Published
Sat, Aug 23 2014 2:58 AM
| Last Updated on Sat, Sep 2 2017 12:17 PM
తొలిసారి 7,900కు నిఫ్టీ
దేశీ స్టాక్ మార్కెట్ల జోరు కొనసాగుతోంది. ఆర్థిక వృద్ధిపట్ల ఆర్‌బీఐ ఆశావహ అంచనాలు, అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల జోష్ కలసి మార్కెట్లను పరుగుపెట్టిస్తున్నాయి. వెరసి వారాంతం రోజున సైతం కొత్త రికార్డు నమోదైంది. 22 పాయింట్లు లాభపడటం ద్వారా ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ తొలిసారి 7,900కుపైన 7,918 వద్ద ముగిసింది. ఇంట్రాడేలోనూ 7,929 వద్ద కొత్త గరిష్టస్థాయిని తాకింది.
ఇక మరోవైపు సెన్సెక్స్ కూడా 59 పాయింట్లు పుంజుకుని 26,419 వద్ద స్థిరపడింది. గడిచిన మంగళవారం(19న) సెన్సెక్స్ 26,421 వద్ద ముగిసి చరిత్ర సృష్టించడంతోపాటు, ఇంట్రాడేలో 26,531ను తాకినసంగతి తెలిసిందే. ముందురోజు రూ. 413 కోట్లు ఇన్వెస్ట్‌చేసిన ఎఫ్‌ఐఐలు తాజాగా మరో రూ. 302 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.
ఐటీ, బ్యాంకింగ్, కెమికల్ షేర్ల జోరు...
బీఎస్‌ఈలో ప్రధానంగా ఐటీ(1.6%), బ్యాంకింగ్(1%) రంగాలు పురోగమించాయి. బీఎస్‌ఈ-500 సూచీలో భాగమైన కెమికల్ షేర్లూ పెరిగాయి. చక్కెర షేర్లు తీపి ముడి, శుద్ధి చేసిన చక్కెర దిగుమతులపై డ్యూటీని ప్రభుత్వం 15% నుంచి 25%కు పెంచడంతో షుగర్ షేర్లు లాభాలతో తీపెక్కాయి. ద్వారికేష్, బజాజ్ హిందుస్తాన్, సింభోలీ, శ్రీరే ణుకా, ఆంధ్రా షుగర్స్, త్రివేణీ 5-3% మధ్య పురోగమించాయి.