సాక్షి, అమరావతి: ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక కింద 80% సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు రబీ కోసం సిద్ధమవుతున్న రైతులకు అవసరమైన విత్తనాల సరఫరాపై దృష్టి సారించింది. ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ ద్వారా సరి్టఫై చేసిన నాణ్యమైన విత్తనాలను ఆర్బీకేల ద్వారా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. తొలుత సెప్టెంబర్ 15వ తేదీ నుంచి శనగ విత్తనాలు, అక్టోబర్ ఒకటో తేదీ తర్వాత మిగిలిన విత్తనాలు పంపిణీ చేయనున్నారు.
వచ్చే రబీలో 57.50 లక్షల ఎకరాల్లో పంటలు సాగును వ్యవసాయ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధానంగా 20.5 లక్షల ఎకరాల్లో వరి, 10.92 లక్షల ఎకరాల్లో శనగ, 8.25 లక్షల ఎకరాల్లో మినుము, 5.37 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 2.57 లక్షల ఎకరాల్లో జొన్నలు సాగవుతాయని అంచనా వేశారు. ఆ మేరకు విత్తనాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఖరీఫ్ సాగుకు దూరంగా ఉన్న రైతులు ముందస్తు రబీకి సిద్ధమవుతుండడంతో అందుకు తగినట్లుగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
3.98 లక్షల క్వింటాళ్ల విత్తనాలు సిద్ధం
రబీ 2022–23లో 2,83,672 క్వింటాళ్ల విత్తనాలను సిద్ధం చేయగా రైతులు 1,78,818 లక్షల క్వింటాళ్ల విత్తనాలను తీసుకున్నారు. రానున్న రబీ సీజన్ కోసం 3.98 లక్షల క్వింటాళ్ల విత్తనాలను ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ సిద్ధం చేస్తోంది. గత రబీలో 1,26,656 క్వింటాళ్ల శనగ విత్తనాలను సిద్ధం చేయగా, 1.15 లక్షల క్వింటాళ్ల విత్తనాలను రైతులు తీసుకున్నారు.
వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్‌కు దూరంగా ఉన్న రైతులు ముందస్తు రబీలో శనగ సాగుకు మొగ్గు చూపుతుండడంతో ఈసారి 3.40 లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాలను సిద్ధం చేస్తున్నారు. ఆ తర్వాత సాగయ్యే పంటలకు సంబంధించి క్షేత్రస్థాయి నుంచి వచ్చిన ఇండెంట్ మేరకు 36,121 క్వింటాళ్ల వరి, 14,163 క్వింటాళ్ల మినుము, 4,353 క్వింటాళ్ల పెసలు, 2,064 క్వింటాళ్ల పచ్చిరొట్ట, 727 క్వింటాళ్ల వేరుశనగ, 502 క్వింటాళ్ల చిరుధాన్యాలు, 142 క్వింటాళ్ల కంది విత్తనాలు అవసరమని గుర్తించి ఈ మేరకు వాటి పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు.
సెప్టెంబర్ 15 నుంచి నమోదు, పంపిణీ
ఏటా అక్టోబర్ 1 నుంచి రైతుల వివరాలు నమోదుచేసుకుని, 15 నుంచి పంపిణీ మొదలుపెడతారు. కానీ ఈసారి సెప్టెంబర్ 15 నుంచే విత్తన పంపిణీకి సన్నాహాలు చేస్తున్నారు. తొలుత శనగ విత్తనాలను, తర్వాత వరితో సహా మిగిలిన వాటిని స్థానిక డిమాండ్‌ను బట్టి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రైతుల నుంచి సేకరించిన విత్తనాలతో పాటు ప్రైవేటు కంపెనీల నుంచి సేకరించే విత్తనాలను సైతం అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్‌లో పరీక్షించి సర్టిఫై చేసిన తర్వాత ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచనున్నారు.
పంపిణీకి రబీ విత్తనాలు సిద్ధం
ముందస్తు రబీకి సిద్ధమవుతున్న రైతులకు అవసరమైన విత్తనాల సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నాం. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఒక్క రైతు కూడా ఇబ్బందిపడకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నాం. 3.98 లక్షల క్వింటాళ్ల విత్తనాలు సిద్ధం చేశాం. వీటిలో 3.40 లక్షల క్వింటాళ్ల శనగ విత్తనాలను పొజిషన్ చేస్తున్నాం.
– డాక్టర్ గెడ్డం శేఖర్‌బాబు, ఎండీ, ఏపీ విత్తనాభివృద్ధిసంస్థ
ముందస్తు రబీకి ముమ్మర కసరత్తు
Published Sat, Sep 9 2023 2:28 AM | Last Updated on Sat, Sep 9 2023 2:28 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment