దళారులకు మంగళం.. రైతుకు రొక్కం | AP Govt Support To Farmers | Sakshi
Sakshi News home page

దళారులకు మంగళం.. రైతుకు రొక్కం

Published Sat, Apr 24 2021 4:26 AM | Last Updated on Sat, Apr 24 2021 4:26 AM

AP Govt Support To Farmers - Sakshi

కురబలకోట ఎఫ్‌పీవో ఆధ్వర్యంలో రైతులకు పశుగ్రాసం పంపిణీ

సాక్షి ప్రతినిధి, తిరుపతి/మదనపల్లె: దళారులకు మంగళం పాడి.. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. రైతన్నలకు వెన్నుదన్నుగా నిలిచేలా గ్రామ సచివాలయాల పరిధిలో రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ప్రతి గ్రామ సచివాలయం పరిధిలో 10 సంఘాలకు తగ్గకుండా.. ఒక్కో సంఘంలో 15నుంచి 19 మంది రైతులు సభ్యులుగా ఉండేలా కార్యాచరణ అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే చిత్తూరు జిల్లాలోని 14 మండలాల్లో ఏపీ మాస్‌ (మహిళా అభివృద్ధి సొసైటీ) ఆధ్వర్యంలో రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్‌పీవోలు) ఏర్పాటయ్యాయి. 14 రైతు ఉత్పత్తిదారుల సంఘాలను కలిపి ‘మదనపల్లె టమాటా ఫార్మర్‌ ప్రొడ్యూసర్స్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎం.టమాటా) పేరుతో ఓ కంపెనీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

అన్నదాతలకు వెన్నుదన్నుగా..
జర్మనీకి చెందిన గ్రీన్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ (జీఐసీ) ప్రాజెక్ట్‌ ఆధ్వర్యంలో టమాటా సాగులో ఖర్చుల్ని తగ్గించడం.. ఉత్పత్తి, ఆదాయం పెంచడమే లక్ష్యంగా చిత్తూరు జిల్లాలో ఏపీ మాస్‌ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. గ్రామాల్లో రైతు సంఘాలు, పంచాయతీ స్థాయిలో సమాఖ్య, మండల స్థాయిలో రైతు ఉత్పత్తి సంఘాలు (ఎఫ్‌పీవోలు)గా ప్రభుత్వం రిజిస్టర్‌ చేయించింది. 14 మండలాల్లోని ఎఫ్‌పీవోలతో కలిపి ‘ఎం–టమాటా’ కంపెనీగా 2019 ఫిబ్రవరి 28న రిజిస్టర్‌ అయ్యింది. ఇందులో 10 వేల మంది రైతులు వాటాదారులుగా(షేర్‌ హోల్డర్స్‌) ఉన్నారు. అప్పటినుంచి టమాటా సాగులో ఉత్తమ యాజమాన్య పద్ధతులను పరిచయం చేస్తూ సంస్థ కార్యకలాపాలను విస్తరించుకుంటూ ముందుకు సాగుతోంది. రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా ప్రోత్సహించడమే కాకుండా పంట పెట్టుబడులకు తక్కువ వడ్డీకే రుణాలిస్తోంది. నాణ్యమైన విత్తనాల పంపిణీ చేస్తూ పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.

మండల స్థాయిలోని ఎఫ్‌పీవోలకు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందించేలా లైసెన్స్‌లు ఇప్పించి కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్ల ద్వారా వ్యవసాయానికి సంబంధించిన అన్ని పనులకు తోడ్పాటు అందిస్తోంది. ఎఫ్‌పీవోలు నూతన వ్యవసాయ విధానాలపై రైతులకు అవగాహన పెంచేందుకు పొలం బడులు, రాత్రిపూట సమావేశాలు నిర్వహిస్తాయి. ప్రదర్శన క్షేత్రాలను నిర్వహించడంతోపాటు ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి లాభసాటి పంటల సాగుకు సంబంధించిన పరిజ్ఞానాన్ని అందిస్తాయి. పెట్టుబడులను తగ్గించి, భూసారాన్ని పరిరక్షించేందుకు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గిస్తూ సేంద్రియ వ్యవసాయాన్ని, లాభసాటి పంటలను ప్రోత్సహిస్తుంది. వ్యవసాయ ఉత్పాదకాలను రైతుకు తక్కువ ధరలకు అందించడంతో పాటు పండించిన ఉత్పత్తులను మార్కెటింగ్‌ చేసుకునేందుకు సహకారాన్ని అందిస్తాయి. రైతుల మధ్య పరస్పర సహకారాన్ని, సఖ్యతను పెంపొందించి ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పాటు చేస్తాయి.

లాక్‌డౌన్‌ సమయంలో..
ఎం–టమాటా కంపెనీ ఆధ్వర్యంలోని రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్‌పీవో) రామసముద్రం, పలమనేరు, వి.కోట, మదనపల్లె, నిమ్మనపల్లె, కురబలకోట, కలికిరి, వాల్మీకిపురం మండలాల్లో సభ్య రైతుల నుంచి టమాటాలను కొనుగోలు చేసి మంచి ధర వచ్చేలా చూసింది. లాక్‌డౌన్‌ సమయంలో రైతులకు అండగా నిలిచేందుకు 2020 ఏప్రిల్‌ 9న కొనుగోళ్లు ప్రారంభించి మే 10 వరకు 1,997 మెట్రిక్‌ టన్నుల టమాటాలను గుడిపాలలోని ఫుడ్స్‌ అండ్‌ ఇన్, కర్ణాటకలోని శ్రీనివాసపురం సన్‌సిప్‌ అగ్రి ప్రొడక్టŠస్‌ ప్రాసెసింగ్‌ కంపెనీలకు సరఫరా చేసింది. నిమ్మనపల్లె, రామసముద్రం, పలమనేరు, వి.కోట, మదనపల్లె ఎఫ్‌పీవోలకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యాన శాఖ ద్వారా రాష్ట్రీయ వికాస్‌ యోజన (ఆర్‌కేవీవై) పథకం కింద 75 శాతం సబ్సిడీపై టమాటా రవాణా కోసం రూ.14 లక్షల విలువ చేసే ఐషర్‌ వాహనాలను సమకూర్చింది.

ఇందుకోసం ఐదు ఎఫ్‌పీవోలకు రూ.5 లక్షల చొప్పున ఈక్విటీ గ్రాంట్‌గా ప్రభుత్వం మంజూరు చేసింది. ఒక్కొక్క ఎఫ్‌పీవోకు 50 శాతం సబ్సిడీపై 1,000 క్రేట్లను అందించింది. పంటలో కలుపు తీయడానికి వినియోగించే 17 పవర్‌ వీడర్స్‌ను 50 శాతం సబ్సిడీతో నిమ్మనపల్లె, మదనపల్లె, పలమనేరు, రామసముద్రం ఎఫ్‌పీవోలకు మంజూరు చేసింది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో నిమ్మనపల్లె ఎఫ్‌పీవో రూ.2 కోట్లు, మర్యాదరామన్న పట్నం ఎఫ్‌పీవో రూ.1.20 కోట్లు, రామసముద్రం ఎఫ్‌పీవో రూ.60 లక్షలు, వి.కోట ఎఫ్‌పీవో రూ.60 లక్షలు, వాల్మీకిపురం ఎఫ్‌పీవో రూ.35 లక్షలు, కురబలకోట ఎఫ్‌పీవో రూ.40 లక్షలకు పైగా వ్యాపార లావాదేవీలు నిర్వహించాయి. 

వ్యవసాయానికి కొత్తరూపు వచ్చింది
పెట్టుబడి ఖర్చులు తగ్గించేందుకు అధికారుల సలహాలు, సూచనలతో చేస్తున్న వ్యవసాయం నేడు కొత్తరూపు సంతరించుకుంటోంది. మంచి దిగుబడులు, పెరుగుతున్న ఆదాయంతో రైతులు సంతృప్తి చెందుతున్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న ప్రయోజనాలు, అందిస్తున్న సహాయం అండగా నిలుస్తోంది. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు రైతుకు వెన్నుదన్నుగా ఉంటాయనడంలో సందేహం లేదు. 
– కృష్ణరాధ, అధ్యక్షురాలు, మర్యాదరామన్న పట్నం ఎఫ్‌పీవో 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement