current cuts
-
విద్యుత్ కోతలపై పెట్రోల్ బాటిళ్లతో రైతుల ఆందోళన
నెక్కొండ: వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని కోరుతూ వరంగల్ జిల్లా నెక్కొండ మండలం పత్తిపాక గ్రామానికి చెందిన రైతులు నెక్కొండ–వరంగల్ (సూర్య సినిమా థియేటర్) రహదారిపై పెట్రోల్ బాటిళ్లతో ఆది వారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఆ గ్రామ రైతులు మాట్లాడుతూ...వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో అధికారులు మాత్రం వ్యవసాయానికి పగటిపూట విద్యుత్ సరఫరా చేయడం లేదని మండిపడ్డారు. విద్యుత్ అంతరాయంతో పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు విద్యుత్ అధికారులకు చెప్పినా ఫలితం లేదని వాపోయారు. విద్యుత్ సక్రమంగా సరఫరా కాకపోవడం, అప్రకటిత కోతల కారణంగా విద్యుత్ మోటార్లు, స్టార్టర్లు కాలిపోతున్నాయన్నారు. రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న చెన్నారావుపేట ఎస్సై(ఇన్చార్జ్) మహేందర్ సంఘటన స్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. రైతుల సమస్యలను విద్యుత్‌శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అధికారుల సూచనలు, ఎస్సై హామీతో రైతులు ఆందోళన విరమించారు. -
విద్యుత్ కోతలతో అల్లాడుతున్న బ్రిటన్...7 రోజులు కరెంట్ లేకుండా....
యూకేలో శీతకాలం వస్తే చాలు ఏడు రోజుల వరకు విపరీతమైన కరెంట్ కోతలు ఉంటాయి. ఈ విషయమే యూకే ప్రభుత్వం, కౌన్సిల్లు ఈ పరిస్థితిని ఎదుర్కొన్నడంలో సహాయపడే ప్రత్యామ్నాయాలు గురించి అన్వేషిస్తోంది. వాస్తవానికి బ్రిటన్‌లో చలికాలంలో ఒక్కోసారి దారుణంగా ఉష్ణోగ్రతలు పడిపోయి పరిస్థితి మరింత ఘోరంగా ఉంటే మాత్రం ఈ కరెంటు కోతలు తప్పనిసరి. దీన్ని 2021లో జాతీయ గ్రిడ్‌లో పెద్ద సాంకేతిక లోపం ఏర్పడినప్పటి నుంచి ప్రోగ్రామ్ 'యారో' పేరుతో ఇలా శీతకాలంలో ఈ విద్యుత్ కోతలను విధించడం అమలు చేశారు. ముందస్తు హెచ్చరికలు లేకుండా అన్ని రంగాల్లో కరెంట్ కోతలు విధిస్తారు. దీని వల్ల 60% విద్యుత్ డిమాండ్ సుమారు 7 రోజుల వరకు ఉంటుంది. ఇళ్లు, వ్యాపారాలకు అడపదడప కరెంట్ యాక్సిస్ ఉంటుంది. ఈ సమయంలో అనలాగ్ ఎఫ్ఎంలు పనిచేస్తాయి. ఈ ప్లాన్ అత్యంత దారుణంగా ఉష్ణోగ్రతలు పడిపోయి చలి తీవ్రంగా ఉన్నప్పుడూ మాత్రమే అమలు చేస్తామని బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. ఐతే వారం రోజుల్లో తిరిగి విద్యుత్‌ను యథావిధిగా పునరుద్ధరిస్తామని తెలిపింది. అందుకే ఆ పరిస్థితికి అనుగుణంగానే పరిశ్రమలు, వ్యాపార సంస్థలు ముందస్తు ప్రణాళికలతో సిద్ధమవుతాయని చెబుతోంది బ్రిటన్. (చదవండి: పుతిన్ ఆరోగ్యంపై మళ్లీ.. ఇంజెక్షన్లతో నల్లగా మారిన చేతులు) -
బుల్ మరోసారి కుదేల్
ముంబై: స్టాక్ మార్కెట్లో రెండురోజుల పాటు సందడి చేసిన బుల్ బుధవారం చతికిలపడింది. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూలతలతో సెన్సెక్స్ 555 పాయింట్లు పతనమై 59,190 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 176 పాయింట్లు నష్టపోయి 17,646 వద్ద ముగిసింది. ద్రవ్యోల్బణ ఆందోళనలు, మండుతున్న ముడిచమురు ధరలు దేశీయ మార్కెట్‌ను సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి క్షీణత ఇన్వెస్టర్లను కలవరపెట్టింది. అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. ఐటీ, మెటల్ షేర్లలో లాభాల స్వీకరణ జరగడంతో అధికంగా నష్టపోయాయి. సెన్సెక్స్ సూచీలో మూడు షేర్లు మాత్రమే లాభపడ్డాయి. ఎన్ఎస్ఈలో మిడ్‌క్యాప్, స్మాల్ ఇండెక్స్‌లు ఒకశాతానికి పైగా నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.803 కోట్ల షేర్లను, దేశీయ ఇన్వెస్టర్లు రూ.999 కోట్ల షేర్లను అమ్మారు. స్టాక్ సూచీల భారీ పతనంతో ఇన్వెస్టర్లు ఒక్కరోజులోనే రూ.2.57 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. తద్వారా ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.262 లక్షల కోట్లు నమోదైంది. లాభాలతో మొదలై నష్టాల్లోకి.., దేశీయ స్టాక్ మార్కెట్ ఉదయం లాభంతోనే మొదలైంది. సెన్సెక్స్ 197 పాయింట్ల లాభంతో 59,942 వద్ద, నిఫ్టీ 40 పాయింట్లు పెరిగి 17,861 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. జాతీయ, అంతర్జాతీయ నెలకొన్న ప్రతికూలతలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. దీంతో సూచీల ఆరంభలాభాలన్నీ ఆవిరియ్యాయి. అటు పిమ్మట అమ్మకాలకే ప్రాధాన్యత ఇవ్వడంతో సెన్సెక్స్ ఒక దశలో 665 పాయింట్లు పతనమైన 59,080 వద్ద, నిఫ్టీ 209 పాయింట్లు నష్టపోయి 17,613 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచ్చాయి. నష్టాలకు నాలుగు కారణాలు... క్రూడ్ పెరుగుదల భయాలు ... సప్లై మందగమనం, డిమాండ్ పెరగడంతో క్రూడాయిల్ ధరలు ఎనిమిదేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. బ్రిటన్‌లో గ్యాస్ ధరలు ఒక్కరోజులోనే ఏకంగా 40% ఎగిశాయి. భారత చమురు అవసరాల్లో 85% దిగుమతులపైనే ఆధారపడుతోంది. క్రూడ్ ధర పెరగడంతో చమురు దిగుమతుల బిల్లు భారీగా పెరిగిపోతుంది. దీంతో కరెంట్ అకౌంట్ లోటు, ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణం వంటి అంశాలు ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చనే భయాలు మార్కెట్ వర్గాలను వెంటాడాయి. కరెంట్ కోత కలవరం .... దేశవ్యాప్తంగా థర్మల్ ప్లాంట్లలో నాలుగు రోజులకు సరిపడే బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయని విద్యుత్ మంత్రిత్వ శాఖ నివేదిక వెల్లడించడం దలాల్ స్ట్రీట్‌ను కలవరపెట్టింది. బొగ్గు కొరత ఇలాగే కొనసాగితే విద్యుత్ సంక్షోభం తలెత్తి ఉత్పత్తి, వ్యాపారాలపై ప్రభావాన్ని చూపవచ్చనే ఆందోళనలు మొదలయ్యాయి. భారత్‌లో 70% కరెంట్ బొగ్గు ఆధారంగా నడిచే థర్మల్ ప్లాంట్ల ద్వారానే ఉత్పత్తి అవుతుంది. ప్రపంచ మార్కెట్లను ప్రతికూలతలు ... బాండ్ ఈల్డ్స్, క్రూడ్, ద్రవ్యోల్బణ పెరుగుదల భయాలతో పాటు కార్మికుల కొరతతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. ఆసియాలో జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా, తైవాన్ దేశాల మార్కెట్లు రెండు నుంచి ఒకశాతం నష్టపోయాయి. సెలవుల కారణంగా చైనా ఎక్సే్చంజీలు పనిచేయడం లేదు. యూరప్‌లోని బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ మార్కెట్లు ఒకశాతం వరకు క్షీణించాయి. అగ్ర రాజ్యమైన అమెరికా స్టాక్ మార్కెట్లో టెక్నాలజీ, బ్యాంకింగ్ రంగాల షేర్లలో అమ్మకాల తలెత్తడంతో యూఎస్ ఫ్యూచర్లు ఒకటిన్నర శాతం నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. ప్రపంచ మార్కెట్ల పతనం మన మార్కెట్‌పై ప్రభావాన్ని చూపింది. రూపాయి పతనం.... క్రూడాయిల్, డాలర్ విలువ బలపటడంతో ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ భారీగా క్షీణించింది. ఇంట్రాడేలో 74.99 స్థాయికి దిగివచి్చంది. చివరికి 54 పైసలు నష్టపోయి 74.98 స్థిరపడింది. ఈ ముగింపు రూపాయికి ఐదు నెలల కనిష్టస్థాయి. రూపాయి పతనం(డాలర్ బలపడ టంతో)స్టాక్ మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. మార్కెట్లో మరిన్ని సంగతులు ► నష్టాల మార్కెట్లోనూ హిందుస్తాన్ కాపర్ 4% లాభపడి రూ.125 వద్ద ముగిసింది. ఈ సంస్థను చేజిక్కించుకునేందుకు వేదాంత ప్రయత్నాలు చేస్తుండటం ఈ షేరు ర్యాలీకి కారణమైనట్లు నిపుణులు తెలిపారు. ► క్రూడాయిల్ ధరలు పెరగడం ఓఎన్జీసీ షేరుకు కలిసొస్తుంది. బీఎస్ఈలో 3% లాభపడి రూ.168 వద్ద స్థిరపడింది. -
వేసవికి ముందే ‘కోతలు’
• సిరిసిల్లలో అప్రకటిత విద్యుత్ కోతలు • వస్త్రోత్పత్తి కి విఘాతం • తరచూ అంతరాయాలతో ఇబ్బందులు సిరిసిల్ల : కార్మిక క్షేత్రంలో అప్రకటిత విద్యుత్ కోతలు మొదలయ్యాయి. వేసవికి ముందే కరెంట్ కోతలు షురూ కావడంతో వస్రో్తత్పత్తి ఖిల్లా సిరిసిల్లలో నేతన్నలు ఇబ్బం దులు పడుతున్నారు. సిరిసిల్లలో మరమగ్గాలపై వస్త్రం ఉత్పత్తి అవుతుండగా.. విద్యుత్‌కోతలు లేకుండా గతంలో సరఫరా చేశారు. ఇప్పుడు మాత్రం కరెంట్ కోతల వేళలు ప్రకటించకుండానే ఎప్పుడు పడితే అప్పుడే విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. గత మూడు రోజులుగా సిరిసిల్లలో అప్రకటిత విద్యుత్ కోతలు అమలు జరుగుతున్నాయి. దీంతో వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. కోతలతో వస్రో్తత్పత్తికి విఘాతం.. సిరిసిల్ల పట్టణంలోనే మరమగ్గాలపై పాలిస్టర్, కాటన్ వస్రా్తలు ఉత్పత్తి అవుతాయి. కరెంట్ లేకుండా గుడ్డ ఉత్పత్తి సాధ్యం కాదు. దీంతో సిరిసిల్ల పట్టణానికి చాలా కాలంలో నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తున్నారు. సిరిసిల్లలో 34 వేల మరమగ్గాలు ఉండగా.. నిత్యం 34లక్షల మీటర్ల వస్త్రం ఉత్పత్తి అవుతుంది. పాతిక వేల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. మధ్యతరగతి పేదలున్న సిరిసిల్ల కరెంట్ కోతలు ఉండొద్దని గతంలో నిర్ణయించి కొనసాగిస్తున్నారు. గత ఐదు రోజులుగా అప్రకటిత విద్యుత్ కోతలతో నేతన్నలు పని కోల్పోతున్నారు. సాంచాల మధ్య ఉంటూ గంటల తరబడి కరెంట్‌లేక ఉపాధి కరువు అవుతుంది. విద్యుత్ కోతలతో వస్రో్తత్పత్తికి విఘాతం కలుగుతుంది. చిరువ్యాపారుల ఇబ్బందులు.. సిరిసిల్ల కార్మిక క్షేత్రంలో కరెంట్ కోతలతో చిరువ్యాపారులు సైతం అవస్థలు పడుతున్నారు. గురువారం మధ్యాహ్నం కరెంట్ లేక జనం ఇబ్బందులు పడ్డారు. వెల్డింగ్ షాపు, మోటార్ రీవైండింగ్, ఫోటో స్టూడియోలు, టేలరింగ్ షాపుల్లో పని లేక దిక్కులు చూశారు. వేసవికి ముందే కరెంట్ కోతలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సిరిసిల్లలో విద్యుత్ కోతలను నివారించాలని నేత కార్మికులు, చిరు వ్యాపారులు కోరుతున్నారు. సాంకేతిక సమస్యలతో కోతలు సిరిసిల్ల ‘సెస్’ పరిధిలో నాణ్యమైన విద్యుత్‌ను పంపిణీ చేస్తున్నాం. పట్టణానికి విద్యుత్‌ను అందించే సబ్ స్టేషన్లలో సాంకేతిక సమస్యలు రావడంతో సరఫరాలో అవాంతరాలు ఏర్పాడ్డాయి. అధికారికంగా విద్యుత్ కోతలు లేవు. తాత్కాలిక సాంకేతిక సమస్యలతోనే కరెంట్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ అవాంతరాలు లేకుండా చర్యలు తీసుకుంటాం. – దోర్నాల లక్ష్మారెడ్డి, ‘సెస్’ చైర్మన్ -
5 గంటలే..
వ్యవసాయ విద్యుత్ సరఫరాలో కోత మార్చి నుంచి 9 గంటల విద్యుత్ ఉత్తి మాటే.. ఏడు గంటలు కూడా రావడం లేదంటున్న రైతులు చేతికందే దశలో ఎండుతున్న పంటలు నగరంలోనూ కరెంట్ కోతలు ఈ కింది ఫొటోలో ఎండిన వరిని చూపిస్తున్న రైతు పేరు బొంత నర్సయ్య. లింగాలఘణపురం మండలం కుందారం గ్రామానికి చెందిన ఈయనకు నాలుగు బోర్లు ఉన్నాయి. బోర్లలో నీరు ఉండడంతో మూడు ఎకరాల్లో వరి సాగుచేశాడు. కరెంట్ కోతతో పంట చేతికొచ్చే దశలో వరి ఎండిపోతోంది. మూడు ఎకరాల్లో ఇప్పటికే ఎకరం వరకు ఎండిపోయింది. కరెంట్ ఐదు గంటలే వస్తోంది. లాభం లేదని రూ.52వేలు పెట్టి జనరేటర్ కొనుగోలు చేశాడు. అయినప్పటికీ వరి రోజుకు కొంత ఎండుతూనే ఉంది. వేల రూపాయలు పెట్టుబడులు పెట్టి తీరా.. చేతికొచ్చే దశలో ఎండిపోతుండడంతో లబోదిబోమంటున్నాడు. జనరేట ర్తో రాత్రింబవళ్లు నీళ్లు పెడుతూనే ఉన్నాడు. డీజిల్‌కు రోజుకు రూ.1000 ఖర్చు చేస్తున్నాడు. నెల రోజుల ముందే 9 గంటల క రెంట్ ఇస్తే బాగుండేదని నర్సయ్య అంటున్నాడు. హన్మకొండ :మార్చి నుంచి వ్యవసాయానికి 9 గంటల పాటు పగటి పూట విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పిన ప్రభుత్వం చేతులెత్తేసింది. పగలు, రాత్రి పూట కలిపి కూడా ఏడు గంటల విద్యుత్ సరఫరా కావడం లేదు. ప్రస్తుతం వ్యవసాయానికి ఆరు గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తున్నామని ఎన్పీడీసీఎల్ అధికారులు చెపుతున్నా ఆచరణలో మాత్రం కనపడడం లేదు. రోజుకు అయిదు గంటలే ఇస్తున్నారని, అది కూడా సక్రమంగా సరఫరా కావడం లేదని రైతులు అంటున్నారు. ఏడు గంటలు ఇస్తామని చెప్పడంతో తాము నమ్మి వరి పంటను సాగు చేసుకున్నామని, పంటకు చేతికందే ద శలో విద్యుత్ సరఫరా తగ్గించడంతో వేసిన వ రి పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జనగామ డివిజన్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. విద్యుత్ సరఫరా మెరుగుకు చేపట్టిన పనులు నత్తనడకన సాగుతున్నారుు. జిల్లాలో విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణం చేపట్టినా అవి పూర్తి కాలేదు. పలు చోట్ల కొత్తగా లైన్లు వేయాలని ప్రతిపాదనలు రూపొందించినా వాటిని పూర్తి చేయలేదు. దీంతో వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పిన ప్రభుత్వం మాట ఉత్తదే అని తేలిపోయింది. నగరంలోనూ కోతలు.. నగరంలోను విద్యుత్ కోతలు విధిస్తున్నారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెపుతూనే మరమ్మతుల పేరుతో రోజుకు మూడు నుంచి తొమ్మిది గంటల పాటు విద్యుత్ కోతలు విధిస్తున్నారు. ప్రతీరోజు 3 నుంచి 8గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. విద్యుత్ కోతలతో తమకు నష్టం వాటిల్లుతోందని వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరమ్మతుల పేరుతో కోతలు విధించడంపై వినియోగదారులు మండిపడుతున్నారు. నాటు వేసిన పొలం ఎండిపోయింది ఉన్న బోరు కింద రెండు ఎకరాల వరి పొలం నాటు వేశాను. కరెంట్ ఐదు గంటలే రావడంతో రోజుకో మడి చొప్పున రెండు ఎకరాల వరి ఎండిపోయింది. నెల రోజుల క్రితమే అప్పులు చేసి కూతురు పెండ్లి చేసిన. పంటను నమ్ముకుని జీవిస్తున్న నాకు పంట ఎండిపోయి, అప్పులు ఎలా తీర్చాలని దుఖం వస్తున్నది. - పెద్దటి కేశయ్య, బచ్చన్నపేట రైతు కరెంట్ రాక ఎకరం ఎండింది బావి వద్ద ఉన్న రెండు బోర్ల కింద రెండు ఎకరాల వరి పొలం నాటు వేశా ను. వరి పొట్టకు వచ్చి ఈనే దశలో ఎకరం పొలం ఎండిపోరుుంది. వ్యవసాయానికి ఏడు గంటలు ఇస్తామని ఆరు గంటలు కూడా ఇస్తలేరు. కేవలం ఐదు గంటల కరెంట్ ఇస్తుండడంతో పొలం ఎండిపోయింది. -భైరి వెంకటేశ్వర్లు, బచ్చన్నపేట -
కరెంట్ కోతలపై రైతుల కన్నెర్ర
ఇద్దరు ఆత్మహత్యాయత్నం చింతకాని/ నెల్లికుదురు/ మహబూబాబాద్ రూరల్/పెద్దేముల్: వ్యవసాయానికి సరఫరా చేస్తున్న కరెంట్‌లో అంతరాయంపై రైతన్నలు ఆగ్రహించారు. ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో ఆందోళనలు, రాస్తారోకోలకు దిగారు. ఇద్దరు రైతులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట మంగళవారం రైతులు పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. పదిరోజుల నుంచి వ్యవసాయానికి పగటి పూట ఇచ్చే ఆరు గంటల విద్యుత్ సరఫరాను సక్రమంగా ఇవ్వటం లేదని అధికారులపై ధ్వజమెత్తారు. సబ్‌స్టేషన్ ఆపరేటర్లను బయటకు పం పించి గేటుకు తాళాలు వేసి బైఠాయించారు. సీతంపేట గ్రామానికి చెందిన కౌలురైతు షేక్ ఇమామ్ సాహెబ్ కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించడంతో రైతులు అడ్డుకున్నారు. కూసుమంచి సబ్‌స్టేషన్‌లో మరమ్మతులు జరుగుతుండటంతో విద్యుత్ సమస్యలు తలెత్తుతున్నాయని, ఇకనుంచి విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు చేపడతామని ఏఈ హామీ ఇవ్వటంతో రైతులు ధర్నా విరమించారు. వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండలంలోని వివిధ గ్రామాల రైతులు మంగళవారం నెల్లికుదురు మండలం ఆలేరు విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట సుమారు నాలుగు గంటల పాటు రాస్తారోకో జరిగింది. రంగారెడ్డి జిల్లా పెద్దేముల్‌కు చెందిన రైతు బ్యాగరి నర్సప్ప మండలంలోని బుద్దారం పంచాయతీ గ్రామశివార్లలో తనకు ఉన్న 8 ఎకరాల పొలం లో అరటి పంటతో పాటు ఎకరా పొలాన్ని కౌలుకు తీసుకొని అందులో ఉల్లి పంట సాగుచేశాడు. ఈ క్రమంలో 20 రోజులుగా కరెంటు సమస్య వేధిస్తోంది. సాగు చేసిన అరటి, ఉల్లి పంటలు ఎండిపోతుండటంతో ఆందోళనకు గురయ్యాడు. పెద్దేముల్ తండా మార్గంలోని ఓ ప్రైవేట్ సెల్ టవర్ పైకి ఎక్కాడు. ఆత్మహత్య చేసుకుంటానంటూ చెప్పాడు. రూ.4 లక్షల అప్పులు చేసి అరటి, ఉల్లి పంటలు సాగుచేశానని, కరెంటు సక్రమంగా లేకపోవడంతో పంటలు ఎండిపోయాయన్నాడు. సెల్టవర్పైనుంచి దూకి చచ్చిపోతానంటూ వాపోయాడు. వెంటనే పెద్దేముల్‌కు చెందిన నాయకుడు ప్రకాష్‌రెడ్డి, నర్సప్ప సోదరుడు వెంకటయ్యతోపాటు పలువురు కిందికి దిగాలంటూ రైతుకు సూచించారు. గంటసేపు తర్వాత రైతు నర్సప్ప సెల్‌టవర్ పైనుంచి కిందికి దిగివచ్చాడు. -
వేళాపాళా లేని కరెంట్ కోతలు
♦ రోజుకు 15 లక్షల యూనిట్లుకు పెరిగిన వినియోగం ♦ తరచూ సరఫరాలో అంతరాయం ♦ ఇబ్బందులు పడుతున్న వినియోగదారులు నెల్లూరు (టౌన్) : గృహ అవసరాలకు నిరంతరం (24 గంటలు) విద్యుత్ సరఫరా ఇస్తున్నామని ప్రభుత్వ పాలకులు గొప్పలు చెబుతున్నారు. అయితే నెల్లూరు నగరంతో పాటు మున్సిపాలిటీల్లో రోజుకు గంటల తరబడి మధ్య మధ్యలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. పల్లెల్లో అయితే కరెంట్ పోతే ఎన్ని గంటలకు వస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. అనధికార కోతలతో వినియోగదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. గత రెండు వారాలుగా పెరిగిన ఎండలు చూస్తే మళ్లీ ఎండాకాలం వచ్చినట్లుగా ఉంది. ఉష్ణోగ్రతలు కూడా 40 డిగ్రీలకు పైగా నమోదవుతుంది. దీనికి తోడు జిల్లాలో ఖరీఫ్ సీజన్ కూడా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో విద్యుత్ వినియోగం అనూహ్యంగా పెరిగింది. విద్యుత్ డిమాండ్ పెరగడంతో సరఫరాలో తరచూ అంతరాయం ఏర్పడుతుంది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా కరెంట్ పోతుండటంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమాచారం తెలుసుకుందామన్న అధికారుల నుంచి స్పందన కరువుతుందని వాపోతున్నారు. మంగ ళవారం మినీబైపాస్‌లోని టీడీపీ ఆఫీసు, మరి కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి 9 గంటల వరకు, రామ్మూర్తినగర్, బాలాజీనగర్, రామలింగాపురం ప్రాంతాల్లో రాత్రి మొత్తంలో 2 గంటలు మాత్రమే సరఫరా ఉంది. పెరిగిన వినియోగం జిల్లాలో మొత్తం 12 లక్షలకు పైగా విద్యుత్ సర్వీసులు ఉన్నాయి. జిల్లాకు రోజుకు 1.26 కోట్లు యూనిట్లును కోటాగా నిర్ణయించినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే డిమాండ్ మాత్రం 1.40 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా. ప్రస్తుతం రోజుకు 1.25 కోట్లు వినియోగం జరుగుతున్నట్లు అధికార వర్గాలు లెక్కలు చెబుతున్నారు. సరఫరా, వినియోగానికి మధ్యలో తేడా ఉండటంతో తరచూ అంతరాయం ఏర్పడుతుంది. సరఫరాలో 50 శాతం వినియోగం వ్యవసాయానికి అవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. వినియోగానికి తగ్గ సరఫరా లేకపోవడంతో అధికారులు అనధికార కోతలు విధిస్తున్నారు. ఈ విషయంపై విద్యుత్ శాఖ టెక్నికల్ డీఈ వెంకటేశ్వరరావును సాక్షి సంప్రదించగా జిల్లాలో ఈఎల్ఆర్ లేదన్నారు. మరమ్మతులకు గురైనప్పుడు మాత్రమే సరఫరా నిలిపివేస్తున్నామన్నారు. -
ఇక.. కరెంటు కోతలుండవ్
రూ.91 వేల కోట్లతో 24 వేల మెగావాట్ల విద్యుత్ ♦ రెండేళ్ల తర్వాత సాగుకు 24 గంటల కరెంట్ ♦ త్వరలో కాలువల పునరుద్ధరణ పనులు ♦ డ్వాక్రా రుణాల పరిమితి రూ. 5 లక్షల నుంచి రూ. 15 లక్షలకు పెంపు ♦ హరితహారాన్ని విజయవంతం చేయాల్సింది పంచాయతీ అధికారులే ♦ కొప్పుల ఈశ్వర్‌కు మంత్రి పదవిస్తా ♦ ధర్మపురిలోనే పుష్కర స్నానం చేస్తా ♦ కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి, ధర్మారం సభల్లో సీఎం కేసీఆర్ సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో ఇక కరెంట్ కోతలు ఉండవని... రూ.91,500 కోట్ల వ్యయంతో 24 వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు ఏర్పాట్లు చేశామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తెలిపారు. రాబోయే రెండేళ్ల తరువాత వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తామని చెప్పారు. త్వరలోనే కాలువల పునరుద్ధరణ పనులు చేపడతామని ప్రకటించారు. తద్వారా టెయిల్ ఎండ్ ప్రాంతాల్లోని చివరి పొలాలకూ సాగు నీరందిస్తామన్నారు. డ్వాక్రా రుణాల పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.15 ల క్షల వరకు పెంచుతున్నట్లు తెలిపారు. గోదావరి పుష్కరాల సమయంలో ధర్మపురిలోనే పుష్కర స్నానం ఆచరిస్తానని పేర్కొన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ఆదివారం కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి, ధర్మారం మండల కేంద్రాల్లో పర్యటించి మొక్కలు నాటిన కేసీఆర్.. స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ప్రసంగించారు. తొలుత పెద్దపల్లి సభలో మాట్లాడుతూ హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన ప్రధాన బాధ్యత పంచాయతీ అధికారులదేనన్నారు. సరిగా పనిచేయని అధికారులపై తీవ్రమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ‘‘పింఛన్లు, షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి, ఉద్యోగుల జీతాల పెంపు సహా అనేక సంక్షేమ కార్యక్రమాలను ఎవరు అడిగినా అడగకపోయినా అమలు చేస్తున్నాం. కరెంటు, రోడ్లు, ఇతరత్రా అభివృద్ధి పనులకు ఎన్ని కోట్లయినా ఖర్చు చేస్తాం. కానీ వానలను కొనలేం కదా! వానలు రావాలంటే చెట్లు పెంచాలి. అడవులు విస్తరించాలి. అందుకే హరితహారం కార్యక్రమం చేపట్టింది. దీనిని విజయవంతం చేయాల్సిన బాధ్యత మాత్రం స్థానిక ప్రజాప్రతినిధులు, పంచాయతీ అధికారులదే’’ అని ఉద్ఘాటించారు. ఎవరి ఊరును వారే బాగు చేసుకుంటూ హరితహారం కార్యక్రమాన్ని మహాయజ్ఞంలా చేపట్టాలని పిలుపునిచ్చారు. వారం, పదిరోజులకే హరితహారం పరిమితం చేయొద్దని, వర్షాకాలం ముగిసే వరకు కార్యక్రమాన్ని కొనసాగించాలని సూచించారు. మంత్రులు ఈటల రాజేందర్, జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ బాల్కసుమన్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ తుల ఉమ, కలెక్టర్ నీతూప్రసాద్, జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొప్పుల గొప్పోడు... మంత్రిని చేస్తా అనంతరం ధర్మపురి నియోజకవర్గంలోని ధర్మారంలో జరిగిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. ‘‘కొప్పుల ఈశ్వర్ మంచి వ్యక్తి. తెలంగాణ ఉద్యమంలో నాతో కలసి పనిచేసినోడు. కమిట్మెంట్, క్యారెక్టర్ ఉన్న గొప్పోడు. మంత్రి పదవి రాలేదని నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదు. త్వరలోనే ఈశ్వర్‌ను మంత్రిని చేస్తా’’అని పేర్కొన్నారు. గత గోదావరి పుష్కరాల్లో ధర్మపురికి వచ్చి పుష్కర స్నానం చేసి తెలంగాణ వస్తే మళ్లీ పుష్కరాలకు వస్తానని లక్ష్మీనరసింహస్వామికి మొక్కుకున్నానని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. భగవంతుడి దయవల్ల తెలంగాణ వచ్చినందున ఈనెల 13న రాత్రి ధర్మపురికి రావడంతోపాటు 14న పుష్కర స్నానం ఆచరిస్తానన్నారు. ధర్మపురి అభివృద్ధికి ఎన్ని కోట్లు అవసరమైతే అన్ని నిధులను ప్రకటిస్తానని హామీ ఇచ్చారు. సీఎం బస్సుకు సాంకేతిక లోపం పెద్దపల్లి: సీఎం కేసీఆర్ ప్రయాణిస్తున్న బస్సు సాంకేతిక లోపంతో కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో కాసేపు మొండికేసింది. సీఎం కోసం నూతనంగా కొనుగోలు చేసిన తెలంగాణ ప్రగతి రథంలో పెద్దపల్లి సభకు వచ్చారు. ఆయన బస్సు దిగి సభ వద్దకు వెళ్లగా, ఈ క్రమంలో స్థానిక ట్రినిటీ కళాశాల మైదానానికి బస్సును తీసుకొచ్చారు. అరగంటలో మరమ్మతులు చేసి.. బయటికి తీస్తున్న క్రమంలో బస్సు గోడకు తగలింది. అయితే మరమ్మతు పూర్తయి బస్సు బాగవడంతో సభ తర్వాత సీఎం కేసీఆర్‌తో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు అదే బస్సులో ధర్మారం వెళ్లారు. కాగా బస్సును చూసేందుకు వచ్చిన వారంతా రూ. ఐదు కోట్ల బస్సుకు అప్పుడే మరమ్మతులా అంటూ ఆశ్చర్యపోయారు. -
డీసీ కరెంట్‌కు జై కొట్టండి!
వేసవి వచ్చిందంటే చాలు.. కరెంటు కోతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. బ్యాటరీ ఇన్వర్టర్లతో పనిజరుపుకోవచ్చుకానీ... బోలెడు డబ్బు ఖర్చవుతుంది. మరి ప్రత్యామ్నాయం? తాము అందిస్తామంటోంది సిగ్నీ సంస్థ! ఐఐటీ మద్రాస్ సహకారంతో తాము రూపొందించిన గ్రీన్ ఆఫీస్ అపార్ట్మెంట్ (జీఓఏ) వ్యవస్థ ద్వారా కరెంటు వాడకాన్ని తగ్గించడంతోపాటు అతితక్కువ ఖర్చుతో బ్యాకప్ పవర్‌ను పొందవచ్చునని, గ్రిడ్ ద్వారా అందే విద్యుత్తును కూడా అతితక్కువగా వాడుకోవడం ద్వారా విద్యుత్తును ఆదా చేయవచ్చు. ఆసక్తికరమైన ఈ సరికొత్త ఆవిష్కరణ వివరాలు... విద్యుత్తును ఎలా ఉత్పత్తి చేసినా వాటిని ఆల్టర్నేట్ కరెంట్ (ఏసీ), డెరైక్ట్ కరెంట్ (డీసీ)అని రెండు రకాలుగా వాడుకునే అవకాశముంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఏసీ కరెంట్ వాడకమే ఎక్కువ. బల్బులు, ఫ్యాన్లు, ఏసీ, వాషింగ్ మెషీన్, టీవీలు ఇలా అన్ని ఎలక్ట్రిక్ పరికరాలను కూడా ఏసీ కరెంట్‌ను దృష్టిలో ఉంచుకునే తయారు చేశారు. దురదృష్టమేమిటంటే... ఈ ఏసీ కరెంట్ అంత సమర్థమైంది కాదు. అదలా ఉంచినా సౌరశక్తి ద్వారా డెరైక్ట్ కరెంట్ ఉత్పత్తై... ప్రత్యేక పరికరాల ద్వారా దాన్ని ఏసీగా మార్చుకుని వాడుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కనీసం 20 శాతం విద్యుత్తు వృథా అవుతుంది. ఈ నష్టాన్ని లేకుండా చేస్తే...? నేరుగా డీసీ కరెంట్‌నే వాడుకోగలిగితే? అన్న ఆలోచనకు వాస్తవ రూపం జీఓఏ వ్యవస్థ. ఏముంటాయి దీంట్లో? జీఓఏ ఒకరకంగా సౌరశక్తి వ్యవస్థే. కాకపోతే సోలార్ ప్యానెళ్లు మొదలుకొని దీంట్లోని అన్ని పరికరాలు డీసీ విద్యుత్తుతో సమర్థంగా పనిచేసేలా రూపొందించారు. ఐఐటీ మద్రాస్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అధ్యాపకుడు, శాస్త్రవేత్త అశోక్ ఝున్‌ఝున్‌వాలా ఆలోచనల ఆధారంగా సిద్ధమైన ఈ వ్యవస్థలో సోలార్ ప్యానెళ్లు, బ్యాటరీలు, కొన్ని ప్రత్యేకమైన పరికరాలు ఉంటాయి. ప్రస్తుతానికి దీన్ని అపార్ట్మెంట్లలో ఉపయోగించేందుకు వీలుగా తయారు చేశారు. వాయిదాల పద్ధతిలో... డీసీ కరెంట్ వ్యవస్థ ఏర్పాటు చేసుకునేందుకు ముందస్తు పెట్టుబడులేవీ అవసరం లేదని, మొత్తం తామే సమకూర్చి అపార్ట్మెంట్ల యజమానుల నుంచి వాయిదాల పద్ధతిలో వసూలు చేసుకుంటామని సిగ్నీ సంస్థ ప్రతినిధి దీపేశ్ గుజరాతి అంటున్నారు. రెండు పడకగదులున్న అపార్ట్‌మెంట్‌కు నెలకు రూ.300, మూడు పడకగదులకైతే రూ.400 చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. దీంతోపాటు వాడుకునే విద్యుత్తును బట్టి యూనిట్‌కు రూ.6 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో అపార్ట్‌మెంట్‌కు ఏర్పాటు చేసే ప్రత్యేక మీటర్ ద్వారా వాడకాన్ని లెక్కించవచ్చునని చెప్పారు. పదేళ్ల వాయిదాల తరువాత మొత్తం వ్యవస్థ అపార్ట్మెంట్ వాసుల సొంతమవుతుందని, ఈ మధ్యలో బ్యాటరీలను మార్చడం, మెయింటెనెన్స్ మొత్తం కంపెనీనే చేపడుతుందని వివరించారు. ఒక్కో వ్యవస్థ కోసం 800 నుంచి వెయ్యి చదరపు అడుగుల పైకప్పు స్థలం అవసరమవుతుందని తెలిపారు. సంప్రదాయ సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకుంటే దీనికి రెండింతల స్థలం అవసరమవుతుంది. 50 శాతం విద్యుత్తు ఆదా... ఏసీ విద్యుత్ స్థానంలో డీసీని వాడటం ద్వారా కనీసం 50 శాతం విద్యుత్తు ఆదా అవుతుంది. ఉదాహరణకు సాధారణ ఫ్యాన్ పూర్తి వేగంతో తిరిగినప్పుడు దాదాపు 72 వాట్ల విద్యుత్తు వాడుతుందనుకుంటే... బ్రష్‌లెస్ డీసీ ఫ్యాన్ కేవలం 30 వాట్లు మాత్రమే వాడుతుంది. తక్కువ స్పీడ్‌తో తిరిగేటప్పుడు ఇది ఆరువాట్లు మాత్రమే ఉంటుంది. టెలివిజన్లు, మొబైల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల విషయంలోనూ ఇంతే. సిగ్నీ అందించే ఒక్కో వ్యవస్థ ద్వారా ప్రతి అపార్ట్మెంట్ 5 బల్బులు, మూడు ట్యూబ్‌లైట్లు, రెండు ఫ్యాన్లు, ఒక టెలివిజన్‌ను పనిచేయించుకోవచ్చునని, వాషింగ్‌మెషీన్, రిఫ్రిజిరేటర్లు, ఏసీల వాడకం మాత్రం ప్రస్తుతానికి సాధ్యం కాదని చెప్పారు.పైగా ఈ వ్యవస్థలో 230 వోల్టుల స్థానే కేవలం 48 వోల్టులు మాత్రమే వాడతారు కాబట్టి షాక్ కొట్టే అవకాశమే ఉండదు. అడ్రస్:cygni energy pvt ltd landsum house,plot no : 28-3, road no : 78,jubliee hills,hyderabad,telangana. -
కోతలు.. వాతలు
♦ అనధికార విద్యుత్ కోతలతో వెతలు ♦ ఏజెన్సీలో మరీ దారుణం ♦ ఎల్‌ఆర్‌లు లేవంటున్న అధికారులు ♦ ఈ నెల నుంచే కొత్త చార్జీలు సాక్షి, విశాఖపట్నం: వేసవి వచ్చేసింది..తనతో పాటు విద్యుత్ కోతలను తీసుకొచ్చింది. జిల్లాలో అధికారికంగా ప్రకటించకపోయిన్పటికీ, మండల, గ్రామ స్థాయిలో అనధికారిక విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారు. ఇవి కేవలం స్థానికంగా ఏర్పడే ఇబ్బందుల వల్లనే తప్ప లోడ్ రిలీఫ్ విధించాల్సిన పరిస్థితి ఇంకా రాలేదని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఈ నెల విద్యుత్ బిల్లులో కొత్త ధరలు పడనున్నాయి. ఒకటో తేదీ నుంచి అమలులోకి వచ్చిన 2015-16 ఆర్థిక సంవత్సర విద్యుత్ టారిఫ్ ప్రకారం కొత్త ధరలతో బిల్లుల భారం పడనుంది. జిల్లాలో 12 లక్షల మంది విద్యుత్ వినియోగదారులున్నారు. వీరికి రోజుకు అందించే విద్యుత్ 16 మిలియన్ యూనిట్లు. ఆ మేరకు విద్యుత్ కోటా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఎలాంటి విద్యుత్ కోతలు విధించడం లేదంటున్నారు. కానీ గ్రామ స్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. కొన్ని గ్రామాల్లో దాదాపు ఒక పూటంతా విద్యుత్ సరఫరా ఉండటం లేదు. ముఖ్యంగా ఏజెన్సీలో పరిస్థితి దారుణంగా ఉంది. ఇక్కడ విద్యుత్ సరఫరా సక్రమంగా ఉండకపోవడంతో తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విద్యుత్ సౌకర్యం లేక నీటిపథకాలు పనిచేయకపోవడంతో సుదూర ప్రాంతాల నుంచి నీటిని మోసుకుని తెచ్చుకుంటున్నారు. ఇదే విషయాన్ని ఆశాఖ అధికారుల వద్ద ప్రస్తావించగా ఏజెన్సీలో ఉండే ప్రత్యేక పరిస్థితులు, సమస్యల కారణంగా విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తున్న మాట వాస్తవమేనని దానిని అధిగమించడానికి చర్యలు చేపడుతున్నామని వివరించారు. మరోవైపు ఈ నెల నుంచి జిల్లా ప్రజలపై నెలకు రూ.10.22 కోట్ల విద్యుత్ చార్జీల భారం పడుతోంది. 200 యూనిట్లు పైబడి వాడే ప్రతి వినియోగదారుడిపై చార్జీల భారం తప్పదు. ఓ వైపు కోతలు, మరో వైపు చార్జీల వాతలు ఈ నెల నుంచే జిల్లా విద్యుత్ వినియోగదారులకు ఎదురవుతున్నాయి. -
కోతలు షురూ..
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : ఫిబ్రవరి నెల ఇంకా పూర్తికానేలేదు.. వేసవి పూర్తిస్థారుులో ప్రారంభం కానూలేదు.. కానీ, జిల్లాలో అప్పుడే కరెంటు కోతలు షురువయ్యూరుు. ఇప్పుడిప్పుడే వేడి పెరిగి విద్యుత్‌ను వినియోగించుకుంటున్న ప్రజలకు సెగ తగులుతోంది. అనధికారికంగా విద్యుత్ శాఖ కోతలు ప్రారంభించింది. రోజుకు ఉదయం నుంచి రాత్రి వరకు సమయపాలన లేకుండా రెండు నుంచి మూడు గంటల వరకు కోతలు పెడుతున్నారు. అనధికారిక కోతలతో ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. జిల్లా కేంద్రంతోపాటు, సబ్‌స్టేషన్ పరిధిలో, మండలాల్లో ఈ కోతలు అమలవుతున్నారుు. అరుుతే.. అధికారికంగా అధికారులు మా త్రం దీన్ని ధ్రువీకరించడం లేదు. ఆదేశాలు రాకముందే పరిస్థితి ఇలా ఉంటే.. మున్ముందు ఇంకా ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జి ల్లాలో వ్యవసాయరంగానికి 95,095, గృహావసరాలవి 5,70,569, పరిశ్రమల తదితర విద్యుత్ కనెక్షన్లు మొత్తం 7,28,907 ఉన్నాయి. దీనికి అనుగుణంగా సా ధారణ సరఫరా రోజువారీగా 6.026 మిలియన్ యూనిట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. కానీ.. జిల్లాకు కేటాయించిన దానికంటే తక్కువగా నే ఫిబ్రవరి నెల కోటా 4.918 మిలియన్ యూనిట్లు సరఫరా అవుతున్నట్లు అధికారులే చెప్తున్నారు. డిమాండ్‌కు, సరఫరాకు వ్యత్యాసం ఎక్కువగా ఉండడంతో లోటును పూడ్చుకోవడం కోసం ఎడాపెడా కోతలు విధిస్తున్నారు. మొన్నటి వర కు చల్లగా ఉన్న వాతావరణం వారం రోజులుగా ఉష్ణోగ్రతలు పెరిగి ఎండలు మండుతున్నాయి. గురువారం గరిష్ట ఉష్ణోగ్రత 36.5 డిగ్రీలకు చేరుకుంది. గత డిసెంబర్, జనవరి నెలలో 4.682 మిలియన్ యూనిట్లలోపు వాడకం జరగగా బుధవారం విద్యుత్ వినియోగం 5.275 మిలియన్ యూనిట్లు అరుునట్లు విద్యు త్ అధికారులు అంటున్నారు. వారం రోజులుగా విని యోగం ఒక్కసారిగా పెరి గింది. రాబోయే రోజుల్లో కరెంటు వినియోగం మరింత పెరగునున్న దృష్ట్యా వి ద్యుత్ సరఫరాను ఇప్పటి నుంచే అదుపులో పెడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అనధికారిక కోతలు వేళపాలా లేకుండా రెండుమూడు గంటలు విధిస్తున్నారు. గ్రామాల్లో ఏ సమయంలో కరెంటు పోతుంది.. వస్తుందో తెలియకుండా ఉంది. -
అన్నదాతకు షాక్!
పరిగి: అన్నదాతకు అర్ధరాత్రి కరెంట్ కష్టాలు షురువయ్యాయి. ఇటీవలి వరకు తెల్లవారుజామున ఓ దఫా.. మరో దఫా పగలు సరఫరా చేస్తూ వచ్చిన విద్యుత్ అధికారులు సోమవారం నుంచి కరెంట్ వేళలు మార్చేశారు. గతంలో తెల్లవారు జామున సరఫరా చేసే కరెంట్‌ను ప్రస్తుతం అర్ధరాత్రి 12 గంటలకు సరఫరా చేయనున్నారు. ఇదేమంటే ఉన్నతాధికారుల సూచనల మేరకు ఓ దఫా సమయాన్ని అర్ధరాత్రికి మార్చామని అధికారులు పేర్కొంటున్నారు. రైతులకు 7 గంటల కరెంట్ ఇవ్వలేం ఆరు గంటలు మాత్రం ఇస్తామని కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం ప్రకటించింది. సర్కారు ప్రకటన వాస్తవ విరుద్ధంగా ఉందని రైతులు అవస్థలు చూసిన వారెవరికైనా ఇట్టే అర్థమవుతుంది. ఆయా విద్యుత్ సబ్స్టేషన్లకు చెందిన ఫీడర్లలో ఇటీవలి వరకు కొన్నింటిలో ఉదయం 3 నుంచి 6 గంటల వరకు, తిరిగి మ్యధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు, మరో వారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తిరిగి రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు రోజుకు ఆరు గంటల విద్యుత్ సరఫరా చేస్తూ వచ్చారు. ప్రస్తుతం మారిన వేళల ప్రకారం అర్ధరాత్రి 12 గంటల నుంచి 3 గంటల వరకు తిరిగి ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు సరఫరా చేయనున్నారు. దీంతో రైతులు అర్ధరాత్రి కష్టాలు మొదలయ్యాయి. కరెంట్ కోసం రాత్రిపూట వ్యవసాయ పొలాల వద్ద కంటిమీద కునుకు లేకుండా ఉండాల్సిందే. అర్ధరాత్రి విష కీటకాల బారిన పడటంతో పాటు విద్యుత్ ప్రమాదాల భయంతో రైతులు వణికే పరిస్థితులు దాపురించాయి. సరఫరా చేస్తోంది 3 నుంచి 4 గంటల కరెంటే ప్రభుత్వం రైతులకు ఆరు గంటల కరెంటు సరఫరా చేస్తున్నామని చెబుతున్నప్పటికీ వాస్తవంగా 3 నుంచి 4 గంటల కరెంటే సరఫరా అవుతోంది. సరఫరా అయ్యే సమయంలో ఐదు నుంచి పదిసార్లు కరెంట్ పోయి వస్తోందని రైతులు పేర్కొంటున్నారు. సరఫరా అవుతున్న కరెంటు కూడా లో ఓల్టేజితో రావడంతో మోటార్లు, స్టార్టర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. కరెంటు కూడా వచ్చీ పోతుండడంతో పొలానికి నీళ్లు పారించడం రైతులకు గగనంగా మారుతోంది. పదే పదే కరెంటు పోతుండడంతో పారించిన పొలాన్నే తిరిగి పారించాల్సి వస్తుందని దీంతో రోజులో నాలుగు గుంటల భూమికంటే ఎక్కువ పారించలేకపోతున్నామని పరిగికి చెందిన ఓ రైతు ఆవేదన వ్యక్తంచేశాడు. కరెంట్‌ను నమ్ముకుంటే వ్యవసాయం చేయలేమని కనీసం జనరేటరైనా కొందామని వికారాబాద్‌లోని ఓ దుకాణానికి వెళితే రూ. 80 వేలు ధర చెప్పడంతో చేసేదిలేక తిరిగి వచ్చానని మరో రైతు తన ఆందోళన వ్యక్తం చేశాడు. ఆయిల్ ఇంజిన్లు, జనరేటర్లను ఆశ్రయిస్తున్న రైతులు కరెంటు కోతల కారణంగా రైతులు ఆయిల్ ఇంజిన్లను ఆశ్రయించాల్సి వస్తోంది. కొంత డబ్బు వెచ్చించే స్థోమత ఉన్న రైతులు జనరేటర్లను ఆశ్రయిస్తున్నారు. అయినప్పటికీ పొలం బాగా బీటలు వారి ఉండడంతో ఒక్కో ఎకరం నీరు పారించడానికి రెండు రోజులు ఆయిల్ ఇంజిన్‌ను నడిపించాల్సివస్తోంది. గంటసేపు వీటిని నడిపించాలంటే డీజిల్‌కు రూ. 130 ఖర్చవుతోందని పరిగికి చెందిన ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఎకరా పొలానికి నీరు పారించడం కోసం రైతులు వేల రూపాయలు వెచ్చించాల్సి వ స్తోంది. కరెంటు వస్తూ పోతూ ఉండడంతో ఓ వ్యక్తి స్టార్టర్ వద్దే పట్టుకొని ఉండాల్సి వస్తుందని మల్లెమోనిగూడకు చెందిన ఓ రైతు వాపోయాడు. ట్రాన్స్ఫార్మర్ కాలితే పంట ఎండాల్సిందే.. ఇటీవల కరెంటు వస్తూ పోతూ (ట్రిప్ అవుతుండటం)ఉండడంతో పాటు వచ్చిన కరెంటు కూడా లో ఓల్జేజితో వస్తుండడంతో స్టార్టర్లు, ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు కాలిపోతున్నాయి. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయిన వెంటనే అధికారులు స్పందించకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. మరోవైపు మోటార్లు పదే పదే కాలిపోతుండడంతో వాటి మరమ్మతులకు వేలకు వేలు ఖర్చుచే యాల్సి వస్తోంది. కొన్ని సందర్భాల్లో అధికారులు స్పందించకపోవడంతో రైతులే చందాలు వేసుకొని బాగు చేయించుకుంటున్నారు. -
కూర ‘గాయాల’ సాగు
వరంగల్ : రైతులకు ఆర్థికంగా చేదోడుగా నిలిచిన కూరగాయల సాగు ఇప్పుడు భారంగా మారుతోంది. వర్షాభావ పరిస్థితులు, కరెంట్ కోతలు, పెట్టుబడి పెరగడంతో రైతులకు కనీస లాభదాయకంగా లేక ఈ సాగుకు దూరమవుతున్నారు. తక్కువ భూమి, మార్కెట్ అందుబాటులో ఉన్న నగర పరిసర గ్రామాల రైతుల్లో ఇప్పుడు కూరగాయ పంటల సాగుపై ఆసక్తి సన్నగిల్లుతోంది. రోజువారీ ఆదాయం లభిస్తుందనే ఆశతో రెండు దశాబ్దాలుగా ఈ సాగును నమ్ముకున్న రైతులు క్రమంగా దూరమవుతున్నారు. కూరగాయల సాగు పూర్తిగా బోర్లు, బావులపైన్నే ఆధారపడి సాగుతోంది. వేళాపాలాలేని విద్యుత్‌కోతలు, భూగర్భ జలాల సమస్యతోపాటు పెట్టుబడికి తగిన గిట్టుబాటు లేక పోవడంతో రైతుల్లో క్రమంగా మోజు తగ్గింది. నిన్నమొన్నటి వరకు కూరగాయలపైనే ఆధారపడిన రైతులు సైతం క్రమంగా దూరమవుతున్నారు. డిమాండ్‌కు తగిన స్థాయిలో కూరగాయల ఉత్పత్తి లేకపోవడం, దళారీల కారణంగా ధరలు పెరుగుతున్నాయి. ప్రజావసరాలు తీర్చేందుకు దూర ప్రాంతాల నుంచి కూరగాయాలను దిగుమతి చేసుకుంటున్నారు. దీనివల్ల రవాణా చార్జీల భారం, కమీషన్లు తడిసి మోపెడవుతున్నాయి. తగ్గిన సాగు ఖిలావరంగల్, కరీమాబాద్, న్యూశాయంపేట ప్రాంతాల్లో కూరగాయల సాగు పెద్ద విస్తీర్ణంలో సాగేది. నగరం చుట్టూ 20 కిలోమీటర్ల పరిధిలో ఉన్న హన్మకొండ, వర్ధన్నపేట, సంగెం, గీసుకొండ, ఆత్మకూరు, నర్సంపేట, ధర్మసాగర్ మండలాల పరిధిలోని గ్రామాల్లో కూరగాయల సాగుపైనే ఆధారపడే వారు. ఎక్కడ చూసినా కూరగాయల తోటలే కన్పించేవి. చిన్న, సన్నకారు రైతులు తమకున్న తక్కువ భూమిలోనే సాగు చేసేవారు... ఇంటిల్లిపాది శ్రమించేవారు. వేలాది మంది ఇదే ప్రధాన ఆదాయంగా ఎంచుకునేవారు. సీజన్‌వారీగా అన్ని రకాల ఆకుకూరలు, కాయగూరలతో పాటు ఉల్లి, కొత్తిమీర, పచ్చిమిర్చి పండించే వారు. వరంగల్ లక్ష్మీపురంలోని పెద్ద మార్కెట్ దగ్గర ఉండం, సానుకూల రవాణా వసతి కారణంగా కూరగాయల సాగు చేపట్టేవారు. రోజువారీ ఆదాయాన్ని తమ కుటుంబాల అభివృద్ధికి వినియోగించేవారు. ఇటీవల ఈ గ్రామాల్లో పరిస్థితి మారింది. ఈ సాగు లాభసాటిగా లేకపోవడంతో ఇతరత్రా పనులవైపు మొగ్గు చూపుతున్నారు. కూరగాయాల సాగుకు సస్యరక్షణ సమస్యలు అడ్డుగా నిలుస్తాయి. విత్తనాలు, పురుగుల మందులు, ఎరువుల ధరలు రెట్టింపు పెరిగాయి. ఇంతచేస్తే పంట చేతికొచ్చే సమయానికి మార్కెట్లో ధర లేకపోవడంతో పూర్తిగా నష్టపోతున్నారు. చేతికొచ్చిన పంటలను ధరవచ్చే వరకు నిల్వ చేసుకునే అవకాశం లేకపోవడంతో ఒక్కోసారి పంటను పెంటపాలు చేయాల్సి వస్తోంది. పెట్టుబడి కూడా చేతికి రాకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ కారణంగా మొక్కజొన్న, పత్తి, పొద్దుతిరుగుడు వాణిజ్యపంటవైపు దృష్టిసారిస్తున్నారు. తగ్గిన దిగుబడులు వరంగల్ లక్ష్మీపురంలోని మార్కెట్లో 400 మంది హోల్‌సేల్, 600 మంది రిటైల్ వ్యాపారులు లావాదేవీలు సాగిస్తున్నారు. క్రమం తప్పకుండా వ్యాపారం చేసే వారు సగం మాత్రమే ఉంటారు. మరో 200 మంది చిరువ్యాపారులు రోడ్డుపై అమ్మకాలు సాగిస్తున్నారు. రైతుల నుంచి కమీషన్ పద్ధతిలో సరుకులు తీసుకుని వ్యాపారం చేస్తున్నారు. క్వింటాల్‌కు రూ. 4శాతం నుంచి 6శాతం క మీషన్ వసూలు చేస్తున్నారు. మంచి సీజన్లో ఈ మార్కెట్‌కు ఆకుకూరలు, కూరగాయలు కలిపి 1200 నుంచి 1500 క్వింటాళ్ల సరుకు వచ్చేది. ప్రస్తుతం సరుకు రాక తగ్గుతోంది. ఈ కారణంగా ఒక్కసారిగా ధరలకు రెక్కలొచ్చాయి. దీనికి తోడు సరుకు చేతులు మారి వినియోగదారుడి వద్దకు చేరే సరికి ధర రెట్టింపవుతోంది. సీజన్లో రూ. 20 నుంచి 25లక్షల టర్నోవర్ ఉంటుంది. ప్రస్తుతం టర్నోవర్ తగ్గిపోయింది. పెరిగిన దిగుమతులు జిల్లా నుంచి కూరగాయల రాక తగ్గడంతో ఇతర జిల్లాల నుంచి దిగుమతి చేసుకుంటున్నందున రవాణాచార్జీలు, శ్రమ కలిసి ధర పెరుగుతోంది. చిత్తూరు జిల్లా మదనపల్లి, అనంతపురం, కర్నూలు, చింతామణి, ఆదిలాబాద్ జిల్లా ధనోరా, కరీంనగర్ రైతుబాజర్, సిద్ధిపేట, ఒంటిమామిడిపల్లి ప్రాంతాల నుంచి టమాట, బీరకాయ, పచ్చిమిర్చి, కందలు తీసుకొస్తున్నారు. రోజుకు ఈ ప్రాంతాల నుంచి 150 నుంచి 200 క్వింటాళ్ల టమాట దిగుమతి చేసుకుంటున్నారు. స్థానికంగా 20 శాతం సరుకు మాత్రమే వస్తున్నది. మిగిలిన ప్రాంతాల నుంచి 80శాతం దిగుమతి చేసుకుంటున్నారు. ఈ కారణంగా ధరలు పెరిగి జనం బేజారవుతున్నారు. ధరల భారం కూరగాయల ధరలు బాగా పెరిగాయి. మండుతున్న కూరగాయల ధరలతో పాటే సామాన్యుని గుండె మండుతోంది. చేతినిండా డబ్బు తీసుకపోయినా చేయి సంచి నిండని పరిస్థితి నెలకొంది. నగరంలోని లక్షలాది మందితో పాటు జిల్లాలోని డివిజన్, మండల కేంద్రాలకు సైతం వరంగల్ ప్రధాన మార్కెట్ నుంచే వ్యాపారులు, వినియోగదారులు కొనుగోలు చేస్తారు. ఇక్కడ హోల్‌సేల్‌తో పాటు రిటేల్ వ్యాపారం సాగుతోంది. రైతుల చేతిలున్నపుడు ధర లభించడంలేదు. దళారీల పాత్ర వల్ల ధరలు బాగా పెరుగుతున్నాయి. క్రమంగా సాగు తగ్గి ధరలు పెరుగుతున్నాయి. -
అన్నదాత అరిగోస
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ఖరీఫ్ ఆరంభంలో కురిసిన చిరు జల్లుల అనంతరం వేసిన పంటలు ఆ తర్వాత వర్షాభావం, కరెంట్ కోతలతో చాలా వరకు దెబ్బతిన్నాయి. రైతుల పంటలను తగుల బెట్టే పరిస్థితి ఎదురైంది. ఖరీఫ్ సాగు రైతులకు అప్పులనే మిగల్చగా, సకాలంలో పంటరుణాలు ఇచ్చి ఆదుకోవాల్సిన బ్యాంకర్లు నిబంధనల పేరిట ఇబ్బందులకు గురి చేశారు. 25 శాతం రుణమాఫీ రైతులకు ఉపశమనం కలిగించలేదు. ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కోసం ఐకేపీ, పీఏసీఎస్‌ల ద్వారా 287 కేంద్రాలను ఏర్పాటు చేయాలని ల క్ష్యంగా పెట్టుకోగా, 92 కేంద్రాలనే ఏర్పాటు చేశారు. 3,20,500 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 5,080 మె.టన్నులే కొనుగోలు చేశారు. దళారులు, రైసుమిల్లర్లు కొందరు రంగంలోకి దిగడంతో రైతులకు గిట్టుబాటు ధర అందని ద్రాక్షలా మారుతోంది. ఊరట ఏదీ? రుణమాఫీ రైతులకు ఊరట కలిగించలేదు. ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించేనాటికి 4,33,132 మంది రైతులు రూ.1863.65 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ రుణాలన్నింటినీ రద్దు చేస్తామని సర్కారు చెప్పినప్పటికీ, 25 శాతం మాత్రమే రుణాలను మాఫీ చేశారు. 1,26,539 మందికి చెందిన రూ.465.19 కోట్ల రుణాలు మొదటి విడతగా మాఫీ అయ్యాయి. 3,06,593 మంది రైతులకు చెందిన రూ.1,398.46 కోట్లు ఇంకా మాఫీ కావాల్సి ఉంది. ఇదిలా వుంటే, వ్యవసాయ సీజన్ ప్రారంభానికి ము ందే ప్రభుత్వం రుణ ప్రణాళికలను సిద్ధం చేయాల్సి ఉంది. ఖరీఫ్‌లో 2,86,540 మంది రైతులకు రూ.1,300 కోట్లు పంట రుణాలుగా ఇవ్వాలని బ్యాంకులు లక్ష్యంగా పెట్టుకున్నాయి. అక్టోబర్ 15 నాటికి రూ.479.29 కోట్లు పంట రుణాలుగా ఇచ్చినట్లు రికార్డులు చెప్తున్నాయి. పంటల రుణాలను కనిష్టంగా, గరిష్టంగా ఎకరానికి ఇంత ఇవ్వచ్చన్న ప్రతిపాదనలను సైతం అక్కడక్కడ బ్యాంకర్లు పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. పంటలపై ఇచ్చే రుణ మొత్తం (స్కేల్ ఆఫ్ ఫైనాన్స్)విధానాన్ని పాటించలేదని రైతులు వాపోతున్నారు. తగ్గిన వర్షపాతం ఖరీఫ్‌లో సాధారణ సాగు లక్ష్యం 3,20,931 హెక్టార్లు కాగా, 3,10,679 హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేశారు. గతేడాదితో పోలిస్తే ఈ సారి జిల్లా సాధారణ వర్షపాతం 49.8 శాతం తగ్గిపోగా చెరువులు, కుంటలు ఎండిపోయి భూగర్భజలాలలో 10.37 మీటర్లకు పడిపోయాయి. 22,375 హెక్టార్లలో వరి, సోయాబీన్ పంటలు ఎండిపోగా, సుమారుగా పదివేల హెక్టార్ల వరకు రైతులు సోయా, వరి పంటలను తగులబెట్టారు. శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టుల్లో నీటిమట్టం పూర్తిగా తగ్గిపోయింది. నిజాంసాగర్ ప్రాజెక్టు నీటి సామర్థ్యం 1405.00 అడుగులు. గతేడాది ప్రాజెక్టు జలకళతో ఉట్టిపడితే, ఈసారి నీటిమట్టం 1381.78 అడుగులకు పడిపోయింది. శ్రీరాంసాగర్‌లో గతేడాది ఇదే సీజన్లో రిజర్వాయర్ లెవెల్ 1091.00 అడుగులుంటే, ఈసారి 1067.40 అడుగులకు పడిపోయింది. గతేడాది ఇదే సీజన్ శ్రీరాంసాగర్‌లో 90.31 టీఎంసీల నీళ్లుంటే ప్రస్తుతం 24.28 టీఎంసీలే ఉన్నాయి. నిజాంసాగర్‌లో గతేడాది 17.80 టీఎంసీలుంటే ప్రస్తుతం1.67 టీఎంసీలకు పడిపోవడం ఆందోళన కల్గిస్తోంది. కరెంట్ కోతలు, ఎండిపోయిన పంటలు, అప్పుల బాధలు భరించలేక మూడు నెలల వ్యవధిలో 21 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఖరీఫ్‌లో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కున్న రైతులు రబీసాగుపై అనాసక్తితో ఉన్నారు. రబీలో 1,78,684 హెక్టార్లు సాగు లక్ష్యం కాగా ఇప్పటి వరకు 6,877 హెక్టార్లలోనే పంటలు వేశారు. మొత్తంగా జిల్లాలో కరువు కరాళనృత్యం చేస్తుండగా.. కష్టాన్ని నమ్ముకున్న రైతులు కాడిని వదిలే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
చీకటి బతుకులు
* కాంట్రాక్ట్ కార్మికులు, దినసరి కూలీల మీద తీవ్ర ప్రభావం * ఆర్డర్లు రద్దవుతున్నాయంటూ యాజమాన్యాల ఆందోళన * ఉపాధి కోల్పోతున్న కార్మికులు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: కరెంటు కోతలు కార్మికుల ఉపాధికి వాతలు పెడుతున్నాయి. వారి జీవితాల్లో చీకట్లు నింపుతున్నాయి. పవర్ హాలీడేతో నెలలో 10 రోజుల పాటు పరిశ్రమలు మూతపడుతున్నాయి. దీంతో యాజమాన్యాలు కాంట్రాక్ట్ కార్మికులను, దినసరి కూలీలను తగ్గించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఉపాధి వెతుక్కుంటూ పల్లె నుంచి పట్నం వచ్చి బడుగు జీవుల బతుకులు రోడ్డున పడుతున్నాయి. ప్రస్తుత అంచనాల ప్రకారం జిల్లాకు రోజుకు 22.80 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం ఉంది. కానీ ఇప్పటికీ 2001 లెక్కల ఆధారంగానే రోజుకు 17.51 మిలియన్ యూనిట్ల విద్యుత్‌నే అధికారులు కేటాయించారు. ఇందులో 9.40 మిలియన్ యూనిట్లు పరిశ్రమల కోసం వినియోగిస్తున్నట్లు టాన్స్‌కో రికార్డులు చెప్తున్నాయి. డిమాండ్‌కు తగినంత సరఫరా లేకపోవడంతో అధికారులు పరిశ్రమలకు రెండు రోజుల పవర్ హాలీడే ప్రకటించారు. వారానికి రెండు రోజులతో పాటు, మధ్యమధ్యలో కరెంటు కోతలు విధిస్తున్నారు. దీంతో నెలకు కనీసం 10 నుంచి 12 రోజుల పాటు పరిశ్రమలు నడవడం లేదు. ఈ నేపథ్యంలో అనుకున్న లక్ష్యంలో దాదాపు 40 శాతం ఉత్పత్తులు ఆగిపోతున్నాయి. జిల్లాలోని చాలా పరిశ్రమల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. సమయానికి ఉత్పత్తులు ఇవ్వడం లేదన్న కారణంతో బయ్యర్లు ముందస్తు ఆర్డర్లను తిరస్కరించి, మరో రాష్ట్రం కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఉత్పత్తులు నిలిచిపోవడంతో ఆదాయ వ్యయాల్లో తీవ్ర వ్యత్యాసం వస్తోంది. దీంతో ఉద్యోగులు, కార్మికుల వేతనాల చెల్లింపులు కూడా పరిశ్రమల యాజమాన్యాలకు కష్టంగా మారుతోంది. జిల్లాలో ఒక్కొక్క భారీ పరిశ్రమలో కనీసం 350 నుంచి 500 వరకు కార్మికులు పనిచేస్తున్నారు. దినసరి కూలీల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుంది. మధ్య, చిన్నతరహా పరిశ్రమల్లో సగటున 50 నుంచి 100 మంది కూలీల పని చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ప్రత్యక్షంగా దాదాపు 2 లక్షల మంది కార్మికులు, పరోక్షంగా మరో లక్ష మంది పరిశ్రమల మీద ఆధారపడి బతుకుతున్నారు. నెలకు 10 రోజుల పాటు పరిశ్రమల ఆగిపోవడం వల్ల అందులో పని చేసే కార్మికుల జీతాల్లో యాజమాన్యం కోత పెడుతోంది. ఇంకొన్ని పరిశ్రమలు సిబ్బందిని కుదించుకుంటున్నాయి. దీంతో దినసరి కూలీలు, కాంట్రాక్టు కార్మికుల ఆర్థిక పరిస్థితి భారంగా మారుతోంది. కాంటాక్ట్ కార్మికుల మీద ప్రభావం... డిమాండ్‌కు తగినంతగా విద్యుత్‌ను సరఫరా లేకపోవడంతో పరిశ్రమల్లో ఉత్పుత్తులు ఆగిపోతున్నాయి. చిన్న మధ్య తరహా పరిశ్రమలకు వారానికి రెండు రోజులు పవర్ హాలీడే ప్రకటించడంతో ఈ ప్రభావం నేరుగా దినసరి కూలీల మీద పడుతోంది. ప్రస్తుతం సరఫరా అవుతున్న విద్యుత్తులో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తుండటంతో పరిశ్రమలకు వారానికి కనీసం 2 రోజుల పవర్ హాలీడే ప్రకటించాల్సి వచ్చింది. జిల్లాలో భారీ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు అధికంగానే ఉన్నాయి. 11 కేవీ విద్యుత్‌తో నడిచే భారీ పరిశ్రమలు దాదాపు 1,500 వరకు ఉన్నాయి. 10 కేవీ విద్యుత్తుతో నడిచే అంటే మధ్యతరహా, చిన్న పరిశ్రమలు 7,500 వరకు ఉన్నాయి. ప్రస్తుతం బొల్లారం పారిశ్రామిక వాడలో సోమవారం, మంగళవారం, జిల్లాలోని మిగిలిన పారిశ్రామిక వాడల్లో బుధ, గురువారాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో ఈ పరిశ్రమల్లో ఉత్పత్తి ఆగిపోతోంది. ఫార్మా, ఐరన్, స్టీల్, బాయిల్డ్, విత్తన, జౌళి పరిశ్రమలపై విద్యుత్ కోతల ప్రభావం తీవ్రంగా ఉంటోంది. ఐరన్, బాయిల్డ్ పరిశ్రమల్లో బాయిలర్స్ వేడెక్కాలంటే దాదాపు 1000 ిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అవసరం. ఇందుకోసం దాదాపు 5 నుంచి 10 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుందని పరిశ్రమల యాజమాన్యాలు చెబుతున్నాయి. కరెంటు కోతల నేపథ్యంలో ప్రత్యామ్నాయంగాా హైటెన్షన్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన జనరేటర్లు ప్రస్తుతం అందుబాటులో లేవని, ఒకవేళ అందుబాటులో ఉన్నప్పటికీ అంత ఖర్చు భరించి పరిశ్రమలు నడపటం సాధ్యం కాదని యాజమాన్యాలు అంటున్నాయి. విధిలేని పరిస్థితిలోనే పవర్ హాలీడే ప్రకటించిన రెండు రోజులు ఉత్పత్తి నిలిపివేస్తున్నామని వారు చెప్తున్నారు. మిగిలిన 5 దినాల్లో కూడా నిరంతరాయంగా కరెంటు రావడం లేదని, మధ్యమధ్యలో కనీసం మూడు నుంచి నాలుగు గంటల పాటు సరఫరా నిలిచిపోతున్నట్లు పరిశ్రమల యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అన్ని వర్గాల మీదా ప్రభావం... రసాయన పరిశ్రమలు 24 గంటలు 365 రోజులు నడవాల్సిందే. కెమికల్ జోన్లో రసాయన గుణాన్ని బట్టి 24 గంటలు, 36 గంటల ప్రతిచర్యలు (రియాక్షన్స్) ఉంటాయి. కరెంటు కోతలతో రసాయనిక ప్రతి చర్యలు ఆగిపోయి ఉత్పత్తులు తగ్గడం, నాసిరకం ఉత్పత్తులు తయారవుతున్నాయి. ఇలాంటి ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉండటం లేదు. ఫలితంగా భారీగా నష్టపోవాల్సి వస్తోంది. పరిశ్రమల ఆగటంతో యాజమాన్యం, కార్మికులు మాత్రమే కాదు.. పారిశ్రామిక ఉత్పత్తులను తరలించడం..విక్రయించడం.. వాటిని వివిధ రూపాల్లోకి మార్చే అనేక వర్గాల మీద ప్రభావం చూపుతుంది. రవాణ వాహనాలు, డ్రైవర్లు, ఏజెన్సీలు, డీలర్లు, దుకాణదారులు, మధ్యవ ర్తులు ఇలా ప్రతి వారి మీదా ప్రభావం పడుతుంది. ముఖ్యంగా కాంట్రాక్టు కార్మికులు, దినసరి కూలీల మీద తీవ్ర ప్రభావం పడుతుంది. -అంజిరెడ్డి, ఎస్సార్ కెమికల్స్, ఎస్సార్ ట్రస్టు అధినేత -
రైతును కాటేసిన కరెంట్ కోతలు
తాటికొండ(స్టేషన్‌ఘన్‌పూర్) : కరెంట్ కోతలు ఓ రైతును కాటేశారుు. అతడు గత ఏడాది సాగు చేసిన పంటలు చేతికొచ్చే దశలో వడగండ్లతో నాశనం కాగా, ఈసారి కరెంటు కోతలతో ఎండిపోయూరుు. దీంతో పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులను తీర్చే మార్గం లేకపోవడంతో మనోవేదనకు గురైన యువరైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండలంలోని తాటికొండలో బుధవారం రాత్రి జరిగింది. మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఎడమ పెద్దాపురం, సుజాత దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. చిన్నకుమారుడు చదువుకుంటుండగా పెద్దకుమారుడు సాంబరాజు(27) వ్యవసాయం చేస్తున్నాడు. వారికి గ్రామంలో రెండు ఎకరాల పొలం ఉండగా గత ఏడాది ఐదెకరాలు కౌలుకు తీసుకున్నారు. అప్పట్లో రూ.3 లక్షలు అప్పు చేసి వరి, పత్తి, మిర్చి, మక్క పంటలు సాగు చేశాడు. పంటలు ఏపుగా పెరగడంతో చేసిన అప్పులు తీరుతాయని ఆశించాడు. మరో నెల రోజుల్లో పంట చేతికి వస్తుందనుకుంటున్న తరుణంలో ఒక్కసారిగా వడగండ్లుపడి పంటంతా నాశనమైంది. ఈ ఏడాది మరో రూ.లక్ష అప్పు చేసి రెండెకరాల్లో వరి, మరో రెండు ఎకరాల్లో పత్తి, మిర్చి, మక్క వేశాడు. ఇటీవల కురిసిన వర్షాలకు తోడు గత 15 రోజుల వరకు కరెంటు బాగానే ఉండడంతో కొంత అప్పు తీర్చవచ్చని ఆశించారు. కానీ కరెంటు కోతలు మొద లు కావడంతో పంటలు ఎండిపోయే దశకు చేరుకున్నాయి. ఈ క్రమంలోనే గురువారం పంటలపై పిచికారీ చేసేందుకు క్రిమిసంహారక మందు తెచ్చాడు. బుధవారం రాత్రి కరెంట్ పోవడంతో అతడి తల్లిదండ్రులతోపాటు భార్య ఆరుబయట కూర్చుని ఉండగా.. అతడు మరో రెండు రోజులు కరెంట్ ఇలాగేపోతే పంట పూర్తి ఎండుతుందని మనోవేదనకు గురై క్రిమిసంహారక మందు తాగి పడిపోయూడు. రాత్రి 10 గంటల ప్రాంతంలో కరెంట్ వచ్చాక ఇంట్లోకి వెళ్లిన కుటుంబ సభ్యులకు సాంబరాజు కిందపడి కనిపించాడు. నోట్లో నుంచి నురగలు రావడం, పక్కనే పురుగుల మందు డబ్బాను గమనించి బోరున విలపిస్తూ స్థానికుల సాయంతో ఆర్ఎంపీ వద్ద కు తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మేము బయటకు వెళ్లకున్నా బతికేటోనివి బిడ్డా.. అన్నం తిన్నంక మేము బయటకు పోకున్నా బతికెటోనివి బిడ్డా.. ఈ కరంటు పాడుగాను నీ చావుకు వచ్చిందా బిడ్డా.. అంటూ తల్లి సుజాత గుండెలు బాదుకుంటూ రోదించిన తీరు చూసి స్థానికులు కన్నీటిపర్యంతమయ్యూరు. పొలం కాడికి తప్ప ఎక్కడికి పోయేటోడు కాదు పొలంకాడికి తప్ప తన కొడుకు ఎక్కడికి పోయెటోడు కాదని మృతుడి తండ్రి పెద్దాపురం తెలిపారు. రోజు పొలంకాడికి ఎందుకురా బిడ్డా.. నేను పనిచేస్తానన్నా వినకపోయేదని గుర్తు చేస్తూ గుండెలవిసేలా రోదించాడు. -
మిశ్రమ పంటలపై రైతుల ఆసక్తి
శామీర్‌పేట్: మండలంలోని రైతులు మిశ్రమ పంటలపై దృష్టి సారిస్తున్నారు. ఒకే సీజన్లో రెండు పంటలను సాగు చేసి రెట్టింపు ఆదాయాన్ని పొందుతున్నారు. మండలంలో భూగర్భజలాలు అంతంత మాత్రమే. ఐదు సంవత్సరాలుగా వరి సాగు చివరిరోజుల్లో కరెంట్ కోతలు, అయితే అతివృష్టి, లేకుంటే అనావృష్టితో నష్టాలు చవి చూస్తున్నారు. రైతులు మిశ్రమ పంటలపై దృష్టి సారిస్తున్నారు. వీరికి వ్యవసాయ శాఖ అధికారులు తగు సూచనలు ఇస్తుండంతోై రెతులు అటువైపు అడుగులు వేస్తున్నారు. టేకు చెట్ల మధ్య డెకరేషన్‌కు పనికి వచ్చే ఆస్పరాగస్ గడ్డితోపాటు పూలు, కాకర తోటల్లో టమాటా, మామిడిలో మొక్కజొన్న, పశుగ్రాసం, వేరుశనగ, కంది, రాగి, బీన్స్, వంకాయ, చిక్కుడు తదితర తీగజాతి పంటలు, బొప్పాయిలో బంతి పూలు, మొక్కజొన్నలో కంది పంటలు సాగు చేస్తున్నారు. ఉన్నంత వరకు భూమిని పూర్తిగా ఉపయోగించుకుని ఇలా ఒకే సీజన్లో రెండు పంటలతో ఆదాయం పొందుతున్నారు. శామీర్‌పేట్ మండలంలోని పొన్నాల్, బాబాగూడ, పోతారం, నారాయణపూర్, అనంతారం, కొల్తూర్, ఉద్దెమర్రి, పోతాయిపల్లి, తూంకుంట తదితర ప్రాంతాల్లోని రైతులు సుమారు వెయ్యి ఎకరాల్లో మిశ్రమ పంటలు పండిస్తున్నారు. రాబోయే కాలంలో మరింత ఎక్కువ విస్తీర్ణంలో మిశ్రమ పంటలు సాగయ్యే సూచనలు కనిపిస్తున్నాయని వ్యవసాయ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. మిశ్రమ పంటలకు డ్రిప్ మల్చింగ్ విధానం మరింత సౌలభ్యాన్ని కల్గిస్తున్నాయని రైతులు పేర్కొంటున్నారు. -
తెల్ల‘బంగారం’.. వీడని మమకారం
గజ్వేల్ : మెతుకుసీమగా ఖ్యాతి గడించిన జిల్లాలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.. ప్రస్తుతం భూ గర్భజలాలు అడుగంటి కరెంట్ కోతలు విపరీతంగా పెరిగిన కారణంగా వరిసాగు గణనీయంగా తగ్గి.. పత్తి, మొక్కజొన్ననే ప్రధాన పంటలుగా ఆవిర్భవించాయి.. కొన్నేళ్లుగా ఈ రెండు పంటలే అత్యధిక విస్తీర్ణం లో సాగులోకి రావడమే ఇందుకు నిదర్శనం. పత్తికి సంబంధించి ఈసారి సీజన్ ఆరంభంలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుత సీజన్లో జిల్లాలో 1.73 లక్షల హెక్టార్లలో పత్తి సాగవుతుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందుకోసం 7.18 లక్షల బీటీ పత్తి విత్తన ప్యాకెట్లు అవసరమవుతాయని భావించారు. అధికారులు భావించినట్టుగానే.. 7 లక్షలకుపైగా విత్తన ప్యాకెట్లు అమ్ముడుపోయాయి. ప్ర స్తుతం 1.25 లక్షల హెక్టార్ల వరకు పత్తి సాగులోకి వచ్చిందని వ్యవసాయశాఖ చెబుతోంది. విత్తన రూపే ణా రైతుల రూ. 60 కోట్లకుపైగా, ఎరువులు, దున్నకాలు, కూలీల ఇతర పెట్టుబడుల రూపేణా మరో రూ. 60 కోట్ల వరకు ఖర్చు చేశారు. 10 రోజుల క్రితం వర కు మైనస్ వర్షపాతం ఉండటం వల్ల ఒక్కో రైతు రెండు నుంచి మూడు సార్లు విత్తనాలు వేయాల్సి వ చ్చింది. ఫలితంగా కోట్లల్లో నష్టం వాటిల్లింది. ముచ్చటగా మూడోసారి వేసిన విత్తనాలతో మొక్కలు మొలిచా యి. ఇవీ ఎండుపోతాయని రైతులంతా ఆందోళనలో మునిగిన తరుణంలో వానలు కురుస్తున్నాయి. ఫలి తంగా జిల్లాలోని అన్ని చోట్లా పత్తి పంట తేరుకుంటున్నది. ఆరంభంలో వర్షాభావం తలెత్తి...నష్టాల పాలుజేసినా ప్రస్తుతం తెల్ల‘బంగారం’ తేరుకోవడంతో రైతులు ఊరట చెందుతున్నారు. ఇక పంటకు తెగుళ్లు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు మెరుగైన యాజమాన్య పద్ధతులపై దృష్టి సారిస్తున్నారు. -
కరువుఛాయలు
- జిల్లాలో జాడలేని వానలు - దుక్కులు దున్ని దిక్కులు చూస్తూ రైతులు - ఇరవై శాతం మించని సాగు - అదును దాటుతోందని అన్నదాతల ఆందోళన కరీంనగర్ అగ్రికల్చర్ : కార్తెలన్నీ కరిగిపోతున్నాయే తప్ప.. వరుణుడు మాత్రం కరుణించడం లేదు. బోర్లు, బావుల్లో నీళ్లున్న రైతులు కాస్తాకూస్తో సాగు చేసినా.. కరెంట్ కోతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని కరెంట్‌తో వేసిన పంటలు కాస్తా ఎండిపోతున్నాయి. వర్షాలు లేక.. కరెంట్ ఉత్పత్తి తగ్గిపోయిందని, ఇందులో తామేమీ చేయలేమని విద్యుత్ అధికారులు చేతులెత్తేయడంతో రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. కాలువల కింది రైతులు కూడా ఈసారి నీటి విడుదల ఉంటుందో.. లేదోనని అయోమయానికి గురవుతున్నారు. జిల్లాలో సాధారణ వర్షపాతం (ఇప్పటివరకు) 194 మిల్లీమీటర్లు కాగా.. గతేడాది 208.4 మిల్లీమీటర్లుగా నమోదైంది. ఈ సంవత్సరం మాత్రం 83.6 మిల్లీమీటర్లకు మించలేదు. అంటే.. 57 శాతం లోటు ఏర్పడింది. గ్రామాల్లో కప్పతల్లి ఆడుతున్నా.. ముక్కోటి దేవుళ్లకు మొక్కుతున్నా చినుకు జాడే కరువైంది. రోజూ కారుమబ్బులు కమ్ముకుంటున్నా.. రైతన్నల ఆశలతో దోబూచులాడుతున్నాయి. వెరసి అన్నదాతలను కలవరపెడుతున్నాయి. ఖరీఫ్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు జిల్లాలో ఎక్కడా ఆశించిన వర్షం కురవలేదు. మరోవైపు అదునుదాటుతోంది. ఈ క్రమంలో రెండుమూడు భారీ వర్షాలు కురిస్తే తప్ప రైతులు ముందుకు కదలడం కష్టంగా ఉంది. రోహిణి, మృ గశిర, ఆరుద్ర కార్తెలు ముగిశాయి. ఆదివారం నుంచి పునర్వసు మొదలైంది. ఈ కార్తెలో కాలం పోతే పత్తి, వరి సాగు కష్టమేనని రైతులు పేర్కొంటున్నారు. అదును దాటితే ఆరుతడి పంటలే మేలని వ్యవసాయశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు సూచిస్తుండటం కరువుకు అద్దం పడుతోంది. ఇప్పటికే ఆరుతడి విత్తనాల కోసం ప్రభుత్వ ఆమోదానికి జిల్లా అధికారులు నివేదికలు పంపించారు. జిల్లావ్యాప్తంగా జూన్ నుంచి ఇప్పటివరకు సాధారణ వర్షపాతం 194 మిల్లీమీటర్లు కాగా.. రెండు మండలాల్లోనే సాధారణ వర్షపాతం నమోదైంది. 28 మండలాల్లో లోటు, 27 మండలాల్లో అత్యల్ప వర్షపాతం నమోదైంది. జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 5,18,349 హెక్టార్లు కాగా ఇప్పటివరకు కేవలం 20 శాతం మాత్రమే పంటలు సాగయ్యాయి. ఓవైపు ఎండలు.. మరోవైపు జాడలేని వర్షాలు.. వీటికితోడు కరెంట్ కోతలు.. వెరసి ఖరీఫ్ సాగును ఆగమ్యగోచరంగా మార్చింది. పత్తి మొక్కలు మొలిచి ఎండిపోతుండటంతో వాటిని బతికించుకునేందుకు రైతులు నానాపాట్లు పడుతున్నారు. పంటను కాపాడుకునేందుకు కూలీలతో నీరు పోయిస్తున్నారు. ఈనెల 4న 29 మండలాల్లో సగటున 4.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. 5న 44 మండలాల్లో 9.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది ఒక మోస్తరు వర్షంగానే వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఈ వర్షాలు రైతులకు కొంత ఊరటనిచ్చాయని పేర్కొంటున్నారు. గడ్డుకాలం.. దాదాపు జూన్‌లోనే 50 శాతం విస్తీర్ణంలో సాగు చేయటం ఆనవాయితీ. ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. వ్యవసాయ శాఖ రికార్డులు ప్రకారం కూడా సాగు నామమాత్రంగానే ఉంది. గతేడాది 5,61,049 హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేయగా.. ఈ సమయం వరకు నాలుగు లక్షల హెక్టార్లలో సాగులో ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు కేవలం 1,03,072 హెక్టార్లకే పరిమితమైంది. బోర్లు, బావుల్లో నీరున్న రైతులు 1071 హెక్టార్లలో వరి నార్లు పోవారు. 68,536 హెక్టార్లలో పత్తి విత్తనాలు నాటారు. మరో 20 వేల హెక్టార్లలో మొక్కజొన్న సాగు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ రికార్డులు చెబుతున్నాయి. జూలై 15 వరకు వర్షాలు రాకుంటే మూడు దశల్లో విత్తనాలు నాటి పంటలు సాగు చేసేందుకు అధికారులు ప్రత్యామ్నాయ ప్రణాళిక రూపకల్పనలో తుదిమెరుగులు దిద్దుతున్నారు. -
మళ్లీ కోతలు షురూ..
- వానాకాలం మొదట్లోనే మొదలు.. - మండల కేంద్రాల్లో 2 గంటలు.. - సబ్‌స్టేషన్ పరిధిలోనూ 2గంటలు - అధికారికంగా మరింత కోత సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : కరెంట్ కోతలు మళ్లీ మొదలయ్యాయి. విభజన తర్వాత వానాకాలం మొదట్లోనే కరెంట్ కష్టాలు ఎదురవుతున్నాయి. ఉత్పత్తి తగ్గిందంటూ ప్రభుత్వం విద్యుత్ కోతలు విధించేందుకు అనుమతి ఇచ్చింది. కరీంనగర్ సర్కిల్లో శుక్రవారం నుంచి కోతలను అమలులో పెట్టింది. ప్రస్తుతం వ్యవసాయానికి విద్యుత్తు అవసరం కొంత మేరకే ఉంది. అయినప్పటికీ ఉత్పత్తి తగ్గడంతో సరఫరా మెగావాట్లు తగ్గాయని, ట్రాన్స్‌కో నుంచి కోతలకు ఆదేశాలిచ్చారని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం గ్రామాలు, మండల కేంద్రాలు, సబ్‌స్టేషన్ పరిధిలోని ప్రాంతాల్లోని అన్ని వర్గాల కనెక్షన్లపై విద్యుత్ కోతలు విధిస్తున్నారు. గ్రామాల్లో అధికారికంగా ఆరు గంటలు కోత విధిస్తున్నట్లు అధికారులు చెబుతున్నా... అది ఏడు నుంచి 8 గంటలకు పైగా ఉంటుంది. గ్రామాల్లో ఆరు గంటలు జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో ఆరు గంటల విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారు. పలు సందర్భాల్లో రాత్రి కూడా సరఫరా నిలిపివేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యుత్ కోతను అమలు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే పలు కారణాలు, సరఫరాలో సాంకేతిక కారణాలు అంటూ రోజూ రాత్రిపూట గంటపాటు కోత విధిస్తున్నారు. అంతేకాకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు పలుమార్లు ఎల్ఆర్ తీసుకుంటున్నారు. దీంతో గ్రామాల్లో అధికారిక కోత 6గంటలే అయినా... తీసేస్తుంది మాత్రం 8గంటల వరకు ఉంటుంది. ప్రతీసారీ విద్యుత్ కోతలకు గ్రామాలనే టార్గెట్ చేస్తున్న అధికారులు... ఈసారి కూడా పల్లెలపైనే పడ్డారు. ముందుగా పల్లెలకు విద్యుత్ సరఫరా ఆపేస్తున్నారు. పునఃప్రారంభం వేసవి నుంచి విద్యుత్ సరఫరా కొంత మెరుగ్గానే ఉంది. రబీ తర్వాత వ్యవసాయ మోటర్లు నడవడం లేదని, జిల్లాకు కావాల్సిన విద్యుత్తు సరఫరా అవుతుందంటూ నిరంతర విద్యుత్ ఇచ్చారు. అయితే గ్రామాల్లో మాత్రం అనధికారికంగా గంటో, రెండు గంటలో కోత పెట్టినా... కొద్ది రోజులకే పరిమితం చేశారు. తాజాగా శుక్రవారం మళ్లీ కరెంట్ కోతలు మొదలుపెట్టారు. విద్యుత్ ఉత్పత్తి తగ్గిందని ఎమర్జెన్నీ లోడ్ రిలీఫ్ (ఈఎల్ఆర్) తీసుకుంటున్నారు. మండలాల్లో 2గంటలు జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో 2 గంటల కోత విధిస్తున్నారు. రెండు రోజుల నుంచే కోతలు అమలు చేస్తున్నా... శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. అన్ని మండలాలు, డివిజన్లకు ఫోన్ సమాచారమిచ్చారు. మండల కేంద్రాల్లో అధికారికంగా 2గంటలు కోత పెడుతున్నా మరో గంటపాటు అడపాదడపా తీసేస్తున్నారు. సబ్‌స్టేషన్ పరిధిలో 2 గంటలు జిల్లాలోని 226 సబ్‌స్టేషన్ కేంద్రాల్లో అధికారిక కోత 2 గంటలు పెడుతున్నారు. ఇక్కడ కూడా అధికారిక కోతకు అదనంగా 30నుంచి 50 నిమిషాలపాటు అనధికారికంగా సరఫరా నిలిపివేస్తున్నట్లు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. -
కరెంట్ కట్ కటా!
సాక్షి, అనంతపురం : జిల్లా వ్యాప్తంగా కరెంటు కోతలు తీవ్రమయ్యాయి. కరెంటు ఎప్పుడొస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. దీంతో జనం అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా చంటి పిల్లలు, వృద్ధుల పరిస్థితి దయనీయంగా మారింది. జిల్లా కేంద్రంతో పాటు, పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాల వారీగా కరెంటు కోతల వేళలను సదరన్ పవర్ డిస్ట్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎస్పీడీసీఎల్) అధికారులు వేసవి ఆరంభం నుంచి ఇప్పటి వరకు రెండు సార్లు ప్రకటించారు. అనంతపురం నగరంలో రెండు గంటలు, మునిసిపాలిటీలలో నాలుగు, మండల కేంద్రాల్లో ఆరు, గ్రామీణ ప్రాంతాల్లో ఎనిమిది గంటల చొప్పున కోత ఉంటుందని తొలుత ప్రకటించారు. ఆ తర్వాత వేసవిలో వినియోగం పెరగడం, రాష్ట్ర విభజన వంటి కారణాలతో కోతల వేళల్లో మార్పు చేశారు. పస్తుతం నగరంలో నాలుగు గంటలు, పట్టణాల్లో ఆరు, మండల కేంద్రాల్లో ఎనిమిది గంటల చొప్పున అధికారిక కోతలు ఉన్నాయి. అయితే.. నెల రోజులుగా ప్రకటిత కోతల వేళలు పూర్తిగా మారిపోయాయి. ఎప్పుడు పడితే అప్పుడు కరెంటు తీసేస్తున్నారు. ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ (ఈఎల్ ఆర్) కింద హైదరాబాద్ నుంచే నేరుగా కోత పెడుతున్నారని, తాము నిమిత్తమాత్రులమని జిల్లా అధికారులు అంటున్నారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం ఒక్కరోజే నాలుగు సార్లు కోత విధించారు. ఇక పట్టణాలు, గ్రామాల్లో పరిస్థితి చెప్పక్కరలేదు. పది రోజులుగా జిల్లాలో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. అయినా ఉక్కపోత తగ్గడం లేదు. దీనికితోడు కరెంటు లేకపోవడంతో జనం అల్లాడిపోతున్నారు. రాత్రిళ్లు దోమల బెడద కంటిమీద కనుకు లేకుండా చేస్తోంది. పరిశ్రమల్లో ఉత్పత్తికి తరచూ ఆటంకం కలుగుతుండడంతో పారిశ్రామికవేత్తలు లబోదిబోమంటున్నారు. పెరిగిపోతున్న డిమాండ్ జిల్లాకు ప్రస్తుతం 14.5 మిలియన్ యూనిట్ల కరెంటు అవసరం. పంపిణీ సంస్థ నుంచి మాత్రం 11 మిలియన్ యూనిట్లే వస్తోంది. 3.5 మిలియన్ యూనిట్ల లోటు కొనసాగుతోంది. సరఫరాకు, డిమాండ్‌కు మధ్య వ్యత్యాసం కారణంగా హైదరాబాద్ నుంచే నేరుగా 220 కేవీ సబ్స్టేషన్ల నుంచి వెళ్లే 133 సబ్స్టేషన్ల లైన్లకు కరెంటు సరఫరా నిలిపేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో వ్యవసాయానికి సరఫరా తగ్గినా కోతలు పెరగటానికి కారణమేమిటన్న ప్రశ్న తలెత్తడం సహజం. కానీ జిల్లాలో పండ్లతోటలు విస్తారంగా సాగులో ఉండడం, కొన్ని పంటలు దిగుబడి స్థాయిలో ఉండడం వల్ల వంద శాతం కరెంటు మళ్లించటానికి వీలు కావడం లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో కోతలు తప్పడం లేదని అంటున్నారు. ఇన్వర్టర్ల వాడకం పెరగడం కూడా కరెంటు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతోందని అధికారులు చెబుతున్నారు. ఇన్వర్టర్లు ఒకేసారి లోడు అవుతుండడంతో ఆ భారం సబ్స్టేషన్లపై పడుతోందని, తరచూ లైన్లు ట్రిప్ అవుతున్నాయని అంటున్నారు. -
కరెంట్ కోత ఉక్కపోత..
నెల్లూరు(హరనాథపురం), న్యూస్‌లైన్: అసలే వేసవి కాలం. ఆపై కరెంట్ కోతలు. రెండూ కలిసి ప్రజలకు ఉక్కపోత. ఇదీ జిల్లాలో దుస్థితి. బుధవారం ఏకంగా 10 గంటలు విద్యుత్ కోత విధించడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. జిల్లాలో రోజురోజుకూ విద్యుత్ కోతలు పెరుగుతున్నాయి. పాలకులు, అధికారులకు ముందుచూపు లేకపోవడంతో ప్రతి వేసవిలో ప్రజలకు కరెంట్ కష్టాలు తప్పడం లేదు. అధికార, అనధికార కోతలతో ప్రజలు అల్లాడుతున్నారు. పల్లెల్లో పగలంతా కరెంట్ ఉండటం లేదు. కరెంట్ కోతలపై అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో జనం ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రంలో నాలుగు యూనిట్లు మరమ్మతులకు గురి కావడంతో జిల్లా వ్యాప్తంగా అంధకారం నెలకొంది. మధ్యాహ్నం 12 గంటలకు సరఫరాను నిలిపివేసి సాయంత్రం 5కు పునరుద్ధరించారు. గంటల తరబడి సరఫరా నిలిచిపోవడంతో కరెంట్ ఎప్పుడు వస్తుందా అని జిల్లా ప్రజలు ఎదురు చూశారు. విద్యుత్ కోతలపై సమాచారం తెలుసుకునేందుకు సంబంధిత అధికారులను సెల్ ఫోన్లలో సంప్రదించేందుకు ప్రయత్నించగా ఎస్ఈ మొదలుకుని డీఈఈ, ఏఈల వరకు అందరి ఫోన్లు బిజీ అని తప్ప సమాధానం రావడం లేదు. నెల్లూరు నగరంతో పాటు, పట్టణాల్లో విద్యుత్ కోతలు విధించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే మండల కేంద్రాలు, పట్టణాల్లో కరెంట్‌పై ఆధారపడి జీవిస్తున్న చిరు వ్యాపారులు కుదేలవుతున్నారు. వేసవి ప్రారంభంలోనే ఈ రకంగా ఎడా పెడా విద్యుత్ కోతలను విధిస్తుండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పట్టణాల్లో అధికారికంగా గంట, అనధికారికంగా మరో గంట కోత విధిస్తున్నారు. గ్రామాల్లో అయితే పగలంతా కరెంట్ ఉండటం లేదు. పల్లెల్లో ప్రజలకు కంటిపై కునుకు లేకుండాపోతోంది. ఈ కోతల వల్ల తాగునీటి పథకాలకు ఆటంకం ఏర్పడుతున్నది. మున్ముందు ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. భూగర్భ జలాలు అడుగంటుతుండటంతో మోటార్ల ద్వారా నీటిని తోడేందుకు విద్యుత్ వినియోగం పెరుగుతున్నది. మరోవైపు ఏసీల వినియోగం పెరుగుతుండటంతో విద్యుత్ డిమాండ్, సరఫరా మధ్య తీవ్ర వ్యత్యాసం ఉంటోందని అధికారులు పేర్కొంటున్నారు. అయితే నిర్దేశించిన కోతలతో పాటు అనధికారికంగా మరో 3 గంటలు కోతలను విధిస్తున్నారు. జిల్లా కేంద్రంలో 3 గంటలు, మున్సిపల్ పట్టణ కేంద్రాల్లో 4 గంటలు, మండల కేంద్రాల్లో 6 గంటలు అని అధికారులు చెబుతున్నా ఆచరణలో ఎమర్జెన్సీ కోతలు అంటూ అనధికారికంగా కోతలు విధిస్తున్నారు. జిల్లాలో బుధవారం మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో 10 గంటల పాటు ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. కరెంట్ కోతల కారణంగా పలు వ్యాపార సంస్థలు వెలవెలబోయాయి. జెరాక్సు షాపులు, జ్యూస్ సెంటర్లు, పిండి మిల్లులు, వెల్డింగ్ షాపులు, ఆటోనగర్ వర్క్‌షాపుల్లో ఎక్కడికక్కడ పనులు నిలిచిపోయాయి. పనులపై వచ్చిన వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత మంచినీటి ట్యాంకుల నుంచి తాగునీరు సరఫరా లేక ప్రజలు కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆస్పత్రుల్లో సైతం అత్యవసర సేవలు మినహా మిగిలిన అన్ని రకాల సేవలు నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
మళ్లీ కరెంట్ కోతలు
=నేటినుంచి అమలు =విజయవాడలో 2, బందరులో 3 గంటలు =మున్సిపాలిటీల్లో 4, మండల కేంద్రాల్లో 6 గంటలు విజయవాడ, న్యూస్‌లైన్ : జిల్లా వ్యాప్తంగా కరెంటు కోతలు గురువారం నుంచి మళ్లీ ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఏపీఎస్పీడీసీఎల్ ఆపరేషన్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. హైడల్ పవర్ జనరేషన్‌కు కావాల్సిన నీటి కొరత కారణంగా రాష్ట్రంలో అనేక థర్మల్ యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోవడంతో విద్యుత్ కోతల వేళల షెడ్యూల్‌ను రివైజ్ చేస్తున్నట్లు వివరించారు. ఈ విద్యుత్ కోతల సమయాలు గురువారం నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. విజయవాడ కార్పొరేషన్ పరిధిలో ఉదయం 7 గంటల నుంచి 8 వరకు, తిరిగి మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రెండు గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు. జిల్లా కేంద్రమైన మచిలీపట్నం మున్సిపాలిటీలో ఉదయం 6 గంటల నుంచి 7.30 వరకు, తిరిగి మధ్యాహ్నం 12 గంటల నుంచి 1.30 వరకు, ఇతర మున్సిపాలిటీలలో ఉదయం 6 గంటల నుంచి 8 వరకు, తిరిగి 12 గంటల నుంచి 2 వరకు కరెంట్ ఉండదని వివరించారు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ఉదయం 6 నుంచి 9 వరకు, తిరిగి మధ్యాహ్నం 12 నుంచి 3 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు.