21,676 వద్ద సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఆఖరికి 213 పాయింట్లు లాభపడి 21,655 వద్ద నిలిచింది. ఆయిల్ అండ్‌గ్యాస్, యుటిలిటీ, విద్యుత్, సేవా రంగ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,926 కోట్ల షేర్లను కొన్నారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.192 కోట్ల షేర్లు విక్రయించారు. ర్యాలీ ఎందుకంటే...? ఫెడ్ రిజర్వ్ 2024 మార్చి కంటే ముందుగానే ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు ఉంటుందనే అంచనాలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న సానుకూలత దేశీయ మార్కెట్‌కు కలిసొచి్చంది. గత 20 ఏళ్ల ట్రేడింగ్ ట్రెండ్‌ను అనుసరిస్తూ ఈక్విటీ మార్కెట్లలో శాంటా క్లాజ్ ర్యాలీ కొనసాగుతుంది. (డిసెంబర్ చివరి 5 ట్రేడింగ్ సెషన్లు, జనవరి తొలి 2 ట్రేడింగ్ సెషన్లు మార్కెట్ పెరిగితే దానిని శాంటా ర్యాలీగా వ్యవహరిస్తారు). వాల్ స్ట్రీట్‌లో ‘సెల్ చైనా, బై భారత్’ వ్యూహం జోరుగా సాగుతున్నట్లు కనిపిస్తుంది. అందుకు అనుగుణంగా డిసెంబర్లో ఎఫ్ఐఐలు రూ.57,275 కోట్ల ఈక్విటీలను కొన్నారు. రెండో త్రైమాసికంలో అలాగే భారత కరెంట్ ఖాతా లోటు తగ్గడం కలిసొచి్చంది. భారీ భద్రత నడుమ ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకల రాకపోకల పునఃప్రారంభంతో బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 80 డాలర్ల దిగువకు చేరుకుంది. మార్కెట్లో మరిన్ని సంగతులు ► చైనా తయారీ రంగం పుంజుకోవడం, డాలర్ బలహీనతతో అంతర్జాతీయంగా బేస్ మెటల్ ధరలు పెరగడం మెటల్ షేర్లకు డిమాండ్ పెంచింది. హిందాల్కో 4%, జేఎస్‌డబ్ల్యూ 3%, సెయిల్, నాల్కో 2% లాభపడ్డాయి. టాటా స్టీల్, వెల్‌స్పాన్ కార్ప్, హిందుస్థాన్ కాపర్, వేదాంతా, జిందాల్ స్టీల్ షేర్లు 1% వరకు పెరిగాయి. ► ఇటీవల ర్యాలీలో వెనకబడిన బ్యాంకింగ్ షేర్లు పుంజుకున్నాయి. పీఎన్బీ 4%, బ్యాంక్ ఆఫ్ బరోడా 3%, ఎస్బీఐ 2%, ఇండస్ఇండ్ బ్యాంక్ 1.50%, బంధన్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ, కోటక్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఏయూస్మాల్‌ఫైనాన్స్ బ్యాంక్‌లు 1–6% లాభపడ్డాయి. ► 4 రోజుల్లో సెన్సెక్స్ 1,532 పాయింట్ల ర్యాలీ తో దలాల్ స్ట్రీట్‌లో రూ.11.11 లక్షల కోట్లు సంపద సృష్టి జరిగింది. దీంతో బీఎస్ఈలో మొత్తం కంపెనీల మార్కెట్ విలువ జీవితకాల గరిష్ట స్థాయి రూ.361 లక్షల కోట్లకు చేరింది. -
బుల్ మరోసారి కుదేల్
ముంబై: స్టాక్ మార్కెట్లో రెండురోజుల పాటు సందడి చేసిన బుల్ బుధవారం చతికిలపడింది. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూలతలతో సెన్సెక్స్ 555 పాయింట్లు పతనమై 59,190 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 176 పాయింట్లు నష్టపోయి 17,646 వద్ద ముగిసింది. ద్రవ్యోల్బణ ఆందోళనలు, మండుతున్న ముడిచమురు ధరలు దేశీయ మార్కెట్‌ను సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి క్షీణత ఇన్వెస్టర్లను కలవరపెట్టింది. అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. ఐటీ, మెటల్ షేర్లలో లాభాల స్వీకరణ జరగడంతో అధికంగా నష్టపోయాయి. సెన్సెక్స్ సూచీలో మూడు షేర్లు మాత్రమే లాభపడ్డాయి. ఎన్ఎస్ఈలో మిడ్‌క్యాప్, స్మాల్ ఇండెక్స్‌లు ఒకశాతానికి పైగా నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.803 కోట్ల షేర్లను, దేశీయ ఇన్వెస్టర్లు రూ.999 కోట్ల షేర్లను అమ్మారు. స్టాక్ సూచీల భారీ పతనంతో ఇన్వెస్టర్లు ఒక్కరోజులోనే రూ.2.57 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. తద్వారా ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.262 లక్షల కోట్లు నమోదైంది. లాభాలతో మొదలై నష్టాల్లోకి.., దేశీయ స్టాక్ మార్కెట్ ఉదయం లాభంతోనే మొదలైంది. సెన్సెక్స్ 197 పాయింట్ల లాభంతో 59,942 వద్ద, నిఫ్టీ 40 పాయింట్లు పెరిగి 17,861 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. జాతీయ, అంతర్జాతీయ నెలకొన్న ప్రతికూలతలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. దీంతో సూచీల ఆరంభలాభాలన్నీ ఆవిరియ్యాయి. అటు పిమ్మట అమ్మకాలకే ప్రాధాన్యత ఇవ్వడంతో సెన్సెక్స్ ఒక దశలో 665 పాయింట్లు పతనమైన 59,080 వద్ద, నిఫ్టీ 209 పాయింట్లు నష్టపోయి 17,613 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచ్చాయి. నష్టాలకు నాలుగు కారణాలు... క్రూడ్ పెరుగుదల భయాలు ... సప్లై మందగమనం, డిమాండ్ పెరగడంతో క్రూడాయిల్ ధరలు ఎనిమిదేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. బ్రిటన్‌లో గ్యాస్ ధరలు ఒక్కరోజులోనే ఏకంగా 40% ఎగిశాయి. భారత చమురు అవసరాల్లో 85% దిగుమతులపైనే ఆధారపడుతోంది. క్రూడ్ ధర పెరగడంతో చమురు దిగుమతుల బిల్లు భారీగా పెరిగిపోతుంది. దీంతో కరెంట్ అకౌంట్ లోటు, ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణం వంటి అంశాలు ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చనే భయాలు మార్కెట్ వర్గాలను వెంటాడాయి. కరెంట్ కోత కలవరం .... దేశవ్యాప్తంగా థర్మల్ ప్లాంట్లలో నాలుగు రోజులకు సరిపడే బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయని విద్యుత్ మంత్రిత్వ శాఖ నివేదిక వెల్లడించడం దలాల్ స్ట్రీట్‌ను కలవరపెట్టింది. బొగ్గు కొరత ఇలాగే కొనసాగితే విద్యుత్ సంక్షోభం తలెత్తి ఉత్పత్తి, వ్యాపారాలపై ప్రభావాన్ని చూపవచ్చనే ఆందోళనలు మొదలయ్యాయి. భారత్‌లో 70% కరెంట్ బొగ్గు ఆధారంగా నడిచే థర్మల్ ప్లాంట్ల ద్వారానే ఉత్పత్తి అవుతుంది. ప్రపంచ మార్కెట్లను ప్రతికూలతలు ... బాండ్ ఈల్డ్స్, క్రూడ్, ద్రవ్యోల్బణ పెరుగుదల భయాలతో పాటు కార్మికుల కొరతతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. ఆసియాలో జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా, తైవాన్ దేశాల మార్కెట్లు రెండు నుంచి ఒకశాతం నష్టపోయాయి. సెలవుల కారణంగా చైనా ఎక్సే్చంజీలు పనిచేయడం లేదు. యూరప్‌లోని బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ మార్కెట్లు ఒకశాతం వరకు క్షీణించాయి. అగ్ర రాజ్యమైన అమెరికా స్టాక్ మార్కెట్లో టెక్నాలజీ, బ్యాంకింగ్ రంగాల షేర్లలో అమ్మకాల తలెత్తడంతో యూఎస్ ఫ్యూచర్లు ఒకటిన్నర శాతం నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. ప్రపంచ మార్కెట్ల పతనం మన మార్కెట్‌పై ప్రభావాన్ని చూపింది. రూపాయి పతనం.... క్రూడాయిల్, డాలర్ విలువ బలపటడంతో ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ భారీగా క్షీణించింది. ఇంట్రాడేలో 74.99 స్థాయికి దిగివచి్చంది. చివరికి 54 పైసలు నష్టపోయి 74.98 స్థిరపడింది. ఈ ముగింపు రూపాయికి ఐదు నెలల కనిష్టస్థాయి. రూపాయి పతనం(డాలర్ బలపడ టంతో)స్టాక్ మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. మార్కెట్లో మరిన్ని సంగతులు ► నష్టాల మార్కెట్లోనూ హిందుస్తాన్ కాపర్ 4% లాభపడి రూ.125 వద్ద ముగిసింది. ఈ సంస్థను చేజిక్కించుకునేందుకు వేదాంత ప్రయత్నాలు చేస్తుండటం ఈ షేరు ర్యాలీకి కారణమైనట్లు నిపుణులు తెలిపారు. ► క్రూడాయిల్ ధరలు పెరగడం ఓఎన్జీసీ షేరుకు కలిసొస్తుంది. బీఎస్ఈలో 3% లాభపడి రూ.168 వద్ద స్థిరపడింది. -
లాక్డౌన్ ఎఫెక్ట్: రంగంలోకి కొత్త ఇన్వెస్టర్లు
కరోనా ప్రేరిపిత లాక్‌డౌన్‌తో భారత స్టాక్మార్కెట్లోకి కొత్త ఇన్వెస్టర్లు రాక పెరిగింది. కొత్తవారి ఆగమనంతో ఎక్చ్సేంజీల ట్రేడింగ్ యాక్టివిటీ భారీస్థాయిలో జరుగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసికంలో 25లక్షల కొత్త డీమాట్ ఖాతాలు తెరవబడినట్లు గణాంకాలు చెబుతున్నాయి. జూన్‌లో జరిగిన మార్కెట్ యాక్షన్‌ను పరిశీలిస్తే ఈ ట్రెండ్‌ను నిర్ధారించుకోవచ్చు. నిఫ్టీ ఇండెక్స్ ఈ జూన్‌లో 7శాతం పెరిగింది. నెల ప్రాతిపదికన మార్కెట్ టర్నోవర్ 37శాతం వృద్ధి చెంది రూ.14.6లక్షల కోట్లుగా నమోదైంది. ఇదే జూన్‌లో ఇన్స్టిట్యూషనల్ విభాగంలో టర్నోవర్ 9శాతం వృద్ధిని సాధించి రూ.5లక్షల కోట్లుగా నమోదైనట్లు ఎన్ఎస్ఈ గణాంకాలు చెబుతున్నాయి. ఇందుకే రిటైల్ ఇన్వెస్టర్లు పెరిగారు: కరోనా కట్టడికి లాక్‌డౌన్‌తో విధింపుతో చాలామంది ఇళ్లలో చిక్కుకుపోయారు. అందులో భారీగా డబ్బున్న వారు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్‌మెంట్‌కు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. భారత్‌లో బెట్టింగ్ చట్టబద్ధం కాకపోవడంతో ఖాళీ సమయాన్ని గడిపేందుకు ఎలాంటి ఇతర ప్రత్యమ్నాయాలు లేకపోవడంతో వారు ట్రేడింగ్ పట్ల ఆకర్షితులయ్యారు. దాదాపు అన్ని బ్రోకరేజ్ సంస్థలు ఉచిత డీమాట్ ఖాతా ప్రారంభాన్ని అందిస్తున్నాయి. దీనికి తోడు కొత్తవారికి ప్రోత్సాహకాలు, డిస్కౌంట్లు ఇస్తుండటం కూడా స్టాక్ మార్కెట్లో రిటైల్ ఇన్వెస్టర్లు పెరిగారు. ఏయే బ్రోకరేజ్‌లో ఎంతమంది: ఈ జూన్ క్వార్టర్లో టాప్-12 బ్రోకరేజ్ సంస్థలు దాదాపు 13లక్షల కొత్త డీమాట్ అకౌంట్లను ప్రారంభించినట్లు నేషనల్ సెక్యూరిటీస్ డిపాజీటరీ లిమిటెడ్ తెలిపింది. అందులో అత్యధికంగా జిరోదా బ్రోకింగ్ 5,26,917 కొత్త ఖాతాలను ప్రారంభించింది. ఏంజిల్ బ్రోకింగ్ 1,90,397 అకౌంట్లు, 5పైసా క్యాపిటల్ 1.31లక్షల ఖాతాలు నమోదయాయ్యాయి. ఈ నగరాల నుంచే అధికంగా రాక: కొత్తగా స్టాక్ మార్కెట్లో ప్రవేశించినవారిలో 80శాతం మధ్య, చిన్నతరహా నగరాలైన నాసిక్, జైపూర్, పాట్నా, కన్నూర్, గుంటూర్, తిరువళ్లూర్, నైనిటాల్‌తో పాటు ఇతర టైర్-2, టైర్-3 నగరాలను నుంచి వస్తున్నట్లు బ్రోకరేజ్ సంస్థలు తెలిపారు. స్టాక్ మార్కెట్లోకి కొత్త ఇన్వెస్టర్లు రాక కొత్తేంకాదని అయితే కరోనా ప్రేరిపిత లాక్డౌన్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్లు, కొత్త ఇన్వెస్టర్లు కిందటి ఏడాదితో పోలిస్తే మరింత పెరిగారని బ్రోకరేజ్ సంస్థలు తెలిపాయి. ‘‘ ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్ల నగదు విభాగంలో రిటైల్ ఇన్వెస్టర్ల కాంట్రిబ్యూషన్ పెరుగుతోంది. భారత్‌లో కూడా అదే విధంగా జరుగుతుంది. గత రెండేళ్లలో నగదు విభాగంలో పాల్గోనే రిటైల్ ఇన్వెసర్ల సంఖ్య క్రమంగా 50-52శాతానికి చేరుకుంది.’’ బీఎన్పీ పారిబా సీఈవో జైదీప్ అరోరా తెలిపారు. -
మిశ్రమంగా మార్కెట్లు
సెన్సెక్స్ 22 పాయింట్లు డౌన్ నిఫ్టీ 7 పాయింట్లు ప్లస్ ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ కోసం అమ్మకాలకు దిగడంతో మార్కెట్లు వారాంతంలో స్వల్ప వెనకడుగు వేశాయి. సెన్సెక్స్ 22 పాయింట్లు క్షీణించి 27,090 వద్ద నిలవగా, నిఫ్టీ 7 పాయింట్లు పెరిగి 8,121 వద్ద స్థిరపడింది. అయితే వారం మొత్తంమీద సెన్సెక్స్ నికరంగా 29 పాయింట్లు జమ చేసుకోవడం ద్వారా వరుసగా ఆరో వారంలోనూ లాభాలతో ముగిసినట్లయ్యింది. సెన్సెక్స్ ఇలా రెండేళ్ల క్రితం మాత్రమే వరుస లాభాలను ఆర్జించింది. కాగా, గురువారంనాటి జోష్‌తో సెన్సెక్స్ తొలుత 135 పాయింట్ల వరకూ పుంజుకుంది. గరిష్టంగా 27,247 పాయింట్లను తాకింది. ఆపై అమ్మకాలు పెరగడంతో చివరికి స్వల్ప నష్టాలతో ముగిసింది. గత రెండు రోజుల్లో సెన్సెక్స్ 620 పాయింట్లు ఎగసింది. వెలుగులో టాటా గ్రూప్ టాటా గ్రూప్ షేర్లు వెలుగులో నిలిచాయి. గ్రూప్‌లోని కొన్ని కంపెనీల రేటింగ్‌ను మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ అప్‌గ్రేడ్ చేయడం దీనికి కారణమైంది. -
తొలిసారి 7,900కు నిఫ్టీ
దేశీ స్టాక్ మార్కెట్ల జోరు కొనసాగుతోంది. ఆర్థిక వృద్ధిపట్ల ఆర్బీఐ ఆశావహ అంచనాలు, అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల జోష్ కలసి మార్కెట్లను పరుగుపెట్టిస్తున్నాయి. వెరసి వారాంతం రోజున సైతం కొత్త రికార్డు నమోదైంది. 22 పాయింట్లు లాభపడటం ద్వారా ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ తొలిసారి 7,900కుపైన 7,918 వద్ద ముగిసింది. ఇంట్రాడేలోనూ 7,929 వద్ద కొత్త గరిష్టస్థాయిని తాకింది. ఇక మరోవైపు సెన్సెక్స్ కూడా 59 పాయింట్లు పుంజుకుని 26,419 వద్ద స్థిరపడింది. గడిచిన మంగళవారం(19న) సెన్సెక్స్ 26,421 వద్ద ముగిసి చరిత్ర సృష్టించడంతోపాటు, ఇంట్రాడేలో 26,531ను తాకినసంగతి తెలిసిందే. ముందురోజు రూ. 413 కోట్లు ఇన్వెస్ట్‌చేసిన ఎఫ్ఐఐలు తాజాగా మరో రూ. 302 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. ఐటీ, బ్యాంకింగ్, కెమికల్ షేర్ల జోరు... బీఎస్ఈలో ప్రధానంగా ఐటీ(1.6%), బ్యాంకింగ్(1%) రంగాలు పురోగమించాయి. బీఎస్ఈ-500 సూచీలో భాగమైన కెమికల్ షేర్లూ పెరిగాయి. చక్కెర షేర్లు తీపి ముడి, శుద్ధి చేసిన చక్కెర దిగుమతులపై డ్యూటీని ప్రభుత్వం 15% నుంచి 25%కు పెంచడంతో షుగర్ షేర్లు లాభాలతో తీపెక్కాయి. ద్వారికేష్, బజాజ్ హిందుస్తాన్, సింభోలీ, శ్రీరే ణుకా, ఆంధ్రా షుగర్స్, త్రివేణీ 5-3% మధ్య పురోగమించాయి. -
26,000 దిగువకు సెన్సెక్స్
వరుసగా రెండో రోజు మార్కెట్లు నష్టపోయాయి. వారం రోజుల తరువాత మళ్లీ సెన్సెక్స్ 26,000 పాయింట్ల దిగువకు చేరింది. 136 పాయింట్లు క్షీణించి 25,991 వద్ద ముగిసింది. ఒక దశలో కనిష్టంగా 25,900ను తాకింది. ఇక నిఫ్టీ కూడా 42 పాయింట్లు తగ్గి 7,749 వద్ద నిలిచింది. ప్రధానంగా రియల్టీ, మెటల్, ఆయిల్ రంగాలు 3-1.5% మధ్య నీర సించాయి. మంగళవారం మార్కెట్లకు సెలవుకావడం, గురువారం ఎఫ్‌అండ్‌వో సిరీస్ ముగింపు వంటి అంశాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు తొలినుంచీ అమ్మకాలకే ప్రాధాన్యమిచ్చారని నిపుణులు పేర్కొన్నారు. కాగా, వరుసగా రెండు రోజుల్లో సెన్సెక్స్ 281 పాయింట్లు నష్టపోయింది. హెచ్‌యూఎల్ జోష్: క్యూ1 ఫలితాల కారణంగా ఎఫ్ఎంసీజీ దిగ్గజం హెచ్‌యూఎల్ దాదాపు 4% పుంజుకోగా, గత మూడు వారాల్లోలేని విధంగా కోల్ ఇండియా 3% పతనమైంది. మిగిలిన సెన్సెక్స్ దిగ్గజాలలో హిందాల్కో, టాటా మోటార్స్, టాటా స్టీల్, ఐసీఐసీఐ, హీరోమోటో, ఆర్ఐఎల్, ఓఎన్ జీసీ 2-1.5% మధ్య తిరోగమించాయి. రియల్టీ షేర్లలో డీఎల్ఎఫ్, ఫీనిక్స్, డీబీ, శోభా, హెచ్‌డీఐఎల్, ఇండియాబుల్స్, యూనిటెక్ 5-2% మధ్య పడ్డాయి. నేడు మార్కెట్లకు సెలవు ముంబై: ఈదుల్ ఫితర్(రంజాన్) సందర్భంగా మంగళవారం(29న) ఎన్ఎస్ఈ, బీఎస్ఈలతోపాటు, ఫారెక్స్, మనీ, మెటల్, ఆయిల్ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. అయితే బులియన్, చక్కెర మార్కెట్లు యథావిధిగా పనిచేస్తాయి. నేటి బోర్డ్ మీటింగ్స్ ఐటీసీ, భారతీ ఎయిర్టెల్, ర్యాన్‌బాక్సీ, సెసాస్టెరిలైట్, ఐడీఎఫ్సీ, డీసీఎం శ్రీరామ్, ఎస్కార్ట్స్, ఐఎఫ్బీ ఇండస్ట్రీస్, వీగార్డ్ ఇండస్ట్రీస్, వీఐపీ ఇండస్ట్రీస్.