ఏం తమాషానా.. మా దుకాణాలు తనిఖీ చేస్తారా?
అధికారంలో ఉన్నాం.. మాజోలికొస్తే ఊరుకోం.. వెంటనే వెళ్లిపోండి..
రేషన్ షాపుల తనిఖీకి వెళ్లిన సబ్ కలెక్టర్‌కు టీడీపీ నేతల హెచ్చరిక
పోలీసుల్ని కూడా అసభ్య పదజాలంతో దూషించిన నాయకులు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ‘మేం అధికారంలో ఉన్నాం. మా షాపులు తనిఖీ చేస్తారా.. ఎంత ధైర్యం.. మా జోలికొస్తే ఊరుకోం..’ ఇవి ఏ ఉద్యోగినో, చిన్న అధికారినో ఉద్దేశించి అన్న మాటలు కాదు. సాక్షాత్తు ఐఏఎస్ అధికారి అయిన సబ్ కలెక్టర్‌ను ఉద్దేశించి అన్న మాటలు. ‘ఐఏఎస్ అధికారి అయితే మాత్రం మా షాపుల్ని తనిఖీ చేస్తారా? తమాషాలు చేస్తున్నారా?..’ అంటూ తెలుగుదేశం నాయకులు ప్రకాశం జిల్లా మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనాను అడ్డుకున్నారు. దీంతో ఆయన మౌనంగా వెనుదిరిగారు.
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో గురువారం రాత్రి జరిగిన ఈ సంఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. తెలుగుదేశం నేతల బరితెగింపుపై అధికార యంత్రాంగంలోను, ప్రజల్లోను తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఆవు చేలో మేస్తుంటే.. దూడ గట్టున మేస్తుందా.. అన్నట్లు రాష్ట్రంలో లోకేశ్ రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తుంటే.. నియోజకవర్గస్థాయిలో తెలుగుదేశం నేతలు అదేరీతిలో రెచి్చపోయి వ్యవహరిస్తున్నారు.
మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా గురువారం రాత్రి 10 గంటల సమయంలో యర్రగొండపాలెం నియోజకవర్గ కేంద్రంలో రేషన్ దుకాణాల తనిఖీకి వచ్చారు. సిబ్బందితో కలిసి పలు షాపుల్ని తనిఖీ చేశారు. తొలుత వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులకు చెందిన రేషన్ దుకాణాలను పరిశీలించారు. అనంతరం టీడీపీ సానుభూతిపరులకు చెందిన దుకాణాల తనిఖీకి వెళ్లారు. దీంతో టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సబ్ కలెక్టర్ మీనాను ఉద్దేశించి తీవ్రపదజాలంతో వ్యాఖ్యలు చేశారు. ‘మేం అధికారంలోకి వచ్చి నెలకాకముందే మా రేషన్ దుకాణాల్లోనే తనిఖీ చేస్తారా..’ అంటూ నిలదీశారు. ‘ఏం? ఐఏఎస్ అధికారి అయితే మాత్రం తమాషా చేస్తున్నారా..’ అంటూ మరికొందరు దూషణలకు దిగారు. పక్కనే ఉన్న పోలీసు అధికారులను కూడా దూషించారు. టీడీపీ నేతల తీరుతో తీవ్ర మనస్తాపానికి గురైన సబ్ కలెక్టర్ తనిఖీలు నిలిపేసి వెళ్లిపోయారు. అడ్డుకున్నది అధికార పార్టీ నేతలు కావడంతో తమ విధులకు ఆటంకం కలిగించారంటూ ఒక్క అధికారి కూడా కనీసం ఫిర్యాదు చేయలేదు.
బ్లాక్ మార్కెట్‌కు బియ్యం
టీడీపీ సానుభూతిపరుల దుకాణాల నుంచి రేషన్ బియ్యం పెద్ద ఎత్తున బ్లాక్ మార్కెట్‌కు తరలిపోయిందని, అందుకే ఆ పార్టీ నేతలు తనిఖీలను అడ్డుకున్నారని తెలిసింది. టీడీపీకి చెందినవారి షాపులకు ఒక్కోదానికి సుమారు 30 క్వింటాళ్ల బియ్యం తక్కువ దిగుమతి అయినట్లు తెలిసింది. పేదలకు అందాల్సిన ఈ బియ్యాన్ని స్టాక్‌పాయింట్ నుంచే నల్లబజారుకు తరలించి సొమ్ముచేసుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సబ్ కలెక్టర్ తనిఖీలో ఈ బండారం బయటపడుతుందనే భయంతోనే టీడీపీ నేతలు షాపుల తనిఖీనే అడ్డుకున్నారని తెలిసింది. అందుకే సబ్ కలెక్టరును కూడా లెక్కచేయకుండా ఎదిరించినట్లు భావిస్తున్నారు. తనిఖీకి వచ్చిన సబ్ కలెక్టర్, పోలీసు అధికారులపై టీడీపీ నేతలు విరుచుకుపడిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నా జిల్లా యంత్రాంగం కనీసం స్పందించలేదు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి దీనిపై సమగ్ర విచారణ జరిపి అధికారుల విధులకు ఆటంకం కలిగించి, దౌర్జన్యానికి పాల్పడిన టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment