పట్టుబడ్డ సీనియర్ అసిస్టెంట్ సురేందర్
సాక్షి, కరీంనగర్: జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో నీరటి రమేశ్ థియేటర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. గతంలో 22 నెలలు మెడికల్ లీవ్ పెట్టాడు. తిరిగి విధుల్లో చేరిన రమేశ్ మెడికల్ లీవులకు సంబంధించిన బిల్లు తీసుకునేందుకు సంబంధిత అధికారుల వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో ఆసుపత్రిలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సీహెచ్.సురేందర్ వద్దకు ఫైలు వెళ్లింది. ఫైలును పరిశీలించిన సురేందర్ అందులో చాలా లోపాలున్నాయని, వాటిని మార్చాల్సి ఉందని చెప్పాడు. ఫైలును పట్టించుకోకుండా పలుమార్లు రమేశ్‌ను అతడి చుట్టూ తిప్పుకున్నాడు.
తర్వాత కొన్ని రోజులకు సురేందర్ వద్దకు వెళ్లిన రమేశ్ పని తొందరగా చేసి పెట్టాలని బతిమిలాడాడు. మొదట రూ.15 వేలు ఇస్తే చేసిపెడతానని రమేశ్‌కు చెప్పగా, అప్పటికే సురేందర్ వద్దకు చాలాసార్లు తిరిగి విసిగిపోయిన అతను ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. తర్వాత సురేందర్ వద్దకు వెళ్లి అంత ఇచ్చుకోలేనని రూ.12 వేలు ఇస్తానని తెలిపాడు. మంగళవారం రూ.12 వేలు సురేందర్‌కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
చదవండి: అవన్నీటితో సంబంధం లేదు.. చల్లాన్లు విధించడంలో బీజీ బీజీ...
అయితే.. సురేందర్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఏసీబీ అధికారులు, మీడియా ప్రతినిధులు దూరంగా వెళ్లారు. కాగా, అతడి వద్ద నుంచి రికార్డులు స్వాధీనం చేసుకొని పరిశీలించిన అనంతరం ఇంట్లో సోదాలు జరిపామని, సురేందర్‌ను ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ భద్రయ్య తెలిపారు. లంచం ఇవ్వాలని ఎవరైనా ఉద్యోగి డిమాండ్ చేస్తే ఏసీబీ అధికారులను ఆశ్రయించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment