సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ఖరీఫ్ ఆరంభంలో కురిసిన చిరు జల్లుల అనంతరం వేసిన పంటలు ఆ తర్వాత వర్షాభావం, కరెంట్ కోతలతో చాలా వరకు దెబ్బతిన్నాయి. రైతుల పంటలను తగుల బెట్టే పరిస్థితి ఎదురైంది. ఖరీఫ్ సాగు రైతులకు అప్పులనే మిగల్చగా, సకాలంలో పంటరుణాలు ఇచ్చి ఆదుకోవాల్సిన బ్యాంకర్లు నిబంధనల పేరిట ఇబ్బందులకు గురి చేశారు. 25 శాతం రుణమాఫీ రైతులకు ఉపశమనం కలిగించలేదు.
ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కోసం ఐకేపీ, పీఏసీఎస్‌ల ద్వారా 287 కేంద్రాలను ఏర్పాటు చేయాలని ల క్ష్యంగా పెట్టుకోగా, 92 కేంద్రాలనే ఏర్పాటు చేశారు. 3,20,500 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 5,080 మె.టన్నులే కొనుగోలు చేశారు. దళారులు, రైసుమిల్లర్లు కొందరు రంగంలోకి దిగడంతో రైతులకు గిట్టుబాటు ధర అందని ద్రాక్షలా మారుతోంది.
ఊరట ఏదీ?
రుణమాఫీ రైతులకు ఊరట కలిగించలేదు. ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించేనాటికి 4,33,132 మంది రైతులు రూ.1863.65 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ రుణాలన్నింటినీ రద్దు చేస్తామని సర్కారు చెప్పినప్పటికీ, 25 శాతం మాత్రమే రుణాలను మాఫీ చేశారు. 1,26,539 మందికి చెందిన రూ.465.19 కోట్ల రుణాలు మొదటి విడతగా మాఫీ అయ్యాయి. 3,06,593 మంది రైతులకు చెందిన రూ.1,398.46 కోట్లు ఇంకా మాఫీ కావాల్సి ఉంది.
ఇదిలా వుంటే, వ్యవసాయ సీజన్ ప్రారంభానికి ము ందే ప్రభుత్వం రుణ ప్రణాళికలను సిద్ధం చేయాల్సి ఉంది. ఖరీఫ్‌లో 2,86,540 మంది రైతులకు రూ.1,300 కోట్లు పంట రుణాలుగా ఇవ్వాలని బ్యాంకులు లక్ష్యంగా పెట్టుకున్నాయి. అక్టోబర్ 15 నాటికి రూ.479.29 కోట్లు పంట రుణాలుగా ఇచ్చినట్లు రికార్డులు చెప్తున్నాయి. పంటల రుణాలను కనిష్టంగా, గరిష్టంగా ఎకరానికి ఇంత ఇవ్వచ్చన్న ప్రతిపాదనలను సైతం అక్కడక్కడ బ్యాంకర్లు పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. పంటలపై ఇచ్చే రుణ మొత్తం (స్కేల్ ఆఫ్ ఫైనాన్స్)విధానాన్ని పాటించలేదని రైతులు వాపోతున్నారు.
తగ్గిన వర్షపాతం
ఖరీఫ్‌లో సాధారణ సాగు లక్ష్యం 3,20,931 హెక్టార్లు కాగా, 3,10,679 హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేశారు. గతేడాదితో పోలిస్తే ఈ సారి జిల్లా సాధారణ వర్షపాతం 49.8 శాతం తగ్గిపోగా చెరువులు, కుంటలు ఎండిపోయి భూగర్భజలాలలో 10.37 మీటర్లకు పడిపోయాయి. 22,375 హెక్టార్లలో వరి, సోయాబీన్ పంటలు ఎండిపోగా, సుమారుగా పదివేల హెక్టార్ల వరకు రైతులు సోయా, వరి పంటలను తగులబెట్టారు.
శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టుల్లో నీటిమట్టం పూర్తిగా తగ్గిపోయింది. నిజాంసాగర్ ప్రాజెక్టు నీటి సామర్థ్యం 1405.00 అడుగులు. గతేడాది ప్రాజెక్టు జలకళతో ఉట్టిపడితే, ఈసారి నీటిమట్టం 1381.78 అడుగులకు పడిపోయింది. శ్రీరాంసాగర్‌లో గతేడాది ఇదే సీజన్‌లో రిజర్వాయర్ లెవెల్ 1091.00 అడుగులుంటే, ఈసారి 1067.40 అడుగులకు పడిపోయింది. గతేడాది ఇదే సీజన్ శ్రీరాంసాగర్‌లో 90.31 టీఎంసీల నీళ్లుంటే ప్రస్తుతం 24.28 టీఎంసీలే ఉన్నాయి. నిజాంసాగర్‌లో గతేడాది 17.80 టీఎంసీలుంటే ప్రస్తుతం1.67 టీఎంసీలకు పడిపోవడం ఆందోళన కల్గిస్తోంది.
కరెంట్ కోతలు, ఎండిపోయిన పంటలు, అప్పుల బాధలు భరించలేక మూడు నెలల వ్యవధిలో 21 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఖరీఫ్‌లో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కున్న రైతులు రబీసాగుపై అనాసక్తితో ఉన్నారు. రబీలో 1,78,684 హెక్టార్లు సాగు లక్ష్యం కాగా ఇప్పటి వరకు 6,877 హెక్టార్లలోనే పంటలు వేశారు. మొత్తంగా జిల్లాలో కరువు కరాళనృత్యం చేస్తుండగా.. కష్టాన్ని నమ్ముకున్న రైతులు కాడిని వదిలే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అన్నదాత అరిగోస
Published Mon, Nov 3 2014 3:04 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement
Advertisement