విత్తనంపై పెత్తనం | Seed Distribution Not Properly In Srikakulam District | Sakshi
Sakshi News home page

విత్తనంపై పెత్తనం

Published Sun, Jun 16 2019 8:23 AM | Last Updated on Sun, Jun 16 2019 8:23 AM

Seed Distribution Not Properly In Srikakulam District - Sakshi

సాక్షి, శ్రీకాకుళం: టీడీపీ నాయకుల స్వలాభాపేక్ష, కొంతమంది వ్యవసాయాధికారుల పక్షపాత వైఖరి కారణంగా జిల్లాలో చాలామంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు తమకు కావాల్సినన్ని విత్తనాల ప్యాకెట్లు ఇళ్లకు తీసుకుపోతున్నారు. టోకెన్లు తీసుకొని మండుటెండలో రోజంతా బారులు తీరిన రైతులు మాత్రం విత్తనాలు దొరక్క నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఉదాహరణకు పాతపట్నం నియోజకవర్గంలోని ఎల్‌.ఎన్‌.పేట మండలంలో జరుగుతున్న చోద్యమే ఇందుకు ఒక నిదర్శనం. ఈనెల 12వ తేదీన విత్తనాల విక్రయం ప్రారంభిస్తున్నామని అధికారులు ప్రకటించారు. స్వర్ణ, 1075 రకాల విత్తనాల కోసం అన్ని గ్రామాల నుంచి వేలాదిగా రైతులు ఉదయం 8 గంటలకే ఎల్‌ఎన్‌ పేట మండల కేంద్రానికి తరలివచ్చారు. గంట తర్వాత వచ్చిన వ్యవసాయశాఖ సిబ్బంది మండల పరిషత్‌ కార్యాలయంలో రైతులకు టోకెన్లు పంపిణీ చేశారు. ఒక రైతుకు రెండు స్వర్ణ, రెండు 1075 రకం విత్తనాల ప్యాకెట్ల కోసం టోకెన్లు రాశారు.

రెండు కంటే ఎక్కువ ఇవ్వలేమని, రెండో విడతలో విత్తనాలు వస్తే మరోసారి రెండు బస్తాల విత్తనాలు ఇస్తామని చెప్పారు. ఇలా వ్యవసాయ శాఖ సిబ్బంది ఇచ్చిన టోకెన్లు తీసుకున్న రైతులు సమీపంలోని ఒక ప్రైవేటు కళ్యాణ మండపం వద్ద బారులు తీరారు. పీఏసీఎస్‌ సిబ్బంది ఆయా రైతుల నుంచి వ్యవసాయశాఖ సిబ్బంది ఇచ్చిన టోకెన్‌తోపాటు డబ్బులు తీసుకుని మరో టోకెన్‌ ఇచ్చారు. పీఏసీఎస్‌ సిబ్బంది ఇచ్చిన టోకెన్‌ తీసుకుని విత్తనాలు నిల్వ ఉంచిన గిడ్డంగి వద్దకు వెళితే అక్కడి కళాసీలు విత్తనాల బస్తాలు ఇవ్వాల్సి ఉంది. అయితే స్థానికంగా ఉన్న హిరమండలం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్, టీడీపీ నాయకుడు కాగాన మన్మధరావు ఆ టోకెన్లతో సంబంధం లేకుండానే గిడ్డంగి వద్దనే డబ్బులు తీసుకుని టీడీపీ నాయకులకు కావాల్సినన్ని విత్తనాలు ఇచ్చేశారు. మధ్యాహ్నం 12 గంటలకే స్వర్ణ రకం విత్తనాలు, ఒంటిగంటకే 1075 రకం విత్తనాలు అయిపోయాయి. అప్పటికే విత్తనాల కోసం డబ్బులు చెల్లించిన రైతులంతా టీడీపీ నాయకుల తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు.

మరెన్నో ఉదంతాలు..
రాజాం నియోజకవర్గంలో పరిస్థితి కూడా దారుణంగా ఉంది. రాజాం, రేగిడి మండలాల్లో విత్తనాలు అడ్డదారిలో టీడీపీ కార్యకర్తల ఇళ్లకు తరలిపోతున్నాయి. వ్యవసాయశాఖ సిబ్బంది కొంతమంది ఈ తంతులో ప్రధాన పాత్ర పోíషిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రాజాం వ్యవసాయ మార్కెట్‌ యార్డు వద్ద విత్తనాలు పంపిణీ చేస్తున్నా రైతులకు అందడం లేదు. రాత్రిపూట ట్రాక్టర్లలో విత్తనాలు తరలించుకుపోతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేగిడి మండలంలో సగానికి పైగా విత్తనాలు బ్లాక్‌ మార్కెట్‌లో తరలించారని వాపోతున్నారు. ఇక టెక్కలి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు అడ్డగోలు గా వ్యవహరిస్తున్నారు. వ్యవసాయ శాఖ, పీఏ సీఎస్, డీసీఎంఎస్‌ సిబ్బంది మొదటి నుంచి ఇక్కడ పనిచేస్తుండటంతో టీడీపీ కార్యకర్తలకు విత్తనాలు కట్టబెడుతున్నారు. దీనిపై వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నప్పటికీ అధికారుల్లో మార్పు కనిపించడం లేదు. దీంతో అర్హులైన రైతులకు రాయితీ విత్తనాలు అందడం లేదు. ఇదేవిధంగా జిల్లాలో చాలాచోట్ల వ్యవసాయశాఖ అధికారులు, సిబ్బంది టీడీపీ నాయకుల ప్రలోభాలకు లొంగిపోతున్నారు. సాంకేతిక లోపాల ముసుగులో బయోమెట్రిక్, టోకెన్లతో సంబంధం లేకుండా విత్తనాల పంపిణీ పక్కదారి పట్టిస్తున్నారు.

అదునులోగా అందించాల్సిందే...
ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లాలోని 2.55 లక్షల హెక్టార్లలో సుమారు 5.50 లక్షల మంది రైతులు వరిసాగు చేస్తున్నారు. ఇందుకు 1.55 లక్షల క్వింటాళ్ల వరి విత్తనాలు అవసరమవుతాయి. మూడో వంతు మంది రైతులు సొంతంగా విత్తనాలు తయారు చేసుకుంటున్నారు. మిగతావారికి మాత్రం ప్రైవేటు వ్యాపారులు విక్రయించే విత్తనాలు, రాయితీపై వ్యవసాయ శాఖ సరఫరా చేసే విత్తనాలే ఆధారం. ఈ ఖరీఫ్‌ సీజన్‌లో ఇప్పటివరకూ 75,900 క్వింటాళ్లు జిల్లాకు చేరాయి. వాటిలో కేవలం 43 వేల క్వింటాళ్లు మాత్రమే వ్యవసాయశాఖ అధికారులు రైతులకు విక్రయించారు. అవి కూడా టీడీపీ నాయకులు చెప్పినవారికే ఎక్కువగా దక్కుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సీఎం, మంత్రి ఆదేశాలు బేఖాతర్‌
అర్హులైన రైతులందరికీ రాయితీ వరి విత్తనాలు సకాలంలో అందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, జిల్లాకు చెందిన మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కానీ ఆచరణలో మాత్రం వ్యవసాయశాఖలో అధికారులు, సిబ్బంది బేఖాతరు చేస్తున్నారు. దీంతో విత్తనాలు అవసరమైన రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అదునులోగా చేతికందుతాయో లేదోనని ఆందోళన చెందుతున్నారు.

టీడీపీ వాళ్లకు నేరుగా ఇచ్చేశారు...
రైతులకు బయోమెట్రిక్‌ ఆధారంగా విక్రయించాల్సిన వరి విత్తనాలు టీడీపీ నాయకుడు, హిరమండలం ఏఎంసీ చైర్మన్‌ విత్తన గిడ్డంగి నుంచి తమ పార్టీకి చెందినవారికి నేరుగా ఇచ్చేస్తున్నారు. నాలాంటి రైతులంతా వ్యవసాయశాఖ సిబ్బంది నుంచి టోకెన్లు తీసుకొని మండుటెండలో వరుసలో ఉంటున్నాం. టీడీపీ నాయకుల నుంచి నేరుగా డబ్బులు తీసుకొని వారికి కావాల్సినన్ని విత్తనాలు ఇచ్చేస్తున్నారు. మేమంతా రోజంతా వేచిచూసి ఒట్టి చేతులతో వెనుదిరగాల్సి వస్తోంది.
– కిలారి త్రినాథరావు, యంబరాం, ఎల్‌ఎన్‌ పేట మండలం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement