లంచం డబ్బుతో సబ్‌కలెక్టర్‌ రాసలీలలు | ACB Officers Arrested Sub Collector From Veluru For Taking Bribe | Sakshi
Sakshi News home page

లంచం డబ్బుతో సబ్‌కలెక్టర్‌ రాసలీలలు

Published Tue, Mar 3 2020 8:27 AM | Last Updated on Tue, Mar 3 2020 8:34 AM

ACB Officers Arrested Sub Collector From Veluru For Taking Bribe - Sakshi

దినకరణ్, సబ్‌ కలెక్టర్‌

వేలూరు : వ్యవసాయ భూమి పత్రాలు మంజూరు చేసేందుకు రూ.50 వేలు లంచం తీసుకొని పట్టుబడిన వేలూరు ప్రత్యేక సబ్‌ కలెక్టర్‌ దినకరన్‌ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా లంచం తీసుకున్న డబ్బుతో సదరు సబ్‌కలెక్టర్‌ పలువురు మహిళలతో రాసలీలలు జరిపిన సంఘటనలు ప్రస్తుతం వెలుగుచూశాయి. తిరువణ్ణామలై జిల్లా పోలూరు తాలుకా ఇరుంబులి గ్రామానికి చెందిన రంజిత్‌కుమార్‌ గత ఆగస్టులో తన పూర్వీకుల భూమిని అతని పేరుపై మార్చుకున్నాడు. ప్రభుత్వం విలువకన్నా తక్కువగా రిజిష్టర్‌ పత్రాలు తీసినట్లు సబ్‌ రిజిస్ట్రార్‌కు తెలియడంతో వీటిపై వేలూరు కలెక్టరేట్‌లోని ప్రత్యేక సబ్‌ కలెక్టర్‌ దినకరన్‌ను కలవమని తెలిపాడు.

కాగా సబ్‌ కలెక్టర్‌ రూ.50 వేలు లంచంగా అడగడంతో రంజిత్‌కుమార్‌ వేలూరులోని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు పథకం ప్రకారం అతనిపై దాడి చేసి రెడ్‌ హ్యాండడ్‌గా పట్టుకున్నారు. అనంతరం అతని ఇంటిలోను, కార్యాలయంలోను మొత్తం రూ.80 లక్షల నగదు, పలు కీలక పత్రాలు, కంప్యూటర్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం ప్రత్యేక కోర్టులో హాజరు పరిచి వేలూరు సెంట్రల్‌ జైలుకు తరలించారు. విచారణలో దినకరన్‌ ప్రతిరోజూ ఎవరి వద్ద ఎంత నగదు రావాలి అనే జాబితాను తయారు చేసి కారు డ్రైవర్‌ రమేష్‌కుమార్‌ అందజేసి వసూళ్లకు పాల్పడేవాడని తెలిసింది. జల్లికట్టుకు అనుమతి ఇచ్చేందుకు ఉత్సవ కమిటీ సభ్యుల నుంచి కారు డ్రైవర్‌ ద్వారా వేల రూపాయలు తీసుకున్నట్లు తెలిసింది. ఈ డబ్బుతో పలువురి మహిళలతో రాసలీలలు జరిపినట్లు అధికారులు గుర్తించారు.

ఇటీవల రూ 2 వేల నోట్లు మారదని ప్రకటించడంతో లంచంగా రూ.500, 200 నోట్లు మాత్రమే తీసుకునే వాడని తెలిసింది. ముఖ్యంగా ఆయన కార్యాలయంలో పనిచేసే మహిళా అధికారి ఒకరికి అవసరమైనప్పుడల్లా నగదును ఇచ్చేవాడని, దీంతో కార్యాలయానికి ఎవరు వచ్చినా మహిళా అధికారినే మాట్లాడి సర్దుబాటు చేయడంతో పాటు వారి వద్ద ఆమె నగదును తీసుకునేదని ఏసీబీ అధికారులు గుర్తించారు. కార్యాలయానికి సొంత పనులపై వచ్చే మహిళలను ఆకర్షించే విధంగా మాట్లాడి అనంతరం వారితో చనువుగా ఉండేవాడని తెలిసింది. వీటితో పాటు వేలూరులో పనిచేస్తున్న కాలంలోనే రాణిపేటలో రూ. కోటి విలువ చేసే బంగ్లాను కొనుగోలు చేసినట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు గుర్తించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement