మళ్లీ కోతలు షురూ.. | again current cuts | Sakshi
Sakshi News home page

మళ్లీ కోతలు షురూ..

Published Sun, Jun 22 2014 2:43 AM | Last Updated on Sat, Sep 2 2017 9:10 AM

మళ్లీ కోతలు షురూ..

మళ్లీ కోతలు షురూ..

- వానాకాలం మొదట్లోనే మొదలు..
- మండల కేంద్రాల్లో 2 గంటలు..
- సబ్‌స్టేషన్ పరిధిలోనూ 2గంటలు
- అధికారికంగా మరింత కోత

సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : కరెంట్ కోతలు మళ్లీ మొదలయ్యాయి. విభజన తర్వాత వానాకాలం మొదట్లోనే కరెంట్ కష్టాలు ఎదురవుతున్నాయి. ఉత్పత్తి తగ్గిందంటూ ప్రభుత్వం విద్యుత్ కోతలు విధించేందుకు అనుమతి ఇచ్చింది. కరీంనగర్ సర్కిల్‌లో శుక్రవారం నుంచి కోతలను అమలులో పెట్టింది. ప్రస్తుతం వ్యవసాయానికి విద్యుత్తు అవసరం కొంత మేరకే ఉంది.

అయినప్పటికీ ఉత్పత్తి తగ్గడంతో సరఫరా మెగావాట్లు తగ్గాయని, ట్రాన్స్‌కో నుంచి కోతలకు ఆదేశాలిచ్చారని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం గ్రామాలు, మండల కేంద్రాలు, సబ్‌స్టేషన్ పరిధిలోని ప్రాంతాల్లోని అన్ని వర్గాల కనెక్షన్లపై విద్యుత్ కోతలు విధిస్తున్నారు. గ్రామాల్లో అధికారికంగా ఆరు గంటలు కోత విధిస్తున్నట్లు అధికారులు చెబుతున్నా... అది ఏడు నుంచి 8 గంటలకు పైగా ఉంటుంది.
 
గ్రామాల్లో ఆరు గంటలు
జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో ఆరు గంటల విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారు. పలు సందర్భాల్లో రాత్రి కూడా సరఫరా నిలిపివేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యుత్ కోతను అమలు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే పలు కారణాలు, సరఫరాలో సాంకేతిక కారణాలు అంటూ రోజూ రాత్రిపూట గంటపాటు కోత విధిస్తున్నారు.

అంతేకాకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు పలుమార్లు ఎల్‌ఆర్ తీసుకుంటున్నారు. దీంతో గ్రామాల్లో అధికారిక కోత 6గంటలే అయినా... తీసేస్తుంది మాత్రం 8గంటల వరకు ఉంటుంది. ప్రతీసారీ విద్యుత్ కోతలకు గ్రామాలనే టార్గెట్ చేస్తున్న అధికారులు... ఈసారి కూడా పల్లెలపైనే పడ్డారు. ముందుగా పల్లెలకు విద్యుత్ సరఫరా ఆపేస్తున్నారు.  
 
పునఃప్రారంభం
వేసవి నుంచి విద్యుత్ సరఫరా కొంత మెరుగ్గానే ఉంది. రబీ తర్వాత వ్యవసాయ మోటర్లు నడవడం లేదని, జిల్లాకు కావాల్సిన విద్యుత్తు సరఫరా అవుతుందంటూ నిరంతర విద్యుత్ ఇచ్చారు. అయితే గ్రామాల్లో మాత్రం అనధికారికంగా గంటో, రెండు గంటలో కోత పెట్టినా... కొద్ది రోజులకే పరిమితం చేశారు. తాజాగా శుక్రవారం మళ్లీ కరెంట్ కోతలు మొదలుపెట్టారు. విద్యుత్ ఉత్పత్తి తగ్గిందని ఎమర్జెన్నీ లోడ్ రిలీఫ్ (ఈఎల్‌ఆర్) తీసుకుంటున్నారు.

మండలాల్లో 2గంటలు
 జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో 2 గంటల కోత విధిస్తున్నారు. రెండు రోజుల నుంచే కోతలు అమలు చేస్తున్నా... శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. అన్ని మండలాలు, డివిజన్లకు ఫోన్ సమాచారమిచ్చారు. మండల కేంద్రాల్లో అధికారికంగా 2గంటలు కోత పెడుతున్నా మరో గంటపాటు అడపాదడపా తీసేస్తున్నారు.

సబ్‌స్టేషన్ పరిధిలో 2 గంటలు
 జిల్లాలోని 226 సబ్‌స్టేషన్ కేంద్రాల్లో అధికారిక కోత 2 గంటలు పెడుతున్నారు. ఇక్కడ కూడా అధికారిక కోతకు అదనంగా 30నుంచి 50 నిమిషాలపాటు అనధికారికంగా సరఫరా నిలిపివేస్తున్నట్లు వినియోగదారులు ఆరోపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement