seeds distribution
-
ముందస్తు రబీకి ముమ్మర కసరత్తు
సాక్షి, అమరావతి: ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక కింద 80% సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు రబీ కోసం సిద్ధమవుతున్న రైతులకు అవసరమైన విత్తనాల సరఫరాపై దృష్టి సారించింది. ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ ద్వారా సరి్టఫై చేసిన నాణ్యమైన విత్తనాలను ఆర్బీకేల ద్వారా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. తొలుత సెప్టెంబర్ 15వ తేదీ నుంచి శనగ విత్తనాలు, అక్టోబర్ ఒకటో తేదీ తర్వాత మిగిలిన విత్తనాలు పంపిణీ చేయనున్నారు. వచ్చే రబీలో 57.50 లక్షల ఎకరాల్లో పంటలు సాగును వ్యవసాయ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధానంగా 20.5 లక్షల ఎకరాల్లో వరి, 10.92 లక్షల ఎకరాల్లో శనగ, 8.25 లక్షల ఎకరాల్లో మినుము, 5.37 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 2.57 లక్షల ఎకరాల్లో జొన్నలు సాగవుతాయని అంచనా వేశారు. ఆ మేరకు విత్తనాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఖరీఫ్ సాగుకు దూరంగా ఉన్న రైతులు ముందస్తు రబీకి సిద్ధమవుతుండడంతో అందుకు తగినట్లుగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. 3.98 లక్షల క్వింటాళ్ల విత్తనాలు సిద్ధం రబీ 2022–23లో 2,83,672 క్వింటాళ్ల విత్తనాలను సిద్ధం చేయగా రైతులు 1,78,818 లక్షల క్వింటాళ్ల విత్తనాలను తీసుకున్నారు. రానున్న రబీ సీజన్ కోసం 3.98 లక్షల క్వింటాళ్ల విత్తనాలను ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ సిద్ధం చేస్తోంది. గత రబీలో 1,26,656 క్వింటాళ్ల శనగ విత్తనాలను సిద్ధం చేయగా, 1.15 లక్షల క్వింటాళ్ల విత్తనాలను రైతులు తీసుకున్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్‌కు దూరంగా ఉన్న రైతులు ముందస్తు రబీలో శనగ సాగుకు మొగ్గు చూపుతుండడంతో ఈసారి 3.40 లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాలను సిద్ధం చేస్తున్నారు. ఆ తర్వాత సాగయ్యే పంటలకు సంబంధించి క్షేత్రస్థాయి నుంచి వచ్చిన ఇండెంట్ మేరకు 36,121 క్వింటాళ్ల వరి, 14,163 క్వింటాళ్ల మినుము, 4,353 క్వింటాళ్ల పెసలు, 2,064 క్వింటాళ్ల పచ్చిరొట్ట, 727 క్వింటాళ్ల వేరుశనగ, 502 క్వింటాళ్ల చిరుధాన్యాలు, 142 క్వింటాళ్ల కంది విత్తనాలు అవసరమని గుర్తించి ఈ మేరకు వాటి పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్ 15 నుంచి నమోదు, పంపిణీ ఏటా అక్టోబర్ 1 నుంచి రైతుల వివరాలు నమోదుచేసుకుని, 15 నుంచి పంపిణీ మొదలుపెడతారు. కానీ ఈసారి సెప్టెంబర్ 15 నుంచే విత్తన పంపిణీకి సన్నాహాలు చేస్తున్నారు. తొలుత శనగ విత్తనాలను, తర్వాత వరితో సహా మిగిలిన వాటిని స్థానిక డిమాండ్‌ను బట్టి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రైతుల నుంచి సేకరించిన విత్తనాలతో పాటు ప్రైవేటు కంపెనీల నుంచి సేకరించే విత్తనాలను సైతం అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్‌లో పరీక్షించి సర్టిఫై చేసిన తర్వాత ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచనున్నారు. పంపిణీకి రబీ విత్తనాలు సిద్ధం ముందస్తు రబీకి సిద్ధమవుతున్న రైతులకు అవసరమైన విత్తనాల సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నాం. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఒక్క రైతు కూడా ఇబ్బందిపడకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నాం. 3.98 లక్షల క్వింటాళ్ల విత్తనాలు సిద్ధం చేశాం. వీటిలో 3.40 లక్షల క్వింటాళ్ల శనగ విత్తనాలను పొజిషన్ చేస్తున్నాం. – డాక్టర్ గెడ్డం శేఖర్‌బాబు, ఎండీ, ఏపీ విత్తనాభివృద్ధిసంస్థ -
ఏపీకి ‘స్కోచ్’ అవార్డుల పంట
సాక్షి, అమరావతి: ఆంద్రప్రదేశ్‌కు స్కోచ్ అవార్డుల పంట పండింది. స్కోచ్ గ్రూప్ 78వ ఎడిషన్‌లో భాగంగా జాతీయ స్థాయిలో గురువారం ప్రకటించిన అవార్డుల్లో అత్యధిక అవార్డులు ఏపీని వరించాయి. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి 113 నామినేషన్స్ రాగా, గతంలో ఎన్నడూ లేని విధంగా వివిధ కేటగిరిల్లో 5 గోల్డ్, 5 సిల్వర్ స్కోచ్ మెడల్స్ రాష్ట్రానికి దక్కాయి. ఢిల్లీ నుంచి గురువారం నిర్వహించిన వెబినార్‌లో స్కోచ్ గ్రూప్ ఎండీ గురుషరన్‌దంజల్ ఈ అవార్డులను ప్రకటించారు. సంక్షేమ పథకాలకు బంగారు స్కోచ్‌లు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా మహిళలను తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాలకు గోల్డ్ స్కోచ్‌లు వరించాయి. అదే విధంగా మత్స్య ఉత్పత్తుల స్థానిక వినియోగాన్ని పెంచే లక్ష్యంతో మత్స్యశాఖ ఇటీవల ప్రారంభించిన ‘ఫిష్ ఆంధ్రా’కు డొమెస్టిక్ ఫిష్ మార్కెటింగ్ కేటగిరిలో గోల్డ్ స్కోచ్ దక్కింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎన్నికలనాటికి డ్వాక్రా సంఘాలకున్న అప్పును వైఎస్సార్ ఆసరా పథకం కింద నాలుగు విడతల్లో వారి ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది. అదేవిధంగా 45–60 ఏళ్ల మధ్య వయస్సులో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు వైఎస్సార్ చేయూత పథకం కింద ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేలు అందిస్తోంది. మత్స్య ఉత్పత్తుల స్థానిక వినియోగం కనీసం 30 శాతం పెంచే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 70 ఆక్వా హబ్‌లను, వాటికి అనుబంధంగా 14 వేలకుపైగా రిటైల్ అవుట్‌లెట్స్‌ను తీసుకొస్తోంది. ప్రయోగాత్మకంగా పులివెందులలో ఆక్వాహబ్తో పాటు 100కు పైగా రిటైల్ అవుట్‌లెట్స్ ఇటీవలే అందుబాటులోకి వచ్చాయి. సంక్షోభంలో ఉన్న చేనేత కార్మికులకు అండగా నిలిచేందుకు వైఎస్సార్ నేతన్న నేస్తం కింద ఒక్కో కుటుంబానికి ఏటా రూ.24 వేల చొప్పున అందిస్తోంది. ఈ పథకాన్ని అత్యంత సమర్ధవంతంగా అమలుచేస్తోన్న అనంతపురం జిల్లాకు గోల్డ్ స్కోచ్ అవార్డు దక్కింది. ఇక గిరిజన ప్రాంతాల్లో బలవర్ధకమైన వరి (రైస్ ఫోర్టిఫికేషన్) సాగు చేస్తోన్న విజయనగరం జిల్లాకు గోల్డ్ స్కోచ్ వరించింది. ఐదు విభాగాల్లో సిల్వర్ మెడల్స్ డొమెస్టిక్ ఫిష్ మార్కెటింగ్‌లో గోల్డ్‌మెడల్ దక్కించుకున్న మత్స్యశాఖ ఈ–ఫిష్ విభాగంలో సిల్వర్ మెడల్ సొంతం చేసుకుంది. ఈ–క్రాప్ తరహాలోనే ఆక్వా సాగును గుర్తించేందుకు తీసుకొచ్చిన ఈ–ఫిష్ యాప్‌తో పాటు పశువైద్యాన్ని పాడిరైతుల ముంగిటకు తీసుకెళ్లే లక్ష్యంతో పశుసంవర్ధక శాఖ తీసుకొచ్చిన పశుసంరక్షక్ యాప్‌కు సిల్వర్ స్కోచ్ అవార్డులు వరించాయి. ఆర్బీకేల ద్వారా సకాలంలో సబ్సిడీపై విత్తనాలు అందిస్తూ రైతుసంక్షేమం కోసం పాటు పడుతున్న ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థ (ఏపీ సీడ్స్)కు సిల్వర్ స్కోచ్ దక్కింది. కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలను అత్యంత పారదర్శకంగా ప్రజల ముంగిటకు తీసుకెళ్తున్న గ్రామ, వార్డు సచివాలయాల విభాగానికి సిల్వర్ స్కోచ్ వరించింది. ఇక.. బయోవిలేజ్, నేచురల్ ఫార్మింగ్ విభాగంలో విజయనగరం జిల్లాకు సిల్వర్ స్కోచ్ దక్కింది. ఈ అవార్డులను వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, ఏపీ సీడ్స్ ఎండీ గెడ్డం శేఖర్‌బాబు, మత్స్యశాఖ కమిషనర్ కన్నబాబు, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ ఆర్ అమరేంద్రకుమార్, సెర్ప్ సీఈవో ఇంతియాజ్‌లతో పాటు విజయనగరం, అనంతపురం జిల్లా కలెక్టర్లు అందుకున్నారు. చదవండి: ('చంద్రబాబు నీకు జీవితకాలం టైం ఇస్తున్నా.. దమ్ముంటే నా ఛాలెంజ్ తీసుకో') -
17 నుంచి రైతులకు విత్తనాలు
సాక్షి, అమరావతి: ఖరీఫ్ సీజన్లో వివిధ పంటలకు సంబంధించి 7.12 లక్షల క్వింటాళ్ల విత్తనాలను ఈ నెల 17వ తేదీ నుంచి రైతులకు సరఫరా చేయనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. వ్యవసాయ పనులు, సరుకుల రవాణాకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉన్నందున పూర్తి జాగ్రత్తలతో చేసుకోవాలని సూచించారు. ఖరీఫ్‌కు పూర్తి సన్నద్ధంగా ఉండాలని, రైతులకు ఇచ్చే విత్తనంతో పాటు ప్రతి ఒక్కటీ నాణ్యతగా ఉండాలని, ఇది మనం వారికి ఇచ్చిన హామీ అని స్పష్టం చేశారు. కోవిడ్ సమయంలో ఉపాధి హామీ పథకం కింద జూన్ చివరిలోగా ప్రతి జిల్లాల్లో తప్పనిసరిగా కోటి పని దినాలు పూర్తి చేయాలని ఆదేశించారు. స్పందనలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పలు అంశాలపై అధికార యంత్రాంగానికి మార్గనిర్దేశం చేశారు. సీఎం సమీక్ష వివరాలు ఇవీ.. చెక్ చేయండి... గ్రామాల్లో రైతులకు అండగా ఉండేలా 10,778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. కలెక్టర్లు, జేసీలు ఆర్బీకేలను ఓన్ చేసుకుని రైతులకు సేవలందించాలి. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, స్టాక్ పాయింట్స్ ఒకసారి చెక్ చేసుకోండి. వ్యవసాయ సలహా కమిటీలు... ప్రతి జిల్లాలో నీటి పారుదల సలహా బోర్డుల సమావేశాలు నిర్వహించాలి. వ్యవసాయ సలహా కమిటీలు వెంటనే అన్ని చోట్ల ఏర్పాటు కావాలి. పంటల ప్లానింగ్ మొదలు ప్రతి అడుగులో ఈ కమిటీలు రైతులతో కలిసి పని చేయాలి. అవసరమైతే రైతులకు ప్రత్యామ్నాయ పంటలు కూడా ఆ కమిటీలు చూపాలి. రూ.1.13 లక్షల కోట్ల పంట రుణాలు టార్గెట్. అది సాధించాలంటే జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశాలు జరగాలి. అప్పుడే పంటల రుణాల పంపిణీ పక్కాగా ఉంటుంది. ప్రతి జిల్లాలో కోటి పనిదినాలు కోవిడ్ సమయంలో ఉపాధి హామీ పనులు చాలా ముఖ్యం. మనకు ఈ ఏడాది 20 కోట్ల పని దినాలు మంజూరయ్యాయి. వచ్చే నెల చివరిలోగా 16 కోట్ల పని దినాలు పూర్తి చేయాలన్నది మన లక్ష్యం. ఇప్పటి వరకు 4.57 కోట్ల పని దినాల కల్పన మాత్రమే జరిగింది. జూన్ చివరిలోగా ప్రతి జిల్లాలో తప్పనిసరిగా కోటి పని దినాలు పూర్తి చేయాలి. తొలి విడతలో 15.60 లక్షల ఇళ్లు.. వైఎస్సార్–జగనన్న కాలనీల్లో ఎట్టి పరిస్థితులలోనూ ఇళ్ల నిర్మాణ పనులు జూన్ 1న ప్రారంభం కావాలి. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా తొలి విడతలో 15.60 లక్షల ఇళ్లు మంజూరు చేశాం. తొలి విడత ఇళ్లలో 14.89 లక్షల ఇళ్లకు సంబంధించి ఇప్పటికే మంజూరు పత్రాలు జారీ చేశాం. మిగిలినవి కోర్టు వివాదాల్లో ఉన్నందున ప్రత్యామ్నాయ నివేదికలను పీఎంఏవైకి పంపించాం. వాటికి సంబంధించి వచ్చే నెలలోగా అనుమతి వచ్చే వీలుంది. ఇళ్ల నిర్మాణాల సన్నాహక పనులను ఈనెల 25వ తేదీలోగా కలెక్టర్లు తప్పనిసరిగా పూర్తి చేయాలి. ఇళ్ల నిర్మాణం వల్ల ఆర్థిక పురోగతి (ఎకానమీ బూస్టప్) మాత్రమే కాకుండా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అన్ని రంగాలు, వృత్తుల వారికి ఉపాధి దొరుకుతుంది. 8,679 లేఅవుట్లలో నీటి సదుపాయాన్ని డిస్కమ్‌లు, గ్రామీణ నీటి సరఫరా విభాగాలతో సమన్వయం చేసుకుని ఈనెల 31లోగా పూర్తి చేయాలి. ఎక్కడైనా నోడల్ అధికారుల నియామకం జరగకపోతే ఈనెల 15లోగా పూర్తి చేయాలి. నిరాటంకంగా ఇళ్ల నిర్మాణం జరిగేందుకు తగినంత ఇసుక అందుబాటులో ఉండేలా చూడాలి. ఇళ్ల స్థలాలు.. ఇళ్ల స్థలాలకు సంబంధించి కొత్తగా 1,19,053 అర్హులైన లబ్ధిదారులను గుర్తించాం. ఇంకా 98,834 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వారిలో కూడా అర్హులను గుర్తించండి. 10,752 మందికి ఇప్పటికే ఉన్న లేఅవుట్లలో, మరో 1,520 మందికి కొత్త లేఅవుట్లలో ఇళ్ల స్థలాలు ఇచ్చే వీలుంది. ఇక మిగిలిన 1,06,781 మందికి సంబంధించి భూసేకరణ జరగాలి. వీలైనంత త్వరగా ఇళ్ల స్థలాలు ఇచ్చేలా చొరవ చూపండి. వేగంగా భవన నిర్మాణాలు.. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల భవనాలు, వైఎస్సార్ గ్రామీణ, పట్టణ హెల్త్ క్లినిక్‌ల నిర్మాణాలు, ఏఎంసీయూ, బీఎంసీయూల నిర్మాణాలను, నాడు–నేడు కింద అంగన్ వాడీ కేంద్రాల నిర్మాణాలను, ఆధునీకరణ పనులను పూర్తి చేయడంపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలి. ఈ నెలలో అందించే సాయం ► మే 13న వైఎస్సార్ రైతు భరోసా కింద రైతులకు రూ.7,500 చొప్పున ఖాతాల్లో జమ. ఖరీఫ్‌లో సాగు పెట్టుబడి కింద సాయం. ► మే 25న ఖరీఫ్–2020కి సంబంధించిన రైతులకు క్రాప్ ఇన్సూరెన్సు చెల్లింపు. ► మే 18న వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద మత్స్యకారులకు రూ.10 వేల చొప్పున సహాయం (చేపలవేట నిషేధ సాయం) ఆ ఏడు.. చాలా ముఖ్యం స్పందన కార్యక్రమం ద్వారా సమస్యలు, ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలి. లేకపోతే మనం ఆ సమయం నిర్దేశించుకుని ఏం ప్రయోజనం? గత ఏడాది జూన్ 9 నుంచి ఈనెల 10వ తేదీ వరకు స్పందనలో 2,25,43,894 ఫిర్యాదులు, అర్జీలు రాగా 85 శాతం సకాలంలో పరిష్కరించగలిగాం. ఆరోగ్యశ్రీ కార్డులు, బియ్యం కార్డులు, పెన్షన్ కార్డులు. శానిటేషన్, వీధి దీపాలు, తాగు నీటితో పాటు ఇంటి స్థలం.. ఈ ఏడు మనకు చాలా ముఖ్యం. -
సబ్సిడీపై రైతులకు వేరుశనగ విత్తనాల పంపిణీ: కన్నబాబు
సాక్షి, విజయవాడ : సబ్సిడీపై రైతులకు వేరుశనగ విత్తనాలు పంపిణీ చేస్తామని, ఈనెల 10 నుంచి రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చునని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ఈనెల 17 నుంచి రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు పంపిణీ చేస్తామన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘జూన్ 17 నాటికి వేరుశనగ విత్తనాలు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. సీఎం అదేశాలకు అనుగుణంగా విత్తనాల పంపిణీకి ప్రణాళిక సిద్ధం చేశాం. రైతుల నుండే విత్తనాలు తీసుకుని ప్రాసెసింగ్ చేసి మళ్లీ రైతులకు అందిస్తున్నాం. సీఎం జగన్ ఆదేశాలతో ఈ పద్ధతిని అమలు చేస్తున్నాం. గత ఏడాది విత్తనాల పంపిణీని గ్రామ స్థాయి నుండి ప్రారంభించాం. ఈ ఏడాది మరింత సమర్థవంతంగా విత్తనాలు పంపిణీ చేస్తాం. విత్తనాల కోసం రైతులు రోడ్డెక్కి గంటల తరబడి ఎండలో నిలబడే పరిస్థితి గతంలో ఉండేది. సీఎం జగన్ ఆలోచనలతో రైతులకు ఇబ్బంది లేకుండా గ్రామాల్లోనే పంపిణీ చేస్తున్నా’’మన్నారు. -
దళారులకు మంగళం.. రైతుకు రొక్కం
సాక్షి ప్రతినిధి, తిరుపతి/మదనపల్లె: దళారులకు మంగళం పాడి.. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. రైతన్నలకు వెన్నుదన్నుగా నిలిచేలా గ్రామ సచివాలయాల పరిధిలో రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ప్రతి గ్రామ సచివాలయం పరిధిలో 10 సంఘాలకు తగ్గకుండా.. ఒక్కో సంఘంలో 15నుంచి 19 మంది రైతులు సభ్యులుగా ఉండేలా కార్యాచరణ అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే చిత్తూరు జిల్లాలోని 14 మండలాల్లో ఏపీ మాస్ (మహిళా అభివృద్ధి సొసైటీ) ఆధ్వర్యంలో రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్‌పీవోలు) ఏర్పాటయ్యాయి. 14 రైతు ఉత్పత్తిదారుల సంఘాలను కలిపి ‘మదనపల్లె టమాటా ఫార్మర్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్ (ఎం.టమాటా) పేరుతో ఓ కంపెనీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అన్నదాతలకు వెన్నుదన్నుగా.. జర్మనీకి చెందిన గ్రీన్ ఇన్నోవేషన్ సెంటర్ (జీఐసీ) ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో టమాటా సాగులో ఖర్చుల్ని తగ్గించడం.. ఉత్పత్తి, ఆదాయం పెంచడమే లక్ష్యంగా చిత్తూరు జిల్లాలో ఏపీ మాస్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. గ్రామాల్లో రైతు సంఘాలు, పంచాయతీ స్థాయిలో సమాఖ్య, మండల స్థాయిలో రైతు ఉత్పత్తి సంఘాలు (ఎఫ్‌పీవోలు)గా ప్రభుత్వం రిజిస్టర్ చేయించింది. 14 మండలాల్లోని ఎఫ్‌పీవోలతో కలిపి ‘ఎం–టమాటా’ కంపెనీగా 2019 ఫిబ్రవరి 28న రిజిస్టర్ అయ్యింది. ఇందులో 10 వేల మంది రైతులు వాటాదారులుగా(షేర్ హోల్డర్స్) ఉన్నారు. అప్పటినుంచి టమాటా సాగులో ఉత్తమ యాజమాన్య పద్ధతులను పరిచయం చేస్తూ సంస్థ కార్యకలాపాలను విస్తరించుకుంటూ ముందుకు సాగుతోంది. రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా ప్రోత్సహించడమే కాకుండా పంట పెట్టుబడులకు తక్కువ వడ్డీకే రుణాలిస్తోంది. నాణ్యమైన విత్తనాల పంపిణీ చేస్తూ పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. మండల స్థాయిలోని ఎఫ్‌పీవోలకు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందించేలా లైసెన్స్‌లు ఇప్పించి కస్టమ్ హైరింగ్ సెంటర్ల ద్వారా వ్యవసాయానికి సంబంధించిన అన్ని పనులకు తోడ్పాటు అందిస్తోంది. ఎఫ్‌పీవోలు నూతన వ్యవసాయ విధానాలపై రైతులకు అవగాహన పెంచేందుకు పొలం బడులు, రాత్రిపూట సమావేశాలు నిర్వహిస్తాయి. ప్రదర్శన క్షేత్రాలను నిర్వహించడంతోపాటు ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి లాభసాటి పంటల సాగుకు సంబంధించిన పరిజ్ఞానాన్ని అందిస్తాయి. పెట్టుబడులను తగ్గించి, భూసారాన్ని పరిరక్షించేందుకు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గిస్తూ సేంద్రియ వ్యవసాయాన్ని, లాభసాటి పంటలను ప్రోత్సహిస్తుంది. వ్యవసాయ ఉత్పాదకాలను రైతుకు తక్కువ ధరలకు అందించడంతో పాటు పండించిన ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునేందుకు సహకారాన్ని అందిస్తాయి. రైతుల మధ్య పరస్పర సహకారాన్ని, సఖ్యతను పెంపొందించి ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పాటు చేస్తాయి. లాక్డౌన్ సమయంలో.. ఎం–టమాటా కంపెనీ ఆధ్వర్యంలోని రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్‌పీవో) రామసముద్రం, పలమనేరు, వి.కోట, మదనపల్లె, నిమ్మనపల్లె, కురబలకోట, కలికిరి, వాల్మీకిపురం మండలాల్లో సభ్య రైతుల నుంచి టమాటాలను కొనుగోలు చేసి మంచి ధర వచ్చేలా చూసింది. లాక్డౌన్ సమయంలో రైతులకు అండగా నిలిచేందుకు 2020 ఏప్రిల్ 9న కొనుగోళ్లు ప్రారంభించి మే 10 వరకు 1,997 మెట్రిక్ టన్నుల టమాటాలను గుడిపాలలోని ఫుడ్స్ అండ్ ఇన్, కర్ణాటకలోని శ్రీనివాసపురం సన్సిప్ అగ్రి ప్రొడక్టŠస్ ప్రాసెసింగ్ కంపెనీలకు సరఫరా చేసింది. నిమ్మనపల్లె, రామసముద్రం, పలమనేరు, వి.కోట, మదనపల్లె ఎఫ్‌పీవోలకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యాన శాఖ ద్వారా రాష్ట్రీయ వికాస్ యోజన (ఆర్కేవీవై) పథకం కింద 75 శాతం సబ్సిడీపై టమాటా రవాణా కోసం రూ.14 లక్షల విలువ చేసే ఐషర్ వాహనాలను సమకూర్చింది. ఇందుకోసం ఐదు ఎఫ్‌పీవోలకు రూ.5 లక్షల చొప్పున ఈక్విటీ గ్రాంట్‌గా ప్రభుత్వం మంజూరు చేసింది. ఒక్కొక్క ఎఫ్‌పీవోకు 50 శాతం సబ్సిడీపై 1,000 క్రేట్లను అందించింది. పంటలో కలుపు తీయడానికి వినియోగించే 17 పవర్ వీడర్స్‌ను 50 శాతం సబ్సిడీతో నిమ్మనపల్లె, మదనపల్లె, పలమనేరు, రామసముద్రం ఎఫ్‌పీవోలకు మంజూరు చేసింది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో నిమ్మనపల్లె ఎఫ్‌పీవో రూ.2 కోట్లు, మర్యాదరామన్న పట్నం ఎఫ్‌పీవో రూ.1.20 కోట్లు, రామసముద్రం ఎఫ్‌పీవో రూ.60 లక్షలు, వి.కోట ఎఫ్‌పీవో రూ.60 లక్షలు, వాల్మీకిపురం ఎఫ్‌పీవో రూ.35 లక్షలు, కురబలకోట ఎఫ్‌పీవో రూ.40 లక్షలకు పైగా వ్యాపార లావాదేవీలు నిర్వహించాయి. వ్యవసాయానికి కొత్తరూపు వచ్చింది పెట్టుబడి ఖర్చులు తగ్గించేందుకు అధికారుల సలహాలు, సూచనలతో చేస్తున్న వ్యవసాయం నేడు కొత్తరూపు సంతరించుకుంటోంది. మంచి దిగుబడులు, పెరుగుతున్న ఆదాయంతో రైతులు సంతృప్తి చెందుతున్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న ప్రయోజనాలు, అందిస్తున్న సహాయం అండగా నిలుస్తోంది. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు రైతుకు వెన్నుదన్నుగా ఉంటాయనడంలో సందేహం లేదు. – కృష్ణరాధ, అధ్యక్షురాలు, మర్యాదరామన్న పట్నం ఎఫ్‌పీవో -
సబ్సిడీ వర్తించని రైతులకూ విత్తనాలు
సాక్షి, అమరావతి: సబ్సిడీ వర్తించని రైతులకు సైతం రైతు భరోసా కేంద్రం (ఆర్బీకే)ల నుంచే అన్ని రకాల విత్తనాలను సరఫరా చేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇందుకు తగిన ఏర్పాట్లను రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చేసింది. సబ్సిడీపై ఇచ్చే విత్తనాల పంపిణీ ఇప్పటికే పూర్తయింది. అయితే ప్రభుత్వ సబ్సిడీ వర్తించని రైతుల నుంచి వస్తున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పూర్తి ధరకు ఆర్బీకేల నుంచి విత్తనాలు తెప్పించుకునేలా ఏర్పాట్లు చేసింది. సబ్సిడీపై తీసుకున్నా ఇంకా అదనంగా విత్తనాలు కావాల్సిన వారు సైతం పూర్తి ధరకు తీసుకోవచ్చు. ఆర్బీకేల్లోని కియోస్క్‌లు లేదా గ్రామ వ్యవసాయ సహాయకుల ద్వారా విత్తనాలను ఆర్డర్ చేసుకుంటే 48 గంటల్లో రైతు ఇంటి ముంగిటకే విత్తనాలు వస్తాయని ఏపీ సీడ్స్ ఎండీ శేఖర్ బాబు తెలిపారు. ► ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచి గ్రామస్థాయిలో పలు రకాల విత్తన పంపిణీ ప్రారంభమైంది. ► విత్తనాలను రైతుల ఇళ్ల వద్దే పంపిణీ చేసేలా ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ఏర్పాట్లు చేసింది. ► నాణ్యమైన విత్తనాలను సబ్సిడీ వర్తించని రైతాంగానికి పూర్తి ధరకు ఆర్బీకేల వద్ద పంపిణీ చేయాలని సంకల్పించింది. ► జీలుగ, జనుము వంటివి 5, 10, 25 కిలోల పరిమాణంలో, పిల్లిపెసర 4, 8, 20 కిలోల సైజులో, వడ్లను (వరి) 10, 20, 25, 30 కిలోల సంచుల్లో ప్యాకింగ్ చేశారు. ► రైతులు తమకు ఎన్ని కావాలంటే అన్ని విత్తనాలు కొనుగోలు చేయవచ్చు. ► కరోనా నిరోధక చర్యల్లో భాగంగా కొన్ని ఆంక్షలున్నప్పటికీ విత్తన రవాణాకు ఎటువంటి ఆటంకం లేకుండా ఏపీ సీడ్స్ ఏపీఎస్ఆర్టీసీతో ఒప్పందం కుదుర్చుకుని విత్తనాన్ని గ్రామాలకు తరలించింది. ఏడాదిలోనే రూ.4,800 కోట్లు ఆదా ► మాజీ సీఎం చంద్రబాబు విద్యుత్ రంగంలో సంస్కరణలను చేయాల్సిన రీతిలో చేయకపోవడం వల్ల అవి విద్యుత్ సంస్థలకు గుదిబండగా మారాయి. ► రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీ జెన్కో, ట్రాన్స్‌కో, డిస్కమ్‌లలో పరిస్థితులను చక్కదిద్దుతున్నాం. అంతర్జాతీయ ఒప్పందాలను ఎక్కడా ఉల్లంఘించడం లేదు. కేంద్రం సూచనల వల్ల, కోర్టుల్లో కేసులు ఉండటం వల్ల టీడీపీ సర్కార్ కుదుర్చుకున్న పీపీఏలను సమీక్షించ లేకపోతున్నాం. ► బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకే దొరుకుతున్న విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నాం. బొగ్గును రివర్స్ టెండరింగ్ ద్వారా కొనుగోలు చేస్తున్నాం. 2018–19లో విద్యుత్ సంస్థలు రూ.48,100 కోట్లు ఖర్చు చేస్తే.. 2019–20లో రూ.43,300 కోట్లు ఖర్చు చేశాం. అంటే.. ఒక్క ఏడాదిలోనే రూ.4,800 కోట్లను ఆదా చేశాం. ► పగటి పూటే రైతులకు 9 గంటల విద్యుత్‌ను సరఫరా చేసేందుకు పది వేల మెగావాట్ల సామర్థ్యంతో బీవోటీ విధానంలో సంప్రదాయేతర విద్యుదుత్పత్తి సంస్థను నెలకొల్పుతున్నాం. దీని వల్ల సర్కారుపై ఉచిత విద్యుత్ భారం తగ్గుతుంది. ► కరోనా సమయంలో బహిరంగ మార్కెట్లో పోటీ విధానం ద్వారా తక్కువ ధరకే యూనిట్ రూ.1.75, రూ.రెండు చొప్పునే విద్యుత్‌ను కొనుగోలు చేసి.. సంస్థలకు ఆదా చేశాం. విద్యుత్ సంస్థలను బలోపేతం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. తద్వారా తక్కువ ధరకే విద్యుత్‌ను సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. ► ఏపీ జెన్కో, ట్రాన్స్‌కో, డిస్కమ్‌లను కేంద్రం తీసుకున్నా మాకు అభ్యంతరం లేదు. (ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు) ఏపీ, తెలంగాణ సర్కార్లు వ్యతిరేకించినా కేంద్రం తెచ్చే విద్యుత్ బిల్లు ఆగదు. చట్టంగా రూపుదాలుస్తుంది. -
సాగు పండగై
వ్యవసాయ రంగం ముఖచిత్రాన్నే మార్చి వేసే ప్రభుత్వ నిర్ణయాల కారణంగా రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరుగుతోంది. గత ఏడాది 86.33 లక్షల ఎకరాల్లో సాగు కాగా, ఈ ఏడాది ఖరీఫ్ సాగు విస్తీర్ణం అంత కంటే 6.10 లక్షల ఎకరాలు పెరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది ఖరీఫ్‌లో 92,46,006.30 ఎకరాలు సాగులోకి రావొచ్చని అంచనా. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతు సంక్షేమ పథకాలు.. ప్రధానంగా రైతు భరోసా, విత్తనాల పంపిణీ, ఎరువులు, పురుగుమందుల సంసిద్ధత వంటివి సాగును ప్రోత్సహించేలా ఉన్నాయి. సకాలంలో వర్షాలు పడటంతో ఈ సీజన్లో ఇప్పటికే అంటే గురువారం నాటికి 3,29,085.06 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. గత ఏడాదితో పోల్చుకుంటే ఇది 1,08,590.46 ఎకరాలు ఎక్కువ. గత ఏడాది ఇదే కాలానికి అంటే జూన్ ఒకటి నుంచి 17వ తేదీ వరకు 2,20,494.60 ఎకరాల్లో మాత్రమే పంటల్ని వేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న విప్లవాత్మక పథకాలు, అన్నదాతల ముంగిటకే అందిస్తున్న సేవలు, కలిసి వచ్చిన వాతావరణం.. వెరసి రాష్ట్రంలో వ్యవసాయ రంగం మూడు పూవులు, ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. ఇదివరకెన్నడూ లేని విధంగా గత ఏడాది పంట దిగుబడులతో ఆనందంగా ఉన్న రైతాంగం.. ఈ ఖరీఫ్‌లో రెట్టించిన ఉత్సాహంతో సాగులో నిమగ్నమైంది. (ఎ.అమరయ్య, జీపీ వెంకటేశ్వర్లు) ‘కల్లా కపటం కానని వాడా.. లోకం పోకడ తెలియని వాడా..ఏరువాక సాగారో రన్నో చిన్నన్న.. నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్న..నవ ధాన్యాలను గంపకెత్తుకొని.. చద్ది అన్నము మూట గట్టుకొని ముల్లు గర్రను చేతబట్టుకొని.. ఇల్లాలునీ వెంటబెట్టుకొని..’ అన్న పాటలోని జీవన సౌందర్యం ఊరూరా కనిపిస్తోంది. ► నగరాలు నిద్రలేవడానికి మునుపే పల్లెలు పొలం పనుల్లో మునిగి తేలుతున్నాయి. ఓవైపు చిరు జల్లులు, మరోవైపు మసకేసిన మబ్బు.. ఉదయం 8 గంటలు కావొస్తోంది.. అప్పటికే పొలంలో ట్రాక్టర్లు రయ్రయ్యిమంటూ రొద చేస్తున్నాయి. హాయ్, హోయ్ మంటూ అన్నదాతలు ఎడ్లను అదిలిస్తున్నారు. కొన్ని చోట్ల మహిళలు, పిల్లలు పొలంలో దంటు ఏరుతున్నారు. ► రాత్రి కురిసిన చిరు జల్లుల వల్లనో ఏమో ట్రాక్టర్లు దుమ్ము లేపడం లేదు. పైరగాలికి గెనాల మీద చెట్ల కొమ్మలు రెపరెపలాడుతున్నాయి. నాగటి చాళ్లంట బయటపడే పురుగుల కోసం కొంగలు, కోనంకి పిట్టలు దేవులాట మొదలు పెట్టాయి. అరేయ్.. బువ్వ తిందాం రా అంటూ అవతలి చేలో దుక్కిదున్నుతున్న దోస్త్‌ను ఓ రైతు పిలుస్తున్నాడు. రైతు షేక్ సత్తార్ది ప్రముఖ చిత్రకారుడు సంజీవ్‌దేవ్ స్వగ్రామమైన గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామం. 75 సెంట్ల తన సొంత భూమిని ఖరీఫ్‌లో సాగుకు సిద్ధం చేస్తున్నాడు. రైతు భరోసా కింద ఇచ్చిన సొమ్ముతో వరి సాగు పనులు ప్రారంభిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా తొర్రేడు గ్రామానికి చెందిన ఈ రైతు పేరు సీహెచ్ వీర్రాజు. తన పిల్లలు కాయకష్టం చేసే పరిస్థితి రాకూడదన్న ఉద్దేశంతో 13 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. గోదావరి కాలువలు వదిలిన ఈనెల 10కి ముందే ఆయన నారు సిద్ధం చేసుకున్నారు. గురువారం నాటికి 12 ఎకరాల్లో నాట్లు సైతం పూర్తి చేశారు. వేరుశనగ విత్తనాన్ని వెదపెడుతున్న ఈ రైతుది వైఎస్సార్ జిల్లా ముద్దనూరు. నైరుతి రుతు పవనాల ప్రభావంతో కురిసిన వర్షాలకు ముందుగా పదును కావడంతో ఈ రైతు విత్తనం వేశారు. 5 ఎకరాల వరకు వేరుశనగను సాగు చేసే ఈ రైతుకు రైతు భరోసా కింద అందిన పెట్టుబడి సాయం కలిసి వచ్చింది. సకాలంలో విత్తనాలు వచ్చాయి. దీంతో భూమిని నమ్ముకున్న ఈ రైతు రాయలసీమలో ప్రధాన వాణిజ్య పంటైన వేరుశనగ సాగుకు ఉపక్రమించారు. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు ► ఖరీఫ్‌లో క్షేత్ర స్థాయి వాస్తవ సాగు పరిస్థితులను తెలుసుకునేందుకు బయలుదేరిన ‘సాక్షి’ ప్రతినిధులకు కనిపించిన దృశ్యాలివి. మొత్తం మీద ఈ ఏడాది ఖరీఫ్ కోటి ఆశలు, కొంగొత్త ఆకాంక్షలతో శుభారంభమైందన్న భావన కలిగింది. ► సకాలంలో రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించడం, అల్పపీడనం బలపడడంతో ఒక్క చిత్తూరు జిల్లా తప్ప మిగతా 12 జిల్లాల్లోనూ వ్యవసాయ పనులు చేపట్టేలా వానలు పడ్డాయి. అటు ఉత్తరాంధ్ర మొదలు ఇటు రాయలసీమ వరకు ఎక్కడ చూసినా ఖరీప్ పనులు ముమ్మరం అయ్యాయి. ► దక్షిణాంధ్ర జిల్లాల్లో దుక్కులు సిద్ధం చేస్తుండగా రాయలసీమ జిల్లాలలో వేరుశనగ విత్తడం ప్రారంభమైంది. ఇప్పటికే దాదాపు 24 శాతం మేర పూర్తయింది. ► గోదావరి డెల్టా కాలువలకు నీళ్లు వదలడంతో ఉభయ గోదావరి జిల్లాల్లో నాట్లు మొదలయ్యాయి. ఉత్తరాంధ్రలో అక్కడక్కడా నాట్లు పడ్డాయి. వరి సాగు చేసే ప్రాంతంలో వరి నారుమళ్లు పోయడం ముమ్మరమైంది. ► కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నీటి వసతి ఉన్న ప్రాంతాలలో వేసిన అపరాలు మొలక దశ దాటాయి. మరొక్కసారి పెద్ద వర్షం పడితే పంటల్ని వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. వ్యవసాయం ఎందుకు పండగైందంటే.. ► రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతు సంక్షేమ పథకాలు.. ప్రధానంగా రైతు భరోసా, విత్తనాల పంపిణీ, ఎరువులు, పురుగు మందుల సంసిద్ధత వంటివి సాగును ప్రోత్సహించేలా ఉన్నాయి. ► దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. వచ్చే నాలుగైదు రోజుల్లో వర్షాలు పడితే వేరుశనగ విత్తడం మరింత ముమ్మరం అవుతుందని రైతులు చెప్పారు. ► విత్తనాలను ముందే పంపిణీ చేయడం సంతోషంగా ఉందని అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన హన్మంతరెడ్డి చెప్పారు. ఉత్తరాంధ్రలో ఈసారి ఎక్కువ మంది ఉద్యాన పంటల వైపు కూడా దృష్టి సారించారు. ఖరీఫ్‌లో వరి సాగుకు అధిక వ్యయం అవుతుందన్న భావనలో పలువురు ఉన్నారు. ► ఖరీఫ్ సీజన్లో నైరుతి రుతుపవనాల ప్రభావంతో కురవాల్సిన సగటు వర్షపాతం 556 మిల్లీమీటర్లు. ఇప్పటికే కురవాల్సింది 62 మిల్లీమీటర్లు కాగా బుధవారం సాయంత్రానికి 63 మిల్లీమీటర్లు కురిసింది. ఫలితంగా ఒక్క చిత్తూరు జిల్లా మినహా 12 జిల్లాలలో మామూలు వర్షపాతం నమోదైంది. ► వరి, జొన్న, మొక్కజొన్న, సజ్జ, రాగి, కంది, పెసర, మినుము, వేరుశనగ, నువ్వులు, ఉల్లి పంటల్ని ఇప్పటికే 20 నుంచి 24 శాతం లోపు విస్తీర్ణంలో విత్తారు. రికార్డు దిగుబడే లక్ష్యం ► ఖరీఫ్ సాగుపై అధికారులు ఆశావహ దృక్పథంతో ఉన్నారు. గత ఏడాది కంటే మించి ఉత్పత్తులు రావొచ్చని అంచనా వేస్తున్నారు. గత ఏడాది (2019–20) ఖరీఫ్, రబీ రెండు సీజన్లలో కలిపి 180.54 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తితో రాష్ట్రం రికార్డు సృష్టించింది. ఇందులో ఒక్క ఖరీఫ్ నుంచే 87.64 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. ఈ ఏడాది ఇంతకుమించి రావొచ్చునని అధికారులు అంచనా. ► సీజన్‌కు కావాల్సిన ఎరువులు, పురుగు మందులకు ఎటువంటి ఢోకా లేదని వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ తెలిపారు. మరో వైపు కరోనా నేపథ్యంలో వ్యవసాయ కూలీల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ► అగ్రి దుకాణాల ద్వారా యంత్రాలను తక్కువ ధరకు అద్దెకు ఇచ్చేలా ఏర్పాటు చేస్తున్నారు. వరిని నాటడానికి బదులు వెదజల్లే పద్ధతిని పాటించాలని సూచిస్తున్నారు. ► కరోనా వైరస్ భయంతో పొరుగు ఊళ్ల నుంచి వ్యవసాయ కూలీలను అనుమతించనందున ఏ ఊరికి ఆ ఊరి వాళ్లే గ్రూపులుగా ఏర్పడి పనులు చేసుకోవాలని రైతు సంఘాలు సూచించాయి. మొత్తంగా ఖరీఫ్ పంటలకు అన్నీ సానుకూల అంశాలేనని రైతులు అభిప్రాయపడుతున్నారు. కౌలు రైతుల సమస్యకు త్వరలో పరిష్కారం ప్రభుత్వం ఇచ్చే అన్ని రకాల రాయితీలను కౌలు రైతులకు కూడా అందించాలన్నదే సీఎం వైఎస్ జగన్ లక్ష్యం. కౌలు రైతులకు రుణాలు, రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించేందుకు దరఖాస్తులు ఆహ్వానించాం. 11 నెలల కాలానికి సాగు ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా సాయం అందిస్తాం. అర్హులైన వారందరికీ సాయం ఇస్తాం. – మంత్రి కన్నబాబు -
నాణ్యత లేని విత్తనాన్ని అనుమతించొద్దు
సాక్షి, అమరావతి: వేరుశనగ సహా అన్ని రకాల విత్తనాల పంపిణీలో అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య అన్ని జిల్లాల వ్యవసాయాధికారులను, ఏపీ సీడ్స్ అధికారులను ఆదేశించారు. నాణ్యత లేని విత్తనాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించవద్దని చెప్పారు. అనంతపురం జిల్లాలో నాలుగు ట్రక్కులు నాణ్యత లేని వేరుశనగ విత్తన కాయలు సరఫరా అయిన విషయాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించిన నేపథ్యంలో ఆమె శనివారం అధికారులకు సందేశం పంపారు. విత్తన పంపిణీ పూర్తయ్యాక రైతుల నుంచి ఆరోపణలు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నాణ్యత లేని కాయల్ని సరఫరా చేసిన సంస్థల్ని బ్లాక్ లిస్ట్‌లో పెట్టడంతోపాటు వారిపై చర్యలు తీసుకోవాలని ఏపీ సీడ్స్‌ను ఆదేశించారు. ► వ్యవసాయశాఖ ఏడీలు సరుకు ఎక్కడ నుంచి బయలుదేరుతుందో అక్కడే తనిఖీలు నిర్వహించాలి. నాణ్యతను నిర్ధారించాకే సరఫరాకు అనుమతించాలి. ► నాణ్యత లేని విత్తనాన్ని వ్యవసాయ శాఖ ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించవద్దన్న గట్టి హెచ్చరిక వెళ్లాలి. ► వ్యవసాయ ఉత్పాదకాల సరఫరా, పంపిణీ విషయంలో సీఎం వైఎస్ జగన్ చాలా పట్టుదలతో ఉన్నారు. నాణ్యత లేనివాటిని రైతులకు అంటగడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ట్రూత్‌ఫుల్ లేబుల్‌పై ఏం ఉంటుందంటే.. బస్తా బరువు, కాయల శుభ్రత, మొలక శాతం, తేమ, కలుపు, గరిష్ట చిల్లర ధర వంటివి ఉంటాయి. ఏ సంస్థ నుంచి ఏపీ సీడ్స్‌కు వచ్చాయో కూడా ఉంటుంది. అయితే.. ఇవేవీ ప్రభుత్వ సంస్థలు గుర్తించి ఇచ్చిన ప్రకటనలు కావు. ఆయా సంస్థలు తమకు తాము ఇస్తున్నవే. ట్రూత్‌ఫుల్ లేబుల్ ఉండాలా? వద్దా? ఏపీ సీడ్స్‌కు సరఫరా చేస్తున్న విత్తన బస్తాలపై సర్టిఫైడ్ ట్యాగ్‌కు బదులు ఆయా సంస్థలు ఇస్తున్న ట్రూత్‌ఫుల్ లేబుల్ (స్వీయ విశ్వసనీయ ప్రకటన) ఉండడాన్ని అనుమతించాలా, వద్దా అనే దానిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. దీనిపై వివరణ ఇవ్వాలని వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్‌కుమార్‌ను కోరారు. సర్టిఫైడ్ ట్యాగ్ ఉంటే ఇక ఆ విత్తనానికి తిరుగుండదు. అదే ట్రూత్‌ఫుల్ లేబుల్ అయితే ఆయా విత్తన సంస్థలు ఇచ్చే స్వచ్ఛంద ప్రకటన మాత్రమే. ఇప్పుడు ఇలా లేబుల్ ఉన్న వాటిల్లోనే నాణ్యత లేని కాయలు వచ్చాయి. -
40 శాతం సబ్సిడీతో వేరుశనగ విత్తనాలు : కన్నబాబు
సాక్షి, అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా ముందుగానే విత్తన సరఫరా ప్రారంభించామని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాకముందే రైతు భరోసా డబ్బు వేశామని తెలిపారు. ఆ డబ్బు రైతుకు చేరగానే విత్తనాలు అందుబాటులో ఉంచామన్నారు. ‘నేటి నుంచి వేరుశనగ విత్తన కాయలు 40 శాతం సబ్సిడీతో అందిస్తున్నాం. వరి, ఇతర పంటల విత్తనాల సరఫరా కూడా జరుగుతోంది. నాణ్యతను అధిక ప్రాధాన్యం ఇచ్చాం. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామస్థాయిలో విత్తనాలు అందిస్తున్నాం. గతంలోలా భారీ క్యూ లైన్లు లేకుండా ముందుగానే రిజిస్ట్రేషన్ చేసి రైతుకు అందిస్తున్నాం. దీని వల్ల బ్లాక్ మార్కెటింగ్ కూడా అరికడుతున్నాం. ఎక్కడైనా అవినీతి జరిగిందని మా దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. విత్తన పంపిణీ కోసం జిల్లాకో ప్రత్యేక అధికారిని కూడా పంపాము. రైతు భరోసా కేంద్రాలు ఈ నెల 30న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభిస్తారు. దానికోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అవి రాగానే గ్రామ స్థాయి నుంచి రైతు సేవలు ప్రారంభం అవుతాయి. వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున ఆర్బీకేల ప్రారంభం ద్వారా రైతు సేవలో పునరంకితమవుతాం’ అని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. -
'కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం'
సాక్షి, వైఎస్సార్ : కరోనా నివారణకు రాష్ట్ర ప్రభుత్వ చర్యలు అభినందనీయమని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పేర్కొన్నారు. బుధవారం కడప నగరంలో పర్యటించిన ఆయన పాత కడప మున్సిపల్ హైస్కూల్లో రైతులకు విత్తనాలు సరఫరా చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం అధ్యక్షుడు సాంబటూరు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంజాద్ బాషా మాట్లాడుతూ.. కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.కరోనా నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. రైతులకు అండగా ఉండేదుకు ఈ నెల 15న రైతు భరోసా పంపీణీ చేపడతామన్నారు. అలాగే మే18 నుంచి వేరుశనగ విత్తనాలను కూడా పంపీణీ చేయనున్నట్లు డిప్యూటీ సీఎం వెల్లడించారు. -
విత్తనాలు రెడీ
సాక్షి, అమరావతి: ఖరీఫ్ సీజన్లో రైతులకు సబ్సిడీపై ఇచ్చే విత్తన ప్రణాళికను వ్యవసాయ శాఖ ఖరారు చేసింది. ఈ నెల 18 నుంచి విత్తనాలు పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. ఇ–క్రాప్ బుకింగ్ ఆధారంగా విత్తనాలు సరఫరా చేస్తారు. రైతులు గ్రామ సచివాలయాల్లో డబ్బు చెల్లించి రాయితీ పొందవచ్చు. సబ్సిడీ వర్తించని వారు పూర్తి మొత్తాన్ని చెల్లించి విత్తనాలు తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. 5,07,599 క్వింటాళ్ల వేరుశనగ, 2,28,732 క్వింటాళ్ల వరి, 83,215 క్వింటాళ్ల జీలుగ, జనుము, పిల్లిపెసర వంటి పచ్చిరొట్ట విత్తనాలు వ్యవసాయ శాఖ అందుబాటులో ఉంచింది. సబ్సిడీ ఇలా.. ► 13 రకాల వరి వంగడాలను 9 జిల్లాలకు కేటాయించారు. ఈ విత్తనాలపై క్వింటాల్‌కు రూ.500 సబ్సిడీ ఉంటుంది. పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లో రైతులు సొంతంగా విత్తనం తయారు చేసుకుంటారు కాబట్టి ఆ జిల్లాలకు తక్కువ కేటాయించారు. ► గ్రామ సచివాలయాల్లో రైతులు నిర్ధేశించిన సొమ్ము చెల్లించి రశీదును గ్రామ వ్యవసాయ సహాయకులకు చూపి విత్తనాల్ని పొందవచ్చు. ► జాతీయ ఆహార భద్రత మిషన్ కింద గుర్తించిన జిల్లాలకు, గుర్తించని జిల్లాలకు సబ్సిడీలో తేడా ఉంటుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు జాతీయ ఆహార భద్రతా మిషన్ (ఎన్ఎఫ్ఎస్ఎం)లో ఉన్నాయి. ► కే–6, ఇతర రకాల వేరుశనగ విత్తనాల ధరను క్వింటాల్‌కు రూ.7,850గా నిర్ణయించారు. దీనిపై 40 శాతం పోను రైతులు క్వింటాల్‌కు రూ.4,710 చెల్లించాలి. ► పచ్చిరొట్ట పంటలుగా సాగు చేసే జీలుగ, జనుము, పిల్లి పెసర విత్తనాలపై 50 శాతం సబ్సిడీ ఉంటుంది. -
లోకేశ్ బయట మాట్లాడితే తప్పులు వస్తాయని ట్వీట్లు
-
అందుకే లోకేశ్ ట్వీట్లు : అనిల్ కుమార్
సాక్షి, అమరావతి : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యం వల్లే రైతులకు విత్తనాల సమస్య వచ్చిందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. విత్తనాల కంపెనీలకు ఇవ్వాల్సిన నిధులను గత ప్రభుత్వంలో పక్కదారి పట్టించారని ఆయన విమర్శించారు. నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌తో కలిసి రైతులకు విత్తనాల పంపిణీపై ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. కన్నబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో 4 లక్షల 41వేల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు అవసరం ఉండగా.. 3 లక్షల 8 వేల క్వింటాళ్ల విత్తనాలు సరఫరా చేసినట్టు తెలిపారు. రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. తక్షణమే కొబ్బరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. రైతు ఆత్మహత్యల నివారణకు కృషిచేస్తున్నట్టు స్పష్టం చేశారు. అనిల్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. చంద్రబాబు తనయుడు లోకేశ్ బయటకి వచ్చి మాట్లాడితే తప్పులు వస్తాయని భయపడి ట్వీట్లు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. లోకేశ్ ట్వీట్లు ఆయనే చేస్తున్నారో.. ఎవరైనా రాస్తున్నారో తెలియదన్నారు. గోదావరి నీటితో రాయలసీమ కరువును తొలగించాలనేదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచన అని తెలిపారు. వైఎస్ జగన్‌కు మంచి పేరు వస్తుందనే టీడీపీ నేతలు భయపడుతున్నారని విమర్శించారు. రెండు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి ఇరువురు ముఖ్యమంత్రులు కృషి చేస్తున్నట్టు పేర్కొన్నారు. టీడీపీలో తర్వాతి నాయకుడు ఎవరని వెతుక్కుంటున్నారని వ్యాఖ్యానించారు. -
చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే రైతులకు విత్తనాల సమస్య
-
ఆందోళన అనవసరం..విత్తనాలు తెప్పిస్తాం
సాక్షి, అనంతపురం జిల్లా: రైతులందరికీ వేరుశనగ విత్తనాలు పంపిణీ చేస్తామని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని అనంతపురం జిల్లా కలెక్టర్ సత్యనారాయణ స్పష్టం చేశారు. విత్తన సంస్థలకు గత ప్రభుత్వం రూ. 150 కోట్ల బకాయిలు ఉన్నందునే అనంతపురం జిల్లాలో విత్తనాల సేకరణ ఆలస్యం అయిందన్నారు. మొత్తం మూడు లక్షల క్వింటాళ్ల కు గాను ఇప్పటిదాకా రెండు లక్షల క్వింటాళ్ల విత్తనాలు రైతులకు పంపిణీ చేశామని వివరించారు. రైతుల డిమాండ్ మేరకు మరో నలభై వేల క్వింటాళ్ల విత్తనాలు సేకరిస్తున్నామని చెప్పారు. ఎంత ధర అయినా చెల్లించి వేరుశనగ విత్తనాలు సేకరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారని.. పొరుగు రాష్ట్రాల నుంచి విత్తనాలు తెప్పిస్తున్నామని తెలిపారు. -
ఈ దుస్థితికి గత ప్రభుత్వమే కారణం !
సాక్షి, పశ్చిమ గోదావరి: గత ప్రభుత్వ బాధ్యతారాహిత్యం రైతుల పాలిట శాపంగా మారిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణంగా ఖరీఫ్ సీజన్లో జనవరి నుంచే ప్రభుత్వం విత్తనాలను సేకరిస్తుంది. కానీ గత ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం విత్తనాల కొనుగోలుకు కేటాయించాల్సిన నిధులను ఎన్నికల పథకాల కోసం ఖర్చు పెట్టింది. దీంతో ఎన్నడూ లేని విధంగా పశ్చిమ గోదావరిలో విత్తనాల కొరత ఏర్పడింది. విత్తనాల కోసం కేటాయించిన నిధులను చంద్రబాబు పక్కదారి పట్టించడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు ఎన్నిసార్లు ప్రతిపాదనలు పంపినా వాటిని గత ప్రభుత్వం లెక్కచేయలేదని రైతులు ఆక్రోశిస్తున్నారు. చేసిన తప్పులు చాలక టీడీపీ నేతలు అధికార పార్టీపై విమర్శలు చేయటంపై రైతులు మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ యుద్ధప్రాతిపదికన విత్తనాలు సేకరించి రైతులకు అందజేయాలని ఆదేశించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
మందులు కావాలా నాయనా!
పురుగు మందుల విక్రయానికి ప్రభుత్వం నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. పంటల సాగులో విచ్చలవిడిగా మందులు వాడకుండా కొత్త నిబంధన పెట్టింది. ఇక నుంచి పురుగు మందులు కొనుగోలు చేయాలంటే వ్యవసాయాధికారి చీటీ (ప్రిస్కిప్షన్) తప్పనిసరి చేసింది. సాగు చేసిన పంట, ఆశించిన తెగుళ్లు, తదితర వాటిని రైతులు అధికారులకు వివరిస్తే ఏ మందును, ఎంత మోతాదులో వాడాలో వ్యవసాయాధికారి చీటీ రాసిస్తారు. ఈ మేరకే దుకాణాల్లో పురుగు మందులు ఇస్తారు. దీనిని అతిక్రమించే పురుగు మందుల విక్రయ డీలర్లు, వ్యాపారులపై వ్యవసాయశాఖ అధికారులు చర్యలు తీసుకోనున్నారు. ఆదిలాబాద్‌టౌన్: విచ్చిలవిడిగా పురుగుల మం దుల వాడకం వల్ల మానవాళికి నష్టం వాటిళ్లడంతోపాటు జీవ వైవిద్యంపై ప్రభావం చూపుతోం ది. అవసరానికి మించి రైతులు పంటలకు పురుగుల మందులు చల్లడంతో కూరగాయలు, ఇతర ఆహార పంటలు విషపదార్థాలుగా మారి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన ప్రభుత్వం నిర్ణీత మోతాదులో పురుగుల మందులు వాడాలనే ఉద్దేశంతో వ్యవసాయ అధికారుల ద్వారా ప్రిస్కిప్షన్ (చీటీ) రైతులకు అందిస్తున్నారు. దాని ప్రకారమే డీలర్లు రైతులకు పురుగు మందులు, ఎరువులు విక్రయించాల్సి ఉంటుంది. నిబంధనలు విస్మరిస్తే డీలర్లపై చర్యలు తీసుకునేందుకు వ్యవసాయశాఖ సిద్ధమవుతోంది. ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో సేంద్రియ పద్ధతిలో పంటలు పండించడంతో ఇటు ఆరోగ్యంతోపాటు అటు రైతులకు పెట్టుబడి కూడా తక్కువగా ఉండేది. ప్రస్తుతం పురుగు మందుల ధరలు పెరిగిపోవడం, కూరగాయలు, ఇతర ఆహార పంటలు కొనుగోలు చేసే వారిపై దీని ప్రభావం పడడమే కాకుండా వారు అనారోగ్యానికి గురవుతున్నారు. జిల్లాలో.. ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 250కుపైగా ఎరువులు, పురుగుల మందుల దుకాణాలు ఉన్నాయి. ఆదిలాబాద్ పట్టణంతోపాటు ఇచ్చోడ, బోథ్, ఉట్నూర్, ఇంద్రవెల్లి, బేల తదితర మండలాలు, ఆయా గ్రామాల్లో పురుగులు, ఎరువుల దుకాణాలు ఉన్నాయి. అయితే ఇక నుంచి రైతులు వ్యవసాయ శాఖ అధికారులు జారీ చేసిన ప్రిస్కిప్షన్ మేరకే మందులు వాడాల్సి ఉంటుంది. మండల ఏఈఓ, ఏఓలు పంటకు ఎంత మోతాదులో మందులు వాడాలనే విషయాన్ని రైతులకు వివరిస్తారు. పండించిన పంటకు ఎలాంటి కీటకాలు ఆశించాయో రైతులు విన్నవిస్తే ఏ మందులు వాడాలి, ఎంత మోతాదులో వాడాలనేది ప్రిస్కిప్షన్ ద్వారా రాసి ఇస్తారు. ఆ చీటిని మందుల దుకాణదారుడికి చూపిస్తేనే రైతులకు మందులు లభించే పరిస్థితి ఉంది. జీవ వైవిధ్యంపై ప్రభావం కొంతమంది రైతులు అవగాహన లేక పంట పొలాల్లో విచ్చలవిడిగా ఎరువులు, పురుగుల మందులను పిచికారి చేస్తున్నారు. దీంతో నేల సారవంతం దెబ్బతినడమే కాకుండా జీవ వైవిద్యంపై కూడా ప్రభావం చూపుతుందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. పంటకు కీడు చేసే పురుగులతో మిత్ర పురుగులు కూడా ఉంటాయనే విషయాన్ని రైతులు గ్రహించలేక పోతున్నారు. అధిక మోతాదులో మందులను వాడడంతో అవి చనిపోయి పంట దెబ్బతినే ప్రమాదం ఉంది. పత్తి, సోయాబీన్, కందులు, కూరగాయలు, ఆకుకూరలు, ఇతర ఆహార పంటలకు ఏ తెగుళ్లు సోకినా రైతులు వ్యవసాయ అధికారుల సూచనలు తీసుకోవాలని పేర్కొంటున్నారు. అవగాహన లేమితో పురుగుల మందులు, ఎరువులను వాడితే నష్టాలను చవిచూసే అవకా>శాలు ఉన్నాయని చెబుతున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కొరడా ఎరువులు, పురుగు మందులు విక్రయించే డీలర్లు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్ వ్యవసాయ శాఖాధికారులకు ఇదివరకే ఆదేశాలు జారీ చేసిన విషయం విధితమే. ప్రతీ రైతుకు విత్తనాలు, ఎరువులు, పురుగుల మందు బిల్లులు తప్పనిసరిగా అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. దుకాణంలో ధరల బోర్డు తప్పనిసరిగా ఉంచాలని, స్టాక్ రిజిస్టర్, నిల్వ వివరాలను ప్రదర్శించాలని సూచించారు. ఈ నిర్ణయంతో విచ్చలవిడిగా పురుగుల మందుల వాడకం తగ్గడంతో పాటు అవగాహన లేని రైతులు సైతం మోతాదులో వాడే అవకాశం ఉంది. సేంద్రియ పద్ధతికి ప్రోత్సాహం పురుగు మందులు చల్లిన కూరగాయలు, ఆకుకూరలు, ఇతర ఆహార పంటలను కొనుగోలు చేసి వినియోగిస్తున్న ప్రజలు ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారని కలెక్టర్ గ్రహిం చి ఆదిలాబాద్ పట్టణంలో సేంద్రియ ఆహార పంటల విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వారిని ప్రోత్సహించడమే కాకుండా సేంద్రియ పద్ధతిలో సాగు చేసే ఆహార పదార్థాలను విని యోగించాలని ఇటు ప్రజలు సైతం అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం పురుగు మందులను మోతాదుకు మించి రైతులు వాడకూడదనే నిబంధన తీసుకురావడం అభినందనీయమని పలువురు పేర్కొంటున్నారు. ప్రభుత్వ నిర్ణయం మంచిదే.. అవగాహన లేని కారణంగా రైతులు పంటకు అనుకూలం లేని పురుగుల మందులను కూడా విచ్చలవిడిగా వాడి నష్టపోతున్నారు. ఆహార పంటలకు మోనోక్రోటోఫాస్ మందు పిచికారీ చేయవద్దని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నా వాటిని పాటించడంలేదు. ఆహార పదార్థాలకు ఈ మందును పిచికారీ చేయడంతో అవి విషపదార్థాలుగా మారుతాయి. పురుగుల మందులు విచ్చలవిడిగా వాడకుండా సేంద్రియ పద్ధతిలో తక్కువ ఖర్చుతో రైతులు పంటలు సాగు చేసుకోవచ్చు. – సుధాన్షు, ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త, ఆదిలాబాద్ డీలర్లకు ఆదేశాలు జారీ చేశాం పురుగు మందులు రైతులు విచ్చలవిడిగా వాడకూడదని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి. ఈ విషయమై డీలర్లకు కూడా సమాచారం అందించాం. ఏఓ, ఏఈఓలు సూచించిన పురుగు మందులనే రైతులు వాడాల్సి ఉంటుంది. ప్రిస్కిప్షన్ లేకుండా ఎవరైనా డీలర్లు పురుగు మందులు విక్రయిస్తే శాఖ పరమైన చర్యలు తీసుకుంటాం. – శివకుమార్, వ్యవసాయశాఖ నోడల్ అధికారి -
‘విత్తు’కు ఉరుకులు..
ఖమ్మంవ్యవసాయం: తొలకరి పలకరించడంతో రైతులు ఖరీఫ్ పనులకు సిద్ధమవుతున్నారు. జిల్లాలోని నేలల స్వభావం, నీటి వనరుల ఆధారంగా పత్తి వైపు మొగ్గు చూపుతుంటారు. పంటల సాగు విస్తీర్ణం 5.50 లక్షల ఎకరాలు కాగా.. ఇందులో 2.40 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తుంటారు. ఖమ్మం, మధిర, పాలేరు, వైరా వ్యవసాయ డివిజన్లలో అధిక విస్తీర్ణంలో పత్తి పంట సాగు చేస్తుంటారు. సత్తుపల్లి వ్యవసాయ డివిజన్లో మాత్రం అతి తక్కువ విస్తీర్ణంలో పంట వేస్తారు. తొలకరిలో అనుకూలమైన వర్షం కురిసిన వెంటనే విత్తనాలు నాటుతారు. నల్ల రేగడి నేలల్లో వర్ష సూచన, రుతుపవనాల కదలికలను చూసి రైతులు పొడి దుక్కుల్లో పత్తి విత్తనాలను విత్తుతారు. ఇదే విధానాన్ని ఎర్ర నేలలు, ఇసుక నేలల్లో కూడా రైతులు పాటిస్తున్నారు. అయితే వర్షాలు ఆశించిన సమయానికి రాకపోతే అన్ని రకాల నేలల్లో విత్తనాలు మొలకెత్తవు. ఇలా రైతులు కొంతమేర నష్టపోతున్నారు. ఈ అంశంపై అవగాహన ఉన్నప్పటికీ సీజన్‌కు ముందుగా పత్తిని వేయాలనే ఆతృతతో రైతులు విత్తనాలు విత్తుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు మాత్రం పొడి దుక్కుల్లో విత్తనాలు విత్తొద్దని, సరైన పదునులో మాత్రమే విత్తనాలను నాటాలని సూచిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలను పెడచెవిన పెడుతూ నష్టపోతున్నారు. వ్యవసాయ పనుల్లో నిమగ్నం సోమవారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండి ఉరుములతో కూడిన వర్షం కురిసింది. పలుచోట్ల పెద్ద వర్షం పడగా.. మరికొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. ఇది వ్యవసాయ పనులకు దోహదపడుతుంది. దాదాపు ప్రతి ఏటా జూన్ ఆరంభం నాటికి ఒకటి, రెండు వర్షాలు పడతాయి. అలాంటిది ఈ ఏడాది జూన్ అర్ధభాగం దాటిన తర్వాత వర్షం పడింది. పత్తి సాగు చేసే రైతులు జూన్ ఆరంభం నుంచి వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. 17న వర్షం కురవడంతో రైతుల్లో పంటల సాగుకు ఆశలు చిగురించాయి. మంగళవారం జిల్లాలో సగటున 2.64 సెం.మీల వర్షపాతం నమోదైంది. కొణిజర్ల, వైరా, కామేపల్లి, కారేపల్లి, ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం, కూసుమంచి, ముదిగొండ, చింతకాని, ఖమ్మం అర్బన్, ఏన్కూరు, కల్లూరు, తల్లాడ మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. దుక్కులు చేయడానికి ఈ వర్షం బాగా అనుకూలిస్తుంది. కొందరు రైతులు ఏకంగా ఈ వర్షానికే విత్తనాలు వేయడానికి సిద్ధమవుతున్నారు. రెండు, మూడు రోజుల్లో పత్తి విత్తడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. విత్తన దుకాణాలు కళకళ పత్తి విత్తనాలు కొనుగోలు చేసేందుకు రైతులు విత్తన దుకాణాలకు పరుగులు తీస్తున్నారు. నగరంతోపాటు వైరా, కొణిజర్ల, కారేపల్లి, ఏన్కూరు, మధిర, బోనకల్, కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లో ఉన్న విత్తన దుకాణాల్లో పత్తి విత్తనాలను కొనుగోలు చేసే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. జిల్లాలో పత్తి సాగు చేసే 2.40 లక్షల ఎకరాలకు 5.72 లక్షల విత్తన ప్యాకెట్లు అవసరం ఉంటాయని జిల్లా వ్యవసాయ శాఖ అంచనాలు రూపొందించి.. విత్తన కంపెనీలకు అనుమతులిచ్చింది. దీంతో వివిధ కంపెనీల యాజమాన్యాలు జిల్లాలో 5.22 లక్షల విత్తనాల ప్యాకెట్లను విక్రయాలకు సిద్ధంగా ఉంచాయి. సాగు విస్తీర్ణం పెరిగితే మరికొంత స్టాక్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. 450 గ్రాముల విత్తన ప్యాకెట్లను రూ.730 చొప్పున విక్రయిస్తున్నారు. అదునులో పత్తి విత్తేందుకు సమాయత్తం ఒక వర్షంతో విత్తనాలు వేయకుండా మరోసారి దుక్కి చేసి.. అదునులో పత్తి విత్తనాలు నాటాలని రైతులు ఆలోచిస్తున్నారు. నేల రకాన్నిబట్టి సరైన పదునులో విత్తనాలను విత్తితే అవి మొలకెత్తుతాయి. సోమవారం కురిసిన వర్షంతో రైతులు దుక్కి దున్నించే పనుల్లో నిమగ్నమయ్యారు. రెండు, మూడు రోజుల్లో రాష్ట్రానికి వచ్చే నైరుతి రుతుపవనాలతో వర్షం కురిస్తే వెంటనే పత్తి విత్తనాలు వేయాలని రైతులు భావిస్తున్నారు. మరో వర్షం పడితే.. సోమవారం కురిసిన వర్షంతో విత్తనాలు కొనుగోలు చేశా. ఈ వర్షంతో మరోసారి దుక్కి దున్ని అంతా సిద్ధం చేస్తాం. మరో వర్షం పడగానే పాటు చేసి విత్తనాలు నాటుతాం. ఇప్పటికే పత్తి విత్తనాలు పెడితే బాగుండేది. ఈ ఏడాది ఆలస్యమవుతోంది. విత్తనాలు ఆలస్యంగా విత్తితే దిగుబడులు తగ్గుతాయి. – వీరన్న, ఎర్రగడ్డతండా, కారేపల్లి మండలం అదునులో విత్తుకోవాలి.. రైతులు వర్షం పడింది కదా.. అని వెంటనే వేడి దుక్కుల్లో విత్తనాలు విత్తొద్దు. అలా విత్తడం ద్వారా సరైన పదును లేక విత్తనాలు మొలకెత్తవు. దీంతో రైతులు శ్రమ, ఖర్చుతో నష్టపోతారు. 60 నుంచి 70 మి.మీల వర్షం కురిసిన తర్వాత పత్తిని విత్తాలి. స్థానిక వ్యవసాయాధికారుల సలహాలతో పంటలు వేసుకోవాలి. విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో ఆయా విత్తనాలకు సంబంధించిన బిల్లులు, రశీదులు డీలర్లు, దుకాణాల యజమానుల నుంచి తీసుకొని భద్రపరుచుకోవాలి. – ఏ.ఝాన్సీలక్ష్మీకుమారి, జిల్లా వ్యవసాయాధికారి -
విత్తనంపై పెత్తనం
సాక్షి, శ్రీకాకుళం: టీడీపీ నాయకుల స్వలాభాపేక్ష, కొంతమంది వ్యవసాయాధికారుల పక్షపాత వైఖరి కారణంగా జిల్లాలో చాలామంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు తమకు కావాల్సినన్ని విత్తనాల ప్యాకెట్లు ఇళ్లకు తీసుకుపోతున్నారు. టోకెన్లు తీసుకొని మండుటెండలో రోజంతా బారులు తీరిన రైతులు మాత్రం విత్తనాలు దొరక్క నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఉదాహరణకు పాతపట్నం నియోజకవర్గంలోని ఎల్.ఎన్.పేట మండలంలో జరుగుతున్న చోద్యమే ఇందుకు ఒక నిదర్శనం. ఈనెల 12వ తేదీన విత్తనాల విక్రయం ప్రారంభిస్తున్నామని అధికారులు ప్రకటించారు. స్వర్ణ, 1075 రకాల విత్తనాల కోసం అన్ని గ్రామాల నుంచి వేలాదిగా రైతులు ఉదయం 8 గంటలకే ఎల్ఎన్ పేట మండల కేంద్రానికి తరలివచ్చారు. గంట తర్వాత వచ్చిన వ్యవసాయశాఖ సిబ్బంది మండల పరిషత్ కార్యాలయంలో రైతులకు టోకెన్లు పంపిణీ చేశారు. ఒక రైతుకు రెండు స్వర్ణ, రెండు 1075 రకం విత్తనాల ప్యాకెట్ల కోసం టోకెన్లు రాశారు. రెండు కంటే ఎక్కువ ఇవ్వలేమని, రెండో విడతలో విత్తనాలు వస్తే మరోసారి రెండు బస్తాల విత్తనాలు ఇస్తామని చెప్పారు. ఇలా వ్యవసాయ శాఖ సిబ్బంది ఇచ్చిన టోకెన్లు తీసుకున్న రైతులు సమీపంలోని ఒక ప్రైవేటు కళ్యాణ మండపం వద్ద బారులు తీరారు. పీఏసీఎస్ సిబ్బంది ఆయా రైతుల నుంచి వ్యవసాయశాఖ సిబ్బంది ఇచ్చిన టోకెన్‌తోపాటు డబ్బులు తీసుకుని మరో టోకెన్ ఇచ్చారు. పీఏసీఎస్ సిబ్బంది ఇచ్చిన టోకెన్ తీసుకుని విత్తనాలు నిల్వ ఉంచిన గిడ్డంగి వద్దకు వెళితే అక్కడి కళాసీలు విత్తనాల బస్తాలు ఇవ్వాల్సి ఉంది. అయితే స్థానికంగా ఉన్న హిరమండలం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, టీడీపీ నాయకుడు కాగాన మన్మధరావు ఆ టోకెన్లతో సంబంధం లేకుండానే గిడ్డంగి వద్దనే డబ్బులు తీసుకుని టీడీపీ నాయకులకు కావాల్సినన్ని విత్తనాలు ఇచ్చేశారు. మధ్యాహ్నం 12 గంటలకే స్వర్ణ రకం విత్తనాలు, ఒంటిగంటకే 1075 రకం విత్తనాలు అయిపోయాయి. అప్పటికే విత్తనాల కోసం డబ్బులు చెల్లించిన రైతులంతా టీడీపీ నాయకుల తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. మరెన్నో ఉదంతాలు.. రాజాం నియోజకవర్గంలో పరిస్థితి కూడా దారుణంగా ఉంది. రాజాం, రేగిడి మండలాల్లో విత్తనాలు అడ్డదారిలో టీడీపీ కార్యకర్తల ఇళ్లకు తరలిపోతున్నాయి. వ్యవసాయశాఖ సిబ్బంది కొంతమంది ఈ తంతులో ప్రధాన పాత్ర పోíషిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రాజాం వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద విత్తనాలు పంపిణీ చేస్తున్నా రైతులకు అందడం లేదు. రాత్రిపూట ట్రాక్టర్లలో విత్తనాలు తరలించుకుపోతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేగిడి మండలంలో సగానికి పైగా విత్తనాలు బ్లాక్ మార్కెట్లో తరలించారని వాపోతున్నారు. ఇక టెక్కలి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు అడ్డగోలు గా వ్యవహరిస్తున్నారు. వ్యవసాయ శాఖ, పీఏ సీఎస్, డీసీఎంఎస్ సిబ్బంది మొదటి నుంచి ఇక్కడ పనిచేస్తుండటంతో టీడీపీ కార్యకర్తలకు విత్తనాలు కట్టబెడుతున్నారు. దీనిపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నప్పటికీ అధికారుల్లో మార్పు కనిపించడం లేదు. దీంతో అర్హులైన రైతులకు రాయితీ విత్తనాలు అందడం లేదు. ఇదేవిధంగా జిల్లాలో చాలాచోట్ల వ్యవసాయశాఖ అధికారులు, సిబ్బంది టీడీపీ నాయకుల ప్రలోభాలకు లొంగిపోతున్నారు. సాంకేతిక లోపాల ముసుగులో బయోమెట్రిక్, టోకెన్లతో సంబంధం లేకుండా విత్తనాల పంపిణీ పక్కదారి పట్టిస్తున్నారు. అదునులోగా అందించాల్సిందే... ఖరీఫ్ సీజన్లో జిల్లాలోని 2.55 లక్షల హెక్టార్లలో సుమారు 5.50 లక్షల మంది రైతులు వరిసాగు చేస్తున్నారు. ఇందుకు 1.55 లక్షల క్వింటాళ్ల వరి విత్తనాలు అవసరమవుతాయి. మూడో వంతు మంది రైతులు సొంతంగా విత్తనాలు తయారు చేసుకుంటున్నారు. మిగతావారికి మాత్రం ప్రైవేటు వ్యాపారులు విక్రయించే విత్తనాలు, రాయితీపై వ్యవసాయ శాఖ సరఫరా చేసే విత్తనాలే ఆధారం. ఈ ఖరీఫ్ సీజన్లో ఇప్పటివరకూ 75,900 క్వింటాళ్లు జిల్లాకు చేరాయి. వాటిలో కేవలం 43 వేల క్వింటాళ్లు మాత్రమే వ్యవసాయశాఖ అధికారులు రైతులకు విక్రయించారు. అవి కూడా టీడీపీ నాయకులు చెప్పినవారికే ఎక్కువగా దక్కుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం, మంత్రి ఆదేశాలు బేఖాతర్ అర్హులైన రైతులందరికీ రాయితీ వరి విత్తనాలు సకాలంలో అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, జిల్లాకు చెందిన మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కానీ ఆచరణలో మాత్రం వ్యవసాయశాఖలో అధికారులు, సిబ్బంది బేఖాతరు చేస్తున్నారు. దీంతో విత్తనాలు అవసరమైన రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అదునులోగా చేతికందుతాయో లేదోనని ఆందోళన చెందుతున్నారు. టీడీపీ వాళ్లకు నేరుగా ఇచ్చేశారు... రైతులకు బయోమెట్రిక్ ఆధారంగా విక్రయించాల్సిన వరి విత్తనాలు టీడీపీ నాయకుడు, హిరమండలం ఏఎంసీ చైర్మన్ విత్తన గిడ్డంగి నుంచి తమ పార్టీకి చెందినవారికి నేరుగా ఇచ్చేస్తున్నారు. నాలాంటి రైతులంతా వ్యవసాయశాఖ సిబ్బంది నుంచి టోకెన్లు తీసుకొని మండుటెండలో వరుసలో ఉంటున్నాం. టీడీపీ నాయకుల నుంచి నేరుగా డబ్బులు తీసుకొని వారికి కావాల్సినన్ని విత్తనాలు ఇచ్చేస్తున్నారు. మేమంతా రోజంతా వేచిచూసి ఒట్టి చేతులతో వెనుదిరగాల్సి వస్తోంది. – కిలారి త్రినాథరావు, యంబరాం, ఎల్ఎన్ పేట మండలం -
వరి సాగు అస్సలొద్దు..
మహబూబ్‌నగర్ రూరల్: ఈ సారి ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా 1.25 లక్షల హెక్టార్లలో పంటలు సాగు చేస్తున్నట్లు అంచనా వేశాం.. ఈ మేరకు వ్యవసాయ శాఖ కార్యాచరణ చేపట్టి అందుకు తగ్గట్టు అవసరమైన విత్తనాలను, ఎరువులను సిద్ధం చేసింది. రైతులు వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా పంటలను సాగు చేసుకొని లబ్ధి పొందాలి.. అని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సుచరిత సూచించారు. శనివారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు సూచనలు చేశారు. వాతావరణం వరికి అనుకూలించదు.. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు జిల్లాలో వరి పంట సాగుకు ఏమాత్రం అనుకూలించే విధంగా లేవు. అందువల్ల రైతులు ఆరుతడి పంటల సాగుకే ప్రాధాన్యం ఇవ్వాలి. రైతులు పంటల సాగు విషయంలో మూస పద్ధతులు పాటిస్తే నష్టపోయే ప్రమాదం ఉంది. పంటల సాగు విషయంలో వ్యవసాయ అధికారులు, విస్తరణ అధికారుల సూచనలు, సలహాలు పరిగణలోకి తీసుకోవాలి. భూగర్భజలాలు లేకనే.. గత ఏడేళ్లుగా వర్షాలు సమృద్ధిగా కురియకపోవడం వల్ల భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయి. ఈ కారణంగానే వరి పంట సాగు శ్రేయస్కారం కాదు. నైరుతి రుతుపవనాల కారణంగా ఇప్పటివరకు కురియాల్సిన వర్షం కురియకపోవడం వల్ల జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదు కాలేదు. ఇకముందు కూడా నమోదయ్యే అవకాశం కనిపించడం లేదు. అందువల్ల రైతులు ఆరుతడి పంటల సాగుకే ప్రాధాన్యత ఇవ్వాలి. నెలాఖరువరకు జొన్న, కందులు వేసుకోవచ్చు.. ఈ నెలాఖరు వరకు జొన్న, కందుల విత్తనాలను విత్తుకోవచ్చు. ఆ తర్వాత జూలై 15వ తేదీ వరకు పత్తి పంటను సాగు చేసుకోవాలి. జూలై ఆఖరు వరకు ఆముదం పంటను సాగు చేసుకోవాలి. పంటల సాగు విషయంలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. రైతులు వ్యవసాయ అధికారులు, విస్తరణాధికారుల సలహాలు తీసుకొని పంటలను సాగు చేస్తేనే ప్రయోజనకరంగా ఉంటుంది. పదును ఉన్నప్పుడే విత్తనాలు వేయండి అదునుకు తగ్గ పదును లభిస్తేనే పంటలను సాగు చేసుకోవాలి. కొద్దిపాటి వర్షపు జల్లులు కురిస్తే పంటలను సాగు చేయడం వల్ల ప్రయోజనం ఉండదు. విత్తనాలు విత్తే ముందే అన్ని రకాలుగా ఆలోచించి విత్తుకోవాలి. ఈ సంవత్సరం వర్షం సమృద్ధిగా కురియాలని రైతులతో పాటు తాము కూడా అభిలాషిస్తున్నాం. ఒకవేళ వాతావరణ పరిస్థితులు అనుకూలించక వర్షం సమృద్ధిగా కురియకుంటే ప్రత్యామ్నాయ పంటల సాగు కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తాం. విత్తనాలు సిద్ధంగా ఉన్నాయి గత ఖరీఫ్‌లో ఎదురైన సవాళ్లను ఎదుర్కొని ఈ సీజన్లో రైతులకు ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా తగు జాగ్రత్తలను తీసుకుని ముందుకు సాగుతున్నాం. ఈ ఖరీఫ్‌లో వర్షాలు సకాలంలో కురిస్తే జిల్లా వ్యాప్తంగా 1.25 లక్షల హెక్టార్లలో వివిధ పంటలను సాగు చేసే అవకాశం ఉంది. అందులో ప్రధానంగా వర్షాధార పంటలు పత్తి 35వేల హెక్టార్లు, కందులు 12వేల హెక్టార్లు, మొక్కజొన్న 39వేల హెక్టార్లు, ఆముదం వరి 17,211 హెక్టార్లు, జొన్న 8,500 హెక్టార్లు, ఆముదం 250 హెక్టార్లు, రాగులు 600 హెక్టార్లు సాగు చేసే అవకాశం ఉంది. వీటితో ఇతర పంటలు సాగు చేసే అవకాశం ఉంటుంది. సబ్సిడీపై అందిస్తున్నాం.. జిల్లాలో రైతులకు సబ్సిడీపై అందించడానికి 15,977 క్వింటాళ్ల అన్ని రకాల విత్తనాలను సిద్ధంగా ఉంచాం. జిల్లాలోని పీఏసీఎస్, ఏఆర్ఎస్కే కేంద్రాల ద్వారా సబ్సిడీపై విత్తనాలు పంపిణీ చేస్తున్నాం. ఇప్పటికే పత్తి విత్తనాలను డీలర్ల వద్ద అందుబాటులో ఉన్నాయి. విత్తనాలకు ఎలాంటి కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. -
విత్తన కంపెనీల ప్రచార హోరు
బేల(ఆదిలాబాద్): ఖరీఫ్ సీజన్ సమీపించిన తరుణంలో పత్తి విత్తన కంపనీలు ఊదరగొడుతున్నాయి. ప్రచార రథాలు, మైక్సెట్లు, కరపత్రాలు, వాల్‌పోస్టర్లు, ప్లెక్సీలు, కటౌట్లతో హోరెత్తిస్తున్నాయి. ఆకర్షించేలా ప్రకటనలు చేస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా అన్నిగ్రామాల్లో ప్రచారం చేపడుతూ రైతులను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. గ్రామాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద రైతులను సమీకరించి సమావేశాలు పెడుతూ ఊదరగొడుతున్నారు. అధిక దిగుబడి వస్తుందంటూ నమ్మబలుకుతూ బుట్టలో వేసుకుంటున్నారు. కొందరు దళారులు నకిలీ, నాణ్యత లేని విత్తనాలను అంటగట్టి సొమ్ముచేసుకుంటున్నారు. ఈ బీటీ పత్తి విత్తనాలను సరఫరా చేసే కొన్ని సంస్థలు వందల రకాలను మార్కెట్లో ఇప్పటికే సంసిద్ధం చేశాయి. రైతులు అప్రమత్తంగా ఉండకపోతే పంటలు నష్టపోయే అవకాశాలు లేకపోలేదు. నాణ్యమైన పత్తి బీటీ విత్తనం 450 గ్రాముల ప్యాకెట్ ధర రూ.730కు లభిస్తుండగా నకిలీ విత్తనాల ప్యాకెట్ రూ.400నుంచి రూ.600 వరకు విక్రయించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కొందరు డిస్ట్రిబ్యూటర్లు, డీలర్లకు పలు కంపనీలు విదేశీ, విహార యాత్రలకు అవకాశం కల్పిస్తూ అధిక మొత్తంగా విత్తనాలు అంటగడుతున్నట్లు తెలుస్తోంది. అధికారులు నకిలీ విత్తనాలపై నిఘా వేసి, పూర్తిస్థాయిలో అరికట్టాలని పలువురు రైతులు కోరుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 1,46,960 హెక్టార్లలో.. జిల్లాలో ఎక్కువగా నల్లరేగడి భూములున్నాయి. దీంతో ప్రధాన పంటగా ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 1,46,960 హెక్టార్లలో పత్తి సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. గతేడాది వర్షభావ పరిస్థితులు ఉండడంతో ఆశించిన మేర దిగుబడి రాలేదు. ఎక్కువ భూముల్లో నీటి సౌకర్యం లేకపోవడం, వర్షాధారంతో కూడా అధికంగా పత్తి పంట సాగు చేసే వీలుండటంతోనే కొన్నేళ్ల నుంచి పత్తిపంటపై ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. కృత్రిమ కొరత ఇలా.. తొలకరి చినుకులు మొదలైతే రైతులు విత్తనాలకోసం విత్తన విక్రయకేంద్రాల ఎదుట బారులు తీరుతారు. ఇదే అదనుగా భావించి సరిపడా విత్తనాలు అందుబాటులో ఉన్నా వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తుంటారు. ఇదే సమయంలో కొత్త రకం విత్తనాలు, నాణ్యత లేని విత్తనాలు అంటగడుతుంటారు. కొన్నేళ్లుగా జిల్లాలో ఇదే పరిస్థితి ఎదురవుతోంది. అప్పు రుపేణా.. జిల్లాలో కొంతమంది దళారులు రైతులకు అప్పు రూపేణా విత్తనాలు అందిస్తుంటారు. ఇలాంటి సమయంలో నకిలీ విత్తనాలు అంటగడుతుంటారు. వారు ఇచ్చే విత్తనాలు తీసుకోవడమే గానీ, కావాలనుకున్న కంపనీల విత్తనాలు ఇవ్వరు. పంట పండినా, పండకపోయినా పంట దిగుబడి వచ్చే సమయంలో ఇచ్చిన సరుకుకు వడ్డీతో సహా ఇవ్వాల్సిందే. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ∙నకిలీ విత్తనాలను గుర్తించేందుకు వాటిని తయారు చేసిన కంపనీ పేరు, లోగో, బ్యాచ్, లాట్ నంబర్, తయారు చేసిన తేదీ, వాడకానికి గరిష్ఠ గడువు వంటివి ఖచ్చితంగా పరిశీలించాలి. ∙గుర్తింపు పొందిన డీలర్ల నుంచే కొనుగోలు చేయాలి. ∙ఐఎస్ఓ స్టీక్కర్ ఉందో లేదో గమనించాలి. ∙జెర్మినేషన్(మొలకెత్తే శాతం) వివరాలు చూడాలి. ∙ఎలాంటి అనుమానాలున్నా వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలి. -
రబీకి సమాయత్తం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రబీ సాగుకు వ్యవసాయ శాఖ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. సబ్సిడీ విత్తనాలు, ఎరువు లను రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు సమాయత్తమవుతోంది. ఈ సీజన్లో 29వేల హెక్టార్లలో వివిధ పంటలు సాగవుతాయని అంచనా వేసింది. సాధారణంగా రబీలో ఎక్కువగా శనగ, వేరుశనగ, వరి, మొక్కజొన్న పంటలు సాగవుతాయి. సుమారు 11 వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని లెక్కతేల్చారు. ఇప్పటివరకు శనగ, వేరుశనగ విత్తనాలు కొంతమేర మండల స్థాయిలో అందుబాటులో ఉంచారు. మిగతా పంటలతో పోల్చితే ఈ రెండు పంటలు సీజన్ ఆరంభంలోనే సాగుచేస్తారు. ఆ తర్వాతే వరి తదితర పంటలు సాగవుతాయి. విత్తన సబ్సిడీ ఖరారు.. ఆయా విత్తనాలపై సబ్సిడీ ఖరారైంది. శనగ విత్తనాలను 50 శాతం సబ్సిడీపై రైతులు కొనుగోలు చేయవచ్చు. క్వింటా శనగ విత్తనాల ధర రూ.6,500. ఇందులో సబ్సిడీపోను (రూ.3,250) మిగిలిన మొత్తాన్ని రైతు వాటాగా చెల్లించాల్సి ఉంటుంది. వేరుశనగ క్వింటా ధర రూ.6,400గా నిర్ణయించారు. రైతులకు 35 శాతం రాయితీపై వీటిని విక్రయిస్తారు. ఇక వరి ధాన్యం రకాన్ని బట్టి ధరలో స్వల్ప మార్పులు ఉన్నాయి. ధరతో సంబంధం లేకుండా క్వింటాపై రూ.500 రాయితీ పొందవచ్చు. విత్తనాలు అవసరం ఉన్న రైతులు స్థానిక వ్యవసాయ విస్తరణాధికారులను ఆధార్ కార్డు, పట్టాదారు పాస్‌పుస్తకం తీసుకుని కలవాలి. రైతులకు కావాల్సిన విత్తన రకం, పరిమాణాన్ని అతను ఆన్లైన్లో నమోదు చేస్తారు. విత్తనాలు అందుబాటులో ఉన్న పీఏసీఎస్, డీసీఎంస్, ఆగ్రోస్ కేంద్రాలు, అగ్రి సేవా కేంద్రాల్లో రైతులు పొందవచ్చు. సబ్సిడీపై విత్తనాలు కావాలంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు, పట్టాదారు కా>ర్డు ఉండాల్సిందేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఆధార్ ఉంటేనే సబ్సిడీపై ఎరువులు రబీ ప్రారంభంలో అవసరమయ్యే మేరకు ఎరువులు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఈ సీజన్లో వివిధ రకాల 24,580 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని అంచనా. ఇందులో ఇప్పటి వరకు 17 వేల మెట్రిక్ టన్నులకు పైగా అన్ని పీఏసీఎస్, డీసీఎంఎస్, మన గ్రోమోర్ కేంద్రాలు, లైసెన్స్డ్ ప్రైవేటు డీలర్ల వద్ద అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. వీటిని ఈ–పాస్ విధానంలోనే విక్రయిస్తారు. పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు తీసుకెళ్తేనే సబ్సిడీపై ఎరువులు విక్రయిస్తారు. ప్రతి డీలర్ తమ వద్ద అందుబాటులో ఉన్న ఎరువుల ధరలు తప్పనిసరిగా రైతులకు స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాల్సి ఉంటుంది. విస్తృత చర్యలు రబీలో రైతులు పంటలు సాగు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే ఆయా రకాల విత్తనాలు, ఎరువులను క్షేత్రస్థాయిలోకి పంపించాం. ఎటువంటి కొరతా లేదు. ఎక్కడైనా తక్కువ పడితే అప్పటికప్పుడు రైతులకు సమకూర్చేలా చర్యలు తీసుకుంటాం. రోజువారీగా జరుగుతున్న విక్రయాలపై సమీక్షిస్తున్నాం. ఏమైనా ఇబ్బందులు ఉంటే స్థానిక ఏఈఓ లేదా మండల వ్యవసాయ అధికారి దృష్టికి తీసుకెళ్లాలి. – గీతారెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖాధికారిణి -
381 క్వింటాళ్ల వేరుశనగ పంపిణీ
అనంతపురం అగ్రికల్చర్: విత్తన పంపిణీలో భాగంగా 48వ రోజు గురువారం జిల్లా వ్యాప్తంగా 339 మంది రైతులకు 381 క్వింటాళ్ల వేరుశనగ పంపిణీ చేసినట్లు జేడీఏ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. మొత్తమ్మీద ఇప్పటి వరకు 2,87,713 మంది రైతులకు 3,31,355 క్వింటాళ్లు అందజేసినట్లు వెల్లడించారు. 20,529 మంది రైతులకు 2,365 క్వింటాళ్లు విత్తన కందులు, 46,226 మంది రైతులకు 94,441 బహుధాన్యపు కిట్లు, 3,892 మంది రైతులకు 654 క్వింటాళ్లు మొక్కజొన్న పంపిణీ చేశామన్నారు. ఇందులో ఎంవీకేల ద్వారా 52,093 క్వింటాళ్లు వేరుశనగ, 61,053 బహుధాన్యపు కిట్లు ఇచ్చారని తెలిపారు. -
1,176 క్వింటాళ్ల విత్తన కాయల పంపిణీ
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లా వ్యాప్తంగా 1,047 మంది రైతులకు 1,176 క్వింటాళ్ల సబ్సిడీ విత్తన కాయలు శుక్రవారం 32వ రోజు పంపిణీ చేసినట్లు వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు 2,79,903 మంది రైతులకు 3,22,577 క్వింటాళ్లు అందజేశామన్నారు. 18,893 మంది రైతులకు 2,158 క్వింటాళ్లు కందులు, 39,891 మంది రైతులకు 73,283 బహుధాన్యపు కిట్లు అందజేశామన్నారు. ఎంవీకేల ద్వారా 46,816 క్వింటాళ్లు వేరుశనగ, 46,221 కిట్లు ఇచ్చామన్నారు. శనివారం కూడా విత్తన పంపిణీ కొనసాగుతుందన్నారు. -
1,651 క్వింటాళ్ల విత్తన కాయలు పంపిణీ
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లా వ్యాప్తంగా విత్తన వేరుశనగ పంపిణీలో భాగంగా శనివారం 28వ రోజు 1,458 మంది రైతులకు 1,651 క్వింటాళ్లు పంపిణీ చేసినట్లు వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు 2,75,123 మంది రైతులకు 3,17,092 క్వింటాళ్లు అందజేశామన్నారు. 18,226 మంది రైతులకు 2,079 క్వింటాళ్లు విత్తన కందులు, 38,079 మంది రైతులకు 67,388 బహుధాన్యపు కిట్లు పంపిణీ చేశామన్నారు. ఎంవీకేల ద్వారా 45,065 క్వింటాళ్లు వేరుశనగ, 43,021 బహుధాన్యపు కిట్లు పంపిణీ చేశామన్నారు. ఆదివారంతో పాటు రంజాన్ పండుగ కారణంగా సోమవారం విత్తన పంపిణీ ఉండదన్నారు. ఇక పెట్టుబడిరాయితీ (ఇన్పుట్ సబ్సిడీ)కి సంబంధించి జాబితాలు అప్లోడ్ చేసే కార్యక్రమం కొనసాగుతోందన్నారు. అయితే సర్వర్ సమస్య కొంత వరకు ఇబ్బంది పెడుతోందన్నారు. నెలాఖరుకు తొలిజాబితా ద్వారా ట్రెజరీ నుంచి బ్యాంకులు అటు నుంచి రైతుల ఖాతాల్లోకి పరిహారం జమయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.