Fertilizer price
-
దీపక్ ఫెర్టిలైజర్స్ పునర్వ్యవస్థీకరణ
ముంబై: పారిశ్రామిక రసాయనాలు, ఎరువుల దిగ్గజం దీపక్ ఫెర్టిలైజర్స్ అండ్ పెట్రోకెమికల్స్ కార్పొరేషన్(డీఎఫ్పీసీఎల్).. కార్పొరేట్ పునర్వ్యవస్థీకరణకు తెరతీయనుంది. తద్వారా మైనింగ్ కెమికల్స్, ఫెర్టిలైజర్ బిజినెస్‌లను విడదీయనుంది. డీఎఫ్పీసీఎల్కు సొంత అనుబంధ సంస్థ స్మార్ట్‌కెమ్ టెక్నాలజీస్(ఎస్టీఎల్) బోర్డు గురువారం ఇందుకు అనుమతించినట్లు ఒక ప్రకటనలో కంపెనీ వెల్లడించింది. మైనింగ్ కెమికల్స్(టీఏఎన్) బిజినెస్‌ను ఎస్టీఎల్ నుంచి విడదీసి పూర్తి అనుబంధ సంస్థ డీఎంఎస్పీఎల్కు బదిలీ చేయనున్నట్లు పేర్కొంది. ఎస్‌టీఎల్‌కు సొంత అనుబంధ సంస్థ మహాదాన్ ఫామ్ టెక్నాలజీస్‌ను ఎస్టీఎల్లోనే విలీనం చేయనున్నట్లు తెలియజేసింది. (ఈ వార్తల నేపథ్యంలో దీపక్ ఫెర్టిలైజర్స్ షేరు బీఎస్ఈలో 1.1 శాతం బలపడి రూ. 812 వద్ద ముగిసింది.) -
ఆగ్రహంతో ప్రభుత్వాధికారిని స్థంభానికి కట్టేసిన రైతులు: వీడియో వైరల్
న్యూఢిల్లీ: బిహార్‌లోని మోతిహారిలో ఎరువులు నిల్వ ఉంచడం, బ్లాక్ మార్కెటింగ్ చేయడం పై ఆగ్రహం చెందిన రైతులు ఒక ప్రభుత్వాధికారిని స్థంభానికి కట్టేశారు. రైతుల ఆవేదన అర్థం చేసుకోకుండా ఎరువుల ధరలు తమ ఇష్టరాజ్యంగా పెంచేందుకు యత్నిస్తున్న ఒక అధికారికి బుద్ధి చెప్పేందుకే ఇలా చేసినట్లు సమాచారం. వివరాల్లోకెళ్లే...బిహార్‌లో వ్యవసాయ శాఖ నియమించిన కిసాన్ సలహదారుడు నితిన్ కుమార్‌ని రైతులు స్థంభానికి కట్టేశారు. సదరు సలహదారు ఎరువుల విక్రయదారులతో చేతులు కలిపి ధర పెంచే పనిలో పడ్డారని రైతులు ఆరోపిస్తున్నారు. అదీగాక యూరియా బస్తాను ప్రభుత్వం రూ. 265కి విక్రయిస్తుంటే స్థానిక దుకాణాదారులు అదే యూరియాని తమకు రూ.500 నుంచి రూ. 600 విక్రయిస్తున్నారని వాపోయారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో స్థానిక యంత్రాంగం వెంటనే స్పందించి సదరు ప్రభుత్వాధికారిని విడిపించే ప్రయత్నంలో పడింది. చివరకు అధికారులు రైతులకు వ్యవసాయానికి అవసరమైన అన్ని వస్తువులు ప్రభుత్వ ధరకు లభిస్తాయని హామీ ఇవ్వడమే గాక సదరు అధికారిని విడిపించేందుకు వారిని ఒప్పించారు. खाद की कालाबाज़ारी से तंग आकर मोतिहारी में कृषि सलाहकार को किसानों ने खंभे से बांध दिया @ndtvindia pic.twitter.com/UMfOKrug79 — manish (@manishndtv) August 29, 2022 (చదవండి: క్లాస్‌రూమ్‌లో హఠాత్తుగా ఫ్యాన్ పడటంతో విద్యార్థినికి గాయాలు) -
ఎరువుల ధరలు పెంచి దేశ రైతాంగం నడ్డి విరిచారు: సీఎం కేసీఆర్
హైదరాబాద్: ఎరువుల ధరల పెంపు అంశంలో కేంద్రంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎరువుల ధరల పెంపును నిరసిస్తూ ప్రధాని మోదీకి కేసీఆర్ బహిరంగలేఖ రాశారు. ఎరువుల ధరలు పెంచి దేశ రైతాంగం నడ్డి విరిచారని లేఖలో కేసీఆర్ విమర్శించారు. వ్యవసాయ ఖర్చులు రెట్టింపు చేయడం దుర్మార్గమని ఎద్దేవా చేశారు. కేంద్రం.. రైతులను వారి పొలాల్లోనే కూలీలుగా మార్చే కుట్ర చేస్తోందని మండిపడ్డారు. 2022 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పిన కేంద్రం.. ఉల్టా వ్యవసాయ ఖర్చులు రెట్టింపు చేయడం దుర్మార్గమని దుయ్యబట్టారు. బీజేపీ ప్రభుత్వం పచ్చి రైతు వ్యతిరేక ప్రభుత్వం అని మరోసారి నిర్ధారణ అయిందని స్పష్టం చేశారు. దేశ రైతాంగాన్ని బతకనిచ్చే పరిస్థితి లేదన్నారు. కరెంటు మోటార్లు బిగించి బిల్లులు వసూలు చేయడం... ఎన్ఆర్జీఈ నీ వ్యవసాయానికి అనుసంధానం చేయమంటే చేయకుండా నాన్చడం దుర్మార్గమని మండిపడ్డారు. రైతులు తాము పండించిన ధాన్యాన్ని కూడా కొనకుండా దుర్మార్గపు చర్యలకు పూనుకోవడం ...వెనక కుట్ర దాగి వుందన్నారు. రైతులను వారి పొలాల్లో వారినే కూలీలుగా మార్చే కుట్రలను ఎదుర్కోవాలన్నారు. గ్రామీణ వ్యవసాయ రంగాన్ని, అనుబంధ వృత్తులను నిర్వీర్యం చేసి, గ్రామీణ ఆర్థిక రంగాన్ని చిన్నాభిన్నం చేసి వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు కేంద్రం కుట్రలు చేస్తుందని విమర్శించారు. బీజేపీని కూకటివేళ్లతో పెకలించి వేయాలని ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఎరువుల సబ్సిడీలను ఎత్తివేసి రైతులను వ్యవసాయం చేయకుండా చేస్తున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వంపై దేశ రైతాంగం తిరగబడాలన్నారు. నాగండ్లు ఎత్తి తిరగబడితే తప్ప వ్యవసాయాన్ని కాపాడుకొలేని పరిస్థితులు దాపురించాయనీ ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ కేంద్రానికి బుద్ధి వచ్చేదాకా ఎక్కడికక్కడ నిలదీయాలని ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. కేంద్రం తక్షణమే ఎరువుల ధరలను తగ్గించాలని.. లేని పక్షంలో దేశ వ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కేంద్రం కుట్రలను రాష్ట్ర రైతాంగం అర్థం చేసుకొని బీజేపీ ప్రభుత్వం పై ధరలు తగ్గించే దాకా సాగే పోరాటంలో కలిసిరావాలనీ పిలుపు నిచ్చారు. చదవండి: సజ్జనార్‌కు అర్ధరాత్రి యువతి ట్వీట్.. వెంటనే స్పందించిన ఆర్టీసీ ఎండీ -
రైతులా వచ్చిన సబ్ కలెక్టర్.. దుకాణాదారులకు ముచ్చెమటలు
కైకలూరు: అది కైకలూరు జాతీయ రహదారిపై అడవి నాయుడు సెంటర్. సమయం శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలు. లుంగీ, షర్టు ధరించి ఓ వ్యక్తి బైక్‌పై ఎరువుల దుకాణానికి వచ్చాడు. యూరియా, డీఏపీ రెండు బస్తాలు కావాలని అడిగాడు. దుకాణం యజమాని ఓ తెల్లచీటీపై రాసి, పక్కనే గోడౌన్లో తెచ్చుకో అని పంపించాడు. అక్కడకెళ్లి రెండు బస్తాలను బైక్‌పై వేసుకుని తిరిగి దుకాణం వద్దకు వచ్చాడు. బోర్డులో సూచించిన ఎమ్మార్పీ కంటే ఎక్కువ వసూలు చేస్తున్నారేంటని నిలదీశాడు. రైతులందరి నుంచి ఇలానే వసూలు చేస్తున్నారా అంటూ గద్దించాడు.. అప్పటికి గానీ ఆ వ్యాపారికి అర్థంకాలేదు.. ఎరువుల కోసం వచ్చింది రైతు కాదు, విజయవాడ సబ్ కలెక్టరు జి.సూర్య సాయి ప్రవీణ్ చంద్ అని. అసలేం జరిగిందంటే... కలెక్టరు జె.నివాస్ ఆదేశాలతో సబ్ కలెక్టరు సూర్య సాయి ప్రవీణ్ చంద్ రైతు వేషధారణలో ఎరువుల దుకాణాల్లో తనిఖీలకు ముదినేపల్లి మండలం దేవపూడి శ్రీలక్ష్మీగణేష్ ట్రేడర్స్ వద్దకు వెళ్లారు. అప్పటికి దుకాణం తెరవలేదు. అక్కడే ఉన్న రైతులను ధరలపై ప్రశ్నించగా అధిక ధరలు అడుగుతున్నారని బదులిచ్చారు. వెంటనే వ్యవసాయ శాఖ ఏఓను పిలిపించి, ఆ దుకాణాన్ని తనిఖీచేసి, అధిక ధరలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆ తర్వాత కైకలూరులో వాసవీ ఫెర్టిలైజర్స్‌కు వెళ్లి యూరియా కావాలని అడగ్గా, వ్యాపారి లేదని సమాధానం చెప్పాడు. అక్కడి నుంచి వెంకట నాగదత్త ఏజెన్సీస్‌కు వెళ్లి యూరియా, డీఏపీ కావాలని అడిగారు. యూరియా బస్తా ధర రూ.266.50 కాగా రూ.280, డీఏపీ బస్తాకు రూ.1200 బదులు రూ.1250 తీసుకున్నారు. పైగా ఆధార్ ద్వారా బయోమెట్రిక్ లేకుండా, బిల్ ఇవ్వకుండా విక్రయించారు. అనంతరం వాసవీ ఫెర్టిలైజర్స్‌లో తనిఖీ చేయగా గోడౌన్లో యూరియా నిల్వలు ఉన్నాయి. ఈ రెండు దుకాణాలను సీజ్ చేసి, చర్యలు తీసుకోవాలని తహసీల్దారు సాయి కృష్ణకుమారి, వ్యవసాయశాఖ ఏడీ జి.గంగాధరరావు, ఏఓ దివ్యను సబ్ కలెక్టర్ ఆదేశించారు. -
ఎరువు ధర తగ్గిందోచ్!
ఎట్టకేలకు ఎరువుల ధరలు తగ్గాయి. రైతుకు పెద్ద భారం తగ్గింది. ఏటా పెరుగుతున్న ధరలతో రైతు దిగాలుపడినా... తప్పనిసరి పరిస్థితుల్లో భారం భరించేవాడు. ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయంతో ఊరట లభించింది. రైతు మోములో చిరునవ్వు కనిపించింది. బొండపల్లి(గజపతినగరం): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఆసరాగా నిలవడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాయి. రెండు నెలల క్రితం పెరిగిన ఎరువుల ధరలను తగ్గిస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటికే పెరిగిన పెట్టుబడుల కారణంగా రైతులకు వ్యవసాయం పెనుభారంగా పరిణమించిన నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో గతంలో ఉన్న పాలకులు ఎరువుల ధరలను భారీగా పెంచడంతో రైతులపై పెనుభారం పడింది. కేవలం రూ. 950లున్న డీఏపీ బస్తా ధర గడచిన ఐదేళ్లలో రూ. 1430ల వరకు పెరిగింది. అంతే గాకుం డా అన్ని రకాల ఎరువుల ధరలు గత ఐదేళ్లలో రూ. 200 లు నుంచి రూ. 400 ల వరకు పెరి గింది. ఈ తరుణంలో రైతులపై పడిన భారాన్ని తగ్గించేందుకు ప్రస్తుతం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సముచితమని రైతాం గం అభిప్రాయపడుతోంది. తగ్గించిన ధరలు ఈ నెల మొదటివారంనుంచి అమలులోకి రావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. డీలర్లు, సహకార సంఘాల వద్ద ఇప్పటికే నిల్వ ఉన్న సరకు తాజాగా నిర్థారించిన ధరలకే విక్రయిం చాలని ప్రభుత్వం అందరు డీలర్లు, సహకార సంఘాలకు ఆదేశాలు జారీ చేసింది. అలా కాదని పాత ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది. రైతులకు ఉపశమనం.. ఎరువుల ధరలు తగ్గించడం వల్ల రైతులపై భా రం తగ్గనుంది. ప్రతి బస్తా పైనా రెండు నెలల క్రితం రూ. 125 ల నుంచి రూ. 150ల వరకు కంపెనీని బట్టి ధరలు పెంచగా, ప్రభుత్వం దా నిని సవరిస్తూ ఒక్కో బస్తాపై రూ. 50ల వరకు తగ్గించింది. డీఏపీతోపాటు కొన్ని రకాల కాంపె ్లక్స్ ఎరువుల ధరలు తగ్గించడంతో రైతులకు ఆర్థికంగా కాస్త వెసులుబాటు దొరకనుంది. రైతుకు ఆసరా.. ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఎరువుల ధరలు తగ్గడం వల్ల రైతులకు కొంత వరకు ఆసరాగా ఉంటుంది. ఇప్పటికే రైతులకు పెట్టుబడులు పెరిగిపోయి వ్యవసాయం భారంగా మారింది. ఈ తరుణంలో ధరలు తగ్గిస్తూ మంచి నిర్ణయం తీసుకోవడం ముదావహం. – గెద్ద సత్యనారాయణ రైతు, బొండపల్లి కొత్త ధరలకే విక్రయించాలి.. ప్రభుత్వం డీఏపీ, పొటాష్‌తో సహా కొన్ని రకాలైన ఎరువుల ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఒక్కో బస్తాపై రూ. 50లు తగ్గించింది. డీలర్లు, సహకార సంఘాల్లో ఎరువులు విక్రయించేవారు కొత్త ధరలకే ఎరువులు విక్రయించాలి. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశాం. ఎక్కువ ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం. – కె,మహరాజన్, ఏడీఏ, గజపతినగరం రైతులకు కొంతవరకు మేలు.. ప్రభుత్వం ఎరువుల ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం వల్ల కొంత వరకు రైతులకు ఉపశమనం కలగనుంది. ఇప్పటిప్పుడే మండలం లో కురుస్తున్న వర్షాలకు నాట్లు పడుతున్నా యి. ఇప్పుడు డీఏపీ, పొటాష్ వంటి ఎరువుల అవసరం ఉంటుంది. ధరలు తగ్గడం వల్ల ఆర్థికంగా ఇబ్బంది తొలగనుంది. – కర్రోతు శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్, వేండ్రాం, బొండపల్లి మండలం -
మందులు కావాలా నాయనా!
పురుగు మందుల విక్రయానికి ప్రభుత్వం నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. పంటల సాగులో విచ్చలవిడిగా మందులు వాడకుండా కొత్త నిబంధన పెట్టింది. ఇక నుంచి పురుగు మందులు కొనుగోలు చేయాలంటే వ్యవసాయాధికారి చీటీ (ప్రిస్కిప్షన్) తప్పనిసరి చేసింది. సాగు చేసిన పంట, ఆశించిన తెగుళ్లు, తదితర వాటిని రైతులు అధికారులకు వివరిస్తే ఏ మందును, ఎంత మోతాదులో వాడాలో వ్యవసాయాధికారి చీటీ రాసిస్తారు. ఈ మేరకే దుకాణాల్లో పురుగు మందులు ఇస్తారు. దీనిని అతిక్రమించే పురుగు మందుల విక్రయ డీలర్లు, వ్యాపారులపై వ్యవసాయశాఖ అధికారులు చర్యలు తీసుకోనున్నారు. ఆదిలాబాద్‌టౌన్: విచ్చిలవిడిగా పురుగుల మం దుల వాడకం వల్ల మానవాళికి నష్టం వాటిళ్లడంతోపాటు జీవ వైవిద్యంపై ప్రభావం చూపుతోం ది. అవసరానికి మించి రైతులు పంటలకు పురుగుల మందులు చల్లడంతో కూరగాయలు, ఇతర ఆహార పంటలు విషపదార్థాలుగా మారి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన ప్రభుత్వం నిర్ణీత మోతాదులో పురుగుల మందులు వాడాలనే ఉద్దేశంతో వ్యవసాయ అధికారుల ద్వారా ప్రిస్కిప్షన్ (చీటీ) రైతులకు అందిస్తున్నారు. దాని ప్రకారమే డీలర్లు రైతులకు పురుగు మందులు, ఎరువులు విక్రయించాల్సి ఉంటుంది. నిబంధనలు విస్మరిస్తే డీలర్లపై చర్యలు తీసుకునేందుకు వ్యవసాయశాఖ సిద్ధమవుతోంది. ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో సేంద్రియ పద్ధతిలో పంటలు పండించడంతో ఇటు ఆరోగ్యంతోపాటు అటు రైతులకు పెట్టుబడి కూడా తక్కువగా ఉండేది. ప్రస్తుతం పురుగు మందుల ధరలు పెరిగిపోవడం, కూరగాయలు, ఇతర ఆహార పంటలు కొనుగోలు చేసే వారిపై దీని ప్రభావం పడడమే కాకుండా వారు అనారోగ్యానికి గురవుతున్నారు. జిల్లాలో.. ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 250కుపైగా ఎరువులు, పురుగుల మందుల దుకాణాలు ఉన్నాయి. ఆదిలాబాద్ పట్టణంతోపాటు ఇచ్చోడ, బోథ్, ఉట్నూర్, ఇంద్రవెల్లి, బేల తదితర మండలాలు, ఆయా గ్రామాల్లో పురుగులు, ఎరువుల దుకాణాలు ఉన్నాయి. అయితే ఇక నుంచి రైతులు వ్యవసాయ శాఖ అధికారులు జారీ చేసిన ప్రిస్కిప్షన్ మేరకే మందులు వాడాల్సి ఉంటుంది. మండల ఏఈఓ, ఏఓలు పంటకు ఎంత మోతాదులో మందులు వాడాలనే విషయాన్ని రైతులకు వివరిస్తారు. పండించిన పంటకు ఎలాంటి కీటకాలు ఆశించాయో రైతులు విన్నవిస్తే ఏ మందులు వాడాలి, ఎంత మోతాదులో వాడాలనేది ప్రిస్కిప్షన్ ద్వారా రాసి ఇస్తారు. ఆ చీటిని మందుల దుకాణదారుడికి చూపిస్తేనే రైతులకు మందులు లభించే పరిస్థితి ఉంది. జీవ వైవిధ్యంపై ప్రభావం కొంతమంది రైతులు అవగాహన లేక పంట పొలాల్లో విచ్చలవిడిగా ఎరువులు, పురుగుల మందులను పిచికారి చేస్తున్నారు. దీంతో నేల సారవంతం దెబ్బతినడమే కాకుండా జీవ వైవిద్యంపై కూడా ప్రభావం చూపుతుందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. పంటకు కీడు చేసే పురుగులతో మిత్ర పురుగులు కూడా ఉంటాయనే విషయాన్ని రైతులు గ్రహించలేక పోతున్నారు. అధిక మోతాదులో మందులను వాడడంతో అవి చనిపోయి పంట దెబ్బతినే ప్రమాదం ఉంది. పత్తి, సోయాబీన్, కందులు, కూరగాయలు, ఆకుకూరలు, ఇతర ఆహార పంటలకు ఏ తెగుళ్లు సోకినా రైతులు వ్యవసాయ అధికారుల సూచనలు తీసుకోవాలని పేర్కొంటున్నారు. అవగాహన లేమితో పురుగుల మందులు, ఎరువులను వాడితే నష్టాలను చవిచూసే అవకా>శాలు ఉన్నాయని చెబుతున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కొరడా ఎరువులు, పురుగు మందులు విక్రయించే డీలర్లు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్ వ్యవసాయ శాఖాధికారులకు ఇదివరకే ఆదేశాలు జారీ చేసిన విషయం విధితమే. ప్రతీ రైతుకు విత్తనాలు, ఎరువులు, పురుగుల మందు బిల్లులు తప్పనిసరిగా అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. దుకాణంలో ధరల బోర్డు తప్పనిసరిగా ఉంచాలని, స్టాక్ రిజిస్టర్, నిల్వ వివరాలను ప్రదర్శించాలని సూచించారు. ఈ నిర్ణయంతో విచ్చలవిడిగా పురుగుల మందుల వాడకం తగ్గడంతో పాటు అవగాహన లేని రైతులు సైతం మోతాదులో వాడే అవకాశం ఉంది. సేంద్రియ పద్ధతికి ప్రోత్సాహం పురుగు మందులు చల్లిన కూరగాయలు, ఆకుకూరలు, ఇతర ఆహార పంటలను కొనుగోలు చేసి వినియోగిస్తున్న ప్రజలు ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారని కలెక్టర్ గ్రహిం చి ఆదిలాబాద్ పట్టణంలో సేంద్రియ ఆహార పంటల విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వారిని ప్రోత్సహించడమే కాకుండా సేంద్రియ పద్ధతిలో సాగు చేసే ఆహార పదార్థాలను విని యోగించాలని ఇటు ప్రజలు సైతం అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం పురుగు మందులను మోతాదుకు మించి రైతులు వాడకూడదనే నిబంధన తీసుకురావడం అభినందనీయమని పలువురు పేర్కొంటున్నారు. ప్రభుత్వ నిర్ణయం మంచిదే.. అవగాహన లేని కారణంగా రైతులు పంటకు అనుకూలం లేని పురుగుల మందులను కూడా విచ్చలవిడిగా వాడి నష్టపోతున్నారు. ఆహార పంటలకు మోనోక్రోటోఫాస్ మందు పిచికారీ చేయవద్దని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నా వాటిని పాటించడంలేదు. ఆహార పదార్థాలకు ఈ మందును పిచికారీ చేయడంతో అవి విషపదార్థాలుగా మారుతాయి. పురుగుల మందులు విచ్చలవిడిగా వాడకుండా సేంద్రియ పద్ధతిలో తక్కువ ఖర్చుతో రైతులు పంటలు సాగు చేసుకోవచ్చు. – సుధాన్షు, ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త, ఆదిలాబాద్ డీలర్లకు ఆదేశాలు జారీ చేశాం పురుగు మందులు రైతులు విచ్చలవిడిగా వాడకూడదని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి. ఈ విషయమై డీలర్లకు కూడా సమాచారం అందించాం. ఏఓ, ఏఈఓలు సూచించిన పురుగు మందులనే రైతులు వాడాల్సి ఉంటుంది. ప్రిస్కిప్షన్ లేకుండా ఎవరైనా డీలర్లు పురుగు మందులు విక్రయిస్తే శాఖ పరమైన చర్యలు తీసుకుంటాం. – శివకుమార్, వ్యవసాయశాఖ నోడల్ అధికారి -
ఎరువులపై 5 శాతం జీఎస్టీ
► ట్రాక్టర్ల విడిభాగాలపై 18 శాతం ► విందు సమావేశంలో జీఎస్టీ మండలి నిర్ణయం ► హాజరైన ప్రధాని.. మండలి సభ్యులకు కృతజ్ఞతలు న్యూఢిల్లీ: జీఎస్టీ అమలుకు కొద్ది గంటల ముందు జీఎస్టీ కౌన్సిల్ సమావేశమై రైతులకు సంబంధించిన రెండు అంశాలపై పన్నురేటును తగ్గించింది. గతంలో 12 శాతం పరిధిలో ఉన్న ఎరువులను 5 శాతం పరిధిలోకి.. 28 శాతంగా ఉన్న ట్రాక్టర్ల విడిభాగాలను 18 శాతంలోకి చేరుస్తూ నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ ఉత్పత్తిని పెంచటంతోపాటుగా రైతుకు మేలు చేసే దిశగా ఈ రెండింటిపై పన్ను తగ్గించినట్లు జైట్లీ తెలిపారు. జీఎస్టీ కౌన్సిల్ సభ్యుల విందు భేటీకి ప్రధాని మోదీ హాజరై కౌన్సిల్ జీఎస్టీ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. 2016 సెప్టెంబర్ 23న జీఎస్టీ కౌన్సిల్ తొలిసారి సమావేశమైంది. ఆనాటి నుంచి నేటి వరకు 18 సార్లు ఈ మండలి సమావేశమైంది. విస్తృతమైన అంశాలపై కూలంకశంగా చర్చించి 5, 12, 18, 28 శాతం పన్ను పరిధిని నిర్ణయించింది. అయితే శుక్రవారంనాటి సమావేశంలో పలు ఇతర నిబంధనలకు కూడా మండలి ఆమోదం తెలిపిందని జైట్లీ వివరించారు. తగ్గనున్న యూరియా ధరలు: జీఎస్టీ మండలి తాజా నిర్ణయంతో ఎరువుల ధరలు గణనీయంగా తగ్గుతాయని కేంద్ర ఎరువులు, రసాయనాల మంత్రి అనంత్ కుమార్ వెల్లడించారు. యూరియా, డీఏపీ, ఎంవోపీ, మిశ్రమ ఎరువుల ధరలు తగ్గటం ద్వారా రైతులపై రూ.1,261 కోట్ల భారం తగ్గుతుందన్నారు. నిజాయితీపరులకు లాభం..అధియా: జీఎస్టీ అమల్లోకి రావటం ద్వారా ఇన్నాళ్లూ నిజాయితీగా పన్నులు చెల్లిస్తున్న వారికి.. ఇకపై పన్నులు చెల్లించేవారికి లాభం జరుగుతుందని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా చెప్పారు. ఏడాదికి రూ.10లక్షల టర్నోవర్ ఉన్న వ్యాపారులు వ్యాట్ చెల్లించేవారు. అయితే వీరికి ఎక్సైజ్ సుంకం నుంచి మినహాయింపుండేది. కానీ ఇప్పుడు రూ. 20–75 లక్షల టర్నోవర్ ఉన్న వ్యాపారులు 2.5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. రూ. 20 లక్షల్లోపు టర్నోవర్ ఉండే వారికి జీఎస్టీ నుంచి మినహాయింపు ఉంది. నేటి నుంచి ఎరువుల ధర (50 కిలోల బస్తా ధర రూపాయల్లో) ఎరువు రకం ప్రస్తుత ధర నేటి నుంచి ఇలా ఉండే అవకాశం డీఏపీ 1092 1081 యూరియా 290 287 20:20 కాంప్లెక్స్ 880 871 పొటాష్ 580 574 -
ఖరీఫ్‌లో ఊరట
తగ్గుముఖం పట్టిన ఎరువుల ధరలు ప్రకటించిన వ్యవసాయ శాఖ అన్నదాతకు కాస్త ఉపశమనం వరంగల్ : రెండేళ్లుగా వరుస కరువుతో ఇబ్బంది పడుతున్న అన్నదాతకు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు కొంచెం ఊరటనిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎరువుల కంపెనీలు కూడా అన్నదాతకు లాభం చేకూర్చేలా నిర్ణయం తీసుకున్నారుు. వివిధ ఎరువుల గరిష్ట చిల్లర ధర(ఎంఆర్పీ)లకు సంబంధించి వ్యవసాయ శాఖ సోమవారం ప్రకటన జారీ చేసింది. దీని ప్రకారం వ్యవసాయంలో ఎక్కువగా వినియోగించే డీఏపీ, కాంప్లెక్సు ఎరువుల ధరలు కొంత వరకు తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి సరుకుల ధరలు గణనీయంగా తగ్గడంతో ఎరువుల ధరలను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. టన్నుకు రూ.5వేలు యూరియా మినహా... మిగిలిన రకాల ఎరువుల ధరలను టన్నుకు రూ.5 వేల వరకు తగ్గించింది. వ్యవసాయంలో ఎక్కువగా వినియోగించే డీఏపీపై టన్నుకు రూ.2500 తగ్గించి రూ.22 వేలుగా నిర్ణయించింది. పొటాష్(ఎంఓపీ)పై టన్నుకు రూ.5 వేలు తగ్గించి రూ.11 వేలు ధరగా ప్రకటించారు. జూలై ఆరంభం నుంచే కొత్త ధరలకు అమల్లోకి వచ్చేలా ప్రభుత్వ రంగ ఎరువుల కంపెనీలు చర్యలు తీసుకుంటున్నారుు. ప్రభుత్వ రంగ సంస్థలు ఎరువుల ధరలను తగ్గించాలని నిర్ణయించడంతో ప్రైవేటు కంపెనీలు కూడా అదే దారిలో నడుస్తున్నారుు. కేంద్రప్రభుత్వం 2010 ఏప్రిల్ నుంచి ఎరువుల సబ్సిడీ విధానాన్ని మార్చింది. పోషకాల ఆధారిత సబ్సిడీ(ఎన్బీఎస్) విధానం అమలులోకి తెచ్చింది. అంతకుముందు ఉత్పత్తి ఖర్చులకు అనుగుణంగా ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడంతో ఎరువుల గరిష్ట చిల్లర అమ్మకం ధరల్లో తేడా ఉండేది కాదు. కానీ ఎన్బీఎస్తో ప్రభుత్వం కంపెనీలకు ఇచ్చే సబ్సిడీ స్థిరంగా ఉండి ఎంఆర్పీ ధరల్లో మార్పులు ఉంటున్నాయి. అరుుతే, ఎన్బీఎస్ అమల్లోకి వచ్చినప్పటి ఎరువుల ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి. రైతులు సాగులో ఎక్కువగా వినియోగించే యూరియా, పొటాష్, కాంప్లెక్స్ ఎరువుల ధరలు మూడు, నాలుగు రెట్లు పెరిగాయి. కాగా, కరువు పరిస్థితులతో రెండేళ్లుగా సాగు ఎక్కువగా లేకపోవడం, ముడి సరుకుల ధరలు తగ్గడంతో మొదటిసారిగా కంపెనీలు ఎరువుల ధరలను తగ్గించాయి. -
సామాన్యుడికి ధరాఘాతం
ఏడాదిలో పదిసార్లు పెరిగిన పెట్రోలు ధరలు.. 14 సార్లు పెరిగిన డీజిల్ ధరల మోతలతో మధ్యతరగతి జీవి విలవిల్లాడిపోయాడు. సన్న బియ్యం రేట్లు చుక్కలు చూపించాయి. వంట నూనెల ధరలు సలసలా కాగి పేదోడి కుంపట్లో నిప్పులు రాజేశాయి. ఆర్టీసీ, కరెంటు చార్జీలు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. 700శాతం పెరిగిన ఎరువుల ధరలు రైతులను కోలుకోలేని విధంగా అప్పుల పాల్జేశాయి. ఏ వస్తువు కొందామన్నా.. షాక్ కొట్టే విధంగా ఉన్న ధరల్ని చూసి ఈ ఏడాది సామాన్యుడు బెంబేలెత్తిపోయాడు. మూలిగే నక్క మీద తాటిపండు పడిన చందంగా సమ్మె కాలంలో నిత్యావసరాలు చుక్కలు చూపాయి. ధరల నియంత్రణకు నడుం బిగించాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యుడిపై ఏ మాత్రం కనికరం చూపలేదు. చేసేదేమీ లేక చేష్టలుడిగిన ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ జిల్లావాసులు మోయలేని భారం మోశారు. ఆర్టీసీ కస్సు ‘బుస్సు’ ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రయాణీకులపై చార్జీల రూపంలో అదనపు భారం వేసిన ఆర్టీసీ.. జూన్ నెలలో టోల్ ట్యాక్స్ బాదుడుతో బెంబేలెత్తించింది. ఏడాదికి రూ.75 లక్షల అదనపు ఆదాయాన్ని సమకూర్చుకునే క్రమంలో భాగంగా ప్రయాణీకులపై మరింత భారాన్ని మోపింది. సమైక్యాంధ్ర ఉద్యమం ముగిశాక, మరోసారి చార్జీలు పెంచి పెరిగిన నష్టాన్ని పూడ్చుకునే ప్రయత్నం చేసింది. కిలో మీటరుకు 30 నుంచి 50 పైసల వరకు చార్జీలను పెంచి సగటున నెలకు రూ.12 లక్షల అదనపు ఆదాయాన్ని ఆర్జించేందుకు రీజియన్ అధికారులు ప్రణాళికలు రూపొందించి అమలు చేశారు. రైతన్నకు ఎరువుల ధరాఘాతం కనీవినీ రీతిలో ఎరువుల ధరలు రైతన్న వెన్ను విరిచాయి. దీంతో పాటు సమైక్య సమ్మె ప్రభావంతో ధరలు ఆకాశాన్నంటాయి. 50 కిలోల యూరియా బస్తా రూ.284కు అమ్మాల్సి ఉంటే, రూ.350 చొప్పున అమ్ముకున్నారు. మిగిలిన ఎరువులు రూ.50 నుంచి రూ.70 వరకు అధిక ధరలకు విక్రయించారు. సుమారు 700 శాతం మేర ఎరువుల ధరలు పెరిగి అన్నదాతలకు అప్పులు మిగిల్చాయి. నియంత్రించాల్సిన అధికార గణం పట్టనట్లు వ్యవహరించడంతో వ్యాపారులు చెప్పిందే రేటు.. అన్నట్లు సాగింది. దీనికి తోడు వరుస తుఫాన్లు చుట్టుముట్టి పెట్టిన పెట్టుబడికి తోడు ఎకరాకు రూ.20 వేల అప్పు మిగిలింది. కరెంటు నిల్లు... బిల్లు ఫుల్లు... గతంలో ఎన్నడూ లేని విధంగా కరెంటు కోతలు చుక్కలు చూపించాయి. లేని కరెంటుకు మూడింతలు కరెంటు బిల్లులు వచ్చాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చిన కరెంటు చార్జీలు 60 శాతానికి పైగా పెరిగాయి. జిల్లావాసులపై పెరిగిన కరెంటు బిల్లుల భారమే నెలకు రూ.101.69 కోట్లకు పైగా ఉంది. సర్దుబాటు చార్జీల పేరిట గడిచిన రెండేళ్లకు వినియోగదారుల నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేశారు. నెలకు సర్దుబాటు చార్జీల భారం రూ.30 కోట్లకు పైగా ఉంది. పరిశ్రమలకు మూడురోజుల పాటు పవర్ హాలిడే అమలు చేయడంతో జిల్లాలో సుమారు రూ.2 వేల కోట్ల విలువైన పలు రకాల ఉత్పత్తులు నిలిచిపోయాయి. నిత్యావసరాలు ప్రియం.. ఈ ఏడాది సన్న బియ్యం, వంట నూనెలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు పెరిగాయి. సన్న బియ్యం మరింత ప్రియం అయ్యింది. ఏడాది ప్రారంభంలో కేజీ రూ.35-రూ.40 వరకు ఉన్న సన్న బియ్యం సమ్మెకు ముందు రూ.50 కి చేరింది. సమ్మె కాలంలో రూ.60 వరకు పలికింది. వంట నూనెల్లో పామాయిల్ మంటలు మండింది. రూ.75వరకు ధర పలికింది. వేరుశనగ మొన్నటివరకు రూ.110కి చేరింది. నిత్యం అవసరమైన కూరగాయలు, ఆకు కూరలు మధ్యతరగతి వర్గాలకు దడ పుట్టించాయి. టొమాటో మొదట్లో కేజీ రూ.5 ఉన్న ధర ఏకంగా కేజీ రూ.40కి చేరింది. అల్లం అల్లాడించగా, బీన్స్ ధరలు పెరిగాయి. క్యారట్ రూ.12 ఉన్న ధర రూ.26 వరకు పలికింది. రూపాయి ములక్కాయ ధర రూ.పదికి చేరింది. కార్తీక మాసంలో కూర‘గాయాలు’ చేశాయి. గ్యాస్ ‘బండ’ పడింది.. గ్యాస్ సిలిండర్ ధర వినియోగదారుడిని గందరగోళానికి గురి చేసింది. ఆధార్ లింకుతో గ్యాస్ వినియోగదారులకు తిప్పలు తప్పలేదు. రాయితీ సిలిండర్ ధర రూ.412 నుంచి రూ.600కి చేరింది. నెలకు వినియోగదారులపై సుమారు రూ.20 కోట్ల భారం పడింది. వంట గ్యాస్‌కు ఆధార్ లింకేజీతో సిలిండర్‌కు వినియోగదారులు రూ.1,017 చెల్లించారు. బ్యాంకు ఖాతాలో జమ కావాల్సిన డబ్బు జమ కాకపోవడంతో వినియోగదారులు నానా ఇబ్బందులు పడ్డారు. పెట్రో వాత.. డీజిల్ మోత.. పదిసార్లు పెట్రోలు చార్జీలు పెంచి పథ్నాలుగు సార్లు డీజీల్ మోత మోగించిన కేంద్ర ప్రభుత్వ తీరుకు వినియోగదారుడి జీవిత చక్రానికి బ్రేకులు పడ్డాయి. జిల్లాలో 220 పెట్రోలు బంకు ఔట్లెట్లు ఉన్నాయి. రోజుకు డీజిల్ 27 లక్షల లీటర్ల వినియోగం జరుగుతుండగా, పెట్రోలు 9 లక్షల లీటర్ల వినియోగం జరుగుతున్నట్లు అంచనా. పెట్రోలు జనవరిలో రూ.73.20 ఉంటే, ప్రస్తుతం రూ.77.40 వరకు ఉంది. అంటే లీటరుకు రూ.4.20 వరకు పెరిగింది. రోజుకు పెట్రోలు భారం రూ.3.78 లక్షలు పెరిగింది. డీజిల్ జనవరిలో రూ.52.60 ఉంటే ప్రస్తుతం రూ.58.40 ఉంది. లీటరుకు రూ.5.80 వరకు పెరిగింది. రోజుకు జిల్లాలో డీజిల్ భారం రూ.15.66 లక్షల వరకు ఉంది. ఉల్లి లొల్లితో కంట కన్నీరు.. ఉల్లి ధరలతో ప్రభుత్వాలనే గడగడలాడించింది. ఈ ఏడాది అక్టోబరులో ఒక్కసారిగా ధరలు పెరిగాయి. మహారాష్ట్ర, నాందేడ్, కర్ణాటకలలో పంట తుడిచిపెట్టుకుపోవడం, స్థానికంగా తుపాన్లుతో పంట దెబ్బతినడంతో ఎన్నడూ లేని విధంగా ఉల్లి ధరలు కేజీ రూ.వందకు చేరాయి. సమ్మెకాలంలో రూ.120కి చేరుతుందని ప్రచారం జరిగింది. మళ్లీ ఇప్పుడు కూడా ధర లేక రైతులకు కన్నీరు పెట్టిస్తోంది. ఇప్పుడు కేజీ రూ.8కి కొంటామని వ్యాపారులు రైతుల వద్ద బేరాలు చేస్తుండటంతో ఉల్లి రైతులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు.