కైకలూరు: అది కైకలూరు జాతీయ రహదారిపై అడవి నాయుడు సెంటర్. సమయం శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలు. లుంగీ, షర్టు ధరించి ఓ వ్యక్తి బైక్‌పై ఎరువుల దుకాణానికి వచ్చాడు. యూరియా, డీఏపీ రెండు బస్తాలు కావాలని అడిగాడు. దుకాణం యజమాని ఓ తెల్లచీటీపై రాసి, పక్కనే గోడౌన్‌లో తెచ్చుకో అని పంపించాడు. అక్కడకెళ్లి రెండు బస్తాలను బైక్‌పై వేసుకుని తిరిగి దుకాణం వద్దకు వచ్చాడు. బోర్డులో సూచించిన ఎమ్మార్పీ కంటే ఎక్కువ వసూలు చేస్తున్నారేంటని నిలదీశాడు. రైతులందరి నుంచి ఇలానే వసూలు చేస్తున్నారా అంటూ గద్దించాడు.. అప్పటికి గానీ ఆ వ్యాపారికి అర్థంకాలేదు.. ఎరువుల కోసం వచ్చింది రైతు కాదు, విజయవాడ సబ్ కలెక్టరు జి.సూర్య సాయి ప్రవీణ్ చంద్ అని.
అసలేం జరిగిందంటే...
కలెక్టరు జె.నివాస్ ఆదేశాలతో సబ్ కలెక్టరు సూర్య సాయి ప్రవీణ్ చంద్ రైతు వేషధారణలో ఎరువుల దుకాణాల్లో తనిఖీలకు ముదినేపల్లి మండలం దేవపూడి శ్రీలక్ష్మీగణేష్ ట్రేడర్స్ వద్దకు వెళ్లారు. అప్పటికి దుకాణం తెరవలేదు. అక్కడే ఉన్న రైతులను ధరలపై ప్రశ్నించగా అధిక ధరలు అడుగుతున్నారని బదులిచ్చారు. వెంటనే వ్యవసాయ శాఖ ఏఓను పిలిపించి, ఆ దుకాణాన్ని తనిఖీచేసి, అధిక ధరలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆ తర్వాత కైకలూరులో వాసవీ ఫెర్టిలైజర్స్‌కు వెళ్లి యూరియా కావాలని అడగ్గా, వ్యాపారి లేదని సమాధానం చెప్పాడు. అక్కడి నుంచి వెంకట నాగదత్త ఏజెన్సీస్‌కు వెళ్లి యూరియా, డీఏపీ కావాలని అడిగారు. యూరియా బస్తా ధర రూ.266.50 కాగా రూ.280, డీఏపీ బస్తాకు రూ.1200 బదులు రూ.1250 తీసుకున్నారు. పైగా ఆధార్ ద్వారా బయోమెట్రిక్ లేకుండా, బిల్ ఇవ్వకుండా విక్రయించారు. అనంతరం వాసవీ ఫెర్టిలైజర్స్‌లో తనిఖీ చేయగా గోడౌన్‌లో యూరియా నిల్వలు ఉన్నాయి. ఈ రెండు దుకాణాలను సీజ్ చేసి, చర్యలు తీసుకోవాలని తహసీల్దారు సాయి కృష్ణకుమారి, వ్యవసాయశాఖ ఏడీ జి.గంగాధరరావు, ఏఓ దివ్యను సబ్ కలెక్టర్ ఆదేశించారు.
ఆకస్మిక తనిఖీతో హడల్! బయటపడిన దుకాణదారుల మోసాలు
Published Sat, Aug 7 2021 10:05 AM | Last Updated on Sun, Aug 8 2021 7:47 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment