సాక్షి ప్రతినిధి, చెన్నై: మాజీ మంత్రి ఎస్‌పీ వేలుమణి ఆస్తులపై ఏసీబీ మరోసారి పంజా విసిరింది. ఆదాయానికి మించి రూ.58.23 కోట్లు కూడబెట్టిన ఆరోపణలపై వేలుమణికి చెందిన 58 చోట్ల అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం దాడులు చేపట్టారు. కేరళతోపాటూ తమిళనాడులోని ఆరు జిల్లాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. గత పదేళ్ల అన్నాడీఎంకే ప్రభుత్వంలో నగరాభివృద్ధిశాఖ మంత్రిగా పనిచేసిన వేలుమణి అధికారాన్ని అడ్డుపెట్టుకుని పలు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. డీఎంకే అధికారంలోకి వచ్చిన తరువాత గత ఏడాది ఆగష్టు 10వ తేదీన ఈయన ఆస్తులపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. సుమారు 60 చోట్ల జరిపిన తనిఖీల్లో రూ.2 కోట్ల విలువైన ఆస్తిపత్రాలు, రూ.13లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆ తరువాత గత ఏడాది సెప్టెంబరు 29వ తేదీ పుదుకోటై జిల్లాలోని అనుచరుని ఇళ్లు, కార్యాలయాల్లో దాడులు జరిపి కేసులు పెట్టారు.
మళ్లీ మెరుపు దాడులు..
కోయంబత్తూరు ఏసీబీ ఇన్‌స్పెక్టర్ ఎళిలరసి ఫిర్యాదుతో వేలుమణి, అతని బంధువులు, స్నేహితులకు చెందిన చెన్నై, కోయంబత్తూరు, సేలం, కృష్ణగిరి, తిరుపత్తూరు, నామక్కల్ జిల్లాల్లోని ఇళ్లు, కార్యాలయాలు, సంస్థలు, బినామీ ఇళ్లలో మంగళవారం ఉదయం దాడులు చేశారు. సుమారు 200 మంది ఏసీబీ అధికారులు ఏకకాలంలో మెరుపుదాడులకు దిగారు. వేలుమణి సొంతూరు కోయంబత్తూరు జిల్లాలోనే 41 చోట్ల తనిఖీలు సాగాయి. అలాగే చెన్నైలో 8, సేలం 4, నామక్కల్, కృష్ణగిరి, తిరుపత్తూరు, తిరుప్పూరు జిల్లాల్లో ఒక్కోచోట దాడులు జరిపారు. కేరళ రాష్ట్రంలోని వేలుమణి బంధువు ఇంటిలో కూడా తనిఖీలు చేశారు. అదనపు డీఎస్పీ అనిత భర్తతో మాజీ మంత్రికి వ్యాపార లావాదేవీలు ఉండడంతో కోయంబత్తూరులోని వారి ఇంట్లో సైతం తనిఖీలు నిర్వహించారు. ఏసీబీ దాడులు జరుగుతున్న సమయంలో వేలుమణి కోయంబత్తూరులోని సుగుణాపురంలో తన ఇంటిలో ఉన్నారు. ఈ దాడుల్లో రూ.58.23 కోట్ల ఆస్తులను గుర్తించి వేలుమణి సహా 10 మందిపై కేసులు పెట్టారు. 2016–21 మధ్యకాలంలో రూ.1.25 కోట్లు ఖర్చుచేసి మంత్రి హోదాలో పలు దేశాలకు వెళ్లివచ్చారు. దీంతో విదేశాల్లో సైతం విలువైన ఆస్తులను కొనుగోలు చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
రాజకీయ కక్షపూరిత చర్య– అన్నాడీఎంకే
రాజకీయంగా కక్ష సాధించేందుకే ప్రభుత్వం ఏసీబీ చేత దాడులు చేయిస్తోందని అన్నాడీఎంకే కన్వీనర్ ఓ పన్నీర్‌సెల్వం, కో కన్వీనర్ ఎడపాడి పళనిస్వామి ఒక ప్రకటనలో ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో డీఎంకే దురాగతాలను వేలుమణి ధైర్యంగా అడ్డుకున్నందన ప్రభుత్వం ఆయనపై కక్ష బూనిందని విమర్శించారు. ఇలాంటి చర్యలకు భయపడమన్నారు.
ఏసీబీ మెరుపు దాడులు.. మాజీ మంత్రి ఇంట భారీగా నగదు సీజ్
Published Wed, Mar 16 2022 6:42 AM | Last Updated on Wed, Mar 16 2022 6:42 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment