ముంబై: స్టాక్ మార్కెట్లో రెండురోజుల పాటు సందడి చేసిన బుల్ బుధవారం చతికిలపడింది. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూలతలతో సెన్సెక్స్ 555 పాయింట్లు పతనమై 59,190 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 176 పాయింట్లు నష్టపోయి 17,646 వద్ద ముగిసింది. ద్రవ్యోల్బణ ఆందోళనలు, మండుతున్న ముడిచమురు ధరలు దేశీయ మార్కెట్‌ను సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి క్షీణత ఇన్వెస్టర్లను కలవరపెట్టింది. అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి.
ఐటీ, మెటల్ షేర్లలో లాభాల స్వీకరణ జరగడంతో అధికంగా నష్టపోయాయి. సెన్సెక్స్ సూచీలో మూడు షేర్లు మాత్రమే లాభపడ్డాయి. ఎన్‌ఎస్‌ఈలో మిడ్‌క్యాప్, స్మాల్ ఇండెక్స్‌లు ఒకశాతానికి పైగా నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.803 కోట్ల షేర్లను, దేశీయ ఇన్వెస్టర్లు రూ.999 కోట్ల షేర్లను అమ్మారు. స్టాక్ సూచీల భారీ పతనంతో ఇన్వెస్టర్లు ఒక్కరోజులోనే రూ.2.57 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. తద్వారా ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.262 లక్షల కోట్లు నమోదైంది.
లాభాలతో మొదలై నష్టాల్లోకి..,
దేశీయ స్టాక్ మార్కెట్ ఉదయం లాభంతోనే మొదలైంది. సెన్సెక్స్ 197 పాయింట్ల లాభంతో 59,942 వద్ద, నిఫ్టీ 40 పాయింట్లు పెరిగి 17,861 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. జాతీయ, అంతర్జాతీయ నెలకొన్న ప్రతికూలతలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. దీంతో సూచీల ఆరంభలాభాలన్నీ ఆవిరియ్యాయి. అటు పిమ్మట అమ్మకాలకే ప్రాధాన్యత ఇవ్వడంతో సెన్సెక్స్ ఒక దశలో 665 పాయింట్లు పతనమైన 59,080 వద్ద, నిఫ్టీ 209 పాయింట్లు నష్టపోయి 17,613 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచ్చాయి.
నష్టాలకు నాలుగు కారణాలు...
క్రూడ్ పెరుగుదల భయాలు ...
సప్లై మందగమనం, డిమాండ్ పెరగడంతో క్రూడాయిల్ ధరలు ఎనిమిదేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. బ్రిటన్‌లో గ్యాస్ ధరలు ఒక్కరోజులోనే ఏకంగా 40% ఎగిశాయి. భారత చమురు అవసరాల్లో 85% దిగుమతులపైనే ఆధారపడుతోంది. క్రూడ్ ధర పెరగడంతో చమురు దిగుమతుల బిల్లు భారీగా పెరిగిపోతుంది. దీంతో కరెంట్ అకౌంట్ లోటు, ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణం వంటి అంశాలు ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చనే భయాలు మార్కెట్ వర్గాలను వెంటాడాయి.
కరెంట్ కోత కలవరం ....
దేశవ్యాప్తంగా థర్మల్ ప్లాంట్లలో నాలుగు రోజులకు సరిపడే బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయని విద్యుత్ మంత్రిత్వ శాఖ నివేదిక వెల్లడించడం దలాల్ స్ట్రీట్‌ను కలవరపెట్టింది. బొగ్గు కొరత ఇలాగే కొనసాగితే విద్యుత్ సంక్షోభం తలెత్తి ఉత్పత్తి, వ్యాపారాలపై ప్రభావాన్ని చూపవచ్చనే ఆందోళనలు మొదలయ్యాయి. భారత్‌లో 70% కరెంట్ బొగ్గు ఆధారంగా నడిచే థర్మల్ ప్లాంట్ల ద్వారానే ఉత్పత్తి అవుతుంది.
ప్రపంచ మార్కెట్లను ప్రతికూలతలు ...
బాండ్ ఈల్డ్స్, క్రూడ్, ద్రవ్యోల్బణ పెరుగుదల భయాలతో పాటు కార్మికుల కొరతతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. ఆసియాలో జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా, తైవాన్ దేశాల మార్కెట్లు రెండు నుంచి ఒకశాతం నష్టపోయాయి. సెలవుల కారణంగా చైనా ఎక్సే్చంజీలు పనిచేయడం లేదు. యూరప్‌లోని బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ మార్కెట్లు ఒకశాతం వరకు క్షీణించాయి. అగ్ర రాజ్యమైన అమెరికా స్టాక్ మార్కెట్లో టెక్నాలజీ, బ్యాంకింగ్ రంగాల షేర్లలో అమ్మకాల తలెత్తడంతో యూఎస్ ఫ్యూచర్లు ఒకటిన్నర శాతం నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. ప్రపంచ మార్కెట్ల పతనం మన మార్కెట్‌పై ప్రభావాన్ని చూపింది.
రూపాయి పతనం....
క్రూడాయిల్, డాలర్ విలువ బలపటడంతో ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ భారీగా క్షీణించింది. ఇంట్రాడేలో 74.99 స్థాయికి దిగివచి్చంది. చివరికి 54 పైసలు నష్టపోయి 74.98 స్థిరపడింది. ఈ ముగింపు రూపాయికి ఐదు నెలల కనిష్టస్థాయి. రూపాయి పతనం(డాలర్ బలపడ టంతో)స్టాక్ మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.
మార్కెట్లో మరిన్ని సంగతులు
► నష్టాల మార్కెట్లోనూ హిందుస్తాన్ కాపర్ 4% లాభపడి రూ.125 వద్ద ముగిసింది. ఈ సంస్థను చేజిక్కించుకునేందుకు వేదాంత ప్రయత్నాలు చేస్తుండటం ఈ షేరు ర్యాలీకి కారణమైనట్లు నిపుణులు తెలిపారు.
► క్రూడాయిల్ ధరలు పెరగడం ఓఎన్‌జీసీ షేరుకు కలిసొస్తుంది. బీఎస్‌ఈలో 3% లాభపడి రూ.168 వద్ద స్థిరపడింది.
Comments
Please login to add a commentAdd a comment