మిశ్రమంగా మార్కెట్లు
సెన్సెక్స్ 22 పాయింట్లు డౌన్
నిఫ్టీ 7 పాయింట్లు ప్లస్
ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ కోసం అమ్మకాలకు దిగడంతో మార్కెట్లు వారాంతంలో స్వల్ప వెనకడుగు వేశాయి. సెన్సెక్స్ 22 పాయింట్లు క్షీణించి 27,090 వద్ద నిలవగా, నిఫ్టీ 7 పాయింట్లు పెరిగి 8,121 వద్ద స్థిరపడింది. అయితే వారం మొత్తంమీద సెన్సెక్స్ నికరంగా 29 పాయింట్లు జమ చేసుకోవడం ద్వారా వరుసగా ఆరో వారంలోనూ లాభాలతో ముగిసినట్లయ్యింది.
సెన్సెక్స్ ఇలా రెండేళ్ల క్రితం మాత్రమే వరుస లాభాలను ఆర్జించింది. కాగా, గురువారంనాటి జోష్‌తో సెన్సెక్స్ తొలుత 135 పాయింట్ల వరకూ పుంజుకుంది. గరిష్టంగా 27,247 పాయింట్లను తాకింది. ఆపై అమ్మకాలు పెరగడంతో చివరికి స్వల్ప నష్టాలతో ముగిసింది. గత రెండు రోజుల్లో సెన్సెక్స్ 620 పాయింట్లు ఎగసింది.
వెలుగులో టాటా గ్రూప్
టాటా గ్రూప్ షేర్లు వెలుగులో నిలిచాయి. గ్రూప్‌లోని కొన్ని కంపెనీల రేటింగ్‌ను మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ అప్‌గ్రేడ్ చేయడం దీనికి కారణమైంది.