వాళ్లు మనోళ్లే.. ఇచ్చేయండి
► ‘సీమ’లో విత్తన విక్రయ కేంద్రాల ఏర్పాటులో రాజకీయం
► అస్మదీయులకే ఇవ్వాలని మంత్రి హుకుం
► పాత బకాయిలున్నా, క్రిమినల్ కేసులున్నా ఇవ్వాల్సిందేనట!
► రాజకీయ జోక్యంతో ఆలస్యం కానున్న వేరుశెనగ పంపిణీ
అనంతపురం: మంజూరు చేసేది మనవాడైతే అక్రమాలు చేసినా ఏజెన్సీలు మంజూరవుతాయి. క్రిమినల్ కేసులున్నా ఎవరూ పట్టించుకోరు. దీనికి నిదర్శనం రాయలసీమలో విత్తన పంపిణీ కేంద్రాల మంజూరు. మంత్రికి అస్మదీయులుగా ఉన్న వారు పాత బకాయిలూ చెల్లించకపోయినా వారికే రాయలసీమ జిల్లాల్లోని వేరుశనగ విత్తన పంపిణీ కేంద్రాలను కట్టబెట్టారు. ఈ తీరుపై విత్తన సేకరణ సంస్థలు నిరసిస్తున్నా మంత్రి మాత్రం పట్టువీడకుండా ‘డిపాల్టర్ల’కే పంపిణీ కేంద్రాలు దక్కేలా చూస్తున్నారు. వచ్చే ఖరీఫ్‌లో రాయలసీమలో 10.07 లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగవుతుందని అంచనా. ఇందుకోసం 5.92 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని సబ్సిడీ ద్వారా రైతులకు అందించేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. మొదట మే 9న విత్తన పంపిణీని ప్రారంభించాలని అధికారులు భావించారు. అయితే పంపిణీ కేంద్రాల ఏర్పాటులో రాజకీయ జోక్యం తీవ్రం కావడంతో పంపిణీ ఆలస్యమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి.
పంపిణీ కేంద్రాల ఏర్పాటు ఇలా..
ప్రతి మండలంలో ఓ విత్తన పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. విత్తన సేకరణ సంస్థలే వీటిని ఎంపిక చేసుకుంటాయి. అయితే రాయలసీమలో మాత్రం పంపిణీ కేంద్రాలను అధికార పార్టీ నేతలకే కట్టబెట్టాలని విత్తన సేకరణ సంస్థలకు వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మౌఖిక ఆదేశాలు జారీచేసినట్లు తెలుస్తోంది. దీంతో పాటు అనంతపురానికి చెందిన ఓ మంత్రి స్వయంగా ఫోన్ చేసి ఫలానా వారికే అనుమతులు ఇవ్వాలని హుకుం జారీ చేశారు. తమకు తెలీకుండా వేరొకరికి ఇవ్వొద్దని ఆదేశించారు. దీంతో విత్తన సేకరణ కంపెనీలు తలపట్టుకుంటున్నాయి.
క్రిమినల్ కేసులున్నా ఇవ్వాల్సిందేనట
గత రెండేళ్లుగా విత్తన పంపిణీ పూర్తి అస్తవ్యస్తంగా సాగింది. సబ్సిడీ విత్తనకాయలను బ్లాక్ మార్కెట్లో విక్రయించి అందినకాడికి దండుకున్నారు. గతేడాది కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని బ్రహ్మసముద్రంలో టీడీపీ జెడ్పీటీసీ సభ్యుడు తన గోదాములో దాదాపు 750 బస్తాలను రహస్యంగా దాచారు. ఉరవకొండ, కనగానపల్లి, రామగిరి, కదిరితో పాటు చాలా చోట్ల పంపిణీలో అవకతవకలు చోటు చేసుకున్నాయి. కొన్ని ఏజెన్సీలపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ ఏజెన్సీలు పంపిణీ సంస్థలకు భారీగా బకాయిలు కూడా ఉన్నాయి. మార్క్‌ఫెడ్, ఆయిల్‌ఫెడ్, హాకా, ఏపీ సీడ్స్‌లకు ‘సీమ’లోని నాలుగు జిల్లాల్లో ఏజెన్సీలు దాదాపు 10.87 కోట్ల బకాయిలు పడ్డాయి. ఇందులో హాకా, ఏపీ సీడ్స్‌కు అధికశాతం బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా అధికారపార్టీ సానుభూతిపరులు కావడంతో బకాయిల చెల్లింపులో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు.
సీమలో 2016 ఖరీఫ్ ప్రణాళిక ఇదే!
జిల్లా సాధారణ సాగు విస్తీర్ణం విత్తనకాయల ప్రతిపాదనలు
(లక్షల హెక్టార్లలో) (క్వింటాళ్లలో)
అనంతపురం 6.95 3.90లక్షలు
చిత్తూరు 1.36 90వేలు
కర్నూలు 1.04 65వేలు
వైఎస్సార్‌జిల్లా 0.72 47వేలు
మొత్తం 10.07 5.92 లక్షలు