bribe demand
-
విశాఖ ఆర్టీవో ఆఫీస్ లో దసరా, దీపావళి దందా
-
రూ.10 లక్షల డిమాండ్.. ఏసీబీ వలలో శామీర్‌పేట తహసీల్దార్
సాక్షి, మేడ్చల్: మేడ్చల్ మల్కాజీగిరి జిల్లా శామీర్‌పేట తహసీల్దార్ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) వలకు చిక్కారు. రూ.10 లక్షలు లంచం తీసుకుంటూ మంగళవారం తహసీల్దార్ సత్యనారాయణ ఏబీసీ అధికారులకు పట్టుబడ్డారు. ఓ వ్యక్తికి సంబంధిచిన భూమికి పట్టాదారు పాసుబుక్ జారీ చేసేందుకు సదరు తహసీల్దార్ రూ.10 లక్ష లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా.. పక్కా ప్రణాళికతో సత్యనారాయణ డ్రైవర్ డబ్బులు తీసుకునే క్రమంలో రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులు అతన్ని పట్టుకున్నారు. అయితే తహసీల్దార్ సత్యనారాయణ తీసుకోమని చెబితేనే తాను లంచం డబ్బు తీసుకున్నానని డ్రైవర్ తెలిపారు. దీంతో ఏసీబీ అధికారులు.. తహసీల్దార్ సత్యనారాయణను అదుపులోకి తీసుకున్నారు. -
మద్యం మత్తుకు.. ‘మామూళ్ల’ కిక్కు!
సాక్షి, హైదరాబాద్: వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో ఆరు వైన్‌షాప్‌లు ఉన్నాయి. అవన్నీ సిండికేట్‌గా దందా చేస్తున్నాయని.. మండలంలోని ఓ గోదాంలో సరుకు నిల్వచేసి మరీ సిండికేట్ నిర్వాహకులు బెల్ట్‌షాపులకు మందు పంపిస్తుంటారని ఎక్సైజ్ వర్గాలకూ తెలుసు. ఎమ్మార్పీ కన్నా ఎక్కువ ధరకు అమ్మడం ద్వారా బెల్టుషాపులతో నెలకు లక్షల రూపాయలు దోచుకుంటున్నారు. అయితే సిండికేట్ నుంచి కొందరు ఎక్సైజ్ సిబ్బందికి నెలకు రూ.1.20 లక్షలు, సివిల్ పోలీసు అధికారులు, సిబ్బందికి మరో రూ.1.20 లక్షలు ముడుపులు అందుతుండటంతో ఈ వ్యవహారమంతా చూసీచూడనట్టు వదిలేస్తున్నట్టు ప్రచారముంది. .. ఇది కేవలం పర్వతగిరి మండలానికి చెందిన విషయం కాదు. దాదాపు రాష్ట్రమంతటా ఇదే తరహాలో దందా కొనసాగుతోందని.. అటు ఎక్సైజ్ పోలీసులు, ఇటు సివిల్ పోలీసులు వైన్‌షాపులు, బార్ల యజమానుల నుంచి నెలవారీ మామూళ్లను ముక్కు పిండి వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇది ఎప్పటి నుంచో కొనసాగుతున్నా ఈ మధ్య ‘వసూళ్ల’ డిమాండ్ పెరిగిందని.. లేకుంటే ఏదో ఒక పేరిట ఇబ్బందిపెడుతున్నారని అంటున్నారు. ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలనలో ఇలాంటి అంశాలు మరిన్ని వెలుగుచూశాయి. అమ్మకాలను బట్టి మామూళ్ల లెక్క.. రాష్ట్రంలోని వైన్‌షాపులు, బార్ అండ్ రెస్టారెంట్ల నుంచి వసూళ్లు గత రెండేళ్ల కాలంలో రెండింతల వరకు పెరిగినట్టు అంచనా. ముఖ్యంగా సివిల్ పోలీసుల దందా ఎక్కువైందని వైన్‌షాప్‌ల నిర్వాహకులు అంటున్నారు. దీనికితోడు అప్పుడప్పుడూ మద్యం బాటిళ్లు కూడా ఫ్రీగా తీసుకెళ్తుంటారని చెప్తున్నారు. ఇక ఎక్సైజ్ సిబ్బందికి అయితే లైసెన్సు తీసుకున్నప్పుడు, రెన్యువల్ సమయంలో, ఫైనల్ క్లియరెన్స్ సందర్భంగా వారికి లక్షల్లోనే ముట్టజెప్పాల్సి వస్తుందని అంటున్నారు. ఈ మామూళ్లలో స్టేషన్ నుంచి డీఎస్పీ కార్యాలయం వరకు, నగరాల్లో అయితే ఏసీపీ స్థాయి అధికారుల వరకు వాటాలు చేరుతుంటాయనే ఆరోపణలు ఉన్నాయి. మొత్తంగా వైన్స్, బార్ల నిర్వాహకుల అక్రమ దందాలు ఓవైపు.. ఎక్సైజ్, సివిల్ పోలీసుల మామూళ్లు మరోవైపు కలిసి మందుబాబుల జేబుకు మాత్రం చిల్లు పడుతోందన్న విమర్శలు ఉన్నాయి. ఊరి నుంచి రాజధాని దాకా ఇంతే.. హైదరాబాద్ నగర శివార్లలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో మొత్తం 44 వైన్‌షాపులు, 38 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. వాటినుంచి ఎక్సైజ్ సిబ్బందికి నెలకు రూ.10.40 లక్షలు, సివిల్ పోలీసులకు రూ.5.20 లక్షలు మామూళ్ల రూపంలో వెళుతున్నట్టు ప్రచారముంది. కొన్ని నెలల కింద మామూళ్లను 50శాతం పెంచారని అంటున్నారు. మామూళ్లు ముట్టకపోతే వైన్‌షాపుల ముందు కానిస్టేబుల్ ప్రత్యక్షమవుతారని.. పార్కింగ్ నుంచి జనాలు గుమికూడే వరకు అన్ని విషయాల్లో ఇబ్బంది పెడుతుంటారని వైన్‌షాపుల నిర్వాహకులు చెప్తున్నారు. జనగామ జిల్లాలో వైన్‌షాపుల నిర్వాహకులు ఎక్సైజ్ పోలీసులకు నెలకు రూ.15వేల–30 వేలవరకు, సివిల్ పోలీసులకు రూ.20–35వేల వరకు ఇస్తున్నట్టు సమాచారం. గ్రేటర్ వరంగల్‌లో గతంలో ఎక్సైజ్ సిబ్బంది నెలకు రూ.15వేలు వసూలు చేసేవారని, ఇప్పుడు రూ.20వేలు తీసుకుంటున్నారని.. సివిల్ పోలీసులు కూడా రూ.10 వేల నుంచి రూ.15వేలకు పెంచారని వైన్స్‌షాపుల నిర్వాహకులు అంటున్నారు. పోలీసులకు మామూలు ముట్టకపోతే.. వైన్‌షాపు ఎదురుగా ట్రాఫిక్ ఉల్లంఘనలు జరుగుతున్నాయని, న్యూసెన్స్ జరుగుతోందని కేసులు పెడుతున్నారని చెప్తున్నారు. కొన్నిచోట్ల సివిల్ పోలీసులే తనిఖీలు కూడా చేస్తున్నారని పేర్కొంటున్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో పోలీసులకు గతంలో నెలకు రూ.25 వేలు ఇచ్చేవారమని, ఇప్పుడు రూ.50 వేలు వసూలు చేస్తున్నారని వైన్స్‌షాపుల వర్గాలు చెప్తున్నాయి. లేకుంటే డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు, బెల్ట్‌షాపులపై దాడులు చేస్తుంటారని అంటున్నాయి. తమ వ్యాపారం ఎక్కడ దెబ్బతింటుందోనని ప్రతినెలా ఠంచన్‌గా ముట్టజెప్పాల్సి వస్తోందని చెప్తున్నాయి. హైదరాబాద్ నడిరోడ్డు హిమాయత్‌నగర్, నారాయణగూడ ప్రాంతాల్లో సివిల్ పోలీసుల దందా ఎక్కువైందని వైన్‌షాపుల యజమానులు చెప్తున్నారు. కేవలం ఎక్సైజ్ వాళ్లకు మాత్రమే ఇస్తే సరిపోదని, తమకూ ఇవ్వకపోతే కేసులు పెడతామని బెదిరిస్తున్నారని అంటున్నారు. నారాయణగూడలో వైన్‌షాపుల నుంచి పోలీసులకు నెలకు రూ.25 వేల చొప్పున అందుతుంటాయని.. అందుకే సిబ్బంది ఆ షాపులు సమయం దాటి తెరిచి ఉన్నా, రోడ్డుపై ఇబ్బంది అవుతున్నా పట్టించుకోరని స్థానికులు ఆరోపిస్తున్నారు. మేడ్చల్ డివిజన్ పరిధిలో సివిల్ పోలీసులు తరచూ దావత్ల పేరుతో పెద్ద సంఖ్యలో మద్యం బాటిళ్లు తీసుకెళ్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడి బార్ల నుంచి నెలకు రూ.15 వేల దాకా వసూలు చేస్తున్నారని వైన్స్ నిర్వాహకులు చెప్తున్నారు. రాత్రి సమయం ముగిశాక మద్యం అమ్మితే.. అందినంత దోచుకుని ఏమీ జరగనట్టు వెళ్లిపోతుంటారని స్థానికులు అంటున్నారు. ఖమ్మం జిల్లాలో గోదావరి జిల్లాలకు ఆనుకుని ఉండే ప్రాంతాల్లోని వైన్స్ నుంచి పోలీసులకు నెలకు రూ.50వేల చొప్పున అందుతాయని.. పైగా అడిగినన్ని మద్యం బాటిళ్లూ ఇవ్వాల్సిందేనని నిర్వాహకులు చెప్తున్నారు. అలా ఇవ్వకుంటే వైన్‌షాపుల్లో మద్యం అన్లోడ్ కూడా కానివ్వరని అంటున్నారు. ఇక ఎక్సైజ్ మామూళ్లు సాధారణమేనని.. లేకుంటే పర్మిట్ రూం, ఇతర అంశాల్లో తీవ్రంగా ఇబ్బందిపెడతారని ఆరోపిస్తున్నారు. కరీంనగర్ జిల్లా గోదావరిఖని ప్రాంతంలో కొందరు పోలీసుల మామూళ్ల దందా మరీ ఎక్కువన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ సమయానికి డబ్బులు అందకుంటే అలుగుతారని.. కొన్నిరోజులు ఇబ్బందిపెడతారని వైన్ షాపుల నిర్వాహకులు చెప్తున్నారు. స్టేషన్‌కు తీసుకెళ్లి ఇబ్బంది పెడుతున్నారు నెలవారీగా సివిల్ పోలీసులకు మామూళ్లు ఇవ్వకపోతే షాప్ వద్దకు వచ్చి ఇబ్బందిపెడతారు. షాప్‌లో పనిచేసే వారిని స్టేషన్‌కు తీసుకెళుతుంటారు. లేదంటే షాప్ దగ్గర డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు పెట్టి భయాందోళనకు గురిచేస్తున్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని ఓ వైన్‌షాప్ నిర్వాహకుడు మద్యం కూడా ఫ్రీగా తీసుకెళ్తారు ప్రభుత్వ జీతాలైనా ఆలస్యంగా అందుతాయేమోగానీ పోలీసులకు ఇచ్చే మామూళ్లకు మాత్రం ఆలస్యం జరగకూడదు. డబ్బులేకాదు వారు అడిగినప్పుడల్లా మద్యం బాటిళ్లు ఫ్రీగా ఇవ్వాలి. లేదంటే వేధింపులు మొదలవుతాయి. మాకు మిగిలే దాంట్లో ఎంతోకొంత ఇచ్చి ప్రశాంతంగా వ్యాపారం చేసుకుంటున్నాం. డబ్బులిస్తే మా జోలికి వచ్చే వారే ఉండరు. – వైన్‌షాప్ యజమాని, నారాయణగూడ, హైదరాబాద్ -
‘మామూలు’ ఇస్తే.. ఆ ఒక్కటీ సరైపోతుందని హింట్
సాక్షి, ఆదిలాబాద్: ఓ సినిమాలో ఓ పోలీస్ ఆఫీసర్.. ఎర్ర చందనం అక్రమ రవాణాకు భారీగా లంచం తీసుకుంటాడు. డబ్బంతా లెక్కబెట్టిన తర్వాత ఒక్కటి తగ్గింది అంటాడు.. అన్నీ సరిగానే ఉన్నాయి కదా అని చెప్పినా.. ఒక్కటి తగ్గింది అంటూ టార్చర్ పెడతాడు.. అచ్చం ఇలాగే ఉంది ఆదిలాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అధికారుల తీరు. భూమి రిజిస్ట్రేషన్ కోసం అన్ని పత్రాలు సక్రమంగా తీసుకుని వెళ్లినా.. ఒక్కటి తగ్గింది అంటూ కొర్రీలు పెడుతున్నారు. డాక్యుమెంట్‌పైనే కోడ్ రాసి డాక్యుమెంట్ రైటర్ ద్వారా ఏం తగ్గిందో హింట్ ఇస్తారు. ఆమేరకు ముట్టజెబితే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సాఫీగా అయిపోతుంది. లేదంటే అంతే.. ఆంగ్ల అక్షరమే కోడ్.. ఆంగ్ల అక్షర రూంలో ‘ఏ’ అంటే రూ.వెయ్యి, ‘బీ’ అంటే రూ.2 వేలు, ‘సీ’ అంటే రూ.3 వేలు, ‘డీ’ అంటే రూ.4 వేలు, ‘ఇ’ అంటే రూ.5 వేలు.. ఏ పక్కన ఒక జీరో పెడితే అది రూ.10 వేలు, బీ పక్కన జీరో పెడితే రూ.20 వేలు, సీ పక్కన జీరో పెడితే రూ.30 వేలు.. ఇలా ఆదిలాబాద్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో కోడ్ భాషలో లంచం వసూలు చేసుకుంటూ డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. డబ్బులు గుంజేందుకు ఎత్తులు గతంలో పేదలు సాగు చేసుకునేందుకు ఇచ్చిన అసైన్డ్ భూములు వెంచర్లుగా మారి ప్లాట్లుగా విక్రయాలు జరిపే క్రమంలో వీటికి సంబంధించి ప్రభుత్వం నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) జారీ చేశారు. అవి అప్పుడు హోదాలో ఉన్న వివిధ రెవెన్యూ అధికారుల ద్వారా జారీ అయ్యాయి. వీటికి సంబంధించి పలుమార్లు ప్లాట్లు చేతులు మారి రిజిస్ట్రేషన్ కూడా జరిగాయి. ఇప్పుడు ఎవరైనా ఎన్ఓసీ ఉన్న ప్లాట్‌కు సంబంధించి రిజిస్ట్రేషన్‌కు వచ్చినప్పుడు ఆ డాక్యుమెంట్‌పై రిజిస్ట్రేషన్ అధికారులు డబ్బులు గుంజేందుకు ఎత్తులు వేస్తున్నారు. ఈ ఎన్ఓసీ విషయంలో జిల్లా అధికారుల నుంచి అభ్యంతరాలు ఉన్నాయని, వాళ్ల నుంచి మాకు మళ్లీ క్లియరెన్స్ రాలేదని, జాబితా పంపలేదని.. ఇలా రకరకాలుగా చెప్పడం ద్వారా రిజిస్ట్రేషన్‌కు వచ్చిన పార్టీని డైలమాలో పడేస్తారు. ఒకవేళ తాము డాక్యుమెంట్‌పై రాత ద్వారా సూచించిన విధంగా డబ్బులిస్తే రిజిస్ట్రేషన్ అయిపోతుందని చెబుతారు. ఇలా వ్యవసాయ భూములను వెంచర్లుగా మార్చేందుకు ఉద్దేశించిన నాలా కన్జర్వేషన్, ఇండ్ల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి మున్సిపల్ సంబంధిత పత్రాలు, ఇలా అనేక రకాలుగా డాక్యుమెంట్‌కు ఏదో ఒక అభ్యంతరం చూయించి పార్టీ నుంచి డబ్బులు వసూలు చేయడం ద్వారా ఆదిలాబాద్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో అధికారుల తీరు హద్దు మీరిపోయిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీరికంటే జలగలే నయమన్న పరిస్థితి పలువురిలో వ్యక్తమవుతోంది. వసూళ్లకు దళారులు సాధారణంగా ఎస్ఆర్ఓ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్లకు ప్రవేశం లేదు. అయితే పార్టీలు డాక్యుమెంట్ రైటర్లను మొదట దస్తావేజు రూపొందించేందుకు ఆశ్రయిస్తారు. అదే సమయంలో ఈ డాక్యుమెంట్ రైటర్ దాన్ని రూపొందించిన తర్వాత సబ్‌రిజిస్ట్రార్ దగ్గరికి పంపించినప్పుడు పరిశీలన చేసిన తర్వాత దాంట్లో ఏదో ఒక లోపం చూపిస్తూ ఆంగ్ల అక్షరం రాసి పంపిస్తారు. కోడ్ పద్ధతిలో డాక్యుమెంట్‌పై రావాల్సిన లంచం రూపం చెప్పిన తర్వాత దానికి పార్టీ ‘సై’ అంటే సబ్‌రిజిస్ట్రార్‌కు సంబంధించిన ఇద్దరు ముగ్గురు వ్యక్తులు రంగంలోకి దిగుతారు. ఆ ఆంగ్ల అక్షరం మేరకు లంచం డబ్బులు వసూలు చేస్తారు. ఆ తర్వాతే ఆ డాక్యుమెంట్ మళ్లీ సబ్‌రిజిస్ట్రార్ టేబుల్‌పైకి వెళ్తుంది. ఇదంతా రోజూ మామూలుగా జరిగే తతంగమే. ఏసీబీకి పట్టుబడినా తీరు మారలే.. ఆదిలాబాద్‌లో ప్రస్తుతం ఇన్చార్జి సబ్‌రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తున్న ఓ అధికారి గతంలో ఇలాగే లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. దీనికి సంబంధించి ఈ మధ్యకాలంలో శాఖ పరంగా సర్వీస్ రిమూవల్ జరిగిందనే ప్రచారం సాగింది. అయితే రిజిస్ట్రేషన్ శాఖలో ఉన్నతాధికారులను మచ్చిక చేసుకుని దీనినుంచి బయటపడ్డాడని శాఖలో చెప్పుకుంటున్నారు. అయినప్పటికీ ఆ అధికారి తీరు మారలేదు. ప్రస్తుతం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ కోడ్ పద్ధతిని అమలులోకి తీసుకొచ్చి యథేచ్ఛగా వసూలు చేస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. ప్రతీరోజు ఈ అధికారి లక్షల రూపాయలు లంచం రూపంలో వసూలు చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు. చేతులెత్తేసిన రిజిస్ట్రార్ ఆదిలాబాద్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో విచ్చలవిడిగా సాగుతున్న అక్రమాలపై కొంతమంది డాక్యుమెంట్ రైటర్లు ఇటీవల జిల్లా రిజిస్ట్రార్ ఫణీంద్రను కలిసి ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే జిల్లా రిజిస్ట్రార్ మా టలు వారిని విస్తుపోయేలా చేశాయి. ప్రధానంగా ఆదిలాబాద్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో రెగ్యులర్ సబ్రిజిస్ట్రార్లు పనిచేసేందుకు ముందుకు రావడం లేదని, పనిచేసేవారిని ఇక్కడ ఉన్నవారు పనిచేయనివ్వడం లేదని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం చేస్తున్న వారితోనే వ్యవస్థను నడిపియ్యాల్సి వస్తుందని చెప్పారు. దీంతో అక్కడ వ్యవస్థ పరమైన లోపమా? లేనిపక్షంలో జిల్లా రిజి స్ట్రారే ఇలాంటి అక్రమాలకు పాల్పడే అధికారులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాడా? అన్న అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ‘సాక్షి’ జిల్లా రిజిస్ట్రార్ ఫణీంద్రను వివరణ కోరేందుకు గురువారం సాయంత్రం ఫోన్ చేయగా ఆయన అందుబాటులోకి రాలేదు. -
కరోనా పాజిటివ్.. అయినా బుద్ధి మారలేదు.. చివరకు!
సాక్షి, కరీంనగర్: జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో నీరటి రమేశ్ థియేటర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. గతంలో 22 నెలలు మెడికల్ లీవ్ పెట్టాడు. తిరిగి విధుల్లో చేరిన రమేశ్ మెడికల్ లీవులకు సంబంధించిన బిల్లు తీసుకునేందుకు సంబంధిత అధికారుల వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో ఆసుపత్రిలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సీహెచ్.సురేందర్ వద్దకు ఫైలు వెళ్లింది. ఫైలును పరిశీలించిన సురేందర్ అందులో చాలా లోపాలున్నాయని, వాటిని మార్చాల్సి ఉందని చెప్పాడు. ఫైలును పట్టించుకోకుండా పలుమార్లు రమేశ్‌ను అతడి చుట్టూ తిప్పుకున్నాడు. తర్వాత కొన్ని రోజులకు సురేందర్ వద్దకు వెళ్లిన రమేశ్ పని తొందరగా చేసి పెట్టాలని బతిమిలాడాడు. మొదట రూ.15 వేలు ఇస్తే చేసిపెడతానని రమేశ్‌కు చెప్పగా, అప్పటికే సురేందర్ వద్దకు చాలాసార్లు తిరిగి విసిగిపోయిన అతను ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. తర్వాత సురేందర్ వద్దకు వెళ్లి అంత ఇచ్చుకోలేనని రూ.12 వేలు ఇస్తానని తెలిపాడు. మంగళవారం రూ.12 వేలు సురేందర్‌కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. చదవండి: అవన్నీటితో సంబంధం లేదు.. చల్లాన్లు విధించడంలో బీజీ బీజీ... అయితే.. సురేందర్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఏసీబీ అధికారులు, మీడియా ప్రతినిధులు దూరంగా వెళ్లారు. కాగా, అతడి వద్ద నుంచి రికార్డులు స్వాధీనం చేసుకొని పరిశీలించిన అనంతరం ఇంట్లో సోదాలు జరిపామని, సురేందర్‌ను ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ భద్రయ్య తెలిపారు. లంచం ఇవ్వాలని ఎవరైనా ఉద్యోగి డిమాండ్ చేస్తే ఏసీబీ అధికారులను ఆశ్రయించాలని కోరారు. -
ఏసీబీకి చిక్కిన రాజేంద్ర నగర్ సబ్ రిజిస్ట్రార్
సాక్షి, హైదరాబాద్: రూ.5 లక్షలు లంచం తీసుకుంటూ రాజేంద్రనగర్ సబ్ రిజిస్ట్రార్ హర్షద్ అలీ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. గురువారం రాత్రి డాక్యుమెంట్ రైటర్ నుంచి నగదు తీసుకుంటుండగా దాడి చేసిన ఏసీబీ అధికారులు ఇద్దర్నీ పట్టుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. లంగర్‌హౌస్‌కు చెందిన ఒక మహిళ గంధంగూడ ప్రాంతంలోని 300 గజాల స్థలంలో డెవలప్మెంట్కు బిల్డర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే బిల్డర్ డెవలప్మెంట్ చేయకపోవడంతో సంబంధిత డాక్యుమెంట్ రద్దు కోసం తన సోదరుడి కుమారుడైన అరవింద్ మహేష్‌కుమార్‌ను సంప్రదించారు. అరవింద్ రాజేంద్రనగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం డాక్యుమెంట్ రైటర్ వాసును సంప్రదించాడు. వాసు ఈ విషయాన్ని సబ్ రిజిస్ట్రార్ హర్షద్ అలీకి తెలిపాడు. ఈ పని చేసేందుకు ఆయన మొదట రూ.8 లక్షలు డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన సంభాషణలను అరవింద్ వీడియో రికార్డు చేశాడు. చివరకు రూ.5 లక్షలు సబ్ రిజిస్ట్రార్, రూ.50 వేలు డాక్యుమెంట్ రైటర్ తీసుకునేందుకు ఒప్పుకున్నారు. అనంతరం అరవింద్ ఏసీబీ అధికారులకు సమాచారం అందించాడు. సెల్ఫోన్లో కీలక సమాచారం... ముందస్తు పథకం ప్రకారం గురువారం డబ్బులు ఇస్తానని చెప్పిన అరవింద్.. సాయంత్రం 5 గంటలకు ఏసీబీ అధికారులతో పాటు రాజేంద్రనగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చాడు. డాక్యుమెంట్ రైటర్ వాసు డబ్బు తీసుకున్నాడు. అయితే సబ్ రిజిస్ట్రార్ డబ్బు తీసుకునేందుకు దాదాపు రెండు గంటల సమయం పట్టింది. ఆయన నేరుగా డబ్బు తీసు కుంటే పట్టుకునేందుకు వీలుగా ఏసీబీ అధికారులు రెండు గంటల పాటు వేచి చూశారు. చివరకు డాక్యుమెంట్ రైటర్ వాసు వద్ద డబ్బులు తీసుకుంటుండగా దాడి చేసి ఇద్దర్నీ పట్టుకున్నారు. హర్షద్ అలీ కార్యాలయంలో మరో ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులను ఏర్పాటు చేసుకుని డబ్బులు వసూలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఆయన పట్టుబడగానే ప్రైవేట్ వ్యక్తులు ఇద్దరూ సబ్ రిజిస్ట్రార్ సెల్‌ఫోన్‌తో మాయమయ్యారు. ఏసీబీ అధికారులు సెల్‌ఫోన్‌కు సంబంధించి వివరాలు అడగడంతో ఇంటి వద్ద ఉందని ఒకసారి, అసలు లేదని మరొకసారి చెబుతూ హర్షద్ అలీ అధికారులను ముప్పుతిప్పలు పెట్టారు. చివరకు సెల్‌ఫోన్‌ను అప్పగించారు. అందులో పలు లావాదేవీలకు సంబంధించిన వివరాలు ఉన్నట్లు సమాచారం. రాజేంద్రనగర్ సబ్ రిజిస్ట్రార్‌గా హర్షద్ అలీ గత సంవత్సర కాలంగా విధులు నిర్వహిస్తున్నారు. ఐదేళ్ల క్రితం నార్సింగి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అటవీ శాఖ భూములు రిజిస్ట్రేషన్ చేసిన కేసులో సస్పెన్షన్‌కు గురయ్యారు. అయినా ఆయన తీరు మారలేదని, పలు వివాదాస్పద రిజిస్ట్రేషన్లు చేశారని తెలుస్తోంది. -
లంచం డిమాండ్; 75 రోజుల తర్వాత అంత్యక్రియలు
లక్నో: కరోనాతో మరణించిన ఒక వ్యక్తి మృతదేహానికి రెండున్నర నెలల తర్వాత అంత్యక్రియలు నిర్వహించారు. అయితే తన భర్త మృతదేహాన్ని అప్పగించేందుకు వైద్యులు రూ.15,000 లంచం డిమాండ్ చేశారని భార్య ఆరోపించింది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. వివరాలు.. 28 ఏళ్ల నరేశ్‌కు ఏప్రిల్ 10న కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆయనకు తొలుత హాపూర్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. అనంతరం నరేశ్‌ను మీరట్‌లోని లాలా లాజ్‌పత్ రాయ్ మెమోరియల్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఏప్రిల్ 15న చనిపోయాడు.అయితే ఆయన భార్య గుడియాకు మృతదేహాన్ని అప్పగించేందుకు వైద్యులు రూ.15,000 డిమాండ్ చేసినట్లు తేలింది. డబ్బులు ఇవ్వని పక్షంలో మృతదేహానికి తామే అంత్యక్రియలు నిర్వహిస్తామని వారు చెప్పారు. దీంతో డబ్బులు లేక గుడియా తిరిగి ఊరికి వెళ్లిపోయింది. ఆ తర్వాత బంధువులు సాయంతో విషయాన్ని పోలీసులకు వివరించింది. పోలీసులు ఇటీవల మృతుడి భార్య గుడియాతో ఫోన్లో మాట్లాడి ఆమెను హాపూర్‌కు రప్పించినట్లు తెలిపారు. అనంతరం హాపూర్ మున్సిపల్ సిబ్బంది ఈ నెల 2న భార్య సమక్షంలో నరేశ్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారని వెల్లడించారు. కాగా గుడియా ఆరోపణల్లో నిజానిజాలు ఎంత అనేది తెలుసుకోవడానికి మీర్ట్ జిల్లా కలెక్టర్ బాలాజీ దర్యాప్తుకు ఆదేశించారు. -
ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిన హెచ్ఎం
సాక్షి, పశ్చిమ గోదావరి : రెవెన్యూ, ఇతర శాఖల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిన సంఘటనలు చాలానే చూశాం. కానీ విద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలంలోని జెడ్‌ఎన్‌వీఆర్ హైస్కూల్లో గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. జె. శ్రీనివాస్ జెడ్‌వీఎన్‌ఆర్ హైస్కూల్లో ప్రధానోపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్నాడు. పెనుగొండకు చెందిన పూర్వకాలం విద్యార్థి ఎన్.సూర్యప్రకాశ్ తన పదో తరగతి సర్టిఫికెట్ పోవడంతో హెచ్ఎం శ్రీనివాస్ వద్ద దరఖాస్తు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ సూర్యప్రకాశ్‌ను రూ.10వేలు లంచం అడిగాడు. దీంతో ఏసీబీని ఆశ్రయించిన సూర్యప్రకాశ్ లంచం విషయం వారికి వివరించాడు. అధికారులతో కలిసి స్కూల్‌కు వెళ్లిన సూర్యప్రకాశ్ రూ. 10వేలు శ్రీనివాస్‌కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. హెచ్ ఎం జే. శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నారు. -
సబ్ కలెక్టర్ బ్యాంకు ఖాతాలు సీజ్!
వేలూరు: వేలూరులో రూ.50 వేలు లంచం తీసుకొంటూ పట్టుబడిన సబ్ కలెక్టర్ బ్యాంకు ఖాతాలను సీజ్ చేసేందుకు ఏసీబీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. తిరువణ్ణామలై జిల్లా పోలూరు సమీపంలోని ఇరుంబులి గ్రామానికి చెందిన రంజిత్‌కుమార్ పూరీ్వకుల ఆస్తులను తన పేరుపై మార్చుకొని పత్రాలు తీసుకునేందుకు సబ్‌కలెక్టర్ దినకరన్ సంప్రదించారు. ఆయన రూ.50 వేలు లంచం డిమాండ్ చేశారు. వేలూరు ఏసీబీ అధికారులు వలపన్ని సబ్‌కలెక్టర్ దినకరన్‌తో పాటు ఆయన డ్రైవర్ సురేష్‌కుమార్‌ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అనంతరం ఆయన ఇల్లు, కార్యాలయంలో తనిఖీలు చేశారు. ఆ సమయంలో సుమారు రూ.80 లక్షల నగదు పట్టుపడిన విషయం తెలిసిందే. కార్యాలయంలో ఆయనకు సహకరిస్తున్న 11 మంది ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బందిపై కేసులు నమోదు చేశారు. (లంచం డబ్బుతో సబ్‌కలెక్టర్ రాసలీలలు) వారి వద్ద విచారణ చేపట్టారు. విచారణలో సబ్ కలెక్టర్ దినకరన్ లంచాలు తీసుకుని అవినీతికి పాల్పడడంతో పాటు పలువురి మహిళలతో రాసలీలలు జరిపిన విషయం వెలుగులోకి వచ్చింది. ఆయనకు సంబంధించిన బ్యాంకు ఖాతాలను సీజ్ చేసి ఏయే బ్యాంకుల్లో ఎంత నగదు ఉంది, ఈ నగదు ఎక్కడ నుంచి వచ్చింది అనే కోణంలో విచారణ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఏసీబీ అధికారి మాట్లాడుతూ సబ్‌కలెక్టర్‌గా పనిచేసిన కాలంలో దినగరన్ పలు కోట్ల రూపాయలను బ్యాంకులో పొదుపు చేయడంతో పాటు అనేక చోట్ల ఆస్తులు కొనుగోలు చేసినట్లు విచారణలో తెలిసిందన్నారు. వెంటనే ఆయన బ్యాంక్ ఖాతాలను సీజ్ చేసి, ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి.. అనే కోణంలోనూ విచారణ చేస్తున్నట్లు వివరించారు. -
లంచం డబ్బుతో సబ్‌కలెక్టర్ రాసలీలలు
వేలూరు : వ్యవసాయ భూమి పత్రాలు మంజూరు చేసేందుకు రూ.50 వేలు లంచం తీసుకొని పట్టుబడిన వేలూరు ప్రత్యేక సబ్ కలెక్టర్ దినకరన్ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా లంచం తీసుకున్న డబ్బుతో సదరు సబ్‌కలెక్టర్ పలువురు మహిళలతో రాసలీలలు జరిపిన సంఘటనలు ప్రస్తుతం వెలుగుచూశాయి. తిరువణ్ణామలై జిల్లా పోలూరు తాలుకా ఇరుంబులి గ్రామానికి చెందిన రంజిత్‌కుమార్ గత ఆగస్టులో తన పూర్వీకుల భూమిని అతని పేరుపై మార్చుకున్నాడు. ప్రభుత్వం విలువకన్నా తక్కువగా రిజిష్టర్ పత్రాలు తీసినట్లు సబ్ రిజిస్ట్రార్‌కు తెలియడంతో వీటిపై వేలూరు కలెక్టరేట్లోని ప్రత్యేక సబ్ కలెక్టర్ దినకరన్‌ను కలవమని తెలిపాడు. కాగా సబ్ కలెక్టర్ రూ.50 వేలు లంచంగా అడగడంతో రంజిత్‌కుమార్ వేలూరులోని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు పథకం ప్రకారం అతనిపై దాడి చేసి రెడ్ హ్యాండడ్‌గా పట్టుకున్నారు. అనంతరం అతని ఇంటిలోను, కార్యాలయంలోను మొత్తం రూ.80 లక్షల నగదు, పలు కీలక పత్రాలు, కంప్యూటర్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం ప్రత్యేక కోర్టులో హాజరు పరిచి వేలూరు సెంట్రల్ జైలుకు తరలించారు. విచారణలో దినకరన్ ప్రతిరోజూ ఎవరి వద్ద ఎంత నగదు రావాలి అనే జాబితాను తయారు చేసి కారు డ్రైవర్ రమేష్‌కుమార్ అందజేసి వసూళ్లకు పాల్పడేవాడని తెలిసింది. జల్లికట్టుకు అనుమతి ఇచ్చేందుకు ఉత్సవ కమిటీ సభ్యుల నుంచి కారు డ్రైవర్ ద్వారా వేల రూపాయలు తీసుకున్నట్లు తెలిసింది. ఈ డబ్బుతో పలువురి మహిళలతో రాసలీలలు జరిపినట్లు అధికారులు గుర్తించారు. ఇటీవల రూ 2 వేల నోట్లు మారదని ప్రకటించడంతో లంచంగా రూ.500, 200 నోట్లు మాత్రమే తీసుకునే వాడని తెలిసింది. ముఖ్యంగా ఆయన కార్యాలయంలో పనిచేసే మహిళా అధికారి ఒకరికి అవసరమైనప్పుడల్లా నగదును ఇచ్చేవాడని, దీంతో కార్యాలయానికి ఎవరు వచ్చినా మహిళా అధికారినే మాట్లాడి సర్దుబాటు చేయడంతో పాటు వారి వద్ద ఆమె నగదును తీసుకునేదని ఏసీబీ అధికారులు గుర్తించారు. కార్యాలయానికి సొంత పనులపై వచ్చే మహిళలను ఆకర్షించే విధంగా మాట్లాడి అనంతరం వారితో చనువుగా ఉండేవాడని తెలిసింది. వీటితో పాటు వేలూరులో పనిచేస్తున్న కాలంలోనే రాణిపేటలో రూ. కోటి విలువ చేసే బంగ్లాను కొనుగోలు చేసినట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు గుర్తించారు. -
ఓ మాజీ సైనికుడిని లంచం అడిగితే ఏంచేశాడంటే!!
లంచావతారులు చేయి తడపనిదే ఏ పనీ చేయడం లేదు. పైసలిస్తే కాని ఫైల్ కదిలించడం లేదు. దేశ రక్షణకు పాటు పడే జవానులైనా అందుకు అతీతులు కాదంటున్నారు. కుమార్తె స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకున్న ఓ మాజీ సైనికుడిని జిల్లా సైనిక సంక్షేమశాఖ అధికారి కార్యాలయ ఉద్యోగి లంచం డిమాండ్ చేశాడు. భారత సైన్యంలో పనిచేసిన ఆయన అది సహించలేకపోయాడు. లంచం పేరెత్తగానే ఆయన రక్తం మరిగిపోయింది. ఆ లంచావతారాన్ని రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టించాడు. సాక్షి, ఒంగోలు: ఇంకొల్లు మండలం కొణికి గ్రామానికి చెందిన నీలం ఆంజనేయులు కొంతకాలం భారత సైన్యంలో పనిచేశాడు. రిటైర్మెంట్ తర్వాత గుంటూరు జిల్లా బాపట్లలో నివాసం ఉంటున్నాడు. ప్రస్తుతం అక్కడే ఓ సంస్థలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అతని కుమార్తె గుంటూరు జిల్లాలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. తండ్రి మాజీ సైనికుడు కావడంతో ప్రధానమంత్రి స్కాలర్షిప్ స్కీము కింద ఆమెకు ఏటా రూ.36 వేలు వస్తుంది. దీని కోసం దరఖాస్తు చేసుకోవాలంటే మాజీ సైనికుని రికార్డును పరిశీలించి అనెగ్జర్–1 పై జిల్లా సైనిక సంక్షేమశాఖ అధికారి సంతకం చేయాలి. దానిని ప్రాసెస్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఉపకార వేతనం కోసం సైనిక్ బోర్డుకు నెలరోజుల క్రితం ఆంజనేయులు దరఖాస్తు చేసుకున్నాడు. అందులో వివరాలను జిల్లా సైనిక సంక్షేమశాఖ అధికారులు పరిశీలించి అన్ని సక్రమంగా ఉన్నట్లు నిర్థారించుకుని జిల్లా సైనిక సంక్షేమశాఖ అధికారి రజనీకుమారి దానిపై సంతకం చేశారు. అడ్డుగా మారిన జూనియర్ అసిస్టెంట్.. అయితే అధికారి సంతకం చేసినా దానిని అప్లోడ్ చేసేందుకు జూనియర్ అసిస్టెంట్ షేక్ ఆర్ జమీర్ అహ్మద్ అడ్డుగా మారాడు. గడువు దగ్గరపడుతోంది. దయచేసి అప్లోడ్ చేయమని ఆంజనేయులు అభ్యర్థించినా పట్టించుకోలేదు. చివరకు బాపట్ల నుంచి సెలవు పెట్టుకుని మరీ వచ్చి ప్రకాశం భవనం ఎదురుగా గల పాత రిమ్స్ భవనంలోని జిల్లా సైనిక సంక్షేమశాఖ అధికారి కార్యాలయానికి ఉన్నతాధికారిని కలిసేందుకు వచ్చాడు. ఆమె సెలవులో ఉండటంతో అతను జూనియర్ అసిస్టెంట్‌పై ఒత్తిడి తీసుకువచ్చి సకాలంలో అప్లోడ్ కాకపోతే తాను తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందంటూ నచ్చజెప్పేందుకు యత్నించాడు. దీంతో జమీర్ రూ.10వేలు ఇస్తే సరి.. లేకుంటే కుదరదంటూ తేల్చి చెప్పాడు చివరకు కనీసం రూ.8వేలైనా ఇవ్వక తప్పదన్నాడు. స్వాధీనం చేసుకున్న నగదు ఏసీబీకి ఫిర్యాదు.. ఇటువంటి అవినీతిపరుడికి వారికి డబ్బిచ్చి పని చేయించుకునే కంటే కటకటాల వెనక్కు పంపడమే కరెక్ట్ అని భావించిన ఆంజనేయులు ఈనెల 12న అవినీతి నిరోధక శాఖ అధికారులను కలిశాడు. తన సమస్యను రాతపూర్వకంగా తెలియజేశాడు. ఫిర్యాదును రికార్డు చేసుకున్న అధికారులు రెండురోజులపాటు జిల్లా సైనిక సంక్షేమశాఖ అధికారి కార్యాలయంపై నిఘా పెట్టారు. తమకు వచ్చిన ఫిర్యాదు వాస్తవమేనని నిర్థారించుకుని ఉన్నతాధికారులకు తెలియపర్చారు. అవినీతి నిరోధక శాఖ గుంటూరు అదనపు ఎస్పీ సురేష్‌బాబు నేతృత్వంలో శుక్రవారం అహ్మద్‌పై వల పన్నారు. ఫిర్యాదిదారుకి పలు సూచనలు చేశారు. ఆయన వెళ్లి సర్టిఫికేట్ అడగడం, జమీర్ అహ్మద్ డబ్బులు డిమాండ్ చేయడం.. ఫిర్యాది ఇచ్చిన సిగ్నల్‌తో రూ.8 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు మధ్యవర్తుల సమక్షంలో నిందితుడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడం వెంటవెంటనే జరిగిపోయాయి. ఈ దాడులలో ఏసీబీ సీఐలు ఎన్.రాఘవరావు, ఎ.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అదనపు ఎస్పీ ఏమంటున్నారంటే.. నిందితుడ్ని అరెస్టు చేసిన అనంతరం అదనపు ఎస్పీ సురేష్‌బాబుతోపాటు మీడియాతో మాట్లాడుతూ సర్టిఫికేట్‌పై సంతకం చేసిన అనంతరం దానిని పద్ధతి ప్రకారం అప్లోడ్ చేయాలి. ఇందుకు జూనియర్ అసిస్టెంట్ జమీర్ అహ్మద్ రూ.10వేలు లంచం డిమాండ్ చేశాడు. చివరకు రూ.8వేలు తప్పనిసరి అనడంతో తమకు ఫిర్యాదు వచ్చింది. దీంతో తమ సిబ్బంది నిఘా పెట్టి వాస్తవమే అని నిర్థారించుకున్న అనంతరం రంగంలోకి దిగాం. చివరగా కూడా ఫిర్యాదికి పలు సూచనలు చేశాం. ముందుగా ఎట్టి పరిస్థితులలోను డబ్బులు ఇవ్వొద్దని, సర్టిఫికేట్ గురించి మాత్రమే మాట్లాడమని చెప్పాం. మరలా డబ్బు సంగతి ఎత్తితే అప్పుడు ఇవ్వమంటూ రూ.10 వేలు ఇచ్చి పంపాం. ఫిర్యాది సర్టిఫికేట్ గురించి ప్రస్తావించగానే డబ్బులు తప్పనిసరి అనడం, అతను డబ్బులు ఇస్తూ తమకు సూచన చేయడంతోనే అరెస్టు చేశాం. నిందితుడిని నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తాం. మాజీ సైనికుని కుమార్తె దరఖాస్తుకు సంబంధించిన ఫైల్‌ను కూడా సీజ్ చేస్తాం. -
ఏసీబీకి పట్టుబడ్డ లైన్‌మన్
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్‌లోని పెద్ద షాపూర్ ఏఈ కార్యాలయంలో లైన్‌మన్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు సోమవారం రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. పెద్ద షాపూర్ ఏఈ కార్యాలయంలో లైన్‌మన్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఎస్. కాశీరాములు.. తిరుపతి రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో మీటర్ ఫిట్ చేసినందుకు 50 వేలు లంచం కావాలని డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో లంచం తీసుకుంటుండగా లైన్‌మన్‌ను పట్టుకున్నారు. సోమవారం రూ.28 వేలు లంచం తీసుకుంటూ కాశీరాములు ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు. -
అవినీతిలో అందెవేసిన చేయి
చేయి తడపందే ఆయన దగ్గరనుంచి ఏ ఫైల్ కదలదంట... పనిచేసిన ప్రతిచోటా కలెక్షన్ చేయడంలో సిద్ధహస్తుడంట... ఈయన దాహానికి అంతులేకపోవడంతో ఇటీవలే ఓ అధికారి సైతం జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించారంట... అయినా ఆయన తన సహజ ధోరణితో వ్యవహరించడంతో మళ్లీ ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపైనా ఓసారి కేసు నమోదై... ఇంకా విచారణ కొనసాగుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఓ వైపు అవినీతిపై ఉక్కుపాదం మోపాలని హెచ్చరిస్తుంటే... ఇంకా ఇలాంటి తిమింగలాలు తమ వైఖరి మార్చుకోకపోవడం రెవెన్యూ శాఖకే మాయని మచ్చగా మారుతోంది. సాక్షి, విజయనగరం : రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వై.ఎస్.జగన్మోహన్రెడ్డి రెవెన్యూశాఖలో అవినీతి పై రెండు నెలలుగా ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా రెవెన్యూశాఖ అధికారుల తీరు మారడంలేదు. ఎన్నోఏళ్లుగా లంచాలకు అలవాటు పడ్డ కొందరు వాటిని మానుకోలేకపోతున్నారు. గంట్యాడ మండల తహసీల్దార్ డి.శేఖర్ అవినీతి నిరోధక శాఖ అధికా>రులకు మంగళవారం చిక్కడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. అవినీతి శేఖరం ఏసీబీ అధికారులకు చిక్కిన గంట్యాడ తహసీల్దార్ డి.శేఖర్‌కు అవినీతి చరిత్ర పెద్దదే ఉంది. కాసులివ్వనదే పని చేయడన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఈయన విశాఖపట్నంలో రెవెన్యూశాఖలో ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించారు. డిప్యూటీ తహసీల్దారు కేడరు వరకు అక్కడే పని చేశారు. ఏడాది క్రితం తహసీల్దారుగా పదోన్నతి ఇచ్చిన రాష్ట్ర భూపరిపాలన ముఖ్య కార్యదర్శి విజయనగరం జిల్లా కేటాయించారు. జిల్లా కలెక్టర్ ఈయన్ను మొదట బొండపల్లి తహసీల్దారుగా నియమించారు. ఎన్నికల సమయంలో బదిలీల్లో అక్కడి నుంచి సీతానగరం బదిలీ చేశారు. తాజాగా 20రోజుల క్రితం సీతానగరం నుంచి గంట్యాడకు బదిలీపై వచ్చారు. ఈ నెల 10వ తేదీనే అక్కడ విధుల్లో చేరారు. సుదీర్ఘకాలం రెవెన్యూశాఖలో సేవలందించిన శేఖర్‌పై జిల్లాలో అనేక ఆరోపణలున్నాయి. జిల్లాకు వచ్చిన ఏడాది కాలంలో అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డారన్న పేరు కూడా ఉంది. ఎక్కడ పని చేసినా డబ్బులు ఇవ్వనిదే పనులు చేయరన్నది ప్రతీతి. పట్టాదారు పాసుపుస్తకాలు, పలు ధ్రువీకరణపత్రాల జారీకి పెద్ద ఎత్తున లంచాలు డిమాండ్ చేశారని బొండపల్లి, సీతానగరం, గంట్యాడ వాసులు చెబుతున్న మాట. బొండపల్లిలో ఉండగా లంచా ల విషయంలో సిబ్బందికి, ఆయనకు మధ్య పెద్ద ఎత్తున వివాదాలు చోటు చేసుకున్నాయి. గంట్యా డ వెళ్లిన 20రోజుల్లోనే అనేక పనులకు డబ్బులు డిమాండ్ చేయడం, ఇచ్చిన వారికి సంతకాలు చేయడం, ఇవ్వనివారిని తిప్పించడం చేస్తున్నారని ప్రచారం సాగింది. కొందరు అధికారులు ఏమీ ఆశించకుండా ఇచ్చే ఎఫ్సీవో కాపీ కోసం రూ.2వేలు డిమాండ్ చేస్తున్నారని ఆ శాఖ అధికారుల్లోనే చర్చ జరుగుతోంది. ఈ విషయం జిల్లా అధికా రుల వరకూ చేరడంతో జాగ్రత్తగా ఉండాలని మూడు రోజుల క్రితమే ఓ జిల్లా అధికారి హెచ్చరించినట్టు కూడా తెలిసింది. అయినా ఎక్కడా వెనక్కి తగ్గలేదు. విశాఖపట్నంలో పని చేసినపుడు కూడా ఆయనపై అనేక అవినీతి అభియోగాలు న్నాయి. విశాఖపట్నంలో పని చేస్తుండగా ఆరేళ్ల క్రి తం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు దాడులు చేసి కేసులు నమోదు చేయగా ఇంకా కేసు నడుస్తోంది. ఎన్ఓసీకోసం రూ. 50వేలు లంచం... విజయనగరానికి చెందిన రొంగలి శ్రీనివాసరావు రామవరం పంచాయతీ కరకవలస సమీపంలో సర్వేనంబర్ 32/6లో 20 సెంట్ల స్థలాన్ని ల్యాండ్ కన్వర్షన్, పెట్రోల్‌బంకు ఏర్పాటుకు ఎన్ఓసీ ఇవ్వాలని రెవెన్యూ శాఖతో పాటు 4 శాఖలకు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే పోలీస్, ఫైర్ తదితర శాఖలు ఎన్ఓసీ ఇవ్వగా రెవెన్యూమాత్రం ఇవ్వలేదు. దీనిపై తహసీల్దార్ బి.శేఖర్‌ను సంప్రదించగా రూ 50వేలు లంచం డిమాండ్ చేశారు. చేసేది లేక ఆయన ఏసీబీ అధికారులకు ఫిర్యాదుచేయగా ఏసీబీ డీఎస్పీ డి.వి.ఎస్.నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మాటువేసి తహసీల్దార్ కార్యాలయంలోనే లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. వెంటనే ఆయనపై కేసు నమోదుచేసి, విశాఖపట్నం ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్టు డీఎస్పీ తెలిపారు. గంట్యాడలో గతంలో విద్యుత్ శాఖ జేఈ జ్యోతీశ్వరరావు, సర్వేయర్ శ్రీనివాసరావు, ఆర్డబ్ల్యూఎస్ జేఈ గోవిందరావు ఏసీబీ వలలో చిక్కుకున్నారు. ముఖ్యమంత్రి ఎంతగా హెచ్చరిస్తున్నా... రెవెన్యూశాఖపై ఇప్పటికే జనంలో చెడ్డ పేరుంది. ఇక్కడ ఏ పనీ లంచం ఇవ్వనిదే జరగదన్న ఓ అపవాదు కూడా ఉంది. ఈ విషయం ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి దృష్టిలో ఉండటంతో అవినీతి తగ్గాలని కలెక్టర్ల సమావేశం, వీడియో కాన్ఫరెన్సులో చెబుతూనే ఉన్నారు. రెండు రోజుల క్రితం జరిగిన వీడియోకాన్ఫరెన్సులోనూ ఈ విషయం కలెక్టర్ ప్రస్తావించారు. అయినా తహసీల్దారు శేఖర్ తీరు మారకపోవడం విశేషం. ఇలాంటి పనుల వల్ల డిపార్టుమెంటు పరువు పోతోందని ఆ శాఖలోని అధికారులే వ్యాఖ్యానించడం గమనార్హం. -
రైతుల పడరాని పాట్లు..
సాక్షి, సిద్దిపేట: నిజాం కాలం నాటి భూముల రికార్డులను సరిచేసి భూ సమస్యను తీర్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రికార్డుల ప్రక్షాళనకు పూనుకుంది. ఆలోచనకు అనుగుణంగా అధికారులు పనిచేయకపోడంతో కొత్తపాస్ పుస్తకాలు రావడమేమో కాని ఉన్న భూమి వేరేవారి పేరున మారిపోయింది. చిన్న చిన్న తగాదాలను అడ్డం పెట్టుకొని పలువురు రెవెన్యూ అధికారులు డబ్బులు దండుకుంటున్నారు. అన్నీ సక్రమంగా ఉన్నా.. పాస్ పుస్తకం ఇవ్వాలంటే ముడుపులు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంటోంది. ఎందుకు డబ్బులు ఇవ్వాలని గట్టిగా అడిగితే వారి భూమికి మరిన్ని కొర్రీలు అంటగట్టడం, కంప్యూటర్లో తప్పుగా నమోదు చేయడం, ఫైల్ మాయం చేయడం పరిపాటిగా మారింది. ఇలాంటి చర్యలతో అనేక మంది రైతులు తమ సమస్యల పరిష్కారానికి చెప్పులరిగేలా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. అయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. దీంతో వారంతా రైతుబంధు, రైతుబీమాకు దూరమవుతున్నారు. చిన్న చిన్న సమస్యలను కూడా సవరించకుండా.. అమ్మిన వారి, కొన్నవారి కాగితాలు, రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నా.. ఎవరో ఫిర్యాదులు చేశారని పలువురు రైతులకు పాస్ పుస్తకాలు ఇవ్వకుండా అధికారులు జాప్యం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 3,33,432 ఖాతాలు ఉన్నాయి. ఇందులో 2,64,062 ఖాతాలు సక్రమంగా ఉన్నాయని అధికారులు డిజిటల్ సంతకం చేశారు. ఇందులో ఇప్పటి వరకు 2,63,018 మంది రైతులకు పాస్‌పుస్తకాలు అందజేశారు. మరో 1,044 మంది పాస్‌పుస్తకాలు ప్రింటింగ్ కాకుండా నిలిచిపోయాయి. అదేవిధంగా 19,591 ఖాతాలు ఆధార్ కార్డు నంబర్లలో తప్పులు, సర్వే నంబర్లో తేడాలు, డబుల్ నంబర్ ఇలా అనేక కారణాలతో ప్రాససింగ్ నిలిచిపోయాయి. మిగిలిన 15,441 ఖాతాలు పట్టణాల సమీపంలో ఉండటంతో వ్యవసాయేతర భూమిగా మార్చడంతో వాటికి పాస్ పుస్తకాలు ఇవ్వడం లేదు. అదేవిధంగా 32,438 ఖాతాలు ప్రభుత్వ భూముల్లో ఉన్నాయి. ఇవిపోగా 1,900 ఖాతాలు ఫార్ట్–బీలో పెట్టారు. దీంతో పాస్‌పుస్తకాలు రాలేదు. అదేవిధంగా ప్రభుత్వం అందచేసే రైతు బంధు, రైతు బీమా సౌకర్యంతోపాటు బ్యాంకు రుణాలు కూడా ఇవ్వడం లేదు. అధికారులకు వరంగా.. ప్రభుత్వం శ్రీకారం చుట్టిన భూ రికార్డుల ప్రక్షాళన పలువురు రెవెన్యూ అధికారులు, ఉద్యోగులకు వరంగా మారింది. తల్లిదండ్రుల నుంచి సంక్రమించే ఆస్తులు, ఒకరి దగ్గరి నుంచి మరొకరు కొనుగోలు చేసి, రిజిస్ట్రేషన్ చేయించుకున్నా రెవెన్యూ పహానీలో నమోదు చేసేందుకు అంగీకరించడం లేదు. అదేవిధంగా అన్నదమ్ముల పంపకాలు, ఇతర విషయాల్లో పైసలు ఇవ్వనిదే దస్త్రం కదలని దుస్థితి. ప్రధానంగా 1900 ఖాతాలు పార్ట్–బిలో ఉన్నాయి. వీటిని సరిచేస్తున్నామనే నెపంతో అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. డబ్బులు ఇచ్చిన వారికి ఏ అడ్డంకులు లేకుండా పాస్‌పుస్తకాలు అందజేశారని, ఇవ్వని వారిని ఇప్పటి వరకు సతాయిస్తున్నారని రైతులు ఆదేవన వ్యక్తం చేస్తున్నారు. పాస్‌పుస్తకాలు ఎందుకు రాలేదు అంటే సర్వే నంబర్లు తప్పులు పడ్డాయని, మీ సర్వేనంబర్‌లో భూమిలేదని ఇలా సాకులు చెబుతూ డబ్బులు వసూళ్లు చేస్తున్నారని రైతులు చెబుతున్నారు. రెవెన్యూ కార్యాలయానికి సాధారణంగా రైతులు తమ భూములకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాల కోసం, వారసత్వంగా తాతలు, తండ్రుల నుంచి వచ్చిన భూమిని తమ పేరు మీదకు మార్చుకోవడానికి, మ్యూటేషన్ కోసం, భూమిని కొలిపించుకోవడానికి దరఖాస్తు చేయడం కోసం వస్తుంటారు. వీటిలో ఏ పని చేయాలన్నా అధికారులకు డబ్బులు ఇవ్వాల్సిందేనని పలువురు రైతులు వాపోతున్నారు. పట్టాదారు పాసు పుస్తకాల కోసం ఎకరానికి రూ. 5 వేల నుంచి రూ. 10 వేల వరకు, మ్యూటేషన్ కోసం ఎకరానికి రూ. 10 వేల వరకు, వారసత్వ భూమిని తమ పేరు మీద మార్చుకోవడానికి రూ. 20 వేలు, ఇతరుల నుంచి కొనుగోలు చేసిన భూమిని తమ రికార్డుల్లో ఎక్కించుకోవడానికి, కొత్త పాసు పుస్తకం కోసం రూ. 20 వేల నుంచి రూ. లక్ష వరకు అధికారులకు ముట్ట జెప్పాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లోని వ్యవసాయ భూములకు తక్కువగా, రియల్ ఎస్టేట్‌కు అనుకూలంగా ఉండి డిమాండ్ ఉన్న భూములకు లక్షల్లో వసూలు చేస్తున్నట్టు రైతులు ఆరోపిస్తున్నారు. ఇవే కాకుండా పట్టణ ప్రాంతాలకు, రాష్ట్ర, జాతీయ రహదారులకు దగ్గర ఉన్న భూములకు రూ. అక్ష నుంచి ఆపైన వసూలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా అంతే సంగతులు నంగునూరు మండలం పాలమాకుల గ్రామానికి చెందిన వర్దోలు శ్రీనివాస్‌కు 2008లో 112 సర్వే నంబర్లోని రెండు బిట్లు, 2010లో ఇదే సర్వే నంబర్లో భూమి కొనుగోలు చేశాడు. అప్పుడు అధికారులు పాస్‌పుస్తకం అందజేశారు. నాటి నుంచి 2017 వరకు పహానీలు అందజేసి బ్యాంక్‌లో రుణాలు పొందాడు. ప్రభుత్వం రైతులకు కొత్త పాసు పుస్తకాలు ఇవ్వగా తన పేరిట ఉన్న సర్వే నంబర్లు ఎగిరిపోవడంతో పాటు బుక్కు రాలేదు. 2018లో వీఆర్ఓకు దరఖాస్తు చేసుకుంటే మూడు నెలల్లో అందజేస్తామని చెప్పినా ఇప్పటి వరకు ఇవ్వలేదు. తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్లకు వినతి పత్రం అందజేసినా ఫలితంలేదు. కొత్త పుస్తకాలు రాకపోవడంతో ప్రభుత్వం అందిస్తున్న పంట పెట్టుబడి సహాయం రాకపోగా రైతుబీమా బాండ్ కూడా రాలేదు. –శ్రీనివాస్, పాలమాకుల, నంగునూరు మండలం పైరవీకారుల పనులు మాత్రమే చేస్తుండ్రు.. కోహెడ మండలంలోని నారాయణపూర్ గ్రామానికి చెందిన రైతు మందడి బుచ్చిరెడ్డి. ఇతడు 2013లో అదే గ్రామానికి చెందిన తగ్గరి బంధువు హన్మంతరెడ్డి అనే రైతు వద్ద 106 సర్వే నెంబర్లోని 2 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. రిజిస్ట్రేషన్ సైతం బుచ్చిరెడ్డి పేరిట చేయించుకున్నాడు. అప్పటి నుంచి కార్యాలయం చూట్టు తిరుగుతున్నాడు. ఇప్పటికే నాలుగుసార్లు మీ సేవలో దరఖాస్తు చేసుకున్నాడు. ప్రతి రోజు కారాలయం చూట్టు తిరుగుతున్నడు. రేపు రా..మాపు రా అంటూ అధికారులు మాట దాటివేస్తున్నారు. ఇప్పగికి 6 సంవత్సరాలు అయన పరిష్కరించడం లేదు. వారం రోజుల క్రితం గట్టిగ ఆడిగితే నీ ఫైలు పోయింది. మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకొమ్మని నీర్లక్ష్యం సమాధానం చెబుతూ బెదిరిస్తున్నారు. ప్రతి రోజు ఎలాంటి పని పేట్టుకోకుండా కేవలం తహసీల్దార్ కార్యలయం చుట్టూ తిరుగుతున్నాడు. పైరవీకారులకు పనులు మాత్రమే చేస్తున్నరని అధికారులపై రైతు మండిపడ్డరు. –బుచ్చిరెడ్డి, నారాయణపూర్, కోహెడ మండలం ముడుపులిస్తేనే పనులు అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన గంగధారి సుగుణ. సర్వే నంబర్ 155లో సదా భైనామా ద్వార 0.38 గుంటలు కొనుగోలు చేసి సాగు చేసుకుంటుంది. ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళనకు అవకాశం ఇవ్వడంతో ఏడాదిన్నర కిందట ఊరుకు వచ్చిన రెవెన్యూ అధికారులకు భూమి పట్టా చేయాలని దరఖాస్తు పెట్టింది. మోక మీద విచారణ చేసిన అధికారులు పట్టా చేస్తామని చెప్పిన అధికారులు ఇప్పటి వరకు పాస్ పుస్తకం అందచేయడం లేదు. ఎందుకు పాస్‌పుస్తకం ఇవ్వడంలేదు అని నిలదీస్తే ఇదే ఖాత నంబరులో జి.మల్లయ్యకు నాలుగు గుంటల భూమి అది సర్వే చేసిన తర్వాత చేస్తామని చెబుతున్నాడు. ఏడాది కిందనే భూ సర్వే కోసం ఫీజులు కట్టిన సర్వేయర్ రాని దుస్థితి. వీఆర్ఏ శ్రీనివాస్ డిప్యూటీ తహసీల్దార్ తిరుపతిరెడ్డికి దగ్గర ఉండి ప్రైవేట్ కంప్యూటర్ ఆపరేటర్లకు చెప్పి అమ్మిన పట్టేదారు పేరును పట్టా కాలం నుంచి తొలగించారు. భూ రికార్డుల ప్రక్షాళన మొదలు పెట్టిన అధికారులు తిరిగి భూమి అమ్మిన వ్యక్తి పేరున వస్తుంది. అమ్మిన సదరు వ్యక్తిని తీసుకవచ్చి అధికారులకు చెప్పించినా వారు పని చేయడం లేదు. శీఆర్ఏ శ్రీనివాస్ అధికారులకు తప్పుడు సమాచారం అందించి భూ సమస్య తీరకుండా చేస్తున్నాడని బాదితురాలు ఆరోపిస్తోంది. ఆయకు ముడుపులు అప్పగిస్తేనే పనులు చేస్తున్నారు. - గంగాధరి సుగుణ, చౌటపల్లి, అక్కన్నపేట మండలం -
కేసుకో రేటు.. ఎస్ఐపై వేటు
వనపర్తి క్రైం : కేసుకో రేటు చొప్పున లెక్క కట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు కొందరు పోలీసులు.. న్యాయం కోసం పోలీస్‌స్టేషన్ తలుపు తడితే.. చేతులు తడిపే దాక వదలని జలగలు పోలీస్ విభాగంలో ఉన్నాయి. తమ సమస్యకు పరిష్కారం చూపుతారని భావిస్తే వాళ్తే పెద్ద సమస్యలా పరిణమిస్తున్నారు. వైట్ కాలర్ నేరగాళ్లకు వత్తాసు పలుకుతూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వారు, సెటిల్మెంట్తో సంపాదిస్తున్న వారు, బెదిరించి దోచుకుంటున్న వారు, బాధితులైన ఇరువర్గాల నుంచి దండుకుంటున్న వారు పోలీస్‌శాఖలో పెరిగిపోయారు. ఈ నేపథ్యంలో అవినీతికి పాల్పడ్డారనే కారణంతో వనపర్తి రూరల్ పోలీస్‌స్టేషన్ ఎస్ఐ మశ్చేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ చర్యతో అవినీతి పోలీసుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. అమాయకులపైనా కేసులు.. వారం పదిరోజుల క్రితం వనపర్తి మండలం చిట్యాల శివారులో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని రూరల్ పోలీసులు పట్టుకున్నారు. అయితే ఈ కేసులో అసలు సూత్రధారులను తప్పించి.. అమాయకులపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. సూత్రధారులను తప్పించినందుకు భారీగానే డబ్బులు దండుకున్నట్లు సమాచారం. దీనిపై ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచి పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. విచారణ చేపట్టి నిజమే అని తేలడంతో రూరల్ ఎస్ఐపై సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలుస్తోంది. అయితే ఇదే ఎస్ఐ తీరుపై ముందు నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో చిట్యాలలోని ఓ పాఠశాలలో విద్యార్థి తప్పిపోయాడని ప్రధానోపాధ్యాయుడు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకపోవడంతో విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. రోజులతరబడి సాగదీత.. నెలన్నర రోజుల క్రితం తిరుమలాయగుట్ట సమీపంలో ప్రేమజంటలను టార్గెట్ చేసి బెదిరించి నగదు దోచుకుంటున్న ఓ ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేయకుండా ఫిర్యాదు వచ్చిన ఐదురోజులపాటు కాలయాపన చేశారు. దీంతో బాధితులు ఎస్పీని ఆశ్రయించడంతో ఆలస్యంగా కేసు నమోదు చేసి తప్పని పరిస్థితుల్లో జైలుకు పంపించారు. ఈ కేసులో బాగానే ముడుపుల దండుకుని నిందితుడు ప్రభుత్వ ఉద్యోగి అయినా ఆ సమాచారాన్ని అతడి ఉన్నతాధికారికి తెలియకుండా వ్యవహరించారు. ‘సాక్షి’ దినపత్రికలో ‘టీచోర్’ అంటూ కథనం రావడంతో డీఈఓ వెంటనే స్పందించి ఆయనను సస్పెండ్ చేశారు. ఈ కేసులోనే సదరు ఎస్ఐపైన వేటు తప్పదని పోలీసు శాఖలోనే పెద్ద చర్చ జరిగింది. ఎవరైనా రోడ్డుపై ప్రయాణించే వాళ్లు పొరపాటున మద్యం తాగి పట్టుబడితే ఇక అంతే సంగతులు. కేసు రాసినప్పటికీ తనకు అనూకూలంగా ఉండే ఇద్దరు సిబ్బంది సహాయంతో బాధితుల నుంచి అందిన కాడికి దండుకుంటారని ఆరోపణలున్నాయి. ఇవే కాకుండా సమస్యలపైన స్టేషన్‌కు వచ్చే వారితోనూ దురుసుగా ప్రవర్తిస్తూ.. నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తారన్న ఆరోపణలు లేకపోలేదు. ఇదిలా ఉండగా పోలీసు శాఖలోని ఓ ఉన్నతాధికారితోనూ అమర్యాదగా ప్రవర్తిస్తే నెలరోజుల క్రితం సైకాలజీ తరగతులకు పంపించారు. అయినా అతని ప్రవర్తనలో మార్పురాకపోవడం గమనార్హం. అయితే అవినీతి ఆరోపణలతో ఎస్ఐ సస్పెండ్ కావడంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. -
మంచిర్యాలలో ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్
ఆదిలాబాద్(మంచిర్యాల): మంచిర్యాల ఐటీఐలో పనిచేసే సీనియర్ అసిస్టెంట్ లింగమూర్తి లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీ అధికారులకి చిక్కాడు. ఐటీఐలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న సంతోష్ నుంచి రూ.4 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. తన జీతానికి సంబంధించిన బిల్లులు పంపించటానికి లింగమూర్తి లంచం డిమాండ్ చేయటంతో సంతోష్ ఏసీబీ అధికారులకు ముందస్తుగా సమాచారం ఇచ్చి నిందితుడ్ని పట్టించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వేశ్యాగృహ నిర్వాహకులను బెదిరిస్తున్న కానిస్టేబుళ్ల అరెస్ట్
వేశ్య గృహాల నుంచి మాముళ్లు వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలపై ఎస్.ఆర్.నగర్ ఠాణాకు చెందిన ముగ్గురు కానిస్టేబుళ్లను అరెస్ట్ చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు ఆదివారం వెల్లడించారు. ఎస్.ఆర్.నగర్ పరిధిలో పలు వేశ్య గృహాల నిర్వహకులను తమకు మాముళ్లు సమర్పించాలని ఆ కానిస్టేబుళ్లు తరచుగా వేధింపులకు గురి చేస్తు, అక్రమ కేసులు బనాయిస్తాంటూ వేశ్య గృహాల నిర్వహకులను బెదిరిస్తున్నారు. దాంతో నిర్వహకులు పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించారు. దీంతో వేధింపులకు పాల్పడుతున్న ముగ్గురు కానిస్టేబుళ్లను వెంటనే అరెస్ట్ చేయాలని ఉన్నతాధికారులు దిగవ పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆ ముగ్గురు కానిస్టేబుళ్లను అరెస్ట్ చేశారు. వారిని ఎస్.ఆర్.నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించి వారిని విచారిస్తున్నారు.