పురుగు మందుల విక్రయానికి ప్రభుత్వం నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. పంటల సాగులో విచ్చలవిడిగా మందులు వాడకుండా కొత్త నిబంధన పెట్టింది. ఇక నుంచి పురుగు మందులు కొనుగోలు చేయాలంటే వ్యవసాయాధికారి చీటీ (ప్రిస్కిప్షన్) తప్పనిసరి చేసింది. సాగు చేసిన పంట, ఆశించిన తెగుళ్లు, తదితర వాటిని రైతులు అధికారులకు వివరిస్తే ఏ మందును, ఎంత మోతాదులో వాడాలో వ్యవసాయాధికారి చీటీ రాసిస్తారు. ఈ మేరకే దుకాణాల్లో పురుగు మందులు ఇస్తారు. దీనిని అతిక్రమించే పురుగు మందుల విక్రయ డీలర్లు, వ్యాపారులపై వ్యవసాయశాఖ అధికారులు చర్యలు తీసుకోనున్నారు.
ఆదిలాబాద్‌టౌన్: విచ్చిలవిడిగా పురుగుల మం దుల వాడకం వల్ల మానవాళికి నష్టం వాటిళ్లడంతోపాటు జీవ వైవిద్యంపై ప్రభావం చూపుతోం ది. అవసరానికి మించి రైతులు పంటలకు పురుగుల మందులు చల్లడంతో కూరగాయలు, ఇతర ఆహార పంటలు విషపదార్థాలుగా మారి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన ప్రభుత్వం నిర్ణీత మోతాదులో పురుగుల మందులు వాడాలనే ఉద్దేశంతో వ్యవసాయ అధికారుల ద్వారా ప్రిస్కిప్షన్ (చీటీ) రైతులకు అందిస్తున్నారు. దాని ప్రకారమే డీలర్లు రైతులకు పురుగు మందులు, ఎరువులు విక్రయించాల్సి ఉంటుంది. నిబంధనలు విస్మరిస్తే డీలర్లపై చర్యలు తీసుకునేందుకు వ్యవసాయశాఖ సిద్ధమవుతోంది. ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో సేంద్రియ పద్ధతిలో పంటలు పండించడంతో ఇటు ఆరోగ్యంతోపాటు అటు రైతులకు పెట్టుబడి కూడా తక్కువగా ఉండేది. ప్రస్తుతం పురుగు మందుల ధరలు పెరిగిపోవడం, కూరగాయలు, ఇతర ఆహార పంటలు కొనుగోలు చేసే వారిపై దీని ప్రభావం పడడమే కాకుండా వారు అనారోగ్యానికి గురవుతున్నారు.
జిల్లాలో..
ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 250కుపైగా ఎరువులు, పురుగుల మందుల దుకాణాలు ఉన్నాయి. ఆదిలాబాద్ పట్టణంతోపాటు ఇచ్చోడ, బోథ్, ఉట్నూర్, ఇంద్రవెల్లి, బేల తదితర మండలాలు, ఆయా గ్రామాల్లో పురుగులు, ఎరువుల దుకాణాలు ఉన్నాయి. అయితే ఇక నుంచి రైతులు వ్యవసాయ శాఖ అధికారులు జారీ చేసిన ప్రిస్కిప్షన్ మేరకే మందులు వాడాల్సి ఉంటుంది. మండల ఏఈఓ, ఏఓలు పంటకు ఎంత మోతాదులో మందులు వాడాలనే విషయాన్ని రైతులకు వివరిస్తారు. పండించిన పంటకు ఎలాంటి కీటకాలు ఆశించాయో రైతులు విన్నవిస్తే ఏ మందులు వాడాలి, ఎంత మోతాదులో వాడాలనేది ప్రిస్కిప్షన్ ద్వారా రాసి ఇస్తారు. ఆ చీటిని మందుల దుకాణదారుడికి చూపిస్తేనే రైతులకు మందులు లభించే పరిస్థితి ఉంది.
జీవ వైవిధ్యంపై ప్రభావం
కొంతమంది రైతులు అవగాహన లేక పంట పొలాల్లో విచ్చలవిడిగా ఎరువులు, పురుగుల మందులను పిచికారి చేస్తున్నారు. దీంతో నేల సారవంతం దెబ్బతినడమే కాకుండా జీవ వైవిద్యంపై కూడా ప్రభావం చూపుతుందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. పంటకు కీడు చేసే పురుగులతో మిత్ర పురుగులు కూడా ఉంటాయనే విషయాన్ని రైతులు గ్రహించలేక పోతున్నారు. అధిక మోతాదులో మందులను వాడడంతో అవి చనిపోయి పంట దెబ్బతినే ప్రమాదం ఉంది. పత్తి, సోయాబీన్, కందులు, కూరగాయలు, ఆకుకూరలు, ఇతర ఆహార పంటలకు ఏ తెగుళ్లు సోకినా రైతులు వ్యవసాయ అధికారుల సూచనలు తీసుకోవాలని పేర్కొంటున్నారు. అవగాహన లేమితో పురుగుల మందులు, ఎరువులను వాడితే నష్టాలను చవిచూసే అవకా>శాలు ఉన్నాయని చెబుతున్నారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే కొరడా
ఎరువులు, పురుగు మందులు విక్రయించే డీలర్లు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్ వ్యవసాయ శాఖాధికారులకు ఇదివరకే ఆదేశాలు జారీ చేసిన విషయం విధితమే. ప్రతీ రైతుకు విత్తనాలు, ఎరువులు, పురుగుల మందు బిల్లులు తప్పనిసరిగా అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. దుకాణంలో ధరల బోర్డు తప్పనిసరిగా ఉంచాలని, స్టాక్ రిజిస్టర్, నిల్వ వివరాలను ప్రదర్శించాలని సూచించారు. ఈ నిర్ణయంతో విచ్చలవిడిగా పురుగుల మందుల వాడకం తగ్గడంతో పాటు అవగాహన లేని రైతులు సైతం మోతాదులో వాడే అవకాశం ఉంది.
సేంద్రియ పద్ధతికి ప్రోత్సాహం
పురుగు మందులు చల్లిన కూరగాయలు, ఆకుకూరలు, ఇతర ఆహార పంటలను కొనుగోలు చేసి వినియోగిస్తున్న ప్రజలు ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారని కలెక్టర్ గ్రహిం చి ఆదిలాబాద్ పట్టణంలో సేంద్రియ ఆహార పంటల విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వారిని ప్రోత్సహించడమే కాకుండా సేంద్రియ పద్ధతిలో సాగు చేసే ఆహార పదార్థాలను విని యోగించాలని ఇటు ప్రజలు సైతం అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం పురుగు మందులను మోతాదుకు మించి రైతులు వాడకూడదనే నిబంధన తీసుకురావడం అభినందనీయమని పలువురు పేర్కొంటున్నారు.
ప్రభుత్వ నిర్ణయం మంచిదే..
అవగాహన లేని కారణంగా రైతులు పంటకు అనుకూలం లేని పురుగుల మందులను కూడా విచ్చలవిడిగా వాడి నష్టపోతున్నారు. ఆహార పంటలకు మోనోక్రోటోఫాస్ మందు పిచికారీ చేయవద్దని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నా వాటిని పాటించడంలేదు. ఆహార పదార్థాలకు ఈ మందును పిచికారీ చేయడంతో అవి విషపదార్థాలుగా మారుతాయి. పురుగుల మందులు విచ్చలవిడిగా వాడకుండా సేంద్రియ పద్ధతిలో తక్కువ ఖర్చుతో రైతులు పంటలు సాగు చేసుకోవచ్చు.
– సుధాన్షు, ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త, ఆదిలాబాద్
డీలర్లకు ఆదేశాలు జారీ చేశాం
పురుగు మందులు రైతులు విచ్చలవిడిగా వాడకూడదని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి. ఈ విషయమై డీలర్లకు కూడా సమాచారం అందించాం. ఏఓ, ఏఈఓలు సూచించిన పురుగు మందులనే రైతులు వాడాల్సి ఉంటుంది. ప్రిస్కిప్షన్ లేకుండా ఎవరైనా డీలర్లు పురుగు మందులు విక్రయిస్తే శాఖ పరమైన చర్యలు తీసుకుంటాం.
– శివకుమార్, వ్యవసాయశాఖ నోడల్ అధికారి
Comments
Please login to add a commentAdd a comment