సాక్షి, హైదరాబాద్: రూ.5 లక్షలు లంచం తీసుకుంటూ రాజేంద్రనగర్ సబ్ రిజిస్ట్రార్ హర్షద్ అలీ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. గురువారం రాత్రి డాక్యుమెంట్ రైటర్ నుంచి నగదు తీసుకుంటుండగా దాడి చేసిన ఏసీబీ అధికారులు ఇద్దర్నీ పట్టుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. లంగర్‌హౌస్‌కు చెందిన ఒక మహిళ గంధంగూడ ప్రాంతంలోని 300 గజాల స్థలంలో డెవలప్‌మెంట్‌కు బిల్డర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే బిల్డర్ డెవలప్‌మెంట్ చేయకపోవడంతో సంబంధిత డాక్యుమెంట్ రద్దు కోసం తన సోదరుడి కుమారుడైన అరవింద్ మహేష్‌కుమార్‌ను సంప్రదించారు.
అరవింద్ రాజేంద్రనగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం డాక్యుమెంట్ రైటర్ వాసును సంప్రదించాడు. వాసు ఈ విషయాన్ని సబ్ రిజిస్ట్రార్ హర్షద్ అలీకి తెలిపాడు. ఈ పని చేసేందుకు ఆయన మొదట రూ.8 లక్షలు డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన సంభాషణలను అరవింద్ వీడియో రికార్డు చేశాడు. చివరకు రూ.5 లక్షలు సబ్ రిజిస్ట్రార్, రూ.50 వేలు డాక్యుమెంట్ రైటర్ తీసుకునేందుకు ఒప్పుకున్నారు. అనంతరం అరవింద్ ఏసీబీ అధికారులకు సమాచారం అందించాడు.
సెల్‌ఫోన్‌లో కీలక సమాచారం...
ముందస్తు పథకం ప్రకారం గురువారం డబ్బులు ఇస్తానని చెప్పిన అరవింద్.. సాయంత్రం 5 గంటలకు ఏసీబీ అధికారులతో పాటు రాజేంద్రనగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చాడు. డాక్యుమెంట్ రైటర్ వాసు డబ్బు తీసుకున్నాడు. అయితే సబ్ రిజిస్ట్రార్ డబ్బు తీసుకునేందుకు దాదాపు రెండు గంటల సమయం పట్టింది. ఆయన నేరుగా డబ్బు తీసు కుంటే పట్టుకునేందుకు వీలుగా ఏసీబీ అధికారులు రెండు గంటల పాటు వేచి చూశారు.
చివరకు డాక్యుమెంట్ రైటర్ వాసు వద్ద డబ్బులు తీసుకుంటుండగా దాడి చేసి ఇద్దర్నీ పట్టుకున్నారు. హర్షద్ అలీ కార్యాలయంలో మరో ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులను ఏర్పాటు చేసుకుని డబ్బులు వసూలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఆయన పట్టుబడగానే ప్రైవేట్ వ్యక్తులు ఇద్దరూ సబ్ రిజిస్ట్రార్ సెల్‌ఫోన్‌తో మాయమయ్యారు. ఏసీబీ అధికారులు సెల్‌ఫోన్‌కు సంబంధించి వివరాలు అడగడంతో ఇంటి వద్ద ఉందని ఒకసారి, అసలు లేదని మరొకసారి చెబుతూ హర్షద్ అలీ అధికారులను ముప్పుతిప్పలు పెట్టారు.
చివరకు సెల్‌ఫోన్‌ను అప్పగించారు. అందులో పలు లావాదేవీలకు సంబంధించిన వివరాలు ఉన్నట్లు సమాచారం. రాజేంద్రనగర్ సబ్ రిజిస్ట్రార్‌గా హర్షద్ అలీ గత సంవత్సర కాలంగా విధులు నిర్వహిస్తున్నారు. ఐదేళ్ల క్రితం నార్సింగి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అటవీ శాఖ భూములు రిజిస్ట్రేషన్ చేసిన కేసులో సస్పెన్షన్‌కు గురయ్యారు. అయినా ఆయన తీరు మారలేదని, పలు వివాదాస్పద రిజిస్ట్రేషన్లు చేశారని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment