వరంగల్ ప్రధాన రహదారిపై పెట్రోల్ బాటిళ్లతో ఆందోళన చేస్తున్న రైతులు
నెక్కొండ: వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని కోరుతూ వరంగల్ జిల్లా నెక్కొండ మండలం పత్తిపాక గ్రామానికి చెందిన రైతులు నెక్కొండ–వరంగల్ (సూర్య సినిమా థియేటర్) రహదారిపై పెట్రోల్ బాటిళ్లతో ఆది వారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఆ గ్రామ రైతులు మాట్లాడుతూ...వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో అధికారులు మాత్రం వ్యవసాయానికి పగటిపూట విద్యుత్ సరఫరా చేయడం లేదని మండిపడ్డారు.
విద్యుత్ అంతరాయంతో పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు విద్యుత్ అధికారులకు చెప్పినా ఫలితం లేదని వాపోయారు. విద్యుత్ సక్రమంగా సరఫరా కాకపోవడం, అప్రకటిత కోతల కారణంగా విద్యుత్ మోటార్లు, స్టార్టర్లు కాలిపోతున్నాయన్నారు. రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న చెన్నారావుపేట ఎస్సై(ఇన్‌చార్జ్) మహేందర్ సంఘటన స్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. రైతుల సమస్యలను విద్యుత్‌శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అధికారుల సూచనలు, ఎస్సై హామీతో రైతులు ఆందోళన విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment