sub collector
-
కలెక్టర్ అయితే గొప్పా.. మార్కాపురం సబ్ కలెక్టర్ పై రెచ్చిపోయిన టీడీపీ నాయకులు
-
ఐఏఎస్సా.. అయితే..?
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ‘మేం అధికారంలో ఉన్నాం. మా షాపులు తనిఖీ చేస్తారా.. ఎంత ధైర్యం.. మా జోలికొస్తే ఊరుకోం..’ ఇవి ఏ ఉద్యోగినో, చిన్న అధికారినో ఉద్దేశించి అన్న మాటలు కాదు. సాక్షాత్తు ఐఏఎస్ అధికారి అయిన సబ్ కలెక్టర్‌ను ఉద్దేశించి అన్న మాటలు. ‘ఐఏఎస్ అధికారి అయితే మాత్రం మా షాపుల్ని తనిఖీ చేస్తారా? తమాషాలు చేస్తున్నారా?..’ అంటూ తెలుగుదేశం నాయకులు ప్రకాశం జిల్లా మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనాను అడ్డుకున్నారు. దీంతో ఆయన మౌనంగా వెనుదిరిగారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో గురువారం రాత్రి జరిగిన ఈ సంఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. తెలుగుదేశం నేతల బరితెగింపుపై అధికార యంత్రాంగంలోను, ప్రజల్లోను తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఆవు చేలో మేస్తుంటే.. దూడ గట్టున మేస్తుందా.. అన్నట్లు రాష్ట్రంలో లోకేశ్ రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తుంటే.. నియోజకవర్గస్థాయిలో తెలుగుదేశం నేతలు అదేరీతిలో రెచి్చపోయి వ్యవహరిస్తున్నారు. మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా గురువారం రాత్రి 10 గంటల సమయంలో యర్రగొండపాలెం నియోజకవర్గ కేంద్రంలో రేషన్ దుకాణాల తనిఖీకి వచ్చారు. సిబ్బందితో కలిసి పలు షాపుల్ని తనిఖీ చేశారు. తొలుత వైఎస్సార్సీపీ సానుభూతిపరులకు చెందిన రేషన్ దుకాణాలను పరిశీలించారు. అనంతరం టీడీపీ సానుభూతిపరులకు చెందిన దుకాణాల తనిఖీకి వెళ్లారు. దీంతో టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్ కలెక్టర్ మీనాను ఉద్దేశించి తీవ్రపదజాలంతో వ్యాఖ్యలు చేశారు. ‘మేం అధికారంలోకి వచ్చి నెలకాకముందే మా రేషన్ దుకాణాల్లోనే తనిఖీ చేస్తారా..’ అంటూ నిలదీశారు. ‘ఏం? ఐఏఎస్ అధికారి అయితే మాత్రం తమాషా చేస్తున్నారా..’ అంటూ మరికొందరు దూషణలకు దిగారు. పక్కనే ఉన్న పోలీసు అధికారులను కూడా దూషించారు. టీడీపీ నేతల తీరుతో తీవ్ర మనస్తాపానికి గురైన సబ్ కలెక్టర్ తనిఖీలు నిలిపేసి వెళ్లిపోయారు. అడ్డుకున్నది అధికార పార్టీ నేతలు కావడంతో తమ విధులకు ఆటంకం కలిగించారంటూ ఒక్క అధికారి కూడా కనీసం ఫిర్యాదు చేయలేదు. బ్లాక్ మార్కెట్‌కు బియ్యం టీడీపీ సానుభూతిపరుల దుకాణాల నుంచి రేషన్ బియ్యం పెద్ద ఎత్తున బ్లాక్ మార్కెట్‌కు తరలిపోయిందని, అందుకే ఆ పార్టీ నేతలు తనిఖీలను అడ్డుకున్నారని తెలిసింది. టీడీపీకి చెందినవారి షాపులకు ఒక్కోదానికి సుమారు 30 క్వింటాళ్ల బియ్యం తక్కువ దిగుమతి అయినట్లు తెలిసింది. పేదలకు అందాల్సిన ఈ బియ్యాన్ని స్టాక్‌పాయింట్ నుంచే నల్లబజారుకు తరలించి సొమ్ముచేసుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సబ్ కలెక్టర్ తనిఖీలో ఈ బండారం బయటపడుతుందనే భయంతోనే టీడీపీ నేతలు షాపుల తనిఖీనే అడ్డుకున్నారని తెలిసింది. అందుకే సబ్ కలెక్టరును కూడా లెక్కచేయకుండా ఎదిరించినట్లు భావిస్తున్నారు. తనిఖీకి వచ్చిన సబ్ కలెక్టర్, పోలీసు అధికారులపై టీడీపీ నేతలు విరుచుకుపడిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నా జిల్లా యంత్రాంగం కనీసం స్పందించలేదు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి దీనిపై సమగ్ర విచారణ జరిపి అధికారుల విధులకు ఆటంకం కలిగించి, దౌర్జన్యానికి పాల్పడిన టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
సబ్‌కలెక్టర్ గీతాంజలి శర్మకు అవార్డు
తెనాలి: వ్యాయామ ఉపాధ్యాయిని, వితరణశీలి దివంగత మొవ్వా విజయలక్ష్మి స్మారక ద్వితీయ అవార్డును తెనాలి సబ్‌కలెక్టర్ గీతాంజలి శర్మకు ప్రదానం చేయనున్నారు. విజయలక్ష్మి వర్ధంతి రోజైన ఈనెల 20న ఉదయం 9 గంటలకు తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఏర్పాటయ్యే ప్రత్యేక సభలో స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చేతులమీదుగా గీతాంజలి శర్మకు అవార్డును అందజేసి సత్కరిస్తారు. అనంతరం ‘విద్యార్థులు–భవిష్యత్ సవాళ్లు’ అనే అంశంపై గీతాంజలి శర్మ ప్రసంగిస్తారు. గతేడాది తొలిసారిగా ఈ అవార్డును అప్పటి సీఐడీ అడిషనల్ ఎస్పీ, ప్రస్తుత ఇంటెలిజెన్స్ ఎస్పీ కేజీవీ సరితకు బహూకరించారు. తన లక్ష్యం వేరైనప్పటికీ తల్లిదండ్రుల సూచనపై సివిల్స్‌లో నెగ్గి ఐఏఎస్‌కు ఎంపికై న గీతాంజలి శర్మ కాకినాడలో ట్రైనీ కలెక్టర్‌గా పనిచేసి, తెనాలి సబ్‌కలెక్టర్‌గా గతేడాది బాధ్యతలు స్వీకరించారు. ప్రజాసేవపై ఆకాంక్ష, విధులపై చిత్తశుద్ధితో అనతికాలంలోనే ప్రజలు, ఉన్నతాధికారుల మన్ననలు పొందారు. గత రిపబ్లిక్ దినోత్సవాన జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రాన్నీ అందుకున్నారు. పశువైద్యురాలు కావాలనుకుని.. గీతాంజలి శర్మ స్వస్థలం రాజస్థాన్. తండ్రి యశ్వంత్‌శర్మ నౌకాదళంలో అధికారిగా చేశారు. తల్లి వేదవతిశర్మ శాస్త్రవేత్త. సోదరుడు యశ్దేవ్ శర్మ నౌకాదళంలో అధికారిగా ఉన్నారు. గీతాంజలి శర్మ భర్త కుమార్ సౌరభ్ ఐఆర్ఎస్ అధికారి. జైపూర్, ముంబయి, ఢిల్లీలో విద్యాభ్యాసం చేసిన గీతాంజలి శర్మ ప్రతి తరగతిలోనూ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులవుతూ వచ్చారు. పక్షులు, జంతువులంటే ప్రేమ కలిగిన ఆమె పశువైద్యురాలు కావాలనుకున్నారు. సివిల్స్‌లో విజయం సాధిస్తే, ఎందరో ప్రజలకు సేవ చేయొచ్చన్న తల్లిదండ్రుల సూచనను పాటించారు. 2020 అక్టోబర్‌లో ఐఏఎస్ సాధించారు. తన వ్యక్తిత్వం, దక్షతతో ప్రజాసేవలో రాణిస్తున్నారు. -
కట్టల పాముపై కొరడా
కొరాపుట్: విజిలెన్స్ వలలో చిక్కిన నబరంగ్‌పూర్ అదనపు సబ్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్ రౌత్ లక్ష్యంగా సోదాలు కొనసాగుతున్నాయి. శనివారం సోదాలు జరిపిన ప్రాంతాలను అధికారులు పెంచారు. దర్యాప్తులో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అనేక బినామీ బ్యాంక్ ఖాతాలు, డెబిట్, క్రెడిట్ కార్డులు పట్టుబడ్డాయి. అందులో భుబనేశ్వర్లోని చంద్రశేఖర్‌పూర్ యాక్సిస్ బ్యాంక్‌లో ఖాతా ఉన్న నివేదిత జెన్న అనే మహిళని అధికారులు పిలిపించారు. అయితే పేరుతో అకౌంట్ ఉండడంపై ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 2016లో రాజఖనికలో బీడీవోగా ఉన్న ప్రశాంత్ కుమార్ రౌత్‌ని తాను కలిసినట్లు తెలియజేశారు. తనకు బియ్యం కార్డు ఇప్పించమని ప్రాదేయపడ్డానని, అప్పుడే తన ఆధార్ వివరాలు అందజేశానని వెల్లడించారు. ఈమె పేరు మీద ఉన్న అకౌంట్ నుంచి అనేక రూ.లక్షలు లావాదేవీలు జరిగాయి. ఆమెలాగే అనేక మంది పనివాళ్లు, డ్రైవర్లు పేరు మీద ఆస్తులు బయటపడుతున్నాయి. ప్రస్తుతం రూ.5 కోట్ల నగదు, ఒక ఇల్లు, వాహనాలు విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మండిపడిన బీజేపీ నబరంగ్‌పూర్ అదనపు సబ్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్ రౌత్ వద్ద రూ.కోట్ల నగదు పట్టుబడడంపై బీజేపీ మండిపడింది. ఇది ప్రభుత్వంలోని అధికారులకు, పార్టీ నాయకులకు చెందిన నగదు అని ఆ పార్టీ మాజీ ఎంపీ బలభద్ర మజ్జి ఆరోపించారు. శనివారం సాయంత్రం నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలోని చమిరియా గుడలో ఉన్న పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. దీనిని వాటాల పంపిణీలో వచ్చిన విభేదాల వలన వెలుగులోనికి వచ్చిన నల్లధనంగా అభివర్ణించారు. నగదు పట్టుకున్న అధికారులు, ఆ నగదు ఎలా వచ్చిందో, ఎవరెవరు ఇచ్చారో విచారణ చేయాలన్నారు. ఇంత నగదు లంచంగా ఇచ్చినవారు ఇంకెంత ప్రజాధనం దోపిడీ చేసి ఉంటారోనని అనుమానం వ్యక్తం చేశారు. సమావేశంలో పార్టీ నాయకులు జగదీష్ బిసాయి, గౌరి మజ్జి, షర్మిష్టా దేవ్, దేవదాస్ మహంకుడో తదితరులు పాల్గొన్నారు. భారతమాల నిర్వాసితుల హర్షం ప్రశాంత్ కుమార్ పట్టుబడడంపై భారతమాల నిర్వాసితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రూ.20 వేల కోట్ల వ్యయంతో విశాఖపట్నం నుంచి రాయ్‌పూర్‌కి 6 అంచెల ఎకనామిక్ కారిడర్ని భారతమాల పేరిట రోడ్డు నిర్మిస్తుంది. దీనిలో నబరంగ్‌పూర్ జిల్లాలో అత్యధిక భాగం భూసేకరణ జరిగింది. భూసేకరణలో భాగంగా వేలాది మంది గిరిజనులు నిర్వాసితులయ్యారు. వారికి అందే పరిహారాల విషయంలో ప్రశాంత్ ఎంతో కీలకంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. సబ్ కలెక్టర్ హోదాలో అనేక ప్రభుత్వ భూములకు నకిలీ యజమానులను సృష్టించి రూ.కోట్లు దోచుకున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహరంపై రాయిఘర్ బీజేపీ నాయకులు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో కేంద్ర హోం శాఖ ఈ వ్యవహరంపై చర్యలకు ఉపక్రమించిందని రాయిఘర్ నేతలు ప్రకటించారు. అందులో భాగంగానే దాడులు జరిగాయని పేర్కొన్నారు. మరోవైపు కొద్దిరోజుల క్రితం ఒక ప్రైవేటు పరిశ్రమకి వెళ్లి ప్రశాంత్ తనికీలు చేపట్టడం సంచలనం కలిగించింది. దీంతో సదరు పరిశ్రమల యజమానుల సంఘం ప్రతినిధులు తమను వేధిస్తున్నట్లు ఫిర్యాదు చేశారు. -
బోడె... మామూలోడు కాదు.. ఆది నుంచీ అంతే! ఏకంగా 33 కేసులు
సాక్షి ప్రతినిధి, విజయవాడ/పెనమలూరు: వివాదాలు, గొడవలు, దౌర్జన్యాలకు లెక్కేలేదు. సెటిల్మెంట్లు, దందాలు, అధికారులపై దాడులకు అంతూ పొంతూ లేదు. అధికారంలో ఉన్నప్పుడే కాదు, లేనప్పుడూ దూకుడు తగ్గలేదు. ఒకటీ రెండూ కాదు ఏకంగా 33 కేసులు నమోదు చేయించుకొన్న ఘనుడు పెనమలూరు మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి బోడె ప్రసాద్. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. రెండు రోజుల క్రితం పెనమలూరులో ఓ రేషన్ షాపు తనిఖీలకు వెళ్లిన డెప్యూటీ తహసీల్దార్, వీఆర్ఓలపై హత్యాయత్నానికి పాల్పడి మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. మన బోడె కేసుల చిట్టా పరిశీలిస్తే దిమ్మ తిరిగిపోవాల్సిందే. సామాన్యుల నుంచి అధికారుల వరకు.. పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ వ్యవహార శైలిపై విమర్శలు వెల్లువెతుత్తున్నాయి. పోలీసు కేసుల్లో ఇరుక్కోవటం, అధికారులపై దౌర్జన్యం చేయడం ఆయనకు కొత్త కాదు. అయినా టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఆ పార్టీ నేతలు బోడెకు అండగా నిలుస్తున్నారు. బోడె ప్రసాద్ గత చరిత్రను ఒక్క సారి పరిశీలిస్తే.. టీడీపీ పాలనలో వెలుగు చూసిన కాల్‌మనీ, సెక్స్ రాకెట్ ఘటనలో ఆయన ప్రమేయం ఉన్నట్లు అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే అప్పట్లో పార్టీ అధికారంలో ఉండటంతో ఆయనపై కాల్‌మనీ కేసులు నమోదు కాలేదు. చదవండి👉 తెలుగుయువత నేత ఇంట్లో క్రికెట్ బెట్టింగ్ బోడె ప్రసాద్ సింగపూర్‌లో పర్యటనలో ఉండగా తనకు బదులు మరో వ్యక్తితో పోరంకిలో ఉన్నత విద్య పరీక్ష రాయించారన్న వివాదం కూడా ఉంది. అంతేకాదు గతంలో వణుకూరులో ప్రభుత్వ భూముల్లో చేపట్టిన అక్రమ తవ్వకాలను అప్పటి విజయవాడ సబ్‌కలెక్టర్ మీషా సింగ్ అడ్డుకున్నారు. మట్టి తవ్విన పొక్లెయిన్‌ను స్వాధీనం చేయాలని మీషాసింగ్ ఆదేశించగా బోడె ప్రసాద్ దురుసుగా ప్రవర్తించి పొక్లెయిన్‌ను దాచేసి, సబ్‌కలెక్టర్ విధులకు ఆటంకం కలిగించిన ఘటన సంచలనం కలిగించింది. కృష్ణానదిలో ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డే లేదు. జగన్నాథపురంలో ప్రభుత్వ భూమిలో ఇళ్ల స్థలాలు ఇస్తానంటూ బందరు రోడ్డు విస్తరణ బాధితుల వద్ద డబ్బులు తీసుకున్నాడు. ఇప్పటి వరకూ పట్టాలు ఇవ్వలేదు. యనమలకుదురులో గ్రూప్ హౌస్‌లు ధ్వంసం వ్యవహారంలో కూడా బోడె ప్రసాద్ పేరు ప్రముఖంగా వినిపించింది. చదవండి👉🏻 నకిలీ మందుల ఊసే ఉండకూడదు సమస్యలను నివేదించడానికి వచ్చిన ప్రజలను దూషిస్తున్న బోడె ప్రసాద్ (ఫైల్) కేసుల్లో ఘనాపాటి బోడె ప్రసాద్ దురుసు ప్రవర్తనతో ఇప్పటి వరకు 33 పోలీసు కేసులు నమోదయ్యాయి. ఆరు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. తాజాగా డెప్యూటీ తహసీల్దార్ గుమ్మడి విజయ్‌కుమార్‌పై దాడి కేసులో ఆయన పారిపోయాడు. ఈ కేసులో తొమ్మిది మంది కటకటాల పాలై, బొడే ఒక్కరే పారిపోవడం వెనుక పోలీసుల మెతక వైఖరి ఉందన్న విమర్శలున్నాయి. ఓ పోలీసు అధికారి లోపాయికారీగా ఆయనకు సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ నియోజకవర్గ స్థాయి నేత పోలీస్‌స్టేషన్‌లో కూర్చొని బోడెను కేసు నుంచి తప్పించేందుకు చర్చలు సాగించినట్లు ప్రచారం జరుగుతోంది. బోడె ఒక్కడే పారిపోడం దీనికి ఊతం ఇవ్వడంతోపాటు స్థానిక పోలీసు అధికారుల తీరుపై అనుమానాలకు తావిస్తోంది. తరచూ వివాదాల్లో నిలిచే ఆయనపై పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించకుండా, రౌడీ షీట్ ఓపెన్ చేయాలని స్థానికులు కోరుతున్నారు. చదవండి👉 నారాయణ, లింగమనేని పిటిషన్లపై విచారణ వాయిదా -
సబ్ కలెక్టర్ గొప్పతనం.. రోడ్డుపై దీనావస్థలో ఉన్న వృద్ధుడిని..
రాయగడ( భువనేశ్వర్): అనారోగ్యంతో తీవ్ర ఇబ్బందిపడుతున్న ఓ వృద్ధుడ్ని తన వాహనంలో ఆస్పత్రికి తీసుకెళ్లి మానవీయతను చాటుకున్నారు రాయగడ సబ్ కలెక్టర్ ప్రతాప్‌చంద్ర ప్రధాన్. ఆదివారం రాయగడ పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పట్టణానికి సుమారు ఏడు కిలొమీటర్ల దూరంలోని కొత్తపేట గ్రామానికి చెందిన పి.రాములు అనే వృద్ధుడు ఆరోగ్యం క్షీణించడంతో ఆదివారం ఉదయం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయించుకునేందుకు ఆటోలో వచ్చాడు. ఈ సమయంలో బాలల దినోత్సవం సందర్భంగా గాంధీ పార్క్ వద్ద విద్యార్థులు ర్యాలీ నిర్వహించడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆటో ముందుకు వెళ్లేందుకు చాలా సమయం పడుతుందని భావించిన డ్రైవరు ఆ వృద్ధుడ్ని అక్కడే దింపి వెనక్కు వెళ్లిపోయాడు. అనారోగ్యం కారణంగా నడిచే ఓపిక లేక వృద్ధుడు అక్కడే దీనంగా ఉండిపోయాడు. కొద్దిసేపటి తర్వాత అదే మార్గంలో సబ్ కలక్టర్ ప్రతాప్ చంద్ర ప్రధాన్ వెళ్తూ వృద్ధుడి దీనావస్థను గమనించి తన వాహనాన్ని నిలిపి వివరాలు ఆరా తీశారు. అనంతరం తన వాహనంలో వృద్ధుడ్ని ఎక్కించుకుని సరాసరి ఆస్పత్రికి తీసుకెళ్లి దగ్గరుండి చికిత్స చేయించారు. దీంతో వృద్ధుడు సబ్ కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. చదవండి: ఒడిశా: రాత్రి బహిర్భూమికి వెళ్లిన వివాహితపై సామూహిక అత్యాచారం -
ఆయనే విద్యార్థి.. ఆయనే గురువు
నందిగామ: ఆయనో అధికారి.. విద్యార్థి మృతి ఘటనలో విచారణకు నందిగామ జెడ్పీ ఉన్నత పాఠశాలకు వచ్చారు. ‘విద్యార్థి ట్యాంక్ పైకి ఎలాఎక్కాడు? పాఠశాలకు మెట్లున్నాయా? ట్యాంక్‌కు అంత దగ్గరలో విద్యుత్ లైన్లు వెళ్లడం ఏమిటి’ అంటూ పాఠశాల సిబ్బంది, స్థానిక అధికారులపై ప్రశ్నల వర్షం కురిపిస్తూనే.. పదండి ఆ ట్యాంక్‌ను చూద్దాం.. అంటూ బయటకొచ్చి.. చకచకా గోడ ఎక్కేశారు. ఆపై ట్యాంక్ వద్దకు చేరుకుని.. ప్రమాదం జరిగిన తీరుపై స్వయంగా అవగాహనకొచ్చారు. ఇదంతా కింద నుంచి చూస్తున్న ఇతర అధికారులు అవాక్కవ్వడం వారి వంతైంది. ఇంతకీ ఎవరు ఈ అధికారి అనుకుంటున్నారా.. గతంలో ఓ రైతు వేషంలో ఎరువుల దుకాణానికి వెళ్లి అక్కడ జరుగుతున్న మోసాలను బయటపెట్టారు గుర్తుందా.. ఆయనే విజయవాడ సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్. చదవండి: (అమ్మా కృష్ణవేణి వస్తే నా శవాన్ని ముట్టకోనివ్వద్దు..) వివరాలు ఇవీ.. పట్టణ శివారుల్లోని అనాసాగరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన గోపీచరణ్ అనే విద్యార్థి ఆగస్టు 25వ తేదీన పాఠశాల పైభాగంలో వాష్‌రూమ్‌లపై గల నీటి ట్యాంక్‌ను కడిగేందుకు ట్యాంక్ పైకి వెళ్లి, విద్యుత్ షాక్‌తో మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విచారణ నిమిత్తం గురువారం పాఠశాలను విజయవాడ సబ్ కలెక్టర్ ప్రవీణ్‌చంద్ పాఠశాలను సందర్శించారు. ఈ క్రమంలో అసలు సంఘటన ఎలా జరిగింది? అన్న విషయాన్ని నిర్థారించేందుకు స్వయంగా తానే ట్యాంక్‌పైకి ఎక్కారు. లెక్కల మాస్టారుగా.. అనంతరం విద్యార్థులతో కొద్దిసేపు మాట్లాడిన సబ్ కలెక్టర్ వారికి గణిత బోధన చేయడంతోపాటు సహపంక్తి భోజనాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. సబ్ కలెక్టర్ వెంట డీఈఓ తాహెరా సుల్తానా, తహసీల్దార్ చంద్రశేఖర్, ఎంఈఓ బాలాజి, డెప్యూటీ తహసీల్దార్ రిబ్కా రాణి, ఎస్హెచ్ఓ కనకారావు ఉన్నారు. చదవండి: (సాగునీటి ప్రాజెక్టులపై సీఎం జగన్ సమీక్ష) -
రైతు వేషం లో విజయవాడ సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
-
రైతులా వచ్చిన సబ్ కలెక్టర్.. దుకాణాదారులకు ముచ్చెమటలు
కైకలూరు: అది కైకలూరు జాతీయ రహదారిపై అడవి నాయుడు సెంటర్. సమయం శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలు. లుంగీ, షర్టు ధరించి ఓ వ్యక్తి బైక్‌పై ఎరువుల దుకాణానికి వచ్చాడు. యూరియా, డీఏపీ రెండు బస్తాలు కావాలని అడిగాడు. దుకాణం యజమాని ఓ తెల్లచీటీపై రాసి, పక్కనే గోడౌన్లో తెచ్చుకో అని పంపించాడు. అక్కడకెళ్లి రెండు బస్తాలను బైక్‌పై వేసుకుని తిరిగి దుకాణం వద్దకు వచ్చాడు. బోర్డులో సూచించిన ఎమ్మార్పీ కంటే ఎక్కువ వసూలు చేస్తున్నారేంటని నిలదీశాడు. రైతులందరి నుంచి ఇలానే వసూలు చేస్తున్నారా అంటూ గద్దించాడు.. అప్పటికి గానీ ఆ వ్యాపారికి అర్థంకాలేదు.. ఎరువుల కోసం వచ్చింది రైతు కాదు, విజయవాడ సబ్ కలెక్టరు జి.సూర్య సాయి ప్రవీణ్ చంద్ అని. అసలేం జరిగిందంటే... కలెక్టరు జె.నివాస్ ఆదేశాలతో సబ్ కలెక్టరు సూర్య సాయి ప్రవీణ్ చంద్ రైతు వేషధారణలో ఎరువుల దుకాణాల్లో తనిఖీలకు ముదినేపల్లి మండలం దేవపూడి శ్రీలక్ష్మీగణేష్ ట్రేడర్స్ వద్దకు వెళ్లారు. అప్పటికి దుకాణం తెరవలేదు. అక్కడే ఉన్న రైతులను ధరలపై ప్రశ్నించగా అధిక ధరలు అడుగుతున్నారని బదులిచ్చారు. వెంటనే వ్యవసాయ శాఖ ఏఓను పిలిపించి, ఆ దుకాణాన్ని తనిఖీచేసి, అధిక ధరలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆ తర్వాత కైకలూరులో వాసవీ ఫెర్టిలైజర్స్‌కు వెళ్లి యూరియా కావాలని అడగ్గా, వ్యాపారి లేదని సమాధానం చెప్పాడు. అక్కడి నుంచి వెంకట నాగదత్త ఏజెన్సీస్‌కు వెళ్లి యూరియా, డీఏపీ కావాలని అడిగారు. యూరియా బస్తా ధర రూ.266.50 కాగా రూ.280, డీఏపీ బస్తాకు రూ.1200 బదులు రూ.1250 తీసుకున్నారు. పైగా ఆధార్ ద్వారా బయోమెట్రిక్ లేకుండా, బిల్ ఇవ్వకుండా విక్రయించారు. అనంతరం వాసవీ ఫెర్టిలైజర్స్‌లో తనిఖీ చేయగా గోడౌన్లో యూరియా నిల్వలు ఉన్నాయి. ఈ రెండు దుకాణాలను సీజ్ చేసి, చర్యలు తీసుకోవాలని తహసీల్దారు సాయి కృష్ణకుమారి, వ్యవసాయశాఖ ఏడీ జి.గంగాధరరావు, ఏఓ దివ్యను సబ్ కలెక్టర్ ఆదేశించారు. -
సబ్ కలెక్టర్‌కే నకిలీ టోల్ రశీదు!
నకిలీ రశీదులతో టోల్గేట్ రుసుం వసూలు చేస్తూ మోసం చేస్తున్న వీఆర్ఏల ఉదంతాన్ని మదనపల్లె సబ్‌కలెక్టర్ ఎం.జాహ్నవి గుట్టురట్టు చేశారు. సాధారణ పర్యాటకురాలిగా హార్సిలీహిల్స్ వెళ్లారు. రూ.25 చెల్లించి తీసుకొన్న రశీదుపై సబ్‌కలెక్టర్ అధికారిక సంతకం, సీలు లేకపోవడంతో ఆరా తీస్తే నకిలీదని తేలింది. ఫలితంగా ఇద్దరు వీఆర్ఏలను సస్పెండ్ చేశారు. సాక్షి, బి.కొత్తకోట(చిత్తూరు): మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌పైకి వెళ్లే వాహనాల నుంచి రుసుం వసూలుచేసే బాధ్యతను కోటావూరు పంచాయతీకి చెందిన వీఆర్ఏలు ఎస్.వెంకటరమణ, ఎస్.మస్తాన్‌సాబ్‌కు అప్పగించారు. వీరు పదేళ్లకు పైగా రుసుం వసూలు చేస్తూ ఈ విధులకే పరిమితం అయ్యారు. ఈ వసూళ్లపై చాలాకాలంగా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హార్సిలీహిల్స్ టౌన్షిప్ కమిటీ చైర్మన్ అయిన మదనపల్లె సబ్‌కలెక్టర్ ఎం.జాహ్నవి గత నెల 29, 30 తేదీల్లో సాధారణ పర్యాటకురాలిగా కొండకు కారులో వెళ్తుండగా వీఆర్ఏలు టోల్‌గేటుగా రెండు సార్లు రెండు రశీదులు ఇచ్చి రూ.50 తీసుకొన్నారు. వీరు ఇచ్చిన రశీదుల నంబర్లు 9281, 8137. అయితే ప్రస్తుతం రుసుం వసూళ్లకు కేటాయించిన అధికారిక రసీదు పుస్తకాల్లోని సీరియల్ నంబర్లు 12,500, 13,200గా ఉన్నాయి. దీంతో ఈ అసలు నంబర్లకు సంబంధం లేని నకిలీ రశీదు పుస్తకాలను తయారు చేసి నగదు వసూలు చేస్తూ, సబ్‌కలెక్టర్ కార్యాలయంలో జమ చేయకుండా అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని బి.కొత్తకోట తహసీల్దార్ నిర్మలాదేవిని సబ్‌కలెక్టర్ ఆదేశించారు. దీంతో వీఆర్ఏలు ఎస్.వెంకటరమణ, ఎస్.మస్తాన్‌వలీని సస్పెండ్ చేస్తూ బుధవారం తహసీల్దార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కరోజులో రూ.1,700 బుధవారం టోల్‌గేటు వసూలుకు ఇద్దరు వీఆర్ఏలను కొత్తగా నియమించగా ఊహించని విధంగా రూ.1,700 వసూలు కావడం చూసి రెవెన్యూ అధికారులే ఆశ్చర్యపోయారు. సాధారణ రోజుల్లో ఈ స్థాయిలో టోల్ వసూలైనట్టు గత పదేళ్లలో ఎన్నడూ చూపలేదని స్పష్టమైంది. దీన్నిబట్టి చూస్తే తీవ్ర రద్దీగా ఉండే శుక్ర, శని, ఆదివారాల్లో రోజుకు కనీసం రూ.5వేలు తగ్గకుండా వసూలు కావాలి. ఏడాదికి కనీసం రూ.7లక్షలు వసూలవ్వాలి. ఈ స్థాయిలో నగదు జమ అయ్యిందా లేదా అన్నది పరిశీలిస్తే ఏ మేరకు నకిలీ రశీదులతో దోచుకున్నారో తేలుతుంది. వసూళ్ల జమపై చాలాకాలంగా ఆరోపణలు ఉన్నా అధికారులు పట్టించుకోలేదు. స్వయంగా సబ్ కలెక్టరే నిజాలు నిగ్గుతేల్చడంతో వీఆర్ఏల వ్యవహారానికి చెక్‌పడింది. 11న వేలం పాట హార్సిలీహిల్స్‌పైకి వెళ్లే వాహనాల నుంచి టోల్ రుసుం వసూలు అవకతవకల నేపథ్యలో ఈ కాంట్రాక్ట్‌ను ప్రయివేటుకు అప్పగించేందుకు సబ్ కలెక్టర్ జాహ్నవి నిర్ణయించారు. ఈ మేరకు ఈనెల 11న వేలం పాట నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. పాటదారులు రూ.500 చెల్లించి పాల్గొనవచ్చని తెలిపారు. -
లంచం డబ్బుతో సబ్‌కలెక్టర్ రాసలీలలు
వేలూరు : వ్యవసాయ భూమి పత్రాలు మంజూరు చేసేందుకు రూ.50 వేలు లంచం తీసుకొని పట్టుబడిన వేలూరు ప్రత్యేక సబ్ కలెక్టర్ దినకరన్ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా లంచం తీసుకున్న డబ్బుతో సదరు సబ్‌కలెక్టర్ పలువురు మహిళలతో రాసలీలలు జరిపిన సంఘటనలు ప్రస్తుతం వెలుగుచూశాయి. తిరువణ్ణామలై జిల్లా పోలూరు తాలుకా ఇరుంబులి గ్రామానికి చెందిన రంజిత్‌కుమార్ గత ఆగస్టులో తన పూర్వీకుల భూమిని అతని పేరుపై మార్చుకున్నాడు. ప్రభుత్వం విలువకన్నా తక్కువగా రిజిష్టర్ పత్రాలు తీసినట్లు సబ్ రిజిస్ట్రార్‌కు తెలియడంతో వీటిపై వేలూరు కలెక్టరేట్లోని ప్రత్యేక సబ్ కలెక్టర్ దినకరన్‌ను కలవమని తెలిపాడు. కాగా సబ్ కలెక్టర్ రూ.50 వేలు లంచంగా అడగడంతో రంజిత్‌కుమార్ వేలూరులోని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు పథకం ప్రకారం అతనిపై దాడి చేసి రెడ్ హ్యాండడ్‌గా పట్టుకున్నారు. అనంతరం అతని ఇంటిలోను, కార్యాలయంలోను మొత్తం రూ.80 లక్షల నగదు, పలు కీలక పత్రాలు, కంప్యూటర్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం ప్రత్యేక కోర్టులో హాజరు పరిచి వేలూరు సెంట్రల్ జైలుకు తరలించారు. విచారణలో దినకరన్ ప్రతిరోజూ ఎవరి వద్ద ఎంత నగదు రావాలి అనే జాబితాను తయారు చేసి కారు డ్రైవర్ రమేష్‌కుమార్ అందజేసి వసూళ్లకు పాల్పడేవాడని తెలిసింది. జల్లికట్టుకు అనుమతి ఇచ్చేందుకు ఉత్సవ కమిటీ సభ్యుల నుంచి కారు డ్రైవర్ ద్వారా వేల రూపాయలు తీసుకున్నట్లు తెలిసింది. ఈ డబ్బుతో పలువురి మహిళలతో రాసలీలలు జరిపినట్లు అధికారులు గుర్తించారు. ఇటీవల రూ 2 వేల నోట్లు మారదని ప్రకటించడంతో లంచంగా రూ.500, 200 నోట్లు మాత్రమే తీసుకునే వాడని తెలిసింది. ముఖ్యంగా ఆయన కార్యాలయంలో పనిచేసే మహిళా అధికారి ఒకరికి అవసరమైనప్పుడల్లా నగదును ఇచ్చేవాడని, దీంతో కార్యాలయానికి ఎవరు వచ్చినా మహిళా అధికారినే మాట్లాడి సర్దుబాటు చేయడంతో పాటు వారి వద్ద ఆమె నగదును తీసుకునేదని ఏసీబీ అధికారులు గుర్తించారు. కార్యాలయానికి సొంత పనులపై వచ్చే మహిళలను ఆకర్షించే విధంగా మాట్లాడి అనంతరం వారితో చనువుగా ఉండేవాడని తెలిసింది. వీటితో పాటు వేలూరులో పనిచేస్తున్న కాలంలోనే రాణిపేటలో రూ. కోటి విలువ చేసే బంగ్లాను కొనుగోలు చేసినట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు గుర్తించారు. -
అలా అయితేనే పెళ్లి చేసుకుంటా!
టీ.నగర్: పుట్టిన గడ్డపై మమకారంతో ఆ ప్రాంత ప్రజల వైద్య అవసరాలు తీర్చేందుకు ఓ సబ్ కలెక్టర్ వింత వరకట్నం కోరారు. వివరాలు.. తంజావూరు జిల్లా, ఒట్టంగాడు గ్రామానికి చెందిన శివగురు ప్రభాకరన్ అనేక కష్టాలతో ఐఏఎస్ అధికారి స్థాయికి చేరుకున్నారు. ప్రస్తుతం తిరునెల్వేలిలో సబ్ కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఇతనికి వివాహం చేసేందుకు తల్లిదండ్రులు అమ్మాయి కోసం అన్వేషించారు. ఇతన్ని వివాహమాడేందుకు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ చదివిన యువతులు సిద్ధపడినా తాను ఒక వైద్యురాలినే వివాహమాడతానని తెలిపాడు. తల్లిదండ్రులు మెడికల్ కోర్స్ చేసిన యువతి కోసం ఏడాదిగా వెదికారు. మెడిసిన్ చేసిన యువతులు లభించినా, ఇతను కోరిన వింత వరకట్నం విని పరుగు లంకించుకున్నారు. చెన్నై నందనం కళాశాల గణిత అధ్యాపకురాలి కుమార్తె డాక్టర్ కృష్ణభారతిని చూశారు. డాక్టర్ కృష్ణభారతికి వరుని నూతన నిబంధనను సంశయంతో వెల్లడించారు సబ్ కలెక్టర్ తల్లిదండ్రులు. తమ కుమారుడు పెళ్లాడే డాక్టర్ వారంలో రెండు రోజులు ఒట్టంగాడు గ్రామ ప్రజలకు, పరిసరప్రాంతాల వారికి ఉచితంగా వైద్య సేవలందించాలన్నదే అతని వరకట్నం కోరికని వెల్లడించారు. దీన్ని కృష్ణభారతి సంతోషంగా స్వీకరించడంతో ఫిబ్రవరి 26న ఇద్దరికీ వివాహం జరిగింది. ఈ కాలంలోను ఇటువంటి వ్యక్తా అంటూ ఆ ప్రాంత ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తమ పట్ల ఉన్న ప్రేమానురాగాలతో పొంగిపోయిన పేరావూరణి ప్రజలు జంటను ప్రశంసించారు. -
పెళ్లి చేసుకుని ఐదేళ్లుగా పత్తాలేడు
సాక్షి, అమరావతిబ్యూరో: ప్రేమించి పెళ్లి చేసుకొని గర్భం దాల్చాక మొహం చాటేసి దక్షిణాఫ్రికాలో రహస్యంగా ఉంటున్న తన భర్తను, తనను కలపాలని, లేదా చర్యలైనా తీసుకోవాలని ఓ మహిళ ‘స్పందన’లో ఫిర్యాదు చేసింది. వివరాలు.. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కడవకొల్లుకు చెందిన ఎ.శృతిసుహాసిని దక్షిణాఫ్రికాలో బ్యూటీ థెరపిస్టుగా పనిచేసేది. ఆ సమయంలో దక్షిణాఫ్రికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా చీపునుంతలకు చెందిన సందీప్‌రెడ్డితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. 2011 జనవరి 1న వీరు అక్కడే రిజిస్టర్డ్ పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లకు మగబిడ్డ పుట్టాడు. సందీప్‌రెడ్డి తన భార్యను పుట్టింట్లోనే ఉంచేసి దక్షిణాఫ్రికా వెళ్లి మళ్లీ తిరిగి రాలేదు. పెళ్లి సమయంలో రూ.30 లక్షలు, 10 తులాల బంగారం ఇచ్చామని.. కానీ, అదనంగా మరో రూ.50 లక్షలు తెస్తేనే తమను దక్షిణాఫ్రికా తీసుకెళ్తానని చెప్పాడని శృతిసుహాసిని వాపోయింది. తన భర్త దక్షిణాఫ్రికాలో రహస్యంగా ఉంటున్నాడని, ఆయన ఆచూకీ తెలుసుకుని తాను అతనితో కలిసి ఉండేలా చూడాలని, లేదా వారిపై చర్యలైనా తీసుకోవాలని సోమవారం ‘స్పందన’లో తన ఎనిమిదేళ్ల కుమారుడు హర్దీప్‌సాయితో కలిసి విజయవాడ సబ్‌కలెక్టర్ ధ్యాన్‌చంద్రను బాధితురాలు ఆశ్రయించింది. -
జీవితంలో ప్రత్యేకమైన రోజు
విజయవాడ: తన తొలి పోస్టింగ్‌లో సబ్–కలెక్టర్‌గా విజయవాడలో బాధ్యతలు చేపట్టడం జీవితంలో ఓ మరచిపోలేని అనుభూతి అని సబ్‌కలెక్టర్ మిషాసింగ్ అన్నారు. సోమవారం ఆమె సబ్–కలెక్టర్ కార్యాలయంలో సబ్–కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ కృష్ణాజిల్లా ప్రజలకు సేవ చేసే అవకాశం రావటం తన అదృష్టమన్నారు. దేవుడు తనకిచ్చిన సదవకా«శాన్ని వినియోగించుకుని నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు.ప్రజాసమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యతనిస్తానన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై ఎటువంటి జాప్యం, కాలయాపన లేకుండా పని చేస్తానని చెప్పారు. విధి నిర్వహణలో అంకితభావం చిత్తశుద్ధితో పని చేస్తానని చెప్పారు. ప్రధానంగా భూవివాదాలు, రైతుల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తాన్నారు. డివి జన్ స్థాయిలో అన్ని శాఖలకు చెందిన అధికారులతో సమీక్ష నిర్వహించి, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. ‘మీకోసం’లో ఫిర్యాదుల స్వీకరణ.. సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే మిషాసింగ్ కార్యాలయంలో ‘మీకోసం’ కార్యక్రమంలో పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు. ముందుగా కార్యాలయంలో పని చేసే సిబ్బందిని పరిచయం చేసుకున్నారు. సబ్–కలెక్టర్ కార్యాలయం ఏఓ రాజకుమారి, ఉద్యోగులు స్వాగతం పలికారు. అంతకుముందు సబ్–కలెక్టర్ మిషా సింగ్ జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతంను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సబ్ కలెక్టర్ వాహనం అడ్డగింత
బోధన్ నిజామాబాద్ : తమ గోడును ఎవరూ పట్టించుకోవడం లేదనే ఆవేదనతో మెప్మా ఆర్పీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం బోధన్ మున్సిపల్ ఆఫీసు లోపల నుంచి బయటకు వస్తున్న సబ్ కలెక్టర్ అనురాగ్ జయంతి వాహనాన్ని మున్సిపల్ ఆఫీసు ప్రవేశ ద్వారం వద్ద అడ్డుకున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆర్పీలను సముదాయించే ప్రయత్నం చేస్తూ వాహనాన్ని తహసీల్ ఆఫీసు వైపు మళ్లీంచారు. స్థానిక మున్సిపల్ ఆఫీసులో చైర్మన్ ఆనంపల్లి ఎల్లయ్యపై కౌన్సిలర్లు ఇచ్చిన అవిశ్వాస నోటీసు మేరకు బలపరీక్షకు కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఉదయం 11.30 గంటల వరకు కౌన్సిలర్ల కోరం లేక పోవడంతో సమావేశం వాయిదా వేసి తిరిగి సబ్ కలెక్టర్ ఆఫీసుకు వెళ్తున్న ఆయన వాహనాన్ని మున్సిపల్ ప్రవేశ ద్వారం వద్ద మెప్మా ఆర్పీలు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఈ క్రమంలో ఆర్పీలు ఆగ్రహానికి గురై నినాదాలు చేశారు. కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని, 22 రోజులుగా రోడ్డెక్కి నిరసన తెలిపినా ఎవరూ పట్టించుకోవడం లేదని, ప్రభుత్వం తమతో వెట్టిచాకిరి చేయించుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ ఆఫీసుకు ర్యాలీ వెళ్లి నిరసన తెలిపారు. కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, ఇతర సమస్యలు పరిష్కరించాలని మెప్మా ఆర్పీలు 22 రోజులుగా నిరవధిక సమ్మెను కొనసాగిస్తూ రిలే నిరహార దీక్షలు కొనసాగిస్తున్నారు. -
సవాళ్లకు వెరవని వెట్రి సెల్వి
వెట్రిసెల్వి.. దేశంలోనే అతిపెద్ద రెవెన్యూ డివిజన్‌గా గుర్తింపు పొందిన మదనపల్లె సబ్ కలెక్టర్‌గా తనదైన శైలిలో రాణించారు. చిన్నవయస్సులోనే ఐఏఎస్ సాధించి.. కుప్పం స్పెషల్ ఆఫీసర్‌గానూ ప్రతిభ చూపారు. తాజాగా జాయింట్ కలెక్టర్‌గా ఉద్యోగ ఉన్నతి పొంది నెల్లూరుకు బదిలీ అయ్యారు. చిత్తూరు జిల్లాలో సవాళ్లకు దీటుగా విధులు నిర్వహించి ఆమె మంచి గుర్తింపు పొందారు. మదనపల్లె : 2014 ఐఏఎస్ 143వ ర్యాంకు. మదనపల్లె సబ్ కలెక్టర్‌గా విధి నిర్వహణ. వృత్తి పరంగా ఎన్నో సవాళ్లు, మరెన్నో సమస్యలు. అన్నింటినీ సమర్థవంతంగా నిర్వహిస్తూ, తనదైన శైలిలో రాణిస్తూ వెట్రిసెల్వి భూ సమస్యలెన్నింటినో పరిష్కరించారు. మదనపల్లె సబ్ కలెక్టర్‌గానే కాకుండా కుప్పం స్పెషల్ ఆఫీసర్‌గానూ అదనపు బాధ్యతలు స్వీకరించి సత్తా చూపారు. మదనపల్లెలో 16 నెలల పదవీకాలం పనిచేసి నెల్లూరు జాయింట్ కలెక్టర్, అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్‌గా పదోన్నతిపై వెళ్లనున్నారు. భూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి భూసమస్యలపై దృష్టి పెట్టారు. మదనపల్లె రెవెన్యూ డివిజన్ పరిధిలో అనేక ప్రభుత్వ స్థలాలు ఆక్రమణ, భూసమస్యలు, భాగ పరిష్కారాలు, పట్టాదారు పాసుపుస్తకాలు తదితర సమస్యలు అధికంగా ఉండటంతో వాట న్నంటిపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. కిందిస్థాయి సిబ్బం ది సహాయంతో, పై అధికారుల సూచనలతో ఎప్పటి సమస్యలు అప్పుడే పరిష్కరించేందుకు కృషి చేశారు. జాతీయ రహదారి విస్తరణలో.. చొరవ మదనపల్లె నుంచి పలమనేరు వరకు ఎన్‌హెచ్-42 రోడ్డు విస్తరణ పనులకు శ్రీకారం చుట్టారు. పుంగనూరు పట్టణ ప్రజలు ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బైపాస్ రోడ్డుకు అనుమతులు మంజూరు చేశారు. మదనపల్లె తట్టివారిపల్లె నుంచి పలమనేరు వరకు 54 కిలోమీటర్లు రోడ్డు విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. అలాగే మదనపల్లె నుంచి తిరుపతి ఎన్‌హెచ్–71 ఫోర్లేన్లో భాగంగా మొదటివిడతలో 60 కిలోమీటర్ల పనులకు శంకుస్థాపన చేసి సర్వే పనులకు శ్రీకారం చుట్టారు. హంద్రీ– నీవా పనుల్లో.. రాయలసీమ ప్రజల దాహార్తిని తీర్చేందుకు అపర భగీరథుడు వైఎస్సార్ ప్రారంభించిన హంద్రీ–నీవా కాలువ పనుల పూర్తిలో భాగంగా మదనపల్లె మండలం రామిరెడ్డిగారిపల్లె, చిప్పిలి తదితర ప్రాంతాల్లో భూసమస్యలపై కోర్టు వివాదాలు ఉంటే యజమానులతో చర్చించి, ప్రజావసరాల దృష్ట్యా కేసులు వెనక్కు తీసుకుని నిర్మాణానికి సహకరించడంలో చొరవ చూపారు. త్వరలో హంద్రీ–నీవా జలాలు మదనపల్లెకు రానున్నాయి. కుంభకోణాల నిగ్గుతేల్చి.. పెద్దపంజాణి మండలంలో 400 ఎకరాల భూ కుంభకోణంలో సమగ్రంగా పరిశీలన చేసి, అక్రమాలను నిగ్గుతేల్చి మహిళా తహసీల్దార్ సస్పెన్షన్‌కు సిఫారసు చేశారు. బి.కొత్తకోట మండలంలో హార్టికల్చర్ హబ్ నిర్మాణం కోసం బయ్యప్పగారిపల్లె–కోటావూరు గ్రామాల మధ్య 89ఎకరాల60సెంట్లు భూమిని కేటాయించారు. మదనపల్లె ఆటోనగర్, మైక్రో స్మాల్, మీడియం ఇండస్ట్రియల్ ఎస్టేట్ కోసం ఏపీఐఐసీకి 80 ఎకరాలు కేటాయించారు. కుప్పం ఎయిర్‌పోర్టు కోసం 50 ఎకరాలు భూమిని సమీకరించి పనులు త్వరితగతిన ప్రారంభమయ్యేలా చొరవచూపారు. మదనపల్లె వాతారణం తనకెంతో ఇష్టమని, ఇక్కడ ఎదురైన సవాళ్లు కొత్త అనుభవాలను నేర్పాయని వెట్రిసెల్వి తెలిపారు. -
ఒత్తిళ్ల మధ్య ప్రజలకు మేలు చేశారు
తిరుపతి సిటీ: ‘సబ్‌కలెక్టర్‌గా నిశాంత్‌కుమార్ గత 14 నెలల్లో ప్రోటోకాల్, భూసేకరణతో పాటు భూ ఆక్రమణలను నిరోధించగలిగారు. ఒత్తిళ్ల మధ్యలో కూడా ప్రజలకు మేలు చేశారు.’ అని జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న ప్రశంసించారు. సబ్‌కలెక్టర్ నిశాంత్ కుమార్ బదిలీపై వెళుతున్న సందర్భంగా మంగళవారం రాత్రి ఒక ప్రైవేటు హోటల్లో వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమలకు భూములు తీసుకుంటే సదరు భూమి కోల్పోయే వ్యక్తి జీవనం కూడా మెరుగు పరచడానికి బాధ్యత కూడా తీసుకోవాలన్నారు. నిషాంత్ చేసిన మంచిపనులకు నిదర్శనంగా సీపీఎంకు చెందిన కందారపు మురళి వంటి నేతలు వీడ్కోలు సభలో పాల్గొనడం విశేషమన్నారు. అనంతరం సబ్ కలెక్టర్ మాట్లాడుతూ అనుభవం లేని తాను ఇక్కడ ఎన్నో నేర్చుకున్నానని, కలెక్టర్ సూచనలతోనే ప్రజా సమస్యలను పరిష్కరించగలిగానన్నారు. జాయింట్ కలెక్టర్ గిరీషా మాట్లాడుతూ తక్కువగా మాట్లాడి పనులు చక్కబెట్టేవారని, నిశాంత్ నుంచి ఫైల్ వస్తే చూడకుండా సంతకం చేయవచ్చునని గుర్తు చేశారు. అనంతరం నిశాంత్‌కుమార్ దంపతులను తిరుపతి రెవెన్యూ డివిజన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా దుశ్శాలువతో సత్కరించి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో సబ్‌కలెక్టర్ కార్యాలయ ఏఓ ఝాన్సీ, రేణిగుంట విమానాశ్రయ డైరెక్టర్ పుల్ల, సీఎస్ఎఫ్ కమాండెంట్ మనీషా, తహసీల్దార్లు నరసింహులునాయుడు, చంద్రమోహన్, రాజశేఖర్, మునాఫ్, తదితరులు పాల్గొన్నారు. -
బిగుసుకుంటున్న ఉచ్చు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసినందుకు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న నెన్నెలకు చెందిన గీత కార్మికుడు రామాగౌడ్ ఉదంతంలో బాధ్యులపై ఉచ్చు బిగుసుకుంటోంది. రాష్ట్రంలోనే చర్చనీయాంశమైన ఈ కేసును బెల్లంపల్లి సబ్ కలెక్టర్ రాహుల్‌రాజ్ విచారణ చేస్తున్నారు. బుధవారం ఆయన నెన్నెలకు వెళ్లి స్వయంగా రామాగౌడ్ కుటుంబసభ్యులతో మాట్లాడడంతోపాటు రామాగౌడ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిన పల్ల మహేష్ అనే వ్యక్తికి సంబంధించి కూడా వివరాలు సేకరించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేసిన అంశమే ఈ ఘటనలో ప్రధానమైనదిగా మారింది. సబ్ కలెక్టర్ విచారణ కూడా అట్రాసిటీ కింద ఫిర్యాదు చేసిన మహేష్ ఎస్టీనా లేక బీసీనా అనే కోణంతో పాటు ఎస్టీ ధ్రువీకరణ పత్రం జారీ చేసే విషయంలో నిబంధనలు పాటించారా లేదా అనే అంశంపై ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అలాగే మహేష్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగానే, సంబంధిత ఎస్ఐ ఎస్టీ అట్రాసిటీ కింద కేసు తీసుకోగా, విచారణాధికారిగా వ్యవహరించిన ఏసీపీ దానిని సమర్థించి, రామాగౌడ్ ఎస్టీ గౌరవానికి భంగం కలిగించినట్లుగా నిర్ధారించారు. ఈ వ్యవహారంలో ఎస్ఐ, ఏసీపీ ఎంతమేర నిజాయితీగా వ్యహరించారనే అంశాన్ని కూడా సబ్ కలెక్టర్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. భూపాలపల్లి ఇన్చార్జి కలెక్టర్‌గా ఆర్వీ.కర్ణన్ మేడారం జాతరను పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో జాతర ప్రారంభమయ్యే 31వ తేదీ లోపే ఆయనకు నివేదిక అందజేయనున్నట్లు సమాచారం. తహసీల్దార్‌పై తొలివేటు? పల్ల మహేష్ అనే వ్యక్తి రామాగౌడ్‌పై ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయడం వల్లనే ఆత్మహత్య చేసుకున్నట్లు సబ్ కలెక్టర్ రాహుల్‌రాజ్ ప్రాథమిక విచారణలోనే తేలిపోయింది. అయితే మహేష్ ఎస్టీ కాదని, పితృస్వామ్య దేశంలో తండ్రి కులమే సంతానానికి సంక్రమిస్తుందనే వాదన తెరపైకి వచ్చింది. గతంలో హైదరాబాద్ యూనివర్సిటీలో జరిగిన ఓ విద్యార్థి ఆత్మహత్య విషయంలో కూడా ఇదే వివాదం రేగింది. ఈ నేపథ్యంలో నెన్నెల తహసీల్దార్ ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని మహేష్‌కు ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రం ఇచ్చారనే అంశాన్ని విచారిస్తున్నట్లు సమాచారం. కాగా 2017 సెప్టెంబర్ 18న జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రానికి సంబంధించి మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ కూడా ఎస్టీగా సర్టిఫై చేయకుండా ఏకంగా తహసీల్దార్ సంతకం చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. కొలావర్ కులానికి చెందిన వ్యక్తిగా మహేష్‌ను తహసీల్దార్ నేరుగా సర్టిఫై చేయడం గమనార్హం. ఈ కుల ధ్రువీకరణ పత్రం కారణంగానే అట్రాసిటీ కేసు మొదలు, ఆత్మహత్య వరకు చోటు చేసుకోవడంతో విచారణాధికారి కూడా దీనిపైనే ప్రత్యేక దృష్టి పెట్టారు. రాజకీయంగా బెల్లంపల్లిలో హైటెన్షన్ రామాగౌడ్ ఆత్మహత్య ఉదంతం బెల్లంపల్లి నియోజకవర్గంలో రాజకీయంగా టెన్షన్ వాతావరణానికి కారణమైంది. ఈ ఆత్మహత్యకు అధికార పార్టీ నాయకులే కారణమనే విషయాన్ని ప్రతిపక్షాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయం సాధించాయి. నెన్నెల గ్రామ సర్పంచ్, మండల కో అప్షన్ సభ్యుడు, ఎంపీటీసీతో పాటు ఎమ్మెల్యేను కూడా ఇందులోకి లాగాయి. అఖిలపక్షం పేరుతో అన్ని పార్టీలు ఆందోళనలు జరుపుతుండడంతో స్వయంగా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మీడియా సమావేశం పెట్టి తనకే సంబంధం లేదని చెప్పుకునే ప్రయత్నం చేశారు. రామాగౌడ్ తన కుటుంబంలో సభ్యుడి వంటి వాడని ఆయన చెప్పినప్పటికీ, రామాగౌడ్ మృతి తరువాత ఎమ్మెల్యేతో పాటు టీఆర్ఎస్ నాయకులెవరూ బాధితుని కుటుంబాన్ని పరామర్శించకపోవడాన్ని ప్రతిపక్షాలు అవకాశంగా మార్చుకున్నాయి. ప్రత్యక్షంగా టీఆర్ఎస్ నేతలకు ఈ అంశంతో సంబంధం లేకపోయినా... వారి ప్రోద్బలంతోనే ఎస్టీ ధ్రువీకరణ పత్రం, అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు వంటివి జరిగాయనే విషయాన్ని ప్రతిపక్ష పార్టీల నేతలు జనంలోకి తీసుకెళ్లడం కొంత ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో సబ్ కలెక్టర్ నివేదికపైనే కేసు ఆధారపడి ఉంది. ఎస్ఐ, ఏసీపీల విచారణ ఏమైంది..? ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఎవరైనా ఫిర్యాదు చేస్తే దాన్ని రూఢి చేసుకున్న తరువాతే కేసు నమోదు చేయాలన్న ప్రాథమిక సూత్రాన్ని కూడా ఈ కేసులో పాటించలేదని సబ్ కలెక్టర్ విచారణలో స్పష్టమైనట్లు సమాచారం. ఎస్ఐ కేసు నమోదు చేయగానే విచారణాధికారిగా ఏసీపీ వాస్తవాలను విచారించకుండానే రామాగౌడ్‌పై కేసును నిర్ధారించడం, దానికి తహసీల్దార్ ఇచ్చిన కుల ధ్రువీకరణ పత్రాన్ని ప్రామాణికంగా తీసుకోవడం కూడా కీలకంగా మారింది. కేసు నమోదు చేసిన తరువాత గౌడ కుల సంఘాలు, రామాగౌడ్ కుటుంబసభ్యులు ఏసీపీ, కలెక్టర్లను కలిసి వాస్తవాలు తెలియజేసినా, ఎందుకు స్పందించి అట్రాసిటీ కేసు నుంచి సాధారణ కేసుగా మార్చలేదనేది ప్రశ్న. ఈ విషయాలపై విచారణ జరుపుతున్న సబ్ కలెక్టర్ ఇచ్చే నివేదిక పైనే బాధ్యులపై తీసుకునే చర్యలు ఏంటనేది తేలనుంది. -
తేనెటీగల దాడిలో సబ్‌కలెక్టర్‌కు గాయాలు
వాజేడు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా వాజేడులోని బొగత జలపాతాన్ని పరిశీలించేందుకు వచ్చిన అధికారులపై అకస్మాత్తుగా తేనెటీగలు దాడిచేశాయి. ఈ దాడిలో సబ్‌కలెక్టర్, టూరిజం ఈఈ సహా పలువురికి గాయాలయ్యాయి. జలపాత అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను పరిశీలించేందుకు కలెక్టర్ మురళి, సబ్ కలెక్టర్ గౌతమ్, టూరిజం ఈఈలతో కలిసి గురువారం ఇక్కడికి చేరుకున్నారు. ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న సమయంలో ఒక్కసారిగా అధికార బృందంపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో సబ్‌కలెక్టర్ గౌతమ్‌కు చెవి, ముక్కు, గొంతు ప్రాంతాల్లో గాయాలయ్యాయి. అధికారులతో పాటు అక్కడ ఉన్న పర్యటకులపై కూడా తేనెటీగలు విరుచుకుపడటంతో.. భయంతో పరుగులు తీశారు. -
ఇసుక ర్యాంప్‌లో సబ్ కలెక్టర్ తనిఖీలు
కోడేరు: పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం కోడేరు ఇసుక రాంప్లో నర్సాపురం సబ్ కలెక్టర్ సుమిత్ గాంధీ ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా పొక్లెయినర్లతో ఇసుక తవ్వకాలు జరుపుతున్నట్లు ఆయన గుర్తించారు. కూలీలు బదులు యంత్రాలతో ఇసుక లోడింగ్ చేస్తుండటంతో ఆయన 28 లారీలు, 6 పొక్లెయినర్లను సీజ్ చేశారు. మంత్రి పితాని సత్యనారాయణ సొంత నియోజక వర్గంలో సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు సంచలనం రేపుతున్నాయి. -
భూములు ఇచ్చేది లేదు..
సంతకాలు పెట్టని రైతులు స్వాధీనం తీసుకుంటామన్న సబ్ కలెక్టర్ విజయ్‌కృష్ణన్ పురుషోత్తపట్నం పథకం భూసేకరణ ప్రహసనం సీతానగరం (రాజానగరం) : భూములు ఇచ్చేది లేదని, ప్రాణత్యాగానికైనా సిద్ధమవుతామని పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పైప్‌లైన్ భూసేకరణకు సంతకాలు చేయని రైతులు ఖరాఖండీగా చెప్పారు. పురుషోత్తపట్నం పంచాయతీ కార్యాలయం వద్ద మంగళవారం ఆవార్డు ఎంక్వైరీ గ్రామసభలో రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ విజయ్‌కృష్ణన్ పాల్గొన్నారు. భూసేకరణ సమయంలో ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ ఎకరానికి రూ.40 లక్షలు డిమాండ్ చేయమని చెప్పారని, అయితే ఎకరానికి రూ.28 లక్షలు ప్రకటించారని, అందుకే కోర్టును ఆశ్రయించామని రామచంద్రపురానికి చెందిన రైతు కలగల బాలకృష్ణ తెలిపారు. భూసేకరణ చట్టం-2013 ప్రకారం కూలీలు జీవనోపాధి కల్పించాలని, ఎకరానికి రూ.40 లక్షలు ఇవ్వాలని కొండ్రు రమేష్, చల్లమళ్ళ విజయభాస్కర చౌదరి, కరుటూరి శ్రీనివాస్ తదితరులు డిమాండ్ చేశారు. చట్ట ప్రకారం రూ.15 లక్షల నుంచి రూ.19 లక్షలు కోర్టులో జమ చేస్తామని అంటున్నారని, మరి ఎకరానికి రూ.28 లక్షలు ఏవిధంగా ఇస్తారని రైతులు నిలదీశారు. ముందు భూములను స్వాధీనం చేసినందుకు ఎకరానికి రూ.28 లక్షలు ఇస్తామని సబ్ కలెక్టర్ వివరించారు. వారంలో స్వాధీనం చేసుకుంటాం... వారం రోజులలో చట్ట ప్రకారం భూములను స్వాధీనం చేసుకుంటామని, సంతకాలు చేయని రైతులకు కోర్టులో పరిహారం జమ చేస్తామని సబ్ కలెక్టర్ విజయ్‌కృష్ణన్ తెలిపారు. గ్రామసభలో సంతకాలు పెట్టని రైతుల సమస్యలపై స్పందించనని అన్నారు. చట్ట ప్రకారం అయితే రైతుల అంగీకారంతో భూములు తీసుకోవాలని, దౌర్జన్యంగా రైతులు భూములు తీసుకుంటామని తెలుపుతున్నారని రైతులు ప్రాణత్యాగానికైనా సిద్ధమని రైతులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జల వనరుల శాఖ డీఈ వెంకట్రావు, తహసీల్దార్ చంద్రశేఖరరావు, ఆర్ఐ సుధాకర్, మెగా ఇంజనీరింగ్ మేనేజర్ శివరామకృష్ణ, జల వనరుల శాఖ ఏఈఈ కృష్ణప్రసాద్, డిప్యూటీ తహాసీల్దార్ నండూరి శేఖర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
ఆక్వా పార్క్ ఏర్పాటుకు సీఎం సుముఖం
నరసాపురం : తుందుర్రులో గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్కు ఏర్పాటుపై ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు పూర్తి సుముఖంగా ఉన్నారని నరసాపురం సబ్ కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ చెప్పారు. ఈ ఫ్యాక్టరీ వల్ల కాలుష్యం, ఇతర విషయాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆయన తెలిపారు. గురువారం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఫుడ్ పార్కు విషయంలో జరుగుతున్న ఆందోళనలు, లేవనెత్తుతున్న అభ్యంతరాల నేపథ్యంలో ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నియమించిందన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి మధుసూదనరావు, మత్స్యశాఖ ఏడీ పి.రామ్మోహన్రావు, ఆంధ్రా యూనివర్సిటీ బయోటెక్నాలజీ ఫ్రొఫెసర్ ఎస్.సందీప్‌లను నియమించినట్టు చెప్పారు. ఫ్యాక్టరీ నిర్మాణం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని కమిటీ నివేదిక ఇచ్చిందన్నారు. ఈ ఫ్యాక్టరీ నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధవహిస్తున్నారని చెప్పారు. ఆరెంజ్ గ్రేడ్ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ ద్వారా ఎలాంటి హానికరమైన వ్యర్థాలు వెలువడవని సబ్‌కలెక్టర్ వివరించారు. అది ఆరెంజ్ గ్రేడ్ ఫ్యాక్టరీగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ గుర్తించిందన్నారు. వ్యర్థాలను పైప్లైన్ల ద్వారా సముద్రంలో కలపడానికి యాజమాన్యం అంగీకరించందిన్నారు. రూ.11 కోట్లతో పైప్లైన్లు నిర్మించనున్నారని సబ్ కలెక్టర్ చెప్పారు. ప్రత్యక్షంగా ఫ్యాక్టరీ ద్వారా 2 వేల మందికి, పరోక్షంగా ఐదువేల మందికి ఉపాధి కలుగుతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రూ. 50 కోట్లు గ్రాంట్‌గా అందిస్తుందన్నారు. ఆయా గ్రామాల ప్రజలకు ఈ విషయాలను చెప్పి ఒప్పిస్తామని తెలిపారు. -
సబ్ కలెక్టర్ అడ్డుకున్న స్థానికులు
-
తమాషా చేస్తున్నారా?
ప్రజా సమస్యలంటే అంత చులకనా..? అధికారుల తీరుపై సబ్ కలెక్టర్ శ్రుతిఓజా ఆగ్రహం వికారాబాద్: ‘ప్రజల సమస్యలంటే అంత చులకనా.. ఏం తమాషా చేస్తున్నారా’.. అని రంగారెడ్డి జిల్లా సబ్ కలెక్టర్ శ్రుతిఓజా వివిధ శాఖల అధికారులపై మండిపడ్డారు. వికారాబాద్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి గైర్హాజరైన సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. సదరు ఉద్యోగులకు వెంటనే నోటీసులు జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్య, వైద్య, వ్యవసాయ, పంచాయితీరాజ్, ఇరిగేషన్, ఆర్అండ్బీ, ఎక్సైజ్, ఐటీడీఏ, ఐసీడీఎస్, తూనికలుకొలతలు, కార్మిక, ఆర్‌డబ్ల్యుఎస్, గ్రంథాలయ, మున్సిపల్, బ్యాంకింగ్ తదితర శాఖల అధికారులు తరచూ దర్బార్‌కు ఎగనామం పెడుతుండటంపై మండిపడ్డారు. ప్రజలు ఇచ్చే ఫిర్యాదుపై వెంటనే స్పందించి పరిష్కార మార్గాలు చూపాలని ఆదేశించారు. లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. తహసీల్దార్ గౌతంకుమార్, ఎంపీడీవో సత్తయ్య ఉన్నారు. -
సబ్‌కలెక్టర్ ఎదురుచూపులు!
గ్రామసందర్శనకు సకాలంలో హాజరుకాని వైనం జగిత్యాల రూరల్ : గ్రామసందర్శనకు అధికారులు సకాలంలో హాజరుకాకపోవడంతో జగిత్యాల సబ్ కలెక్టర్ శశాంకకు వేచి చూడాల్సిన పరిస్థితి ఎదురైంది. ఉదయం 10 గంటలకు గ్రామ సందర్శన ప్రారంభంకావాల్సి ఉండగా.. 10.10 గంటలకు సబ్‌కలెక్టర్ గ్రామానికి చేరుకున్నారు. అధికారులెవరూ లేకపోవడంతో అరగంటపాటు గ్రామపంచాయతీలోనే ఎదురుచూశారు. ఎంఈవో మద్దెల నారాయణ హాజరుకాగా 10.45 గంటలకు ఎంపీడీవో శ్రీలతరెడ్డి వచ్చారు. ఇద్దరు అధికారులను వెంటబెట్టుకుని ప్రాథమిక పాఠశాల తనిఖీకి వెళ్లగా.. 11 గంటలకు ఐసీడీఎస్ సూపర్వైజర్ రాజశ్రీ హాజరయ్యారు. అరుుతే అధికారులను మందలించకుండానే సబ్‌కలెక్టర్ గ్రామసందర్శనలో పాల్గొన్నారు. -
'అరకు ఉత్సవ్... అభివృద్ధి మాటేంటి?'
విశాఖ: విశాఖ జిల్లాలోని అరకు ఎమ్మార్వో కార్యాలయంలో సోమవారం సబ్ కలెక్టర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని గిరిజన సంఘాలు బాయ్‌కాట్ చేస్తున్నట్టు ప్రకటించాయి. హుద్-హుద్‌తో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు పూర్తి చేయకుండా అరక్ ఉత్సవ్ నిర్వహించడమేంటి?.. సబ్ కలెక్టర్‌ను గిరిజనులు నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దత్తత తీసుకున్న అరకును అభివృద్ధి చేయడం లేదని గిరిజనులు వాపోతున్నారు. జీవో నెంబర్ 97ను వెంటనే ఉపసంహరించుకోవాలని గిరిజనులు డిమాండ్ చేశారు. -
మళ్లీ రావయ్యా! మల్లికార్జునయ్యా..
మదనపల్లె: ఇక్కడ ఫొటోలో తలకు క్యాప్ పెట్టుకుని, నీలిరంగు చొక్కాను టక్ చేసుకుని, సీరియస్‌గా నీళ్లకు బండరాళ్లను అడ్డం వేస్తున్న వ్యక్తిని చూస్తే ఏమనిపిస్తుంది?.. చూడటానికి చదువుకున్నోడిలా ఉన్నాడనో, మరెవరో అనుకుంటున్నారు కదూ! నిజానికి ఆయన మదనపల్లె సబ్ కలెక్టర్ డాక్టర్ ఏ.మల్లికార్జున. వ్యవసాయ నేపథ్యం కలిగిన కుటుంబం ఆయనది. బదిలీ అయినప్పటికీ విధులను నిబద్ధతతో నిర్వర్తించి, తా నూ రైతు బిడ్డనే అని పరోక్షంగా చాటారు. భారీ వర్షాలకు మండలంలోని పలు చెరువులు ప్రమాదస్థితికి చేరాయి. బుధవారం వీటిని ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డితో కలసి సబ్‌కలెక్టర్ పరిశీలించారు. మండలంలోని పెద్ద మొరవ అధ్వానంగా ఉండడడంతో నీరు వృథాగా పోతోంది. ఇది చూసి సబ్‌కలెక్టర్ ఇరిగేషన్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం స్పందించారు. నీరు వృథా కాకుండా చర్యలకు ఉపక్రమించారు. ఫ్యాంటును పాదంపై వరకూ మడిచారు. అక్కడ ఉన్న బండరాళ్లను తానే స్వయంగా మోసుకొచ్చి, నీటికి అడ్డుకట్టగా వేయసాగారు. ఇది చూసి తక్కిన ఆయనతో వచ్చిన ఇతర సిబ్బంది తామూ ఓ చెయ్యి వేశారు. వాళ్లు రాళ్లు అందిస్తూంటే దెబ్బతిన్న మొరవ కట్టపై వరుసగా పేర్చి, నీటిని నిలువరించసాగారు. విషయం తెలుసుకున్న ఆయకట్టు రైతులు అక్క డి చేరుకుని ఆయన శ్రమలో పాలు పంచుకునేందుకు ఉద్యుక్తులయ్యారు. వారిపై కూడా సబ్ కలెక్టర్ మండిపడ్డారు. ‘ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్పలేదు సరే..రైతులుగా ఉండి మీరేం చేస్తున్నారు?.. మొరవ పరిస్థితి ఇలా ఉంటే మా దృష్టికి తీసుకురావాలనే ఆలోచన కూడా లేదా?’ అంటూ చీవాట్లు పెట్టడంలో రైతులు నోరెళ్ల బెట్టారు.! ఇప్పటివరకూ ఇలాంటి అధికారిని తాము చూడలేదని, సబ్ కలెక్టర్ బదిలీ అయినా రైతు సంక్షేమమే ముఖ్యం అన్నట్లుగా ఆయన మాట్లాడారని ఆయకట్టుదారులతో పాటు ఎమ్మెల్యే కూడా ప్రశంసించకుండా ఉండలేకపోయారు. -
గోదాంగూడలో సబ్ కలెక్టర్ పల్లె నిద్ర
ధారూర్(రంగారెడ్డి): తాను దత్తత తీసుకున్న గ్రామంలో సబ్‌కలెక్టర్ పల్లె నిద్ర చేపట్టారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ధారూర్ మండలంలో ఆదివారం చోటుచేసుకంది. మండలంలోని గోదాంగూడ గ్రామాన్ని వికారాబాద్ కలెక్టర్ వర్షిణి, గ్రామ జ్యోతి కార్యక్రమంలో భాగంగా దత్తత తీసుకున్నారు. అయితే గ్రామసమస్యలు తెలుసుకునేందుకు స్థానికులతో మాట్లాడేందుకు ఆమె ఈ రోజు గ్రామంలో పర్యటించి అక్కడే నిద్రించనున్నారు. -
మద్యంపై మహిళాగ్రహం
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన మద్యం విధానాన్ని రద్దుచేయాలని డిమాండ్‌చేస్తూ మహిళా సంఘాల రాష్ట్ర ఐక్య వేదిక ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన సబ్ కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. కార్యాలయం లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించిన మహిళలను పోలీసులు ఈడ్చుకెళ్లి వ్యానులో ఎక్కించారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. కొంతమందిని అరెస్ట్‌చేసి సూర్యారావుపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. - సబ్-కలెక్టరేట్ ముట్టడికి మహిళల యత్నం - పోలీసులు - మహిళల మధ్య తోపులాట, ఉద్రిక్తత విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన మద్యం విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌చేస్తూ సోమవారం మహిళలు సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. మహిళా సంఘాల రాష్ట్ర ఐక్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు కొద్దిసేపు రోడ్డుపైనే బైఠాయించి ధర్నా చేశారు. మద్యం అమ్మకాలపై నిప్పులు చెరుగుతూ సబ్ కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు, మహిళలకు మధ్య తోపులాట జరగడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు వారిని అడ్డుకుని.. అరెస్ట్ చేసి సూర్యారావుపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య (ఐద్వా), ప్రగతిశీల మహిళా సంఘం ప్రతినిధులు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి మాట్లాడుతూ ప్రభుత్వం ఆదాయం కోసం ప్రజల జీవితాలను పణంగా పెడుతోందన్నారు. దశలవారీగా బెల్టుషాపులు రద్దు చేస్తానని ఎన్నికల ముందు వాగ్దానం చేసిన చంద్రబాబు ఇప్పుడు మోసం చేశారని చెప్పారు. సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి పెనుమత్స దుర్గాభవానీ మాట్లాడుతూ ప్రభుత్వం ఆదాయం కోసం పండ్ల మాదిరిగా మద్యాన్ని టెట్రా ప్యాకెట్లలో విక్రయించేందుకు సిద్ధమవుతోందన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మద్యం టెండర్లను నిలుపుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో పాల్గొన్న మహిళా సంఘాల నాయకులు కె.శ్రీదేవి, పంచదార్ల దుర్గాంబ, కాజా సరోజ, ఓర్సు భారతి, ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి గంగాభవానీతో పాటు పెద్దసంఖ్యలో మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. -
వర్షిణి.. సాహసాధికారిణి!
తాండూరు రూరల్ (రంగారెడ్డి): ఆమె ఓ మహిళా ఉన్నతాధికారి.. సాహసానికి మారుపేరుగా నిలిచారు. ఇసుకాసురుల పనిపట్టేందుకు ఆ అధికారిణి బైక్‌పై వెళ్లారు. 150 ట్రాక్టర్ల ఇసుక డంపులను సీజ్ చేశారు. బుధవారం రంగారెడ్డి జిల్లా తాండూరులో ఇసుక రవాణాను అడ్డుకునేందుకు సబ్ కలెక్టర్ అలుగు వర్షిణి ఇలా బైక్‌పై వెళ్లారు. ఆమె సాహసానికి స్థానికులు అబ్బురపడ్డారు. - తాండూరు రూరల్ -
ఇసుకాసురులపై కన్నెర్ర
తాండూరు రూరల్ : ఇసుక అక్రమ రవాణాపై సబ్ కలెక్టర్ అలగు వర్షిణి మరోసారి కన్నెర్ర జేశారు. బుధవారం ఉదయాన్నే ఆమె తాండూరుకు చేరుకొని స్థానిక రెవెన్యూ సిబ్బందితో రెండు బృందాలుగా విడిపోయి పట్టణంలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. పట్టణ శివారు ప్రాంతాల్లో నిల్వచేసిన దాదాపు 150 ట్రాక్టర్ల ఇసుక డంపింగ్లను సీజ్ చేశారు. సీజ్ చేసిన ఇసుకను ప్రభుత్వ పనులకు ఉపయోగించే విధంగా చర్యలు చేపడతామన్నారు. తాండూరులో రోజు రోజుకు ఇసుక మాఫియా రెచ్చిపోతోందని.. వారి ఆటలు సాగవని హెచ్చరించారు. ఇక్కడ నలుగురు వ్యక్తులు ఇసుక మాఫియా నడిపిస్తున్నారని.. త్వరలో వారిపై చర్యలు తీసుకొని.. వారి పేర్లను వెల్లడిస్తామని చెప్పారు. వివరాల్లోకి వెళితే.. ఉదయమే సబ్ కలెక్టర్ అలగు వర్షిణి తాండూరుకు బైక్‌పై వచ్చారు. పట్టణంలోని నేషనల్ గార్డెన్ వెనకాల అక్రమంగా నిల్వ చేసిన 120 ట్రాక్టర్ల ఇసుకను సీజ్ చేశారు. మల్లప్ప మడిగ వద్ద తనిఖీలు నిర్వహించారు. ఖాంజాపూర్ వాగు నుంచి మల్కాపూర్ గ్రామానికి వెళుతున్న ఓ ఇసుక ట్రాక్టర్‌ను పట్టుకున్నారు. పర్మిట్ చూపించడంతో వదిలే శారు. అక్కడి నుంచి కొడంగల్ రోడ్డులోని ప్రతిభ పాఠశాల సమీపంలో ఇసుక డంపింగ్ నిల్వ చేసిన ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం వెంకటేశ్వర రైస్‌మిల్ వెనక భాగంలో ఉన్న 20, గ్రీన్‌సిటీ సమీపంలో 10 ట్రాక్టర్లను గుర్తించి సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె వర్షిణి మట్లాడుతూ ఇసుక డంపింగ్ నిల్వలపై ప్రజలు తమకు సమాచారం అందించాలని కోరారు. ప్రభుత్వ పనులకు ఇసుక పర్మిషన్ ఉందని.. కానీ అక్రమంగా మాత్రం ఇసుకను తరలిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ యజమానులు ఎంపీడీఓకు పూర్తి సమాచారం ఇవ్వాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు వేబిల్లులు వాగు సమీపంలో ఉండి పంపిణీ చేయాలన్నారు. మూడు రోజుల క్రితం అర్ధరాత్రి పట్టుకున్న ట్రాక్టర్‌కు వాల్టా చట్టం ప్రకారం రూ.లక్ష జరిమానా విధించినట్లు సబ్ కలెక్టర్ తెలిపారు. ట్రాక్టర్ డ్రైవర్ల నుంచి స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్లలో డ్రైవర్లు ఎవరెవరితో మాట్లాడారనే విషయం బయటకు తీశామన్నారు. ముఖ్యంగా ఇసుక మాఫియాగా చెబుతున్న నలుగురి వ్యక్తుల పేర్లు బయటకు వస్తున్నాయన్నారు. త్వరలో వారి వివరాలు వెల్లడించి, చర్యలు తీసుకుంటామన్నారు. ఇసుక అక్రమంగా తరిలిస్తూ మొదటిసారి పట్టుకున్న నోటీసులు ఇస్తామని.. రెండో సారి పట్టుబడితే మాత్రం వాల్టా చట్టం ప్రకారం రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా విధిస్తామని ఆమె హెచ్చరించారు. త్వరలో జేసీ ఆమ్రపాలి పర్యటన.. తాండూరులో ఇసుక అక్రమ రవాణాపై జాయింట్ కలెక్టర్ ఆమ్రపాలి సీరియస్‌గా ఉందని.. రెండు రోజుల్లో ఆమె తాండూరులో పర్యటించనున్నారని తెలిపారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలను వేస్తామని చెప్పారు. ఒక్కో బృందంలో ఐదుగురు సభ్యులు ఉంటారని చెప్పారు. స్థానిక పోలీసులు ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునడంలో విఫలమయ్యారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. -
అర్ధరాత్రి సబ్ కలెక్టర్ హడలెత్తించారు
ఇసుక అక్రమార్కులపై కొరడా ఒక ట్రాక్టర్, రెండు బైకుల స్వాధీనం సాయిపూర్లో ఇసుక డంప్ సీజ్ రెవెన్యూ సిబ్బందిపై దాడి చేసి 2 ట్రాక్టర్లు తీసుకెళ్లిన ఇసుకాసురులు తాండూరు రూరల్: వికారాబాద్ సబ్ కలెక్టర్ వర్షిణి తాండూరులో శనివారం అర్ధరాత్రి తనిఖీలు చేయడంతో ఇసుక అక్రమార్కులు హడలెత్తిపోయారు. రాత్రి 1.30 నుంచి ఆదివారం తెల్లవారుజామున 4 గంటల వరకు తనిఖీలు నిర్వహించారు. బైక్‌పై వచ్చి ఇసుక అక్రమకారుల భరతం పట్టారు. ఇసుక తరలిస్తున్న ఓ ట్రాక్టర్‌తో పాటు అక్రమార్కులకు సంబంధించిన రెండు బైకులు, కొన్ని సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. స్థానికుల కథనం ప్రకారం.. శనివారం రాత్రి 1:30 నిమిషాలకు వికారాబాద్ సబ్ కలెక్టర్ వర్షిణి ఓ బైక్‌పై తాండూరు వచ్చారు. ఆమె వెంట ఇద్దరు వీఆర్ఓలు, ఓ ఆర్ఐ ఉన్నారు. ముందుగా బైక్‌పై వెళ్తూ పాత తాండూరులో తనిఖీలు చేశారు. అనంతరం యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్ చౌరస్తా వద్ద సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. లక్ష్మీనారాయణపూర్ చౌరస్తా వద్ద సబ్ కలెక్టర్ బైకును పక్కకు నిలిపి ఇసుక అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను గమనించించారు. అక్కడే ఇద్దరు కానిస్టేబుళ్లు ఉన్నా అక్రమార్కులు ఇసుక అలాగే తరలించారు. ఓ ఇసుక ట్రాక్టర్ తాండూరు వైపు వెళ్లింది. సబ్‌కలెక్టర్ వర్షిణి ఓ ఇసుక ట్రాక్టర్‌ను తన సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. అనంతరం అక్కడి నుంచి యాలాల మండలం బెన్నూర్ కాగ్నా నది సమీపంలోకి వెళ్లారు. కాగ్నా నది నుంచి వస్తున్న రెండు ట్రాక్టర్లను గమనించారు. రెవెన్యూ సిబ్బందిని ఆ ట్రాక్టర్లను అప్పగించారు. తాండూరు తహసీల్దార్ కార్యాలయానికి తీసుకె ళ్లాలని సూచించారు. అనంతరం ఆమె కాగ్నా నది సమీపంలో ఇసుక తరలిస్తున్న స్థలాలను పరిశీలించించారు. అయితే వాహనాలను తరలిస్తున్న రెవెన్యూ సిబ్బందిపై దాడి చేసిన అక్రమార్కులు తమ ట్రాక్టర్లను పట్టణానికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న సబ్‌కలెక్టర్ బైక్‌పై సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దాడికి గురైన రెవెన్యూ సిబ్బందితో మాట్లాడారు. దాడి చేసిన వారిని తాము గుర్తిస్తామని రెవెన్యూ సిబ్బంది చెప్పడంతో ఆమె వారిని తీసుకొని పట్టణానికి వ చ్చారు. అక్రమార్కులు సాయిపూర్ ప్రాంతంలో ఇసుక డంప్ చేయడంతో అక్కడికి వెళ్లి దానిని సీజ్ చేశారు. అప్పటికే ఇసుకాసులు పరారయ్యారు. ముందుగా పట్టుకున్న ట్రాక్టర్‌ను(ఏపీ 28 టీఆర్ 6647) సబ్ కలెక్టర్ తాండూరు తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. సబ్ కలెక్టర్ వర్షిణి తనిఖీలు చేస్తున్నారనే విషయం తెలుసుకున్న అక్రమార్కులు అప్రమత్తమయ్యారు. కాగ్నా నది నుంచి ఇసుక ట్రాక్టర్లను వేరే మార్గంలో తీసుకెళ్లారు. తెల్లవారుజామున 4 గంటల వరకు తాండూరు పరిసర ప్రాంతాల్లో సబ్‌కల్టెర్ తనిఖీలు నిర్వహించారు. అనంతరం తాము పట్టుకున్న ఇసుక ట్రాక్టర్, బైకుల విషయమై తాండూరు ఏఏస్పీ చందనదీప్తికి సబ్ కలెక్టర్ వర్షిణి ఫోన్లో సమాచారం ఇచ్చారు. స్థానిక రెవెన్యూ, పోలీసులపై అసహనం! శనివారం అర్ధరాత్రి తనిఖీలకు వచ్చిన సబ్‌కలెక్టర్ వర్షిణి స్థానిక రెవెన్యూ, పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. పెట్రోలింగ్ పోలీసులు ఇసుకతరలిస్తున్న అక్రమార్కులను పట్టుకోవడం లేదని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. తనిఖీల విషయమై సబ్ కలెక్టర్ స్థానిక తహసీల్దార్ గోవింద్‌రావుకు కూడా సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం. అక్రమార్కుల బెంబేలు.. సబ్ కలెక్టర్ వర్షిణి తనిఖీలకు వచ్చారనే స మాచారంతో ఇసుక వ్యాపారులు అప్రమత్తమయ్యారు. దీంతో వివిధ ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో ఇసుక కోసం ట్రాక్టర్లతో వచ్చిన వారు దారి మళ్లించి పరారయ్యారు. సబ్ కలెక్టర్ రావడంతోఅక్రమార్కులు బెంబేలెత్తారు. ఇదిలా ఉండగా, సబ్‌కలెక్టర్ కొందరు అక్రమార్కుల సెల్ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో వారు భయాందోళనకు గురవుతున్నారు. -
కొత్త జట్టు!
యంత్రాంగం కూర్పులో కేసీఆర్ మార్కు! ఏఐఎస్ విభజనతో అధికారుల బదిలీ అనివార్యం ఎస్పీ, సబ్‌కలెక్టర్ ఏపీ కేడర్‌కు.. వారిస్థానంలో కొత్త ముఖాలు బదిలీల జాబితాలో జేసీల పేర్లు కూడా.. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : పాలనా యంత్రాంగంలో ప్రక్షాళనకు తెరలేచింది. అఖిల భారత సర్వీసు(ఏఐఎస్) అధికారుల విభజన ప్రక్రియ కొలిక్కి రావడంతో జిల్లా సారథుల మార్పు అనివార్యం కానుంది. రంగారెడ్డి గ్రామీణ ఎస్పీ బి.రాజకుమారి, వికారాబాద్ సబ్‌కలెక్టర్ హరినారాయణ్ లను విభజన ప్రక్రియలో ఏపీ కేడర్‌కు కేటాయించడంతో వీరిరువురు బదిలీ తప్పనిసరిగా మారింది. రెండు నెలల క్రితం రాజకుమారిని బదిలీ చేస్తూ ఆమె స్థానే మెదక్ ఎస్పీ సుమతిని ఇన్చార్జిగా ఎస్పీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, సుమతి బాధ్యతలు స్వీకరించకపోవడంతో రాజకుమారే ఎస్పీగా కొనసాగుతున్నారు. తాజాగా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ తదితర అధికారుల విభజనకు ప్రధాని ఆమోదముద్ర వేయడం.. నేడో, రేపో డీఓపీటీ కూడా జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి పంపనున్న తరుణంలో రాజకుమారి ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేయాల్సివుంటుంది. సబ్‌కలెక్టర్ హరినారాయణ్ కూడా ఆ రాష్ట్రానికి వెళ్లాల్సివుంటుంది. ఏపీకి మారుతున్న వీరి స్థానంలో కొత్త ముఖాలు కొలువు దీరనున్నాయి. జాయింట్ కలెక్టర్లకు స్థానచలనం? మరోవైపు జిల్లా జాయింట్ కలెక్టర్లుగా వ్యవహరిస్తున్న ఎం.చంపాలాల్, ఎంవీరెడ్డిల పేర్లు బదిలీల జాబితాలో ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. ఏడాదిన్నర క్రితం జేసీలుగా ఒకే రోజు విధుల్లో చేరిన ఈ ఇద్దరూ కలెక్టర్ పోస్టుపై కన్నేశారు. పని ఒత్తిడితో సతమతమవుతున్న చంపాలాల్ జిల్లా నుంచి నిష్ర్కమించడమే మంచిదనే భావనకొచ్చినట్లు తెలుస్తోంది. నగర శివార్లలో భూముల ధరలు ఆకాశన్నంటిన నేపథ్యంలో ఈ పోస్టుకు భలే డిమాండ్ ఉంది. ఈ క్రమంలోనే పలువురు అధికారులు జేసీ-1గా వచ్చేందుకు పావులు కదుపుతున్నారు. విభజన ప్రక్రియ కొలిక్కిరావడంతో జేసీ-2 ఎంవీరెడ్డికి కూడా స్థానచలనం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పదవీ విరమణకు కొన్నేళ్లు మాత్రమే ఉన్నందున ఏదేనీ జిల్లాకు కలెక్టర్‌గా సేవలందించాలని ఆయన భావిస్తున్నారు. ఆప్రాధాన్య పోస్టులో ఏడాదిన్నరగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన పేరు త్వరలో వెలువడే బ దిలీల జాబితాలో ఉండవచ్చనే ప్రచారం జరుగుతోంది. కలెక్టర్ పోస్టుపై కన్ను! తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బదిలీపై కలెక్టర్‌గా జిల్లాకొచ్చిన ఎన్.శ్రీధర్ కు ఇప్పట్లో స్థానచలనం జరిగే అవకాశాలులేకపోవచ్చు. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ప్రభుత్వాన్ని గట్టెక్కించేందుకు కేసీఆర్ సర్కారు అప్పగించిన గురుతర బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తున్న శ్రీధర్‌ను మార్చడం వల్ల స్థలాల క్రమబద్ధీకరణ, భూముల అమ్మకంతో నిధులు సమకూర్చుకోవాలనే ప్రభుత్వ లక్ష్యం దెబ్బతినే ఆస్కారం ఉందనే వాదన వినిపిస్తోంది. భూముల సర్వే, పరిశ్రమల స్థాపనలోనూ ముఖ్యపాత్ర పోషిస్తున్న ఆయనను మార్చే అవకాశాలు స్వల్పంగానే ఉన్నాయి. కార్యదర్శి హోదాలో ఇప్పటికే నాలుగు జిల్లాల్లో కలెక్టర్‌గా సేవలందించిన శ్రీధర్ పేరు సింగరేణి కాలరీస్ సీఎండీ పోస్టుకు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇది కార్యరూపం దాల్చితే కృష్ణా జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు పేరును ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవచ్చనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కృష్ణా కలెక్టర్‌గా పనిచేస్తున్న ఆయన తెలంగాణ కేడర్‌కు మారనున్నారు. ఇదిలావుండగా, తెలంగాణలోనే ముఖ్య పోస్టుగా భావిస్తున్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్గిరిపై పలువురు అధికారులు ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే ప్రభుత్వ స్థాయిలో తమదైన శైలిలో పావులు కదుపుతున్నారు. ఏదీఏమైనా వారం, పది రోజుల్లో జిల్లా పాలనాయంత్రాంగంలో సమూల మార్పులు జరుగనున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్కు పాలనకు అనుగుణంగా అధికారులు కొలువుదీరనున్నారు. -
వికారాబాద్ సబ్‌కలెక్టర్‌గా హరినారాయణ్
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: వికారాబాద్ సబ్‌కలెక్టర్ కాట ఆమ్రపాలి బదిలీ అయ్యారు. రాష్ట్ర స్త్రీ, శిశుసంక్షేమశాఖ డెరైక్టర్‌గా ఆమెను బదిలీ చేస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె స్థానంలో హరినారాయణ్‌ను నియమించారు. 2011 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఈయన తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు. నిజామాబాద్ జిల్లా బోధన్ సబ్‌కలెక్టర్‌గా పనిచేసిన ఆయనకు ఇటీవల స్థానచలనం కలిగించినా పోస్టింగ్ ఇవ్వలేదు. దీంతో కొన్ని రోజులుగా పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న హరినారాయణ్‌ను వికారాబాద్ సబ్‌కలెక్టర్‌గా నియమిస్తూ తాజాగా ఉత్తర్వులిచ్చింది. దాదాపు రెండేళ్లు సబ్‌కలెక్టర్‌గా పనిచేసిన ఆమ్రపాలి సమర్థ అధికారిగా పేరుతెచ్చుకున్నారు. ముక్కుసూటితనంతో పాలనా వ్యవ హారాల్లో దూకుడు ప్రదర్శించారు. -
తొలి మజిలీ మేడారం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ‘మేడారంతో నాకు గొప్ప అనుబంధముంది. నా ఫస్ట్ పోస్టింగ్ అక్కడే. 2012 జాతర సమయంలో ములుగులో సబ్ కలెక్టర్‌గా ఉన్నాను. అందుకే నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను. వరుసగా రెండోసారి జాతరలో పాలుపంచుకోవటం ఆనందంగా ఉంది. ఏటూరునాగారం ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్‌గా డిసెంబర్ వరకు వరంగల్‌లోనే ఉన్నాను. మేడారం యాక్షన్ ప్లాన్ అప్పుడే సిద్ధమైంది. ఈసారి జాతర ఏర్పాట్లు, అవసరమైన ప్రతిపాదనలన్నీ నేను సిద్ధం చేశాను. గతంతో పోలిస్తే భక్తులు ఇబ్బంది పడకుండా మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు నావంతు ప్రయత్నం చేశాను. వరుసగా రెండుసార్లు జాతర నిర్వహణలో పాలుపంచుకోవటం ఆనందంగా ఉంది. బుధవారం ఉదయమే అక్కడికి వెళ్లాను. ఈ రోజు సాయంత్రమే తిరిగి వచ్చాను...’ అంటూ జాయింట్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ మేడారం గిరిజన మేళా విశేషాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆయన మాటల్లోనే... ‘ఇంత పెద్ద జాతర నేనెప్పుడూ చూడలేదు. దేశంలో కుంభమేళా తర్వాత ఇదే పెద్ద జాతర. అలహాబాద్ సిటీ కావటంతో కుంభమేళాకు వచ్చే భక్తులకు వసతి సదుపాయాలు కల్పించటం ఇబ్బందేమీ కాదు. కానీ.. అటవీ ప్రాంతంలో మారుమూలన ఉన్న మేడారంకు తరలివచ్చే భక్తులకు కనీస సదుపాయాలు కల్పించటం అధికారులందరికీ పెద్ద టాస్క్. వన దేవతలకు మొక్కులు చెల్లించేందుకు ఎడ్ల బండ్లు, బస్సులు, ఇతరత్రా వాహనాల్లో వివిధ ప్రాంతాల నుంచే వచ్చే భక్తులు తరలిరావటం గొప్ప అనుభూతి. వారందరికి ఇంట్లో ఉన్నట్లుగా సదుపాయాలు కల్పించకలేకపోయాని... కనీసం సాఫీగా దర్శనం చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తే ఎంతో మేలు చేసినట్లే. అదే కర్తవ్యంతో పని చేశాను. గత జాతరతో పోలిస్తే ఈసారి భక్తుల రద్దీలో పెద్ద తేడా కనిపించలేదు. గత జాతర అనుభవాలతో ప్రతిపాదనలు సిద్ధం చేయటంతో ఈసారి బడ్జెట్టు కూడా ఎక్కువగానే వచ్చింది. గత జాతరకు రూ.40 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈసారి రూ.100 కోట్లు విడుదల చేసింది. రెండు రోజుల పాటు అక్కడే ఉండి.. జాతర ఏర్పాట్లు దగ్గరుండీ పర్యవేక్షించే అవకాశం రావటం ఆనందంగా భావించాను..’ -
ఆటలు సాగవని..!
అసలే ఐఏఎస్.. ఆపై యువరక్తం.. తొలిపోస్టింగ్.. కొత్తగా బాధ్యతలు చేపట్టిన అధికారులు పాలనలో తమదైన ముద్రకోసం తపించడం సహజం. ఈ క్రమంలో రాజకీయ నాయకుల ఆటలు సాగడం అనుమానమే. ఇదే భయంతో పలువురు నేతలు జగిత్యాల డివిజన్‌కు సబ్‌కలెక్టర్ నియామకాన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుత ఆర్డీవోనే కొనసాగించాలని, లేనిపక్షంలో ఆయనను వేరే డివిజన్‌కు పంపించి.. మరో ఆర్డీవోను ఇక్కడ నియమించాలని కోరుతున్నారు. జగిత్యాల, న్యూస్‌లైన్ : కొత్తగా ఐఏఎస్ శిక్షణ పూర్తి చేసుకున్న బాలాజీరావును జగిత్యాల సబ్‌కలెక్టర్‌గా నియమిస్తూ నాలుగు రోజుల క్రితం ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. ఆయన ఇప్పటివరకు జగిత్యాలకు రాలేదు. దీంతో ఆర్డీవో హన్మంతరావు బదిలీ నిలుపుదలకు జోరుగా ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారాన్ని అందరూ నమ్ముతున్నారు. ఆర్డీవో బదిలీని రద్దు చేయించేందుకు ఆయన సన్నిహితులు కొందరు మంత్రి శ్రీధర్‌బాబు ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రి స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో అంతా ఫోన్ల ద్వారా నడిపిస్తున్నారని సమాచారం. ముఖ్యంగా ఆర్డీవో బదిలీని రద్దు చేయాలని అధికార పార్టీ నేతల నుంచే అధికంగా ఒత్తిళ్లు వస్తున్నట్లు తెలుస్తోంది. ఐఏఎస్ అధికారిని నియమిస్తే తమ మాటలు వింటాడో.. లేదోనని వారు మదనపడుతున్నారు. దీనికితోడు త్వరలోనే మున్సిపాలిటీ, మండల పరిషత్, జిల్లాపరిషత్ ఎన్నికలతోపాటు సంవత్సరంలో సాధారణ ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఐఏఎస్ అధికారి ఉంటే ఎన్నికల్లో తప్పుడు పనులు చేయలేమనే బెంగ రాజకీయ నాయకులకు పట్టుకుంది. దీంతో బాలాజీరావు రాకను అడ్డుకునేందుకు శథవిధాలా ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అది సాధ్యం కాకుంటే జిల్లాలోని మరో డివిజన్లో రెండేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న ఆర్డీవోను జగిత్యాలలో నియమించి.. ఇక్కడి ఆర్డీవోను ఖాళీ స్థానానికి పంపించాలని ప్రతిపాదిస్తున్నారు. మంథని ఆర్డీవోను జగిత్యాలకు, జగిత్యాల ఆర్డీవోను మంథనికి బదిలీ చేయాలని ఒక సామాజిక వర్గానికి చెందిన నేతలు సూచిస్తున్నారు. జగిత్యాల డివిజన్లో పీడీఎస్ సరుకుల అక్రమ రవాణాతోపాటు అవినీతిపైన ఐఏఎస్ వస్తే కొరడా ఝులిపిస్తాడనే భయంతో చీకటి వ్యాపారులు సైతం ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. జగిత్యాలకు ఐఏఎస్ అధికారి వచ్చినా ఫర్వాలేదు కానీ.. రెండేళ్లుగా జగిత్యాల డివిజన్లో పలు రకాల పనులు నిర్వహించి ఉత్తమ అవార్డులు అందుకున్న హన్మంతరావుకు పోస్టింగ్ ఇవ్వకపోవడం సబబు కాదని మరికొందరు వాదిస్తున్నారు. వీరు ఆయన బదిలీ రద్దుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. బాలాజీరావు రాక ఆలస్యమవుతుండడంతో ఆర్డీవోగా హన్మంతరావే కొనసాగుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జగిత్యాల సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇప్పటికే 23 మంది ఐఏఎస్‌లు పనిచేశారు. 10 మంది అసిస్టెంట్లు కలెక్టర్లుగా బాధ్యతలు నిర్వహించగా, 19 మంది మాత్రమే ఆర్డీవోలుగా పనిచేశారు. -
10లోగా పోలింగ్ బూత్‌లు తెలపాలి
కడపసిటీ, న్యూస్‌లైన్ :జిల్లాలో నిర్వహించే ఎన్నికల కోసం పోలింగ్ బూత్‌ల మార్పులు, చేర్పులు కొత్త బూత్‌ల వివరాలు తప్పులు లేకుండా 10వ తేది లోగా పంపాలని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ ఆదేశించారు. నగరంలోని జిల్లా పరిషత్ వైఎస్ఆర్ సమావేశ హాల్లో గురువారం సాయంత్రం పోలింగ్ బూత్‌ల ఏర్పాటు, మార్పులు, చేర్పులపై రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా నిర్వహించినందుకు అధికారులను అభినందించారు. పోలింగ్ బూత్‌ల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పక్కాగా పోలింగ్ బూత్‌లు మార్పులు, చేర్పులు, కొత్త బూత్‌ల ఏర్పాటు అందజేయాలన్నారు. 1200 మంది ఓటర్లు ఉంటే పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేయాలన్నారు. ఓటర్లకు బూత్‌లు అందుబాటులో ఉండాలని, తహశీల్దార్లు స్వయంగా పరిశీలించి ఏర్పాటు చేయాలన్నారు. బూత్‌లలో తాగునీరు, విద్యుత్ సౌకర్యం ఉండేలా చూడాలన్నారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల బూత్‌లను మార్చరాదన్నారు. మైనార్టీ, బీసీ కాలనీలలో 1200 మంది ఓటర్లుంటే బూత్ ఉండాలన్నారు. ఈనెల 12వ తేది పోలింగ్ బూత్ వివరాల ప్రకటన ఉంటుందని, పోలింగ్ బూత్‌ల ఏర్పాటుకై అభ్యంతరాలు వస్తే తహశీల్దార్లు వాటి వివరాలు తెలియజేయాల్సి ఉంటుందన్నారు. సబ్ కలెక్టర్, ఆర్డీఓలు పోలింగ్ బూత్‌ల మార్పులు, చేర్పులను పరిశీలించాలన్నారు. ఓటర్ల నమోదు అభ్యంతరాలు, మార్పులు, చేర్పుల దరఖాస్తులను రిజిష్టరులో నమోదు చేస్తూ కంప్యూటరులో నమోదు చేయాలన్నారు. ఆన్లైన్లో ఓటర్ల నమోదు సరిగా డౌన్లోడ్ కావడం లేదని జమ్మలమడుగు ఆర్డీఓ రఘునాథరెడ్డి కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా తక్షణం పరిష్కరించాలన్నారు. భూ సమస్యల వినతులు పరిష్కరించాలన్నారు. దొంగ పాసు పుస్తకాలు, స్టిక్కర్లు వస్తున్నాయని, తహశీల్దార్లు ప్రత్యేక దృష్టిసారించి అలాంటి వాటిని నివారించాలన్నారు. గ్రామంలోని సమస్యలను కలెక్టర్ దృష్టికి ఎస్ఎంఎస్ ద్వారా తెలపాలన్నారు. అదనపు జాయింట్ కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో అంగన్వాడి కేంద్రాలకు సొంత భవనాలు లేవని, ఐదు సెంట్ల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి నివేదికలు పంపాలన్నారు. ఇన్చార్జి డీఆర్ఓ ఈశ్వరయ్య మాట్లాడుతూ ప్రభుత్వ, పొరంబోకు భూములను గుర్తించి రక్షణ కల్పించేందుకు 9 బృందాలు నియమించామని, ఒక్కో బృందం నాలుగు నుంచి ఐదు మండలాల్లో పర్యటిస్తారన్నారు. ఈ సమావేశంలో రాజంపేట సబ్‌కలెక్టర్ ప్రీతిమీనా, కడప, జమ్మలమడుగు ఆర్డీఓలు వీరబ్రహ్మయ్య, రఘునాథరెడ్డి, ఏఓ గుణభూషణ్‌రెడ్డి తహశీల్దార్లు పాల్గొన్నారు.